వసుచరిత్ర, మనుచరిత్ర, శ్రీమద్రామాయణ కల్పవృక్షం మొదలైన మహాకావ్యాల అంతర్దర్శనం చేయించిన సాహిత్య విమర్శకుడు, పుంభావ సరస్వతి కీ.శే. జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారు, వారి శ్రీమతి కీ.శే. లక్ష్మీనరసమ్మగారల సంస్మరణార్థం, వారి కుమారులు జొన్నవిత్తులవారి సాహిత్య స్ఫూర్తి పురస్కారాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ఈ పురస్కారాన్ని తెలుగు, సంస్కృత, ప్రాకృత భాషా సాహిత్యాల్లో అద్వితీయమైన ప్రతిభ కనపరుస్తున్న యువ సాహితీవేత్త, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీ పరిమి శ్రీరామనాథ్‌గారికి అందిస్తున్నారు. ముప్ఫై సంవత్సరాల వయసులోనే ఆయన చేసిన అపూర్వమైన సాహిత్య సేవలకుగాను వారికి ఇరవై అయిదు వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాలతో సత్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సెప్టెంబరు ఆరు, ఆదివారంనాడు జరుగుతుందని పలమనేరు రచయితల సంఘం అధ్యక్షులు పలమనేరు బాలాజీ, గౌరవాధ్యక్షులు ఆర్ మాధవ్‌లు తెలియజేశారు. తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు శ్రీ తులసీనాథం నాయుడు మాట్లాడుతూ తమ కళామందిరంలో నిరంతరంగా సాహితీ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరగడం సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రఖ్యాత కవి శ్రీ దర్భముళ్ళ చంద్రశేఖర్‌గారి రెండు పుస్తకాలు కూడా విడుదల చేస్తామని జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.