చెంగావి రంగు ఎండ
మొండిగోడ దేహం మీంచి
ఊగుతూ ఊగుతూ ఊసరవెల్లి నీడలు
తెగని రంపపుకోత
ఎగిరే కాకి ఎంతకూ వాలదుభూమి ఒక సుడిగాలి
ఆకాశమంతా ఒకే కన్ను
సముద్రం ఒకే ఒక్క కన్నీటి చుక్క
తడికె కన్నాల నుంచి చూస్తున్నాను
మూడో కాలొకటి నడచి వస్తోంది
నల్లమబ్బు ఒకటి దేహం మీద వాలింది
రెప్ప కదలిన అలికిడి లేదు
కల కలవరింతా లేదు
కిటికీలో సగం వంగిన జామకొమ్మకు
మౌనంగా
పండూ నేనూ వేలాడుతున్నాము
తెగిన గాలిపటం
గిరికీలు కొడుతూ జారిపోతూ ఉంది
ఏదీ చేతికందదు
ఏదీ చెంతకు రాదు
నేను నా నీడ
తడవని మొండిగోడ దేహం మీంచి
కదులుతున్నాము కదులుతున్నాము