నామాట: నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈమాటకి ఎనిమిదేళ్ళునిండాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ ఎనిమిది ఏళ్ళల్లో ఈమాట పరంగా ఎన్నో మంచి విశేషాలు జ్ఞప్తికొస్తున్నాయి. సుమారు, నూట యాభై పై చిలుకు తెలుగు రచయితలు ఈమాటకి తమ రచనలు అందించారు. వీరిలో చాలామంది సరికొత్త రచయితలు. మరికొద్దిమంది చెయ్యితిరిగిన రచయితలు. వీరందరికీ మా ధన్యవాదాలు.

కొత్త రచనలు చేసే సమయయం దొరకనివారు, మేము అడగంగానే మాకు వచ్చిన రచనలని సహృదయతతో సమీక్షించారు. సమీక్షకులకి రచయితలెవరో తెలియదు; అట్లాగే, రచయితలకి సమీక్షకులెవరో తెలియదు. మా అనుభవంలో, ఒకరో ఇద్దరో రచయితలు మినహా, అందరు రచయితలూ, చాలా ప్రఖ్యాతి చెందిన రచయితలతో సహా, సమీక్షకుల సలహాలు పాటించి తమ రచనలకి సవరణలు చేసారు. ఈ ప్రక్రియ, కథలకీ, కవితలకీ (అంటే creative fictional works, సృజనాత్మక కాల్పనిక సాహిత్యం అని నా భావం!) కూడా చక్కగా పనిచేసింది. ప్రచురణకి ముందుగా సమీక్షించడం, తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేయించడం, పాశ్యాత్య పత్రికలకి కొత్త విషయం కాదు. బహుశా, తెలుగు సాహిత్యంలో నూతన ప్రక్రియ అనవచ్చునేమో! ఇంతవరకూ మాకు సమీక్షలు, విమర్శలూ చేసిన వారందరికీ హృదయపూర్వక అభివందనలు. ఇక ముందుకూడా వీరి సహాయం మాకు ఉంటుందని అభిలాష.

మేము ప్రచురించిన కథలు, కవితలూ ఉన్నత స్థాయిలో ఉన్నాయనే మా భావన. లోపాలు లేకపోలేదు. ఒక పెద్ద లోపం: తెలుగు diaspora కథలు చాలా కొద్దిపాటే వచ్చాయి. ఇప్పటివరకూ కథల్లో అథిక భాగం nostalgia కథలే! ఇదేదో తప్పని, కూడని పని అని అనటల్లేదు. ఇక ముందు తెలుగు diaspora కథలు లేని కొరత తీరుతుందని ఆశిస్తున్నాం.

ఈమాట ప్రాచీన సాహిత్యాన్నీ, ఆథునిక సాహిత్యాన్నీ సమాన దృష్టితో చూడాలని మా కోరిక. మేము ప్రచురించిన వ్యాస పరంపర చూస్తే, ఈ విషయం దృఢపడుతుంది. మంచి ఆథునిక రచయిత, వన్నె కెక్కిన ప్రాచీన సాహిత్యాన్ని తనకు అనుగుణంగా మలచుకోగలడనేది నిర్వివాదాంశం. పాత సంచికలలో వ్యాసాలు పరీక్షగా చూస్తే, ఇక్కడి రచయితల్లో తార్కిక దృష్టి, విషయ పరిజ్ఞానం, అవగాహన ఎక్కడా ఏవొక్కరికీ తీసిపోదని చెప్పవచ్చు. ఇది మనకెంతో గర్వ కారణం.

ఎన్నో కొత్త పుస్తకాలు వస్తున్నాయి. కవితా సంకలనాలు, కథా సంకలనాలు, నవలలు, నవలికలూ వస్తున్నాయి. ఈమాట కి ఒక కొరత ఉంది. పుస్తక సమీక్షలు, అనుకున్నంత ఎక్కువగా చేయలేకపోవడం. ఈ సంవత్సరంలో విమర్శనాత్మకమైన పుస్తక సమీక్షలు చేయిద్దామనుకుంటున్నాం. రచయితలు, తమ పుస్తకాలు ఎక్కడికి పంపాలో, submissions@eemaata.com కి ఉత్తరం పంపిస్తే, ఆ వివరాలు అందచెయ్యగలం.

ఏ పత్రికకైనా పాఠకులు ప్రాణం. ఏ కొత్త అంశాలు పత్రికలో ఉంటే పత్రిక స్థాయి పెరుగుతుందో పాఠకులే చెప్పాలి. అభిప్రాయాల వేదిక శ్రుతిమించకుండా, చురుగ్గా వేడి వేడి wafers లా, పాఠకులే చెయ్యగలరు. విమర్శనాత్మక దృష్టితో, వ్యక్తిగత దూషణలు లేకుండా, సహృదయతతో, మీ అభిప్రాయాలు రాయండి.

మళ్ళీ మరోసారి, పాఠకులకి, రచయితలకి, సమీక్షకులకి, విమర్శకులకీ అభివాదాలు; నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సంపాదక వర్గం తరఫున,

వేలూరి వేంకటేశ్వర రావు