నిసి షామల్, సోఫాలో పడుకుని మహాకవి కాళిదాసు విరచితమైన “మేఘ సందేశం” రెండు పుస్తకాలు -ఒకటి విద్వాన్ కోసూరు వెంకట నరసింహరాజు గారు వ్యాఖ్యానం చేసిందీ, ఇంకొకటి డాక్టర్ మహీధర నళినీమోహన్, మాత్రా చందస్సులో ఆయన అనుసరణ, వ్యాఖ్యానం రాసింది – ఒకటి మార్చి ఒకటి చదువుతూంది.
నంగీతాయ ప్రహతమురజాఃస్నిగ్ధ గంభీర ఘోషమ్
అంతస్తోయం మణిమయభువ, స్తుంగ మభ్రం విహాగ్రాః
ప్రాసాదా స్త్వాం తులయితు మలం యత్రతై స్తైర్విశేషైః
యత్రోన్మత్త భ్రమర ముఖరాః పాదపానిత్యపుష్పాః
హంస శ్రేణీ రచితరశనా నిత్య పద్మా నలిన్యః
కేకోత్కంఠా భవన శిఖినో నిత్యభాస్వత్కలాపా
నిత్యజ్యోత్స్నాః ప్రతిహత తమోవృత్తిరమ్యాః ప్రదోషాః
యస్యాం యక్షాః సితమణి మయా న్యేత్య హర్మ్య స్థలాని
జ్యోతిశ్ఛాయా కుసుమరచితా న్యుత్తమ స్త్రీ సహాయాః
ఆ సేవంతే మధు రతిఫలం కల్పవృక్ష ప్రసూతం
త్వద్గంభీర ధ్వనిషు శనకైః పుష్కకే ష్వాహతేషు.
ఈ పద్యాలు కాళిదాస మహాకవి మేఘసందేశం కావ్యంలో, ఉత్తర మేఘం భాగంలో , అలకాపురి సౌందర్యాన్ని వర్ణించడానికి వాడారు. పద్యాలు చదివి పై రచయితల సాయంతో వాటిని అర్ధం చేసుకుని, అలకానగరం అచ్చంగా అమెరికా దేశంలో ఫ్లారిడాలో, ఈ నేపుల్స్ నగరం లాగానే ఉంది సుమా అని పొంగి పోయింది.
అలకాపురికీ, నేపుల్స్ నగరానికి ఎన్నో పోలికలు కనిపిస్తాయి. ఆ నగరం లాగానే, ఈ నగరం మేఘుడి లాటి్దే. మేఘుడిలో మెరుపుతీగలుంటాయి. నగరంలో ఇళ్ళలో మెరుపుతీగల వంటి సుందరులు ఉన్నారు. మేఘుడిలో రంగుల ఇంధ్ర ధనుస్సు ఉంది ఇక్కడి ఇళ్ళలో రంగుల తైల చిత్రాలు ఉన్నాయి. మేఘుడిలో గంభీరమైన వీనుల విందైన శబ్దాలున్నాయ్. ఈ నగరంలో ఇళ్ళలోనూ శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. మేఘుడిలో జలం ఉంది. నేపుల్స్ నగరం అంతా అందమైన సరస్సులు, సముద్రపు పాయలు. మేఘుడు ఉన్నతుడు. అతడిలాగే నగరంలో భవనాలు ఉన్నతాలు. ఇవీ ఆకాశాన్ని అంటుతాయి.
నగరంలోని చెట్ట్లు ఎప్పుడూ పూలతో నిండి ఉంటాయి. వాటిని తుమ్మెదలెప్పుడూ ఆవహించి ఉంటాయి. కొలనుల్లో తామర తీగెలు వాటికి పద్మాలు, వాటి మొలనూలులా వాటి చుట్టూ తిరిగే హంసల (కొన్నిచో బాతులు) బారులు. ఇక రాత్రులలో వెన్నెల లంటారా, అవి అత్యంత ఆనంద దాయకాలు.
నగర వాసులు ఆనందప్రియులు. మేడల్లో ఉండే వారి సహచరులు అందమైన వారు. మేడలు పైభాగాలు పాలరాతితో చేసినందున వాటిలో నక్షత్రాలు ప్రతిఫలిస్తూ, అక్కడా పువ్వులు జల్లినట్లే అనిపిస్తుంది. నగర వాసులు, మృదంగ వాద్యాలు వింటూ, సురాపానం చేస్తూ, సుఖాలలో తేలుతారు.
ఆమె చదువుతూ, ఇలా పోల్చి చూస్తూ, ఆనందిస్తూండగా, వెస్ట్ మినిస్టర్ ఏబీ లో లాగా డోర్ బెల్ ఇల్లంతా ధ్వనించేట్లు, గంటలు వినిపించింది.
నిసి బైటికి వెళ్ళింది. తోటమాలి ఆమెతో మాట్లాడ్డానికి బెల్ కొట్టి మళ్ళీ పనిలోకి వెళ్ళినట్లున్నాడు.
ఆ ఇల్లు తెలుపు లేత గులాబీ రంగులు కలిసి ఉంటుంది. ఎత్తైన స్తంభాలు. వెడల్పాటి సింహద్వారం. ఇంటి ముందు అంతా అర్ధచంద్రాకారమ్లో ఇటుక రాయి పరచి ఉంది. నిసి వెళ్ళి, తన భర్త బహుమతిగా ఇవ్వగా, తను నాటిన మల్లె దగ్గర నిలబడింది. అది ఇంత మొక్కై వచ్చి , ఇప్పుడు పెద్ద కుదురై , చకచక తీగలు సాగుతున్నది. కుడి వైపు గోడకు ఆనుకుని గరాజ్ కీ గాజు కిటికీ కి పక్కన, ఈ తీగ అందంగా పాకుతూంది. దానికి సహాయంగా ఎన్నో డైమండ్ల ఆకారం లో , గో్డ మీద ఇనుప తీగె నేలనుండి కప్పుదాకా సిమ్మెట్రికల్ గా కంటికి ఆకర్షణీయంగా ఉండేట్లు అమర్చాడు తోటమాలి లూపే.
ఇప్పుడే ఈ దృశ్యం ఇంత కన్నుల పండువగా ఉంది. ఈ మల్లె ఈ ఇనుపతీగ ననుసరించి పాకి ఘుమ్మున పూలు పూస్తే ఆ సుందర దృశ్యం ఇంటి లోనించి వెలుపటి నుంచి తను కొన్నాళ్ళలొ చూడటం , ఆ ఆకుల తీరైన రూపం, ఆ పచ్చదనాలు, ఆ మూడు మూడు మొగ్గల గుత్తుల తెల్లని అందం, సువాసనలు మనసులో ఊహించుకుని, ఆనందంతో వణికి పోయింది నిసి .
ఇంటిముందు లూపే ట్రక్కు ఆగిఉంది. వారం వారం వస్తాడు లూపే, తన ట్రక్కులో మెక్సికన్ పని కుర్రాళ్ళు, కావలసిన సామగ్రితో కలిసి. ట్రాక్టర్లు, ఎలెక్ట్రిక్ రంపాలు పని ఆరంభించాయ్. కుర్రాళ్ళు చకచకా పైనుండి రాలిన పెద్ద కొబ్బరి మట్టలు, తాటి మట్టలు పోగెసి ట్రక్కులో పడేస్తున్నారు. ఒకడు, లాన్ కత్తిరిస్తున్నాడు. ఇంకొకతను చిన్న ఆర్నమెంటల్ పామ్స్ , ఇతర పూల మొక్కలను సరిఐన ఆకారంలో కత్తిరిస్తున్నాడు.
అంతలోనే వచ్చి పక్కన నిల్చున్నాడు తోటమాలి లూపే.
“లూపే! భలే బాగా చేశావయ్యా, నీ పనితనం నాకు నచ్చింది” అంది. మల్లె మొక్క వేపు చూపిస్తూ. లూపే ఎంతొ సంతోషంగా నవ్వాడు.
లూపే ధృడకాయుడు. ఎంత ఎత్తో అంత వెడల్పుగా ఉంటాడు. పెద్ద తల. చదరపు ముఖం. నవ్వినపుడు పెద్ద పళ్ళు చిగురులతో సహా కనిపిస్తాయి. తన కుర్రాళ్ళతో కలిసి పని చెస్తాడు. అంత పెద్ద తోటా ఒక పది పదిహేను నిమిషాల్లొ పని ముగించేస్తారు. ఒక్కో సారి నిసి లోపలినించి అతనికేమైనా చెప్పాలని ఆమె చెతిలో పని ముగించుకుని వచ్చేసరికి అతను అక్కడ ఉండడు. అంత చురుగ్గా పని ముగించుకుని వేళ్ళి పోతారు వాళ్ళు.
లూపే, “మీరు బోగన్ విల్లా ఈ పెద్ద ఇనప కుండిలలో అన్ని రంగులు కలిపి పెట్టించారు. అది గమనించి, ఈ కెన్సింగ్టన్ గార్డెన్స్ లో ఇంకా కొంతమంది అలాటి పని వారి తోటల్లోనూ చెయ్యమని నన్నడిగారు.” అని చెప్పాడు.
నిసి డ్రైవ్ వేకి రెండు పక్కలా ఎరుపు, పసుపు, తెలుపు రంగుల మిశ్రమంలొ వెలిగి పోతున్న బోగన్ విల్లా వంక గర్వంగా చూసుకుంది. మధ్యలోఉన్న గడ్డిలో ఇండియాలో చిలకమొక్కల్లాటి ఇంపేషన్స్ పూలు కుప్పలు కుప్పలు.
“ఈ మధ్య పోర్ట్ రాయల్ తోటలు చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడి ఒక తోట చాలా నచ్చింది లూపే. కొన్ని ఆ ఐడియాలు ఇక్కడ వాడాలి మనం.” అంటూ అతనితో కలిసి నడిచి ఎక్కడ ఎంత సైజు గులాబి వెన్నముద్దలు, ఒంటిరెక్క మందారాలు, తెల్ల కాశ్మీరాలు, కనకాంబరాలు గుంపులుగా ఏ రంగుల్లొ నాటాలో, ఎక్కడ అరిటి మొక్కకు చోటుందో వాళ్ళమ్మాయి కోసం, ఎక్కడ మామిడి చెట్టుకు చోటుందో, వాళ్ళాయన కోసం, అన్నీ వివరంగా మాట్లాడింది.
ఈ పనులంటే ఆమెకు ఎక్కడలేని ఇష్టం. ఆమె రక్తంలొ మరి మట్టితో, మట్టినుండి వచ్చే చెట్టు చేమలతో ఘనిష్ట సంబంధాలున్నాయి మరి. వాల్ స్ట్రీట్ లో పని చేస్తూ ఒక్క మొక్క ఐనా నాటి ఎరుగని తన కూతుర్ని, ఆ తరం వారైన ఇతర చుట్టాల పిల్లలనూ తలుచుకుని, దేశంలో డబ్బు ఘనంగా పెంచుతున్నారు కాని, వీళ్ళు కొందరు ఒక్క పచ్చని మొక్క పెంచలేదు కదా ఇంతవరకూ అనుకుంటుంది నిసి.
లొపలికి వెళ్ళి కొంచెం ఉప్మా ఒక ఐదు నిమిషాల్లొ చేసి అది తినటం , ఒక కప్పుడు చల్లని పాలు తాగటం తొందరగా ఐపోయింది. అన్నిటి కన్నా తక్కువ సమయం తిండి మీద గడుపుతుంది, నిసి. వెనకటి డాక్టరు అలవాటు పోదు. ఇప్పుడు కావలసిన విశ్రాంతి ఉన్నా, బల్ల దగ్గరైనా కూర్చోకుండా, కిచెన్ సెంటర్ ఐలండ్ దగ్గర నిల్చుని తినేసి వెళ్ళిపోతుంది.
ఆ తినే టైములోనే ఫోన్ మోగింది. ఎత్తి హలో అనగానే అవతలి మాటలు విని “ఐతే ఈ రోజు రావన్న మాట , సరే సరే, మళ్ళీ నీకు సరిగ్గా పరిస్థితి తెలిసాక, ఫోన్ చేస్తావు కదూ! గుడ్ లక్, స్వీటీ! రేపు కలుస్తామేమో ఐతే. ఐ హోప్ సో ” అని ఫోన్ పెట్టేసింది.
ఆ పైన తన లైబ్రరీలోకి వెళ్ళి పోయిందామె మళ్ళీ .
ఎంత సేపూ ఏదో పుస్తకాలమీద ఎక్కువ ధ్యాస. చిన్నప్పుటినుంచీ ఏర్పడిపోయిన అలవాటు. మళ్ళీ మేఘసందేశం తియ్యబోతుంటే , గబుక్కున ఆమెకు మధ్యాహ్నం మూడు గంటలకు టెన్నిస్ లెసన్ ఉన్న సంగతి గుర్తొచ్చింది. సరే ఒక గంట ఆ కార్యక్రమం అయ్యాక, పబిక్స్ కు వెళ్ళి, గ్రోసెరీ కొనుక్కు వచ్చెయ్యచ్చు అని ఒక నీలం చొక్కా, నిక్కరూ వేసుకుని, స్నీకర్లు తొడుక్కుని, తన బెంజ్ కారులొ సముద్రానికి పక్కగా ఉండే గల్ఫ్ షోర్ డ్రైవ్ లో కారు నడుపుతూ, టెన్నిస్ క్లభ్ కెళ్ళింది.
టెన్నిస్ పాఠం ముగించాక కారెక్కుతుంటే, ఆమెకు వెనక సీట్లో, ఆర్ట్ పుస్తకాలు కనిపించాయి. అవి తిరిగి ఇచ్చెయ్యాలి. గుర్తొచ్చింది.
లైబ్రరీ నుంచి అప్పుడే ఆ విషయం ఫోన్ రానే వచ్చింది రెందు రోజుల క్రితం.
వర్జీనియా నిసితో చనువుగా నవ్వుకుంటూ మాట్లాడుతుంది. మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతు ఆమె వయసును సూచిస్తూ వణుకుతూ ఉంటుంది.
” నిన్ను ఆర్టిస్ట్ అనాలో, డాక్టర్ అనాలో? ఎప్పుడైనా పుస్తకాలు సరైన టైమ్ లో తెస్తావేమో అని చూస్తాను. ఇప్పుడు రోజుకి పదిహేను పైసలు ఫైన్ అని తెలుసుగా. ”
“నా పేరు పెట్టి పిలిస్తే చాలు. ఎవరైనా పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారా వర్జీనియా?”
వర్జీనియాకు ఎవ్వరూ ఆ పుస్తకాలను అంతగా వాడటం లేదని చెప్పటం ఇష్టముండదు.
కార్డ్ చూచే నిసికి తెలుసు. ఎప్పుడు ఎంత మంది ఒక్కో పుస్తకం చదివారో. కొన్ని కార్డుల మీద ఇంతవరకూ ఒక్కరైనా చదివిన చిహ్నాలు ఉండవు.
నిసి అంది “పర్వాలేదులే. డబ్బులిచ్చినా లైబ్రరీకేగా. ఆ డబ్బుతో ఇంకాస్త కలిపి, ఇంకేమైనా పుస్తకాలు మీరు తెప్పిస్తారు.”
వర్జీనియా వయసు ఢెబ్భయిల్లొనో, ఎనభయ్యిలోనో ఉంటుంది. ఆమె ఉత్సాహం చూస్తే నిసికి చాలా ఇష్టం. లైబ్రరీ పకడ్బందీగా నడుపుతుంది. వాలంటీర్లను ఏర్పరుస్తుంది. అదే కాక తాను సొంతగా ఆర్ట్ లో ప్రయోగాలు చేస్తుంది. ఆమె చెసిన ఒక కొల్లాజ్ కి బహుమతి వచ్చిందనీ, దాన్ని నిసికి చూపించి అది పేరిస్ పోయి అక్కడ ఎగ్జిబిషన్ లో చూపబడి కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెనక్కు వస్తుందని చెప్పింది.
నిసి తన క్లాసులలొనుండి లోపలకూ, బైటికి తిరిగేటప్పుడు “ఒహో డాక్టర్! ఈ వారం తమరే చిత్రకారుడి రూపం దాల్చారు. కిందటి వారం ‘మటిస్,’ అంతకు ముందు ‘పికాసో,’ ఈ వారం ఎవరూ మీరు?
“సెజాన్, ఈ వారం నెను సెజాన్ ను. చూపిస్తాలే నా స్టిల్ లై ఫ్ పెయింటింగ్ అవ్వగానే”
కారు నడుపుతూ నిసి వాళ్ళిద్దరి ఇలాటి సంభాషణలు కొన్ని గుర్తు చేసుకుంది.
కారు ఆర్ట్ సెంటర్ పార్కింగ్ లో ఆపి, లోపలికి పోయి రెండో అంతస్తులో లైబ్రరీ కెళ్తే వర్జీనియా లేదు. పుస్తకాలు తనే వాటి స్థానాల్లో పెట్టేసి, కార్డులు , డబ్బు, ఒక క్లిప్ కి పెట్టి డబ్బాలో పడెసింది. వేరే కార్డు మీద ఒక చిన్న బొమ్మ గీసి, తన పేరు కింద రాసి వర్జీనియా ఆనందం కోసం ఆ క్లిప్పుకే తగిలించింది.
వేరు దారినుంది కిందికి లాబీ లొకి వస్తే ఎప్పుడూ లేని కోలాహలం . అక్కడ ఉన్న రిక్ “హాయ్ నిసి, లొపలకు వస్తున్నావా? బైటికి వెడుతున్నావా? ” అన్నాడు నవ్వుతూ.
“పుస్తకాలు ఇచ్చిపోదామని వచ్చాను. ఎమిటి విశేషం ఇవ్వాళ?.”
“నువ్వు మెంబర్ వి. ఐనా మేం పంపే బ్రోషూర్లు చూడవా ఎప్పుడు? క్లాసులకు వచ్చి పోతావు గాని సాయంత్రాలు ఉన్న కల్చరల్ ప్రోగ్రాములకు రావేం? ” అని అడిగాడు.
“చూస్తాను రిక్ . కానీ ఏం గుర్తుండవ్. అప్పుడప్పుడూ నా కంప్యూటర్ మీద కేలెండర్లో ఎక్కిస్తా కూడా. కాని అది సమయానికి చూసుకోను. చెప్పరాదూ, ఇవ్వాళ ఏం మిస్సవుతున్నానో” అంది.
రిక్ చెప్పేలోగానే, ఒక చక్కని పిల్ల మాట అందుకుని ఈ రోజు “హంట్ స్లోనెమ్” ఛారిటీ ఇవెంట్ ఉంది గదా. మీరు రెజిస్టర్ చేసుకున్నారా?” అని అడిగింది.
“ఎవరతను. ఏం గుర్తు రాటల్లేదే?” అంది నిసి.
“స్లోనెమ్. న్యూయార్క్ లో ఉండే ఆర్టిస్ట్ . అతను పక్షుల వాటర్ కలర్ చిత్రాలు బాగా ప్రసిద్ధమైనవి. ఈ రోజు 60 వాటర్ కలర్ బొమ్మలు , తను వెసినవి ఆర్ట్ సెంటర్ కిచ్చెశాడు. 240 టిక్కెట్లు మొత్తం. సాయంత్రం రాఫెల్ తీస్తారు. అదృష్టవంతులకి అతని పెయింటింగ్లు దక్కుతాయి. మిగతావారికి వైన్, ఛీస్ , మ్యూజిక్ .” అందా పిల్ల.
“ఓ సారీ! నెను డబ్బు కట్టలేదు. అబ్బా! నాకు ఆ బొమ్మలు చూడాలనే ఉంది. టూ బేడ్” అని వెళ్ళ బోయింది నిసి.
పక్కనే ఇంకా సాయంత్రం జరగబోయే పార్టీకి నిర్వాహకులు కొంతమంది వచ్చి నిలబడుతున్నారు.
ఒక చక్కని కుర్రాడు, కౌంటర్ మీద మోచేతిని ఉంచి, సంభాషణ వింటున్నాడు.
నిసి లోలోపల ఆలోచిస్తున్నది. తను న్యూయార్క్ ట్రిప్పుల్లో, మెట్రోపాలిటన్ ఆర్ట్ మ్యూజియంలో గాని, గుగ్గెన్ హైమ్, ‘మోమా’ లో గాని అతని బొమ్మలు చూసిందా? చూసి ఆనందించడమే గాని నిసి జ్ఞాపక శక్తి ఇప్పుడు ఏమి బాగా లేదు. బ్రొషూర్ లొ అతని గురించి చదివి, ఆ తర్వాత ఇంటర్నెట్లో తన కంప్యూటర్ మీద చదివింది, ఏదో కొంత గుర్తొచ్చింది.
ఎదురుగా ఉన్న చక్కని అమ్మాయ్, “ఇంకా టికెట్లు ఉన్నాయ్. లాటరీకి కూడా టైం గడిచి పోలేదు. తప్పక సైన్ చెయ్యండి . ఎంతసేపు ఐదు నిమిషాల పని. మెంబర్ల డిస్కౌంటు ఉంది.” అంది.
పక్క వాళ్ళు కూడా చిరునవ్వులతో తలలూపారు.
కొంచెం తల తిప్పి అద్దాల కిటికీ ల్లోంచి బైటికి చూస్తే -అప్పుడే చక్కగా అలంకరించుకుని , టక్సీడోలు వేసుకుని ఎంతో హుందాగా ఉన్న భర్తల చేతి మీద చెయ్యి వేసుకుని, నడిచి వస్తున్నారు చక్కని దుస్తులు ధరించిన భామలు.
తన బట్టల కెసి చూసుకుంది. నవ్వింది నిసి. ఈ లాగూ చొక్కాతో నన్ను రానివ్వరుగదా! మీరు రానిచ్చినా మీ ఫంక్షన్ నేను పాడు చెయ్యొచ్చా! అందరూ ఎంతో మంచి దుస్తులు ధరించి వస్తారయ్యె. ” అంది నవ్వుతూ.
వినోదంగా వింటున్నారు పక్క వాళ్ళు. లోపలికి చక్కని పువ్వుల వేజ్ లూ , వైన్ గ్లాసులూ, ట్రేలు పట్టుకు వెళ్ళే వెయిటర్లూ- నిసి గమనిస్తున్నది.
అమ్మాయ్ వెనకాల ఆర్గనైజర్ చాలా మర్యాద గానే, “చాలా సేపు ఉంటుంది ఫంక్షన్. మీకు కావలిసినంత టైం ఉంటుంది.” అంది చెప్పకనే చెపుతూ.
“నేనిప్పుడే టెన్నిస్ ఆడి వస్తున్నా. నా ఇల్లు మరీ అంత దగ్గిరేం కాదు. ఏమయ్యింది. ఎన్నో ఇవెంట్లు వస్తూనే ఉంటాయ్. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా.”
కౌంటర్ వెనకాల కుర్రపిల్ల ముఖం కొంచెం వాడింది. అది చూసి బాయ్ ఫ్రెండ్ చిరునవ్వు కాంతి, కొంత తగ్గటం, వెనక్కు తిరిగి వెడ్తున్న నిసి గమనించక పోలేదు.
టెన్నిస్ ఆడి నందువల్ల ఆమె హుషారు ఆ రోజు పెరిగి ఉంది. పైగా అందమైన ఫిఫ్త్ ఏవెన్యూ ఎంతో ఆనందంతో ఉన్న జనం తో కిక్కిరిసి ఉండటం చూసింది వచ్చేప్పుడే.
ఆ సాయంత్రపు వెచ్చటి, హాయైన గాలులు, తేలివచ్చే సంగీతపు ధ్వనులు, అన్నీ ఆమెలో ఉత్సాహాన్ని పెంచాయ్.
స్లోనెమ్…. న్యూయార్క్లో తన లాఫ్ట్ – స్టూడియో లోనే ఎన్నో పంజరాల్లో రకరకాల పక్షులను పెంచుతాడట . ఆ పంజరాలను ఆ పిట్టలను బొమ్మలు గీస్తుంటాడు. అతని బొమ్మలు ప్రపంచంలో చాలా మ్యూజియంలలో ఉన్నవి.
ఇండియా వెళ్ళి వచ్చాడట చాలాసార్లు . దాంతో అతనికి ప్రకృతిపై ప్రేమ, స్పిరిచ్యులిజం పెరిగిందట. అదే అతని ఇన్ స్పిరేషన్ అట. అదేమిటో ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళకు మాత్రం అలాటివేవీ రావు. అక్కడనుండి ఎప్పుడు బైటబడి పోదామా అని ఉంటుంది. పరదేశస్థులందరికీ ఇండియా కల్పవృక్షం అనుకుంది, నిసి.
ఐనా గాని నిజంగా ప్రకృతంటే , పక్షులంటే అభిమానం ఉంటే వాటిని ఒక పెద్ద సిటీలో గదుల్లో ఎందుకు బందీగా ఉంచుతారు. ఊరికే కబుర్లు చెపుతారు. బొమ్మలు వెయ్యగా వెయ్యగా, ప్రతి ఆర్టిస్ట్ కీ ఏదో ఒక సబ్జెక్ట్ దొరుకుతుంది. అంతకు ముందు ఎవరూ దానిలో ప్రయోగం చెయ్యక పోతే వాళ్ళకు పెద్ద పేరొస్తుంది.
చూసొద్దాం. ఎలా వేశాడో బొమ్మలు. ఏం పోయింది. అనుకుంది.
బైట సైడ్ వాక్ మీద పార్కింగ్ కేసి నడిచేదల్లా మళ్ళీ వెనక్కు తిరిగింది. లోనికి వెళ్ళింది.
“ఓ! తిరిగి వచ్చెరు? ” అంది ప్రశ్నార్ధపు ముఖం పెట్టి ఒక ఆర్గనైజర్.
నిసి అంతకు ముందు మాట్లాడిన అమ్మాయితో ” ఫ్రెండ్! ఒక టికెట్ కొంటాను.” అని గబగబా ఫార్మ్ పూర్తి చేసి, “నా టికెట్ ఉంచుతావుగా. నా పేరు రేఫెల్ లో ఎంటర్ చెయ్యటం మర్చిపోకు. అది నీకే వదిలేస్తున్నా. ఒకవేళ ఇంటికి వెళ్ళాక నాకు బద్దకం వేసి నే రాక పోతే, నాకు లాటరీ వస్తే కనుక నా తరుఫున నువ్వు పెయింటింగ్ తీసుకుని ఉంచు. నేను మళ్ళీ ఆర్ట్ సెంటర్ కి వచ్చినప్పుడు తీసుకుంటా. ఖంగారేముంది. ” అని గబగబా సూచన లిచ్చేసి, ఆమె చెప్పిన టికెట్ ఖరీదు చెక్కు రాసేసి ఆమెకు ఇచ్చి, బైటికి నడిచింది.
ఆ అమ్మాయి ముఖం ఒక్క వెలుగు వెలిగింది.
ఊరికే ఆరాటము, ఉబలాటమే కాని అసలు రావాల్సిన డబ్బు ఊళ్ళో షావుకార్లు ఎప్పుడో దఖలు పరిచి ఉంటారు. ఈ ఒకటీ అరా టికెట్లు వల్ల ఏమీ కాదు. ఊరికే ఆ చిన్నవాళ్ళ ఉత్సాహం. మేమూ కొంత పని చేశాం. కాసిని టికెట్లు అమ్మాం అని. అప్పటికప్పుడు ఎవరు కొంటారు ఆ సాయంత్రం టిక్కెట్లు , తనలాటి మతిమరుపు వాళ్ళు తప్ప, అనుకుంది నిసి కారు డ్రైవ్ చేస్తూ.
ఈ పెయింటర్ గురించి రాఛెస్టర్ కవి, ఆర్ట్ విమర్శకుడు ‘జాన్ ఏష్ బెరీ’ కామెంట్లు తను చదివింది. అతను ఈ ఆర్టిస్ట్ గురించి మంచి అభిప్రాయమే వెలిబుచ్చాడు.
బాగుంటయ్యేమో చూద్దాం. నిసి ఉత్సాహం పెరుగుతున్నది.
తను ఆర్ట్ గెలవటం అది వట్టి మాట . నిసి ఒక్కటి కూడా ఎప్పుడూ గెలవదు. లాటరీ తగలటం అన్న మాటే లేదు.
వాళ్ళాయన ఎప్పుడూ ఏదో ఒకటి గెలవటం గుర్తొచ్చింది. నయాగరా వెడితే ఇంత పెద్ద ‘స్నూపీ’ బొమ్మ గెలిచాడు. ఎంతో ముచ్చటగా మోసుకొచ్చుకున్నారు దాన్ని. లాస్ వేగాస్ వెళ్ళినప్పుడల్లా , అతడు లాగినప్పుడల్లా స్లాట్ మెషీన్లు డబ్బులు కురిపించేవి. ఆ డబ్బుల ఘల్లు ఘల్లు మోతలు, వాళ్ళిద్దరూ ఆ డబ్బులు సంతోషంగా ఏరుకుని, నిజం నోట్లలోకి మార్చుకుని లెక్కపెట్టుకుని సంతోష పడటం, ఎంత బాగుండేది.
ఆ డబ్బుల మోత, సీసర్స్ పేలస్ లో సరైన అంకె మీద అతడి కోసం ఆగే చక్రాలూ, ఎమ్.జి.ఎమ్. -స్లాట్ మెషీన్ల మీద మూడు సింహాలు, బెల్లేజియోలో మూడు ఏడులు బొమ్మలు, తిరిగినప్పుడల్లా తమ ఇద్దరి ఆనందాలూ అన్నీ గుర్తొచ్చాయి. తనకు ఒక్కసారంటే ఒక్క సారి కూడా ఏం అదృష్టం, ఏడబ్బు రాలిపడదేం?
రేస్ కోర్స్ లోనూ అంతే అతనికి జాక్ పాట్లు చక్కగా తగుల్తాయి. మొదటిసారి మలక్ పేట రేస్ కోర్స్ లో వాళ్ళుతిరుగుతుంటే, పైన మైకులో అతని పేరు చెప్పటం, లాటరీలో అతనికి పెద్ద మొత్తం వచ్చినట్లు అందరూ వినటం, తమతో పాటు ఆ రోజు తిరుగుతున్న ఆ ఊళ్ళో ఉన్న సుందరీమణులు ఆయనను ఆరాధనగా చూడటం, కావాలని వచ్చి వరుసుకోటం, ఐస్ క్రీం లు కొనిపించుకోటం, అన్నీ గుర్తొచ్చాయి.
శ్రీ కృష్ణ పరమాత్ముడు. శ్యామల గోపాలుడు. ‘లేడీస్ మాన్’ అనుకుంది నిసి నవ్వుతూ.
ఆ ఆలోచనల్లో ఉండగా, కారు ఆమెను ఇంటికి చేర్చింది. కారు బైట డ్రైవ్ వేలో వదిలేసి, వెంటనే బాత్రూం లోకి పోయి , షవర్ తీసుకుంది. అప్పుడు కూడా అక్కడికి అద్దంలోంచి కనిపించే , ఇండోర్ గార్డెన్ లో గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ఊదా రంగు పూలను, వాటిమీద వాలి ఉన్న తుమ్మెదలను చూడటం మరువలేదు.
” క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా, భ్రమరమ్ములు ఘుమలు ఘుమలుగా, ఝుంఝుమ్మని పాడగా, …మనసు పరిమళించెనే, ఆహా..”
ఎవరీ మధుర కవి! పొయెట్రీ రాసే వాళ్ళు, చదివే వాళ్ళు అదృష్టవంతులు. కాని పొయెట్రీని జీవించేవాళ్ళు కదా అసలు భాగ్యవంతులు!
ఒంటికీ, ముఖానికి, పరిమళపు లోషన్లు పూసుకుంటూ, ఎలాటి బట్టలు ధరించటం అని ఆలోచించుకుంది. చూసింది గదా, అంతకు ముందే ఆ లోపలికి వెడుతున్న వాళ్ళు ఎక్కువగా ఎలాటి దుస్తులు వేసుకున్నారో.
నలుపు, నలుపు. అవును నలుపు బాగుంటుంది. రీగల్. ఫార్మల్. ఐనా ఇవ్వాళ నేను నలుపు వేసుకోను. ఇవ్వాళ తేడాగా ఉందాం అనుకుని తెలుపు, వెండి రంగులు మిళాయించిన చేతులు లేని సిల్క్ బ్లౌస్, సిల్క్ పేంట్స్ వేసుకుంది. ఎలాంటి ఆభరణాలు? ఒక్కటే వజ్రం ఉన్న పోగులు. వంద వజ్రాలున్న మ్యుల్లర్ వాచ్. ఒక్కటే రవ్వల గాజు కుడిచేతికి. మెడలో – ఏం వద్దు.
సిల్క్ బ్లౌస్ పైగా, చక్కగా టేన్ అయిన గుండెల మీద అందమైన నల్లని పుట్టు మచ్చ మెరిసింది. ఎందుకు మెడలో నగలు?
జుట్టు ఉంగరాలు ఉంగరాలు తిరిగి పోయిందా రోజెందుకో. నలుపు, తెలుపుల మిశ్రమం. ధరించిన వెండి దుస్తులకూ తలలోని వెండి చమక్కులకూ చక్కగా తగిపోయింది. కాళ్ళకు మెరిసే వెండి రంగు ఆరంగుళాల హీల్స్ .
భుజాలపైన మెత్తగా, మెరుస్తూ జారే మేచింగ్ సిల్క్ కోట్ వేసుకుని -మళ్ళీ కార్లో ఆర్ట్ సెంటర్ కి వెళ్ళింది. అప్పటికి చీకటి పడిపోయింది. ఫిఫ్త్ యావెన్యూ పొడుగూతా పామ్ ట్రీస్ చిన్ని చిన్ని మినుకు మినుకు దీపాలతో అలంకరించబడిఉన్నాయి.
తారా మండలమే భూమ్మీదికి దిగివచ్చినట్లు మెరిసి పోతున్నది. ప్రజలు సంతోషంగా బైట చిన్న బల్లల చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ, పానీయాలు తాగుతున్నారు. కొంతమంది ఫౌంటెన్ల చుట్టూ, కేనొపీల కిందా, పచార్లు కొడుతున్నారు.
వాన్ లీబిగ్ ఆర్ట్ సెంటర్ ఆ రాత్రి మణిహారంలో పతకంలో పెట్టిన పెద్ద ఎమరాల్డ్ వలె ఉంది.
కౌంటర్ దగ్గిర మనుషులు ఎక్కువమంది లేరిప్పుడు. ఫంక్షన్ మొదలయి పోయింది. మాటలు నవ్వులు వినిపిస్తున్నాయ్ ఎగ్జిబిషన్ రూం లోంచి.
లోనికి వెడుతుంటే అక్కడ కొందరు “వచ్చారు! రండి, రండి. వెనక్కి వచ్చారు, ఎంతో సంతోషం, లోనికి వెళ్ళండి. నేం టేగ్. ఏమీ అక్కర్లేదు వెళ్ళి ఆర్ట్ చూడండి” అన్నారు. లోన అందరూ గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. మధ్యలో వేదిక మీద ఒక పియానో, డ్రమ్స్, సేక్స ఫోన్ వాయిద్యాలు, సంగీత కారులు. అక్కడే మైక్ పట్టుకుని ఒక అమ్మాయి పెయింటింగ్ ఆక్షన్ జరుగుపుతున్నది .
మూడు వేలు, మూడు వేల వంద , మూడు వేల రెండొందలు – అక్కడ ఉంది వేలంపాట.
నిసికి భయం పుట్టింది. అయ్యబాబోయ్ తను సరిగ్గా వినలెదా? రాఫెల్ అన్నారు. ఇప్పుడు ఆక్షన్ జరుగుతుందేం. అవంటే నిసికి చాలా భయం. పొరపాటున ఏ చెయ్యో, జుట్టు సర్దుకోటానికి ఎత్తితే , తను మూడువేల మూడొందలు అని పాడిందనుకుని ఆ బొమ్మ తనను కొనమంటే చాలా గొడవై పోతుంది.
టికెట్ ఖరీదే చాలా ఉంది. ఇప్పుడు ఇంకా ఆక్షన్ కూడానా. పక్కనే ఉన్న ఒక వన్నెలాడిని అడిగితే – ఈ ఒక్క చిత్రం మాత్రమే వేలాం. ఇదొక్కటే. దీని అసలు విలువ పదివేల డాలర్ల దాకా ఉంటుందని చెప్పారు.
ఎవరు ఎక్కువ బేరం ఇస్తే వాళ్ళకు. ఆ తర్వాత మళ్ళీ రేఫెల్ సాగుతుంది. ఇంతకు ముందు కొన్ని ఆర్ట్ వర్క్ లాటరీ అయిపోయింది. కొంత మంది అదృష్టవంతులు చిత్రాలు గెలుచుకు పోయారు.
నిసి కొంచెం జనం లోంచి దారులు చేసుకుని వెడుతూ, గోడలు కొన్ని చోట్ల ఖాళీగా ఉండటం గమనించింది. కొంతమంది ఇంకా గదిలో చుట్టూ తిరుగుతూ, తమ పేరు పిలిస్తే తామైతే ఏ బొమ్మ తీసుకుంటారో అని ఆలోచించుకుంటున్నారు. పక్క వాళ్ళతో చిన్న చర్చలు చేస్తూ వినోదిస్తున్నారు.
నిసి బల్ల దగ్గరకు వెళ్ళి రెడ్ వైన్ తెచ్చుకుంది. బల్ల వెనక బార్టెండర్ ఉన్నా, అక్కడ ఒక ఆర్గనైజర్ ప్రత్యేకంగా వైన్ గ్లాసు అందిస్తూ, గబుక్కున ఆమెను గుర్తించి,
“ఓ మై గాడ్! ఎంత మార్పు. ఎంత అందంగా ఉన్నారు!” అన్నాడు చిరునవ్వులొలుకుతూ.
“అవునవును. ప్రెట్టీ ఉమన్ సినిమా లో జూలియా రాబర్ట్స్ లాగా మారిపోలా నేను ఒక గంటలో !” అంది ఉడికిస్తూ నిసి.
“మరే. మరే. అంతకన్నా తక్కువ ఏమాత్రం కాదు. బ్యూటిఫుల్ . బ్యూటిఫుల్” అన్నాడతను.
“ఓ మై గాడ్ . షి ఈస్ బేక్” అని ఉత్తేజంతో అరిచారు ఆమెను చూసిన కుర్ర పిల్లా, ఆమె స్నేహితుడూ.
నిసి నవ్వుకుంది. అమెరికాలో తెలుగు వనిత ఒక ఎక్సాటిక్ బర్డ్. ఈ చిత్రాల్లో చిలకలూ, సీతాకోక చిలకల్లాగానే. ఆంధ్రా పోతే ఒక్కరు మన దిక్కు చూడరు. ఇక్కడ తెలుగు అందం ప్రత్యేకంగా కనపడుతుంది.
మంచిదేగా! మనకేం నష్టం. అనుకుంది.
టికెట్ అమ్మిన అమ్మాయి, స్నేహితుడు ఆమెను ప్రశంసాపూర్వకంగా చూశాడు. అది నిసి గమనించింది. ఆ కుర్రవాడొక్కడే అక్కడ చాలా సాదాగ వచ్చింది. గళ్ళ ఆకు పచ్చని చొక్కా పొడుగ్గా కిందికి వేళ్ళాడుతోంది. మామూలుగా వేసుకునే నీలపు జీన్స్. పక్కన అమ్మాయి చక్కని సూట్లో, ఇతడు మామూలు దుస్తుల్లో. ఐతేనేం ఇద్దరూ ఎంతో ముచ్చటగా ఉన్నారు. చాలా అందమైన ముఖాలు. మర్యాద ఉట్టిపడుతోంది ఇద్దరి దగ్గరా.
ఎక్జిబిషన్ హాల్లో లోపలికి చూస్తే అక్కడి వారు అందుకు పూర్తిగా వ్యతిరేకం. అందరూ డాలర్, డాలర్, డాలర్ అని బోర్డులు మెడలో వేలాడేసినట్లే ఉన్నారు. వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళంతా పోర్ట్ రాయల్ కుబేరులు. డబ్బు రాసులు కలవారు. గుండ్రటి బల్లల వద్ద కూర్చుని విలాసంగా తాగుతూ, పక్కనే వాళ్ళకు తెలిసిన వాళ్ళతో మాత్రమే అప్పుడప్పుడు మాట్లాడుతూ, ఊరికే ఒక కన్ను చిత్రాల మీదా, ఒక చెవి మధ్య మధ్య వినిపించే పియానో, సాక్సఫోన్ సంగీతమ్మీదా పడేశారు. కొంతమంది మాత్రం, అబ్బో! అర్ట్ మీద వాళ్ళకున్న ప్రేమను, ఏది మంచి కళ, ఏది చవక బారు, ఎలా తేల్చి చెప్పగలరో అది వాళ్ళకు పుట్టుకతో వచ్చిన విద్యలా ప్రక్క వాళ్ళతో డంబాలు కొడుతున్నారు.
మామూలు ప్రకారమే అక్కడ నిసికి ఒక్కరు కూడా తెలియదు. ఆమెకు ఎక్కడకు వెళ్ళినా ఎవరూ తెలియరు. ఆమెకు ప్రపంచంలో తెలిసినవాళ్ళు చాలా తక్కువ. డాక్టరు పని మానేసాక ఆ సంఖ్య ఇంకా చిన్నదై పోయింది. ఐనా ఆమెకు ఒంటరితనం లేదు. తెలిసిన ముఖాలైతేనే సుఖం, లేకపోతే గిలగిల లాడిపోటం ఆమెకు లేదు. ఎవరు పక్కన ఉంటే, వాళ్ళతో మాట్లాడటం వాళ్ళనించి ఏదో కోంత నేర్చుకోటం, వినోదించడం ఆమెకు అలవాటు .
గోడల మీద మిగిలిన బొమ్మలను వరసగా చూస్తూఉంది . ఒక దాన్లో నీలపు కోతులు, ఇంకో దాన్లో పింక్ కుర్చీ, మూడు ఎర్ర పిట్టలు, సీ షెల్స్, బ్లూ హార్బర్, ఒక రాణి, గణేష, పసుపు రంగు పిట్టలు ఇలా – – బాగున్నాయ్ . బాగున్నాయ్, రంగుల మిశ్రమాలు. కొన్ని బొమ్మలు ఎక్సైటింగ్ గా ఉన్నయ్.
అంత ఖరీదయినవి కావు చిత్రాలు. ఖరీదు కడితే, ఏదీ 500 డాలర్లు దాటి ఉండదు. ఐనా పేరు పడిన ఆర్టిస్ట్ చిత్రానికి ఉండే విలువ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పోను పోనూ కొన్ని విపరీతంగా వెల పెరగవచ్చు. తన దగ్గర ఉన్న లిస్ట్ చూస్తూ, గోడల మీద ఉన్న బొమ్మలు చూస్తూ, తనైతే ఏది తీసుకుంటుందా అని ఆలోచిస్తూంది.
మళ్ళీ ఆమె దగ్గరికి ‘కుర్రపిల్లా, బోయ్ ఫ్రండ్’ వచ్చి పలకరించి పోయారు. ఆ పిల్ల చెప్పింది, తనైతే ఏ వాటర్ కలర్ తీసుకుంటుందో. దానికేసి చూసింది. ఏం గొప్పగా అనిపించలేదు. నిసి కీ మధ్య రంగుల మీద మోజు జాస్తి అయింది. ఆ బొమ్మ చాలా, సీదా సాదాగా ఉండి ఆమెను ఆకర్షించలేదు. ఐనా నిసికి తనకు ఎలాగూ గెలిచే యోగం లెదని తెలుసు.
ప్రతి రెండు నిమిషాలకూ, వేదిక మీద గుండ్రంగా తిరిగే జార్ ఆగినపుడల్లా అందులొంచి ఒక చీటీ తీసి ఒక పేరు చొప్పున చదివటం , తమ పేరు వచ్చిన వాళ్ళు ఆనందంగా అరుపులూ, కేకలూ, గోడ మీంచి ఒక చిత్రం తీసుకో్టం. చకచక సాగుతోంది. ఫొటో గ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నారు. ఫ్లాష్ లు మెరుస్తున్నయ్.
చూస్తుండగానే గోడల మీది అన్ని వాటర్ కలర్స్ ఐపోయాయి. 60 మందికి బొమ్మలు వచ్చాయ్. 180 మంది ఏ బొమ్మా లేకుండా వెనక్కి పోతారు. మెల్లిగా, అతిధులు ఒకళ్ళ కొకళ్ళు వీడ్కోలు ఇచ్చుకుంటూ హాలు ఖాళీ అవసాగింది.
ఆక్షనీర్ స్టేజ్ దిగివచ్చి తనకు కొంచెం భయం కలిగినట్లూ, అంతా సరిగ్గా చేశానా అని వాళ్ళ స్నేహితుల దగ్గరనుండి కనుక్కుంది. ఒక వ్యవహర్త వచ్చి అంతా బాగా జరిగిందని, భుజం తట్టి వెళ్ళాడు. చక్కగా సంగీతం మొదలయ్యింది. అప్పటికే ఎంతో సేపు అక్కడ గడిపినందున, ఎక్కువమంది వెళ్ళిపోతున్నారు.
నిసి – వెళ్ళనీ, వెళ్ళనీ, హాయిగా సంగీతం వినొచ్చు అనుకుని ఒక బల్ల దగ్గర బేండ్ కు ఎదురుగా కూర్చున్నది. వెయిటర్ వచ్చి వైన్ గ్లాస్ నింపిపోయాడు. పళ్ళెంలో ఛీస్ ముక్కలూ, ఎర్ర ద్రాక్షలూ. ఆమె కొంచెం సేపట్లోనే సంగీతంలో లీనమై పోయింది. ఆరోజు ఆమె రక్తం వేడిగా, వాడిగా ప్రవహిస్తున్నది. ఎందుకో ఆమె చాలా ఆనందంగా ఉంది. ఆ పియానో ధ్వనులు, ఆ డ్రమ్ముల లయలు, ఆ వాయిద్యాలు ఆమెకు ఎంతో హాయి కలిగించాయి. ఆ వెళ్ళే వాళ్ళను ఏమీ పట్టించుకోకుండా చేతితో బల్ల మీద తాళం వేస్తూ, కాళ్ళు లయగా , భూమి మీద టాప్ చేస్తూ, సంగీతం వింటూ ఆనందిస్తున్నదామె.
కొంచెంసేపటికి గదిలో ఎవ్వరూ లేరు. ఆమె. బేండ్ అంతే. నిసికి అదెంతో ఇష్టంగా ఉంది. అప్పుడు ఆమె తనకోసం ఒక సంగీత కచ్చేరీ జరుగుతున్నట్లుగా అనుకుంది. ఎవ్వరూ లేక పోతేనేం. సంగీతం వింటానికి వెరే మనుష్యుల తోడు ఎందుకు. అదుగో ఆర్టిస్టులు ఎదురుగా. ఇదిగో ఇక్కడ శ్రోత తాను.
వెళ్ళిపోనీ ఆ కుబేరులందరినీ, వాళ్ళు బైటికి వెళ్ళి, బైట టెర్రేస్ ల మీద నుంచుని వాళ్ళ రియల్ ఎస్టేట్ ఎంత పెరిగిందో, ఎంత తరిగిందో , స్టాక్ మార్కెట్టూ, ప్రపంచ వ్యవహారాలూ మాట్లాడుకుంటారు. వారికి ఈ సంగీతం ఎందుకు? తనకు ఆ గొడవెందుకు? ఇక్కడ ఎవ్వరూ లేరని వారితో తనెందుకు పోవడం.
అదిగో! చిత్రాలు చూశాను. సంతోషం. ఇప్పుడు సంగీతం సాగుతుంది. మహా భాగ్యం. ఆ ధ్వని తరంగాలు శ్రావ్యంగా మనసును తేల్చి వేస్తున్నాయ్. ఆమె పాదాలు, చెతులు, తల, వళ్ళు, లయగా కదులుతున్నాయ్. పక్క బల్ల మీద దరువు వేస్తున్నది. అప్పుడప్పుడు చప్పట్లు కొడుతోంది. మళ్ళీ పక్కనే ఆ అమ్మాయీ, ఆకుపచ్చ గళ్ళ చొక్కా కుర్రాడు వచ్చి నించున్నారు. కాసేపు ఆమె పక్కనే నించుని -బాగుంది కదా సంగీతం? అన్నారు.
అవును ఫ్రెండ్స్ ! అంది నిసి వాళ్ళతో. మళ్ళీ సంగీతం వినసాగింది. ఇంతలో ఆ అమ్మాయి తూనీగలా వెళ్ళి పోయింది. అబ్బాయి మాత్రం చనువుగా, నిసి పక్కనే నేల మీద మీగాళ్ళ మీద వంగి ఆమె కుర్చీ వెనకాల చెయ్యి వేసి కూర్చున్నాడు. కొంచెం సేపు ఉండి, నాతో డాన్స్ చేస్తారా? అన్నాడు నవ్వుతూ.
ఆశ్చర్యంగా చూసింది నిసి. అతని ముఖం పైకెత్తి ఉంది. ఎంత అందంగా ఉన్నాడు. చక్కని నవ్వు. కళకళ లాడిపోతున్నది ముఖం.
“నేనా! నీ గర్ల్ ఫ్రెండ్ తో చెయ్యవోయ్!” అంది.
“ఐ నో. ఐ విష్. మీరు చెయ్యండి నాతో డాన్స్ ” అన్నాడు. నిసికి కొంచెం అర్ధమయీ అవనట్లు అర్ధమయింది . అతని స్నేహితురాలు, ఆ పిల్ల -ఇక్కడ పని చేస్తున్నది ఈ సాయంత్రం. ఈ సందడి, ఈ సంగీతం ఇక్కడ తనలా డబ్బు కట్టిన అతిధుల కోసం. ఆమె నృత్యం చెయ్యటం ఆర్గనైజర్లకు నచ్చదు? అందుకా? ఐతే తననెందుకు అడగటం?
“నాకు డాన్స్ రాదు మిత్రమా” అంది నవ్వుతూ.
“నాకూ రాదు మేడం. ఐతే ఏం? దేనికైనా మొదటిసారి ఉందంటారుగా”
అసలు చెప్పాలంటే, నిసీ కాళ్ళు అప్పటికే, సిండెరెల్లా షూలో ఉన్నట్లున్నాయి. ఆ హాల్ ఒక్క సారిగా బాల్ రూమ్ ఐ పోయింది. నిజంగానే ప్రిన్స్ చార్మింగ్ వచ్చాడు. ఇదేమి వింత!
“సరే, సరే, ” అని లేచి నించుంది.
చక్కగా స్లో మ్యూజిక్. ఎదురుగా అందమైన చిన్నవాడు. ఆమెలో స్త్రీత్వం పొంగింది. ఆమె చందమామై పోయింది. తెలియకుండానే ఆమె అందంగా ఊగింది.
ఎంతో మర్యాదైన కుర్రాడు. చక్కని స్టెప్స్ వేస్తున్నాడు. నిజంగా ఇతనికి నాట్యం రాదా? అతని కాళ్ళ వంక చూస్తూ, అతని బూట్లు ఎలా కదులుతూ ఉంటే తనూ అలానే కదులుతూ నృత్యం చేసింది.
ఎవ్వరూ లేరు హాల్లో. సంగీతం. సంగీతకారులూ. తనూ, ఇతడు.
ఇతడెవ్వరు? ఏమో?
డాన్స్ చేస్తూ, కబుర్లు చెపుతున్నాడు. ఎక్కడ చదువుతున్నదీ . అతని స్నేహితురాలు ఎక్కడ చదివేదీ.
ఇతడెవరు? ఇతనితో తను ఈ నృత్యమేమిటి?
నిసి దుస్తులు, అందంగా మెరుస్తున్నాయి. ఆమె కాళ్ళకున్న సిల్వర్ హైహీల్స్ ధగధగ లాడిపోతున్నయి. ఆమె పాదాలకు, ఆ అందమైన హీల్సే ఎలా కదలాలో, అవే నేర్పిస్తున్నాయి.
రెడీ? అన్నాడు కుర్రాడు, చెయ్యి పైకి చాపుతూ. ఆ వదులుగా వేలాడే చొక్కా లోంచి, అతని వెడల్పు భుజాలు, సన్నని నడుము చక్కదనం ఆమెకు చక్కగా తెలిసింది.
“నో కిడ్డింగ్” అంది నిసీ. చక్కగా అతడి చెయ్యంది పుచ్చుకుని గిరగిరా తిరిగింది. వెన్నెల వలె నవ్వాడతను.
“డాన్స్ రాదన్నారు? మరి ” అన్నాడు.
అని నవ్వుతూ ఆఖరి సారుగ, మళ్ళీ ఆమెను గిరగిర తిప్పాడు. పాట ముగుస్తుందనగా, మెల్లిగా అడుగులు నెమ్మది చేస్తూ, ఆగిపోయారిద్దరూ.
చాల థేంక్స్! నాతో డాన్స్ చేసినందుకు – అని చెయ్యి పట్టుకుని మెత్తగా వత్తి, స్నేహంగా ఊపి నవ్వుతూ ఎలా వచ్చాడో అలాగే వెళ్ళి పోయాడప్పుడు ఆ అందగాడు.
ఆమె కొంచెం సేపు కూర్చుని, తన గుండె అదటు అణచుకుని, వైన్ సిప్ చేస్తూ, ఈ సారి సంగీతం ఆపినపుడు పియానో ప్లేయర్ కూ , ఇతర ఆర్టిస్ట్ లకూ, తనకు వారి వాయిద్యం ఎంత బాగా ఉందో చెప్పి, ధన్యవాదాలు తెలిపి, బైటికి నడిచింది. లాబీలో పలచగా జనం ఉన్నారు. ఆర్గనైజర్ ఒకతను పుస్తకాలు, లెక్కలు చూసుకుంటున్నాడు.
నిసి సాంతం బైటకి నడుద్దామనుకునేంతలో ఒక అతిధి, గబగబా వచ్చి, “నీతో మాట్లాడవచ్చా, మై డియర్ ? ” అంది.
ఆమె ఎవరో నిసికేం తెలుసు. ఆమె వాళ్ళ ఆయన్ను చాలా ఉత్సాహంతో పిలిచింది. ఆయనేం పట్టించుకోలేదు. వింతేముంది! చాలామంది భర్తల్లానే. అయినా, ఆమె పట్టు వదలకుండా నిసిని ఆయనకు పరిచయం చేసింది.
ఆయన ఏం మొహమాటం లేకుండా నిసిని, వాళ్ళావిడనీ ఇద్దరినీ ఇగ్నోర్ చేశాడు.
“మీరు ఇండియానుంచి వచ్చారా? అబ్బా, చాలా బాగుంది మీ నృత్యం. నే బైటి నుంచి చూస్తున్నా. ఎక్కడ నేర్చుకున్నారు?”
“ఎక్కడా లెదండీ. సంగీతం బాగుందీ, అబ్బాయి బాగున్నాడూ. అతనికి ఎదురుగా, ఊరికే అటూ ఇటూ కాస్త కదలటమేగా” అంది నిసి.
“ఇంకా నయం. భలేగా ఉంది. జస్ట్ గ్రేట్. ”
నిసి చాలా ఆశ్చర్యపోయింది. ఆమె కొద్దిగా తాగి ఉంది. తనూ అంతే. అప్పుడు అన్నీ అందంగానే ఉంటయ్ కదా! అని అనుకుంది.
ఆవతలి ఆమె జర్మన్ లాగ ఉంది. తన కార్డ్ తీసి ఇచ్చి , “తప్పకుండా మమ్మల్నెప్పుడన్నా పిలవండి. మళ్ళీ మాట్లాడుకోవాలి మనం” అంది, వాళ్ళాయనను కూడా సంభాషణలలో కలుపుకుంటూ. ఆయన వేరే దిక్కు చూశాడు.
అలాగే! అని కార్డ్ చదువుకుంది నిసి.
వింటర్ లో ఇక్కడా, స్ప్రింగ్ లో ఇక్కడ, సమ్మర్లో ఇక్కడ, ఫాల్లో ఇక్కడా – అని ప్రపంచంలో నాలుగు చోట్ల ఇళ్ళ అడ్డ్రెస్లు రాసి ఉన్నాయి. సంవత్సరం అంతా ఆమె ఎక్కడ దొరుకుతుందో ఒక అడ్రెస్ , ఫోన్ నంబరు ఉంది.
నిసికి భయం వెసింది. ఈమె గాని ఈమె ఇంటికి పిలిచి ఏ పార్టీ లోనైనా నా నృత్య ప్రదర్శనం ఇమ్మనదు కదా అని. బైటికి పోతూ ఉండగా, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ‘కుర్రపిల్లా, బాయ్ ఫ్రెండూ’ ఇంకో తలుపులోనుండి, వాళ్ళూ వెళ్ళి పోతున్నారు. గుడ్ నైట్ చెప్తూ వెళ్ళిపోయారు. ఆమెకు ఎందుకో గాని వాళ్ళు ఆ రాత్రి, చాల మధురమైన రాత్రి గడుపుతారనిపించింది.
ఆమె కారు లో వెడుతుండగా ఆమె మనసంతా ఆనందం. ఏవో బొమ్మలు చూసి, ఏదో ఒక బొమ్మ ఇంటికి తెచ్చుకుని గోడ మీద తగిలించుకుందామనుకుంటే, అసలు రాఫెల్ గెలవనే లేదు. ఎందుకు? ఏదో గెలిచిన ఈ సంతోషం?
అప్పుడు మళ్ళీ ఇలా అనిపించిందామెకు. అసలు లాటరీ గెలిచింది తనేనేమో అని .
బెంజ్ కారు టాపు దింపివేసి ఆ వెచ్చని గాలులలో – తన జుట్టూ, దుస్తులూ మెరుస్తూ ఎగురుతుండగా, మెల్లగా ఆ నక్షత్రాల వీధులలో మబ్బులను పరికిస్తూ, సంతోషంగా కారు ఇంటి దిక్కుగా నడుపుకుంటూ పోతున్న నిసికి; షెల్లీ కవి ‘ద క్లౌడ్’ కవితను అనుసరించి, ఎవ్వరెరుగని ఒక కవయిత్రి వ్రాసిన:
“ధవళాగ్ని గోళపు ధగధగల భామ!
మర్త్యులనియేరు ఆమెను చందమామ.
నడిరేయి గాలులు లాగికొని రాగ,
ఆమె మెరయుచూ నూగాడు
నా ఉలిపిరి పాన్పుల మీద.
కనరెవ్వరామె పాదాల గురుతులు,
వినగలరు! వేల్పులే! ఆ లాస్యాల ధ్వనులు.. “
కొన్ని పంక్తులు మనసులో మంద్రంగా వినిపించి, వళ్ళు ఝల్లుమంది.
*