పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. శేషు మావయ్య గురించి Mythili abbaraju అభిప్రాయం:

    05/04/2015 9:43 am

    ఆర్ద్రంగా, మృదువుగా , మిథునం కథని గుర్తు చేస్తూ నడిచిన కథ. నూనె లో తేలే మాగాయ ఇంగువ వాసన, మంగినపూడి సముద్రపు అందం, ఉసిరికాయలంత వాన చినుకులు..అన్నీ బావున్నాయి. కొస ఆశ్చర్యపరచింది, సమాధానపడలేకపోయాను [ కొద్దిగా ]

  2. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/04/2015 9:10 am

    చాలా కాలం క్రితం ఓ సారి ఇండియా వెళ్ళొచ్చాక అప్పట్లో ఉన్న న్యూస్ గ్రూప్ లో నేను “ఇండియాలో తెలుగు పుస్తకాలు చదవడనిక్కానీ, కొనడానిక్కానీ ఎవరికీ సమయం లేదు” అని రాస్తే నా మీద విరుచుకు పడ్డారు జనం. ఇప్పటికీ ఇండియాలో (నాకు కనిపించినంతలో – నేను హైద్రాబాద్ నుంచి అన్నవరం దాకా చెడ తిరిగాను, రైళ్ళలో బస్సుల్లో, ఆఖరికి ఆటోలో కూడా) తెలుగు చదవడానికీ (ఇంట్లోనో, స్కూల్లోనో) ఎవరికీ పెద్ద ఇంటరెస్ట్ ఉన్నట్టు నాకు కనిపించలేదు. ఐ. ఐ. టి వ్యామోహం అయిదో క్లాసు దగ్గిర్నుంచీ ఇంకా అలానే ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. పదో తరగతి దాకా నా టైం లో తెలుగు కంపల్సరీ గా ఉండేది మరి ఇప్పుడెలా ఉందో నాకు తెలియదు కానీ ఇంటర్ లోకి వచ్చేసరికి సంస్కృతం, హిందీ లాంటివి తీసుకోవచ్చు. సంస్కృతం తీసుకుంటే సమాధానాలు తెలుగులో, ఇంగ్లీషులో అలా ఎందులోనైనా రాయొచ్చు. అలా మన భాష సర్వనాశనం చేసుకోవడానికి మనమే కారణం అవుతున్నాం. వైజాగ్, హైద్రాబాద్ లాంటి నగరాల్లో చదువుకున్న వాళ్ళకి తెలుగు పుస్తకాలు చదవడం అంటే మాహా రోత. వాళ్ళు తెలుగు న్యూస్ పేపర్లే చదవరు. ఇంక పుస్తకాల దాకా ఎందుకు? ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ దీనికి సమయం లేదు.

    ఇంకపోతే అంతర్జాతీయ భాష అంటే ఏమిటి? ప్రతీ దేశంలోనూ మాట్లాడేదా? అలా అయితే తెలుగువాడు లేని ప్లేస్ ప్రపంచంలో లేదు ఇప్పటికే, థాంక్స్ టు బిల్ గేట్స్! ఆయన “ఇన్ ఫర్మేషన్ టేక్నాలజీ” వల్లా, హైద్రాబాద్లో వెలిసిన పుట్టగొడుగుల సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్ల వల్లా ఇప్పటికే ఏ దేశమేగినా ఎందుకాలిడినా మనవాళ్ళు కనిపిస్తున్నారు కదా? వాళ్ళు తెలుగు మాట్లాడుకుంటారా అనేది మనం మనం లోతుగా చర్చించుకుని కుమ్ముకోవచ్చు తీరిగ్గా. అది మరో సారి. పదిమందిని పోగేసి ఓ మీటింగ్ పెట్టి భాస నాటకం గురించో, కన్యాశుల్కం గురించో చర్చిద్దాం రండి అని చూడండి. “కన్యాశుల్కం” అంటే మన నాగార్జున సినిమాయేనా? ఏం ఏక్షన్ గురూ అంటూ గంటల తరబడి సోది చెప్పగలరు కానీ గురజాడ అప్పారావ్ అంటే ఎంతమందికి తెలుసో ఎవరికి వారే చూసుకోవల్సిన విషయం. నేను కల్సుకున్న తెలుగువాళ్ళలో 90% దాకా “మేం పుస్తకాలువదవం” అని గొప్పలు చెప్పుకునేవారే.

    పత్రిక మాట. అమెరికాలో తెలుగు పలుకు అనో మరోటో అనో పత్రిక ప్రారంభించారు. ఓ రెండు మూడేళ్ళు పోయేక అమ్మేసి బిచాణా ఎత్తేసారు. అది ఇంకా ఎవరో నడుపుతున్నాట్టే గుర్తు. తానా పత్రిక కూడా ఉంది. ఇంతమంది తెలుగువాళ్లలో ఈ పత్రికలు కొనేది ఎంతమందో జగమెరిగిన సత్యం. అందువల్ల ఈ పత్రికలవల్లా, జర్నల్ల వల్లా కలిసొచ్చేది సున్నా.

    అంతర్జాతీయ భాష అంటే తెలుగు మాట్లాడ్డమా? అయితే దీనికోసం ఎక్కడికీ వెళ్ళాల్సిన పనిలేదు. సమాధానం మీ ఇంట్లోనే ఉంది. మీ పిల్లలకి తెలుగొచ్చా? నిజానికి చెప్పాలంటే మా పిల్లలకి రాదు. గుర్రాన్ని చెరువు దగ్గిరకి తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేం కదా? ఓ అయిదేళ్ళు కష్టపడి ఇంక వీళ్ళచేత చదివించలేక వదిలేసాను. పోతే ఇండియానుంచి వచ్చిన మన వాళ్ళు (అంటే సహధర్మచారిణులు, పతులూ అని) మా అబ్బాయ్/అమ్మాయ్ ఇంగ్లీష్ ఏక్సెంట్ లేకుండా మాట్లాడుతున్నాడనే మురిసిపోవడం తప్ప మనమేం చేస్తున్నాం? పోనీ ఎంత చదివించినా ఈ రెండోతరం వాళ్ళు ఎంతమంది తెలుగు మాట్లాడతారు పెద్దయ్యాక? అంతవరకూ ఎందుగ్గానీ మీరు ఎప్పుడైనా గుడికో గోపురానికో వెళ్తే అక్కడ మీకు రెండో తరం ఇండియన్స్ ఎంతమంది కనిపించారు (అమ్మా, నాన్నలతో కాకుండా వాళ్ళమటుకు వాళ్ళే వచ్చినవారు).

    ఇంత ఖంగాళీ మన ఇంట్లోనే పెట్టుకుని తెలుగోయ్, తెలుగోయ్ అని పబ్లిగ్గా అరవడం శుద్ధ దండుగ.

    బ్రహ్మానందం గారి కామెంట్: “కడుపులో చల్ల కదలకుండా ఉంటేనే రాస్తాం” – తో నేను ఒప్పుకోను. ఇంటికి దూరంగా ఉండి కాలేజీలో స్కాలర్ షిప్ సమయానికి రానప్పుడు తిండిలేని రోజుల్లోనూ, ఏదో మోస్తరుగా ఉన్న రోజుల్లోనూ నేను ఏదో విధంగా పుస్తకాలు చదివి రాయడానికి ప్రయత్నం చేసేవాణ్ణి. నా రాతలు ఎంత అధ్యాన్నంగా ఉన్నాయో – తల మీద కొట్టుకుంటూ తప్పులు దిద్దే – ఇక్కడ సంపాదకులకి తెలుసు. చెప్పొచ్చేదేమిటంటే, రాయడానికి కావాల్సిన మొట్ట మొదటిది – చదవడం. ఇది నా అనుభవం లోంచి చెప్తున్నాను. చదవడం ఎందుకంటే, భాషమీద తీపి చంపుకోలేక. ఎప్పుడైతే ఆ చదవడం అనేది వ్యసనం అవుతుందో అప్పుడే రాయడం అనేది బయటకొచ్చి తీరుతుంది. ముళ్ళపూడికీ, శ్రీశ్రీకి కూడా పెద్ద బ్రహ్మాండమైన డబ్బుల్లేవు వాళ్ళు రాసే రోజుల్లో. శ్రీపాద వారు సరేసరి.

    నేనన్న మాటలకి మీకు కోపం వచ్చేసింది కనక నన్ను తిట్టబోయేముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ వ్యాసం టాపిక్ మీద నన్ను తంతానంటే నేను రడీ కానీ పనికిమాలిన విషయాలమిద ఉత్తినే సమయం వృధా చేయవద్దు.

  3. శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/04/2015 8:53 am

    రాధా!కథ నచ్చిందన్న మాటకి ఆనందమైంది.
    అవును రాధా ఎక్కడా షేర్ చేయలేదింకా. అలా అలా తీగలా పందిరి మీద పరచుకోనీ అని! 🙂
    మీకు ధన్యవాదాలు రాధా!

    *శివకుమార శర్మ గారు,
    కథ చదివి ఎంత లోతైన విశ్లేషణనిచ్చారు!
    మీరు సూచించిన అన్ని పాయింట్సూ నిజాలను తేట తెల్లపరిచేవే!…శ్రీమతి జగధ్ధాత్రి గారన్నట్టు
    ఎందుకు డైరెక్ట్ గా చెప్పలేదంటే, కొంతమంది మంచి మనుషులు (?) చేసే అఘాయిత్యాలను చెప్పేందుకు నోరు పెగలదు. కథల్లో అయితే అక్షరం కూడా వొణుకుతుందనుకుంటా.. !
    మీ విలువైన అభిప్రాయాన్ని ఇక్కడ వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ
    శుభాభినందనలతో..

  4. పాఠశాలకై పర్మిటు గురించి గన్నవరపు నరసింహ ముర్తి అభిప్రాయం:

    05/04/2015 8:43 am

    శ్రీ తిరుమల దేశికాచార్యుల వారికి వందనములు. మీ ‘పాఠశాలకై అనుమతి ‘ పద్య నాటిక బాగుంది. పద్యములు కడు రమ్యముగా నున్నాయి .
    యుష్మద్ ( నీ ),అస్మద్ ( నా ) పదముల కుత్తర పదమ్ము పరమగు నపుడు దుగాగమంబగు అన్నది సంధి సూత్రమని విన్నాను. ‘మాదు గ్రామంబు నందు’ అన్నది వ్యాకరణ సమ్మతమేనా అని నా సందేహము.

  5. యద్భావం తద్భవతి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/04/2015 8:24 am

    కామెంటిన ఇంద్రగంటి గారికీ, అయ్యవారు గారికీ ధన్యవాదములు. ప్రసాద్ గారూ, నిజమేనండి. పూతనని చంపడం దగ్గిర్నుంచీ, భగవద్గీత చెప్పడం, ఆ తర్వాత యాదవ వంశం నాశనం దాకా చిన్నబాబే చేయి/చక్రం తిప్పుతూ ఉంటాడు. పెద్దబాబు అక్కడో రాక్షసుణ్ణీ ఇక్కడో రాజునీ చంపినా భాగవతం అంతా మొత్తం దాదాపుగా చిన్నబాబు గురించే. 🙂

  6. గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం గురించి lyla yerneni అభిప్రాయం:

    05/04/2015 3:00 am

    “మహాకావ్య లక్షణాన్ని విశదీకరించి తన లక్షణ గ్రంథాన్ని ముగించాడు శ్రీవిజయుడు.”

    మహాకావ్య లక్షణములు దయచేసి చెప్పగలరా? -లైలా

  7. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/03/2015 9:00 pm

    శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి, శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి నా అభినందనలు. వారు వారి వ్యాసములో ప్రస్తావించిన ఒక అంశాన్ని విత్తుగా తీసుకుని మరికొంచెం విస్తరిస్తాను.

    తెలుగు భాషకి, పరిశోధనకి సంబంధించిన అంశాలని ప్రచురించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రతిష్ఠాత్మకమైన పత్రిక ఉంటే బాగానే ఉంటుంది. ఎమరీలో ఇటీవల స్థాపితమైన పీఠంతో పాటు అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ లోను, కేలిఫోర్నియాలోని బర్క్లీ లోనూ తెలుగు బోధన/పరిశోధన, ఎంతో కొంత, కొన్ని ఏళ్లుగా జరుగుతోంది. ఇవి కాకుండా ఇజ్రయెల్ లో తెలుగుకి ఒక తావు ఉంది. భౌగోళికంగా ఇలా నాలుగు మూలలలోను జరుగుతూన్న ప్రయత్నాలని ఒక తాటి మీదకి చేర్చి ప్రోత్సహించడానికి ఒక పత్రిక (journal) ఉంటే బాగానే ఉంటుంది. అటువంటి పత్రిక స్వరూప స్వభావాలు ఎలా ఉంటే బాగుంటుందో ఊహించి ఒక నఖచిత్రంలా చూపెడతాను. ఈ నఖచిత్రం కేవలం నేను కంటూన్న కల.

    1. మొదట్లో ఈ పత్రికని ఒక అంతర్జాల పత్రికలా ఏడాదికి రెండు సార్లు విడుదల చేస్తూ ప్రారంభించవచ్చు. క్రమేపీ ఈ పత్రిక పుంజుకుంటే తరచుదనం పెంచవచ్చు.
    2. ఈ పత్రికలో సగం తెలుగులో రాసినవి, సగం ఇంగ్లీషులో రాసినవి ఉంటే ఇంగ్లీషు ప్రపంచానికి తెలుగు గురించి కొంచెమైనా తెలుస్తుంది. ఇంగ్లీషు విభాగంలో స్వతంత్రంగా పరిశోధన చేసి సేకరించిన ఫలితాలే కాకుండా, తెలుగు మూలాలలోని వస్తువులని ఇంగ్లీషులోకి మార్చిన అనువాదాలని కూడ ప్రోత్సహించవచ్చు.
    3. పత్రికలో ప్రచురణ పొందేవి అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉండే పరిశోధనా పత్రికల స్థాయికి సరిపడేలా ఉండాలి. పత్రికలో ఏది ప్రచురణార్హమో అన్నది సంపాదక వర్గం నిర్ణయిస్తుంది.
    4. పత్రిక బలం పుంజుకునే వరకు, మనకి తెలుసున్న లబ్దప్రతిష్ఠుల చేత పురమాయించి వ్యాసాలు రాయించాలి. ఆ ఒరవడిని చూసి మిగిలిన వారు కూడ రాస్తారనే ఆశ. ఉదాహరణకి ఈమాటలో గత పదేళ్లుగా ప్రచురణ పొందిన వ్యాసాలలో ఉత్తమోత్తమైన కొన్ని వ్యాసాలని ఎంపిక చేసి, ఆయా రచయితలచే వాటిని పత్రిక నిబద్ధ పరచిన శైలిలో తిరగ రాయించి ప్రచురిస్తే చదువరులకి ఒక నమూనా దొరుకుతుంది.
    5. మొదట్లో ఈ జాల పత్రికని నడిపే సాంకేతిక సరంజామాని “ఈ మాట” వారి పర్యవేక్షణలో నడిపించి, పత్రిక పలుకుబడి పెరిగే వరకు పత్రికని ఈ మాటకి “అనుబంధం” (addendum) గా చేర్చి ప్రచురించవచ్చు.

    నమస్కారం
    వేమూరి

  8. శేషు మావయ్య గురించి Sivakumara Sarma అభిప్రాయం:

    05/03/2015 4:22 pm

    జగధ్ధాత్రిగారి వ్యాఖ్యని చూసిన తరువాత కలిగిన స్పందన: ఉత్తమపురుషలో రాసిన కథలో ఆ చెబుతున్నవాళ్లకి తెలియని అంశాలని రచయిత్రి ప్రస్తావించకపోవడం గొప్ప సంయమనాన్ని చూపుతుంది. అలాగని, కొద్దిగా సూచన నివ్వకుండా వదిలెయ్యలేదు. 1) “పెళ్ళైన కొత్తల్లో కూడా వీడికి ఇంత పెళ్ళాం పిచ్చి లేదే!…ఎందుకో ఈ మధ్యే ఇలా చస్తున్నాడు.” అమ్మమ్మ మాటలు చెవిలో మోగాయి. (గిల్టీ ఫీలింగ్?) 2) కానీ అత్తయ్య మొహంలో నవ్వు, ఆ నవ్వు, ఆవిడది కాదు. నాకు బాగా తెలుసు. ఆ సహజత్వం ఏదీ? 3) “ఏమండీ, పిల్లలొచ్చే టైమైంది. బజ్జీలేయమంటారా…” అంటూ … ఆ మూడు వాక్యాలూ చాలా కథనే చెప్పాయి. ముఖ్యంగా పిల్లలొచ్చే టైం (స్కూల్ నించీ అయ్యుంటుంది) అంటూ, వాళ్ల వయస్సునీ, సంఖ్యనీ (కనీసం రెండు) కూడా ప్రస్తావించి.

    ఇంక శేషు మామయ్య ఎందుకు అలా చేశాడో చెప్పడం అవసరమా అనిపించింది.

    “మాట ఎప్పుడూ ఉప్పు లాటిది. తగినంత వాడాలి. లేకపోతే పదార్ధం చెడిపోతుంది.” అన్న వ్యాఖ్య నాక్కూడా బాగా నచ్చింది.

    దమయంతిగారికి అభినందనలు.

  9. నాకు నచ్చిన పద్యం: అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:

    05/03/2015 3:23 pm

    సరసాకార ముదార మన్మథ కళా సర్వస్వ శృంగారమును తిరస్కరించిన అయుతునకు సరసీ ప్రాప్త మండూక మన్మథ కళా సర్వస్వ శృంగారము తప్ప లేదు. చక్కని విశ్లేషణ కామేశ్వర రావు గారూ !

  10. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:

    05/03/2015 1:43 pm

    శ్రీ వెల్చేరు నారాయణరావు గారు కొన్ని మాసములు నాకు ఏలురులో కట్టమంచి రామలింగారెడ్డి కళాశాలలో తెలుగు ఉపాన్యాసకులు.తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తెలుగుభాషా పరిశోధకులుగా తరలారు .అందుచే వారు నాకు గురువులు. వారికి నా నమస్సులు. వారికి , శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి అభినందనలు. నేను తెలుగు భాషాభిమానిని. తెలుగు ప్రజలు వివిధ దేశాలేగి తెలుగు మాట్లాడుటచే తెలుగు అంతర్జాతీయ భాష అవునో కాదో అనే చర్చ నాకు అనవసరము . తెలుగు ప్రపంచ భాష అవాలనే ఆశ కూడా నాకు లేదు . విద్యార్థి దశలో ఉన్నత పాఠశాల వఱకు ఆంగ్లము ,హిందీ తప్ప మిగిలిన విద్య అంతా తెలుగు మాధ్యమములో చదువుకున్నాను . గణితశాస్త్రము , భౌతికశాస్త్రము , రసాయనశాస్త్రము ,జీవశాస్త్రము తెలుగులో సునాయాసముగా నేర్చుకొన్నాను . కళాశాలలో ఆంగ్లమాధ్యమమవడముచే క్రొత్తలో కొంచెము యిబ్బంది అయినా త్వరలోనే సర్దుకుపోయాము . వైద్యకళాశాలలో విద్యంతా ఆంగ్లములో జరిగినా రోగులతో సంభాషణలు తెలుగులో జరిగేవి. వారి రోగ చరిత్రను ఆంగ్లములో అనువదించి వ్రాసుకొని , వారి రోగము గురించి ,అవసరమయ్యే పరిశోధనల గురించి , చికిత్స గురించి ఆంగ్లములో వ్రాసుకొన్నా వారికి తిరిగి తెలుగులో వివరించి బోధ చేసేవారము .ఆంగ్లభాష పై వ్యతిరేక భావము లేకపోయినా వైద్యశాస్త్ర గ్రంధాలన్నీ తెలుగు భాషలో మనము అనువదించుకుంటే బాగుంటుందనే ఆశ ఎప్పుడూ ఉండేది . ఇప్పుడు వైజ్ఞానిక గ్రంధాలు , న్యాయశాస్త్ర గ్రంధాలు సకలము తెలుగులో అందుబాటులో ఉండాలనే ఆశ ఉంది .
    తెలుగు ఎనిమిది కోట్ల ప్రజానీకానికి మాతృభాష . సంఖ్యాపరముగా ఇటాలియన్ , ఫెంచ్ , జపనీస్, గ్రీక్ , జర్మను ,పోర్చుగీస్ , భాషలకు తీసిపోదు. సంస్కృత భాషా పదజాలము కూడా మిళితమగుటచే విశేషపదజాలము గల భాష .మరి పై భాషలతో సమానముగా తెలుగు ఆధునిక పరిజ్ఞానముతో ఎదగ పోవడానికి అనేక కారణాలున్నాయి. ఫ్రాన్సు ,ఇటలీ , జర్మను ,జపాన్ ల వలె తెలుగు దేశము ( అలాగే వంగదేశము , కర్ణాటక ,తమిళనాడు ) ప్రత్యేక దేశమయితే తెలుగులోనే పరిపాలన పూర్తిగా సాగడమే కాక తెలుగు భాష వికాసము చెంది తెలుగులో వైజ్ఞానిక గ్రంధాలు అనువదించబడి ఉండేవేమో !భారతదేశము విఛ్ఛిన్న మవడము నా ఉద్దేశ్యము కాదు, గాని హిందీతో సమానముగా భారతీయ భాష లన్నిటికీ సమాన ప్రతిపత్తి కలిపించి మాతృభాష లన్నిటినీ అభివృధ్ధి చేసుకో వాలని నా అభిలాష .
    తెలివితేటలు నైపుణ్యములు వ్యక్తులలో విభిన్నముగా గోచరిస్తాయి . కొందఱికి గణిత మలవడుతే కొందఱికి భౌతిక శాస్త్రము, కొందఱికి తెలుగు , కొందఱికి సంగీతము , కొందఱికి నటన సులభముగా అలవడుతాయి . అష్టావధానము చేసే కవులకు గణితశాస్త్రము కొఱకరాని కొయ్య అవవచ్చు. పాండిత్యమున్నా కవిత్వము రాకపోవచ్చును . అందుచే తెలుగు నభ్యసించే వారికి తెలివి లేదని చెప్ప రాదు. తెలుగులో వివిధ గ్రంధాలు ప్రచురించుకోవాలనుకుంటే ప్రభుత్వ పరముగాను , స్వఛ్ఛంద సంస్థల పరముగాను , తెలుగు సంస్కృత పండితులు , తెలుగుపై అభిమానము గల శాస్రజ్ఞులు, వైద్యులు ,న్యాయశాస్త్రా కోవిదులు ,అందఱూ సమిష్టిగా కృషి చెయ్యాలి. దానికి తగిన ప్రణాళిక, నాయకత్వము కూడా అవసరము. ఉగ్గుపాలతో ఆంగ్లమును పోసి ,పాఠశాలలలో తెలుగు బోధనను కుంటుపరుస్తే మనము ఉట్టికెగురలేని అమ్మలమే అవుతాము. పోషణ అన్నిటి కంటే ముఖ్యము. ఒకప్పుడు మనదేశము పేదదేశమే గాని యిప్పుడు మనకు తగిన వనరు లుండడమే గాక సాంకేతికాభివృధ్ధి మాతృభాషల నభివృధ్ధి చేసుకొనుటకు సహకరిస్తుంది.తెలుగు నిఘంటువులు అంతర్జాలములో అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ వారు గొప్పా , శ్రీశ్రీ గొప్పా వంటి చర్చల వలన ప్రయోజనము శూన్యము. సకల సాహిత్య ప్రక్రియలు తెలుగు భాష విస్తృతికి ప్రమాణములు. శ్రీ యెల్లాప్రెగడ సుబ్బారావు గారు తమ ఫోలికామ్లపు పరిశోధనలు తెలుగులో ప్రచురించ లేదు. రవీంద్రనాథ టాగూరు గీతాంజలిని ఆంగ్లములో అనువదించక పోతే ఆయనకు నోబెల్ బహుమానము దక్కేది కాదు. నాకే అధికారముంటే రాచకొండ విశ్వనాథశాస్త్రికి , విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆ బహుమానాలు ప్రదానము చేసే వాడిని. తెలుగు ప్రపంచభాష కానవసరము లేదు గాని స్వంత గడ్డలలో వికాసము చెందవలసిన అవసరావకాశము లున్నాయి. అందఱికీ వందనములు.