పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. రచయితలకు సూచనలు గురించి raavi rangarao అభిప్రాయం:

    09/13/2011 12:24 am

    సంపాదకులకు నమస్కారం…
    మీ ప్రయత్నం అద్భుతం…అభినందనలు

  2. వేటూరి పాట గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    09/13/2011 12:11 am

    వేటూరి లేకపోయినా ఆన్ లైన్ నిఘంటువులున్నాయి కదా, 🙂

    స్వరసం కరెక్టే! స్వరసం అనే మాటకి ఉన్న వివిధార్థచ్ఛాయలలో ఒకటి: proper taste or sentiment in composition; మరొకటి: agreeable or pleasant to one’s taste , congenial (చూ. మోనియర్ విలియంస్)

    “స్వారస్యం” అనే మాట స్వరసం నుంచి వచ్చింది. ఆ మాటకి తీయదనం అని అర్థం. ఔచిత్యం, ప్రయోజనం అనే అర్థాలలో కూడా వాడతారనుకుంటాను. “స్వారస్యం మా చమత్కారంగా తీశావ్!” అంటాడు రామప్ప పంతులు, కన్యాశుల్కంలో.

  3. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/12/2011 6:04 pm

    మోహన గారు: మీరన్నది నిజమే కావచ్చు. కానీ, ఆరు అన్న శబ్దానికి నాకు ఇతర ద్రావిడ భాషలలో “వెంట్రుక” అన్న అర్థంలో పదాలు కనిపించ లేదు.

    అదీగాక, *నున్/*నూన్- అన్న ధాతువుతో smooth, minute అన్న అర్థంతో ఎన్నో పదాలు ఉన్నాయి. నునుపు (దూరపు కొండలు నునుపు), నున్నగా (తల నున్నగా దువ్వుకుని) మొ॥. మిగిలిన భాషలలో ఈ ధాతువుకు సంబంధించిన పదాలను ద్రావిడ వ్యుత్పత్తి నిఘంటువు [DEDR 3700] లో చూడవచ్చు. ఈ ధాతువు ఆధారంగా నూఁగు శబ్దానికి లేఁత అన్న అర్థం కంటే నునుపైన, చిన్నదైన అన్న అర్థాలు సబబని నాకనిపిస్తుంది. తిక్కన “నూఁగునూఁగు లేఁగొమ్మలు” అన్నాడు. అంటే నునుపైన లేతకొమ్మలా కాదంటారా? “నునులేత కొమ్మలు” అన్న వాడుక కూడా ఉంది కదా!

    ఇక ఆరు శబ్దానికి “వెంట్రుక” పదంలో అర్థాలు వేరే భాషల్లో లేవు కానీ, కురుళ్, కురులు, కూదల్, కూంతల్ అన్న పదాలున్నాయి. కురులు శబ్దం నుండి ఆరు నిష్పన్నం చేయడం అంత సులభం కాదు కాబట్టి, నూఁగారు అన్న పదానికి వ్యుత్పత్తి అంత సులభంగా వివరించలేమేమో.

  4. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:

    09/12/2011 2:54 pm

    నూఁగు అంటే లేఁత (నూనూఁగు మీసాల నూత్న యౌవనమున రచియించితి మరుత్తరాట్చరిత్ర). నూఁగు + ఆరు = నూఁగారు. కొందరు దీనిని ముద్దుటుంగురములా నూఁగుటారు అని కూడ అంటారు. ఈ నూఁగుటారు నూఁగు శబ్దముతో తప్ప మరే శబ్దముతో వస్తుంది? నూఁగారు అంటే అప్పుడే యౌవనదశలో అంకురించిన రోమావళి అని అర్థము. విధేయుడు – మోహన

  5. వేటూరి పాట గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/12/2011 2:42 pm

    ఒకే పొరపాటు రెండుసార్లు చేసారనుకోడం నమ్మశక్యం కాదు. ఇక్కడకూడా “సరస” “స్వరస” కలిసి రావడం గమనించవచ్చు. “సారంగ”కూడా వచ్చింది!

    థాక్సండి. మూడో సారి కూడా వాడారు సప్తపది సినిమాలో, ‘అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి’ అన్న పాటలో:

    శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభ చరణే
    సరస సాహిత్య స్వరస సంగీత స్తన యుగళే వరదే అక్షరరూపిణి

    వేటూరి లేరు కాబట్టి ఆయన స్వరసకు అర్థం ఏమనుకున్నాడో తెలుసుకోవడం కష్టం అనుకుంటాను.

  6. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/12/2011 2:18 pm

    @కామేశ్వర రావుగారు: మగధీర, మగమహరాజు ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. అలాగే మహాతల్లి, మహమ్మారి, అతిచిన్న, అతిగారాబం అన్న ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి. నా దృష్టిలో రాజ్యపుసిరి అన్నది రాజ్య, సిరి అన్న రెండు పదాంశాలు ‘పు’ అన్న ప్రత్యయంతో కలిసి ఏర్పడిన పదబంధమే కాని ఒక సమాసం కాదు. నేను మాట్లాడుతున్నది ఒకే పదబంధంలో ప్రత్యయ రహితంగా చేరి సమాసంగా వచ్చేవి. కనుగవ, నేత్రద్వయం అంటామే గానీ, కనుద్వయం, నేత్రగవ అనంకదా! పెనుచీకటి = పెంజీకటి అంటాం, లేదా, గాఢాంధకారం అంటాం; కానీ, గాఢచీకటి, పెనంధకారం అని అనలేము కదా! అట్లాగే ముల్లోకాలు, ముజ్జగములు అన్న ప్రయోగాలు ఉన్నా, మున్నేత్రాలు, మున్నదులు, ముస్సాగరాలు అన్న ప్రయోగాలు ఒప్పవు గదా!

    “పాతిక” పాద నుండి వచ్చుండాలి. పద్యంలో పాదం నాలుగోవంతు కదా!

    అవునండీ. సంస్కృతంలో పాదిక అంటే నాలుగోవంతు. పశువులకు, పద్యాలకు నాలుగు పాదాలుంటాయి కాబట్టి పాదిక అంటే నాలుగోవంతు!

    మోహనరావుగారి అభిప్రాయం:

    ఆరు అంటే నిండు, ఉపశమించు, వెండ్రుకలు (నూగారులాటి పదాలలో) అని అర్థము.

    ఆరు అంటే నిండు. ఆఱు అంటే ఉపశమించు. నూగారులో ఆరు లేదు (కొన్ని నిఘంటువులలో ఆరుకు ఆ అర్థం ఇచ్చినా). ద్రావిడ భాషలలో నూన్-అంటే సన్నని, అతిచిన్నని అన్న అర్థాలు ఉన్నాయి. కారు- అంటే నలుపు. నూగారు = నూన్ + కారు అనే నా అభిప్రాయం.

    వేమూరి గారు అన్నారు:

    అన్నట్టు, సా. శ. 1950 ప్రాంతాలలో, విశాఖ జిల్లాలో, “ముచ్చిలక” అన్న మాటని “నాలుగింట మూడు పాళ్లు” అనే అర్ధంలో వాడగా విన్నట్లు గుర్తు.

    ఇప్పటికీ ఈ ప్రయోగం ఉందో లేదో ఎవరైనా విశాఖా జిల్లా వారు చెప్పగలరా? ఈ అర్థంలో ముచ్చిలకకు వ్యుత్పత్తి ఏమై ఉంటుందంటారు?

  7. వేటూరి పాట గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    09/12/2011 1:37 pm

    “స్వరస” పదాన్ని మళ్ళీ “నిన్నటిదాకా శిలనైనా” అన్న పాటలో కూడా వేటూరి వాడారు.

    “సరస సరాగాల సుమ రాణిని
    స్వరస సంగీతాల సారంగిని”

    ఒకే పొరపాటు రెండుసార్లు చేసారనుకోడం నమ్మశక్యం కాదు. ఇక్కడకూడా “సరస” “స్వరస” కలిసి రావడం గమనించవచ్చు. “సారంగ”కూడా వచ్చింది!

  8. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/12/2011 12:36 pm

    @నాగమురళి గారు: మీరు చెప్పిన జవాబులు చాలావరకు నేననుకున్నవే! అయితే, ‘ఆర్చు’ అన్న పదాన్ని ‘ఆరు (నిండు)’ అన్న క్రియాపదానికే కాక ‘ఆడు’ అన్న పదానికి కూడా సకర్మకరూపంగా (transitive form) వాడుతారు (రెప్పలార్చు అంటే రెప్పలాడించు అన్న అర్థం ఉంది కదా!) ‘తీర్చు’ అంటే చక్కదిద్దు (తీర్చిదిద్దు), పరిష్కరించు అన్న అర్థాలుకూడా ఉంది. అదీకాక, ‘ఆఱు’అంటే ఉపశమించు అయితే, ‘ఆఱ్చు’ ఉపశమింపజేయు అన్న అర్థం కూడా ఉంది. ఇలా ఆలోచిస్తే, ‘ఆఱ్చుతావా?, తీర్చుతావా?’ అంటే ‘ఉపశమింపజేస్తావా? పరిష్కరిస్తావా?’ అన్న అర్థమే సబబని నాకనిపిస్తున్నది.

    ఆరింద అన్న పదం నిఘంటువుల ప్రకారం హిందుస్తానీ ద్వారా తెలుగులోకి ప్రవేశించిందట. అయితే, ఉర్దూ, పారశీక నిఘంటువులలో ఆరిందా అన్న పదానికి A porter, a carrier అన్న అర్థాలే తప్ప నేర్పరి, ప్రజ్ఞావంతుడు, పరిణితి గలవాడు అన్న అర్థాలు కనిపించలేదు.

    తెలుగులో ఆరింద ఆడవారికే వాడడానికి ఒక వివరణ ఇవ్వవచ్చు. -త, -దలు దక్షిణ-మధ్య ద్రావిడ భాషలలో స్త్రీ వాచకప్రత్యయం. నెలత, గుబ్బెత, ముట్టుత, గొల్లెత మొ॥ పదాలలో -త ప్రత్యయాన్ని వాడడం చూడవచ్చు. సంస్కృతంలో దేవతా అన్న పదాన్ని స్త్రీ, పురుష దేవతలకూ వాడితే, తెలుగులో మాత్రం ఆడ దేవతలకే పరిమితం చెయ్యడానికి కూడా ఈ ప్రత్యయమే కారణమని నా గట్టి నమ్మకం.

  9. రాగలహరి: ఆభేరి గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/12/2011 10:14 am

    మోహనరావుగారూ,

    మీరన్నది నిజమే. చాలా సైట్లలో అలాగే రాశారు. కానీ అది తప్పు.
    స్వరాల రీత్యా మధ్యమావతి (లేదా మేఘ్ మల్‌హార్)లో పడని పెద్ద నిషాదం అందులో వినిపిస్తుంది. అలాగే గ1 కూడా.
    మధ్యమావతి స రి2 మ1 ప ని1 స. అంతే.
    కానడా బహార్ స్వరాలు స రి2 (మ1) గ1మ1 ని1ధ2ని2 స, స ని1ప మ1 ప గ1మ1రి2స.
    ఇది నేను ఎవరూ పాడగా వినలేదు కాని స్వరాలను బట్టి ఆ పాటకు ఇది సరిగ్గా సరిపోతుంది.
    విశ్వనాథన్ కాఫీకానడా వంటి రాగాలను కూడా ఎక్కడో విని ఉపయోగించాడు కనక అతని ప్రయోగాలు అంత సులువైనవిగా ఉండవు.
    కానడా బహార్ సంగతి నాకు బి. సుబ్బారావు రాసిన రాగనిధి వాల్యూంలోనే తెలిసింది. అది హిందుస్తానీ, కర్నాటకరాగాల వివరాల పుస్తకం. 4్ సంపుటలతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రచయిత కన్నడిగుడు కనక రెండు పద్ధతులూ తెలిసినవాడై ఉంటాడు.

    పెండ్యాల తెలుగులో మార్చిన తీరు నాకంతగా నచ్చలేదు. గుడ్డిగా కాపీ కొట్టడం ఆయన పద్ధతి కాదనేది సుగుణమే అయినప్పటికీ తమిళ వెర్షన్ బావుంటుంది.

  10. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి వేమూరి అభిప్రాయం:

    09/12/2011 8:30 am

    వ్యాసము, దాని మీద జరుగుతూన్న చర్చ, రెండూ ఎంతో బోధనాత్మకంగా ఉన్నాయి. ఇటువంటి వ్యాసాలు, చర్చలు చదువుతూ ఉంటే “నాకు తెలియనివి ఎన్ని ఉన్నాయో!” అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.

    అన్నట్టు, సా. శ. 1950 ప్రాంతాలలో, విశాఖ జిల్లాలో, “ముచ్చిలక” అన్న మాటని “నాలుగింట మూడు పాళ్లు” అనే అర్ధంలో వాడగా విన్నట్లు గుర్తు. ప్రత్యేకించి ముపావులాని ముచ్చిలక అనేవారని అనుకుంటాను.

    – వేమూరి