పునరుత్థానం

ఒక గాయం ఎటూ కదలనివ్వక, సూటిగా ఆలోచన సాగనివ్వక
నిలబడినచోటనే కూలబడేలా చేస్తుంది
చూస్తున్న దిక్కులోని శూన్యంలోకి వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మంటుంది

గాయం ఏమీ చెయ్యదు
అప్పటివరకూ అల్లుకొన్న తెలిసీ, తెలియని స్వప్నాలనీ
స్వప్నాలకి సుతారంగా పూయబోతున్న చిరునవ్వుల పువ్వులనీ
చిందరవందర చేయడం మినహా

పాలుగారే వెన్నెలల్నుండీ, ఉభయసంధ్యల వర్ణాలనుండీ
సమీకరించుకొన్న జీవనలాలసని ఒకేసారి చెరిపేయడం మినహా

ఇన్నాళ్ళూ పాడింది పాటే కాదు, మళ్ళీ మొదలుపెట్టు
భూగోళమంత జీవితాన్ని నీపై మోపుతున్నాను,
ఇప్పుడు పక్షిలా ఎగిరిచూపించు అంటుంది గాయం


జీవితోత్సవాన్నుండి వేరుపడ్డ హృదయం
తడిసి మెరిసే మాటకోసం, చూపుకోసం, స్పర్శకోసం
తప్పిపోయిన పిల్లాడిలా ఎడతెగక ఎదురుచూస్తుంది

దారులన్నీ మూసుకుపోతున్న చీకట్నుంచి చీకట్లోకి
దుఃఖజలంతో బరువెక్కుతున్న కాలంనుంచి కాలంలోకి
ఉన్నచోటనే వేళ్ళూనుకొంటున్న గాయంతో వేచివుంటుంది


దైవీశక్తులేవో దీవించిన స్పటికంలాంటి క్షణమొకటి ప్రవేశిస్తుంది
ఉన్నట్లుండి ఒకనిట్టూర్పు గుబురుకొమ్మల్లోంచి పక్షిలా ఎగురుతుంది
కాసిని కన్నీటిమొగ్గలు చెక్కిళ్ళపై పారాడుతాయి

ఎక్కడిదో నీళ్ళచప్పుడూ, పక్షిరెక్కల అలికిడీ
చెట్ల ఆకుల్ని గాలి మృదువుగా నిమిరిన మర్మరధ్వనీ
చెవిలో జాగ్రత్తగా గుసగుసలాడుతాయి

జీవితం చాలా పెద్దది, చాలా దయగలది కూడా
ఊరికే నిలబడు, ఊరికే ఒక అడుగువేయి
తక్కినదంతా తను చూసుకొంటుంది

లేతమొక్కలా కూలిపోయిన నీవు
నిలబడతావు, నిలబడతావు
ఒక మహావృక్షపు ఛాయను నీ వెనుక సర్దుకొంటూ
మేఘాలు నుదుటిని చుంబించేవరకూ నిలబడుతూనే ఉంటావు


బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...