మనకు తెలియని మన త్యాగరాజు -1

త్యాగరాజు జననం – ఆయన పూర్వీకులు

త్యాగరాజు సర్వజిత్ నామ సంవత్సరంలో పుష్యమీ నక్షత్రాన, చైత్ర శుక్ల సప్తమి నాడు (మే 4, 1767) తిరువారూర్ లో జన్మించాడు (ఈ పుట్టిన తేదీ,సంవత్సరమూ తప్పనీ, త్యాగరాజు 1759 లో పుట్టాడనీ ఒక వర్గీయుల వాదన ఉంది. దీనికి తగినంత ఆధారం లేదు). ఇతని తండ్రి కాకర్ల (భరద్వాజ గోత్రం) రామబ్రహ్మం, తల్లి సీతమ్మ. వీళ్ళు స్మార్త వైదీక బ్రాహ్మణులు. (స్మార్తులంటే ఎవరో కాదు. శంకరాచార్య ప్రబోధించిన అద్వైతాన్ననుసరించే వాళ్ళు. వీరు శైవులూ కాదు, వైష్ణవులూ కాదు. స్మార్తులు ఇటు శివుణ్ణీ కొలుస్తారు, అటు విష్ణువునీ పూజిస్తారు). తంజావూరు రాజులు శైవ మతస్థులయినా అటు శైవాన్నీ, ఇటు వైష్ణవాన్నీ సమానంగా ఆదరించారు. వారికి రామాయణ, భారతాలు అత్యంత ప్రీతి. వైష్ణవ మతం ఉన్నా, మదురై, తంజావూరు చుట్టు పక్కల శైవ మతమే ఎక్కువగా ఉండేది. 1600 కాలంలో త్యాగరాజు పూర్వీకులు రాయల సీమలోని కర్నూలు నుండి తంజావూరు వలస వచ్చినట్లు చెప్పబడింది.

రామబ్రహ్మానికి ముగ్గురు కొడుకులు. పంచనద బ్రహ్మం, పంచాపకేశ బ్రహ్మం మొదటిద్దరూ. త్యాగరాజు మూడోవాడు.

రామబ్రహ్మం రామాయణ,భారత, భాగవతాలు బాగా అధ్యయనం చేసాడు. సంస్కృతాన్ని అభ్యసించాడు. అప్పట్లో తంజావూరు రాజైన తుల్జాజీ కొలువులో రామాయణం పఠనమూ, వ్యాఖ్యానమూ చేసేవాడు. ఇదే అతని జీవన భృతి. త్యాగరాజు తిరువారూర్ లో జన్మించాడు. కొంతకాలం తరువాత రామబ్రహ్మం తిరువైయ్యారు కి మారాడు. ఈ మార్పుకీ కారణాలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రాసారు.

“త్యాగరాజు అన్నలిద్దరూ (పంచనద బ్రహ్మం, పంచాపకేశ బ్రహ్మం) అల్లరి చిల్లరి పనులతో రామ బ్రహ్మానికి తిరువారూర్ లో తలవంపు తెచ్చేవారు. ఇద్దరికీ సరైన ప్రవర్తన లేదు. ఓ సారి రామబ్రహ్మం తన ముగ్గురు కొడుకులతోనూ కాశీ యాత్రకి బయల్దేరాడు. మధ్యలో అతనికొక కల వచ్చింది. అందులో తిరువారూర్ దైవం త్యాగరాజ స్వామి (నటరాజ రూపంలో నున్న శివుడు) కనిపించి, కాశీ ప్రయాణం రద్దు చేసుకోమనీ, తిరువైయ్యారు వెళ్ళి శైవ దర్శనం చేసుకోమనీ, ఆ తరువాత అక్కడే శేష జీవితం గడపమనీ చెప్పాడు. ఈ కలని మహారాజు తుల్జాజీకి చెప్పడంతో, ఆయన రామబ్రహ్మం ఉండడానికో ఇల్లూ, ఆరెకరాల పొలం ఇచ్చినట్లుగా” వెంకట రమణ భాగవతార్ రాసారు.

ఎం.ఎస్.రామస్వామి అయ్యర్ అనే విద్వాంసుడు ఇదే ఇంకో విధంగా జరిగి ఉండవచ్చని అభిప్రాయ పడ్డారు.

“కావేరీ నదీ తీరాన ఉన్న తిరువైయ్యార్ సంస్కృత విద్యా పీఠ క్షేత్రం. తంజావూరు రాజుల పోషణలో అక్కడి సంస్కృత విద్యాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఎక్కడెక్కడినుండో వచ్చి అక్కడ విద్యా భ్యాసం చేసేవారు. చిన్న తనం నుండీ సంస్కృతం నేర్చుకోవడంలో త్యాగరాజు కనబర్చిన ఆసక్తి చూసి, మంచి చదువుకోసం రామబ్రహ్మం తిరువైయ్యార్ మకాం మార్చి ఉండ వచ్చుననీ” అభిప్రాయ పడ్డారు. ఇదే విషయాన్ని “త్యాగరాజు” అనే పుస్తకంలో రాసారు.

తుల్జాజీ రామబ్రహ్మానికి బహుమానంగా ఇచ్చిన ఇంట్లోనే త్యాగరాజు నివసించాడు. అక్కడే ఆయన జీవితం పూర్తిగా గడిచింది. తిరువైయ్యార్ లో తిరుమంజన వీధిలో ఇదే ఇల్లు ఇప్పటికీ ఉంది.

త్యాగరాజుకి తల్లితండ్రులు పెట్టిన పేరు త్యాగబ్రహ్మం. అది ఎలా త్యాగరాజు గా మారిందో తెలీదు. తిరువైయ్యారు దైవం త్యాగరాజ లింగేశ్వరుడు కావడంతో అలా పిలిచేవారో, లేక తాత గిరిరాజు పేరులో చివరి పదాన్ని త్యాగ బ్రహ్మం మధ్యలో తగిలించారో తెలీదు.

త్యాగరాజు తల్లి పేరు సీతమ్మ. ఈవిడ పేరు సీతమ్మ కాదనీ, శాంతమ్మనీ ఒక వివాదం ఉంది. త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన వాళ్ళలో “నరసింహ టి భాగవతార్” అనే ఆయన “త్యాగరాజు తల్లి శాంతమ్మ” అని రాసారు. మిగతా వాళ్ళంతా సీతమ్మ అనే రాసారు. చాలా మంది సీతమ్మే సరైనదని నిర్థారించేసారు. దానికొక బలమైన కారణాన్ని కూడా చూపించారు. కారణం అనే కంటే కృతి అనడం మంచిది. “సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మాకు తండ్రి” అనే కృతిలో అన్యాపదేశంగా తల్లి తండ్రులనే త్యాగరాజు స్మరించాడు అంటూ వ్యాఖ్యానించారు.

సీతమ్మకి సంగీతంలో ప్రావీణ్యం ఉంది. మంచి గాయని కూడా. త్యాగరాజు చిన్నప్పటినుండే తల్లి వద్ద రామదాసు కీర్తనలూ, పురందరదాసు కీర్తనలూ అభ్యసించాడు. సీతమ్మ రామ భక్తురాలు అవడంతో “రామ భక్తి” బీజాన్ని చిన్నప్పుడే త్యాగరాజులో నాటింది.

తిరువైయ్యార్ సంస్కృత పాఠశాలలోనే త్యాగరాజు మొట్ట మొదట “రామాయణాన్ని” అభ్యసించాడని “వింజమూరి వరాహ నరసింహాచార్యులు” “త్యాగరాజ స్వామి చరిత్ర” లో ప్రస్తావించారు. త్యాగరాజు బాల్య విశేషాలు తెలుసుకునే ముందు ఆయన పూర్వీకులు గురించి చూద్దాం.

గిరిరాజ బ్రహ్మం (తండ్రి వైపు తాత)

రామబ్రహ్మం తండ్రి పేరు గిరిరాజ బ్రహ్మం. ఈయన కవీ, సంగీత విద్వాంసుడూ, సంస్కృత పండితుడూ. ఈయన దగ్గరే మొదట త్యాగరాజు సంగీతం నేర్చుకున్నట్లుగా ఉంది.

త్యాగరాజు తాతగారైన ఈ గిరిరాజ బ్రహ్మం గారి కుటుంబ వరసల మీద కూడా విభిన్న అభిప్రాయాలూ, వివాదాలూ వచ్చాయి. ఈ గిరిరాజ బ్రహ్మం త్యాగరాజు తల్లి సీతమ్మ గారి తండ్రి అనీ అందరూ అనుకున్నారు. అనుకోవడమే కాదు 1900 తరువాత త్యాగరాజు పై వచ్చిన ప్రతీ పుస్తకంలోనూ ఇలాగే ప్రస్తావించారు. దీనికి ఓ చక్కటి ఆధారం కూడా చూపారు. “గిరి రాజ సుత తనయ” అని ఒక ప్రసిద్ధమైన త్యాగరాజ కృతి ఉంది. ఇది తన తాత గారి గురించే త్యాగరాజు రాసారని కొందరి అభిప్రాయం. “గిరి రాజు” అంటే తాతగారి పేరు, సుత అంటే కుమార్తె (సీతమ్మ ఇక్కడ), తనయ అంటే ఆ సీతమ్మ కొడుకు. ఆ కొడుకెవరో కాదు త్యాగరాజేనని భాష్యం చెప్పారు. దీన్ని ఆధారం చేసుకొనే చాలా మంది రచనలు రాసారు. కానీ వాస్తవానికి గిరిరాజ సుత తనయ అంటే “గిరి రాజ సుత” అంటే గిరిరాజు కుమార్తె పార్వతనీ, తనయ అంటే పార్వతి కొడుకనీ (విఘ్నేశ్వరుడు) చెప్పుకోవాలి. అంటే గిరి రాజ సుత తనయ” కృతి వినాయకుడి మీద అని అర్థం చేసుకోవాలి కానీ, తాతగారి మీద త్యాగరాజు రాసిన కృతిగా భావించకూడదు. ఎందుకంటే సీతమ్మ గిరిరాజు కోడలు. కూతురు కాదు. ఇది గిరిరాజ కవి మీదొచ్చిన మొదటి వివాదం.

ఇది కాక ఇంకో అతి పెద్ద వివాదం ఉంది. దానిపై విజ్ఞులూ, పండితులూ అందరూ తప్పుగా అభిప్రాయ పడి చరిత్రని తప్పుగా నిర్ధారించేసారు.

1683 నుండి 1712 వరకూ తంజావూరిని పాలించిన శాహాజీ కొలువులో అనేక మంది తెలుగు కవులుండేవారు. శాహాజీ హయాంలో అనేక తెలుగు గ్రంధాలూ, కావ్యాలూ, నాటకాలూ, యక్షగాన రచనలూ వచ్చాయి. శాహాజీ చుట్టూ చాలా మంది తెలుగు కవులుండే వారు. వందలకు పైగా గ్రంధాలు రాసారు. ఆ కవుల్లో దర్భా సోదరుల్లో ఒకరైన గిరిరాజ కవనే ఒకాయన ఉండేవాడు. ఈయన అనేక ప్రసిద్ధమైన నాటకాలు రాసాడు.. పద్య కావ్యాలు రాయనప్పటికీ, లీలావతీ కళ్యాణం అనే నాటకంలో అనేక పద్య వృత్తాలూ, జాతులూ, ఉప జాతులూ వాడాడు. శ్రావ్యమైన పదాలు వాడాడు. ఈయన రచించిన పదాలలోని సంగీత శైలీ, కూర్పూ త్యాగరాజ కృతుల్లో ఉన్న శైలికీ, కూర్పుకీ సారూప్యం ఉందని విజ్ఞులు భావిం చారు. ఈ గిరిరాజ కవే త్యాగరాజు తాత గారని సంగీత పరిశోధకులు పొరబడ్డారు.

ఈ విషయాన్ని “ఆంధ్ర వాగ్గేయ కార చరిత్ర” అనే పుస్తకంలో బాలాంత్రపు రజనీకాంత రావు గారు ధృవీకరిస్తూ రాసారు. ఆయనే కాదు, ఇంకా కొంతమంది తమిళ రచయితలూ ఇలాగే అభిప్రాయ పడ్డారు. “ది స్పిరిట్యువల్ హెరిటేజ్ ఆఫ్ త్యాగరాజ ” అనే పుస్తకంలోనూ ఇదే విధంగా పొరబడి, గ్రంధస్తం చేసేసారు కూడా.

ఈ పుస్తకాలన్నీ 1950 కాలంలో వచ్చాయి. ఆ తరువాత కాలంలో వచ్చిన “సమగ్రాంధ్ర చరిత్ర” లో ఆరుద్ర ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ అభిప్రాయం తప్పనీ, రజనీకాంత రావు గారు పొరబడ్డారనీ రాసారు. సమగ్రాంధ్ర చరిత్రలో ఆరుద్ర గారు ఈ విషయాన్ని ఇలా ప్రస్తావించారు.

” ఆంధ్ర వాగ్గేయ కారులలోనే కాక కర్ణాటక సంగీత మూర్తిత్రయంలోనూ త్యాగరాజ స్వామి సుప్రసిద్ధుడు. వారి తాత గారి పేరు గిరిరాజ బ్రహ్మం. ఆయన కూడా తంజావూరులో ఉండేవాడు. ఈ సామ్యాల వల్ల శాహాజీ ఆస్థానంలో ఉండే గిరి రాజే సాక్షాత్తూ త్యాగరాజస్వామి తాతగారని సంగీత పరిశోధకులు పొరబడ్డారు. ఈ అభిప్రాయాలను విశ్వసించి బాలాంత్రపు రజనీ కాంత రావు గారు గ్రంధస్థం చేసారు. యండమూరి సత్యనారాయణ రావు గారు ఈ పొరపాటును కూడా స్వీకరించారు.

వాస్తవానికి శాహాజీ కొలువులోని గిరి రాజూ, త్యాగరాజు తాతగారైన గిరి రాజూ విభిన్నులు. ఇంటిపేరూ, గోత్రాలూ వేరు వేరు. గిరిరాజ కవి ఇంటి పేరు దర్భావారు; త్యాగరాజ స్వామి ఇంటి పేరు కాకర్ల వారు. దర్భావారు లోహిత గోత్రీకులు, కాకర్ల వారు భారద్వాజస గోత్రీకులు. “

ఈ విధంగా చెబుతూ శాహాజీ కొలువులోని గిరిరాజుకూ, త్యాగరాజు తాతగారికీ సంబంధం లేదని నిరూపించవచ్చని రాసారు. గోత్రాధారాలే ఇచ్చారు తప్ప, రూఢిగా నిరూపించలేదు. ఇంతకుమించి అధారాలు చూపలేదు. పై కారణాలు చూపిస్తూ, గిరిరాజు రచించిన పదాలలోని సంగీత శైలీ, కూర్పూ త్యాగరాజ స్వామి కీర్తనలలో కూడా కనిపించడానికి తాత మనుమళ్ళ వరసే కారణం అని మిత్రులు రజనీ కాంతరావు గారు భావించారంటూ ఆరుద్ర రాసారు. కేవలం రచనల్లో పోలికలుండడం యాదృచ్చికం అంటూ ముగించారు. ఇంతకు మించి ముందుకు వెళ్ళలేదు.

రజనీ కాంత రావు గారిలాగే అనేకమంది సంగీత కారులు భావించారు. వి. రాఘవన్ మరియు పి. సాంబ మూర్తి గార్లు త్యాగరాజ చరిత్ర మీద రాసిన పుస్తకాల్లో (The Great Composers Vol I & II) ఇలాగే రాసారు.

కానీ, డా. ఎస్. సీత (Tanjore as a Seat of Music during the 17th, 18th, and 19th Centuries – S. Seetha – Oxford Music Journal) అనే మరో సంగీత పరిశోధకురాలు మాత్రం ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తూ, సాంబమూర్తి, రాఘవన్ల అభిప్రాయాలు తప్పని నిరూపించారు. ఆరుద్ర లాగ ఇంటి పేరూ, గోత్రాలని పట్టించుకోకుండా, వారి వారి వంశ చరిత్రల ఆధారాన్ని చూపారు. గిరిరాజ కవి రాసిన రచనల్లోంచి అతని వంశ చరిత్ర అధారం చూపించడమే కాకుండా, వాళ్ళు శైవ మతస్థులనీ రూఢిగా నిరూపించారు. శాహాజీ కొలువులో ఉన్న గిరిరాజ కవి తండ్రి పేరు ఓబులన్న (వీళ్ళు పలనాడు వైపునుండి వలస వచ్చిన శైవ కుటుంబీకులు) అనీ రుజువు చేసి, త్యాగరాజు తాత గారైన గిరిరాజ బ్రహ్మం తండ్రి పేరు పంచనద బ్రహ్మం అనీ, తగినన్ని అధారాలు చూపించారు. గిరిరాజ బ్రహ్మం కొడుకు రామబ్రహ్మం అనీ, ఆయన కొడుకే త్యాగరాజనీ ధృవీకరించారు.

త్యాగరాజు తాతగారైన గిరిరాజ బ్రహ్మం సంస్కృత పండితుడూ, సంగీత శాస్త్రకారుడూనూ. గిరిరాజ బ్రహ్మం తండ్రి పేరు పంచనద బ్రహ్మం. ఆయనకి అయిదుగురు కొడుకులు. వాళ్ళు సదాశివ బ్రహ్మం, సదానంద బ్రహ్మం, సచ్చిదానంద బ్రహ్మం, బాల బ్రహ్మం మరియు గిరిరాజ బ్రహ్మం. అందరిలోకీ చిన్నవాడు గిరిరాజ బ్రహ్మం. గిరిరాజ బ్రహ్మం గురించి తప్ప మిగతా వారి వంశ చరిత్ర ఎవరికీ తెలీదు.

వీణ కాళహస్తయ్య (తల్లి వైపు తాత)

త్యాగరాజు తల్లి వైపు తాత గారి పేరు వీణ కాళహస్తయ్య. ఈయన వైణికుడు. త్యాగరాజు చిన్నతనంలో ఈయన వద్దే వీణ అభ్యసించారని కె కె రామస్వామి భాగవతార్ “ఇంట్రడక్షన్ టు శ్రీ త్యాగబ్రహ్మోపనిషత్” అనే పుస్తకంలో రాసారు. ఈ కె కె రామస్వామి ఎవరో కాదు, త్యాగరాజు అంత్యదశలో ఆయనతో రెండేళ్ళు గడిపిన కృష్ణ స్వామి భాగవతార్ సుపుత్రుడు (వెంకట రమణ భాగవతార్ మనవడు కూడా).

తంజావూరు రాజ్య ఆస్థాన వైణుకులుగా వీణ కాళహస్తయ్య ఉండే వారని మంచాళ జగన్నాధ రావు గారు (త్యాగరాజ కీర్తనలు పుస్తకం లో) రాసారు. కానీ ఈ విషయాన్ని వెంకట రమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ, మనవడు కె కె రామస్వామి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. వీరేకాదు, తరువాత త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన పి. సాంబమూర్తి గారు కూడా ఎక్కడా ఈ సంగతే రాయలేదు(The Great Composers Vol. I & II). కాబట్టి మంచాల జగన్నాధ రావు రాసిన దానికి ఆధారం ఏమిటో స్పష్టంగా తెలీదు. అది ఊహో లేక వాస్తవమో చెప్పలేం.

“నారదీయం” అనే తాళ పత్ర గ్రంధం త్యాగరాజుకి ఈ వీణ కాళహస్తయ్య చనిపోయినతరువాత ఆయన ఇంటిలో లభించిందని వెంకట రమణ భాగవతార్ రాసారు. ఇదే విషయాన్ని ఆయన కొడుకు కృష్ణస్వామి భాగవతార్ రాసినా, ఆయన ప్రస్తావించిన వేరే విషయానికీ దీనికీ పొంతన కుదరదు.

అది –

“త్యాగరాజు తల్లి తాతగారి పేరు గిరిరాజకవి. ఆయన “సంగీత రత్నాకరము” అనే గ్రంధమూ, మతృభుతేస్వర అనే సంగీత విద్వాంసుడి వద్ద తాతగారికి లభించిన “నారదీయం” అనే సంగీత శాస్త్ర గ్రంధమూ, గిరిరాజకవి మరణాంతరం ఇల్లు వెతుకుతుండగా త్యాగరాజుకి దొరికింది”. [14]

పై రెండూ చూస్తే ఏది సరైనదో చెప్పలేం. వీణ కాళ హస్తయ్య తండ్రి పేరూ గిరిరాజకవనీ చెప్పడానికెక్కడా ఆథారం లేదు. పైన రాసింది తప్ప.

గిరిరాజ బ్రహ్మం కొడుకు రామ బ్రహ్మం. ఆయన కొడుకే త్యాగరాజు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఒకే పేరు ఇద్దరు వ్యక్తులకి ఉండే ఆస్కారం ఉంది. కానీ ఇంత కాకతాళీయంగా ఉండడం నమ్మశక్యం కాదు. కాబట్టి కృష్ణస్వామి భాగవతార్ రాసిన దాంట్లో ఎంత కల్పితమో, ఎంత వాస్తవమో తెలీదు.

కానీ భాగవతార్ తండ్రీ కొడుకులిద్దరూ త్యాగరాజుతో కొంత కాలం గడిపారు. వెంకట రమణ భాగవతార్ చాలా కాలం త్యాగరాజు వద్ద సంగీతం నేర్చుకోడంవల్ల, తండ్రే ఎక్కువ కాలం గడిపాడనడానికి సందేహం లేదు. ఆయన చెప్పిన విషయాలే వాస్తవానికి దగ్గరగా ఉండే ఆస్కారం ఉంది.

ఇలా అక్కడక్కడ లభించిన సమాచారామే తప్ప, సరైన, స్పష్టమైన వివరాలు అంద లేదు. ఎవరికి తోచిందీ, విన్నదీ రాసేసారు.

పైన పేర్కొన్న విషయాలు పొందు పరిచిన పుస్తక ప్రతులు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా కొన్ని కథలు పుక్కిట పురాణాల్లా పుట్టుకొచ్చాయి. ఈ ప్రతులు మదురై గ్రంధాలయంలో ఇప్పటికీ ఉన్నాయి. 1990 తరువాత మరలా కొన్ని పుస్తకాలు ప్రచురించారు.

“నారదీయం” అనే తాళ పత్ర గ్రంధ ప్రస్తావనలో తప్ప వీణ కాళహస్తయ్య పేరు ఎక్కడా ఎవరూ రాయలేదు. త్యాగరాజ కృతుల్లో కూడా ఈయన పేరు కనిపించదు.