ఫ్యూగ్ (Fugue)

ఆలెక్స్ నుంచి ఈమెయిల్ తన ఇంటికి డిన్నర్‌కి పిలుస్తూ. “ఎంతో మంది ఉండరు. చిన్న పార్టీ. నీకు పరిచయం చేశాను చూడూ, టెరీసా, ఆమే నువ్వూ, మీ ఇద్దరే డాక్టర్లు. మిగతా ఎవరూ కారు.”

నిసీ వెంటనే తన సంగీతం టీచర్, ఆలెక్స్ రూబెన్ ఈమెయిల్ కు సమాధానం ఇచ్చింది. “నన్ను పిలిస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను తినకూడని పదార్ధాలు చాలా ఉన్నయ్. మెన్యూ ఖచ్చితంగా తెలిస్తే తప్ప, నేనేం తినలేను, తాగలేను.”

“నిసీ! నిన్ను పోయిజన్ చెయ్యాలని పిలవటం లేదు. భోజనానికి పిలుస్తున్నా. నువ్వు బ్రాహ్మిన్ విడో వా?”

“నువ్వు విలేజ్ ఇడియట్‌వా? ఆలెక్స్! నీ సన్నాసి ఇండియన్ కల్చర్ పరిజ్ఞానం నా దగ్గర చూపక. నాకు చాలా రకాల ఫుడ్ ఎలర్జీలు ఉన్నాయి. ఆ డాక్టర్ టెరీసా గారు నీ కెప్పటి నుంచో ఫ్రెండ్ కదా. క్లారినెట్ కూడా వాయిస్తుంది గదా. ఆమెను అడుగు. కొంచెం నీ కర్ధమయే భాషలో, క్లారినెట్ వాయిస్తూ చెపుతుంది.” నిసి ఈ మెయిల్.

వెంటనే రిప్లై. “నిసీ! నేనొక ప్రొఫెసర్ సుమా. ఇది కాలేజి వాళ్ళు తనిఖీ చేసే ఈమెయిల్. ప్రైవేట్‌గా శుంఠ, దద్దమ్మ అని పిలుస్తావనుకో. పబ్లిక్‌లో మర్యాదిచ్చి మాట్లాడలేవా?”

“నోప్. నేను ఎవరి ఉద్యోగిని కాను. నాకు మీ రూల్స్ అక్కర లేదు. మీ కాలేజ్ కోసం, నువ్వు ఏ గడ్డి పెడితే అది తిని చచ్చిపోటానికి తయారుగా లేను. నీ ఫ్యునరల్ మార్చ్, వేరే వాళ్ళ కోసం, ప్లే చెయ్యి ఆలెక్స్!”

“నువ్వు రావాలి. పువ్వులలో పెట్టి చూస్తా. హెల్ప్ మి! నీకేం కావాలో చెప్పవూ.”

ఆమె అప్పుడు నవ్వుకుని, తను ఏవి అసలు తినకూడదో అతనికి తెలియచేసింది. అతడు వెంటనే తన ఇంటి అడ్రస్, ఏ రోజు, ఏ సమయానికి రావాలో సమాచారం, ఆమెకు పంపాడు.


నిసి ఆలెక్స్ ఇంట్లో ఇచ్చిన విందుకి చాలా సంతోష పడింది. అతడు అంత బాగా వంట చెయ్యగలడని ఆమె అనుకోలేదు. ఆరుగురే విందుకు వచ్చింది. అందరికీ తనే డ్రింక్ లందించాడు. ఆమెకు ఏదో నానా రకాల పళ్ళు, ఆకులూ అలములూ ఉన్న సాఫ్ట్ డ్రింక్ ఇవ్వబోతే ఆమె అతని చెయ్యి తోసేసి, నీ కున్న వాటిలో మంచి వైన్, మంచి వైన్ గ్లాస్‌లో ఇవ్వు అంది. అతడు రెండు వైన్ బాటిల్స్ తెరిచి, రెండు గ్లాసుల్లో కొంచెం, కొంచెం వంపి ఆమెకు అందించాడు. ఆమె రుచి చూసి ఒకటి ఎంచుకుంది. ఆమె గ్లాస్ నింపి, అతిధులను ఒకరి కొకరిని పరిచయం చేసుకోమని అక్కడి నుండి కిచెన్ లోకి వెళ్ళి పోయాడు.

నిసికి సోనియా ముందుగానే తెలుసు. మ్యూజిక్ స్కూల్లో సోనియా పాడితే వింటానికి, ఎంతో ఉత్సాహంతో వెళుతుంది. ఆమె ఆహ్వానించిన గాత్ర సంగీత విద్వాంసులను వేరే వారిని, వింటానికి కూడా ఇష్టపడి వెడుతుంది. ఆరకంగా ఆమెకు ఆపెరా సంగీతంలో ఆసక్తి పెరిగింది. నిసి సంగీతం పాఠం చెప్పించుకునేప్పుడు, సోనియా అప్పుడప్పుడూ స్టూడియో లోనికి వస్తుంది. ఆలెక్స్, సోనియా ఆమె ముందు ఎడాపెడా పోట్లాడుకుంటారు.

“ఆలెక్స్! నువ్వు కాలేజ్‌లో కచేరిలు సరిగా ఏర్పాటు చెయ్యటం లేదు. అన్ని రకాల వాయిద్యాలకు సమమైన ప్రాధాన్యత ఇవ్వవు. పైగా గాయకులు, పాటలు అసలు అనవసరం అనుకుంటావు. పియానో ఒక్కటే వాయిద్యం అనుకుంటావు. సంగీతం అంతా పియానో ఒక్కటే తయారు చెయ్యదు. నిసి నడుగు, మనిద్దరి లోఎవరు గొప్పో.” అంటుంది.

నిసి, “నీ గాత్రం, ఆ సంగీత వాయిద్యాలన్నిటి కన్నా బాగుంటుంది.” అంటుంది వెంటనే.

ఆలెక్స్ ఊరుకోడు. “నువ్వు నిసి మాటలు నమ్ముతావు. నీ గాత్రం అంతా వాయిస్ బాక్స్, వోకల్ కార్డ్స్ నుండి మాత్రమే రాదని కూడా తెలియదు తనకి. ఆమె దేశం గాయకులు అలా, గొంతులోంచి పై పైన తీగలు తీస్తూ మాత్రమే పాడతారు. వారు ఫుడ్ పైప్, డయాఫ్రమ్, పొట్ట కొంచెం కూడా ఉపయోగించరు. అతి నాజూకు. అదీ ఒక పాటేనా? డాక్టర్ నిసి గారికి కవిత్వం పై మోజు. అందుకని సాహిత్యం మీద అభిమానం చూపించి, వారి మాటల్లోని అర్ధాలను, ఇమోషన్స్ని సంగీతంలోకి అనువదించుకునే షూల్మన్, షూమన్, షూబర్ట్ లను వింటానికి ఉత్సాహం చూపిస్తుంది. ఆమెకు ఆ పాత కాలపు లవ్ పొయట్రీలు, టి.వి. స్క్రీన్ ల మీద చదువుకుంటూ, ఆడా మగా ఒకరంటే ఒకరు పడి చచ్చిపోవటాలు, ఆ రొమాంటిక్ నాన్సెస్ మీద ఆధారపడి, వాటికి తోకలలాగా వేళ్ళాడుతూ, మెలికలు తిరిగే సంగీతం అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తుంది.

నేను ప్రేమ పిచ్చిగాణ్ణి కాను. భక్తి పిచ్చిగాడిని కాను. నాకు మాటలు ఉత్త సోది. సంగీతానికి మాటలు అనవసరం. ఐనా గాని నిసికి వోకల్ ఇష్టమైతే, నాకు ఉత్తరం రాసి బతిమాలుకుని, నా దగ్గిర పియానో పాఠానికి ఎందుకు జేరింది?” అన్నాడు.

ఆలెక్స్ రూబెన్ మాట్లాడేప్పుడు స్వరం చాలా సమ స్థాయిలో ఉంచుతాడు. ఆ కంట్రోల్డ్ కంఠస్వరం వింటే, నిజానికి నిసికి, వోకలిస్ట్‌ల ఎన్నో హెచ్చు తగ్గుల సంగీతం విన్నదాని కన్నా, ఎక్కువ కాంక్ష రేగుతుంది. ఆ సంగతి వారిద్దరికీ చెప్పదు ఆమె.

అతడు ఒక కాన్సర్ట్ పియానిస్ట్‌గా, ఎంత స్టయిలిష్‌గా, చక్కగా ప్రారంభించి, ప్రోగ్రాం మధ్య భాగాలన్నీ సమర్ధతతో నిర్వహించి, చివరకు ఒక క్లయిమాక్స్‌కి తీసుకు రావటం, ఆ టైమ్ సెన్స్ – సుజ్ఞానమంతా ఆ డిన్నర్ సర్వ్ చెయ్యటంలో కూడా చూపాడు. నిసి – తమ ఇంట్లో వాళ్ళు కలిసినపుడు, ఇప్పటికీ, ఒకరి మీద ఒకరు పడిపోతూ, కంగాళీగా, అరుస్తూ, కొన్నిసార్లు ఆడవాళ్ళు వంటిల్లు సొంతం చేసేసుకుని, మగవాళ్ళను బైటికి తోసేసి, రభస చేసి, ప్రతి డిన్నర్‌నీ ఒక రణరంగంలా ఎలా మారుస్తారా, భోజనం తిన్న ఆనందం ఇంత కూడా ఉండదు కదా, అనుకుంది.

డిన్నర్ పార్టీలో నిసితో ముందుగా చొరవ తీసుకుని మాట్లాడింది, టెరీసా. ఆమె చనువుగా, ఆలెక్స్ రూబెన్ ఇల్లు నిసికి చూపింది. గోడల మీద బీథొవెన్, లిజ్స్ట్, బొమ్మలున్నాయి. చేతి వ్రాతలో ఉన్న మ్యూజిక్ కాంపొజిషన్ లున్నయి. అవి చదివే పరిజ్ఞానం ఇంకా నిసికి లేదు. ఎప్పటికీ రాకపోవచ్చు. కాని, ఆలెక్స్ ఇంట్లో పెయింటింగ్స్ తను కొనిపించినవని టెరీసా చెప్పినపుడు, ఇల్లు అలంకరణలు తను చేసినట్టూ, ఆలెక్స్ ఏదో మ్యూజిక్ సిడి గురించి, చెప్పినపుడు టెరీసా వెంటనే లోపలి గది లోకి వెళ్ళి తీసుకు రావటం నిసి చూసింది. అందువల్ల ఆలెక్స్‌కీకీ, టెరీసాకీ, బహుశా గురువు, విద్యార్ధిని కన్నా ఎక్కువ సంబంధం ఉన్నదేమో అనుకుంది.

వచ్చిన అతిధులలో ఇద్దరు భార్యా భర్తలు. అతడు సొంత ఇంటర్నెట్ బిజినెస్ ఉన్నవాడు. అతని భార్య, కాలక్షేపానికి న్యూట్రిషన్ కోర్సులు తీసుకుంటున్నది. వారిద్దరి మాటల బట్టీ, ఆమె జ్యూయిష్ వనిత అనీ, అతడు కేధలిక్ అనీ, వారిద్దరిదీ రెండో పెళ్ళి అనీ, వారి ఇల్లు ఆ దగ్గర లోనే ఉందనీ నిసికి తెలిసింది.

అందరూ ఏవో లోకల్ కబుర్లూ, వారి యాత్రల కబుర్లూ, పాలిటిక్స్ మాట్లాడుకుంటూ తింటున్నారు. మాటల మధ్యలో ఆలెక్స్ టెరీసాని, “నువ్విప్పుడు ఊరు మారి, కొత్త కార్డియక్ ఫెలోషిప్ చేసి సాధించే దేమిటీ”? అన్నాడు.

నిసితో తను వెళ్ళబోయే చోట ఉన్న లేటెస్ట్ పెట్ స్కాన్‌లూ, ఎమ్.ఆర్.ఐ. ఎక్విప్‌మెంట్ గురించి చెపుతున్న టెరీసా, ముందు పట్టించుకోలేదు. కాని మళ్ళీ ఎగతాళిగా, “నువ్వు ఇప్పుడు ఇంకో ఊరెళ్ళి పొడిచేదేంటీ,” అని ఆలెక్స్ రెట్టిస్తే, ఒక్కసారిగా టెరీసా బేలన్స్ తప్పింది. ఆమె గట్టిగా అరిచింది.

“నాకు ఎమర్జెన్సీ రూమ్ లంటే ఇష్టం. అక్కడ రొప్పుకుంటూ, ఊపిరాడకుండా ఉన్న వాళ్ళను చూస్తే నాకు కిక్ వస్తుంది. వాళ్ళకు ఇ.కె.జి.లు తియ్యటం, ఎకోలు తియ్యటం, అటూ ఇటూ హడావిడిగా పరిగెత్తటం నాకు ఎక్సయిటింగా ఉంటుంది సరేనా, యు ఆర్ సో స్టుపిడ్ ఆలెక్స్!” అని గట్టిగా కేకలేసింది.

ఆమె చేతిలో వైన్ గ్లాస్ పగిలి, ఎర్ర వైనంతా బల్ల మీద ఒలికిపోయింది.

ఒక్క క్షణం, ఆ సంభాషణ ఎటు పోతున్నదో తెలియక అందరూ అయోమయంలో పడ్డారు. నిసి, టెరీసా, గాజు పెంకులు ఎత్తసాగారు.

సోనియా – గాజు పగిలితే అనర్థం అంది, కొంచెం అదేదో జరిగితే బాగుంటుందన్నట్టు. అవి అలా వదిలెయ్యండి. మీ చేతులు తెగుతాయి, నేను తీసేస్తానన్నాడు ఆలెక్స్. గ్లవ్స్ ఇస్తే చాలంది నిసి. అందరి పళ్ళాలూ, గ్లాసులూ మార్చెయ్యమని ఆర్డర్ జారీ చేసింది, ఆలెక్స్ ఆ పని చేస్తుండగా టెరీసా బాత్రూమ్ లోకి మాయం అయ్యింది. గ్లవ్స్ డబుల్ చేసి వేసుకుని, నిసి, ఆ గాజు పెంకులు ఎత్తేసి, బల్ల క్లీన్ చేసేసింది. టెరీసా బాత్రూమ్‌లో మరీ ఆట్టే సేపు తీసుకోకుండా తిరిగి వచ్చింది. నిసి పక్కన వచ్చి కూర్చుని, తన ఫర్నిచర్, ఇతర వస్తువులు అన్నీ పంపించి వేసినట్టూ, తనూ రెండు పగ్స్, మరుసటి రోజు ప్లేన్‌లో, తన కొత్త ప్లేస్‌కు వెడుతున్నట్టు చెప్పింది.

అందరూ సర్దుకుని షెర్రీ తాగుతూ డిసర్ట్ తిన్నారు. కాని నిసికి ఆలెక్స్ రూబెన్ ఎగతాళి నచ్చలేదు. ఎంతైనా ఆమె డాక్టర్. పై చదువు చదవాలనుకునే ఇంకో డాక్టర్ని, ఆఫ్టర్ ఆల్ ఒక పియనిస్ట్ ఎగతాళి చెయ్యటం ఆమెకు నచ్చలేదు. ఊరుకోకుండా, “ఆలెక్స్! నీకెప్పుడైనా, గుండె లయ తప్పిందా. చాలా ఎక్కువ వేగంతో ఎట్లా పడితే అట్లా కొట్టుకుందా. నువ్వు అతి వేగంతో పియానో వాయిస్తావు. కాని నీ గుండె ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగా కొట్టుకుందా?” అంది.

“ఊహూఁ, లేదు. నా కెప్పుడూ అలా జరగలేదు.”

“నాకు జరిగింది. చాలా అన్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎంత తొందరగా, ఎవరైనా సరి ఐన రిథమ్‌కి మారుస్తారా అని అల్లాడి పోయాను. నువ్వు మ్యూజిక్‌తో గుండెను లయ తప్పిస్తావేమో కాని, మామూలు రిథమ్‌కి తేలేవు. నీకంత శక్తి లేదు. టెరీసా చెయ్యగలదు. నువ్వెవరివి ఒక డాక్టర్ని లేటెస్ట్ టెక్నాలజీ తెలుసుకోకుండా ఆపేందుకు?”

ఆలెక్స్ చల్లారి పోయాడు. “అదేదో ఈ ఊళ్ళోనే చెయ్యగూడదా అనే నేనడిగేది,” అన్నాడు.

“అన్నీ ఉన్న ఊళ్ళో దొరికితే, మరి నీ దగ్గరకు వేరే దేశం నుంచీ వచ్చి ఎందుకు చదువుకుంటున్నారు. చైనా, కొరియా, బ్రెజిల్ నుండి, నువ్వెందుకు వాళ్ళను విద్యార్ధులుగా ఒప్పుకున్నావ్. నువ్వు ప్రతి కొన్ని నెలలకూ వేరే దేశం పోయి కాన్సర్ట్స్ ఎందుకిస్తావ్?”

“ఓ.కే. ఐ యామ్ రాంగ్, వెన్ ఐ యామ్ రాంగ్!” అని, ఆలెక్స్ టెరీసా వైపు చూస్తూ, “టెర్రీ! చదువు చక్కగా సాగాలని నే ఆశిస్తున్నా. గత కొన్నేళ్ళుగా సంగీతం కాలేజికి ఇచ్చిన విరాళాలకూ, ముఖ్యంగా నా స్టూడెంట్ల ఆలనా పాలనా చూస్తూ, వారికి చదువులోనూ, వైద్య సహాయం అవసరమైనప్పుడు, ఆ హెల్ప్ అందించినందుకూ థేంక్స్!” అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి ఛీర్స్ అన్నారు. డిసర్ట్, కాఫీ ముగించుకుని, మెల్లగా ఒకరి దగ్గర ఒకరు సెలవు పుచ్చుకుని, అతని ఇల్లు విడిచి వెళ్ళి పోయారు.

ఆ సంఘటన తర్వాత, అప్పటికి, ఇదివరకు ఆలెక్స్, టెరీసా సంభాషణలన్నీ కలుపుకుని నిసికి దాదాపు విషయం అర్ధం అయింది. టెరీసా అండర్ గ్రాడ్యుయేట్‌గా, షికాగోలో, మ్యూజిక్ కోర్సులు ముందు తీసుకుంది. ఆమె మొదటి మొగుడికి పిల్లల్ని కంటూ, అతని ఎంకరేజ్‌మెంట్‌తో మెడికల్ స్కూల్ వెళ్ళింది. అతనితో ఆ పైన ఎందుకో సరిపడలేదు. విడాకులు తీసుకుంది. చెడిన వివాహం వేదన నుండి బైట పడటానికి, ఆమె చుట్టాలకు దగ్గర్లో ఉంటానికి ఫ్లారిడా వచ్చింది. ఆమెకు కొత్తగా డయాగ్నోజ్ చేసిన వాస్క్యులార్ డిసీజ్ మూలాన కూడా, ఆమె చలి ప్రదేశం నుండి బైట పడాలనుకుంది. అన్నిటికీ థెరపీగా మళ్ళీ, మ్యూజిక్‌ని ఆశ్రయించింది. తద్వారా మ్యూజిక్ స్కూల్లో డాక్టర్ రూబెన్‌ని కలిసి, అతని మీద ఆకర్షణ కలిగి అతనితో పరిచయం పెంచుకోటానికి పియానో మొదలెట్టింది. ఆలెక్స్, టెరీసాలు ఒకరంటే ఒకరు ఆకర్షితులౌటంలో ఆశ్చర్యం లేదు. ఆలెక్స్‌కి స్త్రీల మీద పురుషుల చెలాయింపు అసలు గిట్టదు. తను అందరి మగవాళ్ళలా కాదు అని అతనికి నమ్మకం. ఎవరైనా స్త్రీ ఇతర మగవాళ్ళను గురించి తన దగ్గర ఏడుసుకుంటే అతని గుండె కరిగి పోతుంది. టెరీసా ఆ పని బాగా చెయ్యగలదు.

ఆలెక్స్ ఉమన్స్ లిబరేషన్ వైపే గాని, స్త్రీలో మాతృత్వం చూస్తాడు. టెరీసా తన పిల్లల గురించి అహర్నిశలూ మాట్లాడుతుంది. ఆలెక్స్ తను తన స్టూడెంట్లకు తండ్రి స్థానం వహించాలనుకుంటాడు. తన స్టూడెంట్లకు తల్లిదండ్రులున్నారన్న విషయం అతడు మర్చి పోతాడు. వారి భవిష్యత్తు బరువు అంతా తన నెత్తి మీదే ఉన్నట్టు అనుకుని, దాదాపు పిల్లల తల్లిదండ్రులు పడినంత బాధ పడతాడు. టెరీసా అతని విద్యార్ధుల పనులు కొన్ని నెత్తినేసుకుని, అతని విద్యార్ధులకు తల్లి పని చెయ్యటం మొదలెట్టింది. ఆ ఇంగ్లీష్ సరిగ్గా రాని ఫారెన్ స్టూడెంట్లతో నానా చావూ చస్తున్న అతనికి పెద్ద రిలీఫ్ వచ్చింది. ఇద్దరూ మ్యూజిక్ స్టూడెంట్లకు వారు తల్లీ తండ్రీ అనుకుంటూ, వారిలో వారే, వారి నిస్వార్ధ మాతృ పితృ హృదయాలను, వారి అనాథ పిల్లల సేవలను పరస్పరం మెచ్చుకుంటూ, పనిలో పనిగా ప్రేమించుకుంటూ, కొన్నాళ్ళు ఒకరినొకరు, మోసం చేసుకున్నారు. ఆ మత్తు లోంచి టెరీసాకే ముందు మెలుకువ వచ్చింది.

ఆలెక్స్, ఆమె డాక్టరనే మరిచి పోతున్నాడు మెల్లిగా. తన సంగీతం టీచింగ్ ముఖ్యమైన పని, తను ప్రొఫెసర్, ఆమె సహాయకారి అనుకుంటున్నాడు. టెరీసాకి ఆమె సొంత పిల్లలే ఉన్నారు. ఈ సరొగేట్ మదర్ పని ఆమెకు దేనికి? ఆమెలో అసంతృప్తి మొదలైంది. ఆమె కొన్నాళ్ళు తనను తను నమ్మించుకుంది. ఆ కాన్సర్ట్స్ గురించి అతనికి సహాయం చెయ్యటమూ, అతని గర్ల్ ఫ్రెండ్ లాగా తిరగటం, డిన్నర్లివ్వటం, ఆ జీవితం తనకు సరిపోతుందనుకుంది. కాని ఆమె ఒక క్వాలిఫైడ్ డాక్టర్. ఆమె ఆలెక్స్ కన్నా రెండింతలు డబ్బు సంపాదించగలదు. ఆలెక్స్ కాన్సర్ట్‌లకు వెడితే తనూ వెళ్ళటానికి కాలేజీ ఏమీ డబ్బు కట్టదు. ఊరికే ఇంట్లో పడి ఉండి ఉండాలి అతను వచ్చేదాకా. దాన్లో తనకు వచ్చేదేముంది. ఆమె మెల్లిగా మళ్ళీ మెడిసిన్‌కి కావాలసిన స్టేట్ ఫ్లెక్స్ ఎగ్జామ్, బోర్డ్ రీసర్టిఫికేషన్ పూర్తి చేసి, సి.మ్.ఇ. క్రెడిట్స్ అప్‌డేట్ చేసుకుని మంచి పేరున్న టెక్సస్ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్లో ఫెలోషిప్ సంపాదించుకుంది. అదీ వారిద్దరి కథ.


తన మ్యూజిక్ లెసన్ సమయానికి వెళ్ళిన నిసి, “ఆలెక్స్! ఎలా ఉన్నావ్!” అంది. వెంటనే సమాధానం వినిపించక పోయే సరికి ఆమె వెనక్కు తిరిగి అతని కేసి చూసింది.

“టెరీసా వెళ్ళిపోయింది. ఇప్పుడే ఎయిర్ పోర్ట్ లో దించి వస్తున్నా.” అతని కళ్ళల్లో నీళ్ళు.

నిసి వారి సంబంధం ఏమయితేనేం, ఆ క్షణంలో అతని బాధ నిజమైందే, అని అనుకుంది. ఆమె గొంతు మామూలు కాఠిన్యం కోల్పోయింది. “ఆలెక్స్! ఇట్స్ గ్రేట్ టు హేవ్ ఎ ఫ్రెండ్ లైక్ యు. టెరీసా ఈజ్ సో లక్కీ.”

“టెర్రీతో రోజూ మాట్లాట్టం అలవాటయి పోయింది. ఇలా విడిచి వెళ్ళిపోతుందనుకోలా. చదువుకుంటున్నందుకు కాదు. ఇక్కడ దగ్గర్లో లేదే అని.”

“నువ్వు ఇచ్చే కాన్సర్ట్‌ల కోసం దేశ దేశాలు ప్రయాణం చేస్తావు. నీ స్కెడ్యూలు వేరే వాళ్ళు గౌరవించి వాళ్ళు సరిపెట్టుకోలా. మాట్లాడితే ప్లేనెక్కే నువ్వు టెరీసాను చూడాలనుకుంటే, నువ్వు ఆమె ఉన్న చోటికి వెళ్ళలేవా? ఆమె ప్లేనెక్కి నిన్ను చూస్తానికి రాలేదా? ఫెలోషిప్ ఒకటో రెండో సంవత్సరాలుంటుంది. ఆ తర్వాత ఆమె కావాలనుకుంటే ఇక్కడ ఉద్యోగం దొరకదా? లేకపోతే నువ్వే అక్కడ ఉద్యోగం చూసుకోరాదూ, ఇప్పుడే ప్రయత్నించి?”

“యు ఆర్ రైట్. నిజమే. అదేమంత పెద్ద దూరమని. క్రిస్మస్ హాలిడేస్‌లో వెళ్ళి చూసొస్తా.”

“డూ దట్!”

తన దోవన తను సంగీత సాధన మొదలుపెట్టింది నిసి. అవేవీ జరగవని ఆమెకు చక్కగా తెలుసు. నిసి కి ఎవరి ప్రేమ వ్యవహారం లోనూ అసలు ఆసక్తి లేదు, ఆమె సత్తరగాయ పని చెయ్యదు.

ఆ రోజు డైరీలో డొ నొత్ బెచొమె సొమె ఒనె’స్ చ్రుత్చ్. డొన్’త్ బె అ తెంప్. డొన్’త్ బె ఇన్ అ త్రీంగ్లె. ఈత్’స్ దిస్గుస్తింగ్. Yఔ హతె ఇత్. అని రాసుకుంది. ఆమె ఆ రోజు నుండీ, ఆలెక్స్‌తో కొన్ని తను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ రాసుకుంది. సంగీతం పాఠం ముందూ, అతని కాన్సర్ట్ ముందూ నిసి తప్పకుండా అవి చదువుకుంటుంది. ఆమెకు సంగీతం మహత్యం తెలుసు. సంగీతకారుల ఆకర్షణ తెలుసు. ఆమెకు పూర్వ కాలంలో లాగా సంగీతానికి మహారాజ పోషకురాలిగా ఉండటానికి తగిన రాజకీయ ఆర్ధిక స్తోమతులు లేవు. ఎవరికీ ఉంపుడుగత్తెగా ఉండే మనస్ధితి లేదు. నిసికి సంగీతంలో ఆసక్తి ఉంది. వినటం లోనూ, వాద్యం లోనూ. అది తన కోసమే. కాని వేరే వారిని పోషించటం, వారిని ఆరాధించటం గిట్టదు.

ఆమె ఇంటికి వచ్చాక తన మెయిల్ చూసుకుంది. తన కుటుంబ సభ్యుల నుంచీ, ఫలానా తారీఖులలో పార్టీలు, మంచి నావ ప్రయాణాలు. మాతో సైన్ అప్ చేస్తావా? అని ఆహ్వానాలు. సాహిత్య సభలకు, ఆర్ట్ ఎగ్జిబిషన్ లకు ఇన్విటేషన్లు. “ఎంత అందమైన ప్లేస్ తీసుకున్నావు రిలాక్సేషన్‌కు. వెరీ గుడ్ ఛాయిస్.” అని విక్టర్ బెర్నెట్టీ దగ్గర నుండీ ఉత్తరం. కుమార్ నుండి “లెటస్ ఫలయ్ టుగెదర్, ఐ వాంట్ యు ఆల్ టు మైసెల్ఫ్ ఫర్ ఎ ఫ్యూ డేస్! డియర్ నిసీ!” లాజ్లో బేకోస్ నుండి, అంతకు ముందు కాలీగ్స్ నుండీ “న్యూయార్క్ నీకోసం ఎదురు చూస్తున్నదని రావాలి.” అని వాయిస్ మెయిల్స్ విని ఆమె నవ్వుకుని, ఉత్సాహంగా తన కేలెండర్ నింపుకోసాగింది. అందరూ ఆమెకు ప్రియులే. కాని అందులో ఒక వ్యక్తి వైపు మెల్లిగా తన హృదయం మొగ్గు చూపుతున్నట్టు అనిపించింది. సంకెళ్ళన్నీ తెగిపోయి స్వేచ్ఛను అనుభవిస్తున్న నిసికి ఆ కొత్త గమనిక కొంచెం అలజడి కలిగించింది.


నిసి రైల్లో ఫస్ట్ క్లాస్ కూపేలో పారిస్ నుండి కాన్‌కి ప్రయాణం చేస్తూ ఉంది. చెదురు మదురుగా అక్కడక్కడా ప్రయాణీకులున్నారు. మధ్యలో ఓ ఐదు భాషల్లో అప్పుడప్పుడూ ఎనౌన్స్‌మెంట్ జరుగుతూంది. ఇంగ్లీష్ మాత్రమే తెలిసిన నిసికి, ఆ భాషలో ఎనౌన్స్ చేస్తున్నారో లేదో కూడా తెలియటం లేదు. ఐనా, నాలుగేళ్ళ క్రితం ఆ ప్రాంతాలలో తిరిగి ఉన్నందున, ఒంటరి ప్రయాణం ఐనా అంత భయమనిపించలేదు. అతి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం. ఆమె తన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌లో అంతకు ముందటి ప్రొవాన్స్ ట్రిప్ ఐటిరినరీ చూడసాగింది. చూస్తూ, క్రితం సారి హెన్రీ మటీస్ డిజైన్ చేసిన ఛాపెల్ చూడలేదు. అతని మొత్తం ఆర్ట్ ఎఛీవ్‌మెంట్ లలో, అత్యుత్తమమైనదిగా కొందరు గుర్తించే వెనిస్ లోని ఆ ఛాపెల్, స్టెయిన్‌డ్ గ్లాస్ విండోస్, ఆ పరిసరాలు, ఊరు చూడకుండా ఉండటమేమిటి? ఈ సారైనా చూడాలి అనుకుంది.

ప్రొవాన్స్ గురించిన 2009 తన నోట్స్, ఫొటోలు చూస్తుండగానే, ఆమె తన డైరీ ఆర్కైవ్స్ సంకేతం కూడా గమనించింది. ఆమె కంప్యూటర్ కన్సల్టెంట్ రాబర్ట్ అప్పుడప్పుడూ వచ్చి, ఆమె అన్ని కంప్యూటర్స్, ప్రింటర్స్, డ్రైవర్స్, వైరస్ ప్రొటెక్షన్, సరికొత్త ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్ ఇలా ప్రతిదీ అప్‌డేట్ చేస్తాడు. కంప్యూటర్ ఎప్పుడైనా క్రాష్ ఐనా, వెంటనే వచ్చి, మళ్ళీ అన్నీ సక్రమంగా నడిచేట్లు చూస్తాడు. నిసి ఆర్కైవ్స్ అని చూసి, ద న్యూయార్కర్ మేగజీన్‌కి లాగా తనకూ ఆర్కైవ్స్. దమ్మిడీ ఆదాయం లేకుండా ఎందుకు ఈ రచనా వ్యాసంగం? అనుకుని వెంటనే, ఐ కెన్ ఛేంజ్ దట్, ఇఫ్ ఐ వాంట్ టు. నో వర్రీస్! అనుకుంది.
ఆమె డైరీలో ఒక విదేశీ ట్రిప్ గురించి ఎన్నో ఏళ్ళ కింద ఈ పాత ఎంట్రీ ఉంది. కుతూహలంతో అది విప్పి చూసింది.

“ఏవో ఆర్ట్ గేలరీ లు చూసిన తదనంతరం
ఆ సంధ్య వేళ, ఆమె (పుట్టినది ఆంధ్ర, ఇండియా) ఆ రాతి టెర్రెస్ మీద గొడుగుల కింద
ఒక వైన్ గ్లాస్ తీసుకుని, కుర్చీలో
ఆసీనురాలయింది. దూరపు కొండల అందాన్ని చూస్తున్నది. ఆవలిగా కూర్చొన్న వారు
లోకల్స్ లాగున్నారు. కొద్ది సేపట్లో వారు
గొంతుల జోరు పెంచి మాట్లాడు కోసాగారు. ఒక స్త్రీ, చటుక్కున సీట్
లోంచి జారి, పక్క అతని ఒడిలో జేరింది. ఆమె చేతులు
అతని మెడలో దండగా వేసింది. వారు ఎంత నాజూకుగా, ఎంత సొగసుగా ఉన్నారు.
సంభాషణ ఇంత జాప్యం లేకుండా సాగుతూనే ఉంది. అంత సుందర దృశ్యం
ఆరుబయట ఆమె ఇండియాలో ఎప్పడూ చూడలేదు. ఆమె ఇండియాలో
ఉన్నప్పుడు, అట్టి అలవోక కౌగిలింత, దేవాలయాలపై శిల్పాలుగా చూసింది. కానీ ఆ శిల్పాలు చూసే అక్కడి
భారతీయులు, ఆ బొమ్మలలో, స్త్రీ పురుషుల లాగా ప్రవర్తించనే లేదు.
వారి చేతుల్లో పళ్ళెరాలు టెంకాయిలు ఉన్నాయి.
వారి శరీరాలన్నీ, గుడ్డల్లో మూటల్లాగా కట్టేసి ఉన్నయ్యి.
వారు గుండ్రంగా గుడి చుట్టూ తిరగటం లోనూ, వారి చుట్టూ వారు తిరగటం లోనూ,
పసుపులు, కుంకుమలు, ఆ రాతి బొమ్మలపై మెత్తటం లోనూ నిమగ్నులై ఉన్నారు. శిల్పం మీద వారికి చూపు లేదు.
శిల్పాలలోని స్త్రీ పురుషుల చర్యల మీద వారికి ఆసక్తి లేదు.
ఆ మనుషులు గుంపుల్లో వస్తున్నారు. అప్పుడప్పుడూ రాళ్ళపై పొర్లుతున్నారు.
వెడుతున్నారు. కింద రాళ్ళ పైనంతా టెంకాయల నీళ్ళు. వాసన. అంతా రొచ్చు, రొచ్చు.
ఎందుకు చేస్తున్నారు ఈ వింత పనులు. ఏమిటి ఈ కార్య కల్పం?
ఏదో కలలో లాగా గతకాలం లోని ఆ దృశ్యాన్ని మనోఫలకం మీద చూసింది.
ఒక్కసారిగా వళ్ళు జలదరింపుతో, ఆమె ఆ ఎప్పుడో తను ఎరిగిన భారతం నుండి
ప్రస్తుతంలో ఉన్న దేశం లోకి వచ్చింది. ఆమె ఆనంద పూర్ణ మనస్క అయ్యింది. నిస్సంకోచంగా ఇద్దరు స్త్రీ పురుషులు,
ఆరు బైట, అల్లుకుని ఉన్న సుందర దృశ్యం నిజంగా భువి లో ఉంది. రాళ్ళు కాదు. దేవుళ్ళు కాదు.
నిజమైన మామూలు మనుషులు. వస్తాను, నేనీ శుభ్ర, శృంగార దేశానికి
మళ్ళీ వస్తాను. ఇక్కడే కొన్నేళ్ళు ఉండిపోతాను. ఇంత సుందరత, జీవన చైతన్యం చూస్తూ నేనిక్కడ
పునర్జీవిత నౌతానని, పాత నిర్లిప్తత, తెలుగు ఫ్రిజిడిటీ, సమాజపు రిప్రెషన్ కడిగి వేసి, నా సహజ సుందర
స్త్రీత్వం లోని నగ్నత్వం, గాఢత్వం, కాంక్షా పూరిత తత్త్వం,
ఈ జన్మలోనే అన్నీ అనుభవిస్తానని
ఆమె స్థిరంగా నిర్ణయించుకుంది.”

అది చదివి నిసి నవ్వుకుంది. ఇది ఏమిటి? అప్పటి నా వయసు లోని వచనకవితా? నేనేదో తాపీ ధర్మారావు, డి. ఎచ్. లారెన్స్ కాంబినేషన్ గాలా ఉన్నా అనుకుంది. ఆ రాత ఇండియా నోట్‌బుక్ నుంచి తీసి, ఎప్పుడు కంప్యూటర్‌ లోకి ఎక్కించిందో ఆమెకే తెలియదు. అన్ని వయసుల లోనూ ఎన్ని రాతలు రాసిందో. ఎన్ని రకాల ఉక్రోషాలు, అసూయలూ వెళ్ళగక్కిందో. అవన్నీ అక్కడా ఇక్కడా చెల్లాచెదరై పోయాయి. పోవటమే మంచిది.

ఇంతలో ఆమె ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సంగతీ, ఆమెకు ఇంగ్లీష్ తప్పించి ఇతర భాష రాదనీ తెలుసుకున్న ఒక యువ జంట, వారందరి స్టేషన్ దగ్గరకు వస్తున్న సంగతి చెప్పి, ఆమె సామాను వారే ప్లాట్‌ఫామ్ మీదికి దించారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుని నాలుగు అడుగులు వేయగానే ఆమె పేరు అట్టమీద ఇంగ్లీష్‌లో రాసి పెట్టుకుని, ఎదురు చూస్తున్న లిమో డ్రైవర్ కనిపించాడు. ఆమెకెంతో రిలీఫ్ వచ్చింది. బ్యూటిఫుల్ ప్రొవాన్స్! ఐ యామ్ హియర్ ఎగైన్! అనుకుని. అతి సుందరమైన ప్రకృతి చూస్తూ ఒక గంటలో, టెర్రా బ్లాంచ్ – ఫోర్ సీజన్స్ హోటెల్ చేరుకుంది.


నిసి ఆ రాతి టెరేస్ మీద గొడుగుల కింద ఒక వైన్ గ్లాస్ తీసుకుని, కుర్చీలో ఆసీనురాలయింది. దూరపు కొండల అందాన్ని చూస్తున్నది. ఆవలిగా కూర్చొన్న వారు లోకల్స్ లాగున్నారు. కొద్ది సేపట్లో వారు గొంతుల జోరు పెంచి మాట్లాడుకోసాగారు…

నిసి ఒక్కసారి ఉలిక్కిపడింది. అదే సీన్ కదా తను అంతకు ముందు రైలు ప్రయాణంలో తన పాత డైరీలో చదివింది. జరిగిందే జరుగుతూందా? లేక తను రాసిందే రాస్తుందా. ఆమెకు కొద్దిగా డీజావూ, కొంచెం గజిబిజిగా అనిపించింది. ఆలోచన మరల్చటానికి, వేరే వాళ్ళ కేసి, అక్కడి టేబుల్స్ మీది కాఫీ, టీ డిస్పెన్సర్లూ, డిన్నర్ వేర్, తళతళలాడే బోర్లించిన గాజు గ్లాసులూ చూసింది. దృష్టి మరల్చి టెరేస్ గోడ మీదుగా ముందుకు చూసింది. చెట్ల మధ్యగా దారులలో చెయ్యి ఊపుతూ, టెరేస్ కేసి వస్తున్న విక్టర్ బెర్నెట్టీ. టెరేస్ మెట్లెక్కుతున్న విక్టర్. గాలిలో ఎగిరే అతని లేతరంగు జుట్టు. యూరోపియన్ సుమా, అని చెప్పే అతని వస్త్రధారణ, నడక, ముఖపు పొంకం.

నిసికి అతని మీద ప్రేమ ఉప్పొంగింది. ఆమె వెనుకటి రోజుల లోనైతే, అలాగే కుర్చీలో కూర్చొనే ఉండి, అతడు వచ్చాక లేచి కరచాలనం చేసి ఉండేది. అతను నిదానంగా కూర్చుని, పరాయి పరిచితులతో మామూలుగా నడిపే, “ఎలా ఉన్నారు, మీరెలా ఉన్నారనే” సంభాషణ చేసి ఉండేది.

కాని నిసిలో ఈ మధ్య కాలంలో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ఆమెలో భారతీయత తగ్గుతూంది. ఆమె తన అంతకు ముందు బంధనాలు, బంధువులనుండి దూరంగా జరుగుతున్నది. ఆమె మనస్ధితిలో, నడతలో ఒక కొత్త యౌవనం, కొత్త వ్యక్తిత్వం, ఉత్సాహం ఉద్భవించాయి.

నిసి ఒక్కసారిగా లేచి, విక్టర్‌కి ఎదురుగా పరుగెట్టింది. టెరేస్ మీదకు కాలు పెట్టబోతున్న వాడిని ఆ ఆఖరు మెట్టు మీదే నిలబెట్టి, గాఢంగా కౌగిలించుకుంది. వారి ఎత్తులు సమాన మయ్యాయి. ఆమె అతని ముఖం చేతుల్లోకి తీసుకుని, అతని స్ఫుటమైన, ముద్దుల కాహ్వానిస్తున్నట్టుగా ఉండే విలువంపుల పెదవుల మీద తన గులాబీ పెదవుల ముద్దు ఉంచి, అలాగే నిలిపి ఉంచింది. దీర్ఘంగా అతని శరీరపు పరిమళాన్ని ఆఘ్రాణించింది. విక్టర్ అప్రయత్నంగా, ఆమెను చుట్టివేశాడు. ఎంతో రిజర్వ్‌డ్ నిసి. తన షెల్ నుంచి బయటకు వస్తున్నదా? విక్టర్, లోలోపల ఆశ్చర్యపోయినా, ఆమె కౌగిలికి, ముద్దుకు పరవశుడై, తిరిగి కౌగిలించి గాఢంగా ఆమెను ముద్దాడాడు.

టెరేస్ మీద కూర్చొన్న వారు ఆ సుందర దృశ్యాన్ని ఆనందించారు. The world loves the lovers.

నిసి, విక్టర్ మెట్లెక్కి వస్తుండగా, అక్కడి రెస్టరాంట్ స్టాఫ్ ఆనందంగా కన్నులతో సైగలు చేసుకున్నారు. ఎందుకంటే అంతకు ముందు సారి ఆమె ఫోర్ సీజన్స్‌లో, అక్కడ గెస్ట్‌గా ఉన్నప్పుడు ఒక యోగినిలా ఉండింది. అక్కడి వారందరితో ఆమె ఎంతో మర్యాదగా వ్వవహరించినా, ఏదో మారుమూల టేబిల్ దగ్గర మౌనంగా చదువుకుంటూ ఉంటం, రుచికరమైన వంటలు వైన్‌లు తెప్పించుకునీ, వాటిని అంటీ ముట్టకుండా నిరాసక్తంగా ఉండేది. ఆ సారి విజిట్‌లో, ఆఖరు రోజు ఆమె పుట్టిన రోజు అని గ్రహించి, ఛీఫ్ షెఫ్ ఆమెకు బఫే టేబిల్ దగ్గర, పక్కనే ఉండి, ఈ ట్రఫుల్స్, తప్పక తినాలి. ఇవి ఇక్కడి డెలికసీ. ఈ సీజన్లో తప్ప దొరకవు. ఈ సున్నితమైన క్రేప్స్, ఈ ఫ్రెంచ్ పేస్ట్రీలు, ఈ క్వెయిల్, ఈ వైన్ లతో, అంటూ ఆమె తినవలసినవన్నీ వేరు వేరు ప్లేట్లలో సర్దించి, వేరే వెయిటర్లతో ఆమె బల్ల దగ్గరికి పంపాడు. తర్వాత కొంచెం సేపు తనే వచ్చి ఆమెతో పాటు కూర్చొన్నాడు. అతని కుటుంబపు కబుర్లు చెప్పాడు. ఆ అపరిచితుల మర్యాదలకు ఆమె చలించింది. ఫ్రెంచ్ వారు మర్యాద లేని వారు, వేరే దేశాల వారితో రూడ్‌గా ఉండి, వారిని గమనించనట్టు ప్రవర్తిస్తారన్నారేం పుస్తకాలలో. తన అనుభవం ఏ ఒక్కసారీ అది కాదు. నిసి వారితో పాటు నవ్వింది. ఆమె ఉదాసీనతను మరిచింది. ఆ సారి ప్రొవాన్స్ నుంచి, ఫ్లారిడా వెళ్ళిపోయాక ఆ హోటల్ మేనేజ్‌మెంట్‌కు పొగడ్త ఉత్తరం రాసి, స్టాఫ్ తన ఫుడ్ ఎలర్జీ విషయంలో శ్రద్ద చూపుతూనే, ఎన్నో మంచి వంటలను వండిపెట్టినందుకు, ఆదరం చూపినందుకు, ఆ హోటెల్ పనివాళ్ళ ఫండ్‌కు పెద్ద మొత్తాన్ని గిఫ్ట్‌గా పంపింది.

నిసి, విక్టర్ చుట్టూ చేతులు చుట్టి అక్కడ కూర్చుందాం అంటూ, తన టేబిల్ దగ్గరకు నడిపించింది. ఈ సారి వారు కేవలం పరిచితులలాగా, అమెరికాలో స్నేహితుల వలె ఎదురు బొదురుగా కూర్చోలేదు. బూడపెస్ట్‌లో గ్రిషామ్ పాలస్‌లో లాగా ఫార్మల్‌గా, మర్యాదల గిరి లోనూ లేరు. అమెరికాలో వారి ప్రధమ పరిచయాలు గుర్తు చేసుకునే దశలో లేరు. యూరప్‌లో ప్రేమికుల లాగానే, ఆ చిన్న బల్ల దగ్గర కుర్చీలు పక్క పక్కన అతి దగ్గరగా జరుపుకున్నారు. ఆమె భుజాల చుట్టూ అతని చెయ్యి చుట్టే ఉంది. మధ్యలో వారు ఒకరిని ఒకరు చూస్తూ, ఎంతో కాలంగా చూసుకోక బెంగ పడిన వారిలాగా ముద్దులు పెట్టుకుంటున్నారు.

వారి బల్ల వద్దకు షాంపేన్, చిన్ని ఫలహారాలు, ఆలివ్‌లూ వచ్చి చేరాయి. తెచ్చిన వెయిటర్, “డాక్టర్ షామల్ అండ్ గెస్ట్‌కి కాంప్లిమెంట్స్‌తో” అన్నాడు.

విక్టర్ ఆమెకు ఛీర్స్ చెపుతూ, “ఈ దేశం నాది అనుకున్నా. ఇక్కడ పలుకుబడి ఎప్పుడూ, మీకే ఎక్కువున్నట్టుంది.”

ఆమె, ఒక ఆలివ్ అతని నోటికందించి, వెనువెంటనే ముద్దు పెట్టింది.

విక్టర్‌కి అర్ధమయింది. నిసిలో మార్పు. నిసి ఈజ్ ఇన్ లవ్ విత్ హిమ్ నౌ. అతని హృదయంలో ఎంతో సంచలనం. నమ్మలేని ఆనందం.

అతడైతే ఆమెను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు. ఆమెను తెలుసుకున్న ముందు రోజులలోనే, ఆమె పట్ల ప్రేమ కలిగింది. అప్పుడు నిసిని తన అక్కయ్యని, మృత్యు ముఖం లోంచి తప్పించే ఒక వీర వనితగా చూశాడు. ఆ రోజుల్లో ఆమెను గురించి, ఆమెను మనసులో ఉంచుకుని, అతను చిన్ని కంపోజిషన్స్ చేసేవాడు. అప్పుడప్పుడూ తన కాన్సర్ట్ లలో, శ్రోతలు చివరలో మరొక్క పాట, మరొక్క రొమాంటిక్ సాంగ్ అన్నప్పుడు, నిసిని గురించి తను రాసుకున్న ప్రెల్యూడ్‌స్, చిన్ని లీడ్స్ పియానో మీద వాయించి, తనే పాడి వినిపించేవాడు. నెమ్మదిగా, పోను పోను, ఇదివరకటి మోజార్ట్, షాష్టకోవిస్కీ, బ్రామ్స్, లిజ్స్ట్ సంగీతం తను వాయిస్తే ఎంత సంతోషంగా శ్రోతలు వింటారో అంతే ఆనందంగా ఆడియన్స్ అతని సొంత కాంపొజిషన్స్ వినేవారు.

నిసి అమెరికాలో ఆమె క్లినిక్ లలో తనను చూసినా, అప్పుడప్పుడు పేషెంట్లతో పాటు, ఆమె ఆఫీస్‌లో గాని, తర్వాత పేషెంట్ దగ్గర బంధువుగా పేషెంట్ లేకుండానే ఫామిలీతో డిస్కషన్ రూమ్స్‌లో కలిసినా కూడా, చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించేది. ఆమె తన వైద్యవృత్తిలో పేరు గడించుకుంటున్న రోజులవి. రోగుల వైద్యం, పాత కొత్త పధ్దతులు బేరీజులు, రోగ నిదానం, కుటుంబం నుండి రోగికి సరైన ప్రేమ, ఆర్ధిక సహాయాలు కల్పించటం, ఎప్పటికప్పుడు, రోగి పరిస్థితిని గూర్చి, కుటుంబంలోని వ్యక్తులకు సరిగా చెప్పి, ఒకవేళ పిల్లలుంటే, వారికి సరైన భద్రత – మానసికంగాను, ఇంటి దగ్గర వారి పరిరక్షణ లోను, ఇవన్నీ ఆమె ముందు చూపుతో ఆలోచించి, నర్సులతో, సోషల్ వర్కర్ లతో కలిసి పని చేస్తూ, చాలా చురుకుగా ఉండేది. విక్టర్‌కు ఆమె అప్పట్లో ఇలా కనిపించి అలా మాయమయ్యే తళుకు తార. ఒక బ్రైట్ స్టార్.

ఆమె అప్పట్ల్లో తన పేషెంట్ తమ్ముడైన అతనిని గురించి ఏమీ ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నమే చెయ్యలేదు. ఐనా ఆమెను గురించి అతని అడ్మిరేషన్ పెరుగుతూ వచ్చింది. నర్సుల ద్వారా, ఆమె వివాహిత అని విన్నప్పుడు అతడ హతాశుడయ్యాడు. అతడు యూరోపియన్. తనయందు అనురక్తి ఉంటే, ఆ స్త్రీ పొందు అతనికి అభిలషనీయమే. కాని నిసి ఇండియన్. ఎంతో మోడర్న్‌గా కనిపిస్తున్నది. ఆమె బ్రిలియన్స్‌తో మెప్పిస్తున్నది. కానీ ఆమె కల్చర్ వేరు. ఐనా ఆ సందర్భంలో అతని అక్కయ్య జబ్బు గురించిన ఆలోచనలు, ఆమె క్షేమం, అతనికి ప్రధానం. నిజానికి డాక్టర్ నిసి షామల్ మీద ఆకర్షణకు, తనకు తన అక్క మీద ఉన్న ప్రేమాభిమానాలే ఎక్కువ కారణం ఏమో అని అతను చాలా సార్లు వితర్కించుకున్నాడు.

ఏమైనా ఆమెను లండన్‌లో, తర్వాత రోమ్‌లో కలవటం అతని జీవితంలో అనుకోకుండా వచ్చిపడిన వసంతం. అతడు ఆమెతో ఉత్తరాల ద్వారా గాని, ఫోన్‌లో అప్పుడప్పుడూ మాట్లాడి కాని, మరీ మరీ కాంతిమంతుడవసాగాడు. అతని సంగీతం, ఎంతో హృదయ స్పందనను కలిగించేదిగా మార్పులు చెందుతూంది. అతని స్నేహితులు, సంగీత విమర్శకులు, ఎంతో వివేచనతో, ఆ మార్పులను గమనించి, వ్యాసాలలో, పత్రికలలో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు అతని లైవ్ కాన్సర్ట్ లకు ఎంత సేల్స్ ఉన్నాయో, అతని రికార్డింగ్ లకు కూడా అలాటి మార్కెట్ క్రియేట్ అవుతున్నది. ఆ కళాకారునిలో ఇంతటి కళా విస్ఫోటనానికి కారణం ఐన నిసికి ఈ విషయాలేమీ తెలియనే తెలియవు. ఇప్పుడు ఈ నాటికి తనంటే, తను గౌరవించే ఈమెకు ప్రేమ ఉద్భవించింది. విక్టర్ నిజంగా విజేత ఐనాననుకున్నాడు. సహజంగా ఉత్సాహశీలి, సహృదయుడు అతడు. అతని కల నిజమయింది.

వారిద్దరూ మెన్యూ లోంచి ఇద్దరికీ ఇష్టమైన పదార్ధాలు ఆర్డర్ ఇచ్చారు. వైన్ వారిద్దరికీ అతడినే సెలక్ట్ చెయ్యమంది. అతడు ఫ్రెంచ్‌లో వెయిటర్ను ఏవో ప్రశ్నలడుగుతున్నప్పుడు, తెలియకుండానే “డార్లింగ్ నిసీ! ఇది నీకోసం తెప్పిస్తున్నా” అంటే, “ష్యూర్ ఐ లవ్ ఇట్ స్వీటీ!” అంది. ఆ వెయిటర్ వాళ్ళ ముందు నుండి మెన్యూలు తీసీ తియ్యగానే అతని జుట్టు సవరిస్తున్నట్టు ఇంకొంచెం చెరిపి, అతని చెంప పైని చేయి ఆనించి, పెదిమ చివరలు అంటి, మెడ పైని వేళ్ళుంచీ, ఏదో ఒక మిషతో అతనిని తాకటంతో, విక్టర్‌కు ఎంతైనా సంతోషం కలిగింది. ఎంత రిజర్వ్‌డ్‌గా ఉండే నిసి, అతి ప్రైవెసీని మెయింటైన్ చేస్తూ, ఎవరినీ తన లోపలి పరిధి లోనికి రానివ్వని ఈమె, ఈ విద్యావతి, నా కోసం తన హృదయపు తలుపులు తెరిచింది. ఎందరైనా స్నేహితులు ఉండి ఉండాలే, ఆమె విద్యార్థి దశ నుండి ఇప్పటివరకూ. నేనే ఎందుకు ఇష్టమయ్యాను? సంగీతమంటే ఆమెకు ఇష్టమున్న మాట నిజమే, కాని అలా అంటే ఆమె ఆలెక్స్ రూబెన్ స్టూడెంట్. హి ఈజ్ ఎ టెరిబ్‌లీలీ ఎట్రాక్టివ్ గై. ఒకరికొకరు దగ్గర్లో ఉండి తరచూ కలుసుకుంటారు కూడాను. వై నాట్ హిమ్! అనుకున్నాడు. ఆ ఆలోచనలన్నీ ఇప్పుడెందుకు! ఆమె స్పష్టంగా తనపై ప్రేమ చూపుతుంటే.

విక్టర్ ప్రేమశీలి. ఆమెకు, “యూ మస్ట్ టేస్ట్ దిస్ నిసీ!” అని ఆమెకు తన ఫోర్క్‌తో తినుబండారాలు నోటికి అందిస్తూ, మధ్య మధ్యలో “యూ నో వాట్ హాపెన్డ్ ద అదర్ డే ఇన్ మొనాకో,” అంటూ, వాళ్ళు ఎన్నో సంవత్సరాలనుండి ఎడం లేకుండా కలిసి ఉన్నట్టే కబుర్లు చెప్పాడు. “ఈ రిసార్ట్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఔట్ డోర్ స్కల్ప్‌చర్. బ్యూటిఫుల్ ఇన్ఫినిటీ పూల్! వాట్ ఎ లొకేషన్. నిసీ! ఆ కనిపించే దూరపు కొండల బారులలో ఉన్న విలేజెస్ ఫయాన్స్, సెయాన్స్, మాఁస్, అక్కడి పాత ఆర్కిటెక్చర్, చర్చెస్, చిన్ని చిన్ని వీధులు, వారి కూరగాయల మార్కెట్, ఆ కొండ దారుల్లో ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. అవన్నీ తప్పక చూడాలి.”

నిసి టెర్రబ్లాంచ్ ఫోర్ సీజన్స్ రిసార్ట్ ఆర్కిటెక్ట్ నుమాయెర్‌ని చాలా మెచ్చుకుంది. మెయిన్ హోటెల్, విడి విడిగా విల్లాలు, ఈ కొండలలో, లోయలలో సమ్మిళితమై పోతూనే, గాల్ఫ్ కోర్స్‌తో, భవనాల లోపల మాత్రం అత్యంత ఆధునికమైన సౌకర్యాలు, కలిగి ఉండటం చాలా హాయినిస్తున్నదనీ, ఎన్ని దారులలో నడిచినా, ప్రొవాన్స్ చెట్టు చేమల పరిమళాలు ఆఘ్రాణించటంలో తనివి తీరటం లేదని అతనితో అన్నది.

కబుర్లాడుకుంటూ తేలిక తేలికగా, ఎన్నో డెలికసీలు రుచి చూసి, ఆఖరుగా, లెట్ అజ్ షేర్ క్రిమ్ బ్రూలె అండ్ సమ్ షెర్రీ, అనుకున్నారు వారు. అప్పుడే పైన ఆకాశంలో మూన్ ప్రకాశమానమవుతున్నది. ఆ కాంతిలో నిసి చక్కని వంపుల విగ్రహం ప్రదర్శితమైంది. ఆమె వంకుల పొడవు జుట్టు మిలమిలలాడింది. ఆమె బిల్ సైన్ చేస్తుండగా, “నా కార్ టెంపరరీ పార్కింగ్ లో ఉంది, కెన్ యు మూవ్ ఇట్ ప్లీజ్?” అని విక్టర్ అంటే వెయిటర్ నిసి వంక చూసి, ఆమె తల ఊపు అర్ధం చేసుకుని, “మీరు కీస్ ఇస్తే, మేడమ్ విల్లాకి దగ్గర పార్కింగ్‌కి మారుస్తాము. వెన్ యూ ఆర్ రెడీ, ఎ గాల్ఫ్ కార్ట్ విల్ టేక్ యు టు ద విల్లా. అన్లెస్ యు వాంట్ టు వాక్. ఎంతో అందమైన రాత్రి.” అన్నాడు.

“వియ్ వాంట్ టు వాక్, ధాంక్స్ అండ్ గుడ్ నైట్!” అని చెప్పేసి వెళ్ళి పోయారు నిసి, విక్టర్.


“యు రిమెంబర్ ద నైట్ ఇన్ రోమ్ నిసీ!?” అన్నాడు విల్లాలో, అతడు. బాల్కనీ మీదికి వెళ్ళే స్లైడింగ్ డోర్స్ బార్లా తెరిచి ఉన్నాయి. వెన్నెల పొడలు పొడలుగా వారి మీద పడుతోంది. అతడు హోటల్ రోబ్ ధరించి కాళ్ళు బార చాపుకొని, సోఫాలో జారగిలబడి ఉన్నాడు. అతని ఒడిలో నిసి.

“ఎనీ బాండ్ ఎయిడ్స్ ఫర్ ద ఫుట్ టునైట్, డార్లింగ్! యు వాంట్ ఎ పొయట్రీ రీడింగ్!?” అడిగాడు ఆమెను ముద్దులాడుతూ.

“ఐ కెన్ డూ విత్ ఎ సాంగ్! నా కోసం పాడండి.” అంది నవ్వుతూ నిసి, తన పాదాల గోళ్ళ రంగుల కేసి చూస్తూ.

మెల్లగా, మధురంగా పాడాడా సంగీతకారుడు.

ఆకాశంలో ఆడే తారలు!
నడయాడే చంద్రిమ
ప్రేమించనా నిన్నొకసారి!
నిన్ను చూసింది మొదలూ
చెప్పాలనుకున్నా,
కావాలని నీతో సంగమ భోగం
రాతిరి జరిగే, సమయం తరిగే
ఉషస్సు తోచే;
ప్రేమించనా నిన్నొక సారి!

(నిసి షామల్ 2014 డైరీ నుండి.)