ఈ కథ శబ్దరూపకం:
(పురాణం శాస్త్రిగారు బాసీపీఠం వేసుకొని తివాచీ పరిచిన ఎత్తు బల్లమీద ఆసీనులయ్యారు. ఇవాళ పోతన గారి భాగవతంలో గజేంద్రమోక్షం నుంచి తానెంపిక చేసుకున్న కొన్ని పద్యాలు, భక్తితో తనకెదురుగా కూర్చున్న పిల్లలకీ పెద్దలకీ చదివి వినిపించడానికి ఉద్యుక్తులయ్యారు. దణ్ణం పెట్టుకొని కథ మొదలు పెట్టారు.)
ఓం! నమోనారాయణ! ఓం! నమోనారాయణ! ఓం! నమోనారాయణ!
ఆ సరస్సులో తోడుగా ఉన్న ఆడ ఏనుగులతో పాటు జలకాలాటలలో సరసాలాడుతున్న ఆ గజరాజు కాలిని మొసలి ఒకటి పహెక్‌టుకొని విడవటల్లేదని, అవి రెండూ ఒకదానితో ఒకటి ఘోరంగా పోరాడుతున్నాయని ఇహెక్‌వరకే చెప్పుకున్నాము కదా! ఇప్పుడు, ఇహెక్‌ముందు జరగబోయే కథ చెప్పుకుందాం. ఇదిగో ఈ పహెక్‌ద్యం చూడండి. ఎంత అందమైన పద్యమో!
(శాస్త్రిగారు ప్రక్కన పెట్టుకున్న వెండి గ్లాసులో నీళ్ళు కాసిని తాగారు, అపరాహ్నంలో చేసిన ఫలహారాన్ని తిట్టుకుంటూ. పురాణపఠనాని కుపక్రమించారు మళ్ళీ.)
కరిఁ దిగుచు మహెక్‌కరి సరసికిఁ గరిహెక్ దరికిని మకరిఁ దిహెక్‌కుచుఁ గరకరి బెరయన్
కరికి మకరి మకహెక్‌రికిఁ గరి భరమన నిట్ల తల కుతల భహెక్‌క్కటు లదిరిపడన్
మకరితోడఁ బోహెక్‌రు మాతంగవిభుని నొహెక్‌కరుని డించిపోవఁ గాళ్ళురాక
కోరి చూచుచుండెఁ గుంజరీయూహెక్‌ధంబు మగలు తగులు గారె మహెక్‌కువలకును.
గజరాజుని ఒక్కడినీ విడిచిపోవటానికి కాహెక్‌ళు రాక, ఆడ ఏనుగులు చూస్తూ కూహెక్‌కుండి పోయాయి అని చెపుతున్నారు పోహెక్‌తన్న గారు!
అలయక సొలయక వేసట
నొలయక కరి మహెక్‌కరి తోడ నుద్దండత రా
హెక్‌త్రులు సంధ్యలు దిహెక్‌సంబులు
సలిపెన్ బోహెక్ రొక్క వేయి సంహెక్‌సరముల్.
చూశారా! గహెక్‌రాజు మొసలితో వెహెక్‌య్యి, వెయ్యి సంవత్సరాలు, పహెక్‌కలూ రాత్రీ హోరాహోరీగా హెక్‌రాడి అలిసి పోహెక్కున్నాడు.
ఏ రకంగా ఈ పాడు మొహెక్కిళ్ళతో దెబ్బలాడగలను? నా మొహెక్ఆలించే పుణ్యాత్ములేహెక్‌రీ? ఎహెక్‌కడున్నారు? ఏదేహెక్‌డిని ప్రార్థించను?
(పుణ్యాత్ముడొకాయన శాస్త్రిగారికి ఒక కోకాకోలా సీసా తెచ్చిపెట్టాడు. ఆయన చిరునవ్వుతో దీవిస్తున్నట్టు కుడిచెయ్యి ఎత్తి, మళ్ళీ చెప్పటం మొదలుపెట్టారు.)
అలా గహెక్కేంద్రుడు వెహెక్‌కేడుకుంటున్నాడు. ఈ పద్యం హెక్ మనపిల్లలందరికీ బళ్ళల్లో నేర్పిన పహెక్‌ద్యం. వినండి.
ఎవ్వనిహెక్‌చే జనించు జగ హెక్‌కని లోపల నుండు లీనమై
హెక్‌కనియందు డిందుఁ బరహెక్‌కరుఁ డెవ్వఁడు మూలహెక్‌కణం
బెవ్వఁ డనాది మధ్య లయుఁ హెక్కడు సర్వముఁ దానైన వాఁ
హెక్‌కడు వాని నాత్మహెక్ భవు నీశ్వరు నే శరణంబు హెక్‌డెదన్
కలఁడందురు దీనులహెక్ యెడఁ
గలఁడందు హెక్‌రు పరమయోగి గణములపాలం
హెక్‌డందు రన్ని దిశలను
హెక్‌డు గలండనెడువాఁడు హెక్‌డో లేఁడో.
చూశారా? ఎవడో హెక్‌కడో ఉన్నాడంటారు? అసలు ఆ రక్షకుడు హెక్‌డా? హెక్‌డా?
(శాస్త్రిగారు పురాణం ఆపి కోలా కొంత గొంతులో ఎత్తి పోసుకున్నారు. బలంగా ఊపిరి తీసుకున్నారు.)
లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యెఁ, బ్రాణంబులున్
ఠావుల్ హెక్‌కెను, మూర్ఛ వచ్చెఁ, దనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్,
నీవే తప్ప నితః హెక్‌కం బెఱుఁగ, మన్నింపందగున్ దీనునిన్,
హెక్‌కే యీశ్వర! కావవే వరద! సంరక్షించు హెక్‌రాత్మకా!
అని మొరపెట్టుకుంటున్నాడు ఆ గజరాజు. వీడి మొర హెక్ ఆ వైకుంఠపుర వాసి విన్నాడు. ఆపద హెక్‌కుల వాడని ఊరికే అన్నారా!
(ఈ వెక్కిళ్ళు ఆగేట్టుగా కనిపించడం లేదు. శాస్త్రిగారు ఇక పురాణం ఆపడానికి నిశ్చయించుకున్నారు. ఆయన మొర ఆ హరి ఆలకించినట్టు లేడు.)
హెక్! నమో నారాయణ! ఆ తరువాత పోతన రెండు హెక్‌కని పద్యాల్లో – అల వైకుంఠ పురంబులో పహెక్‌ళించి వున్న ఆ మహెక్‌విష్ణువు ఎలా హెక్ ఈ గహెక్‌కేంద్రుని మొరాలకించి, సిరికిం చెప్పక, శంఖ హెక్‌రములు చేతులలో ధహెక్‌కింపక, ఆ హెక్‌మీదేవి కొంగు వదలకండానే తన భహెక్‌డైన ఆ ఏనుగుని రక్షించడానికి బహెక్‌దేరాడో హెక్‌తాడు. అవి వచ్చే వారం హెక్‌తాను.
ఈవాల్టికి ఈ పురాణ హెక్‌రాయణం ఇక్కడితో ఆపుదాం. హెక్!
(మిగతా కోలా గొంతులో పోసుకుని త్రేణ్చారు శాస్త్రిగారు.)
[ప్రఖ్యాత అమెరికన్ రచయిత లిడియా డేవిస్ (Lydia Davis) 2001లో ప్రచురించిన Oral History (with Hiccups) అన్న చిన్న కథ ఈ పై రచనకి ప్రేరణ.]