అనగనగా… ఒక రోజు, దేవలోకం అంతా చాలా హడావిడిగా ఉంది. కలియుగం ప్రవేశించి అయిదువేల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంద్రుడు గొప్ప విందొకటి ఏర్పాటు చేశాడు. ఆ విందుకి, సరిగ్గా కలియుగం ప్రవేశించే ముందు జరిగిన మహాభారతయుద్ధంలో పాల్గొన్న వీరులందరినీ ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. దేవేంద్రుని విందంటే ఆషామాషీ వ్యవహారమా! బ్రహ్మగారు సైతం వర్ణించలేనంత బ్రహ్మండమైన ఏర్పాట్లు జరిగిపోయాయి. ముల్లోకాలలో పేరుమోసిన వంటవారిని రప్పించి విందుకు నియోగించారు.
వచ్చే అతిథులు అసమాన ధీరులైన కురువీరులు. అంతే కాదు, వారికంటూ ప్రత్యేకమైన రుచులు కూడా ఉన్నాయి. అందువల్ల పాకశాసనుడు పాకశాలాధిపతిని పిలిపించి పాండవకౌరవాదులలో ఎవరెవరికి ఏయే వంటకాలు వడ్డించాలో ఎవరికేది వడ్డించకూడదో చాలా వివరంగా చెప్పాడు. ఏమైనా తేడాలు వస్తే నరకానికి పంపేస్తానని హెచ్చరించాడు కూడా. అన్నీ జాగ్రత్తగా విన్న వంటపెద్దకి బెంగ పట్టుకుంది. ఇంద్రుడు చెప్పిన వివరాలన్నీ గుర్తుపెట్టుకొనడం ఎలా? ఏమాత్రం పొల్లుపోకుండా తన క్రింది వారందరికీ ఆ వివరాలన్నీ చెప్పగలడా? వారందరూ కూడా సరిగ్గా గుర్తుపెట్టుకుంటారని ఏమిటి నమ్మకం? విందుకి ఇంకా వారం రోజులు ఉంది. ఈలోపు ఎవ్వరయినా ఏ చిన్న విషయమైనా మరిచిపోయి తేడా వచ్చిందంటే, తనతోపాటు తనవారందరూ నరకానికి బదిలీ అయిపోతారు! ఏం చెయ్యాలో తోచక, ఆఖరికి తరుణోపాయం చెప్పమని వెళ్ళి బృహస్పతిని అర్థించాడు.
“నాయనా! ఈ వ్యవహారం కొంచెం క్లిష్టంగానే ఉంది. దీనికి పరిష్కారం చూపగలిగేవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతనే పాణిని. ఐరావతంలాంటి అమరభాషను సూత్రబద్ధం చేసిన మహామహుడతను. అతని కొరకు వెదుకు. ఇంద్రుడు చెప్పిన వివరాలన్నీ ఆయనకు తెలుసు. ఆయనను ప్రార్థించు, పరిష్కారం దొరుకుతుంది.”
బృహస్పతి సలహా మేరకు పాణిని గురించి వెతకనారంభించాడు వంటపెద్ద. అల అమరావతీ పురంబులో నగరిలో ఆ నందనవనంబులో, ఒక మూలన కూర్చొని, జరుగుతున్న హడావిడిని పట్టించుకోకుండా ధ్యానంలో మునిగి ఉన్న పాణినిని సులభంగానే పట్టుకున్నాడు. తన మొరనాలకించి కావుమని అర్థించాడు. అంతా విన్న పాణిని చిద్విలాసంగా ఒక చిరునవ్వు నవ్వి, ‘ఇంతేనా’ అంటూ, ఒక పాతిక పైచిలుకు చిన్న చిన్న వాక్యాలు అతని చెవిలో ఊది, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. పాణిని చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకోడానికి సులువుగానే ఉన్నాయి కానీ ఒకదానికీ మరొకదానికీ పొంతన లేదు. వంటపెద్ద పెద్ద అయోమయంలో పడిపోయాడు!
“వీటిని ఏం చేయాలి స్వామీ?” బెరుకుతో అడిగాడు చిన్నగా.
“మీ వాళ్ళందరికీ చెప్పి కంఠతా పట్టమను. ఎవరికేం వడ్డించాలో తెలిసిపోతుంది.” కళ్ళు మూసుకొనే బదులిచ్చాడు పాణిని.
“ఇది నాకే ఒక్కముక్క అర్థంకాలేదు. మా వాళ్ళకేం తెలుస్తుంది స్వామీ!” వంటపెద్ద వాపోయినా తిరిగి మాట్లాడలేదు పాణిని. ఆయన పని అయిపోయిందన్నట్లు ధ్యానంలో మునిగిపోయాడు. ఏంచేయాలో తెలియక బుర్ర గోక్కుంటూ పాణిని చెప్పిన వాక్యాలను వల్లెవేసుకొంటూ తిరుగుదారి పట్టాడు వంటపెద్ద.
1. విందు రాత్రి భోజనం
2. లడ్డూలు, అరిసెలు తీపి
3. బూరెలూ
4. పంచామృతం కాదు
5. పళ్ళు కూడా
6. కారప్పూస, జంతికలు, చేగోడీలు కారం
7. విందులో
8. ఇంకా నైవేద్యాలలో
9. పాండవులకు తీపి వడ్డించాలి
10. భీమునికి లడ్డూలు
11. నకులునికీ
12. అర్జునుడికి అరిసెలు వద్దు
13. ఇతరులకు ఏవైనా
14. అడిగిన కౌరవులకూ
15. ధృతరాష్ట్రునికి తప్ప
16. పళ్ళు మాత్రమే
17. కృష్ణుడికి నైవేద్యంలో
18. అన్నీ
19. పంచామృతం
20. ఇతరులకు వద్దు
21. అశ్వత్థామకు ఇవ్వొచ్చు
22. సాత్యకికి ఎప్పుడూ
23. కారానికీ అంతే
24. పాండవులకు తప్ప
25. కోరినవి
26. దుర్యోధనుడికి గోంగూర
అలా వల్లెవేసుకొంటూ వెళుతున్న వంటపెద్దకు అల్లంత దూరంలో తననే చూస్తున్న మరో ముని కన్పించాడు. ఆయనను అడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని అనుకొంటూ అటు వెళ్ళాడు.
“హుఁ, అంతా విన్నాను. పాణిని ఏం చెప్పాడు నీకు?” ప్రశ్నించాడాయన.
“అసలే నేను ఇంద్రుడు చెప్పిన వివరాలు ఎలా గుర్తుపెట్టుకోవడం అని కంగారుపడుతూ ఉంటే, ఆయన మరింత కలగాపులగం చేసేశారు! తమరెవరో గొప్పవారిలాగున్నారు. కాస్త ఆయన చెప్పిన వాక్యాలని నాకర్థమయ్యేలా చెప్పండి స్వామీ!”
పాణిని చెప్పిన పొట్టి వాక్యాలన్నిటినీ యథాతథంగా విన్నవించాడు వంటపెద్ద. దాన్ని రెండుమార్లు విని దీర్ఘంగా నిశ్వసించాడా మునిసత్తముడు.
“అనుకున్నాను. ఇలా చెపితే అయోమయం కాక మరేమవుతుంది! ఈ కాత్యాయనునికే అర్థం చేసుకోవడానికి రెండుసార్లు వినవలసి వచ్చింది. ఉండు, నీకర్థమయ్యేలా నేను మారుస్తాను.”
పాణిని చెప్పిన వాక్యాల మధ్యలో మరికొన్ని వాక్యాలు చేర్చి చెప్పాడు కాత్యాయన మహర్షి.
1. విందు రాత్రి భోజనం
2. లడ్డూలు, అరిసెలు తీపి
3. బూరెలూ
వా. బూరెలను కలిపే చెప్పి ఉండవచ్చు.
4. పంచామృతం కాదు
వా. కలిపినా దోషం లేదు.
5. పళ్ళు కూడా
6. కారప్పూస, జంతికలు, చేగోడీలు కారం
7. విందులో
8. ఇంకా నైవేద్యాలలో
9. పాండవులకు తీపి వడ్డించాలి
10. భీమునికి లడ్డూలు
11. నకులునికీ
12. అర్జునుడికి అరిసెలు వద్దు
13. ఇతరులకు ఏవైనా
14. అడిగిన కౌరవులకూ
15. ధృతరాష్ట్రునికి తప్ప
వా. ధృతరాష్ట్ర భీష్మ ద్రోణ విదుర కృపులకూ అని చెప్పిఉండాలి.
16. పళ్ళు మాత్రమే
17. కృష్ణుడికి నైవేద్యంలో
వా. విందులో కూడా అని చెప్పవలసింది.
వా. బలరామకృష్ణులకు అనాలి.
18. అన్నీ
19. పంచామృతం
వా. పళ్ళు కూడా అని చెప్పాలి.
20. ఇతరులకు వద్దు
21. అశ్వత్థామకు ఇవ్వొచ్చు
వా. కౌరవులతో ఉన్నప్పుడే.
22. సాత్యకికి ఎప్పుడూ
23. కారానికీ అంతే
24. పాండవులకు తప్ప
25. కోరినవి
26. దుర్యోధనుడికి గోంగూర
“ఇదేమిటి స్వామీ! ఇందాకటికంటే గందరగోళంగా ఉంది. ఆ మునిగారు చెప్పినవాటికి మీరు ఇంకొన్ని చేర్చి చెప్పారు తప్ప వాటి అర్థమేమిటో చెప్పనే లేదు!” మరింత అయోమయంలో పడిపోతూ బావురుమన్నాడు వంటపెద్ద.
“మూర్ఖుడా! పాణిని చెప్పింది సూత్రాలు. నేను చెప్పింది వార్తికం!” గర్జించాడు కాత్యాయనుడు.
“ఏ రోలైతేనేంలెండి వేళ్ళు నలగ్గొట్టుకోడానికి. అర్థం కానిదాని పేరు ఏదైనా ఒకటే. ఇప్పుడు దీన్నేం చేయాలో, మావారికి ఎలా వివరించాలో మాత్రం చెప్పండి.” అర్థించాడు పాకశాలాధిపతి. ఇంక చెప్పవలసిందేమీ లేనట్లు అటు తిరిగి కూర్చున్నాడు కాత్యాయనుడు. నిస్సహాయంగా చూసి వెనుతిరిగిన వంటపెద్ద అలా నిరాశగా వనంలో నడిచిపోతుండగా ఒక పిలుపు వినిపించింది.
“ఏమయ్యా! ఎవరయ్యా నువ్వు? ఎందుకంత దిగులుగా ఉన్నావు?”
అటు చూసిన వంటపెద్దకి మహాతేజశ్శాలియైన ఒక పురుషుడు కనిపించాడు. అమ్మో! మరో మునీంద్రుడా, వద్దులే! అనుకొన్నా, ఆ తేజశ్శాలిని చూసి ఏదో కొత్త ఆశ చిగురెత్తింది. ‘ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో. ఒకసారి ప్రయత్నిద్దాం,’ అనుకొన్నాడు స్వగతంగా.
“పాము కాదు. ఆదిశేషుడే దొరికాడనుకో. నీ సమస్య ఏమిటో చెప్పు నాయనా!” అన్నాడా మహాపురుషుడు చిరునవ్వుతో.
“నా మనసులో మాట కనిపెట్టేశారంటే తమరు సామాన్యులు కారు. ఎవరు స్వామీ తమరు?” భక్తితో అంజలించి అడిగాడు వంటలయ్య.
“నేను పతంజలిని. పాణిని వ్యాకరణానికి మహాభాష్యం వ్రాసినవాడను. నీ సమస్య ఏమిటో విన్నవించుకో. నేనేమైనా సహాయపడగలనేమో చూస్తాను.”
పాణిని పేరు వినగానే వంటపెద్ద ముఖం ప్రకాశించింది. “అవునండీ. ఆయనేనండీ నా సమస్య. బృహస్పతి మాట విని ఆయన సాయం కోరి వెళ్ళాను. ఆయనేవో చాలా క్లుప్తంగా చెప్పి ఊరుకున్నాడు. అవే బోధపడకుండా ఉన్నాయంటే, ఇంకో ఆయన వాటికి మరికొన్ని వాక్యాలు చేర్చారు. అంతా అయోమయం అయిపోయింది. విందులో ఎలా నెట్టుకురావాలో బొత్తిగా తెలియడం లేదండీ…” అంటూ తన గోడు వెళ్ళబోసుకొన్నాడు.
“ఓహో, వరరుచిని కూడా కలిశావన్న మాట,” అన్నాడు పతంజలి ప్రసన్నంగా.
“కాదు స్వామీ. ఆ రెండో ఆయన పేరు ఇంకేదో… ఆఁ, గుర్తొచ్చింది. కాత్యాయనుడు, కాత్యాయనుడు!”
“వరరుచి కూడా ఆయన పేరేలేవయ్యా. ఇంతకీ ఆయన ఏం చెప్పారు?”
పాణిని చెప్పిన వాక్యాలు, వాటికి వరరుచి చేర్చిన వార్తికాలు గడగడమని ఒప్పజెప్పాడు వంటపెద్ద. పతంజలి దాన్ని ఒళ్ళంతా చెవులై విన్నాడు.
“అర్థమయింది. విందులో మీ వాళ్ళు చేయవలసిన అతిథి మర్యాదలను సూత్రప్రాయంగా చెప్పారన్న మాట!”
“ఏం సూత్రమో, ఒక్క ముక్క బోధపడలేదు నాకు. ఈ మాటలని అనుసరించి ఇంద్రుడు చెప్పిన విధంగా అతిథి మర్యాదలు ఎలా చేయాలో నాకు అర్థంకావడంలేదు.”
“కంగారుపడకు. సూత్రాలు అలాగే ఉంటాయి. నేను వివరంగా నీకు అర్థమయ్యేలా చెబుతాను. అలా కూర్చో.”
ఆ ఆశ్వాసంతో కొండంత ధైర్యం వచ్చేసింది పాకశాలాధిపతికి. నింపాదిగా పతంజలి ఎదుట కూర్చొన్నాడు.
“చెప్పాల్సిందేదో సూటిగా చెప్పకుండా ఈ సూత్రాల గొడవేమిటి స్వామీ. ఇంతకీ ఇవి సూత్రాలని మీకెలా తెలిశాయి?”
“సూత్ర లక్షణాలను బట్టి.”
మహాభాష్యకారుడు గొంతు సవరించుకున్నాడు.
“అల్పాక్షరమసందిగ్ధం, సారవద్విశ్వతోముఖం
అస్తోభమనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుఃసూత్రానికి ఆరు లక్షణాలుండాలి:
అల్పాక్షరం – క్లుప్తంగా ఉండాలి
అసందిగ్దం – అందులో ఏమీ సందేహించడానికి లేకుండా స్పష్టంగా ఉండాలి
సారవత్ – అర్థవంతంగా, సమగ్రంగా ఉండాలి
విశ్వతోముఖం – అందరికీ, అన్ని చోట్లా వర్తించేదిగా ఉండాలి
అస్తోభం – నిరర్థకమైన శబ్దాలు లేకుండా ఉండాలి
అనవద్యం – దోషాలు లేకుండా ఉండాలిఈ ఆరు లక్షణాలు ఉన్న దానిని సూత్రమని సూత్రం గురించి తెలిసిన జ్ఞానులంటారు.”
శ్రద్ధగా విన్నాడు పాకశాలాధిపతి. “ఇంత విషయం ఉందన్న మాట ఆయన మాటల్లో. మరి ఆ కాత్యాయనుడు, సవరింపులని మరి కొన్ని సూత్రాలు చెప్పారే!”
“అవి సూత్రాల్లాంటివే కానీ సూత్రాలు కావు నాయనా. అవి వ్యాఖ్యలు. వార్తికాలంటారు వాటిని.”
“అవును స్వామీ, గుర్తొచ్చింది. వార్తికాలనే అన్నాడాయన. మరి వార్తికం అంటే ఏమిటో?”
వంటపెద్ద ఆసక్తికి మెచ్చుకోలు చూపు ఒకటి సారించి వివరణ కొనసాగించాడు పతంజలి.
“ఉక్తానుక్త దురుక్తానాం చింతాయత్ర ప్రవర్తతే
తం గ్రంథం వార్తికం ప్రాహుర్వార్తికజ్ఞాః విచక్షణాఃఅంటే సూత్రంలో – చెప్పవలసిన అవసరం లేకున్నా చెప్పబడిందీ, చెప్పవలసి ఉండీ చెప్పనిదీ, తప్పుగా చెప్పబడినదీ – ఈ మూడు విషయాలను గురించిన విచారం ఎక్కడ ఉంటుందో దాన్ని వార్తికం అంటారు.”
“అబ్బో! ఇంత వివరం ఉందన్న మాట వారి మాటల్లో. మరి సూత్రాలేమిటి ఇలా ఉన్నాయి? భీమునికి లడ్డూలంటాడు. విందు రాత్రి భోజనం అంటాడు. కారానికీ అంటాడు. రకరకాలుగా ఉన్నాయి.”
“నువ్వన్నది ఒకవిధంగా నిజమే! సూత్రాలన్నీ ఒక రకంగా ఉండవు. సూత్రాలు ఆరు రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క వివరాన్ని చెప్పడానికి ఒకొక్క రకం సూత్రం కావలసి వస్తుంది. విను – సంజ్ఞా సూత్రం, పరిభాషా సూత్రం, విధి సూత్రం, నియమ సూత్రం, అతిదేశ సూత్రం, అధికార సూత్రం అని సూత్రాలు ఆరు విధాలు…”
“అయ్యా! అయ్యా! మీకో పెద్ద నమస్కారం. ఈ సూత్రాల గొడవలన్నీ నాకెందుకులెండి. నాకు ఆయన ఏం చెప్పారో కాస్త అర్థమయ్యేలా వివరించండి చాలు!”
పతంజలి నవ్వి పాకశాలాధిపతికి అర్థమయ్యేలా సూత్ర వివరణ మొదలుపెట్టాడు.
“పాణిని చెప్పిన ఒక్కొక్క వాక్యాన్నీ ఎలా అర్థం చేసుకోవాలో చెపుతాను విను. పాండవుల వడ్డన గురించిన వాక్యం ఏది చెప్పు?”
“పాండవులకు తీపి వడ్డించాలి.” తొమ్మిదవ సూత్రాన్ని తడుముకోకుండా చెప్పాడు వంటపెద్ద.
“అంటే?”
“ఇదొక్కటి బాగా అర్థమయింది స్వామీ! పాండవులకు తీపి తినుబండారాలు వడ్డించమని.”
“తీపి తినుబండారాలు అంటే ఏవి? రసగుల్లాలు చెయ్యమని చెప్పాడా ఇంద్రుడు?”
“ఆహాఁ! లేదండోయ్. కురురాజులకి తెలుగు వంటకాలంటే ప్రత్యేకమైన ప్రీతి. వాటినే వండమని ఆదేశం.”
“ఆఁ, చూశావా మరి! కాబట్టి ఇక్కడ ‘తీపి’ అంటే ఏమిటో మనం ముందుగా నిర్వచించుకోవాలి. ఏదీ? రెండు, మూడు సూత్రాలను చెప్పు.”
“2. లడ్డూలు, అరిసెలు తీపి. 3. బూరెలూ.”
“అదీ. మీ వడ్డనకు సంబంధించి తీపి అంటే లడ్డూలు, అరిసెలు అన్న మాట.”
“మరి ‘బూరెలూ’ ఏమిటండీ?”
“అంటే బూరెలు కూడా తీపి అన్న వర్గంలోనికే వస్తాయని అర్థం.”
“ఆ మాట ఎక్కడుంది ఆయనన్న దానిలో?”
“అన్నీ ఆ సూత్రంలోనే ఉండవు. అక్కడ కనిపించని పదాలను దాని పై సూత్రంలోనుండో, క్రింది సూత్రంలోనుండో లేకపోతే మరెక్కడైనా ఉన్న సూత్రంలోనుండో తెచ్చుకొని కలిపి అర్థంచేసుకోవాలి.”
“ఇంత తిరకాసు ఎందుకు స్వామీ. బూరెలు కూడా తీపి వర్గంలోనివే అని స్పష్టంగానే చెప్పవచ్చు కదా?”
“అందుకే వరరుచి అక్కడ వార్తికం చెప్పాడు – బూరెలను కలిపే చెప్పి ఉండవచ్చు అని.”
“సరిగ్గానే చెప్పారు. వార్తికం అంటే అదన్నమాట!”
“అర్థమైందా? కాబట్టి ఇక్కడ తీపి అంటే ఒక రుచి అని కాకుండా లడ్డూలు, అరిసెలు, బూరెలకు ఒక ఉమ్మడి పేరుగా అర్థం చేసుకోవాలి. బయట ఉన్న అర్థం ఇక్కడ వర్తించదు.”
“ఓహో!” అన్నాడు వంటపెద్ద. చిక్కుముడులు కాస్త వదులవ్వడం మొదలుపెట్టాయి.
“దాన్ని డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అంటారు.” పక్కనుండి ఎవరో వెళ్ళిపోతూ ఆగి మాట్లాడారు.
“అయ్యా, తమరెవరండీ?”
“నా పేరు డెనిస్ రిచీ. కంప్యూటర్ల కోసం ఒక కొత్త భాషను కనిపెట్టాను నేను. వాటి భాష కూడా యిలా సూత్రప్రాయంగానే ఉంటుంది.”
“ఈ కంప్యూటర్లేమిటి? భాషను కనిపెట్టడమేమిటి! అసలే గందరగోళంలో ఉన్నాను. ఇంకా కంగారు పెట్టకండి. అయ్యా, మీరు దయచేయండి! స్వామీ, తమరు కానీయండి.”
పతంజలి తిరిగి తన భాష్యాన్ని మొదలుపెట్టాడు.
“ఇంతకీ ఇంద్రుడు చెప్పిన వడ్డనంతా ఎక్కడ జరుగుతుంది?”
“ఎక్కడేమిటి స్వామీ, వాళ్ళకి యిచ్చే విందులో!”
“అది సరేలేవయ్యా! విందు అంటే మధ్యాహ్న భోజనమా రాత్రి భోజనమా?”
“ఆఁ, రాత్రి భోజనం! మధ్యాహ్న భోజనం గురించి మళ్ళీ విడిగా చెపుతానన్నారు శ్రీవారు,” నాలిక కరచుకొని అన్నాడు వంటపెద్ద.
తనవైపే మందహాసంతో చూస్తున్న పతంజలితో, “ఓహో! అర్థమయింది. అందుకే ఆ పెద్దాయన తన మొదటి సూత్రంలో ‘విందు – రాత్రి భోజనం’ అని చెప్పాడు.”
“భళా! నువ్వు సూక్ష్మగ్రాహివి సుమా!” మెచ్చుకోలుగా అన్నాడు పతంజలి.
“ఆఁ, ఏదోలేండి. అంతా తమరి దయ!” సిగ్గుపడ్డాడు వంటపెద్ద.
“ఇలా ప్రత్యేకమైన పదాలను సూచించే సూత్రాలను సంజ్ఞా సూత్రాలని అంటారు. సంజ్ఞ అంటే గుర్తు.”
“మరి నాలుగు అయిదు సూత్రాలు ఏమిటి స్వామీ!”
“ఏమిటో చెప్పు?”
“నాల్గవ సూత్రం, ‘పంచామృతం కాదు.’”
“అంటే పంచామృతం తీయగానే ఉన్నా దాన్ని తీపి అన్న వర్గంలో చేర్చకూడదు అని. దీనికి కూడా కాత్యాయనుడు వార్తికం చెప్పాడు కదా – కలిపినా దోషం లేదని.”
“మరి ఏది సరైనది?”
“పాణిని అభిప్రాయంలో అది తీపి కాదు. కాత్యాయనుని అభిప్రాయం ప్రకారం కలిపినా తప్పు లేదని. పోనీ కాత్యాయనుని మతమే అంగీకరిద్దాం. అది కూడా తీపే అనుకో”.
“బాగుంది. ఇప్పుడు నాకు అర్థమవుతున్నట్లే ఉంది. ఐదవ సూత్రం – పళ్ళు కూడా, అంటే పళ్ళు కూడా తీపిలో కలుపుకోవాలన్నమాట. అంతే కదా.”
“అక్కడే పప్పులో కాలువేశావు నాయనా! పై సూత్రం ‘పంచామృతం కాదు’ లోనుండి కాదు అన్న పదాన్ని క్రిందికి తెచ్చుకో. ఎలాగైతే పంచామృతం తీపి కాదో, పళ్ళు కూడా తీపి వర్గం కాదు, అన్నమాట.”
“అబ్బా గొప్ప తిరకాసుగా ఉందండీ యీ వ్యవహారం!” ఉత్సాహం కొద్దిగా నీరుగారింది వంటపెద్దకి.
“ఇందులో తిరకాసు ఏమీ లేదు నాయనా. పళ్ళు తీపి వర్గానికి చెందేమాటయితే బూరెల పక్కనో కిందనో చెప్పి ఉండేవారు కదా!”
“ఓహో! అవును నిజమే కదా. అర్థమవుతున్నట్టే ఉంది.”
“మరికనేం! ఆరవ సూత్రం చెప్పు.”
“కారప్పూస, జంతికలు, చేగోడీలు కారం.”
“అంటే అర్థమైందా?”
“అర్థమైంది. అవన్నీ కారంగా ఉంటాయని కదూ! కాదు, కాదు. ఆ మూడు పదార్థాలనూ కారం అన్న పేరుతో పిలవాలని.”
“బాగు, బాగు. చూశావా, నీకు అర్థమైపోతున్నది. అదే సూత్రాలలోని విశేషం. ఈ ఆరవ సూత్రం వరకూ నిర్వచనాలు అయ్యాయి. ఇక ఏడవ సూత్రం అధికార సూత్రం. అంటే ఇప్పుడు చెప్పబోయే మిగిలిన సూత్రాలు ఎక్కడ వర్తిస్తాయో చెప్పే సూత్రం అన్నమాట. ఏమిటా సూత్రం?”
“విందులో.”
“అంటే ఇప్పుడు వచ్చే సూత్రాలన్నీ విందులోనే వర్తిస్తాయన్నమాట. మిగిలినప్పుడు కాదు. విందు అంటే రాత్రి భోజనం అన్నది నీకు ఇదివరకే బోధ పడింది కదా.”
“అవును స్వామీ! ఎనిమిదవ సూత్రం ‘ఇంకా నైవేద్యాలలో’ అని ఉంది.”
“అదీ అధికార సూత్రమే. దేవతలకు పెట్టే దానిని నైవేద్యం అంటాము. ఇప్పుడు వచ్చే నియమాలు విందుకూ, నైవేద్యానికీ కూడా వర్తిస్తాయన్నమాట.”
“ఓహో! బాగుంది.”
“సంజ్ఞా సూత్రాలు, అధికార సూత్రాలు అయ్యాక అసలు విషయం మొదలవుతోంది. ఎవరెవరికి ఏమిటి వడ్డించాలో, ఏమిటి వడ్డించకూడదో చెప్పే సూత్రాలు. వీటినే విధి నియమ సూత్రాలు అంటారు. తర్వాతి సూత్రం ఏమిటో చెప్పు?”
“9. పాండవులకు తీపి వడ్డించాలి. 10. భీమునికి లడ్డూలు.”
“అంటే అర్థమైందా?”
“ఆ అర్థమయింది గురుస్వామీ! పాండవులకు విందులో తీపి అనే పదం సూచించే వంటలను వడ్డించాలన్నమాట. మరి భీమునికి లడ్డూలు అంటే? అతనికి లడ్డూలు మాత్రమే వడ్డించాలి అనా?”
“ఆహాఁ కాదు! లడ్డూలు మాత్రం తప్పక పెట్టాలి అని. ఆ తర్వాతి సూత్రం చెప్పు.”
“నకులునికీ.”
“అంటే, నకులునికి కూడా లడ్డూలు వడ్డించాలి – అని. ఊఁ, ఆ తర్వాత?”
“అర్జునునికి అరిసెలు వద్దు”
“అంటే, అర్జునునికి అరిసెలు వడ్డించరాదు, తీపి వర్గంలోని మరేదైనా వడ్డించవచ్చు.”
“ఇతరులకు ఏవైనా, అంటే మిగతా అందరికీ ఇంకేవైనా వడ్డించవచ్చును అనే కదా?”
“ఇక్కడ ఇతరులు అంటే ఇతర పాండవులు అని అర్థం. పాండవులు అన్న శబ్దం తొమ్మిదవ సూత్రం నుండి అనువృత్తి అయింది.”
“మళ్ళీ ఇదొక తిరకాసా! ‘ఇతర పాండవులకు ఏవైనా’ అని తిన్నగా చెబితే ఆయన నాలుకేమైనా అరిగిపోతుందా?”
“నాయనా, పాణిని మహావ్యాకరణవేత్త. ఒక్క అక్షరం కూడా వృధాగా వాడరు. అర్ధ మాత్రా లాఘవేన పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాః అని పెద్దల మాట. సూత్రంలో ఒక్క అర్ధ మాత్రను తగ్గించగలిగినా కొడుకు పుట్టినంత సంబరపడిపోతారు వ్యాకరణవేత్తలు.”
“వారి సంబరం పాడుగాను. నా మతి పోతోందిక్కడ!”
“నీ మతి ఎక్కడికీ పోదుగానీ తర్వాతి సూత్రం చెప్పు?”
“అడిగిన కౌరవులకూ,” తెల్లమొహం వేశాడు వంటపెద్ద.
“కౌరవులకు ప్రత్యేకించి వడ్డించమని చెప్పలేదు. అంటే అందరికీ తీపి పదార్థాలు వడ్డించనక్కరలేదు. అయితే, అడిగిన వారికి అడిగినవి వడ్డించవచ్చు. తీపి అన్న శబ్దాన్ని మళ్ళీ తొమ్మిదవ సూత్రంనుండి తెచ్చుకోవాలి.”
“ధృతరాష్ట్రునికి తప్ప,” తర్వాత సూత్రాన్ని అప్పగించాడు వంటపెద్ద.
“దీనినే నియమ సూత్రం అంటారు. అంటే నిషేధం అన్నమాట. పై సూత్రానికి ఇది అపవాదం. కౌరవులలో ధృతరాష్ట్రునికి తీపి వడ్డించరాదని ఈ సూత్రం చెబుతుంది. అడిగినా వడ్డించరాదని అర్థం.”
“దీనికి, ‘భీష్మ ద్రోణ విదుర కృపులకూ అని చెప్పి ఉండాలి’ అని ఒక వార్తికం ఉందండోయ్!”
“అంటే ఈ నియమం ధృతరాష్ట్రునికేగాక భీష్మ ద్రోణ విదుర కృపులకు కూడా వర్తిస్తుందని కాత్యాయన మహర్షి సవరించారు. ఆ తర్వాత?”
“పళ్ళు మాత్రమే.”
“మరి వాళ్ళకి తీపి కాకుండా ఏమిటి పెట్టాలి అన్న సందేహానికి సమాధానం ఈ సూత్రం. వారికి పళ్ళు మాత్రమే వడ్డించాలి అని చెపుతోంది. ఇక్కడితో కురురాజులకు ఏమేమిటి పెట్టాలో పెట్టకూడదో చెప్పే సూత్రాలు పూర్తయ్యాయి. ఇకపైన వారితో వచ్చే ఇతర బంధు జనాల గురించిన సూత్రాలు.”
“కృష్ణుడికి నైవేద్యంలో.”
“కృష్ణుడు భగవానుడు. ఆయన వస్తే ప్రత్యేకించి నివేదన చేయాలన్నమాట.”
“అవును. ఆయన స్వయానా ఉపేంద్రులు కదా! ఇంతకీ ఏది నివేదన చేయాలి? ఆహా! అర్థమైంది. తరువాత సూత్రంలో ‘అన్నీ’ అని ఉంది. అంటే పదార్థాలన్నీ నివేదించాలని కదా!”
“అన్నీ అంటే మనం మాట్లాడుతున్న విషయానికి సంబంధించినవి మాత్రమే నాయనా. అంటే తీపి అని మనం అనుకున్న పదార్థాలన్నీ అని మాత్రమే ఈ సూత్రం చెబుతుంది.”
“ఓహో! సరి సరి. తరువాతి సూత్రంలో ‘పంచామృతం’ అని వుంది. అంటే?”
“పై సూత్రం నుండి ‘కృష్ణునికి,’ ‘నైవేద్యంలో’ అన్న పదాలు, ఇంకా పై సూత్రంనుండి ‘వడ్డించాలి’ అన్న పదం అనువృత్తి చేసుకోవాలి. అప్పుడు ఈ సూత్రం ‘కృష్ణునికి నైవేద్యంలో పంచామృతం వడ్డించాలి,’ అని వస్తుంది. అది తీపి వర్గంలోకి రాదని మొదటే సూత్రం చెప్పారు కనుక ఇక్కడ దాన్ని ప్రత్యేకించి చెప్పారు. చెప్పినా దోషం లేదన్న వార్తికాన్ని తీసుకుంటే ఈ సూత్రం అవసరంలేదు. నీకు ఎలా కావలిస్తే అలా తీసుకో!”
పాకశాలాధిపతి కాస్త తెరపినపడ్డాడు.
“ఇదేదో బాగానే ఉంది స్వామీ! ఇక్కడ వార్తికంలో పళ్ళు కూడా చెప్పాలని వ్రాశారు ఆ ఇంకో ఆయన. అంటే అవికూడా నివేదించాలని కదా?”
“ఔను. అది మాత్రమే కాదు. ఇంకో వార్తికం ఉంది చూడు. ‘బలరామ కృష్ణులకు అని చెప్పాలని’ చెబుతుంది. అంటే కృష్ణునికి ఎలాగో బలరామునికి కూడా అలాగేనన్నమాట.”
“ఔను స్వామీ. ఇంకొక వార్తికం కూడా ఉంది, ‘విందులో కూడా అని చెప్పవలసింది’ అని.”
“దాని అర్థం నైవేద్యంగానే కాక, బలరామ కృష్ణులు అందరితోబాటు విందులో కూర్చొన్నా వారికి అలాగే వడ్డన చేయాలన్నమాట.” వివరించాడు పతంజలి.
“బలరామ కృష్ణులకు చేయాల్సిన వడ్డన విషయం అయింది కదా. ఆ తర్వాత?”
“ఇతరులకు వద్దు.”
“అంటే పైన చెప్పిన వారికి తప్ప ఇతరులకు తీపిగా పేర్కొన్న పదార్థాలను వడ్డించరాదు అని.”
“ఓహో! తర్వాత, ‘అశ్వత్థామకు ఇవ్వొచ్చు’ అని ఉంది. అంటే అశ్వత్థామకు ఇవ్వవచ్చనే కదా అర్థం?”
“అవును. ఇవ్వవచ్చు అంటే అది వికల్పం అన్నమాట. ఇవ్వకపోయినా తప్పులేదని అర్థం. అయితే, దీనికి వరరుచి చెప్పిన వార్తికం గుర్తుంది కదా? ఈ అపవాదం కేవలం అశ్వత్థామ కౌరవులతో కలిసి ఉన్నప్పుడేనని నియమం పెట్టింది.”
“అవును స్వామీ, అర్థమయింది! తర్వాత సూత్రం, ‘సాత్యకికి ఎప్పుడూ’”
“సాత్యకికి కూడా తీపి వడ్డించాలని ఈ సూత్రం నిర్దేశిస్తోంది. అయితే అశ్వత్థామకు లాగా ఇతరులతో ఉన్నప్పుడే కాక ఎప్పుడైనా విందులో తీపి వడ్డించాల్సిందే అని చెపుతోంది.”
“బాగుంది స్వామీ! తర్వాతి సూత్రం, ‘కారానికీ అంతే’”
“అంటే కారంగా పేర్కొన్న వంటకాల విషయంలో కూడా తీపికి వర్తించిన నియమాలే వర్తిస్తాయి. ఇది అతిదేశ సూత్రం. మళ్ళీ అన్నీ చెప్పకుండా అధికారం క్రింద ఉన్న సూత్రాలన్నీ ఈ సంజ్ఞకు కూడా వర్తిస్తాయని చెప్పడమన్నమాట.”
“ఓహో! కానీ తర్వాత, ‘పాండవులకు తప్ప’ అన్నారు స్వామీ.”
“అవును. అంటే, పాండవుల విషయంలో తీపికి వర్తించిన నియమాలన్నీ వర్తించవు. ఇది నియమ సూత్రం. ఆ తర్వాత సూత్రం దీనిని పూరిస్తుంది.”
“కోరినవి.”
“అంటే పాండవులకు విందులో వారు కోరిన కారం పదార్థాలు వడ్డించాలి అని.”
‘అంటే పాండవులకు కారం విషయంలో ఎలాంటి ప్రత్యేకమైన నియమాలూ లేవనీ, వారు కోరినవి వడ్డించమనే కదా?”
“అంతే!”
“చివరగా, ‘దుర్యోధనుడికి గోంగూర.’ ఇది చక్కగా తెలుసులెండి. శాకంబరీదేవీ ప్రసాదం, ఆంధ్ర శాకం. అది లేకుండా రారాజు ముద్దయినా ముట్టరట కదా!”
“అవునవును. ఇప్పుడు సూత్రాలన్నీ పూర్తిగా బోధపడినట్టేనా?” అడిగాడు పతంజలి చిరునవ్వుతో.
వంటపెద్ద ముఖం వెలిగిపోయింది. “అంతా బోధపడింది స్వామీ. ఇదేమంత తేలికైన వ్యవహారం కాదు. అయినా మీ వివరణ కొబ్బరిబొండాన్ని సైతం అరటిపండులా ఒలిచి నోటిలో పెట్టినంత సులభంగా ఉంది! మీకు వేనవేల నమస్కారాలు.”
“అథః శబ్దానుశాసనం – ఇంద్రుడు చెప్పిన మాటలను సూత్రబద్ధంగా వివరించడమే తప్ప, పాణిని గాని, కాత్యాయనుడు గాని, నేను గాని క్రొత్తగా కనిపెట్టిందేమీ లేదు. ఈ సూత్రాలను ఉపయోగించి మంచి విందు తయారుచేయాల్సిందీ, సరిగా వడ్డన జరిగేట్టు చూసి అందరినీ ఆనందపరచాల్సిందీ నువ్వే. వెళ్ళిరా నాయనా. శుభం భూయాత్!” ఆశీర్వదించాడు పతంజలి మహాముని.
ఆయన పాదస్పర్శతో పునీతుడై ఆనందంగా మరలిపోయాడు పాకశాలాధిపతి.
వాక్యకారం వరరుచీం, భాష్యకారం పతంజలీం
పాణినీం సూత్రకారం చ, ప్రణతోఽస్మి మునిత్రయం.
(లౌకిక సంస్కృత వాఙ్మయానికి మూల స్తంభాలవంటి వైయాకరణులు మువ్వురికీ సాష్టాంగ ప్రణామాలతో. – రచయిత)