అద్దంలో జిన్నా

[2023 లో మిల్పిటస్ లో జరిగిన 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో రచయిత చదివిన ప్రసంగవ్యాసం – సం]

[దేవరకొండ బాలగంగాధరతిలక్ రాసిన అద్దంలో జిన్నా కథ 1946 నవంబర్ భారతిలో ప్రకటితం. అంటే తిలక్ పాతికేళ్ల వయసులో రాసిన కథ. ఘనత వహించిన విశాలాంధ్ర ప్రతిలో ఘరానా దోషాలు చోటుచేసుకున్నాయి. రచనా కాలం 1961 అని తప్పుగా సూచించారు. — రచయిత. ]

ఈ కథ అందరూ రాయగలిగింది కాదు. కారణం, జిన్నా అందరికీ అర్ధమయ్యే పాత్ర కాదు. చివరి క్షణం వరకూ ఒక ప్రహేళికలా బ్రతికిన వాడు. అతని అంతరంగాన్ని ఎవరూ పసిగట్ట లేక పోయారు. క్షయవ్యాధితో కృశించి పోతున్న విషయం బయటకు పొక్కనీయలేదు. ప్రతి విషయంలో గోప్యతే. అతనికి సొంత మతాచారాల పట్ల ఎప్పుడూ పట్టింపు లేదు. సూటూ, బూటూ, లంకంత ఇల్లు, విందు వినోదాలు – అన్నీ ఆంగ్లేయుల పద్ధతులే. నాలుగు పదుల వయసులో – తన స్నేహితుని కూతురైన పదహారేళ్ళ పార్సీ అమ్మాయి – రతన్ బాయి ప్రేమలో పడి – మైనారిటీ తీరిన వెంటనే (1918) ఆమెను పెళ్లాడాడు. కొంత కాలం సఖ్యంగా ఉన్నవారిద్దరికీ ఒక కూతురు (1919, ఆగస్టు 14 అర్థరాత్రి) పుట్టింది. క్రమంగా, మారుతున్న పరిస్థితుల కారణంగా జిన్నా ఆమె తో ఇమడ లేక పోయాడు. లేదా ఆమె అంచనాలకు అనుగుణంగా ఉండలేకపోయాడు. చివరికి, ఇద్దరూ విడి పోయారు. అందరి అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్ళాడి, పార్సీ సమాజం నుండి వెలివేయబడి, చివరికి ఇదా తనకు దక్కిన ప్రతిఫలం అని ఎంతగానో దురపిల్లి రతన్ బాయి, ఎంతో చిన్న వయసులో అనగా తన 29వ పుట్టిన రోజున మరణించింది. ఆమెది ఆత్మహత్య అనే వారున్నారు. ఒక్కగానొక్క కూతురు అమ్మమ్మ దగ్గర ఉండి పోయింది. జిన్నా అభీష్టానికి వ్యతిరేకంగా పార్సీ వాడియాను పెళ్లాడింది. విభజన తర్వాత జిన్నా దగ్గరకు వెళ్లలేదు. బొంబాయిలోనే ఉండి పోయింది. జిన్నా విభజన జరిగి ఒక్క ఏడాది గడిచి గడవగానే క్షయకారణంగా గతించాడు. వ్యక్తిగా ఇది జిన్నా కథ.


పెళ్లి నాటి ఫోటో – జిన్నా (42) , రత్తి (18)

తొలినాళ్లలో రాజకీయాల్లో ఇరుమతాల మధ్య సఖ్యత నెరిపే ఉదారవాదిగా పేరుబడిసినా – రాజకీయాల్లో గాంధీ రాకతో పరిస్థితులు తల్లక్రిందులైపోయాయి. చివరికి ద్విజాతివాద ప్రవక్తగా అవతరించి, భారతదేశాన్ని మూడు ముక్కలు చేసి – చరిత్రలో కనీ వినీ ఎరుగని రక్తపాతానికి కారణమయ్యాడు. ఇది ఒక రాజకీయ నాయకుడిగా జిన్నా కథ.


మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) ముగిసి మూడేళ్లు గడిచాక ఎంతో రాజకీయ చైతన్యమున్న కాలంలో (1921)-తిలక్ జన్మించాడు. సరిగ్గా ఇరవై ఏళ్లకు, రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన రెండేళ్లకు – “నా కవిత్వం(1941)” అన్న కవితలో తన కవితా తత్వాన్ని ఎంతో చక్కగా చాటాడు.

నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

తిలక్ జీవిత కాలంలో ఎన్నో యుద్ధాలను చూశాడు. వార్తా పత్రికల్లో, రేడియోల్లో యుద్ధబీభత్సం, ఘోర క్షామం, దేశ విభజన తాలూకు కథనాలెన్నో విన్నాడు. తెలుగులో ఈ నేపథ్యంలో కథలు, కవితలు రాసిన ఏకైక కవి తిలక్.

కవివాక్కు

భారతదేశాన్ని కాదనలేను
రష్యాదేశాన్ని కొలవలేను
నిజం ఎక్కడో – అక్కడ నా ప్రాణం వుంది
హృదయం ఎక్కడో – అక్కడ ఉదయం ఉంది.

పులి చంపిన లేడి నెత్తురు పులుముకోలేను
ఖడ్గ మృగోదగ్ర విరావం ఆలకించలేను
జగద్ధాత్రి! నీ కుమారులమైన మేము
తత్త్వాల పేర విప్లవాల పేర ఒకరి నొకరం హతమార్చుకోలేము!

శాంతికోసం యుద్ధాన్ని ప్రజ్వలింప చేస్తారు
సుఖం కోసం ఆ రక్త విప్లవాన్ని తరింపచేస్తారు
శ్మశాన భూమిని వికసిస్తుంది మీరు నాటిన పూలచెట్టు
కాని ఎవరు తుడుస్తారు తల్లీ! నీ కన్నీటిబొట్టు?

జాగ్రత్తగా గమనిస్తే తిలక్ కవితాదర్శా లే కధల్లో కూడా కనిపిస్తాయి. తిలక్ కథల్ని, కవితల్ని వేరు చేసి చూడలేము. తిలక్ లో గొప్ప కథన శిల్పం ఉంది. ఏ కవితను పరిశీలించినా ఆ విషయం అర్థమవు తుంది. తిలక్ కవిత్వంలోని ప్రసాద గుణానికి అది కూడా ఒక కారణం.

అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?
ఇంకా రాడేం? అని అడిగాడు నాలుగేళ్ళ పిల్లవాడు మరోసారి–
అలవోకగా వాడి తలనిమురుతూ ఆమె అలాగే
ఆశతో వింటోంది రేడియోలో వార్తలు —
ఆమె కళ్లల్లో విమానాల రెక్కలు కదలిన నీడలు
ఆమె గుండెల్లో మరఫిరంగులు పేలిన జాడలు
కాశ్మీరు సరిహద్దులో కమ్ముకొన్న నల్లని పొగలమధ్య
కాలూని నిల్చున్న సైనికుడు
చటుక్కున ఆమె కళ్ళముందు నిలిచాడు.

తిలక్ చేయి తిరిగిన కథకుడు కావడం మూలాన తన కవిత్వం మరింత ఆకర్షణీయంగా తయారైంది. అలాగే – కవిగా తిలక్ లోని భావుకత్వం, ఊహాశక్తి తన కథల స్థాయిని పెంచింది. వెరసి తిలక్ లో మెరిసే వ్యంగ్యం – బిగుసుకు పోయిన మనిషికి సైతం జీవం ప్రసాదించ గలదు.

అరవైల్లో (1961-64) తిలక్ రాసిన – ఊరి చివరి ఇల్లు, దేవుణ్ణి చూసిన వాడు, నల్లజర్ల రోడ్డు, సీతాపతి కథ, సముద్రపు అంచులు తదితర కథలు ప్రపంచ కథకుల్లో తన స్థానాన్ని సుస్థిర పరిచేవే. పొతే, తిలక్ రాసిన ఈ కథలన్నీ ఒకెత్తు, ‘అద్దంలో జిన్నా(1946)’ కథ మరొకెత్తు. యుద్ధ బీభత్సాన్ని చిత్రీకరించిన పికాసో గెర్నికా (Guernica) తో, నాజీల దురాగతాన్ని అక్షరకీరించిన పాల్ సెలాన్ కవిత మృత్యుమేళ (Todesfuge) తో సాటి రాగల కథ; మతం పేరిట -లక్షలాది అమాయక ప్రజల మరణాలకు, స్థానచలనానికి, మహమ్మదీయ సమాజంలో మానసిక విదళనం (schizophrenia) కలగడానికి కారకుడైన ఒక మతరాజకీయ నాయకుని విపరీత మనస్తత్వాన్ని ఎంతో చాకచక్యంతో చిత్రీకరించిన కథ.


Guernica – Oil on Canvas ( 1937)

ఇక ‘అద్దంలో జిన్నా’ కథలోకి ప్రవేశిస్తే, అసలు ప్రారంభంలోనే ఎంతో వ్యంగ్యం, ఎంతో లోతున్న పదునున్న వాక్యాలు:

యం. ఏ. జిన్నా కోటు తొడుక్కొని అద్దం ముందు నుంచున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా చాలా గొప్ప జిన్నాలా కనపడ్డాడు. అద్దంలో నిజానికి ఒక జిన్నా ఒక్కడే కనపడలేదు. జిన్నా వెనకాల ఎంతో మంది మహమ్మదీయులు వరసలు తీరి ‘జిన్నాకీ జై’ అంటు నిలబడ్డారు. అందరిలోనూ ఒక్కొక్క జిన్నా వున్నాడు. ప్రతి మహమ్మదీయుడూ ఒక అద్దం. అద్దంలో జిన్నా, అంటే విశాలమూ, వివిధమూ అయిపోయిన జిన్నా. వెడల్పూ పొడుగూ విస్తరించి మరీ రహస్యమూ, మరీ ప్రకటితము అయిపోయిన జిన్నా.

మొదటి వాక్యంలో తిలక్, జిన్నా అంతరంగాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అద్దం ఆత్మ వ్యామోహానికి ( narcissism) ప్రతీక. జిన్నా కోటు నలుగురిలో అతని అంతస్తును, హోదాను చాటుతుంది. తన్ను తాను గొప్పగా భావించుకోవడం, అందరూ తనకు జేజేలు పలకాలి అనుకోవడం ఆ తరహా వ్యక్తిత్వంలో భాగమే. కాబట్టే, ‘అద్దంలో జిన్నా’ చాలా గొప్ప జిన్నాలా కనపడ్డాడు. అంతే కాదు, అద్దంలో నిజానికి ఒక జిన్నా ఒక్కడే కనపడలేదు. జిన్నా వెనకాల ఎంతో మంది మహమ్మదీయులు వరసలు తీరి ‘జిన్నాకీ జై’ అంటూ నిలబడ్డారు.

గాంధీ కొల్లాయి, జిన్నా కోటు – గురించి కొద్దో గొప్పో చరిత్ర చదువుకున్న అందరికీ తెలుసు. గాంధీ సామాన్యుని ఆహార్యం స్వీకరిస్తే జిన్నా ఆంగ్లేయుల డాబు దర్పం తలపించే సూటుబూటులో వెలిగిపోయేవాడు. తిలక్ కు ప్రపంచ రాజకీయాలు కొట్టిన పిండి, దేని గురించైనా సమగ్రంగా అధ్యయనం చేసి రాయడం తిలక్ ప్రత్యేకత. ఈ కథ రాసే నాటికి (1946) Narcissistic Personality Disorder (NPD) గురించి ఎవరికీ తెలియదు. ఆ రంగాల్లో ఆద్యులైన Otto Kernberg, Heinz Kohut లాంటి జర్మన్ మానసిక శాస్త్రవేత్తలు అప్పటికి తమ పరిశోధనలను మొదలే పెట్టలేదు. కానీ, తిలక్ స్పష్టంగా జిన్నాను ఆత్మవ్యామోహపీడితునిగా గుర్తించాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. మనస్తత్వ శాస్త్ర పరంగా విచార విమర్శ చేయకపోతే ఈ కథలోని లోతులందవు.


1939 నాటి చిత్రం – వాదించుకుంటున్న జిన్నా, గాంధీ

అయేషా జలాల్ లాంటి పరిశోధకులు పెద్ద ఆధారాలు చూపకుండా, ‘జిన్నా భారత విభజన కోరుకోలేదు, బేరసారాల్లో భాగంగా ఇది అతని ఎత్తుగడ. జిన్నా ఒక సెక్యులర్ కాస్మోపాలిటన్ – ఎందుకు ఇలాంటి హననానికి పాలు పడతాడు’ అని జిన్నాను వెనుకేసుకువచ్చి, కాంగ్రెసు నాయకులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ, తోసిపుచ్చలేని ఆధారాలతో ఇటీవలి పరిశోధకులు ముఖ్యంగా పేర్కొనదగిన వారు ఇస్తియక్ అహ్మద్, ధూళిపాళ వెంకట్ -జిన్నానే నిర్ద్వంద్వంగా దోషిగా నిలబెట్టారు.

ధూళిపాళ వెంకట్ గ్రంథం నుండి:

However, a vengeful Congress leadership loath to share power with the Muslims and desirous of creating a strong centralised state in India, repudiated these efforts, leaving Jinnah no option but to accept the Partition. Jalal thus overturned conventional wisdom regarding the Partition, shifting the blame from Jinnah to the Congress leadership for this catastrophe, an event which led to the death of an estimated one million people and the forced displacement of another twelve million-the largest recorded movement of population in all of human history.

This view was immediately contested, most prominently by the historian Anita Inder Singh who reinforced the conventional wisdom about Jinnah’s responsibility for the Partition. Singh demonstrated how Jinnah was clear about achieving a sovereign Pakistan and singlehandedly accomplished it by …

These flawed postulates-about Pakistan being a vague idea, and deliberately kept so by Jinnah-have propped up the third widely accepted truism in Partition studies that Jinnah was using Pakistan as a “bargaining counter” to secure parity for Indian Muslims vis-a-vis the preponderant Hindus in an undivided post-colonial India.

ఆత్మవ్యామోహపీడితుని అంతరంగ చిత్రం

“తానొక రూపం కాదు. ఒక చిత్రం కాదు. ఒక విచిత్రం కాదు. తానొక పెద్దమనస్సు. తానొక పెద్ద భావం. మనస్సు కండరాలకన్నా కోటు గుండీలకన్నా పెద్దది. గొప్పది. ఆ మనస్సు తనలో వుంది. ఆ మనస్సు తనలో పెద్ద కాంతిలా వుంది. ఆ మనస్సు పరమాణువులా తనలో వుంది, ఆ పరమాణువు తనచుట్టూ వలయాలు కల్పించుకుంటూ శక్తినీ, కదలికనీ ప్రేరేపిస్తుంది. ఆ కదలికలో కోటి మనస్సులలో వుండే కోటి పరమాణువుల్ని తాకుతుంది. ”

మహమ్మదీయులు, హిందువులు కలిసి జీవించలేరు, కావున దేశాన్ని ముక్కలు చేయవలసిందే అన్నదే తన భావం, అంతేనా??

“తన మనస్సు రథికుడు. ఆ మనస్సు సృష్టించిన భావం ఒక రథం. ఆ రథాన్ని తాను నడిపిస్తున్నాడు. మహమ్మదీయులందరూ ఆ రథచక్రాలకి కట్టబడి వున్నారు. ఆ రథం అతివేగంతో నడుస్తుంది. వేగం రథంతో నడవలేదు. పంజాబ్, సింధు, బెలూచిస్తాన్, బెంగాల్, అస్సామ్ భూములమీద ఆ రథం నడుస్తుంది. ఆ చప్పుడుకి కాబూలు కైబరు కనుమలు ప్రతిధ్వనిస్తాయి.

“కైలాసం మీద మహేశ్వరుడికి బదులుగా ‘అల్లా’ని తాను నిలబెట్టుతాడు; ప్రతిష్ఠిస్తాడు.” అనడం వ్యంగ్యానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. అంతే కాదు ఎదుటి వారి భావాలకు, ఉద్వేగాలకు ఏమాత్రం విలువనివ్వని ఒక ఆత్మ వ్యామోహ పీడితుడు, హద్దులు లేని తన ప్రవర్తనతో ఎంత దూరం వెళ్లగలడో చూపుతున్నాడు. సహానుభూతి (Emotional Empathy )కలికానికైనా లేక పోవడం NPD ప్రధాన లక్షణం.

అజ్ఞానాన్ని కాపాడటమే రాజకీయం!

“తన రథం వెనుకాల మహమ్మదీయులందరూ వస్తారు. ఎందుకు వస్తారో వారికి తెలియదు. తెలుసు కుంటే ఎవరూ ఏవిషయంలో ఏమీ చేయరు. అజ్ఞానం క్రియకీ కర్మకీ కారణం. జ్ఞానం సమాధికీ విధానానికి కారణం. ఆ అజ్ఞానాన్ని తను భద్రంగా కాపాడుతాడు. ఆ అజ్ఞానాన్ని తను భ్రమలతో, ఆశలతో పోషిస్తాడు.”

రాజకీయాలు అంటే వేరు చేయడమే:

‘ఒక భావంతో పదికోట్లమందిని ఒకటిగా చేశాడు. ఒక భావంతో పదికోట్ల మందిని ముప్ఫైకోట్ల జనం నుండి వేరు చేశాడు. అందరూ చేసేది ఇంతే! రాజకీయజ్ఞుల పని వేరు చెయ్యడం ఒక జాతి అంటే తక్కిన మానవ సంఘంతో వేరుపడిన ఒక సమూహం అన్నమాట. ఎంత బాగా వేరు చేస్తే మరీ అంత పెద్ద నాయకుడవుతాడు.’

మరి జిన్నా పెద్ద నాయకుడు అయ్యాడు, కానీ జిన్నాను రక్తం కలవర పరిచింది.


జిన్నా బంగాళా, మలబార్ హిల్స్, బాంబే (విశ్రాంత జీవనం ఇక్కడే గడపాలి అనుకున్నాడు జిన్నా)

జిన్నా తన కారు మీద తిరిగి వస్తున్నాడు. రోడ్ల మీద రక్తం కనపడింది. రక్తం పక్కన శవాలు కనపడ్డాయి. గాజుగుడ్ల శవాలు – చేష్ట వికృతీలేని శవాలు కనపడ్డాయి. శవాల పక్క తన ‘భావం’ కనపడింది. జిన్నా ఉలిక్కిపడ్డాడు. జిన్నా తన కోటుగుండీలు సరిచేసుకున్నాడు. ఉలిక్కిపడిన జిన్నాలో రక్తం చల్లబడింది

అనేకమంది రక్తం అది. అనేకులు తమకి తెలియకుండానే చచ్చిపోయారు. చచ్చిపోతామనుకోకుండా చచ్చిపోయారు చంపబడ్డారు. పిల్లలూ తల్లులూ వృద్ధులూ.

1946 ఆగస్టు 16 న ముస్లిం లీగ్ Direct Action day కి పిలుపు నిచ్చింది – తమకు కావలిసింది భారత విభజన లేదా భారత వినాశనం. (“we shall have either a divided India or a destroyed India”) అని జిన్నా ప్రకటించాడు. తర్వాత కలకత్తాలో మొదలై దేశ వ్యాప్తంగా జరిగిన హత్యాకాండ కనీ వినీ ఎరుగనిది. అనేక నగరాల్లో రాబందుల రెక్కల చప్పుడు వినిపించింది. ఈ కథకు నేపథ్యమిదే.

ఇంకొక విషయం చెప్పి తీరాలి కథ ఒక వాతావరణం ద్వారా వ్యక్తం అవుతుంది. వాతావరణ కల్పన లేనిదే అక్కడ కథ లేదు. చాలామంది కథకులకు ఈ విషయం స్ఫురించక ఏదో ఒక బలహీనమైన ఊహ లేదా బలమైన ఆలోచన రాగానే గుడ్డెద్దు చేలో పడ్డట్టు కథా రచనకు ఉపక్రమిస్తారు. తిలక్ కథల్లో చక్కని వాతావరణకల్పన కనిపిస్తుంది. కథా స్థలం మలబార్ హిల్స్ లోని సువిశాలమైన జిన్నా బంగాళా అని రెండవ పేరా లోనే తెలిసిపోతుంది. అంతేకాదు 1946 లో అది రంజాన్ మాసం (జులై 30 – ఆగస్టు 27 ), జిన్నా దర్శనార్థం మహమ్మదీయులందరూ వచ్చారు అన్న వివరాలు తెలుస్తాయి. పవిత్రమైన రంజాన్ మాసంలో కరడు కట్టిన తీవ్రవాదులు సైతం కాల్పుల విరమణ (cease fire ) ప్రకటించడం మనకు తెలుసు. కానీ, ముస్లిం లీగ్ “Direct Action Day” కి పిలుపునిచ్చింది వారికి పవిత్రమైన రంజాన్ మాసంలోనే అని మరచిపోరాదు. నీతి నియమాలు, జాలీ దయా, మంచీ మానవత్వం ఆత్మవ్యామోహ ప్రవృత్తి గలవారిలో ఉంటాయనుకోవడం ఘోరమైన తప్పిదం. అనేకులు ప్రశ్నించారు.

“నీ భావం మిమ్మల్ని ఎక్కడకు తీసుకువెళ్ళింది? తీసుకు వెళుతుంది? ఈ రక్తపాతానికీ నీభావానికీ సంబంధం ఏమిటి?అమాయకంగా సుఖంగా వెళ్ళే మా కుటుంబాలలో ఈ హఠాత్ మృత్యువూ భయమూ ఎన్నాళ్ళని భరించం?”


జిన్నా అద్దం ముందు నుంచున్నాడు. జిన్నా కోటు గుండీలు విప్పుకుంటున్నాడు. అద్దంలో మరొహ జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా ఇదివరకటిలాగే గొప్పవాడు. చాలా గొప్పవాడు. అద్దంలో జిన్నా అందరిలోనూజిన్నా! కోటు విప్పుకుని చొక్కా విప్పుకున్నాడు. జిన్నా ఉలిక్కిపడ్డాడు. అద్దంలో జిన్నా గుండె మీద రక్తపు మరక కనపడింది

ఆత్మ వ్యామోహ పీడితులు దోషారోపణ చేయడంలో, కుట్రలు కుతంత్రాలు చేయడంలో ముందుంటారు కానీ, ఆత్మ విమర్శ చేసుకోలేరు. వాస్తవ పరిస్థితులను గ్రహించలేరు, ఇతరుల సుఖదుఃఖాల్లో పాలు పంచుకోలేరు. ఎంత సేపు తాము గొప్ప గా కనిపిస్తే చాలు. తమను అందరూ ప్రత్యేకంగా మన్నిస్తే చాలు, చావులు, హత్యలూ ఇవన్నీపెద్ద విషయాలు కాదు, వారి దృష్టిలో-

“ఆయా” అని పిలిచాడు.

“నా గుండె మీద ఈ రక్తం ఏమిటి” అన్నాడు.

“నాకు ఏం కనపడటం లేదు” అంది ఆయా.

ఆ రక్తపు మరక ఇలా అంది, “నీ భావం అబద్ధం, నీ భావం అనవసరం”.

ఆత్మ వ్యామోహి విమర్శను క్షణకాలం కూడా తట్టుకోలేడు. అబద్దాలతో కట్టిన తన కోట పేక మేడలా కూలి పోవడాన్ని జీర్ణించుకోలేడు.

ఆ రక్తపు మరకను చూశాడు. తిరిగి జిన్నా కళ్ళు మూసుకున్నాడు.

అతని మనస్సుకి అతని మనస్సు కనపడింది. ఆ మనస్సులో ఉన్న పరమాణువుతో ఇలా అన్నాడు.

“ఆ భావం నాకు వద్దు. ఆ భావం అనేకమందిని కలిపింది. తిరిగి అనేకమందిని చంపింది. ఆ భావం అబద్ధం. కృత్రిమం. నిజమైనా నాకు వద్దు. నేను అందరితోనూ నిజం చెప్పేస్తాను. నాకు అలసట కలుగుతోంది. ఇంక నాకు శాంతి కావాలి” ఆ పరమాణువు కోపగించింది. “అహం’ ఎదురు తిరిగింది. మనస్సు అంతా భరింపరాని కాంతితో నిండిపోయింది జిన్నా కళ్ళు తెరిచాడు

సూక్ష్మాతి సూక్షమైన ఈ అహం మూలాల్లోనే ఉంది కీలకం, పరమాణువు విధ్వంసకర ఆత్మవ్యామోహ ప్రవృత్తికి ప్రతీక. ‘తన స్వార్థం గొప్పది. తన స్వార్థం పవిత్రమైనది తన స్వార్థం లేనిదే తాను ఏమీ కాడు’. ఇదీ ధోరణి.

ఈ మనోవికారాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని Self Psychology అనే పిలుస్తారు అందరిలో Self అనగా ఆత్మ ప్రత్యయం చిన్న వయసులోనే ఏర్పడుతుంది. కొందరిలో పలు కారణాల ఏర్పడదు. దాని వల్ల సహానుభూతి లోపించి ఇతరులతో ఆత్మీయ సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఆ ఖాళీని భర్తీ చేసుకోవడానికి పడరాని పాట్లు పడతారు – వీరిలో పటాటోపం, అధికార దాహం, ఇతరుల మెప్పుకై ఆరాటం, పర నింద, కల్లాకపటం, ఎక్కడలేని దాపరికం, ఇలా అనేక దుర్గుణాలు కనిపిస్తాయి, సంతృప్తి అన్నది ఎన్నటికీ కలగదు.

సంతృప్తి లేని ధీమాతో, ఇలా అన్నాడు: “నా భావం నశించదు. నా భావాన్ని రథంలా పరుగెత్తించండి.” రథం పరుగెత్తింది. పదికోట్లమంది మహమ్మదీయుల మనస్సుల్లో తన భావం విద్యుత్తులా మెరిసింది. వానలా కురిసింది. కొండగుహలా ప్రతిధ్వనించింది. తానొక ప్రాణి కాదు. చిత్రం కాదు. విచిత్రం కాదు. ఒక మనస్సు.

ఏది ఏమయినా ఆత్మ వ్యామోహప్రవృత్తి గలవాడు ఎంత సేపూ అలా అద్దం వైపు చూస్తూ ఉండవలసిందే. తన గొప్ప తనకు ప్రధానం. ప్రపంచం ఏమై పోయినా వారికి పట్టదు. వారి పంతం నెగ్గితే చాలు.

“ఆయా” అన్నాడు జిన్నా.

“ఈ రక్తపు మరకను చెరిపెయ్యి” అన్నాడు

“అది చెరగదు ప్రభూ” అంది ఆయా

జిన్నా ఉలిక్కిపడ్డాడు. “చెరగదా?” అని తిరిగి ప్రశ్నించాడు.

తొందరగా కోటు తొడుక్కున్నాడు. కోటు గుండీలు పెట్టుకున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా చాలా గొప్పవాడు. అంతకన్నా గొప్పవాడు. జిన్నా వెనక పదికోట్లమంది మహమ్మదీయులు. ఇరవైకోట్ల కళ్ళల్లో!


మూలాలు:

  1. దేవరకొండ బాలగంగాధరతిలక్, అద్దంలో జిన్నా (తిలక్ కథలు)
  2. వేలూరి వేంకటేశ్వర రావు, కథ నచ్చిన కారణం: అద్దంలో జిన్నా
  3. Ahmad, I. (2017). Jinnah: His successes, failures and role in history. New Delhi: Penguin India.
  4. Dhulipala, V. (2015). Creating a new Medina: State power, Islam, and the quest for Pakistan in late colonial North India. Cambridge: Cambridge University Press.
  5. Jalal, A. (1985). The sole spokesman: Jinnah, the Muslim League and the demand for Pakistan. Cambridge: Cambridge University Press.
  6. Kernberg, O. F. (1975). Borderline conditions and pathological narcissism. New York: Jason Aronson.
  7. Kohut, H. (1971). The analysis of the self: A systematic approach to the psychoanalytic treatment of narcissistic personality disorders. New York: International Universities Press.
  8. Singh, A. I. (1990). The origins of the partition of India, 1936–1947. New Delhi: Oxford University Press.
  9. Wolpert, S. (1984). Jinnah of Pakistan. New York: Oxford University Press.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:

తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.

 ...