అస్తిత్వవాద సాహిత్యం: 4అ. లూయిజీ పిరాండెలో

పిరాండెలో వచనాలు

(తన ముఖంపై ముసుగు తొలగించబోతున్న తండ్రిని, తల్లి వారిస్తోంది. ఇది Six Characters in Search of an Author లో ఒక స్టేజి డైరెక్షన్.)

“Right You Are (If You Think You Are)” అన్నది అతడి ప్రధానమైన మూడు నాటకాలలో ఒకటి. నీవు నిజమని నమ్మితే, అది నిజమే, అంటే సంస్కృతంలో “యద్భావం తద్భవతి” అనుకోవచ్చు. ఈ వ్యాసంలో మనం చదవబోతున్న కథను (Mrs.Frola and Mr. Ponza, her son-in-law) మలచి ఆ నాటకంగా రాశాడు.


Luigi Pirandello: (1867-1836)
Italy. Italian

మనసు మౌనమైన కొన్ని క్షణాలలో, మనకు స్పష్టంగా తెలుస్తుంది, మనకు సాధారణంగా తెలుస్తున్న దానికంటే అతీతమైనవాస్తవం. మనిషిబుద్ధికి అందనిది, ఉన్నదని. (Pirandello: On humour)

భ్రమకంటే వాస్తవం ఏం మేలు? వాస్తవమైన ప్రతిదీ భ్రమ కావచ్చు, అలాగే భ్రమ కూడా.

పిచ్చివాళ్ల అదృష్టం మనం తెలుసుకోడం లేదు.

నీవు తాకి, నమ్మి, నిజమని యీ వేళ నీకనిపించిన ప్రతిదీ, అది రేపు మిథ్య, నిన్నటి నిజంలా.

మనం అందరికీ అన్ని పనులలో ఒకే వ్యక్తి అన్న భ్రమలో ఉంటాం. ఇది నిజం కాదు.


జీవితం

1867, లూయిజ్ పిరాండెలో జననం, సిసిలీ ద్వీపంలో, తండ్రి గంధకం గనులయజమాని.సంపన్నుడు. కనుక పిరాండెలోకు బాల్యంలో పేదరికం తెలియదు. కాని తండ్రి కఠినంగా ప్రవర్తించేవాడు. తల్లిదగ్గర కూడా పెద్ద చనువు లేదు. పందొమ్మిదో ఏట చదువు ముగించి, తండ్రి వ్యాపారంలో చేరాడు. కాని ఆ వాతావరణం నచ్చలేదు. వ్యాపారంనుండి విరమించి, విద్య కొనసాగించాడు. బోన్ విశ్వవిద్యాలయంలో, అతని అధ్యయనవిషయం భాషాశాస్త్రం (philology). కాని అభిమానవిషయం తత్త్వశాస్త్రం. ప్లేటో ఆదర్శవాదం యితన్ని ఎక్కువగా ఆకర్షించింది. కవితలు కథలు రాయడంతో మొదలుపెట్టి, నాటకాలవైపు సాగాడు. గతశతాబ్దపు ప్రపంచనాటకకర్తలలో ప్రముఖస్థానం సంపాదించుకున్నాడు. షేక్స్ పియర్ తర్వాత యింతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాటకకర్త లేడన్నారు. నాటకరచనలోనే కాక నాటక ప్రయోగంలో కూడా ఒక పెద్ద మలుపు తెచ్చాడు. (ఉదాహరణకు, అతడి ప్రసిద్ధనాటకం Six Characters in Search of an Author. ప్రదర్శనలో పాత్రలు ఒక బల్లమీద పైనుంచి రంగస్థలంమీదికి దిగుతారు. సాధారణంగా, యిటువంటిది షేక్స్ పియర్ కాలంలో దయ్యాలు దైవాలు పైనుంచి దిగుతాయి. పిరాండెలో పాత్రలు ఆవిధంగా దిగడంలో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం సాధించాడు పిరాండెలో. తన నాటకంలోని పాత్రలు కూడా దయ్యాలలాగా రచయితను వెంటాడుతాయి. వాళ్ళ జీవితాలు అసంపూర్ణంగా ముగించినందుకు.) అతడు స్వయంగా ఒక నాటక సంస్థను స్థాపించి నడిపాడు.

1894లో ఆంటోనీటా (Antonietta Portulano) ను వివాహం చేసుకున్నాడు. తన భర్తకు పరస్త్రీలతో సంబంధాలున్నాయని ఆమె అనుమానించేది. ఆ అనుమానాలు మనోవ్యాధిస్థాయికి ఎదిగాయి. ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగినతరువాత పిచ్చి మరీ ముదిరింది. 1904 లో వారి కుటుంబవ్యాపారం తీవ్రనష్టాలపాలైంది. ఆమె మానసికస్థితి పూర్తిగా దుర్భరమై, ఆమెను ఒక మానసికచికిత్సాలయంలో చేర్చాడు పిరాండెలో, ఆమె కోలుకోలేదు. తిరిగిరాలేదు. నలభై ఏళ్ళు చికిత్సాకేంద్రంలో గడిపి చివరకు అక్కడే చనిపోయింది. ఆ విధంగా అతడి దాంపత్యజీవితం అపహాస్యం పాలై, దుఃఖాంతమయింది. ఆమె దూరం కావడం పిరాండెలోకు జీవితకాలమంతా దుర్భరమైంది. ఆమె జ్ఞాపకాలను దూరంచేసుకోవడానికి, అతడు ఆ ఊరు కూడా వదిలి మరో చోటికి కదిలిపోయాడు.

పిరాండెలో సాహిత్యాధ్యాపకుడిగా, చాలీచాలని జీతంతో, యిరవైనాలుగు సంవత్సరాలు పనిచేశాడు, ఒక స్త్రీల కళాశాలలో (Normal College for Women. Rome) .ఆ రెండూ (చాలీచాలని జీతము, స్త్రీల కళాశాల) బహుశా అతడి భార్య వ్యాధి ముదరడానికి మరింత దోహదం చేసి ఉండవచ్చు. అటువంటి స్థితిలో పిరాండెలో, ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో యిరవైఎనిమిది నాటకాలు రాశాడు. ఇతడి Six Characters in Search of an Author, మొదటి ప్రదర్శన అల్లర్లలో ముగిసింది. పిరాండెలో తన నాటకరచనకూడా ముగిసింది అనుకున్నాడు. (రచయిత వెనుకదారిన నిష్క్రమించవలసి వచ్చింది.) కాని రెండవ ప్రదర్శనలోనే అనూహ్యమైన ఆమోదం పొందింది. ఇక ఆ తరువాత నాటకకర్తగా అతడిది తిరుగులేని ప్రస్థానం.

పిరాండెలోకు అప్పటి ఇటలీదేశపు నియంత ముసోలిని ప్రోత్సాహం బలంగా దొరికింది. అతడి నాటకాలు ప్రపంచంలోని పెద్దనగరాలలో ప్రదర్శించబడ్డాయి. తనకొక ప్రత్యేక నాటకబృందం ఏర్పరచుకున్నాడు. ఆ బృందంలో ఇటలీలో పెద్ద పేరున్న మార్తా అబా (Marta Abba) నాయికపాత్రలు వేసేది. ఆమెతో పిరాండెలోకు అనుబంధం ఏర్పడింది కాని, ఆమెకు తన వృత్తి ముఖ్యం. అనేకదేశాలలో ప్రదర్శనలిస్తూ, ఇతడితో గడపడానికి ఎక్కువ సమయం ఉండేది కాదు. ఈ సంబంధం వల్ల పిరాండెలోకు తన పిల్లలూ తనకు దూరమయ్యారు. తన జీవితపు చరమదశలో ఒంటరితనం వెంటాడింది. 1934 లో యితడికి నోబెల్ బహుమతి యిచ్చారు. 1936 లో మరణించాడు.

ముఖ్యరచనలు

నాటకాలు

1917: Right You Are (if you think so)
1921: Six Characters in Search of an Author
1922: Henry IV

నవల

1825-26 One, No one and One Hundred Thousand

కథలు

1022-37: Novelle per un anno (Short Stories for a Year). 15 volumes. (వీటిలో నుండి చేసిన ఒక సంకలనం Mad Tales or Tales of Madness. ఆ పిచ్చికథలలో ఒకదాని గురించి మనం యిక్కడ చదవబోతున్నది.)

కవిత్వంకూడా చాలానే రాశాడు.

(సశేషం)