పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. రచయితలు – ఎడిటర్లు గురించి Malathi Nidadavolu అభిప్రాయం:

    01/02/2009 5:19 am

    ఎమి దిని సెపితివి కపితము
    బెమ పడి వెరి పుచ్చకయ దిని సెపితివొ
    ఉమెతః దిని సెపితివొ
    అమవసనిశి యనుచు అలసని పెదన
    అంటూ రామకృష్ణుడు వత్తులూ, దీర్ఘాలూ తీసేసి, అల్లసాని పెద్దన పేరుని కూడా హేళన చేసేడు.
    (ఈపద్యం నాకు జ్ఞాపకం వున్నట్టు రాసేను. తప్పులుండొచ్చు. ప్రధానాంశం అమవసనిశి. అన్నపదం వాడకం). ఇది కూడా ఒకరకంగా ఎడిటోరియల్ కామెంటే.
    మార్క్‌ట్వైన్ తన కథని ఒక పత్రిక తిప్పి పంపుతూ, “ఇందులో నువ్వు విరామ చిహ్నాలు సరిగ్గా పెట్టలేదు. కామాలు వుండవలసినచోట లేవు, అవి పెట్టి మళ్లీ పంపించు” అన్నారుట. దానికి జవాబుగా మార్క్‌ట్వైన్ మరో కాయితంనిండా కామాలు టైపు చేసి పంపుతూ “ఇవిగో కామాలు. మీకిష్టం వచ్చినచోట పెట్టుకోండి” అని రాసేడుట.
    సంపాదకుల-రచయితలమధ్య రాగద్వేషాల విషయం నేను నా తెలుగు తూలికలో రచయితలకోణం నుండి ప్రస్తావించాను. నిజానికి దాన్ని “ఊసుపోక” వ్యాసంగా రాయడంలో నావుద్దేశ్యం హాస్యప్రధానం చేద్దామనే. (ఊసుపోక వ్యాసాలు కాఫీటేబుల్ కబుర్లలాటివి) అయితే అందులో హాస్యం పలకలేదు. ఆదోషం నాదే. వ్యాఖ్యాతలు సీరియస్‌గానే తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
    రచయితకి తనరచనల్లోనూ ఎడిటరుకి తన సలహాల్లోనూ లోపాలు కనిపించవు. కారణం రచయిత తనమనసులో వున్నది తాను రాస్తాడు. ఎడిటరు అది చదువుతున్నప్పుడు తనకి కలిగిన స్పందన ప్రాతిపదికగా తన అభిప్రాయాలు వెల్లడిస్తాడు. కానీ ఎడిటరు బాధ్యత అంతటితో ఆగిపోదు. తన పాఠకులకోణంలోనుండి కూడా ఆలోచించాలి. అంతే కాదు. ఈనాడు ప్రాచుర్యంలో వున్న మంచి కథ లక్షణాలు కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు ఒకకథమీద తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నప్పుడు. నాకు వచ్చే చిక్కంతా ఇక్కడే. ఏది మంచికథ అన్నదానికి ఈనాడు ప్రాచుర్యంలో వున్న ప్రమాణాలు నాకు పూర్తిగా అంగీకారం కాదు. ఆకారణంగానే కొన్ని పత్రికలు నాకథలు వేసుకోవు కూడాను. వారికోసం నేను నా రచనావిధానాన్ని మార్చుకోలేను.
    నేను రచయితనీ సంపాదకినీ కూడా. అంచేత సంపాదకుల సాధకబాధకాలు నాక్కూడా అవగతమే. ఎటొచ్చీ నాసైటులో షేక్స్ పియరులు (those who can shake my views) లేరు. నేను కూడా అందరు ఎడిటర్లలాగే నా సైటు పాఠకులని దృష్టిలో పెట్టుకుని అనువాదకులకి అంతో ఇంతో సలహాలు ఇస్తాను. (నిజానికి అనువాదాల్లో బాధలు వేరు కనక ఇది పూర్తిగా ఇక్కడ వర్తించదేమో).
    ఇంతకీ నా తెలుగుతూలికలో నా వ్యాసంమీద వెలువడిన అభిప్రాయాలూ, ఇక్కడ వేలూరివారి వ్యాసం చూసిన తరవాత నాకు అర్థం అయింది ఏమిటంటే రచయితలకీ, ఎడిటర్లకీ, రెవ్యూయర్లకీ, మధ్య సయోధ్య లేదు. వారూ వీరూ కూడా ఎదటివారు సహకరించడంలేదు అనే అంటున్నారు.
    ఈవిషయం ఈ రెండు వ్యాసాలలోనూ తెల్లమయింది కనక ఇహమీదట ఇరువైపులా తమ దృక్కోణాలలో కొంత మార్పూ, ఇద్దరిమధ్యా రవంత సామరస్యం ఆశించడానికి ఇక్కడ అవకాశం ఏర్పడిందనుకుంటాను. అందుకు కృతజ్ఞతలు.
    . -నిడదవోలు మాలతి.

  2. పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao అభిప్రాయం:

    01/02/2009 4:52 am

    >>ఇప్పుడు గ్రంధాల్లో వున్న భాష గ్రాంధిక భాషా? ఇవి గ్రంధాలు కావా? గ్రాంధిక భాష కాలమహిమవల్ల ఎలా మారిపోతుంది?
    “గ్రంధాలలో ఉండేది గ్రాంధికభాష” అన్న నిర్వచనం తీసుకుంటే ఇప్పుడు గ్రంధాలలో వాడే భాషకూడా గ్రాంధికభాషే అవుతుంది. అందులో సందేహం ఏవుంది? కానీ నేను నా వ్యాసంలో ఉద్దేశించింది అది కాదు. అందుకే ఆ పదాన్ని ఏ ఉద్దేశంలో వాడేనో వ్యాసంలోనే పేర్కొన్నాను.

    >>తెలుగు గ్రాంధిక భాష ఎలా పుట్టింది? ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా గ్రాంధిక భాష గ్రాంధిక భాష ఎలా తయారవుతుంది? ఎవరూ “వాడని” భాషని ఎవరైనా ఎలా తయారుచెయ్యగలరు?
    నాకు భాషాశాస్త్రంతో పెద్దగా పరిచయం లేదు కాని, నాకు తెలిసినంతవరకూ తెలుగులో గ్రాంధిక భాష సంస్కృత భాషా సాహిత్య ప్రభావంతో రూపొందిందని అనుకోవచ్చు. ఇది నన్నయ్యో మరే ఒక్కరో కూర్చుని చేసిన పని అనుకోవడం సరికాదు. నన్నయ్యకి ముందున్న తెలుగుశాసనాలలోనూ, కన్నడ సాహిత్యంలోనూ కూడా ఈ భాష కనిపిస్తుంది. ఎలా అయితే వ్యవహారంలోని భాషని ఒకరు సృష్టించరో, అలానే గ్రాంధికభాషాను. ఎలా అయితే వాడుకభాష మారుతూ వస్తుందో అలానే గ్రాంధిక భాష (అంటే గ్రంధాలలో వాడే భాష) కూడా మార్పుచెందుతూనే ఉంటుంది. గ్రాంధిక వాడుక భాషలు ఒకదాన్ని మరొకటి ప్రభావితం కూడా చేసుకుంటూ ఉంటాయి. పూర్వం సాహిత్యమూ, గ్రందాలూ కొన్ని వర్గాలకి పరిమితమవ్వడం వల్ల వాళ్ళకి నచ్చిన, వాళ్ళు వాడడానికి ఇష్టపడిన భాషలో గ్రంధాలు వెలువడ్డాయి. నిత్య వ్యవహారంలో భాషకీ ఆ భాషకీ కొంత స్పష్టమైన భేదం కనిపించేది. ఇప్పుడు మారిన పరిస్థితులలో సాహిత్యం, గ్రంధరచన అన్ని వర్గాల ప్రజలూ చేస్తునారు కాబట్టి, దానికి ఇంతకు ముందున్నంత నిర్దిష్టమైన రూపం లేదు. వ్యవహార గ్రాంధిక భాషల మధ్య తేడా ఇంచుమించు చెరిగిపోయింది.

    >>కాలమహిమవల్ల మారిపోయే గ్రాంధిక భాషకి ఈ ధూపదీపనైవేద్యాలెందుకు?
    తమకి ఇష్టదైవానికి పూజ చేసుకొనే హక్కు ఈ సెక్యులర్ దేశంలో ప్రతివాడికీ ఉందికదండీ 🙂 నాస్తికుల చెవి మెలిపెట్టి మీరుకూడా పూజ చెయ్యాల్సిందే అనే హక్కు ఆస్తికులకి లేదు. అలానే ఆస్తికులని పూజలు మానుకోండనే హక్కు నాస్తికులకీ లేదు, ఏవంటారు? ఇంతకీ నా వ్యాసంలో నేనెలాంటి పూజా కార్యక్రమమూ పెట్టలేదే!

    >>అందులో పచనం కాని పద్యాలైనా, వచనాలైనా పట్టించుకోడం ఎందుకు?
    పైన నేను చెప్పినట్టు, ప్రస్తుతం గ్రంధాలలో వాడే భాషకి ఒక నిర్దిష్ట రూపం అంటూ నాకు తెలిసి ఏవీ లేదు. ప్రాచీన కావ్యభాష కావచ్చు, అందరికీ అర్థమయ్యే సామాన్య వాడుకభాష కావచ్చు, ప్రాంతీయ/మాండలిక భాష కావచ్చు, జానపదభాష కావచ్చు ఇలా ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళా భాషలో రాస్తున్నారు. దాన్ని ఇష్టపడే వాళ్ళు చదువుతున్నారు. ఒకో రకమైన భాషలో ఒకో అందం ఉంది, ఒకో శక్తి ఉంది. కాబట్టి ప్రాచీన కావ్యభాష ఇష్టమైన వాళ్ళు, దాని శక్తి తెలిసినవాళ్ళు ఆ భాషలో సాహిత్యం వెలువరించడంలో తప్పేముంది? దాన్నిష్టపడి చదివే వర్గమే దాన్ని పట్టించుకుంటుంది. అలాటి వర్గం అంతరించిననాడు అది సహజ మరణం పొందుతుంది. అది సమాజానికి హాని చెయ్యనంత కాలం దాన్ని బతికించుకోవాలనుకోవడంలో తప్పులేదు, హత్య చెయ్యాలనుకోవడం అన్యాయం.

    >>మీరేమో వాడుక భాషలో ఉత్పలమాల, చంపకమాల, పులులూ, ఏనుగులూ కుదరవంటారు. అవును కాబోలు అనుకునే లోపునే, మరో గురు తుల్యులు, కృష్ణమోహన్ గారు వాడుక భాషలో పద్యాలు అంటారు. ఏం దారి?
    మేవిద్దరం రెండు కోణాలని చూపించే ప్రయత్నం చేసేమనే నేననుకుంటున్నాను కాని తగువులాడుకోటం లేదు. మీరు మా మధ్య లేని తగువుని సృష్టించకండి 🙂 పద్యాలలో వాడుకబాష వాడకంలోని పరిమితులని నేను విశ్లేషించేను. అంతేకాని వాడుకభాషలో పద్యాలు రాయలేమని కాని, రాయకూడదని కానీ నేననలేదు. పద్యాలలో వాడుక భాషని ఎలా వాడవచ్చో కూడా నేను నా వ్యాసంలో ప్రస్తావించాను. అలానే వాడుకభాషలో పద్యాలు ఎలా రాయవచ్చో మోహనగారు మరో రకంగా వివరించారు.

  3. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి rama అభిప్రాయం:

    01/01/2009 10:41 pm

    అయ్యా కామేశ్వరరావు గారూ !!

    ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న నాకు …మీరు నాచనసోమనాధుని మీద రాసిన వ్యాసం…. నిజంచెప్పొద్దూ మంచి భోజనం చేసిన అనుభవాన్ని నా మనసుకిచ్చింది.మీ ఇంకో వ్యాసం కోసం ఎదురుచూసేలాంటి ఆత్రుతని కలిగించింది.

    సోమనాధుని మీద చదలువాడ జయరామశాస్త్రి గారి “ముక్తాఫల” వ్యాఖ్య వుంది. అలాగే వజ్ఝల వేంకట సుబ్రహ్మణ్య శర్మ గారి వ్యాఖ్యానాలూ ఉన్నాయి…మల్లంపల్లి శరభయ్య గారిది నాకు తెలీదు. సమ స్య ..చాలా పుస్తకాలు దొరక్క పోవడం కొందామన్నా. ఇదీ మన పాత సాహిత్యానికి సంబంధించిన దుస్థితి. బ్రవున్ దొర ఆత్మక్షోభించదా ?? మన అలసత్వానికి.

    ఇటీవల …క్షణ క్షణ ప్రయాణం కవితాసంకలనంలో… జయప్రభ గారి long poem సోమన కధ మీదది చదివారా? లేకపోతే మాత్రం తప్పకుండా చదవండి.

    రమ.

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Anand అభిప్రాయం:

    01/01/2009 5:39 pm

    Highly commendable effort to bring the glory of Tyagaraja to wider audience.

    Well done sir.

    Happy New year.

  5. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    01/01/2009 3:02 pm

    మంచి వ్యాసం.

    ఈ వ్యాసంలోని కొన్ని విషయాలు నాకు స్వానుభవాలు.

    రావి కొండలరావు గార్ని అజోవిభో ఫౌండేషన్ నాటకాల పోటీల ద్వారా ప్రత్యక్ష పరిచయం కలిగింది. తెలుగునాట నాటకాల మీద ఇప్పటికీ కృషి చేస్తున్న వ్యక్తి. సాధారణంగా నాటకాల నుంచి సినీ రంగంలోకి వెళ్ళిన చాలా మంది వ్యక్తులు తిరిగి నాటకం మొఖం చూడరు. రావి కొండలరావు గారు అందుకు భిన్నంగా ఇప్పటికీ నాటకాలపై గౌరవంతో తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు.

    వ్యాసకర్తలకి ధన్యవాదాలు.

    అయ్యా బాబ్జీలు గారూ: మీ నుంచి (ప్రత్యేకంగా) ఈమాటలో రచనల కోసం ఎదురు చూస్తూ,

    లక్ష్మన్న

  6. ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/01/2009 1:22 pm

    నా చిన్నతనంలో మద్రాసులో ఇటువంటి న్యూవేవ్ సినిమాలు ఎక్కువగా మినర్వా థియేటర్లో చూశాం. పేముకుర్చీ సోఫాలతో అది ప్రత్యేకంగా ఉండేది. రాయ్ సినిమాలన్నీ దాదాపు అక్కడే చూసి ఆనందించాం. నాలుగేళ్ళ క్రితం కలకత్తా వెళ్ళినప్పుడు ఆ వీసీడీలన్నీ కొనుక్కున్నాను.

    అపరాజితొ సినిమా footage ని శ్యాం బెనెగళ్ సత్యజిత్ రాయ్ ని ఇంటర్వ్యూ చేసిన తన టీవీ ప్రోగ్రాంలో చక్కగా ఉపయోగించుకున్నాడు. రాయ్ చిన్నతనంలో అతని మీద తల్లి ప్రభావం ఉండేదని చెపుతూ అపరాజితొ దృశ్యాలని చూపాడు.

    ఇటువంటి సినిమాల గురించిన వ్యాసాలు ఆలస్యంగానైనా తెలుగులో రావడం మంచి పరిణామం. రచయితకు అభినందనలు.

  7. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/01/2009 12:43 pm

    కొండలరావు మా నాన్న కుటుంబరావుగారికి అనేక విధాలుగా సన్నిహితులు. విజయచిత్ర ఆఫీసు చందమామ ఆఫీసుకు పక్కనే ఉండేది. జ్యోతి మాసపత్రికలో ‘సంభాషణలు” అనే శీర్షికతో వారిద్దరూ ఒక సరదా వ్యాసం రాశారు. మా నాన్న రాసిన బ్రతుకు భయం అనే రచనను నాటకం రూపంలో మద్రాసు రేడియోలో కొండలరావు స్వయంగా సీతప్ప పాత్ర ధరించి ప్రసారం చేయించారు.

  8. స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత గురించి rama అభిప్రాయం:

    01/01/2009 10:05 am

    యధాప్రకారం వెల్చేరు నారాయణ రావు గారి మాటలన్నీ.. స్మయిల్నీ..స్మయిల్ పద్యంలోని “రమించేసుకోవటాన్నీ” అంతే మ్రుదువుగా..అంతే గడుసుగా పట్టిచూపాయి. మ్రుదువు పద్యం లోని విషయానికి సంబంధించింది. గడుసు..అన్నమయ్య..అల్లసాని..స్మయిల్ ఈ ముగ్గురు మాత్రమే ఏ ముసుగ్గుల్లేకుండా రమించుకోడాన్ని రాసేరని అంటం.ఇదీ గడుసు.

    ఇది స్మయిల్ని స్మరించుకునే సందర్భం గనక … నారాయణ రావు గారి మ్రుదువుని మెచ్చుకుంటున్నాను. రమించుకోవటాన్నిఅంతే సున్నితంగా “ముసుగులు లేకుండానే ” రాసిన మరికొన్ని కవితలనీ..కవుల్నీ… చెప్పగలిగి కూడా…కాసేపుకి పక్కన పెట్టేస్తున్నాను. వెల్చేరు పట్ల గౌరవంగానూ..ఇస్మాయిల్కి నివాళి గానూ.

    రమ.

  9. కొండ నుంచి కడలి దాకా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    01/01/2009 10:03 am

    శ్రీనివాస్

    చాలా అద్భుతమైన రూపకాన్ని సేకరించి అందించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, ఎంతో విలువైన సమాచారాన్ని, చక్కని సంగీతంతో పాటు సాహిత్యాన్ని మేళవిస్తూ అందరినీ రంజింపచేసే ‘రజని’ అద్భుత సృష్టిని అందరితో పంచుకున్నందుకు అభినందనతో కూడిన ధన్యవాదాలు. మీ భాండాగారంలో దాగిన మరిన్ని శబ్దతరంగాలు ఈ వేదికపై రాబోయే సంచికల్లో పంచుకోవాలని, ప్రతి శబ్దతరంగం వెనుక కృషి చేసిన సాంకేతిక వర్గం వివరాలు, వీలైనంత వరకు తెలియజేయమని కోరుతూ,
    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో,

    లక్ష్మన్న

  10. కవిరాజశిఖామణి గురించి Vamsi M Maganti అభిప్రాయం:

    01/01/2009 9:37 am

    చాలా ఓపికగా, తెలియని ఎన్నో విషయాలు వివరించిన ఈ వ్యాసానికి, వ్యాసకర్తకు ధన్యవాదాలు….