పుస్తక సమీక్షల గురించి…

జాన్‌ కీట్స్ మరణం గురించి ఒక విషాద కథ ప్రచారంలో ఉంది. కీట్స్ ప్రచురించిన బృహత్కవిత Endymion విడుదల కాగానే, ఒక లండన్‌ పత్రికలో ఆ కవితపై అతిఘోరమైన సమీక్ష వచ్చింది. ఆ సమీక్షకుడు కీట్స్ కవితని పూర్తి గా చదవకండానే – ఈ కవితని ఓపికతో పూర్తిగా చదివి నాకు బోధపడిందని అదృష్టవంతుడైన పాఠకుడు ఎవడైనా మా ముందుకొస్తే, ఆనందిస్తాం అన్న అర్థం వచ్చేట్టు – హీనంగా వ్రాసేడు. ఆ సమీక్ష కీట్స్ మరణానికి కారణం అని వాదు. నిజం చెప్పాలంటే కీట్స్ బ్రతికిన కొద్దికాలంలో, వ్రాసిన కొద్దికవితల్లో ఏ కవితకీ నిష్పాక్షికంగా సమీక్షలు ఏ ఒక్క పత్రికలోనూ రాలేదు. అందుకు ముఖ్యకారణం, అప్పటి సమాజంలో అతని స్థానం; మనభాషలో అతని ‘కులం, చదువు సంధ్యలు’, వగైరా అని చెప్పవచ్చు. ఆనాటి లండన్‌ పత్రికలలో వచ్చిన సమీక్షలు అతన్ని మానసికంగా అతి తీవ్రంగా బాధ పెట్టిన మాట ముమ్మాటికీ నిజం; కానీ, నిజానికి కీట్స్ క్షయవ్యాధితో మరణించాడు. ఈ కథ చెప్పటానికి కారణం; పుస్తక సమీక్షలకి పాశ్చాత్య దేశాలలో ఉన్న ‘ప్రభావం’ గుర్తుచెయ్యడానికే!


తెలుగులో సమీక్షల ఆవశ్యకత గురించి, ఇప్పుడు మన తెలుగు పత్రికలలో వస్తున్న సమీక్షల గురించి చెప్పేముందు, పూర్వపు రోజుల్లో తెలుగులో వచ్చిన కొన్ని సమీక్షల గురించి ప్రస్తావిస్తాను. పూర్తిగా నిష్పాక్షికమైన సమీక్షలు అసలు ఎప్పుడూ ఎక్కడా ఉండవేమో! ఆ రోజుల్లో భారతి, జ్వాల వంటి సాహితీపత్రికలలో ఘాటైన పుస్తక సమీక్షలు వచ్చేవి. అప్పటి రచయితల మీద, పాఠకుల మీద ఈ సమీక్షల ప్రభావం ఏమిటో, ఎట్లా వుండేదో ఇప్పుడు చెప్పడం తేలికైన పని కాదు. అయితే, ఆరోజులలో భారతి వంటి సాహితీ పత్రికలలో సమీక్షింపబడడమే గొప్పవిషయంగా భావించేవారని మనం గమనించాలి.

సాధారణంగా సమీక్షలు రెండు రకాలు. పుస్తకాన్ని కేవలం పరిచయం చేసేవి ఒక రకం. ఇది సాధారణంగా కేటలాగు లాంటిది. ప్రాప్తి స్థానం, ప్రచురణ వివరాలు, వెల, మొదలయినవే కాకుండా, రచయిత ఎందుకు వ్రాసాడో సోదాహరణంగా చెప్పడం. పరిచయం పేరుతో క్రొత్త రచయితలని ప్రోత్సహించడం కద్దు. ఈ రకమైన వివరణ మాత్రమే కాకుండా పుస్తకాన్ని ‘విజ్ఞులు ఒప్పుకున్న’ సామాజిక విలువలు, సాహితీ ప్రమాణాలు ఆధారంగా చేసుకొని, ఆ నేపథ్యంలో విమర్శనాయుతంగా విలువ కట్టటం మరొక రకం. అయితే, ఆరోజుల్లో కూడా పేరున్న సమీక్షకులు ఈ వైవిధ్యం నూటికి నూరుపాళ్ళూ పాటించినట్టుగా లేరు. ఉదాహరణకు, 1930 ప్రాంతాలలో శ్రీశ్రీ అప్పటి సాహితీపత్రికలలో చాలా పుస్తక పరిచయాలు, విమర్శ నాత్మకమైన పుస్తక సమీక్షలూ వ్రాసాడు. మచ్చుకి కొన్ని ఈ వ్యాసాంతంలో ఇస్తున్నాను.


ఈ రోజులలో పాశ్చాత్య దేశాలలో ప్రచురణ కొస్తున్న పుస్తకాల సంఖ్య పెరుగుతున్నట్టుగానే తెలుగులో ప్రచురణ కొస్తున్న పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతూన్నది. ఉదాహరణకి, 2004 లో అమెరికాలో గంటకి 17 పుస్తకాలు ప్రచురించబడ్డాయట. వాటిలో 55% కాల్పనిక సాహిత్యం. భారతదేశంలో సంవత్సరానికి సుమారు 12,000 పుస్తకాలు ప్రచురించ బడుతున్నాయని ఒక అంచనా. ఇందులో తెలుగు భాషలో ప్రచురితమైన పుస్తకాల సంఖ్య వెయ్యి పై చిలుకు ఉండవచ్చు. ప్రస్తుతం అచ్చవుతున్న అన్ని తెలుగు పత్రికలలో “సమీక్షించ” బడుతున్న పుస్తకాల సంఖ్య దాదాపు 300 వరకూ ఉండవచ్చు అని నా అంచనా. అందులో చాలా భాగం కాల్పనిక సాహిత్యం అని చెప్పవచ్చు.

‘సాధారణ పాఠకుడి’ కి (Common Reader) పుస్తక పరిచయం కనీసం మార్గదర్శకం అవుతుంది (అసలు, సాధారణ పాఠకుడు అనేవాడు ఒకడు ఉన్నాడా లేదా అన్న మౌలికమైన ప్రశ్న పై ప్రస్తుతం వివాదం లోకి దిగదలచుకోలేదు. ఆసక్తి గల పాఠకులు వర్జీనియా వుల్ఫ్ (Varginia Woolf) రాసిన The Common Reader ని సంప్రదించవచ్చు). పుస్తకాలమీద ఎంత మమకారం ఉన్న పాఠకులైనా, (వీళ్ళని ప్రస్తుతానికి ‘అసాధారణ పాఠకులు’ అని అందాం!) ప్రచురించబడ్డ అన్ని పుస్తకాలూ చదవలేరు. అందుకని, ఒక పుస్తకం గురించి తెలుసుకోవడానికి, ఆ పుస్తకం పై వచ్చిన సమీక్షల పై ఆధారపడవలసి వస్తుంది. అందులో సరి క్రొత్త రచయిత పుస్తకమైతే సమీక్షపైనే పూర్తిగా ఆధార పడవలసి వస్తుంది.

ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. ఇప్పుడు మనకి తెలుగులోమంచి సమీక్షలు రావటల్లేదు. మంచి అన్న విశేషణం వివాదాస్పదమే నని నాకు తెలుసు. నా ఉద్దేశంలో “మంచి” సమీక్ష అంటే పుస్తకాన్ని పుస్తకంగా సమీక్షించడం. ఇంకా విపులంగా చెప్పాలంటే సమీక్ష చేసే వ్యక్తి పుస్తకాన్ని, దానితోపాటు రచయితనీ ఏ రాజకీయ చట్రం లోనూ, ఏ కుల చట్రంలోనూ, ఏ వాద చట్రం లోనూ ‘బంధించబడ’ కుండా, సాధ్యమైనంతవరకూ నిష్పాక్షికంగా సమీక్షించడం. అంటే, సమీక్ష చేసే వ్యక్తి తన రంగుకళ్ళ అద్దాలను తీసివేసి సమీక్షిస్తే, మంచి సమీక్షలు రావడానికి అవకాశం వస్తుంది. ఉదాహరణగా, మంచి సమీక్ష అని నిష్కర్షగా చెప్పగలిగినది శ్రీశ్రీ పై సంపత్ గారు వ్రాసిన సమీక్ష. 1980-90 ప్రాంతాలలో చేకూరి రామారావుగారు చక్కని “పరిచయాలు/సమీక్షలు” వ్రాసారు. అందులో చెప్పుకోదగ్గవి కొన్ని: అఫ్సర్ గారి కవిత్వ పరిచయ వ్యాసం, వేగుంట మోహన ప్రసాద్ గారిపై “సమీక్షా” వ్యాసం, జయప్రభ గారి కవితలపై రెండు చక్కని పరిచయ వ్యాసాలు, వగైరా. బహుశా, అప్పుడు దినపత్రికలలో స్థలాభావం వలననో ఏమో, ఆయన వ్యాసాలు నవ యువ కవులని ప్రోత్సహిద్దామన్న ఉద్దేశంతో వ్రాసిన పరిచయ వ్యాసాలుగా కనిపిస్తాయి.

ఈ సందర్భంలో ఇంగ్లీషులో ప్రచురించబడే సమీక్షలు ప్రస్తావించడం అవసరం. మచ్చుకి New York Review of Books, The New Yorker, The London Review of Books, The American Poetry Review లాంటి పత్రికలలో వచ్చే సమీక్షలు చూడండి. ఈ పత్రికలలో సమీక్షలు వ్రాసే వారి రాజకీయ పక్షపాతం సాధారణంగా వాళ్ళ వ్రాతలలో ఎప్పుడూ కనిపించదు. అయితే, ఈ పైన ఉదహరించిన పత్రికలలఓ కొన్ని కేవలం పుస్తక సమీక్షలకోసమే. నేను ఈ తరహా పత్రికలతో తెలుగునాడులో పత్రికలని పోల్చడం లేదు. అక్కడి పత్రికలలో వస్తున్న సమీక్షల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను.

మరొక ప్రాథమిక ప్రశ్న. సమీక్షకులు ఎవరి తృప్తి కోసం సమీక్షిస్తున్నారు? అని ఎవరన్నా నిలదీసి అడిగితే రకరకాల సమాధానాలు రావచ్చు: సంపాదకులకోసం, తన ఊహలో ఉన్న పాఠకుల కోసం, రచయిత కోసం – ఇంకొంచెం పరిధి పెంచనిస్తే, బహుశా కళకోసం, అని చెప్పవచ్చు. ఆ పరిధిలో ఈ మాట పత్రికలో సమీక్షలు రావాలని నా కోరిక. ఈ పని మనం ఈమాట పత్రికలో చెయ్యగలం అని అనుకుంటున్నాను. మన పత్రికలో వస్తున్న రచనలపై వ్యాఖ్యలు చదువుతూ ఉంటే, మనకి బహుచక్కని రచయితలున్నారని తేటతెల్లం అవుతుంది. క్రొత్త క్రొత్త రచయితలు కనిపిస్తున్నారు. వీళ్ళు బహుచక్కని సమీక్షలు, నిష్పాక్షికమైన సమీక్షలు వ్రాయగలరని నా దృఢ నమ్మకం.

మన సాంస్కృతిక పురోగమనానికి మన పత్రికలు ఆయువుపట్లు వంటివి అని అంటే ఎవరికీ వివాదం లేదనుకుంటాను. అందుచేత, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు పత్రికలు పుస్తక సమీక్షలకి ఎక్కువ పేజీలు కేటాయించడమే కాకుండా, సమీక్షలకోసం నిబద్ధితులైన రచయితలని ప్రోత్సహించాలి. సమీక్షకులకు సమకాలీనతతో ఒకవిచిత్రమైన సంబంధం ఉన్నది. మంచి సమీక్షకులు సంస్కృతికి వాతావరణ శాస్త్రజ్ఞులవంటివారు. సంస్కృతీ వాతావరణం ఎలావున్నదో పూస గుచ్చినట్టు చెపుతారు; వాతావరణ భవిష్యత్తు చెప్పరు (చెప్పకూడదు అనడం సబబేమో!).

ఏ కథతో ప్రారంభించానో ఆ కథతో ముగించడం మంచిది. కీట్స్ పైన వచ్చిన సమీక్ష కీట్స్‌ని చంపలేదు; కీట్స్‌ని అమరజీవినీ చెయ్యలేదు. నిజం చెప్పాలంటే, కీట్స్ ఆ సమీక్షని అమరజీవిగా చేసాడని చెప్పడం సబబు. చాలా గొప్ప కవితని చాలా హీనంగా సమీక్షించిన సమీక్షకుని అదృష్ట్టాన్ని అంతకన్న ఏ రకంగా అభినందించగలం?


చాలా స్థూలంగా, రుచి కోసం శ్రీశ్రీ వ్రాసిన పరిచయాలనుంచి, సమీక్షలనుంచీ కొన్ని భాగాలు మాత్రం చూద్దాం:

పతితనళిని: పోడూరి రామచంద్ర రావు వ్రాసిన డిటెక్టివ్ నవల (భారతి, 1930 జనవరి సంచిక సమీక్షనుంచి —

 ఈ నవల “అత్యద్భుత అపరాధ పరిశోధక నవల ” గా చెప్పుకొన బడ్డది […] చదువగా, చదువగా, విమర్శదృష్టికి తాకినది కథాక్రమము లేమి. ఏ నవలకైనా – అత్యద్భుత అపరాధక పరిశోధక నవలకైనా — కథా క్రమము ప్రాణము. నవలకు మరికొన్ని ప్రాణాలు ఉన్నా, ‘ప్లాటు’ ఆయువుపట్టు. ఇదే మన నవలలో దొరకక పోవుట దురదృష్ట కరము. ఇంతకూ ఇది ప్రధమ భాగము. ఇకపై ఎన్ని భాగాలు ప్రకటింపబడునో పరమేశ్వరునికెరుక. కాని ఒకటి. దీనిని చదివిన పిమ్మట వచ్చే భాగము కొరకు ఎవరైనా ఆత్రుత పొందుతారా అన్నది సందేహాస్పదము […] ఈ నవలలో అద్భుతములు లేవు (ఇదే ఒక అద్భుతము కాకపోతే). అపరాధమున్నా పరిశోధన చాకచక్యము లేదు. ఐనా ఇది “అత్యద్భుత అపరాధ పరిశోధక నవల” అనుకొనుటవల్ల. అందుకొరకే ఆవురావురను పాఠకులున్నారు. ) 

విక్టోరియా క్రాసు: కవితిలక పులపర్తి కమలా దేవి (భారతి 1930 జనవరి సంచిక సమీక్షనుండి):

 ఎట్టి రచనలోనైనా ” స్వతంత్రత ” అనే గుణము వాంఛనీయము, స్తవనీయము.’ విక్టోరియా క్రాసు ‘ అన్న నవలలో ఈ గుణము ఎంతవరకు ఉన్నదంటే, ఐరోపా సంగ్రామాన్ని కథా వస్తువుగా తీసుకున్నంతవరకు – అంతే! […] యుద్ధవిశేషాలు పత్రికావార్తలవలె చెప్పబడినవి కాని నవలా చైతన్యముతో కూడుకున్నవి గాలేవు. […] ఒక చిన్న మూలకథకు ఐరోపా యుద్ధాన్ని అంటించగా ఈ నవల ఏర్పడినది. […] గ్రంధకర్త్రి (ఉపోద్ఘాతము ప్రకారము) గారు “బహుయోర్పు తోడ నెన్నియో విషయములు సేకూర్చి” రనుట నిర్వివాదాంశము. ఈ నవలను “ఐరోపాయుద్ధ అసమగ్ర చరిత్ర” గా చెప్పవచ్చును. ఇందు అందము కూర్చని అచ్చుమాట అటుండగా, “పుడమోపతి (పుట 39), తాత్కాలిక వంతెనలు (79), సామ్రాజ్య పిచ్చి(82)” మొదలైన కొన్ని “సమాస తప్పులు” దొర్లినవి. […] ఈ పుస్తకము నందలి భాష సరాసరిగా గ్రాంధికమే. శైలి ఎగుడుదిగుడుగా ఉన్నది […]

నవలలలో అసంఖ్యాకములవలె ఇది కూడా ఒక సాధారణ నవల. కాని స్వయంవరానికి తయారయిన నాయికకి చర్చిలో పెళ్ళి చేయించడమొకటి అసాధారణమే అనిపించక పోదు. దీని సమంజసత ఎట్లున్నా ఇట్లు చదివిన పిమ్మట మాకు సంతోషము జనించలేదు. 

అప్పటి రచయితలపై ఈ సమీక్షల ప్రభావం కొద్దిసేపు మరిచిపోయి, ఇప్పటి పాఠకులపై ఈ పైవాక్యాల ప్రభావం తేలికగా పసికట్టవచ్చు.

కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి: విశ్వనాథ సత్యనారాయణ (జ్వాల పక్ష పత్రిక 16-12-1934 సమీక్ష నుంచి) :

 రెండూ గేయాలు. కిన్నెరసాని పాటల్లో వివిధ ఛందస్సులు వున్నవి. కోకిలమ్మ పెళ్ళి అంతా ముత్యాల సరాలు. గ్రంధముద్రణ సొగసుగా ఉన్నది. బాపిరాజు గారి చిత్రాలు గ్రంధానికి ఎక్కువ విలువ కూరుస్తున్నవి. ముఖ్యంగా వారి కడలిపొంగు అనే చిత్రం కవి హృదయానికి అద్భుతమైన వ్యాఖ్యానం.

కిన్నెరసాని పాటలు: […]కిన్నెర పుట్టుక లో […] విధానంలో ఆకర్షణీయమైన తూగు ఉన్నది. మున్ముందు రాబోయే విచిత్రచ్చందోగతులకు సూచనలు దొరుకుతవిక్కడ.

తర్వాత కిన్నెర నాట్యం, కిన్నెర గానం ఉన్నవి. మూడింటిలోనూ కొద్ది లయభేదంతో ఒకటే చందస్సు. నడకలు విసురుగా ఉండడంవల్ల నాట్యం బరువుగా తోస్తున్నది. కిన్నెర సంగీతంలో సమమైన తూకం కుదురిందని చెప్పవచ్చును. ఆమ్రేడితాల తరచుదనం నడకల్లోకంటే నృత్యంలోఎక్కువ రాణించదేమో! ఒకే భావాన్ని సమర్ధుడైన కవి విసుగు పుట్టించకుండా ఎంతవరకు విస్తరించగలడో వీటిలో ప్రదర్శించబడ్డది. ఆంధ్రత్వం కుంభించుకున్న ఈ కవికి కిన్నెర జలదేవతల వెంట సాగిపోతే ఉన్నప్పుడు; ‘తెలుగు పాటలవెంట తీపి తోచిం’ దంటే ఆశ్చర్యం లేదు. కిన్నెర ప్రసరిస్తుంటే ‘తెలుగు పిట్టలు ఒళ్ళు తెలియక పాడినై!’ అట. ఏటికిన్నెర పాట ఎగిరెగిరి మిన్నందినప్పుడు ‘తెలుగు వెలుగులు క్రమ్మె నేమో’ నట.

అయితే కిన్నెర పాటల్లో గొప్ప రసవద్ఘట్టంగా ‘గోదావరీ సంగమం’ చెప్పాలి. […] కాని సముద్రుణ్ణి నిరాకరించిన కిన్నెర మానం కాపాడటం కోసం గోదావరి ఆమెను తనలో కల్పుకొన్న కల్పనకు ఉప్పొంగి పోతాము. కవి యొక్క ఉద్రేకం కూడా సున్నితాలైన పోకడలు పోయింది. […] కిన్నెర వైభవంలో కవి రసశిఖరం నుండి సవిలాసంగా జారి భూమికి చేరుకుంటున్నాడు. కిన్నెర సోయగం వివిధ కాలాల్లో, వివిధ స్థానాల్లో ఎట్లు రాణింపులు నిగారించిందో శ్రావ్యంగా వినవస్తుంది.

‘అంచె రెక్కలతోడ నరుగుదెంచె శరత్తు’ అన్నది ఎన్నడూ హృదయాన్ని తొలగిపోని కవిత్వం!

కోకిలమ్మ పెళ్ళి: దీని నొక ప్రతీకాత్మక కావ్యం (allegory) అనాలి. తెలుగు సంస్కృత భాషలు మనదేశంలో ఎట్టి పరిణతి పొందినవో సాంకేతికంగా చెప్పబడ్డది. ఈ విషయం

చిలకతల్లి మహస్వయంబున
నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
కోకిలమ్మా తెనుగు పలుకూ
కూడ బెట్టిందీ

అనే తుదిగీతంలో స్పష్టం అవుతుంది. కథన కవిత్వానికి వాడుక భాష ముఖ్యంగా ముత్యాల సరం ఎంత ఉపయోగిస్తుందో ‘కోకిలమ్మ’ పెళ్ళి చదివిన వాళ్ళకి తెలియక పోదు. […] పూలరేడు చేపట్టిన కోకిలమ్మ ప్రకృతిసిద్ధమైన తీయని తెలుగు కవిత్వంగానూ, ‘వేదపనసలు చెప్పుకుంఛూ’ వచ్చిన బ్రాహ్మడికైనా సంస్కృతం చిలక పలుకులుగా నిర్ణయించి కవి చక్కని మెలుకువ చూపించాడు.

కోకిలమ్మ పెళ్ళికి
తోరణాలైనాయి చివురులు
కాపలా కాసినై పులులూ
గండశిలలందూ

అన్న దానిలో భావగాంభీర్యం మాననీయమైనది.

ఆఖరి మాట: కిన్నెరసాని పాటల్లో హాయీ, కోకిలమ్మపెళ్ళిలో అర్థం ఉన్నవి. 

వర్షర్తువు: విశ్వనాథ సత్యనారాయణ (వీణ మాస పత్రిక, తొలిసంచిక, మే 1936 లో వ్రాసిన పరిచయం నుండి) :

 నేడు తెలుగు పద్యాలు వ్రాస్తున్న కవులలో విశ్వనాథ సత్యనారాయణ గారిది ప్రథమ శ్రేణి. మరీ పరవశులు వీరికి మొదటి స్థానమే ఇస్తారు. వర్షర్తువు పద్యాలలో ఈయన భూమినీ-ఆకాశాన్నీ-తెలుగునీ, సంస్కృతాన్నీ ఒక్క లయతో కదం కొట్టించారు. వీటిలో శ్రీనాథుని సీసపద్యాలని జ్ఞాపకం చేస్తూ వ్యక్తిత్వం చెడని రచన సాగింది. సత్యనారాయణగారు నవకవులలో “ప్రాచీనుడు”. ఈయన పద్యాలు మహాబలిపురపు రాతిగోపురాలు. 

సత్యనారాయణ గారి కవిత్వం గురించి శ్రీశ్రీ చెప్పిన ఈ పై మాటలు, బహుశా శ్రీశ్రీ పై మార్క్సిస్ట్ ప్రభావం ఉధృతంగా లేని రోజుల్లోవయి ఉండాలి. “మహాబలిపురపు రాతిగోపురాలు” అన్న ఉపమానం ఏ రకంగా అన్వయించుకున్నా పరవా లేదనుకుంటాను.

యౌవన జ్వాల : కుందుర్తి నరసింహారావు (భారతి, మార్చి 1938 సమీక్షనుంచి) :

 […] కృష్ణశాస్త్రి, విశ్వనాథలను చదివికూడా ఈతడు పెమ్మరాజు లక్ష్మీపతి, జాషువా వంటి ఉపకవుల ప్రక్కకు పోదామనే ఆదుర్దా కనపరచడంలో నా కాశ్చర్యం వేసింది. ఇతని దేశాభిమాన గీతాలు విశ్వనాథ సత్యనారాయణ దాకా యెగురబోయి కొడాలి సుబ్బా రావునైనా అందుకోలేక పోయినవి. […] ఇక ఈ సంపుటిలో ప్రేమగీతాలకు నాయని ఒరవడి స్పష్టం. వాటి దస్తూరీ ఏమీ బాగాలేదు.

కవిత్వం గురించి అప్రియ వచనాలు నాకు వ్రాయడం ఇష్టం లేదు. ఏ మూల ఒక్క కావ్య నిశ్వాసం వినిపించినా నేను దానికి సానుభూతితో స్పందిస్తాను. అదీగాక సున్నితమైన హృదయాలను అప్రియ వాక్కులు ఎంత బాధిస్తాయో నాకు తెలుసు. కాని కొన్ని కొన్ని విమర్శ ప్రామాణ్యాలు ఎదుట పెట్టుకొని ఋజువృత్తితో చేసే చర్యలకు త్రుళ్ళిపడి లాభం ఉండదనీ, అటువంటి విమర్శకుల దృక్పథాన్ని అర్థం చేసుకొని మన్నించాలనీ నా ఉద్దేశం. కుందుర్తి నరసింహారావు గారు పదజాలాన్ని మోహించి కవిత్వానికి విడాకులిస్తారేమో అని నా అనుమానం. కవికి తనభావం స్పష్టంగా సాక్షాత్కరిస్తే తర్వాత విమర్శకుడికి శ్రమ ఉండదు. ‘పులుముడు’ రెండు రకాలు. రచయిత మనసులోనిది; పాఠకుని అవగాహన లోనిది. వీటిలో మొదటిదే ప్రమాదకరం. 

త్వమేవాహం : ఆరుద్ర తొలికావ్యం ( 1949 ఫిబ్రవరి 18 తెలుగు స్వతంత్ర లో రాసిన పెద్ద వ్యాఖ్య -విమర్శ నుంచి)

 […] నా కిది చదివి వినిపించి “ఎలావుంది?” అని అడుగుతున్నట్లు మొగం పెట్టేడు. వింటూన్నంతసేపూ నాకు ఒళ్ళు జలదరిస్తోంది. దీన్ని ఏమని పొగడడం? పొగిడినంత మాత్రంచేత ఏం లాభం? “ఏమిటి నీ అభిప్రాయం?” అని అడిగేడు, ఆరుద్ర. “ఇక నేను పద్యాలు రాయకపోయినా పర్వాలే” దన్నాను నేను. ఇంతకంటే ఎక్కువ ప్రశంస ఏదీ అప్పటికీ ఇప్పటికీ కూడా నాకు స్ఫురించలేదు.  

బుచ్చిబాబు: ఆంధ్రకథావళి ఐదవభాగము (భారతి, జూన్‌ 1939 సమీక్ష నుంచి)

 ఇది ఇదివరకెప్పుడూ నేను చదివినట్లు లేదు. ఈ చదివిన కథలలో ఉలికిపడవవలసినంత కొత్తదనం నాకేమీ కనపడలేదు కాని “అగోచరుడు” అనే కథ చదవగానే ఒక మంచి కథ చదివానుగదా అనిపించింది. ఐదు కథలూ చదివిన మీదటా మన కథకులకు సెక్సు తప్ప ఇంకొక విషయమే దొరకదా అనే ఆశ్చర్యం తోచింది. […] ‘మల్లెపూలు’, ‘కలలో కార్చిన కన్నీరు’ అనే కథలలో కథనం సున్నితంగా నడిచింది. రెండవ కథ కొంత అనవసరంగా ఈడిగిలబడింది.

కథల శైలిలో పటుత్వం లేదు. కొన్ని చోట్ల మరీ నిర్జీవంగా ఉన్నది. ఈ కారణాలవల్ల గ్రంథకర్తకు ఇదే ప్రథమ ప్రయత్నమేమో అని అనుమానించడానికి వీలుకలుగుతున్నది.

ప్రకటన కర్తలనుగురించి ఒక్క మాట వ్రాసి ముగిస్తున్నాను. నమ్మాళ్వార్సు వారు తలపెట్టిన ఉద్యమం ప్రశంసార్హ మైనదే. కాని వారు ‘చవకదనాన్ని’ గ్రంథాల వెలకు బదులు విషయానికే సంక్రమింప జేస్తున్నట్లు ఇటీవలి ప్రచురణలని బట్టి ఊహించవలసివస్తున్నది. ఇది కాదని నిరూపించడానికి వీరింకా సమర్ధులను ఆకర్షించవలసి వున్నది. 

ఇల్లరికం: కొడవటిగంటి కుటుంబరావు (భారతి, 1939 జూన్‌ సమీక్షనుంచి)

 […] గుడిపాటి వెంకటాచలం, చింతా దీక్షితులు వంటి ‘ఆజానుబాహువుల’ ప్రక్క ఏరీ నిలబడగల యువ కథకులు? కొడవటిగంటి కుటుంబరావు ఎంతో చైతన్యం గల కథలు వ్రాస్తున్నా అతనికింకా ఒక personality ఏర్పడలేదు. బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం కథలలో నిర్మాణ సౌష్టవం ఉంటే విషయ వైవిధ్యం కనపడదు. ఇంక మిగిలిన వారంతా మరుగుజ్జులు. […] ఇప్పుడు వ్రాస్తున్న వారంతా పేరుకు మాత్రమే క్రొత్త వారు. వీరి రచనలలో నవీనత – వస్తువులోగాని, పరిపోషణ ఉక్తి వైచిత్రి, స్వభావ చిత్రణ శక్తి , సంఘటన సృష్టి నైపుణి – కథలలో మనం కోరే గొప్ప గుణాలు వేటిలో గాని కనిపించవు.

కుటుంబరావుగారి కథలను దొరికినంత వరకు అన్నిటినీ చదివినట్లే నమ్మకం. కాని మర్మం విడిచి చెప్పాలంటే ఒక్క కథ కూడా నాకు జ్ఞాపకం లేదు. అయితే ఏకథ కూడా నన్ను విసిగించిందని కాని, ఏదోవిధంగా పూర్తి చేస్తే చాలునన్నట్లు చదివానని గాని చెప్పలేను. నిజానికి ఇతని కథలు యదార్థజీవితంలో మనం అప్పుడప్పుడు పరిచయం చేసుకునే వ్యక్తులవంటి వనుకుంటాను. వారితో మాట్లాడుతున్నంతసేపూ ఎంతో సరదాగా వుంటుంది. ఒక సాయంత్రం అంతా కులాసా కబుర్లతో గడిపి వేస్తాము. సాయంత్రం గడిచినట్లే ఉండదు. కాని మర్నాడు వారి సంగతి మరిచిపోతాము. మళ్ళీ వారిని చూచినప్పుడు ఓహో మీరా? అనుకోవలసి ఉంటుంది.

మనకు జ్ఞాపకముండే వ్యక్తుల సంగతి వేరు. మన స్మృతిపథాన్ని కదిలించే విస్ఫుటగుణాలు వారిలో చాలా ఉంటాయి. ఆ గుణాలకూ మన అభిరుచులకూ గల సామరస్యాన్ని బట్టి దృఢమైన స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబరావుగారి కథలలో ఏ ఒక్కటీకూడా నాకిట్టి దృఢస్నేహం కలిగించిందని చెప్పలేను.

కొడవటిగంటి కుటుంబరావుగారి కథలమీద ఇదీ నా నిష్కల్మషాభిప్రాయం. ‘ఇల్లరికం’ లో సంపుటితములైన ఐదు కథలలో ఈ అభిప్రాయాన్ని మార్చుకోదగిన ప్రబల గుణాలు నాకు గోచరించడం లేదు. కథలన్నీ దేనికది ఈ రచయిత కథా రచనలో ఇదివరకు సంపాదించిన పేరును నిలబెట్టగలిగి మాత్రం ఉంటున్నవి.

గుడిపాటి వెంకటచలంగారి ప్రోద్బలం ఇక ఈ రచయితను వదిలిపెట్టదని నిర్ధారణ చేసుకోవచ్చును. ఇంకొక రచయితను జ్ఞాపకం చేస్తున్నంత కాలం ప్రథమ శ్రేణిలో ఇతనికి స్థలం దొరకడం కష్టం. 

బుచ్చిబాబు గారు , కుటుంబరావు గారూ శ్రీశ్రీ సమీక్షలు చదివిన తరువాత, ఇకముందు కథలు వ్రాయడం మానుకొని వుంటే తెలుగు సాహిత్యానికి తీరని అన్యాయం జరిగి ఉండేది. వారిద్దరూ తరువాత చాలా మంచి కథలు వ్రాసారని మనకి ఇప్పుడు తెలుసు. బహుశా, శ్రీశ్రీ సమీక్షలు తెలుగువారికి ఎంత మేలు చేశాయో, ఎవరికెరుక?

శ్రీశ్రీ పై మార్కిస్ట్ ప్రభావం బాగా పెరిగిన తరువాత ఆయన చేసిన సమీక్షలలో వచ్చిన కొన్ని మార్పులు గమనించడం కోసం ఈ క్రింది రెండున్నూ, మచ్చుకి.

అంగారవల్లరి : కె.వి.రమణారెడ్డి గేయసంపుటి (1951 ఆగస్టు 31 ‘పరిచయం’ నుంచి)

 సంఘంలో మార్పుని సహించలేని వాళ్ళూ, మార్పుని ఆహ్వానించేవాళ్ళూ ఉన్నట్టే కవులలో కూడా ఈ రెండుతెగల వాళ్ళూ ఉంటారు. ఇందలి రెండో తెగ కవులలో మొదటి శ్రేణికి చెందిన వాళ్ళలో ఒకడు శ్రీ రమణా రెడ్డి. […] ఆధునికాంధ్ర కవిత్వంలో అభ్యుదయోద్యమానికి మూలస్థంభాలుగా చెప్పవలసిన కవులలో ముఖ్యుడు రమణారెడ్డి.

క్రిస్టొఫర్ కాడ్వెల్ మీద, గాదిరాజు సుబ్బరాజుమీద అనామధేయులైన అమరప్రజావీరుల మీద రమణారెడ్డి వ్రాసిన ఒక్కొక్క గీతం వెనుక ఒక్కొక్క మహాభారత గాధ ఉంది. అర్థం చేసుకోగలిగినవారికీ, అన్ని పూర్వాపరసందర్భాలూ తెలిసినవారికీ అదంతా కరతలామలకమే! […] రమణారెడ్డి కవిత్వం నవ్య మానవుని అభ్యుదయానికి దివ్యనీరాజనం. 

క్షమించాలి. రమణారెడ్డి ‘కవియా’ – ‘కాదా’ అన్న విషయంపై నేను ప్రస్తుతానికి వాదానికి సంసిద్ధుడను కాను.

‘లే’: విరసం తిరపతి యూనిట్ వారి కవితాసంకలనం (12-2-71, మొదటి ముద్రణకు ముందు మాట నుంచి)

 […] సాహిత్య పరిణామాలను సామాజిక పరిస్థితులతో సమన్వయించి చారిత్రక దృక్పథంతో సమీక్షించగలిగిన వాడే సద్విమర్శకుడు. అతడే మార్కిస్ట్ విమర్శకుడు! సందేహం లేదు. తతిమ్మా వాళ్ళంతా అగాధమీ పండితులు, విశ్వవిద్యాలయ కళాపూర్ణులు. 

సద్విమర్శకుడికి శ్రీశ్రీ ఇచ్చిన నిర్వచనంతో నాకు పెద్ద భేదాభిప్రాయం లేదు. ఆ తరువాతి వాక్యాలు వివాదాస్పదాలు అనే వారితో కూడా నాకేమీ ఇబ్బంది లేదు!

శ్రీశ్రీ అపార వైదుష్యం, దానితోపాటు నంచుకోవటానికన్నట్టుగా కించిత్‌ విదూషకత్వం కొట్టవచ్చినట్టు కనిపించే, పరిచయాలు, సమీక్షలు అన్నీ పూర్తిగా చదవదలచిన వారు శ్రీశ్రీ వ్రాసిన “వ్యూలు, రివ్యూలు” విరసం ప్రచురణ (1992) ని సంప్రదించవచ్చు.