ఈ కానుకనివ్వలేను

ట్రింగ్‌ ట్రింగ్‌ ట్రింగ్‌ ట్రింగ్‌…

ఏదో స్వప్నలోకాల నుంచి వస్తున్నట్టున్న ధ్వని నెమ్మదిగా నన్నీ లోకంలోకి తీసుకొచ్చి పడేసింది. అతి కష్టమ్మీద కనురెప్పలు తెరిచి కాస్త తెలివి తెచ్చుకుని చూస్తే ఫోను మోగుతోంది. విసుగ్గా తల విదిలించి చూశాను. ఫోను మీదున్న ఎలక్ట్రానిక్‌ వాచీ వైపు. అర్థరాత్రి దాటి రెండవుతోంది. ఇప్పుడెవరీ ఫోను? కొంపదీసి ఇండియా నుంచి కాదుగదా? అందరూ క్షేమమేనా?

దెబ్బకి మత్తు వదిలింది. నంబరు చూస్తే ఇండియాది కాదు. హమ్మయ్య. ఇక్కడిదే. కానీ తెలిసినవాళ్ళెవరిదీ కాదు. అయినా తెలిసినవాళ్ళు ఇప్పుడెందుకు చేస్తారు? ఏదైనా రాంగ్‌ కాల్‌? ఫోను తీసుకుని చెవిదగ్గరానించుకున్నా.

“పూర్ణా, సారీ టు డిస్టర్బ్‌ యూ అట్‌ దిస్‌ టైమ్‌. శాండీ ఉన్నాడా? అతనితో మాట్లాడాలి, కొంచెం లేపుతావా?” ఓహ్‌. ఇది రాజు గొంతు. ఏదో హడావుడిలో ఉన్నట్టున్నాడు.

“వాట్‌ హేపెండ్‌ రాజూ? ఎనీథింగ్‌ రాంగ్‌…?” నా గొంతు వణకడం నాకే తెలుస్తోంది.

“ఏం లేదులే, డోంట్‌ వరీ, శాండీ ఉంటే ఫోనియ్యి”

కాస్త జరిగి, అటు తిరిగి పడుకున్న శాండీ భుజమ్మీద చెయ్యేశాను. నెమ్మదిగా కుదుపుతూ చెవి దగ్గరగా వెళ్ళి చెప్పాను.

“శాండీ, నీకే ఫోను. రాజు పిలుస్తున్నాడు… శాండీ…” ఊహూ… లేవలేదు. ఫోను మళ్ళీ దగ్గరిగా తీసుకున్నాను.

“రాజూ, అతన్ని నిద్రలేపి నీకు కాల్‌ చెయ్యమని చెప్తాలే. ఒన్‌ మినిట్‌… ఒకే…”

ఫోను పెట్టేశాను. ఏమయింది, రాజు ఈ వేళలో ఎందుకు కాల్‌ చేశాడు? అంత ఆతృతలోనూ నాకో ఒక విషయం అర్థమయింది. శాండిల్య మెలకువగానే ఉన్నాడనీ, కావాలనే లేవలేదనీ. నిద్రపోతున్నవాణ్ని లేపగలంగానీ, నిద్ర నటిస్తున్నవాడిని లేపడం ఎవరి తరం? అతన్ని నెమ్మదిగా ఇటు తిప్పుదామని ప్రయత్నించాను. తిరగలేదు. అర్థమయింది. అతను ఏదో ఆలోచిస్తున్నాడు. కావాలనే లేవలేదు. అసలేమయిందో తెలుసుకుందామని నేనే మళ్ళీ రాజుకు ఫోన్‌ చేద్దామా అనుకున్నాను. కానీ శాండీ గురించి ఏం చెప్పను? పక్కమీదే అస్తిమితంగా అటూఇటూ కదులుతున్నాను.

అకస్మాత్తుగా శాండిల్య చివ్వున లేచి ఫోనందుకున్నాడు. డయల్‌ చేసి “హలో రాజూ..” అంటూనే మూడంగల్లో గది బైటికెళ్ళిపోయాడు. వెళ్తూ డోర్‌ నాబ్‌ దగ్గరిగా లాగేసి వెళ్ళాడు. నేను వెనకాలే వెళ్ళి అవేం వినకూడదన్న గీత గియ్యడమన్న మాట అది. సరిగ్గా మూణ్నిమిషాల తర్వాత లోపలికొచ్చాడు. బెడ్‌లైట్‌ వెలుగులో అతని మొహంలోని రంగులయితే నాక్కనిపించలేదుగానీ, అశాంతిగా ఉన్నట్టు మాత్రం తెలిసింది. మరో రెండు నిమిషాల్లో రెడీ అయి “త్వరగా వచ్చేస్తాలే , టేక్కేర్” పొడిగా అనేసి బైటకెళ్ళిపోయాడు. ఇంకొక నిమిషంలో కారు డ్రైవ్‌వే దాటిన శబ్దం వినిపించింది.

ఈమధ్యనంతా ఇలాగే ఉంటున్నాడు శాండిల్య.

ఎందుకో ఏవిటో నేను కొంత ఊహించగలుగుతున్నాను. కొంత ఊహించలేకపోతున్నాను. శాండిల్య అశాంతికి నా ఊహలను మించిన కారణాలుండొచ్చన్న ఆలోచన నన్ను భయపెడుతోంది. అప్పటికీ ఇండియాకు ఫోను చేసి “అమ్మా, శాండిల్య ఎందుకో మూడీగా అయిపోతున్నాడమ్మా. ఇప్పుడోలా, ఇంకో క్షణం ఇంకోలా ఉంటున్నాడు. నాకేమిటో భయంగా ఉంది… ” అని చెప్పేశాను.

“ఊరుకో పూర్ణా, అన్నిటికీ నువ్విలాగే భయపడుతుంటావు. నలభైల్లో మగవాళ్ళు ఇలా కాస్త మూడీగా ఉండటం మామూలే. రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళమీద పనిచేస్తుంటాయి. మనం కాస్త శాంతంగా మాట్లాడుతూ సపోర్ట్‌ నివ్వాలి. అంతేగానీ లేనిపోనివన్నీ ఊహించుకుంటూ నీ బుర్ర చెడగొట్టుకుని అతని బుర్ర కూడా చెడగొట్టకు. పిల్లలు జాగ్రత్త…” అంటూ బోలెడన్ని ఉపమానాలు, అనుభవాలు, జాగ్రత్తలూ చెప్పింది అమ్మ. అవును మరి, అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

ఆరవుతూండగా తిరిగివచ్చాడు. ఒక్కసారి నా మొహంలోకి ఏదో వెతుకుతున్నట్టు చూశాడు. “ఆరేళ్ళ క్రితం ఇక్కడికొచ్చారు. నిన్నే కొత్త ఇంట్లో హౌస్‌ వామింగ్‌ కూడా చేశారట. ఏమయిందో తెలియదు, బావా బావమరిది గొడవపడి ఒకర్నొకరు కాల్చుకుని చచ్చిపోయారు. బావమరిది భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా కాల్చేశాడా బావ. ఆస్తి గొడవలుండొచ్చంటున్నారు. పోలీస్‌, హడావుడీ… అందుకే రాజు ఫోను…” అలా పొడిపొడిగా చెప్పడంలోనే తెలుస్తోంది ఆ సంఘటన పట్ల శాండీకెంత అసహనంగా ఉందో.

అంతకుమించి అతను చెప్పడానికీ నేను వినడానికీ ఏమీలేదు. వివరంగా చర్చించుకోవడానికి మాత్రం ఏముంటుంది? ఏదో ఘనవిజయం సాధించినవాళ్ళ గురించి అయితే ఏం చేశారో, ఎలా సాధించారో అడిగి తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో అన్ని వివరాలూ తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం… మరింత మనసు పాడవడం తప్ప. అతను స్నానానికెళ్ళిపోయాడు.

సాఫ్ట్‌వేర్‌ వైభవం మొదలవుతున్న తొలి రోజుల్లోనే ఇక్కడికి వచ్చాడు శాండిల్య. మరో నాలుగేళ్ళకు మా పెళ్ళి జరిగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పని సంపాదించుకున్నాను నేను. అంతా బాగానే గడిచిపోతోందనిపిస్తోంది తల్చుకుంటే. గడిచిన ఆరేడు నెలల్లో ఇండియా వెళ్ళిపోతే ఎలా ఉంటుందని శాండీ పిల్లలను అడగడం ఒకట్రెండుసార్లు విన్నాను. సెలవులకు ఒకటీ రెండు నెలలు కాకుండా, అక్కడే ఉండిపోవడం ఎంత బావుంటుందో వాళ్ళకు అనునయంగా వివరిస్తున్నట్టు చెబుతుండడం కూడా నా చెవిన పడిందోసారి. కానీ తిరిగి వెళ్ళడం గురించి మేమెప్పుడూ ఆలోచించలేదు. శాండిల్యలో అలాంటి ఆలోచన ఉన్నట్టే ఇంతకుముందెప్పుడూ నాకు తెలీదు.

పిల్లలు టీనేజీలోకి వచ్చేసరికల్లా ఇండియా వెళ్ళిపోవాలనుకుంటారు చాలామంది ప్రవాస భారతీయులు. అనుకోవడమేగానీ, నిజంగా వెళ్ళలేరు. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు – ఓ రెండేళ్ళు గట్టిగా ఆలోచిస్తారు. ఆ రెండేళ్ళూ ఇంట్లో భారత దేశ సరిహద్దుల్లో ఉండేలాంటి వాతావరణం ఉంటుంది. భార్య వెళ్దామంటే భర్త వద్దనీ, భర్త చెబితే భార్య వద్దనీ, ఇద్దరూ సరేననుకుంటే పిల్లల గురించి ఆలోచించి వాదోపవాదాలు నడుస్తాయి. డబ్బుల్లెక్క వేసుకునీ, బంధాల లోతెంతో కొలుచుకునీ, ప్రయోజనాలు బేరీజు వేసుకునీ ఇలా గడిచిపోతుందా కాలం. చివరికి హార్దికం మీద ఆర్థికమే ఎక్కువగా నెగ్గుతుంది. అన్నేళ్ళు అలవాటు పడిన పరిస్థితులను వదిలి వెళ్ళే ప్రయాస పడటానికి ఎక్కువమంది ఇష్టపడరు. మొత్తానికి మళ్ళీ ఇక్కడే. ఇప్పుడు శాండిల్య ఆ దశలో ఉన్నట్టున్నాడు. నెమ్మదిగా చూసి నా దగ్గరా ప్రస్తావిస్తాడేమో. అందుకేనా ఇలా అస్తిమితంగా ఉన్నాడు?

శాండిల్య ఆఫీసుకు రెడీ అయిపోయి సిరియల్‌ తింటూ చెప్పాడు, “పూర్ణా, సాయంత్రం నీతో మాట్లాడాలి. కొంచెం ముందు రావడానికి ప్రయత్నిస్తావా”

“షూర్‌ ” అన్నాన్నేను.

కానీ ఆఫీసుకు వెళ్ళాలనిపించలేదు. రావటం లేదని మెసేజ్‌ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. అకస్మాత్తుగా నాకో కారణం దొరికింది. ఆ దారిలో తీగ లాగుతుంటే అవి ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆరు నెలల క్రితం నారాయణగార్ని రిసీవ్‌ చేసుకోవడానికి ఏర్‌ పోర్టుకు వెళ్ళొచ్చినప్పటి నుంచీ శాండిల్యలో ఈ అసహనం ఎక్కువయింది.

నారాయణగారి రూపం గుర్తొచ్చి మనసునెవరో మిక్సీలో వేసి తిప్పినట్టయింది. మా ఇంటికొచ్చిన రోజు కదిపితే కన్నీటి చుక్కన్నట్టు ఉన్నాడాయన.

“ఆయన్ని చూడు పూర్ణా. మొదలు నరికిన చెట్టులా ఎంత డీలా పడిపోయారో చూడు. ఎలా ఉండేవారో తెలుసా… మాకు స్కూల్లో లెక్కలెంత బాగా చెప్పేవారో, తెలంగాణ ఉద్యమ పోరాట కథలంత బాగా చెప్పేవారు. కొన్నాళ్ళు యూజీలో ఉన్నారు. సభలు, సమావేశాలప్పుడు గొంతెత్తి పాడాడంటే అలా వింటూ ఉండిపోవాల్సిందే ఎవరైనా. ఎంత శ్రావ్యతో అంత తీవ్రత. కథలెంత బాగా రాస్తారని. అసలవి కథలు కావు. అక్కడి జీవితాన్ని అలా ఎత్తి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. వాళ్ళింట్లో అందరూ అంతే…”

చిన్నగా చెప్పినా శాండీ మాటలు వినపడ్డాయేమో నారాయణగారు నిర్లిప్తంగా కళ్ళెత్తి చూశారు. కళ్ళనిండా నీళ్ళు. ఎవరివంకా చూడకుండా తల దించుకున్నారు. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నారు.

“అలాంటి కుటుంబంలోని కుర్రాడు అమెరికా ఎందుకొచ్చాడో తెలుసామ్మా? డాలర్‌ కలలు మాకెన్నడూ లేవు తల్లీ. తను సంపాదించాలనో, ఇక్కణ్నుంచి పంపే డబ్బుతో వాళ్ళ నాన్న సొంతిల్లు కూర్చుకుంటాడనో, అమ్మ బంగారం కొనుక్కోవాలనో కాదమ్మా. తనకి నచ్చిన రంగంలో పరిశోధన చేసే అవకాశం ఇక్కడే ఉందని. కాఫీ కూడా ముట్టనివాడు, ఏ గొడవా లేకుండా ఎవడో తాగి వచ్చి పేల్చిన తూటాలకు చచ్చిపోయాడు. మేం తుపాకీ గొట్టాలకు భయపడేవాళ్ళం కాదు. కానీ ఇలాంటి గుళ్ళకు బలయిపోతామనుకోలేదు. వాడొక్కడే కాదు, అందరం బలయిపోయాం తల్లీ. మా కలలన్నీ కల్లలయిపోయాయి. ఇక్కణ్నుంచి వెళ్ళి వాళ్ళమ్మకు మొహం ఎలా చూపించను? అమెరికా నుంచి ఏం తెచ్చానని చెప్పను? కొడుకు శవాన్నా? ఇక్కడ ఏ గొప్ప ప్రదేశాలు చూశానని చెప్పనమ్మా… వాడు హత్యకు గురయిపోయిన అపార్టుమెంటును వర్ణించనా? ఏం చెయ్యను తల్లీ..”

అంతసేపూ ఎలా ఉగ్గబెట్టుకున్నాడోగానీ, ఆ క్షణాన భోరున ఏడ్చేశాడాయన. శాండిల్య కంట నీరు తిరగలేదు, దవడ కండరాలు బిగుసుకోవడం మాత్రం మసకబారిన కళ్ళతో చూశాను.

బాడీ పాడవకుండా పంపేందుకు ఏర్పాట్లు చెయ్యడం, మెడికల్‌, లీగల్‌ ఫార్మాలిటీస్‌, ఎంబసీలో అవసరమైన పేపర్లు డాక్యుమెంట్‌ చెయ్యడం… అన్నిటితో అలిసిపోయాడు శాండిల్య. అన్నిచోట్లా అతనికున్న పరిచయాలు పని త్వరగా జరిగేలా చేశాయి. రాజూ, ఇంకొందరు స్నేహితులూ ఎంత సాయం చేశారో.

అది మొదలు. తర్వాత ఏం జరిగినా ముందు శాండీకే కాల్‌.

ఓ నెలయిందో లేదో, హైవే మీద యాక్సిడెంట్ జరిగితే వెళ్ళాడు. ఐదుగురూ విజయవాడ పిల్లలు. నలుగురు అక్కడే చచ్చిపోయారు. ఒకమ్మాయి మాత్రం అతి కష్టమ్మీద బతికింది. రెండు నెలల క్రితం రిసెషన్‌ వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఇండియన్‌ భార్యాపిల్లల్ని కాల్చి చంపేసి, తనని తాను కాల్చుకున్నాడు. అన్ని సందర్భాల్లోనూ తెలుగు సంఘాల్లో ఇతనే ముందుండి అన్నీ దగ్గరుండి చేశాడు. అప్పుడప్పుడూ ఎవరోఒకరు ఇండియా నుంచి ఫోన్‌ చేసి ధాంక్స్‌ చెప్పడమూ, ‘మీవారు దేవుడిలా ఆదుకున్నారండీ’ అనడమూ తెలుసు నాకు. యస్‌… అప్పట్నుంచే ఏదో ఆలోచనలో పడ్డాడు శాండిల్య. అదే నిజమైతే అతనేం చెప్పబోతున్నాడో ఊహించగలను. నా ఊహకు మించిన కారణం కాకపోడంతో అతనికి విడమర్చి నా ఆలోచనలూ చెప్పగలను, తోడ్పాటు నివ్వగలనేమో.

తెప్పరిల్లి చూస్తే సాయంత్రమవుతోంది. మొక్కలకు నీళ్ళు పోసి, డిన్నరు ప్రయత్నాలు చేస్తున్నాను. పిల్లలు వచ్చి ఫ్రెష్‌ అయి బేస్‌బాల్‌ ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు.

మరో అరగంటకల్లా శాండిల్య వచ్చేశాడు. కాఫీ అందిస్తుంటే చెయ్యి పట్టుకుని ఆపి, దగ్గరగా కూచోపెట్టుకున్నాడు. నా అరచేతుల్లో తన చేతులనుంచి “పని తర్వాత చేసుకుందాం. ఇప్పుడు కాస్త వింటావా?” అన్నాడు. తల ఊపాను.

“కష్టం – సుఖం అంటారు పూర్ణా. మన పెళ్ళికో, గృహప్రవేశానికో ఎవరెవరు వచ్చారో ఆల్బమ్‌లో ఫోటోలుంటాయి. వాళ్ళిచ్చిన గిఫ్టులు ఇంట్లో ఉంటాయి గనుక ఆ రకంగానూ వాళ్ళు గుర్తుంటారు. వాళ్ళు జ్ఞాపకం వస్తుంటే సంతోషంగా ఉంటుంది. అయితే కష్టంలో సాయం చేసినవాళ్ళ దారి వేరు. వాళ్ళను మరిచిపోలేం. కానీ వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఆ దుఃఖదినాలు కూడా గుర్తొస్తుంటాయి. ఎందుకు వాళ్ళు మనకు సాయం చేయవలసి వచ్చిందన్న పాయింటు దగ్గర ఆగుతాయి ఆలోచనలు. వింటున్నావా? నే చెబుతున్నది అర్థమవుతోందా? డిడ్‌ యూ గెట్మీ?”

“యస్‌. అర్థమవుతోంది… చెప్పు…”

“నేనింత ఆలోచించకేపోదును నిజానికి. ఒకట్రెండుసార్లు ఫోన్లు చేస్తే నారాయణగారు ఏమన్నారో తెలుసా? నేను మాట్లాడినప్పుడల్లా ఆయనకి తన అమెరికా ప్రయాణం, ఎందుకొచ్చాడు అన్నది గుర్తొస్తుందట. వాళ్ళబ్బాయిని నేను జాగ్రత్తగా పంపానన్నదీ గుర్తొస్తుందట. అంతే తర్వాత ఏడుపు తప్ప మరేం ఉండదు. ఇవి చెప్పి, ‘బాబూ, పోయినవాడితో మేం పోలేదు, పోలేం కూడా. లోపల కుళ్ళిపోతున్నా బైటికి బాగానే బతుకీడుస్తాం. మీరు ఎలా ఉన్నారని అడిగినప్పుడల్లా నాకిది బుర్రలో సినిమా రీల్లా తిరుగుతుంది. మరీ అవసరమైనప్పుడు నేనే మీకు ఫోను చేస్తాను. మీరు చెయ్యకండి.’ అని చెప్పేశారాయన. అప్పటివరకూ ఆ పాయింటు నాకు తట్టలేదు. నేను వాళ్ళకు అలా గుర్తుండాలనుకోవటం లేదు పూర్ణా. తల్లుల కడుపుచేటవుతుంటే ఆ వార్తల్ని ఫోన్లు చేసి వాళ్ళకు చేరవెయ్యలేను. మీరు అల్లారుముద్దుగా పెంచుకుని, పదిమందికి నీడనిస్తుందనుకున్న ఆశల వృక్షం ఎవరో దుండగుల వికృతత్వానికి బలయిపోయిందని ఎలా చెప్పను వాళ్ళకి? అంతా అయ్యాక మీరు దేవుడిలా కనిపించారని వాళ్ళంటుంటే మనసును రంపంతో కోసినట్టుంటుంది తెలుసా పూర్ణా. నేను దేవుడిలా కనిపించడం ఏవిటి? ఎలా కనిపిస్తాను… జీవితాంతం గర్భశోకంతో రగిలిపోమని శాపమిచ్చే దేవుడిలాగానా? మిమ్మల్నీ జన్మలో మర్చిపోలేం అంటారు. ఎలా మర్చిపోతారు? కన్నబిడ్డల మరణవార్తలను చేరవేసిన దుర్మార్గపు మనిషిని కదా నేను… ఎలా మర్చిపోతారు ఎవరైనా? ఇంతాచేసి నా ప్రయోజకత్వం ఏమిటి? శవ వాహకత్వమే కదా. వద్దు పూర్ణా, నాకలాంటి గుర్తింపు వద్దు. ఆ ప్రయోజకత్వమూ వద్దు. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు మీవాడిచ్చాడండీ అని కాసిని డబ్బులో చాక్లెట్లో మరేదో వస్తువో ఇచ్చి రావడం వరకూ ఓకే. ఆమాత్రానికే లగేజ్‌ ఎక్కువయిపోతుందని మానేస్తారు చాలామంది. మరి నేను మాత్రం ఇంత లగేజ్‌ను ఎందుకు మొయ్యాలి పూర్ణా… ఆశల్ని మోసుకుంటూ వచ్చినవాళ్ళు అర్థంతరంగా చచ్చిపోతే… నేను వాళ్ళని పెట్టెల్లో పెట్టించి, ప్యాక్‌ చేయించి జాగ్రత్తగా తల్లిదండ్రులకూ పుట్టినూరికీ పంపించాలా? ఇవా మనం ఇక్కణ్నుంచి పంపేవి? ఇలాంటి కానుకలివ్వలేను పూర్ణా. అంతకుమించి… మనమూ అలాగయిపోతే…”

దుఃఖంతో గొంతు పూడుకుపోయి మరి మాట్లాడలేకపోయాడు శాండిల్య.

అతనిచుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకున్నాను. పసిపిల్లాడిలా ఒళ్ళో తలపెట్టి సోఫాలో ముడుచుకుని పడుకున్నాడు. మెల్లగా అతని తల నిమురుతూ కాసేపలానే నిశ్శబ్దంగా వున్నాను.

“శాండీ, నారాయణగారలా అన్నాడని అప్పుడే ఎందుకు చెప్పలేదు నువ్వూ?”

“‘ఏమో, ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికే నాక్కొంత సమయం పట్టింది. అప్పటివరకూ ఇలాంటి సంఘటనల్లో ముందుండి మనం చెయ్యగలిగిన సాయం చెయ్యడం ఒక బాధ్యతగా అనుకునేవాణ్ని పూర్ణా. నేనొక్కణ్నే ఏదో చేసేస్తున్నానని కాదు. అందరం కలిసి తలో చెయ్యీ వేసేదే. కానీ నారాయణగారు చెప్పింది విన్నాక నాకా సాయం చెయ్యబుద్ధి కావటం లేదు. అలాగని తెలిసి తెలిసీ చెయ్యగలిగింది చెయ్యకుండా వదిలెయ్యలేను. నలిగిపోతున్నాను. అంతకుమించి మనమూ ఇండియాకు అలా వెళతామేమో అన్న భయం కుదిపేస్తోంది పూర్ణా…”

నాకు చెప్పలేదు సరే, రాజుతోనో మిగిలిన ఫ్రెండ్స్‌తోనో అయినా ఇతనివన్నీ పంచుకున్నట్టు లేడసలు. అదే అడిగాను.

“ఎలా చెప్పను పూర్ణా. చెయ్యకుండా పారిపోడానికిదో సాకని వాళ్ళనుకుంటే? లేదూ ఇదీ కరెక్టేనని నాలాగే అందరూ వెనకడుగు వేస్తే? అసలు అలాంటి సమయాల్లో సాయం చేసేవాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఎవరికీ ఏమీ చెప్పలేకపోతున్నా…”

అతని బాధ నాదై నా కళ్ళు తడి అయ్యాయి. శాండిల్యని ఒళ్ళోంచి లేపి అతని తలని గుండెల మీద పెట్టుకుని పసిపాపలా పొదివి పట్టుకున్నాను.

“శాండీ, నువ్వెందుకో నలిగిపోతున్నావని నాకు తెలుస్తూనే వుంది. కానీ నువ్వే టైం వచ్చినప్పుడు చెప్తావని ఆగాను. కొంత నా భయం కూడా తోడయింది. ఇంతకాలం మనం ఈ విషయం మాట్లడుకోకుండా తప్పు చేశాం. ఎనీ వే, నీ మనసులో అశాంతి నిన్ను స్తిమితంగా ఆలోచించనివ్వటం లేదు. దురదృష్టవశాత్తూ మూణ్నాలుగు యాక్సిడెంట్లు మన ఏరియాలోనే జరిగాయి. రోడ్డు మీద వెళుతుంటే ఎవరికో ప్రమాదం జరిగిందనుకో. ఒక్క క్షణం భయం వేస్తుంది. చాలాదగ్గరవాళ్ళకే ఏదో అయిందనుకో, అసలు జీవితంలో మళ్ళీ మామూలుగా నవ్వుతామనే అనుకోం. కానీ నెమ్మదిగా బయటపడతాం, మామూలవుతాం కదా. అలాగని అవి మళ్ళీమళ్ళీ జరుగుతాయని భయపడుతూ కూర్చోం. ఇలాంటివి తరచుగా జరుగుతాయని, నువ్వే బాధ్యత తీసుకోవాలనీ అనుకోకు. రాజుతో కూడా మాట్లాడు, అతని పరిస్థితి ఎలావుందో తెలుసుకో. ఈ వీకెండ్ వాళ్ళని డిన్నర్‌కి పిలుద్దాం, మనం కలిసి కూడా చాలా రోజులయింది కదా.”

శాండిల్య తల చిన్నగా వూపాడు నేను చెప్పేది వింటున్నాడనీ ఆలోచిస్తున్నాడనీ తెలిసేట్టుగా.

“నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయి. నీ భయాలన్నీ అర్థం లేనివని, వాటిని ఇప్పటికిప్పుడే బుర్రలోంచి తీసెయ్యమనీ అనను. కానీ అలాంటి సందర్భాల్లో నువ్వో, నేనో, మరొకరో తోచింది చెయ్యకపోతే ఎలా చెప్పు? నిజమే, మనం గుర్తొచ్చినప్పుడల్లా వారికి వచ్చేది చేదు జ్ఞాపకాలే. కానీ, దాంట్లో ఒక ఫైనాలిటీ ఉంది. ఒక నిశ్చింత వుంటుంది శాండీ. ఆ శవాన్ని చూస్కోడంతో, ఆ కర్మ పూర్తి కావడంతో వాళ్ళు కొన్నేళ్ళ తర్వాతైనా కోలుకుంటారు. ఒక్కసారి ఊహించు, తన బిడ్డ పోయాడనే వార్త ఒక్కటే వాళ్ళకి తెలిసి, ఆఖరిచూపుకీ నోచుకోక, కనీసం శవాన్నీ చూసుకోలేక పోతే ఆ వ్యాక్యూం వాళ్ళని పూర్తిగా కాల్చేస్తుంది. వాళ్ళ జీవితమంతా ఒక నిర్ధారించుకోలేని నిజంతో బతకడం కంటే, నువ్వు పంపించే బిలాంగింగ్స్‌తో చేదైనదే అయినా ఒక ముగింపు, ఒక వోదార్పు వస్తుంది. పోయినవారితో వీళ్ళూ పోకుండా కొంతైనా ఆపుతుంది కదా శాండీ నువు చేస్తున్న ఈ సహాయం. అది చాలుగదా. అంతకంటే ఇంకేం కోరుకుంటాం మనం. సో డోంట్వరీ. ప్లీజ్ రిలాక్స్‌ ఫర్ ఎ వైల్. ఇట్స్ గోయింగ్ టు బీ ఫైన్. కానీ, ఇంకెప్పుడూ ఇలా నీలో నువ్వే నలిగిపోకుండా నాతో వెంటనే చెప్తావు కదూ ప్లీజ్.”

శాండిల్య కళ్ళెత్తి నా కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళు సరే అంటున్నాయి. వాన కురిసి వెలిసిన తర్వాత వీచే చల్లగాలిలాంటిదేదో అతని మొహంలో తేటగా ప్రతిఫలించింది.

రచయిత అరుణ పప్పు గురించి: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 1979లో జన్మించారు. గణితంలో ఎం. ఎస్‌సీ. చేసినా తెలుగు చదవాలనీ రాయాలనీ వున్న అభిలాష వల్ల చేపట్టిన వృత్తి పాత్రికేయం. మొదట ఈనాడు లో ఐదేళ్ళు చేసి, గత రెండేళ్ళుగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. రచనా వ్యాసంగం శైశవదశలోనే ఉన్నా ఇప్పటికే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. అరుణమ్ వీరి బ్లాగ్‌సైట్.  ...