అసమర్ధుని జీవయాత్రే!

(కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంత్యుత్సవాల సందర్భంగా సెప్టెంబరు 26-27, 2009న డి. టి. ఎల్. సి. వారు నిర్వహించిన సభలో గోపీచంద్ నవల అసమర్థుని జీవయాత్ర పై మాచవరం మాధవ్ ప్రసంగానికి ప్రతిగా ఇచ్చిన ప్రసంగపు పాఠం).


జీవితం వడ్డించిన విస్తరైనప్పుడు అందులోంచి ఆకలికి సరిపడగా తినలేనివాడు అసమర్ధుడా? పిచ్చివాడా? ఇదీ ఈ నవల చదువుతున్నప్పుడు నేను వేసుకున్న ప్రశ్న.

అసమర్ధుడికీ, మానసిక రోగికి ఉన్న తేడా లౌకికజ్ఞానమేనన్న నిర్వచనంతో నేనూ ఏకీభవిస్తాను. ఐతే గోపీచంద్ సీతారామారావుని అంత తేలిగ్గా నిర్వచించలేం. సీతారామారావులో తండ్రి, తాత, ముత్తాతల దగ్గర్నుంచి సంక్రమించిన కొన్ని విశిష్టమైన లక్షణాలున్నాయి. ఇవి తన శరీరంలోని కన్ను, ముక్కు, చర్మం లాంటి సహజమైన, స్వభావసిద్ధమైన అవయవాల్లాంటివే కానీ వేరే కాదు. వీటిని సీతారామావులోంచి విడదీయడం అసంభవం.

సీతారామారావు చెయ్యిజాచి అడిగిన వారికి లేదనలేని బలి చక్రవర్తి లాంటివాడు. బలితో ఎందుకు పోల్చానంటే, ‘తన్నుమాలిన ధర్మం’ అని సీతారామారావుకు తెలిసీ మానుకోలేడు. సనాతనుల సాంగత్యంలో, శిక్షణలో, కీర్తిని మించి శాశ్వతమైంది ఏదీ లేదని నమ్మినవాడు. అప్పట్లో, ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా, కాస్తో కూస్తో కలిగి ఉన్న రైతు కుటుంబాల్లో ఒక అలవాటు ఉంది – అది, ఇవ్వడమే గాని అడగడం చిన్నతనంగా భావించడం. అదీ అతని స్వభావం. ఇవన్నీ సీతారామారావుకు ఉగ్గుబాలతో అలవడిన లక్షణాలు. సీతారామారావులోని ఈ లక్షణాలన్నీ నవల మొదటి 8 పేజీల్లో చూపించారు గోపీచంద్. అన్నీ ప్రత్యక్షంగా సీతారామారావునుద్దేశించే చెప్పలేదు.

ఉదాహరణకు, తండ్రి చనిపోతూ చెప్పిన మాట, “చూడు బాబూ! మన వంశం పేరు నిలబెట్టు. అంతకంటే నేను చెప్పేదేమీ లేదు.” ఇందులో సీతారామారావుకు వంశ పారంపర్యంగా సంక్రమించిన లక్షణాల చరిత్ర ఉంది. అలాగే ఈ వాక్యం చూడండి, “ఇప్పటికీ దేవుడి పెళ్ళికి పీటలమీద కూర్చునే హక్కు వాళ్ళదే. ఈ హక్కు అతని తండ్రి ముప్పైవేలు ఖర్చు పెట్టి హైకోర్టు దాకా వెళ్ళి నిలబెట్టుకున్నాడు.” ఈ వాక్యం వ్రాయడంలో ఆ కుటుంబంలో అణువణువునా జీర్ణించుకుపోయిన నమ్మకాన్ని, ధర్మాన్ని, సాంప్రదాయాన్నీ, దాన్ని సాధించుకునే పట్టుదలనూ చూపిస్తున్నాడు రచయిత. సీతారామారావు మనస్థితిని తెలిపే ఇంకొక ఉదాహరణ చూడండి, “సంపాదించే అవకాశం ఉంది గనుక ఇతర్లకు సహాయం చేస్తున్నాననుకోవడం అతనికి బొత్తిగా బాగాలేదు. సూర్యుని తేజస్సుకుమల్లే, రత్నాల కాంతికిమల్లే దాతృత్వం అతని స్వభావం.”

ఇవి కేవలం తెచ్చిపెట్టుకున్న భేషజాలు కావు. శిక్షణలో, క్రమశిక్షణలో మనసా, వాచా, కర్మణా జీర్ణించుకున్నవి. కానీ సీతారామారావు మట్టిముద్ద కాదు. కాబట్టే, అతనికున్న మేధస్సు, విచక్షణా జ్ఞానంతో అంతగా ఏర్పడిన క్రమశిక్షణా వలయం దాటి కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలడు. ఐతే ఆ విచక్షణా జ్ఞానం కుటుంబ సాంప్రదాయంతో సరితూగలేకపోయింది.

దానానికి అపాత్రదానానికి తేడా ఉంటుందన్న స్పృహ కూడా లేనివాడు సీతారామారావు. స్వతహాగా కష్టపడి సంపాదించవలసిన అవసరం కలగలేదు గనక, అడిగినవారికీ, అడగనివారికీ ఇవ్వడమే తెలుసుగాని, ఖాళీ అవుతున్న ఖజానాని నింపాలన్న ఆలోచన కూడా రానివాడు.

దానికితోడు అది తరతరాలుగా వ్యవసాయాధారిత కుటుంబం. మొత్తం ఆర్ధిక వ్యవస్థ అంతా వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో, కాలంలో, మోతుబరి రైతు కుటుంబం అలాంటి జీవనశైలి నిర్వహించడం నల్లేరుమీద బండి నడక కాకపోయినా, అతి కష్టమైతే కాదు. రూపాయి పోగుచేసి 99 పైసల వరకు నిరాఘాటంగా ఖర్చు చేసిన పూర్వీకులు, బాధ్యత గురించి పట్టించుకోకుండా పెంచిన పెంపకంలో ఎదిగిన సీతారామారావుకు పోగుచెయ్యడం నేర్పలేదు. కుటుంబ వ్యవహారం తన చేతిలోకి వచ్చేటప్పటికి సీతారామారావు పరిస్థితి ఇది.

ఇలాంటి పరిస్థితిలో కుటుంబ ఆర్ధిక స్థితి క్షీణించడానికి ఎంతోకాలం పట్టదని బయటినుండి చూసేవారికెవరికైనా తెలుస్తుంది, ఒక్క సీతారామారావులకు తప్ప. ఈ సీతారామారావుల మినహా ప్రపంచానికి ప్రతీకే రామయ్య తాత. మొదట్లో తెలియకపోయినా, రూపాయికోసం కొంచెం వెతకాల్సి వచ్చేటప్పటికి సీతారామారావుకీ తెలుసు మారుతున్న పరిస్థితులు. దానికి తోడు మారుతున్న ఆర్ధిక విధానాలు, విలువలు సీతారామారావు ఆర్ధిక పతనాన్ని వేగవంతం చేశాయి. ఇక్కడ మనం నవలా కాలాన్ని గుర్తుంచుకోవాలి. వ్యవసాయం, వ్యవసాయాధారిత వ్యాపారం మాత్రమే తెలిసిన రైతు కుటుంబాలకు, దేశానికి స్వాతంత్ర్యం వస్తున్న, వచ్చిన కాలంలో వేగంగా మారుతున్న ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా ఆకళింపుకు రాని సంధి సమయం ఇది.

సీతారామారావు అజ్ఞాని కాడు. గురుకులం విద్యతో వచ్చిన జ్ఞానానికి, తను పెరిగిన సాంప్రదాయానికి సమన్వయం చేకూర్చుకోలేకపోయాడు. అందుకే అతని ఆశయాలకు, ఆచరణకు పొంతన లేకుండా పోయింది.

పెళ్ళి విషయంలోనే చూడండి – వైవాహిక జీవతమంటే కావ్యాల్లోను, ప్రబంధాల్లోనూ కనిపించే ప్రణయగాధలే గానీ, పిల్లలు, రోగాలు, తిండి, కుటుంబ సంబంధాలు కాదనే ఊహా ప్రపంచంలోంచి బయటకు రాలేకపోయాడు. అవి అనుభవంలోకి వచ్చేసరికి, పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడి స్థితే. మేనమామ తనకు ఇవ్వాల్సిన డబ్బు విషయంలో మోసం చేస్తున్నాడని అతనికి తెలుసు. కానీ ఆ ఆలోచనల్ని పైకి రానివ్వడానికి, అతనికి ఒంటబట్టిన సాంప్రదాయం అడ్డు తగిలి, బలవంతంగా అణిచిపెట్టి, బుద్ధి పలాయనం చిత్తగిస్తుంది. ఇవన్నీ నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తున్నా ఆచరణలో లోపాలే అనుకుంటాడు తప్ప, వాస్తవాలని గుర్తించడానికి మనసొప్పదు. ‘గుర్తించడు’ కాదు, ‘గుర్తించడానికి మనసొప్పదు’ అంతే. రెంటికీ తేడా తెలియక కాదు. తెలిసీ ఒప్పుకోలేడు. ఎప్పటికప్పుడు అతని బుద్ధికి పలాయనమే తేలికైన పని. సమస్యలూ తెలుసు, వాటికి పరిష్కార మార్గమూ తెలుసు. కానీ వాటిని ఎదుర్కొని ఆచరణతో పరిష్కరించలేడు. కూతుర్ని కొట్టినా, భార్యను కొట్టినా, తనను తానే హింసించుకున్నా వాస్తవాల్ని ఎదుర్కోలేని పలాయన ప్రవృత్తితోనే. అదీ అతని బలహీనత. ఆ బలహీనతే లోకానికి అతని అసమర్ధత.

ప్రాణత్యాగంతో సాధించుకున్న వస్తువును అనుభవించలేనని తెలిసి కూడా చావడానికి సిద్ధపడేవాణ్ణి గురించి ఏమంటాం? తీరిగ్గా ఆలోచిస్తే మూర్ఖుడంటాం; అదే అతని ఉద్రేకంతో మమేకం చెందగలిగితే వాణ్ణి పట్టువదలని విక్రమార్కుడంటాం.

ఇక్కడ అసమర్ధతకు, మానసిక ఋగ్మతకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు గాని, తెలిసీ, ఎటూ తేల్చుకోలేక, నిభాయించుకోలేక, వేదన పడే సందిగ్ధ స్థితి అది. సాంప్రదాయపు పొరలను ఛేదించుకుని కాలానికి, పరిస్థితులకీ అనుగుణంగా జీవించలేకపోవడం అతని అసమర్ధత.

ముందే చెప్పినట్టుగా, సీతారామారావు అసమర్ధతకు సంబంధించిన నేపధ్యమంతా అతి క్లుప్తంగా మొదటి 8 పేజీలలోనే సూచించారు రచయిత. తర్వాత నవలంతా ఆ నేపధ్యానికి పర్యవసానమేనని నా అభిప్రాయం. తాను నమ్మి జీర్ణించుకున్న ఆశయాలకు, సాంప్రదాయాలకు – వాస్తవాలకు పొంతన కుదరక నిత్యం జరిగే మానసిక సంఘర్షణ. ఈ సంఘర్షణను సీతారామారావు ప్రతీ ఆలోచనలోనూ, మాటలోనూ, ప్రవర్తనలోనూ మనకు కనిపిస్తుంది. అదే సీతారామారావు జీవితం.

ఐతే రెండు సన్నివేశాల్లో సీతారామారావును ఉన్మాదిగా చూపించడం ఆ పాత్ర స్వభావానికి సరిపోలేదని నాకనిపించింది. మొదటిది ఆఫీసులో మేనేజరుతో ప్రవర్తన, రెండవది, బహిరంగ సభలో చేసిన గందరగోళం.

సీతారామారావులాంటి వ్యక్తులు లోపల ఎంతటి విపరీతమైన ఆలోచనలున్నా, వాటిని అంత త్వరగా బహిరంగం చెయ్యరు. అందులోనూ తాను నియంత్రించలేని వాళ్ళ దగ్గర. వీళ్ళకు ప్రజల దృష్టిలో ఔన్నత్యం చాలా ముఖ్యం. ఎరుకలి దృష్టిలో తన ఔన్నత్యాన్ని ప్రదర్శించుకోవడానికి కూతుర్ని కొడతాడు కానీ, ఎరుకలితో మాట్లాడి నిజ నిర్ధారణ చేయడం అతనికి చిన్నతనం. అలాంటి వాడు బహిరంగంగా వెకిలి నవ్వులు నవ్వడం, నిజాలైనా బహిరంగంగా నిష్కర్షగా మాట్లాడడంలాంటివి చెయ్యలేడు. ఆ సన్నివేశాల్లో సీతారామారావు కేవలం ఉన్మాదేనేమోననిపించక తప్పదు. కానీ నా దృష్టిలో ఇవి రచనలో చోటు చేసుకున్న చిన్న లోపాలు మాత్రమే.

సీతారామారావు మరణంలో కొంత నాటకీయత కనిపించినా, ఇక్కడ లేవనెత్తిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. తన జీవిత పరిస్థితికి కారణం, కేవలం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేని అతని బుద్ధి మాంద్యం కాదు, చాలా వరకు అతను పెరిగిన విధానం. దానిక్కారణం అతని పూర్వీకులు. కానీ వారిని తప్పుబట్టడానికి అతనికి మనసొప్పదు. అతని సాంప్రదాయం అడ్డొస్తుంది. జీవితమంతా ఎప్పటికప్పుడు నిన్న ఎంత బుద్ధి తక్కువగా ప్రవర్తించానా అని అనుకోవడమే గానీ, అలాంటి ఆలోచనల్లోంచి బయటకు రాలేని అసమర్ధత. అందులోంచి బయట పడ్డప్పుడుగాని తండ్రిని ప్రశ్నించలేకపోయాడు. ఇది కూడా సీతారామారావు ఊహాజనిత ప్రపంచంలోనే జరిగుతుంది. ఆంధ్రదేశంలో ఊరికి కనీసం ఒక్కరైనా కనిపించే సీతారామారావులకు అద్దం పట్టారు రచయిత. అంతమాత్రాన సీతారామారావులు ఇక ఉండరనీ కాదు, ఈ నవల చదివి అందరూ జ్ఞానులైపోతారనీ కాదు.

చాలా మందికి సీతారామారావులో తన్ను చూసుకునే అవకాశాన్ని కలిగించారు గోపీచంద్. ఈ నవల చదువుతున్నప్పుడు, ‘ఇది నా కథలానే’ ఉందనో, లేకపోతే ‘మాఊర్లో ఫలానా వెంకన్నగారి జీవితంలా ఉందనో’ చాలా మంది అనుకోవడం, ఈ నవల సార్వజనీనతకు నిదర్శనం. ఈ సీతారామారావులు ఇప్పటికీ, ఎప్పటికీ… వివిధ స్థాయిల్లో కనిపిస్తూ ఉండడం ఈ నవల సార్వకాలీనతకు నిదర్శనం. అక్కడక్కడా సాంకేతిక లోపాలున్నప్పటికీ, ఈ రెండు లక్షణాలూ ఉన్న ఈ నవల, ముప్పైతొమ్మిదేళ్ళ తర్వాత చదివినా, నాకు కలిగిన అనుభూతిలో మాత్రం పెద్దగా తేడాలేదు. మొదట సారి చదివినప్పుడు ఇప్పుడు చదివినంత క్షుణ్ణంగా ఈ నవలను పరిశీలించానని అనుకోను. అంటే అప్పట్లో నవలతో మమేకం చెంది ఉంటాను, ఇప్పుడు తీరిగ్గా ఆలోచించాననుకుంటున్నాను. అప్పటికీ, ఇప్పటికీ సీతారామారావు లోకానికి అసమర్ధుడే నంటాను.


మద్దిపాటి కృష్ణారావు

రచయిత మద్దిపాటి కృష్ణారావు గురించి: పుట్టింది పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా రామన్న గూడెంలో. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కెమిస్ట్రీలో డాక్టరేట్. ప్రస్తుతం డెట్రాయిట్ లోని వేన్ స్టేట్ యూనివర్సిటీలో రిసర్చ్ ప్రొఫెసర్‌. తెలుగు సాహిత్య, సంగీత, నాటకాది కళలంటే ఎంతో అభిమానం. డిటిఎల్‌సి అని అందరూ పిలుచుకునే డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడిగా సాహిత్యకార్యక్రమాలలో చురుకుగా పని చేస్తున్నారు. ...