బ్లాగుల గురించి – నా మాట

మా ఈమాట సంపాదకవర్గంలో ముఖ్యులు ఒకరు నన్ను ఒక ఏడాదినుంచీ, “మీరు తెలుగు బ్లాగులు చదవటల్లేదు, బ్లాగుల మీద మీకు శీతకన్ను. మీరు ఇంటర్నెట్లో వచ్చేసిన విప్లవం — పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి — అంటూ ఉరకలువేస్తూ వస్తూన్న మరోప్రపంచపు ఇంటర్నెట్ సామజిక విప్లవంలో భాగస్వాములు కావాలంటే తెలుగు బ్లాగులు చదవాలి, చవి చూసితీరాలి” అని వాత్సల్యంతోటే ననుకోండి, మందలిస్తూ వస్తున్నాడు. మందలించి అల్లరిపట్టించే మంచి మిత్రుడు అందరికీ దొరకడు. “మొజాయిక్ అక్షరాభ్యాసం” ద్వారా వెబ్‌స్కూలులో చేరిన నాలాంటి వాళ్ళు బ్లాగులని పట్టించుకోనట్టు పైకి కనిపించినా, బ్లాగులపై శీతకన్ను వేసినట్టుగా భేషజం ప్రకటించినా — ఆ మిత్రుడి ప్రోద్బల భాగ్యమే ననుకోండి — నేను సైతం తెలుగు బ్లాగులు అప్పుడప్పుడు చదువుతున్నా నని యిప్పుడు పబ్లిగ్గా ఒప్పుకుంటున్నాను.

అసలు బ్లాగుల గురించి, ముఖ్యంగా తెలుగు బ్లాగుల గురించీ ఈ క్రింద చెప్పిన వన్నీ నా అభిప్రాయాలు. మా సంపాదకవర్గం ఉమ్మడిగా ఈ అభిప్రాయాలకి మద్దతు ఇవ్వకపోవచ్చునని ముందుగానే మనవి చేసుకుంటున్నాను.

ఈ నెల బ్లాగుల గురించి రాద్దామని ముహూర్తం పెట్టుకోవడం మంచిదే అయ్యింది. నాఅదృష్టం కలిసి వచ్చింది. బ్లాగుల గురించి బోలెడు ముడిసరుకు దొరికింది, శారా బాక్సర్ రాసిన సమీక్ష వ్యాసం నుంచి కాపీ కొట్టచ్చు అని ధైర్యం వచ్చింది. ఇలా ఎందుకంటున్నానంటే, దూషకుడనీ, కాపీరాయుడనీ, గ్రంథ చౌర్యం చేస్తున్నాడనీ బ్లాగరుమీద వ్యాజ్యం వేయడం బ్లాగులరాజ్యంలో ససేమిరా చెల్లదని ఈ మధ్యనే చదివాను. శారా బాక్సర్‌ తనకు తానే బ్లాగుల మీద అల్టిమేట్ బ్లాగ్స్” అన్న పుస్తకం రాసింది.(ఆ పుస్తకం ఇది రాస్తున్నప్పుడు విడుదల కాలేదు.) బహుశా, దానిని గురించి ఎప్పుడో బ్లాగుతాను!

1997 లో జార్న్ బార్గర్ అనే వాడు సృష్టించిన పదం Web log. తరువాత 1999 లో పీటర్ మెర్హోల్జ్ అనే పెద్దమనిషి Web log ని విరిచి, We blog తయారుచేశాడు, ఇందులో బ్లాగ్‌ (Blog) అన్నపదం నామవాచకంగా కానీ, క్రియాపదంగా కానీ వాడుకోటానికి వీలుగా! తెలివంటే వాడిదేనని ఒప్పుకోవాలి. ఏది ఏమయితేనేం, ఇప్పుడు ప్రపంచంలో సుమారు పదికోట్ల బ్లాగులున్నాయట. అందులో కోటిన్నర బ్లాగులు చురుగ్గా పనిచేస్తున్న బ్లాగులు. బ్లాగుల్లో ఎన్నో రకాలు! రాజకీయ బ్లాగులు, లైంగిక విజ్ఞాన సంబంధమైన బ్లాగులు (అంటే తెలుగులో బూతు బ్లాగులు!), శాస్త్రీయ అశాస్త్రీయ బ్లాగులు, పాత కొత్త సినిమా బ్లాగులు, సినిమాతారల బ్లాగులు, సంగీతం బ్లాగులు, రూమరు బ్లాగులు, యుద్ధం బ్లాగులు, ఇరాక్‌ బ్లాగులు, సైనికుల బ్లాగులు, శాంతి బ్లాగులు, అశాంతి బ్లాగులు, మతం బ్లాగులు, ఏసు బ్లాగులు, ఈసు బ్లాగులు, మదం బ్లాగులు … ఒకటేమిటి సవాలక్ష రకాల బ్లాగులున్నాయి! బ్లాగుల్లో 37 శాతం జపనీసు బ్లాగులు. ఈ జపనీసు బ్లాగుల్లో చాలా భాగం మర్యాదగా, స్వపక్షవిమర్శ తో కొంచెం సంకోచంతో రాసే బ్లాగులు. పోతే, 36 శాతం ఇంగ్లీషు బ్లాగులు. ఇవి చాలా భాగం ‘అమర్యాదాకరంగా, పరపక్ష విమర్శ’ — ఒక్కక్కతరి కుపరపక్ష కువిమర్శతో — నిండి ఉంటాయి. కొన్ని బ్లాగులు క్షణభంగురాలు … అలా వచ్చి ఇలా మాయమైపోతాయి, మళ్ళీ ఏ సోదిలోకి కూడా రాకండా.

బ్లాగులతో ఒక సుఖం ఉంది. ఏ భాషలోనైనా సరే, నీ ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. నీ ఇష్టమైనప్పుడు రాసుకోవచ్చు. నీ ఇష్టమైన విషయం గురించి ఎక్కడో మొదలెట్టి మరెక్కడో ముగించవచ్చు. అసలు ముగించక పోవచ్చు. ముఖ్యంగా, బ్లాగన్నది ‘నీ కోసం నువ్వు రాసుకుంటున్నమాటల మూట.’ కొన్ని బ్లాగులు ఏకవాక్య పరిమితాలు; మరికొన్ని ఏకపేరా నుంచి ధారాయుతంగా పేజీలకొద్దీ పరిగెత్తేవి, పరిగెత్తించేవీ. విశేషమేమిటంటే, నీ బ్లాగు పదిమందీ చదివితే ఆనందం, కించిత్‌ కీర్తీ దక్కుతాయి. చదవడమే కాదు, నువ్వు రాసిన దానిపైన పొగడ్తో, నువ్వు ఒప్పుకుంటే తెగడ్తో రాసి, నీ బ్లాగులో భాగరి అయితే మరీ మంచిది. సాధారణంగా బ్లాగర్లు ఎక్కువగా రాయరు. చాలాభాగం మరొక చోటినుంచి తెచ్చిన రాతల కత్తిరింపులకి అతుకులు పెట్టి దానిని వాళ్ళ బ్లాగుగా ‘ప్రచురిస్తారు.’ దానికి చురుక్కుమనే మకుటం పెడతారు. చాలా మంది బ్లాగర్లు (తెలుగు బ్లాగర్లు కూడా!) తాజావార్తలకి సంరక్షకులు, సంపాదకులు, మేనేజర్లూ! కొద్దిమంది మంచి సూక్ష్మదృష్టి ఉన్న సంరక్షకులు, సంపాదకులు, మేనేజర్లూనూ! ఇది తెలుగు బ్లాగర్లకి కూడా వర్తిస్తుంది.

బ్లాగులు చదవడానికి కొంత ఓపిక, కాస్త శ్రమ అవసరం. పుస్తకం లాగానో, వార్తాపత్రికలో వార్తలాగానో, వ్యాసంలాగానో బ్లాగులు చదవలేం. అసలు బ్లాగులు అలాగ పొదగవు. అచ్చు వ్యాసాల్లో పాదసూచికలకి బదులుగా బ్లాగుల్లో లింకులుంటాయి. ఆ లింకు నొక్కితే, అది విడియోకో, మరో బ్లాగుకో, మరోబ్లాగులో ఉన్న రిఫరెన్సుకో తీసుకు పోతుంది. ఒక్కక్కసారి, మనం ఎక్కడ ఎందుకు మొదలుపెట్టామో పూర్తిగా మరిచిపోయే అవకాశం ఉన్నది. అంతు తెలిసే అవకాశం లేకుండా పోయే ప్రమాదం కూడా ఉన్నది. ఒకలింకునుంచిమరోలింకునుంచిమరొక్క లింకులోకి… అండజభీముడండ డడ డండడ డండడ డండడ డండ డండ …. అన్నట్టు (ఆ ప్రమాదం ఈ-మేగజైనుల్లో కూడా ఉండచ్చు). బ్లాగర్లకి ప్రారంభంలో కీర్తి కండూతి లేకపోయినా, ఇప్పుడిప్పుడే ముఖ్యంగా ఇంగ్లీషు బ్లాగర్లకి ఆ జాడ్యం పట్టుకుంటూన్నది. ఒక విధంగా చూస్తే, లింకులూ కీర్తికి లింకులయి పోతున్నాయి. ఇతర బ్లాగుల నించి నీ స్వంత బ్లాగుకి ఎన్ని లింకులుంటే అంత గొప్ప పేరు! ఆ లింకులేవో నువ్వు ఇదివరలో రాసిన వాటికే ఉంటే, ఒక సారి నీ బ్లాగులోకి వచ్చినవాడు మరోబ్లాగులోకి పోవలసిన అవసరం లేదు.

బ్లాగులు చదవడం ఎలా తేలిక కాదో, అలాగే రాయడం కూడా తేలికయిన పనికాదు. చెయ్యితిరిగిన పత్రికా విలేఖకులు బ్లాగులు రాయడానికి ప్రయత్నిస్తే, అది వార్తలాగానో, సంపాదకీయంలాగానో పట్టుబట్టి పకడ్‌బందీగా రాసినట్టే ఉంటుంది కానీ, బ్లాగులా ఉండదు. ఈ విషయం తెలుగు బ్లాగులకు కూడా వర్తిస్తుందని నా నమ్మకం. ఎలిజబెత్ హార్డ్విక్ — ఈవిడ న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ కి సంపాదక సలహాదారు — ఒకసారి తన విద్యార్థులతో అన్నదట: “రాయడానికి రెండే కారణాలు: నైరాశ్యం లేదా ప్రతీకారేచ్ఛ” అని. ఏవో కొద్ది బ్లాగులు మినహా, చాలా ఇంగ్లీషు బ్లాగుల విషయంలో ఇది నిజం అనిపిస్తుంది. నేను చూసిన మేరలో తెలుగు బ్లాగుల విషయంలో ఈ పైరెండు కారణాలూ (desperation or revenge) నిజం కావు. ప్రస్తుతానికి ఆ విషయమై దృఢంగా చెప్పగలం. ముందుముందు ఏమి జరుగుతుందో జోస్యం చెప్పడం కష్టం.

తెలుగులో దగ్గిర దగ్గిర రెండువేలమంది బ్లాగర్లున్నారని విన్నాను. చాలా మంది తెలుగు సినిమా, తెలుగు సంగీతం, తెలుగు దేశీ వార్తలు గురించి బ్లాగుతారు. కనీసం ఒక ఇరవైమంది పైచిలుకు బ్లాగర్లు సాహితీపిపాసులేనని చెప్పవచ్చు. మిగిలినవారికి, తెలుగు మీద మమకారం, తెలుగులో రాద్దామన్న అభిలాష కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. పోతే ఈ సాహితీపిపాసులు అన్నానే, ఆ బ్లాగర్లు ఓపికగా కథలు, కవితలు, వ్యాసాలూ , తాము రాసినవీ, ఇతరులు రాసినవీ కూడా సంకలనీకరిస్తున్నారు. వాటిపై వచ్చే బ్లాగర్శలని (బ్లాగులపై వచ్చే విమర్శలని నా అర్థం) కూడబెట్టటం కూడా చేస్తున్నారు. అయితే, కథలు, కవితలు, వ్యాసాలూ, మరొకరు ఎక్కడో ఎప్పుడో రాసి ప్రచురించినవి తమ బ్లాగుల్లో పెట్టినప్పుడు ఆ రచయితల అనుమతి తీసుకున్నారో లేదో చెప్పడం అన్ని వేళలా సాధ్యం కాదు. మరొక్క విషయం చెప్పుకోక తప్పదు. చాలా మంది యువతీయువకులు కొత్తగా తెలుగులో రాస్తున్నారు. కొత్త కొత్త పదాలు సృష్టిస్తున్నారు. సరికొత్త వచనాన్ని తయారు చేస్తున్నారు. కొత్త వ్యాకరణం, కొత్త పంక్చువేషన్ వడివడిగా తయారవుతున్నాయి. మడికట్టుకున్న వాళ్ళకి, ప్యూరిస్టులకీ, చాందసులకీ వాళ్ళ కొత్త పదజాలం కొంతకాలంపాటు కొంచెం ఎబ్బెట్టుగా కనిపించినా, బ్లాగుల్లో విరివిగా వాడటంతో అవి తెలుగు పదాలయిపోతాయి — రైలు, పోస్టాఫీసు, మేష్టారు, తాసిల్దారు, కంప్యూటరూలలాగా! అది చెప్పుకోదగ్గ విషయం.

ఏదో ఆవేశం పుట్టి మనమో కవిత రాశామనుకోండి. ఏ పత్రికాసంపాదకుడో ఎప్పుడో తన కవిత అచ్చువేసే వరకూ ఆగనక్కరలేదు. తన కథ ప్రచురించబడుతుందా, ప్రచురించబడదా అని ఎదురు చూడనక్కరలేదు. పైగా, ఇది ఎంతమంది చదువుతున్నారూ అన్న ప్రశ్న ప్రస్తుతం అప్రస్తుతం — అహంభావంతో కొట్టుమిట్టాడుతూ ఉండే వారికి తప్ప!

తెలుగులో రాయాలని ఉత్సాహం ఉండీ పెద్దగా అనుభవం లేని వాళ్ళయినా సులభంగా కంప్యూటరు మీద తెలుగులో రాసుకోవడానికి ఓ లేఖిని ఆవిర్భావం, కళ్ళు విప్పిన బ్లాగులన్నిటినీ ఒక బొమ్మల కొలువులా పొందిగ్గా చూపించే ఓ కూడలి ఏర్పాటు తెలుగులో బ్లాగుల వ్యాప్తికి మార్గం సుగమం చేశాయని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. తెలుగు బ్లాగర్లు తాము పోటీలు పడి రాయడమే కాక కొత్తగా బ్లాగ్లోకంలో ప్రవేశించేవారిని ఉత్సాహ పరిచి రాయిస్తున్నారు. ఏవన్నా సమస్యలూ సందేహాలూ వస్తే తీరుస్తున్నారు. కొందరు చెయ్యి తిరిగిన పాత రచయితలు కూడా తమ పాళీలకి సానబెట్టి బ్లాగుల్లో కొత్త సిరాతో సరికొత్త మూసల్లో రాస్తున్నారు. మొత్తమ్మీద వెల్లివెరిస్తున్న ఈ బ్లాగోత్సాహం అందరూ ఆనందించ దగ్గ విషయం. ఈ పిపాస పెనమ్మీది నీటిబొట్టులా ఆవిరై పోకూడదని నా కోరిక.

కొన్ని బ్లాగులు చదివిన తరువాత, ఛందస్సంటే భయపడే నాకు కూడా ఛందస్సులో కవిత్వం రాద్దామనే కుతూహలం కలుగుతూన్నది. ఇప్పుడు నన్ను బ్లాగులు చదవమని ప్రోత్సహించిన స్నేహితుడికి నా సమాధానం:

బ్లాగులు నా కెందులకని,
నే గోళులు గిలికెదనని నాపై నెపమా?– అని అనగలను.

అయితే, ఇప్పటికీ, “బ్లాగు లందు తెలుగు బ్లాగు మేలయా” అన్నది ఏ పద్యపాదమో తెలియని ఛందో దుస్థితి నాది.

ఈ కొత్త బ్లాగర్ల (వాడిగల సరికొత్త రచయితలు అని అనడం భావ్యం) దగ్గిరనుంచి పోను పోను ఇంకా మంచి సాహిత్యం వస్తుందని ఆశిద్దాం. ఎప్పుడో, ఎవరో ఈ బ్లాగుల సందోహం నుంచి ఒక మెచ్చదగిన “బ్లాగలనం” అచ్చులో అందరికీ అందచేస్తారని కూడా నా నమ్మిక.