పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. గడి నుడి – 1 గురించి sudha అభిప్రాయం:

    09/13/2016 11:16 pm

    గళ్ళనుడికట్టు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆధారాలు అన్నీ ఆలోచింపజేసేవిగా చక్కగా కూర్చారు. సరిచూడు బొత్తాముతో పాటు సబ్మిట్ కూడా ఇస్తే బాగుండేది. బహుమతి లేకపోయినా పర్లేదు – సరిగ్గా రాసినవారి పేర్లు ప్రకటిస్తే అదో తుత్తి కదా!

  2. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/13/2016 6:13 am

    శిష్టులు, ప్రామాణికులు అయిన పెద్దల రచనలో అనంగీకర్తవ్యములైన సంశయాంశాలు కనబడినప్పుడు విద్యార్థిత్వం ఉన్న విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుని అడిగినట్లే – విద్వాంసులైన రచయితలను పాఠకులు అడుగుతారు. విషయం చర్చలోకి ప్రవేశపెట్టబడినది కాబట్టే వ్యాఖ్యలు వస్తాయి. వ్యాఖ్య వల్ల వ్యాసవిస్తృతి కలుగదు. వ్యాసకర్తృకృతమైన సందేహనిరాసం మూలాననే వ్యాసవిస్తృతి, చిత్తవిస్తృతి కలుగుతాయి.

    వ్యాఖ్యాపరిణామం ఏమిటో తెలిసింది కాబట్టి, ఈ చర్చనుంచి విరమించుకొనే ముందు నాలుగు మాటలు వ్రాయక తప్పటం లేదు: మాన్యులైన శ్రీ కె.వి.ఎస్. రామారావు గారు, వ్యాఖ్యాకర్తను గురించి – “చిన్నయసూరి ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది? అంటూ “అధిక్షేపించారు” – అని చేసిన ఆ నిరుక్తి మూలాన ఈ ప్రస్తావన నిమిత్తీకృతమైంది.

    వ్యాఖ్యాకర్త విద్వన్మణులను, తనకు హితకర్మీణులను అధిక్షేపింపలేదు. వ్యాసగతమైన వాక్యాన్ని అధిక్షేపింపలేదు. “ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది?” అన్న ప్రశ్నలో ఏ అధిక్షేపణమూ, తిరస్కారభావమూ లేవు. వాగనుశాసనులు నన్నయ గారు కారా? వాగనుశాసన బిరుదధారి అయిన రెండవ వ్యక్తా? అని వ్యాఖ్యాకర్త అడగవలసి రాదు. వాక్యంలో ‘అన్నాడు’, ‘చెప్పాడు’, ‘పేర్కొన్నాడు’ అని గాక, “ఒప్పుకొన్నాడు” (=సమ్మతించాడు, అంగీకరించాడు) అని వ్రాసినప్పటి నిర్దేశాన్ని మాత్రమే ప్రశ్నించటం జరిగింది. ఆ ఒప్పుకోవటం ఆంధ్రశబ్దచింతామణి నన్నయకర్తృకం అన్న విషయాన్నే కదా. ఆంధ్రశబ్దచింతామణిని నన్నయే రాశాడు అని ఒప్పుకోవలసిరావటం చిన్నయ సూరి గారికి ప్రమేయం కాదు. ఆ ‘కర్తృత్వసమస్య’ అన్నది ఆ వ్యాస కాలపరిధిలో, ఆ సూత్రనిర్మాణపరిధిలో అసలు చిన్నయసూరి గారి దృష్టిపథంలో లేనే లేదు. ఆయన ఆ ఆలోచన చేసిన ఆధారాలు లేవు. చింతామణివిరుద్ధప్రయోగాలు నన్నయ భారతంలోనూ, నన్నయప్రయోగవిరుద్ధలక్షణాలు చింతామణిలోనూ ఉండటాన్ని వ్యాకర్తలు గుర్తించినా, తత్కర్తృత్వసందేహం వారికి కలుగలేదు. ఆనాటి విశ్వాసమల్లా అంతిమగద్యలో వ్రాసిన మాటే. ఆ సమస్యను తొలిసారిగా లేవనెత్తి, తమకాలం నాటి ఆధారాలతో తత్కర్త మహాకవి నన్నయ కాదన్న అంశాన్ని సర్వసమర్థనీయంగా నిరూపించినవారు శ్రీ కందుకూరు వీరేశలింగం గారు. అయినా అది ఆదికవి నన్నయకృతమే అని వాదించినవారు శ్రీ వజ్ఝల వారు. కర్త మహావైయాకరణి అయిన మహావిద్వాంసుడు కాబట్టి, ఆయన ఆదికవి నన్నయ గారు కాదని రూఢమైంది కాబట్టి – ఆ నన్నయభట్టు రెండవ నన్నయభట్టు కావచ్చునని ప్రతిపాదించినవారు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. తమ కాలానికి అనంతరీయమైన ఆ వివాదంతో ఏ సంబంధమూ లేని చిన్నయసూరి గారు ఆ చింతామణిని (మహాకవి) నన్నయే రాసినట్లుగా ఏవార్థకంతో ఒప్పుకొన్నట్లు ఎట్లా రుజువు కాగలదు? “ఒప్పుకొనటం” అన్న పదం విషయం మాత్రమే చర్చకు వచ్చింది. అన్యవిషయాలు కావు. అది అధిక్షేపణం కాదు.

    “చెళ్లపిళ్ల వారు … ఏ ‘శాస్త్రం’లోనూ తను పండితుణ్నయానని ఆయన ఎక్కడా చెప్పలేదు … ఈ వ్యాస కాలపరిధిలో కవులు వేరు, పండితులు వేరు. పండితులంటే తప్పక కనీసం ఏదో ఒక సంస్కృతశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారే తిరుపతివెంకట కవులు కవులు; పండితులు కారు.”

    ఈ మాటలు శ్రీ కె.వి.ఎస్. రామారావు గారివి. దీనిని కొనసాగింపక, తిరుపతి వేంకటకవులు శాస్త్రపండితులమని చెప్పుకొన్న పద్యాలలోని కొన్ని ప్రసిద్ధవాక్యాలు ‘నానారాజసందర్శనము’లో నుంచి ప్రమాణీకరింపబడుతున్నాయి. వారి కావ్యాలలో నుంచి అంతకు పదింతలు ఉదాహరింపవచ్చును. ఔగాములను పాఠకులు నిర్ణయించుకొంటారు:

    వేంకటగిరిలో చెప్పినవి: “…శబ్దశాస్త్రప్రశస్తప్రభావం బాతపత్రమ్ము దివ్యచారిత్ర! మాకు”; “…ధాతురత్నాకరోద్దామచంపు రచించి పాణినీయస్తుతుల్ వడసినాము”; “వేగ మా పాణినీయాగమమ్ము పఠించి, మించి, దేశికుల మెప్పించినాము”; “తిరుపతివేంకటేశకవిధీరుల మేము … శబ్దశాస్త్రధీ,వరులము”; “…గురువు నెన్నఁగ బ్రహ్మగురుపండితుండు, శాస్త్రమ్ము నెన్నంగ శాబ్దమ్ము మాకు”; గద్వాలలో – “…గురుపాదసేవనాలబ్ధ మగు విద్య నాగరాజముఖోదితాగమంబు”; విజయనగరంలో – “రా జతిపండితుం డఁట, బరాబరి యౌ నఁట మంత్రి రాజుతో, ధీజవ మొప్పునట్టి కవిధీరులు తిర్పతివేంకటేశు(లు)…”; “తిరుపతి వేంకటేశు లని పిల్తురు మమ్ము, బ్రహ్మసద్గురువరు పాదసేవన మకుంఠితసత్కృప మాకు నిచ్చె వ్యాకరణము”; కొత్తపల్లిలో – “భవదీయసత్రాన్నభక్షణమ్మునఁ జేసి చదివినారము శబ్దశాస్త్ర మెల్ల”; రాజమండ్రిలో దివాకరాస్తమయ సభలో – “”ఎవఁ డెన్నఁడును బాఠ మెలమి విప్పకయె వ్యాకరణపాండిత్యప్రకర్ష మూనె”; ఉర్లాములో – “వారుం బండితు, లేము పండితులమై వర్తించు టట్లుండఁగా…”.

    ఇక, తిరుపతి వేంకటకవులు శ్రీ రామచంద్ర అప్పారావు గారికి విన్నవించిన ఈ మాట కూడా ప్రమాణం కాకపోతే, చేసేదేమీ ఉండదు: “చదివినారము శబ్దశాస్త్రమ్ము తుదముట్టఁ, జిరకాల మొక్క దేశికునియొద్ద” అని. శబ్దశాస్త్రం ‘తుదముట్ట’ (శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి సన్నిధిని ఆసాంతం) చదివిన ఆ మహాత్ములు శాస్త్రపండితులని ఎట్లా తెలుస్తుందో ఒక పద్యాన్ని, ఒక శ్లోకాన్ని చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యాకర్త ఉదాహరించటం జరిగింది.

    కవులు శాస్త్రపండితులు అవునో, కాదో వారి రచనలే నిర్ధారిస్తాయి. వారు చెప్పుకోనంత మాత్రాన వారు పండితులని నిర్ధారణ కాకమానదు. వాళ్ళే మేము శాస్త్రపండితులమని చెప్పుకొన్నాక కూడా వారు పండితులు కారంటే చెప్పగలిగినదేమీ ఉండదు.

    “వాళ్ల ప్రఖ్యాత పద్యంలో “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండుబాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా; రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు” అన్నారే కాని పాండిత్యంలో పోటీకి రమ్మనలేదు.”

    ఈ పద్యనేపథ్యం చాలా మంది పాఠకులకు తెలిసి ఉండకపోవచ్చును. ఆత్మకూరు సంస్థానంలో తిరుపతి వేంకటకవులకు తీవ్రమైన ప్రతికూలవాతావరణం ఎదురైంది. శఠమర్షణం కృష్ణమాచార్యుల వారి మహాప్రౌఢమైన శ్రీనివాస విలాస చంపువును తెలుగు చేసినందువల్ల కవులకు సభలో కలిగిన ప్రశస్తిని చూసి ఆస్థానకవి తర్కతీర్థ తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు గారికి అసూయ కలిగింది. కవులకు శాస్త్రపాండిత్యం లేదని ప్రసంగించారు. ‘గుణాలయ’, ‘దేవతలు ధర్మవర్తులు’ అన్నవి అపప్రయోగాలని సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆస్థానవిద్వాంసులు ఒకటయ్యారు. కవులు ఆనాడు అసామాన్యమైన తమ వ్యాకరణపాండిత్యంతో విమర్శకులను నిరుత్తరులను చేశారు. భారత ప్రయోగాలను తవ్వి తలకెత్తారు. అప్పుడు శ్రీనివాసాచార్యులు చేసేదేమీ లేక, “మీసములం బట్టి చూడ మీరు పండితులు గారు” అని కుత్సితాక్షేపణ చేశారు. అందుకు సమాధానంగా కవులు జగదేకనుతిపాత్రమైన ఆ పద్యాన్ని చెప్పారు. “దుందుడు కొప్పఁగ” రెండు వైపుల మీసాలు పెంచినది రెండు భాషలలో మేము కవీంద్రులం అని చెప్పుకొనేందుకు (తండ్రిగారు జీవించి ఉండగా వైదికులు మీసాలు పెంచరాదన్న ఆనాటి సంప్రదాయం తెలియని ధర్మశాస్త్రపాండిత్యలోపం వల్ల కాదు, కవీంద్రత్వం మూలాన కలిగిన దుడుకుతనం వల్ల); ఏ పాండిత్యం మాకు లేదని ఆక్షేపించారో – ఆ శాస్త్రార్థంలో “కవివరుల్ (ఆస్థానకవి శ్రీనివాసాచార్యులు గారిని ఉద్దేశించి అన్నమాట అది) మము గెల్వుఁడు” – అని ఆ పద్యభావం. పాండిత్యంలో పోటీకి రమ్మనే ఆరోజు వారన్నారు. ఆత్మకూరు శాస్త్రవాదంలో గెలుపొందిన కొంతకాలానికి తర్వాత కూడా, “నీదు సంస్థానపండితుఁ డైన యల శ్రీనివాసాచార్యవర్యుండు సన్యాసి యయ్యె” అని కవులు ఆ పాండిత్యవిజయాన్ని నెమరువేసుకొన్నారు.

    “వ్యాకరణం పుట్టి, కావ్యాలు వస్తాయనే నమ్మకం మనవారికి ఎన్నడూ లేదు.” అంటూ ఏల్చూరి వారొక sweeping generalization చేశారు. ఇందుకు వారిచ్చిన ఉదాహరణలన్నీ పందొమ్మిదో శతాబ్దికి ముందువే. ఈ ప్రస్తుత వ్యాసానికి సంబంధించిన కాలంలో ఉన్న పరిస్థితికి ఈ ఉదాహరణలు ఎలా అన్వయిస్తాయి?”

    అందువల్ల ఆ నమ్మకం 19-వ శతాబ్దికి సంబంధించిన కాలంలో ఏ రూపంలో ఉన్నదో అన్వయించటమొక్కటే సమాధానం కాగలదు. పందొమ్మిదో శతాబ్దికి మునుపు, పందొమ్మిదో శతాబ్ది కాలంలో, పందొమ్మిదో శతాబ్దికి తర్వాత, ఆనాటికీ ఈనాటికీ ప్రయోగరక్షే వ్యాకరణప్రయోజనమని నమ్మకం.

    “లక్షణోక్తమగు విషయము లక్ష్యమం దిమిడియున్నదే కాని వేఱు కాకపోయినను” … “నన్నయభట్టారకునకుఁ బూర్వము గాని యతనినాఁడు గాని తత్సమ భాషకుఁ గాదు కదా యాచ్ఛికభాషకే లక్షణము పుట్టలేదు” … “శబ్దస్వరూపవిజ్ఞానమును బ్రయోగవిజ్ఞానమును విశదీకరించు లక్షణములే మనభాష కిపు డావశ్యకము” … “ఈ భావముతోనే ‘ప్రయోగశరణం వ్యాకరణ’ మ్మనుచు నే నాంధ్రభాషానుశాసనము నిర్మించినట్లే యీ శాస్త్రిగా రీ తత్సమచంద్రికను నిర్మించినారు” అని 1954లో శ్రీ సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి గారి తత్సమచంద్రిక పీఠికలో శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు. 20-వ శతాబ్దిలోనూ ఈ భావమే ఉన్నది.

    జిజ్ఞాస్యమైన సంశయప్రకాశానికి మూలం జిజ్ఞాస. సందేహనివృత్తి వ్యాసకర్తల కర్తవ్యం. వ్యాసంలోని ప్రత్యంగమూ వ్యాసంగానికి పాత్రమే. ఏ అధిక్షేపణమూ లేని ప్రశమితభావంతోనే విషయవిమర్శను వ్యాసరచయితల సహృదయత మన్నింపగలదన్న ఆకాంక్షతో వ్యాఖ్యను ప్రకటించటం జరిగింది.

    వ్యాసరచయితలకు, శ్రీ రామారావు గారికి, శ్రీ వంశీమోహన్ గారికి, సంపాదకులకు ధన్యవాదాలు. ఈ మాటకు ఇంతటితో స్వస్తి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    [ఈ వ్యాసపు రెండవ భాగం ప్రచురించబడేవరకూ, ఈ మొదటి భాగంపై చర్చను నిలిపివేస్తున్నాము.అసౌకర్యానికి క్షమార్పణలు – సం.]

  3. హృదయం ఇక్కడే వుంది! గురించి domain dns అభిప్రాయం:

    09/12/2016 11:22 pm

    చాలా ధన్యవాదాలు సురేష్, కథ చదివి మీ విలువైన స్పందన తెలియచేసినందుకు.
    శుభాకాంక్షలతో….

  4. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:

    09/12/2016 4:19 pm

    ముందుగా, ఏల్చూరి వారికి నమస్కారాలతో కూడిన అభినందనలు – ఒక వ్యాసంలోని అతిముఖ్యమైన పలు సమస్యలని గుర్తించి, దానిని కూలంకషంగా విలోకించి, విచారించి, విశ్లేషించి, కొత్త ఆలోచనలకి దారి తీసే విషయాల్ని వ్యాఖ్యద్వారా ప్రతిపాదిస్తున్నందుకు. ఆ ఆలోచనల లోతులు ఎంతలో వున్నాయో అన్న సంగతి ఎంతమందికి అర్థమవుతుందోనని నాకు కుతూహలంగా వుంది.

    “ఏవం విధ విషయవిమర్శ” అని ఒకవంక, “వ్యాసతాత్పర్యానికి భంజకాలు కావని” స్పష్టంగా అపార్థాలకు తావులేకుండా మరోవంక మురళీధరరావు గారు చేసిన వ్యాఖ్య బ్రహ్మాండంగా అనిపిస్తోంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే – వారన్నవి ఒక్కొక్కటి తీసుకుని, అందుట్లోని సారం సంగతి అర్థం కాక ఈ వ్యాస విషయాన్ని పరిష్కరించే ప్రయోజనం చేజార్చుకుంటారేమోనన్న భయం. ఈ రెండు పేజీల వ్యాసంలో చదవవలసిందేదీ లేదని వ్యాసం చదివిన తరువాత అనిపించిన మాట వాస్తవం. అయితే ఇది తర్వాత వచ్చేదానికి ఉపోద్ఘాతం లాటిదన్న రచయిత మాట వలన, ఊరుకొని దానికోసం ఎదురు చూడడమంత మంచి పని ఇంకోటి లేదు. ఇప్పటికయితే నా దృష్టిలో ఈ వ్యాసం చివరన ఇచ్చిన 30 + రెఫెరెన్సు పుస్తకాలు చదువుకోవటం ఉత్తమం. లిష్టు ఇచ్చినందుకు రచయితకు కృతజ్ఞతలు.

    పోతే, ఏల్చూరి వారు రచయితను కొన్ని ప్రశ్నలు అడిగినారు. సమాధానం రచయిత ఇస్తే బాగుండును. రచయితకు పట్టనిదో, సమాధానం చెప్పలేని విషయమో, తర్వాతెప్పుడైనా చెపుదామని ఊరకున్నారో తెలియనైతే లేదు కానీ, ఏల్చూరి వారి కామెంటు మీద కె.వి.ఎస్ రామారావు గారనువారు చేసిన కామెంటు నాకు చాలా అనవసరమనే అనిపిస్తోంది. దాని వల్ల వ్యాసాన్ని విస్తృతపరిచే అవకాశమున్నదనుకొని రాసినారో ఏమో? అలా రాసి ఉంటే అది భ్రమగా మిగిలిపోకూడదన్న ఆశతో!

    ఏల్చూరి వారి వ్యాఖ్య వల్ల రచయిత ప్రూఫు రీడింగులో చేసిన పొరపాటు బయటపడింది. రాసేవారు పొరపాటు చేసినపుడు చదివేవారు పొరపాటు పడకుండా సరిచెయ్యటమనేది మంచి విమర్శకుని లక్షణం. అది ఏల్చూరి వారిలో పుష్కలంగా ఉన్నదని పట్టవన్న పేర్లు ఇరికించి రాసిన వారి పద్యమే నిరూపించినది. అలాగే వారి వ్యాఖ్య లోని ఇతర విషయాలు కూడాను.

    రామారావుగారి కామెంటు వలన ఇసుమంత కూడా ప్రయోజనమేమీ లేదని నాకు అనిపించిన మాట నిజమే కానీ, వ్యాసకర్త రామారావుగారి కామెంటు చదివి వ్యాసాన్ని విస్తృతపరిస్తే అంతకన్నా ఆనందమూ లేదు.

    నేను రాసిన ఈ కామెంటు కూడా దేనికి ఉపయోగపడే అవకాశమూ లేదు. ఏమీ ఉపయోగాల్లేని వాటిని రాసుకొని ఆనందించటం కన్నా ఏల్చూరి వారి ప్రశ్నలు మరల చదువుకొని అర్థమూ ఆకళింపూ చేసికొని జ్ఞానసముపార్జన చేసుకోవటం ఉత్తమమని నమ్ముతూ

    ఇంతటితో ఈ వ్యాసమునకు, వ్యాఖ్యలకు స్వస్తి

    భవదీయుడు
    మాగంటి వంశీ మోహన్

    [ఎవరి అభిప్రాయాలు వారివి. విమర్శకు ఎవరూ అతీతులు కారు. అయితే ఆ విమర్శ అభిప్రాయం పైన కాక అభిప్రాయం వెలిబుచ్చిన వారిపైకి హేళనలతో మరలించడం వల్ల తాత్కాలికమైన ఉపశాంతి ఏదైనా మిగలవచ్చేమో కాని, అసాహిత్య వాతావరణం ఏర్పడి చర్చ స్థాయి దిగజారిపోతుంది. అది ఎవరికీ విజ్ఞానదాయకమూ కాదు, అందువల్ల ఏ లాభమూ లేదు. దయచేసి ఆసక్తికరము, అవసరము అయిన ఈ వ్యాసంపై చర్చను నిగ్రహంతో కొనసాగించవలసిందని మా మనవి – సం.]

  5. రక్తకన్నీరు గురించి domain dns అభిప్రాయం:

    09/12/2016 12:00 pm

    మా చిన్నప్పుడు విన్న రేడియో నాటికల్లో గణపతి అనే నాటిక – చాలా నవ్వు తెప్పిస్తుండేది. తరచూ విని ఆనందించేవాళ్ళం. వీలుంటే ఆ నాటకాన్ని కూడా ఇక్కడ వుంచగలరని మనవి.
    ధన్యవాదాలు.

  6. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి కె. వి. ఎస్. రామారావు అభిప్రాయం:

    09/11/2016 9:04 pm

    ముందుగా, నారాయణరావు, శ్రీనివాస్ గార్లకి అభినందనలు – అతి ముఖ్యమైన ఒక సమస్యని గుర్తించి, దానిని కూలంకషంగా విలోకించి, విచారించి, విశ్లేషించి, కొత్త ఆలోచనలకి దారి తీసే విషయాల్ని ప్రతిపాదిస్తున్నందుకు. ఆ ఆలోచనల లోతులు ఇంకెంత వున్నాయో రెండో వ్యాసంలో చదవాలని నాకు కుతూహలంగా వుంది.

    ఐతే, “ఏవం విధ విషయవిమర్శ” అని ఒకవంక, “వ్యాసతాత్పర్యానికి భంజకాలు కావని” మరోవంక అంటూనే మురళీధరరావు గారు చేసిన వ్యాఖ్య మాత్రం నాకు అనవసరమనే అనిపిస్తోంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే – వారన్నవి ఒక్కొక్కటి తీసుకుని వాటివల్ల ఈ వ్యాస విషయాన్ని విస్తృతపరిచే ఏమన్నా ప్రయోజనం ఉందేమో చూస్తే నాకు అలా కనిపించటం లేదు.

    మొదటగా – “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు” అన్న వాక్యం వారికి అభ్యంతరకరమైందన్నారు మురళీధరరావు గారు.. ఐతే వారు చూపిన తిరుపతివెంకట కవులు చెప్పిన శ్లోకాలు, వారి శిష్యుల సంస్కృత భాషాజ్ఞానం తిరుపతి వెంకట కవులు పండితులు ఔనని ఏ అర్థంలో నిరూపిస్తాయో నాకు బోధపడడం లేదు.

    ఇక – “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్లే” అన్న విషయాన్ని తీసుకుందాం. ఈ వ్యాసం మాట్లాడుతున్నది పందొమ్మిదో శతాబ్దపు చివరి భాగం, ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగాల్లోని పరిస్థితుల గురించి. ఆ కాలంలో ఎవరిని పండితులనే వాళ్లో చెళ్లపిళ్ల వారి ఆత్మకథ స్పష్టంగానే చెప్తున్నది. వ్యాసంలో, చెళ్లపిళ్ల వారి ఆత్మకథ నుంచి ఈ సందర్భంలోని కొన్ని విషయాల్ని తీసుకున్నామని వ్యాసకర్తలూ చెప్పారు. ఉదాహరణకి వారి “కథలు గాధలు” పుస్తకంలో “వెనకటి పండితులు” అన్న వ్యాసం చూడండి (అదృష్టవశాత్తు ఎవరో ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని archive.org లో పెట్టారు. చెళ్లపిళ్ల వారి “కాశీయాత్ర” కూడ ఎప్పటినుంచో అక్కడ ఉంది.) అందులో వారు పండితులుగా చెప్పిన వారంతా వ్యాకరణ, తర్క, మీమాంస, వేదాంతాది శాస్త్రాల్లో పండితులే, ఎవరూ “తెలుగు పండితులు” కారు. వాళ్లలో కవిత్వం చెప్పగలిగిన వాళ్లు ఎవరైనా ఉన్నారేమో తెలియదు; ఉన్నా వాళ్లని వాళ్లు పండితులుగా భావించుకున్నారు తప్ప కవులుగా చూసుకున్నట్టు దాఖలాలు లేవు ఈ పుస్తకంలో. అలాగే, అప్పుడు పిల్లలెలా పాఠాలు నేర్చుకునేవారో చెప్పే ఈ వాక్యాలు చూడండి (పేజి. 301):

    “తెల్లవారుజామున పాఠాలకు ప్రారంభం చేసేవారు. తక్కువ పాఠం వాళ్లకి ముందు ప్రారంభం. ఆ పాఠాన్ని పై తరగతివాళ్లంతా వినడం ఆవశ్యకం. యీ నియమం శాస్త్ర పాఠాలకి మాత్రమే. కావ్య పాఠాల వాళ్లకి గురువుగారు చెప్పడం లేదు. విద్యార్థులలో పెద్దతరగతివాళ్లే చెప్పేవారు. గురువుగారివద్ద చెప్పుకొన్న శాస్త్రపాఠాన్ని క్రిందితరగతి వాళ్లకి పై గ్రంథాలు చదువుకొనే విద్యార్థులు చింతన చెప్పేవాళ్లు. ఆయీ విధంగా కష్టిస్తేనే తప్ప శాస్త్రం స్వాధీనం కాదు. యీ విధంగా అభ్యసించినప్పటికీ యేకొందరికోతప్ప సర్వేసర్వత్ర శాస్త్రం స్వాధీనం కాదు.”

    దీన్నిబట్టి కావ్యాధ్యయనం, శాస్త్రాధ్యయనం వేరువేరని, శాస్త్రాల్ని గురువుగారు చెప్తే కావ్యాల్ని ఇతర విద్యార్థులే చెప్పేవారని తెలుస్తుంది కదా!

    “నేనూ – మా తిరుపతి శాస్త్రుల్లూ” అనే వ్యాసంలో చెళ్లపిళ్ల వారు తాము సంస్కృతంలో ఏమేం చదివిందీ చాలా విస్ఫష్టంగానే రాశారు. ఏ ‘శాస్త్రం’లోనూ తను పండితుణ్నయానని ఆయన ఎక్కడా చెప్పలేదు. తిరుపతిశాస్త్రి తనకన్న ముందుగా సిద్ధాంతకౌముది పూర్తిచేశాడని, వ్యాకరణంలో తనకంటె తిరుపతిశాస్త్రి గట్టివాడని మాత్రం అక్కడక్కడ అభిప్రాయపడటం కనిపిస్తుంది. వాళ్ల ప్రఖ్యాత పద్యంలో “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండుబాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా; రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు” అన్నారే కాని పాండిత్యంలో పోటీకి రమ్మనలేదు. ‘కవీంద్రులమని” చెప్పి ‘కవివరుల’తో మాత్రమే పోటీ పడ్డారు. ఈ వ్యాస కాలపరిధిలో కవులు వేరు, పండితులు వేరు. పండితులంటే తప్పక కనీసం ఏదో ఒక సంస్కృతశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారే. తిరుపతివెంకట కవులు కవులు; పండితులు కారు. కవిత్వం గురించే వారు పోటీ పడ్డారు తప్ప శాస్త్రాల గురించి కాదు. గీరతం, గుంటూరుసీమ, ఇంకా అనేకుల్తో వాదాలు ఇలాటివే.

    ఇంతెందుకు – కథలు గాధలు, 18వ పేజీలో చెళ్లపిళ్ల వారు అతి స్పష్టంగానే చెప్పారు: “పండితులంటే ఆ కాలంలో ఆ బిరుదు రావడం సామాన్యంగా వచ్చేది కాదు. కావ్యనాటకాలంకారాలు పూర్తిగా చదివిన వారికి ఆ బిరుదు ఉండేదే కాదు. సాహిత్య గాళ్లనేవారు వాళ్లని. ఏదో ఒక శాస్త్రంలో పూర్తిగా పాండిత్యం సంపాదిస్తేనే పండితుడనడం.” ఇది సంస్కృతభాషా సందర్భంలోనేనని, తెలుగు గురించి కాదని చెప్పక్కర్లేదు కదా !

    రెండవది – “‘ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయనే నమ్మకం’ మనవారికి ఎన్నడూ లేదు.” అంటూ ఏల్చూరి వారొక sweeping generalization చేశారు. ఇందుకు వారిచ్చిన ఉదాహరణలన్నీ పందొమ్మిదో శతాబ్దికి ముందువే. ఈ ప్రస్తుత వ్యాసానికి సంబంధించిన కాలంలో ఉన్న పరిస్థితికి ఈ ఉదాహరణలు ఎలా అన్వయిస్తాయి?

    “సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు.” ఆంధ్రశబ్దచింతామణి 16-వ శతాబ్ది చివరి కాలం నాటిది. అంతకు మునుపటి కవులకు దాని ఉనికి విషయం తెలిసివుండే అవకాశమే లేదు. ఆ తర్వాతి కవులు మాత్రం దానికి “బలమైన ప్రాధాన్యాన్ని” ఇచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఏమున్నాయి?”

    వారి ఈ వ్యాఖ్యలో మొదటిభాగం వ్యాసకాలానికి ముందుది. రెండోభాగానికి ఉత్తరం బాలవ్యాకరణమే ఇస్తుంది. (దీని గురించి కొంచెం ముందు మాట్లాడదాం).

    “పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు.” అనే దానికి అభ్యంతరం వెలిబుచ్చుతూ మళ్లీ వ్యాసకాలానికి పూర్వుల్నే ఉదహరించారు కనుక దీన్ని చర్చించనక్కర్లేదు.

    మూడవది – “ఆంధ్రశబ్దచింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు.“ చిన్నయ సూరి గారు ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది? “ అంటూ అధిక్షేపించారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి “రమణీయము”లో సంధి పరిఛ్చేదంలో 13 వ సూత్రం, దాని సందర్భం చూడండి. “వాగనుశాసనులు యదా తదా యని గ్రహించుట ప్రపంచార్థమని యెఱుగునది.” అని ఒక వాక్యం కనిపిస్తుంది. ఈ వాగనుశాసనుడు నన్నయ కాదు, మరొకరికెవరికో కూడ ఆ బిరుదుంది, సూరి మాట్లాడుతున్నది ఆ రెండో వ్యక్తి విషయం, నన్నయ గారి గురించి కాదని అంటారా?

    చివరగా వ్యాసకర్తల పేర్లు ఛందోబద్ధ పద్యాల్లో పడతాయా లేదా అనేది. వ్యాఖ్యకారులు ఒక ఉదాహరణ ఇచ్చారు వ్యాసంలో విషయానికీ దీనికీ ఎంతదూరమో చదివేవాళ్లకి వెంటనే తెలుస్తుంది.

  7. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి శ్రీనివాస్ పరుచూరి అభిప్రాయం:

    09/11/2016 6:13 pm

    సంపాదకులకు నమస్కారం, మా వ్యాసం ప్రూఫు చూడ్డంలో మా పొరపాటు వల్ల ఈ కింది వాక్యంలో ఒక మాట చేరలేదు.

    “వెల్చేరు నారాయణరావు ఏ పద్యంలోను పట్టదు.” – ఈ వాక్యం ఈ కింది విధంగా సవరించి చదువుకో ప్రార్ధన.

    “వెల్చేరు నారాయణరావు ఒక పట్లాన ఏ పద్యంలోను పట్టదు.”

    మురళీధరరావుగారి వ్యాఖ్య చదివిన తరువాత ఇది మా దృష్టికి వచ్చింది. వారికి మా కృతజ్ఞతలు.

    [ఆ వాక్యం సవరించాము. – సం.]

  8. గడి నుడి – 1 గురించి Hareesh Kumar అభిప్రాయం:

    09/10/2016 11:34 am

    the winners’ names should be published in the next edition to make this puzzle a success.

  9. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/10/2016 4:20 am

    మాన్యులైన శ్రీ తః తః గారికి
    నమస్కారములతో,

    రచయితల నైకజమైన అభిప్రాయమే గాని, ‘నైజ’మేమీ తెలియవలసి రాలేదు. 🙂 “తెలుగులోనే పనిచేస్తున్నవాళ్లు … కవులే కానీ పండితులు కారు”, “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే” అన్న నైపథ్యానుసంజనతో ఘట్టితాలైన “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృతపండితులు కారు … అందుచేతనే … ఆశుకవిత్వా(వధానా)దివిద్యల వల్ల … వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు” ఇత్యాదివాక్యాలను పురస్కరించికొని మాత్రమే – తిరుపతి వేంకట కవులు సంస్కృతంలో శాస్త్రపండితులు ఎందుకు కారన్న సంశయాన్ని ప్రకటించటం జరిగింది. నారాయణరావు గారి గురుస్థానీయత, శ్రీనివాస్ గారి బహుముఖప్రామాణికత, ఆ ఉభయుల ప్రభావశీలితల నైజం ఆ ప్రకటనకర్తకు సుజ్ఞాతమన్నది ప్రతిజ్ఞాతమే.

    అట్లాగే, తత్సమమైన ‘అయోమయ’ శబ్దానికి ‘ఇనుముతో నిండి(చేసి)నది’, అన్న ప్రాథమికార్థం తొలగిపోయి, ‘అస్తవ్యస్త పరిస్థితి’, ‘అర్థం కాని స్థితి’ అని తెలుగులో అర్థపరిణామం ఏర్పడిన తర్వాతి (ఇటీవలి?) కాలంలో ఎవరో తెలుగువారే, ఏ సమస్యను ఇచ్చినప్పుడో, ఏ చమత్కారవశాననో ప్రాసంగికంగా చెప్పిన శ్లోకమే గాని, “ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం” అన్నది తెలుగు పట్ల ఈసడింపుగా చెప్పబడిన చాటూక్తి భావమై ఉండదు. ఆ మాట శ్లోకపూర్వార్ధంలో ఆ విధమైన శ్లేషార్థంతో ఉండటమే అందుకు నిదర్శనం.

    ‘గీర్వాణ’ శబ్దం సంస్కృతంలో ‘గీర్బాణ’ శబ్దం నుంచి ఏర్పడినదని “గీరేవ (నిగ్రహానుగ్రహసమర్థా) బాణః అస్త్రం యేషామ్’ అని రామాశ్రమి. ఎవరి వాక్కులు బాణతుల్యములో, వారు గీర్బాణులు. గీరేవ శాపలక్షణా వాణో బాణో వా యేషాం తే వబయో రభేదః’ అని లింగాభట్టీయం. సంప్రదాయస్థమైన ఇదే తెలుగులో ఏర్పడిన అర్థచ్ఛాయకు మూలమని ఊహ్యం. ములుకుల వంటి పలుకులు (బాణతుల్యములైన కఠినోక్తులు) కలవాడు గర్విగా భావింపబడటం సహజమైన అర్థాన్వయమే. అది ఆధునిక సాహిత్యపరిణామగతమైన అర్థాన్వయమో, కాదో ఇంకా పరిశీలింపవలసి ఉన్నది.

    ఇవన్నీ వ్యాసప్రతిపాదితానికి భంజకాంశాలు కావని ముందే విన్నవించటం జరిగింది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  10. హృదయం ఇక్కడే వుంది! గురించి Venkat Suresh అభిప్రాయం:

    09/09/2016 4:16 pm

    కధ చదువుతున్నంత సేపు నాకు తెలిసిన ఒక జంట గుర్తొచ్చారు మామ్. మీరు వాళ్ళని బాగా అబ్సర్వ్ చేసి రాసినట్లు అనిపించింది. ముగ్గురి పాత్రల సంఘర్షణని చక్కగా రాశారు. చాలా చాలా బాగుంది.