ఆమె వచ్చి నా ఎదుట నిలబడింది.
“నన్నెప్పుడు పరిచయం చేస్తారు అందరికీ!”
నేను ఇబ్బందిగా కదిలాను. “అప్పుడే కాదు, ఇంకొంచెం సమయం కావాలి…” నసిగాను.
ఆమె మొహం మ్లానమైంది. “ఎందుకు! ఎందుకు మీరింత తటపటాయిస్తున్నారు?” అని అడిగింది.
నేను కళ్ళు వాల్చుకుని నా చేతికి వున్న గాజులు సవరించుకుంటూ ఉండిపోయాను.
“పరిచయం చేయడం సంగతి అలా వుంచండి. మీరు కనీసం నేనేం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అన్న విషయాలయినా నాకు నేర్పడం లేదు. నాకు తర్ఫీదివ్వడం మొదలు పెట్టనే లేదు.”
ఆమె మాటలకి నేను మరొకసారి ఇబ్బందిగా కదిలాను.
“నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా! నిజానికి నేనసలు ఎవరికీ తర్ఫీదులు ఇవ్వను. అందరి ముందుకీ వెళ్ళినపుడు కూడా నువ్వు మాట్లాడదల్చుకున్నదీ నువ్వు మాట్లాడగలిగినదే నువ్వు మాట్లాడాలి కానీ నేను నీకు నేర్పించడమూ నియంత్రించడమూ ఉండదు.”
“అదేమిటి మరి! సంధ్య, ప్రియ, నిత్య, అరుణ, సత్యం, మాధవ్… మొన్నటికి మొన్న మీరు వెలుగు లోకి తెచ్చిన ఆ పెద్దావిడ… వాళ్ళందరూ… వాళ్ళకి అలా అంత చక్కగా మాట్లాడటం,అంత నిబ్బరంగా ప్రవర్తించడం… అదంతా నేర్పింది మీరే కదా!” ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
“లేదు.” నేను తల అడ్డంగా ఊపాను.
“వాళ్ళెవ్వరికీ నేనేమీ నేర్పలేదు. వాళ్ళు మాట్లాడినవన్నీ వాళ్ళ మాటలే. అచ్చంగా వాళ్ళ నోట్లోనుంచి వచ్చినవే. నా ప్రమేయమేమీ లేదు.”
నా మాటలు విని ఆమె హతాశురాలయినట్లుగా నిలబడిపోయింది.
“నిజానికి నీకు కూడా నేనేమీ నేర్పనవసరం లేదమ్మా. నీ వాదన నువ్వే చేసుకోగలవు. నీ గురించి నువ్వే చక్కగా చెప్పుకోగలవు. నీ సమస్య పట్లా నీ పరిస్థితి పట్లా నీకు స్పష్టత వుంది. నీ దృక్కోణం నీకుంది. నువ్వైనా నేనైనా అందరికీ చెప్పాల్సింది అదే కదా!” అన్నాను.
ఆమె అలానే చూస్తుంటే మళ్ళీ నేనే చెప్పాను. “నిజం చెప్పాలంటే నీలో నన్ను ఆకర్షించినదే నీ వ్యక్తిత్వం. నీ బలం. నీ విశిష్టత. బలహీనులని అందరి ముందూ బయటపడేసే పని నేనసలు చేయనే చేయను.”
“నాకు తెలుసు,” అంది ఆమె తల ఊపుతూ.
“అందుకే మరొకరి దగ్గరికీ మరొకరి దగ్గరికీ వెళ్ళకుండా మీ దగ్గరికి వచ్చాను నేను. ఎప్పటికైనా మీరే నన్ను అందరికీ పరిచయం చేయాలని ఎదురు చూస్తున్నాను.”
“కానీ బాగా ఆలస్యమవుతోంది కదా!” నేను మొహమాటంగా గొణిగాను.
“ఆలస్యమవుతుందని తెలిసే వచ్చానండి. త్వరగా తేలిపోవాలంటే మావూరాయనే ఒకాయన వున్నాడు. మీకు తెలుసు కదా! ఆయన దగ్గరికే వెళ్ళి వుండేదాన్ని.”
ఆమె మాటలు విని నేను విస్మయంగా చూశాను.
“అవును కదా! ఆయనది మీ ఊరే కదా! మర్చిపోయాను. ఆయనకయితే నీ భాషా యాసా కూడా బాగా అర్థమవుతాయి కదా! నీలానే మాట్లాడతారాయన. పైగా ఆయన మాట అంటే చాలామందికి గురి కూడా. నిజానికి ఆయన పరిచయం చేస్తే నీకీపాటికి చాలా పేరొచ్చి వుండేది…”
ఆమె చేసిన వ్యాఖ్యకి నేనలా వాపోతూ ఉండగానే “ఊరుకోండమ్మా,” అని ముద్దుగా కసిరింది ఆమె నన్ను.
“ఆయన పరిచయం చేస్తే నన్నిలా మిగలనిస్తాడా? నేను ‘తేలిపోవాలంటే’ ఆయన దగ్గరికే వెళ్ళి వుండేదాన్ని అని ఎందుకన్నానో మీకు అర్థం కాలేదనుకుంటా. ఆయన దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పుకుంటే నా వ్యక్తిత్వాన్నే ‘తేల్చిపారేసేవాడు’ అని నా వుద్దేశ్యం.”
ఆమె చెప్పిన తీరుకి నేను చిన్నగా నవ్వాను.
“నువ్వు ఆ మాట అన్నప్పుడు నాకు ఆ భావం స్పురించింది. కానీ నువ్వు అంత ఆలోచించి అని ఉంటావని నేను అనుకోలేదు.” ఒప్పుకున్నాను.
ఆమె కూడా నవ్వింది. “ఆలోచించే అన్నానమ్మా. ఆయన గనక పరిచయం చేస్తే నాకు బాగా పేరొచ్చి వుండేది నిజమే. కానీ ఆ పేరుకి జతచేయబడిన వ్యక్తిత్వమూ, స్వభావమూ నావయ్యి ఉండేవి కావు.” స్పష్టంగా చెప్పింది.
“అయినా ఆయనకి నాలాంటి వాళ్ళం కనబడమమ్మా. నాలాంటి సామాన్యులలో కూడా కాస్త తెలివీ ధైర్యం ఉంటాయంటే ఆయన ఒప్పుకోడు.” మళ్ళీ తనే అంది కొంచెం నిరసనగా. అంతటితో ఆగకుండా “అసలు ఆయన బోటి పెద్దమనుషుల కధేంటో చెప్పమంటావా?” అని ఉత్కంఠ రేపుతూ ఓ ప్రశ్న వేసింది.
నేను ఆసక్తిగా చూశాను.
“అందరూ గోతిలో పడిపోయి గోల పెడుతున్నారనుకుంటే ఆయన లాంటి వాళ్ళకి ఒక తృప్తి. జనాన్ని పిల్చి ‘ఇదిగో చూడండి. పాపం వీడు గోతిలో వున్నాడు. కష్టాల్లో వున్నాడు. అమాయకుడు. ఎలా బ్రతకాలో కూడా వీడికి తెలియదు. నేనే వీడిని కనిపెట్టి చేరదీసి జీవితాన్ని బాగుచేసుకోవడమెలాగో నేర్పిస్తున్నాను,’ అని చెప్పుకోవడం సరదా. అంతేకానీ వాడు తనంతట తాను గోతిలోనుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తానంటే మాత్రం ఆయన ఒప్పుకోరు. ఎలాగోలా కష్టపడి వాడి జీవితాన్ని వాడే బాగు చేసుకున్నాడంటే ఇక వాడిని పట్టించుకోనే పట్టించుకోరు. ఎందుకంటే బాధల్లో బలహీనతల్లో వున్న వారి గురించి చెప్పుకుంటేనే కదా ఆయనలాంటి వాళ్ళకి పేరూ ప్రఖ్యాతి. ఒకళ్ళని ఉద్దరిస్తున్నామంటేనే కదా వాళ్ళకి ప్రత్యేకత! అందుకే బాధల్లోనే వున్నా ధైర్యంగా హుందాగా వుండేవాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళనసలు గుర్తించరు. తమ పరిస్థితుల పట్ల ఆక్రోశాన్నీ అసహనాన్నీ చూపకుండా, జరిగిపోయిన దానికి చింతిస్తూ ఆవేశపడుతూ కూర్చోకుండా, జరగవలసిన దాని మీద దృష్టి పెట్టేవాళ్ళంటే వాళ్ళకి మరీ చులకన.”
ఆమె విశ్లేషణకి నేను ఆశ్చర్యపోయాను.
నివ్వెరపాటుగా చూస్తూ “నీకా నేను మాటలు నేర్పాల్సింది! మనుషుల్ని… ముఖ్యంగా నిన్ను నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు? నువ్వేమిటో నీకు కావలసినదేమిటో ఎంత చక్కగా తెలుసుకున్నావు? దానిని ఎంత స్పష్టంగా నాకు వివరిస్తున్నావు?” అన్నాను.
“లేదమ్మా, మీ దగ్గర మాట్లాడుతున్నాను కానీ అందరి ముందూ ఇలా మాట్లాడలేను. చెప్పాల్సినవన్నీ ఒక వరుసలో చెప్పడం చేతకాదు. అసలు ముందు అవతలి వాళ్ళ ధ్యాసని నా వైపు తిప్పుకోవడం… వాళ్ళు నా మాటలపై శ్రద్ధ పెట్టేట్లు చేసుకోవడం… అదే కష్టం కదా! మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నట్లు అందరూ అర్థం చేసుకోరమ్మా. మీరు మా మాటలు విన్నట్లుగా అందరూ వినరమ్మా.”
నేను చిన్నగా నిట్టుర్చాను. “మొదటి విషయంలో నేను నీకు సహాయం చేయగలను. అంటే చెప్పాల్సిన విషయాన్ని వరుసలో చెప్పడం చేతకాదన్నావు చూడు, ఆ విషయంలో నేను కొంత సహకారం అందించగలను. నిజానికి నేను నీకు చేయాల్సిందీ చేయగలిగిందీ ఆ మాత్రం సహాయమే! అది చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అయితే రెండో విషయం… అందరూ నీ మాటలు శ్రద్ధగా వినడం, నీ మీద సానుభూతి చూపడం, ఆ విషయంలో నేను నీకు ఎక్కువ సాయపడగలననుకోను. నిజానికి నేను నిన్ను ఎలా అర్థం చేసుకున్నానో నీలో ఏ విశిష్టతలు చూశానో అది నేను అందరి తోనూ చెప్పగలను, ఆ కోణాలని మిగతా వారికి కూడా అర్థం చేసేందుకు ప్రయత్నించగలను. అయితే నా మాటలు విన్నవారందరు నీపై సానుభూతి చూపుతారని మాత్రం నేను నిన్ను మభ్యపెట్టలేను…”
“సానుభూతి ఎందుకమ్మా నాకు! సానుభూతి నాకసలు వద్దేవద్దు.” అంది ఆమె నా చివరి మాటలు పూర్తయ్యీ కాకముందే.
“నాకు కావలసింది అందరికీ నేనేమిటో అర్థం అవడం. ఆ పట్టింపు కూడా లేకుండా ఉండవచ్చు. ఎవరేమనుకుంటే మనకేమిలే అని వూరుకోవచ్చు. కానీ దానివలన కొన్ని నష్టాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం మా వ్యక్తిత్వాలని వక్రీకరించి బలహీనపరచి చూపుతుంటే దాని వలన మేము చరిత్రలో అలాగే ముద్ర పడిపోతాము. రాబోయే తరాలు మమ్మల్ని అలాగే అర్థం చేసుకుంటాయి. దాని వలన సమాజం నిజంగా నష్టపోతుంది.”
ఆమె చివరి మాటల్లో ఆవేశం కన్నా ఆవేదన ఎక్కువగా ధ్వనించింది. నేను నిదానంగా తలపంకించాను.
“ఇందాక చెప్పుకున్నామే మా వూరాయన… ఆయన్ని నేనొకసారి చూశానమ్మా.” మెల్లగా చెప్పిందామె.
“అవునా! ఎప్పుడు?” అప్రయత్నంగా అడిగాను నేను.
“కొన్నాళ్ళ క్రితం ఆయనగారు మాట్లాడే సభకి వెళ్ళానమ్మా నేను. ఆ సభలో మా వూరివాళ్ళెవరూ లేరు. అయినా వినేవాళ్ళు ఎవరైతే ఏమిటి… మాట్లాడే ఆయన మా కష్టసుఖాలు తెలిసిన మనిషి కదా. మావాడు కదా. మా గురించి ఎంత బాగా చెప్తాడో విందామని నేను వుత్సాహంగా కూర్చున్నాను. కానీ….” ఆమె గొంతుకి ఏదో అడ్డుపడ్డట్లుగా ఆగిపోయింది.
నేను ఆసక్తిగా చూశాను. ఆమె చెప్పింది.
“మీరు ఇందాక భాషా యాసా అన్నారు. నన్ను అర్థం చేసుకోవడానికి కావలసింది భాషా యాసా కాదమ్మా. మా ప్రాంతం వాడవడమూ కాదు. మా వర్గం వాడవడమూ కాదు. సహనమూ శాంతమూ వంటి వాటికి విలువ ఇచ్చే వాళ్ళు, జీవితంలో ఏది సత్యమో శాశ్వతమో గ్రహించిన వాళ్ళు ప్రపంచంలో ఏ వ్యక్తినైనా అర్థం చేసుకోగలుగుతారు. నిజమైన సహాయమూ సలహాలూ అందించగలుగుతారు. ఆ విచక్షణ లేని వాళ్ళు మీ కష్టసుఖాలు అర్థం చేసుకుంటున్నామంటూ ఎన్ని మాటలు చెప్పినా వాటి వల్ల ఉపయోగమేమీ లేదు. ప్రాంతం వర్గం వంటి వాటిని వాళ్ళు కేవలం రెచ్చగొట్టడానికీ స్వప్రయోజనానికీ వాడుకుంటారు. అంతే.”
“ఏమయింది? ఆ సభలో ఆయన మీగురించి అసలేమీ చెప్పలేదా! శ్రోతలని మెప్పించే మాటలే మాట్లాడాడా!”
“అదే కదమ్మా విచిత్రం… మా గురించే మాట్లాడాడు. కానీ శ్రోతల్ని మెప్పించేట్లుగా మాట్లాడాడు.”
నేను అర్థం కానట్లుగా చూస్తుంటే ఆమె వివరించింది.
“నాలా ధైర్యంగా వుండేవాళ్ళనయితే ఆయన పట్టించుకోడు. కానీ అమాయకంగా అసహాయంగా వుండేవాళ్ళ మీదనన్నా ఆయనకి సానుభూతి ఉందేమోననుకున్నా. అదేమీ లేదనీ ఆయనలాంటి వాళ్ళదంతా అవకాశవాదమేననీ ఆ రోజు నాకర్థమయింది. మా వూరి వాళ్ళ మాటలూ, కష్టాలూ, అమాయకత్వాలు, కుతంత్రాలు అన్నీ మా యాసలో చెప్పాడు. ఎవరైతే మమ్మల్ని అపహాస్యం చేస్తారనీ గౌరవంగా చూడరనీ మా కష్టాలన్నిటికీ కారణమనీ ఆయన ఉద్బోధిస్తూ ఉంటాడో వాళ్ళ ముందరే నిలబడి…”
గొంతు రుద్ధమవడంతో ఆమె ఒక్క క్షణం ఆగింది.
“…ఆ రోజు ఆయన మా దైన్యాన్నీ హైన్యాన్నీ ఎలా వర్ణించాడంటే ఆయన చెప్తున్నంత సేపూ జనం పొట్టలు పట్టుకుని నవ్వి నవ్వి అలిసిపోయారు. అంత హాస్యంగా చెప్పాడు. హాస్యం అంటే అందులో మళ్ళీ ఛలోక్తులేమీ లేవమ్మా… ఆయన చెప్పే ధోరణీ ఆ విషయమూ – అవే వినేవాళ్ళందరికీ నవ్వు తెప్పిచ్చేట్లుగా వున్నాయి.”
“బహుశా ఆయన దృష్టిలో అది జనరంజకమైన ఉపన్యాసం. కానీ నాకు మాత్రం ఆరోజు తలకొట్టేసినట్లయింది.” చిన్నగా నిట్టూర్చింది.
“మాటలూ అమాయకత్వాలు సరే… కష్టాలూ కుతంత్రాలు కూడా నవ్వొచ్చేట్లు చెప్పాడా!” అడిగాను ఎలా చెప్పి ఉంటాడో ఊహించే ప్రయత్నం చేస్తూ.
“ఏముందమ్మా వాటిని కూడా హాస్యంగా చెప్పచ్చు. తెచ్చిపెట్టుకున్న కష్టాలూ, అమలు చేసే ముందే బట్టబయలై పోయిన కుతంత్రాలూ నవ్వు తెప్పిస్తాయి కదా.”
అదిరిపోయాను ఆ జవాబుకి నేను. “ఏమి గమనింపు! ఏమి విశ్లేషణ! ఇటువంటి వారిని తక్కువగా అంచనా వేసి పబ్బం గడుపుకుంటున్న వాళ్ళంతా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లులే కదా! ఏదోలే పాపం అని వీళ్ళు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు కానీ వీళ్ళే కనుక కర్రెత్తితే…” నేను విస్మయంగా చూస్తుండగానే ఆమె మరో సత్యాన్ని అలవోకగా చెప్పింది.
“భగవంతుడనే వాడొకడున్నాడు ఎప్పటికన్నా ఆయనకి జవాబు చెప్పుకోవాలి అనుకునే వాళ్ళకీ… ఏదెట్టా బోయినా మనచుట్టూ జనముండాలి వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి అనుకునేవాళ్ళకీ… అదేనమ్మా వ్యత్యాసం.”
నేను దీర్ఘంగా నిట్టూర్చాను. అవును. ఈమె తప్పకుండా నలుగురికీ పరిచయం కావాల్సిన వ్యక్తే. ఈమె వ్యక్తిత్వం నలుగురికీ తెలియవలసిన విశిష్టతే. కానీ పర్యవసానాలు! పర్యవసానాల గురించి కూడా ఆమెని మరొక్కసారి హెచ్చరించడం నా బాధ్యత. నేను గొంతు సవరించుకుని మెల్లగా చెప్పాను.
“చూడమ్మా… నిజానికి నేను నీ దగ్గర నేర్చుకోవలసినదాన్నే కానీ నీకు చెప్పదగిన దాన్ని కాను. అయినా ఇంతకు మునుపు నాకు జరిగిన అనుభవాలని బట్టి నీకు ఒకటి రెండు విషయాలు చెప్పాలి.”
అలాగే, చెప్పండి అన్నట్లుగా తల ఊపింది ఆమె.
“చూడూ…” నేను గొంతులోకి చాలా మృదుత్వాన్ని తెచ్చుకుని చెప్పాను. “నువ్వు మీవూరాయన గురించి చెప్పావే… ఆ లక్షణాలు ఆయనొక్కడికే పరిమితం కాదు. లోకమంతా అలాగే వుంది. అయితే అవకాశవాదం కాకుంటే అయోమయం. రేపు నేను నిన్ను పరిచయం చేయగానే అసలు ప్రపంచమే తెలియని ఓ పిల్ల ‘అది పరమ మూర్ఖత్వం. అలాంటి మూర్ఖులు నాకింకెక్కడా కనబడలేదు’ అనచ్చు.”
ఆమె తల పంకించింది.
“ఇంకొక సహృదయ స్నేహితుడు ‘ఇలాంటి వ్యక్తిని ఎక్కడినుంచి పట్టుకొచ్చావు? ఈమెని నలుగురికీ పరిచయం చేయాలనుకున్నావంటే నీది అమాయకత్వమో అతితెలివో అర్థం కావడంలేదు’ అంటూ నన్ను పరిహసించవచ్చు.”
ఈసారి మరింత జాగ్రత్తగా మరోసారి గొంతు సవరించుకుని చెప్పబోయాను. “ఇంకొందరు తమకే అన్నీ తెలుసుననుకునేవాళ్ళు…”
నేను సంకోచంగా ఆగిపోవడం చూసి ఆమె ప్రశ్నార్థకంగా నొసలు ముడిచింది.
“అసలు నీలాంటి వాళ్ళని నలుగురి లోకీ తీసుకు రాకూడదంటారు. నిన్ను సమర్థించడమే తప్పంటారు. నువ్వున్న పరిస్థితులకీ నువ్వు చూపే వ్యక్తిత్వానికీ పొంతన లేదనీ అది అసహజమనీ అసాధ్యమనీ ఒకవేళ సాధ్యమే అయినా అది తిరోగమనమనీ అసమర్థత అనీ చేతకానితనమనీ అనుసరణీయం కాదనీ అంటారు.” ఒక్క గుక్కలో చెప్పి ఊపిరి తీసుకున్నాను.
ఆమె దెబ్బతిన్నట్లుగా చూసింది. “నేను… చేతకనిదాన్నా! అసమర్థురాలినా!” అంది పాలిపోయిన మొహంతో.
“అంటే… ఇప్పటి సమాజం ధోరణి అలా వుంది మరి. ఒకప్పుడు సమర్థతలుగా చెప్పుకున్నవన్నీ ఇప్పటివారి దృష్టిలో అసమర్థతలు. ఆహారవిహారాలలో ఆచారవ్యవహారాలలో పాత పద్ధతులని పాటిస్తామని గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా ఆలోచనలలో మాత్రం పాత విలువలని విలువలుగా ఒప్పుకోరు. దౌర్జన్యానికి ఎదురుగా సహనాన్ని నిలబెట్టడమన్న ఊహని కూడా ఇప్పుడు చాలామంది భరించలేరు.”
ఆమె అయోమయంగా చూసింది. మరీ కంగారు పెడుతున్నానేమోనని అనుమానం వచ్చింది నాకు. కొంత సర్ది చెప్పే ఉద్దేశ్యంతో “నిన్నే కాదు, నన్నూ ఒప్పుకోరు. నిజానికి నిన్నయితే ఒప్పుకోకపోవడం మాత్రమే జరుగుతుంది. కానీ నాకు అంతకన్నా పెద్ద శిక్షే పడుతుంది. ఎందుకంటే నీలా వుండడం కంటే నీ లాంటి వాళ్ళని సమర్థించడం ఈనాటి సమాజంలో పెద్ద నేరం,” అన్నాను.
ఆమె అలాగే కళ్ళు విప్పార్చుకుని చూస్తుంటే ఇంకొంచెం వివరించే ప్రయత్నం చేశాను.
“ఇప్పటికే నన్ను దూరంగా పెడుతున్నారు. ఇలాగే కొన్నాళ్ళు సాగిందంటే బహుశా నన్ను పూర్తిగా వెలేస్తారు. పండగలకీ పబ్బాలకీ పిలవరు. సన్మానాలు సత్కారాలు చేయరు. అవన్నీ ఫరవాలేదు. ఒద్దులే అనుకుని ఊరుకోవచ్చు. కానీ చెప్పానుగా అసలు మన వ్యక్తిత్వమే అసహజమైనదన్నట్లూ అసాధారణమన్నట్లూ వ్యాఖ్యానిస్తారు. అసాధారణం అనేది మంచి అర్థంలో కాదు సుమా!” నేను నవ్వుతూ చెప్పాను.
“ఇదివరకే ఒక పెద్దావిడ అయితే ఒక నిండుసభలో “ఈమె మనలాగా కాదు… కొంచెం తేడా!” అంటూ పరిచయం చేసింది నన్ను.”
నా ఛలోక్తికి ఆమె నవ్వలేదు. గంభీరంగా చూసింది. ఆమెకి హాస్యాలు నచ్చడం లేదని అర్థమవడంతో నేను గొంతు లోకి కొంచెం గంభీరత తెచ్చుకున్నాను.
“అదీ సంగతి. నిన్నూ నీ వ్యక్తిత్వాన్నీ అందరికీ పరిచయం చేయడం వలన మనకి వచ్చే ప్రశంసలూ పేరూ సంగతేమో కానీ మనం అనామకంగా అయిపోయే రిస్క్ మాత్రం చాలా వుంది. బహుశా మనం బ్రతికుండగా మనల్నెవరూ పట్టించుకోరు.”
సంభాషణని ముగిస్తున్న ధోరణిలో చెప్తున్న నేను ఆమె మోహంలో వస్తున్న మార్పు చూసి ఒక్కసారిగా ఆగిపోయాను. ఆమె కళ్ళల్లో సన్నటి నీటితెర… నివ్వెరపోయిచూస్తున్న నన్ను ఆమె వణికే గొంతుతో అడిగింది.
“పరిణామాలు నాకు అర్థమయాయమ్మా. వాటికి నువ్వు భయపడతావా!”
“లేదు.” కచ్చితంగా చెప్పాను.
“మరి… ప్రలోభాలకి లొంగిపోతావా?” మరింతగా రుద్ధమైన గొంతుతో అడిగింది.
“లేదు. లేనే లేదు.” మరింత కచ్చితమైన స్వరంతో నేను బదులిచ్చాను.
నీళ్ళకళ్ళతోనే ఆమె సన్నగా నవ్వింది. ఇంక తాను చెప్పాల్సిందేమీ లేదన్నట్లుగా చిన్నగా నిట్టూర్చి, నా మెదడు పొరల్లో పదిలంగా సర్దుకుని ధ్యానముద్రలో కూర్చుండి పోయింది.
నేను ఇక ఆలస్యం చేయదలచుకోలేదు.
సముద్రమంత అలజడిని సైతం పుక్కిట పట్టిన రచయితలను గుర్తు చేసుకున్నాను.
మరొక సజీవమైన పాత్రను పరిచయం చేయడం కోసం కలం చేతిలోకి తీసుకున్నాను.