నేను మొత్తం పదమూడు సంవత్సరాలు హోటల్ పని చేస్తూ జీవితాన్ని గడిపాను. పదేళ్ళ పసివాడిగా ఆ వృత్తిలో ప్రవేశించి, ఇరవైమూడేళ్ళ యువకుడినయ్యాక ఆ బండచాకిరీ నుండి విముక్తిని పొందాను! ఈ పదమూడు సంవత్సరాల్లో ఎన్నో బాధలుపడ్డాను. విపరీతమైన చాకిరీ చేస్తూ కూడా పస్తులు పడుకున్నాను, అవమానాలకు గురి అయ్యాను.
యుద్ధపు సమయంలో గడియారాల్లో సమయాన్ని ఒక గంట ముందుకు తిప్పారు. అలా ముందుకు తిప్పబడ్డ సమయం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి, చాకిరీకి నడుం వంచి, ఐదు గంటల వరకూ పనిచేశాక – అప్పుడు రెంటికి పోవడానికి కొద్ది అవకాశాన్నిచ్చేవారు. అప్పటికి చచ్చే బడలిక, అలసట, నిద్రమత్తు ఆవహించేవి నన్ను! నేరుగా మూడు కాలవలకు దొడ్డికి వెళ్ళినవాణ్ణి పాతవంతెన మీద ఆపళంగా పడి నిద్రపోయేవాడిని! మూడు కాలవల్లో మధ్యకాలువ వంతెన కొంచెం వెడల్పుగా వుంటుంది. మనిషి అటూ ఇటూ పొర్లకపోతే దాని మీద పడుకోవచ్చును. ఐతే, నిద్రలో ఇటు దొర్లితే రోడ్డుమీదకు పడతాను, ఏ గుర్రబ్బండో, రిక్షానో మీదగా వెళ్ళిపోయే ప్రమాదం వుంది. ఇంక అటు దొర్లితే నేరుగా కాలువలోనే పడిపోతాను. ఐనా, నిద్రలేమిని భరించలేక సంవత్సరాల తరబడి అలా ఆ వంతెన మీద పడి నిద్రపోయాను.
ఆ రోజుల్లోని నా గొప్పకోరిక, పొద్దున్నే స్థిమితంగా నిద్రలేచి, ప్రశాంతంగా ముఖం కడుక్కునేంత స్వాతంత్ర్యాన్ని పొందగలగడం!
నాకూ, ప్రకాశానికీ, నటరాజన్‌కూ, విజయకుమార్కూ, రామచంద్రరావుకూ ఎవరూ పనులు ఇచ్చేవారు కాదు. కమ్యూనిస్టులం, ఎప్పుడూ పుస్తకం పట్టుకు కూచుంటాము. ఇది మాలో వున్న గొప్పలోపం! అంతటి ప్రతికూల పరిస్థితుల్లో, కమ్యూనిస్టు పార్టీ సహకారంతో హోటల్ వర్కర్స్ సంఘం పెట్టడానికి ప్రయత్నించాము.
ప్రకాశం బ్రతికి వుండగా జరిగిన విషయం, హోటల్ వర్కర్స్ యూనియన్ని స్థాపించడం కోసం ఆంధ్రరత్న లైబ్రరీలో సభనొకదాన్ని ఏర్పాటు చేశాం! ఓ యాభై మంది వరకూ వర్కర్లు వచ్చారు. అందులో పాల్గొన్నవారిలో తమిళులూ, మళయాళీ వర్కర్లు కూడా వున్నారు. ఒకరిద్దరు మాట్లాడాక ప్రకాశం మాట్లాడడానికి లేచాడు. ఓ పావుగంట మాట్లాడాడో లేదో కూర్చున్నవాళ్ళల్లో, గంద్రగోళం బైల్దేరింది. గోలగా అరుచుకుంటూ అందరూ లేచి వెళ్ళిపోయారు. ఆ సభకు మా గురువుగారు కూడా వచ్చారు.
వారు వెడుతూ నాతో ఇలా అన్నారు:
“మీ అన్న ప్రకాశరావు చాలా మంచివాడు. నాలుగు భాషలు చదువుకున్నాడు. ఐనా, కమ్యూనిస్టు పార్టీలో చేరాడయ్యా; అదే అతడు చేసిన తప్పు!”
హోటల్ వర్కరుగా ఎన్నో బాధలు పడ్డాను. ఐనా, ఆ జీవితాన్ని నేనెన్నడూ ద్వేషించలేదు! హోటల్ వృత్తి నీచమైందని నేనెన్నడూ అనుకోలేదు! నా జీవితంలోని ఆ పదమూడు సంవత్సరాలు నాకు ఈనాటికీ గర్వకారణమై, జీవితంలో ఎన్నటికీ మరువరాని, మరువలేనివి. ఎస్. నటరాజన్ ఆ వృత్తిలోనే నాకు పరిచయం అయ్యాడు. సహాధ్యాయిని మిత్రురాలు రాఘవమ్మ, ఆ వృత్తిలోనే నాకు పరిచయం అయింది. ఎన్నో మంచికథల్ని రాశానారోజుల్లోనే – ధనస్వామ్యం, నిజమైన దొంగలు, సాలెగూడు, రాజకీయ బాధితుడు లాంటి మంచి కథల్ని ఆ వృత్తిలో వుండగానే రాశాను. వివిధ రకాలైన ప్రజల్ని, వారి ప్రవర్తనల్ని అతి దగ్గరగా చూడగల అవకాశం హోటల్ వృత్తి నాకు ప్రసాదించింది. తన రక్తపు బిగిమీద ఆధారపడి బ్రతకడం కంటే గౌరవనీయమైంది మరోటిలేదని హోటల్ పనే నాకు చెప్పింది. కులమూ, మతమూ, దేవుడూ దయ్యం (దైవానికి అపభ్రంశరూపం దయ్యం) ఏమీలేవు. అంతా హంబక్! మనిషి ముఖ్యం అన్న జ్ఞానాన్నిచ్చింది ఆ జీవితమే! ఆదెమ్మ, పేరమ్మ, సరస్వతి లాంటి ఈ వ్యవస్థ మలచిన వ్యభిచారిణుల పరిచయమూ అప్పుడే లభించింది. కృష్ణవేణి లాంటి కుటిలవర్తని ఐన స్త్రీ పరిచయం అప్పుడే కలిగింది!
ఏమైనా కానీ, ఆ వృత్తిలో నాకు పరిచయం అయినవాళ్ళందరూ నిఖార్సయిన మానవులు. వాళ్ళల్లో నీచత్వం వుంది, అశ్లీలత వుంది, క్రౌర్యం, వెకిలితనం వుంది. ఐతేయేం, నిండుకుండలాంటి పరిపూర్ణమైన మానవత్వమూ వుంది వాళ్ళల్లో! కుటుంబరావు, జొన్నలగడ్డ, ప్రకాశరావు, మాగంటి కృష్ణమూర్తి, కొమ్మరాజు కృష్ణమూర్తి, నత్తి కృష్ణమూర్తి, కృష్ణయ్యర్, విజయకుమార్, నటరాజన్, ప్రకాశం – వీరందరూ ఆనాటి నా గురువులు. వీరిపట్ల ఆదరభావం ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా వుంది నాలో! ఆ జీవితం సాహసోపేతమైనది. తెగింపు కలది. తోటి వర్కర్ల పట్లా, మానవుల పట్లా మమత్వాన్ని ఏర్పరచగలది.
1945వ సంవత్సరం అనుకుంటాను. వంక మామిడి వెంకట్రామయ్య హోటలు ‘ఆంధ్రరత్న భవన్’లో పని చేస్తున్నాను. ఈ హోటలు గాంధీ చౌక్‌లో బొంతా విశ్వనాథం హోటల్ పక్కనుండేది. ఇప్పుడు దాన్లో స్టేట్ బ్యాంక్ వుంది.
ఆ రోజు మేడే! “నేను ఇవ్వాళ పనిలోకి రాను!” అన్నాను యజమాని వెంకట్రామయ్యతో.
“ఎందువల్ల?” అడిగాడు యజమాని.
“ఇవాళ మేడే!”
“అంటే?”
“అమెరికాలో, చికాగో నగరంలో కార్మికులు తమ ప్రాణాలనొడ్డి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు. ఆ సందర్భంగా మేమివ్వాళ ఊరేగింపు జరుపుతాం! సభ పెట్టుకుంటాం!”
“ఐతే, ఈ రోజు నుండి నువ్వు నా హోటల్లో పనికి రానవసరం లేదు!”
యజమాని బెదిరింపుకు బెదరకుండా నేనారోజు పనికి వెళ్ళలేదు. ఊరేగింపులో పాల్గొన్నాను. సభలో పాల్గొన్నాను, ఆనాటి ఆహారం నాకు పెద్ద సమస్య. మర్నాటి నుండి అసలు ఆహారమే వుండదని తెల్సికూడా!
అంతటి తెగింపు, సాహసం, ఏమో చెయ్యాలన్న తపన, విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని ఔపోసన పట్టాలన్న తృష్ణ ఆ జీవితమే నాకు ప్రసాదించింది.
ఓ శ్రమైక జీవన సౌందర్యమా! నీకు సలామ్!
(‘గమనాగమనం’ నుండి)