మనలో చాలామందికి (మరీ ఔరంగజేబుల్ని మినహాయిస్తే) ఏదో ఒకరకం సంగీతమంటే అభిమానం ఉంటుంది. వీరిలో కూనిరాగాలు తీసేవారూ, ఇంకాస్త గట్టిగా పాడదామని ప్రయత్నించేవారూ కూడా ఉంటారు. ఏవో కారణాలవల్ల చిన్నతనంలో సంగీతం నేర్చుకోలేదనో, సరిగ్గా నేర్చుకోలేదనో బాధపడేవారుంటారు. నేర్పించే సంగీతమంతా శాస్త్రీయమే. అందుచేత తదరిన్నన్నా అంటూ పాడడమంటే కొందరికి తలనొప్పిగానో, వెక్కిరింపుగానో, ‘అరవ’ పద్ధతిగానో అనిపిస్తుంది. వాటితో పోలిస్తే సినిమా పాటలే ‘హాయిగా’ అనిపిస్తాయి. చిక్కేమిటంటే ఇటువంటి తేలిక సంగీతం నేర్పేవారెవరూ మనకు తగలరు. పైగా సినిమాల్లో ‘డబ్బా’ పాటలు పాడే గాయనీ గాయకులు కూడా ఔత్సాహికులకి ‘శాస్త్రీయసంగీతం నేర్చుకోండి’ అని ఉచిత సలహాలిస్తూ ఉంటే వారికి కాస్త కోపం కూడా రావచ్చు. మనకి నచ్చే పాటలకీ, వ్యాకరణ భూయిష్ఠం అనిపించే శాస్త్రీయసంగీతానికీ మధ్య పూడ్చలేని అగాధం ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యకి సమాధానమిచ్చే ప్రయత్నమే ఈ వ్యాసం. ఈ విషయం గురించి నేను “శ్రుతిమించిన రాగం”, “మన శాస్త్రీయ సంగీతం”, “రాగాలూ – స్వరాలూ” అన్న ఈమాట వ్యాసాల్లో కొంత రాశాను కూడా. అలాగే , మోహనం, అభేరి, సింధు భైరవి, కళ్యాణి, హిందోళం, చక్రవాకం రాగాలను గురించి పరిచయం చేస్తూ డా. లక్ష్మన్న కూడా కొన్ని వ్యాసాలు రాశారు.
సంగీతమంటే కనీసం ప్రాథమిక స్థాయిలో ‘బ్రహ్మవిద్య’ కాదని నా ఉద్దేశం. తమకి సంగీతం చచ్చినా రాదని నిర్ణయించేసుకున్న చాలామందికి తమది కేవలం ఒక ‘మానసిక అవరోధం’ (మెంటల్ బ్లాక్) అనిపించకపోవచ్చు. ప్రతీవారూ సంగీతంలోకి దిగనవసరం లేదని నేనూ ఒప్పుకుంటాను కాని ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవటానికి ‘సరస్వతీ కటాక్షం’ ఏదీ అక్కర్లేదు. సంగీతాన్ని కొంతవరకూ డీ మిస్టిఫై చెయ్యాలని నా ఉద్దేశం. వ్యక్తిగతంగా నన్ను అనేకమంది మిత్రులు అడిగిన ప్రశ్నలకి కూడా ఇందులో కొన్ని జవాబులు లభిస్తాయి. ఇందులో కొన్ని విషయాలు కొందరికి తెలిసినవే అయుంటాయి కాని తెలియనివారి కోసమని కొన్ని ప్రాథమిక విషయాలు రాయక తప్పలేదు. (ఈ గొడవ గురించి పట్టనివాళ్ళు ఈ వ్యాసం చదవడం మానేసి ముందుకు సాగవచ్చు.)
చేతకాకుండా సంగీతంతో కుస్తీ పట్టే వారి గురించి అపహాస్యం చెయ్యడం మామూలే. మిస్సమ్మలో నాగేశ్వరరావు వంటివారు హాస్యపాత్రలుగా గుర్తుంటారు. సంగీతం మొదలుపెట్టే ‘లార్వా’లన్నీ సీతాకోకచిలకలు కాకపోవచ్చు గాని మొండిగా తమ కళాప్రదర్శన చేసేవారి గురించి శ్రీశ్రీ ఇలా రాశారు.
మేం గొప్పవాళ్ళమంటూ
సంగీతం తీయునట్టి చవటలనెల్లన్
బంగీ కట్టి పయోరా
శిం గూలగ ద్రోయవలదె సిరిసిరిమువ్వా
ఈ అవహేళన భయం వల్లనే చాలామంది సంగీతం జోలికి పోకుండా ఉండిపోతారు. అయినా ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకూ పరవాలేదని నా ఉద్దేశం. నేర్చుకోవాలనే ఆసక్తితో బాటు దీనికి కావలసినవల్లా ఒక చిన్న కీబోర్డూ (లేదా హార్మోనియం), బోలెడు ఓపికా మాత్రమే. సంగీతం నేర్చుకోవడానికి అనేక వాయిద్యాలు ఉపకరిస్తాయి కాని కీబోర్స్డ్ ఉంటే టైప్‌రైటర్ ఉన్నట్టే. అక్షరాలు రాయడం రాకపోయినా చదివి గుర్తుపట్టగలిగితే చాలు; ఎవరైనా సరే ‘ముత్యాలకోవ’ లాంటి అక్షరాలు టైప్ చెయ్యగలుగుతారు. అదే పద్ధతిలో మెట్లు ఎటువంటివో తెలిస్తే ఎవరైనా వాటిని నొక్కి స్వరాలను తప్పుల్లేకుండా పలికించవచ్చు. ముందుగా కీబోర్డ్ ఎలా ఉంటుందో బొమ్మలో చూద్దాం.
కీబోర్డ్ మెట్లలో నల్లవీ, తెల్లవీ ఒక పద్ధతిలో అమరి ఉంటాయని చూడగానే తెలుస్తుంది. వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క స్వరాన్ని పలుకుతుంది. కీబోర్డ్ మెట్లు ఎక్కడినుంచయినా సరే మొదలుపెట్టి, నల్లవీ, తెల్లవీ అన్నీ కలిపి వరసగా లెక్కపెడితే 12 కనబడతాయి. పదమూడోది మళ్ళీ మొదటిదాన్ని పోలిన స్థానంలోనే కనబడుతుంది. వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క శ్రుతి. వీటిని బొమ్మలో చూపినట్టుగా పాశ్చాత్య సంగీతంలో సి, సి షార్ప్, డి మొదలైనవిగా వ్యవహరిస్తారు. వాటిని కర్ణాటక పద్ధతిలో ఒకటి, ఒకటిన్నర వగైరాలుగా సూచిస్తారు. మూడున్నర శ్రుతి అనేది ఉండదని బొమ్మనుబట్టి తెలుస్తుంది. అలాగే మనవాళ్ళు ఏడు శ్రుతిని (శోకాన్ని సూచిస్తుందనే భయంతోనో ఏమో) ‘అర’ అంటారు. హిందూస్తానీలో తెల్లవాటిని సఫేద్ ఏక్ దో అనీ, నల్లవాటిని కాలీ ఏక్, దో అనీ చెపుతారు. ఈ మూడు పద్ధతులూ ఒకటే. ఈ శ్రుతుల ఫ్రీక్వెన్సీలు (సెకండుకు శబ్ద కంపనాల సంఖ్య) నిర్దుష్టంగా ఉంటాయి. బ్రిటిష్ పద్ధతిలో మిడ్‌ల్ సి సెకండుకు 256 కంపనాలు కలిగి ఉంటుంది. మగవారి కంఠం సామాన్యంగా 1, 2 ఆధార శ్రుతులకు సరిపోతుంది. స్త్రీలకూ, పిల్లలకూ 5, 6, ఆరున్నర సరిపోతుంది.
ఆధార శ్రుతి అంటే షడ్జమం, లేక స. మనం ఎంచుకునే దాకా దీనికి ప్రత్యేకంగా ఫ్రీక్వెన్సీ ఉండదుకనక ఇదొక ఫ్లోటింగ్‌పాయింట్ అనుకోవచ్చు. ఒక షడ్జమాన్ని (శ్రుతిని) నిర్ణయించుకున్నాక దాని ప్రకారం తక్కిన రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, ధైవతం, నిషాదం అన్నీ పలుకుతాయి. ఆధార శ్రుతిని బట్టి వీటిలో ప్రతిదానికీ ఖచ్చితమైన స్వరస్థానం ఏర్పడుతుంది. అవి సరిగ్గా పలకనప్పుడు అపస్వరం అంటాం. మామూలుగా సప్తస్వరాలనేవి నిజానికి 12 స్వరాలు. దీన్ని పాశ్చాత్య పద్ధతిలో డయటోనిక్, లేదా క్రోమాటిక్ స్కేల్ అంటారు. మన పద్ధతిలో చెప్పాలంటే స, ప తప్ప తక్కిన అయిదు (రి, గ, ద, ని) స్వరాలూ రెండేసి ఉంటాయి; అంటే మొత్తం 12. స నుంచి రి గ మ అంటూ ‘పైకి’ వెళుతున్న కొద్దీ స్వరాల ఫ్రీక్వెన్సీ క్రమంగా పెరుగుతూ పోతుంది. అందుకే ‘కింది’ స్వరాలు బొంగురుగానూ, పైవి కీచుగానూ అనిపిస్తాయి. స, రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ద1, ద2, ని1, ని2 అని ముగించాక మళ్ళీ తారస్థాయిలో స వస్తుంది. ఇంకా పైకి వెళితే వుళ్ళీ రి1, రి2, గ1, వగైరాలన్నీ వస్తాయి. అలాగే మనం మొదలెట్టిన స నుంచి ‘కిందికి’ వెళితే మంద్రస్థాయిలో క్రమంగా ని2, ని1, ద2 మొదలైనవి పలుకుతాయి. ఇది పాడినప్పుడూ, వాయించినప్పుడూ కూడా జరిగే విషయం. వీటిలో 1 సంఖ్య ఉన్న స్వరాలను ‘కోమల’ స్వరాలుగానూ, 2 ఉన్నవాటిని ‘తీవ్ర’ స్వరాలుగానూ హిందూస్తానీ పద్ధతిలో అభివర్ణిస్తారు. ప్రస్తుత వ్యాసానికి ఈ వర్ణన సరిపోతుంది. వేలకొద్దీ రాగాలూ, లక్షలాది పాటలూ అన్నీ ఈ 12 స్వరాలతోనే రూపొందినటువంటివి. సంగీతపు భాషకు అక్షరాలు ఇవే.
ఒక షడ్జమం (స) నుంచి మరొక షడ్జమం (స) దాకా ఉన్న వ్యవధిని ఆక్టేవ్ అంటారు. పై బొమ్మలో రెండు ఆక్టేవ్‌లు ఉన్నాయి. ఇవి ఎన్నైనా ఉండవచ్చు. దీనికి అంతూ పొంతూ ఉండదు. ఎటొచ్చీ ఫ్రీక్వెన్సీ 20 కంపనాలకంటే తగ్గినా, 20 వేల కంపనాలకంటే ఎక్కువైనా మనకు శబ్దాలు వినబడవు. 8 ఆక్టేవ్ లుండే గ్రాండ్ పియానో వాయించి చూస్తే ఈ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో మరికొంత ఫిజిక్స్ ఉంది. ఒక షడ్జమానికీ దాని “పై” షడ్జమానికీ ఫ్రీక్వెన్సీ సరిగ్గా రెండింతలుంటుంది. అలాగే మంద్రస్థాయి షడ్జమపు ఫ్రీక్వెన్సీ సరిగ్గా సగం ఉంటుంది. ముఖ్యమైన సంగతేమిటంటే సరసనున్న ఏ రెండు స్వరాల ఫ్రీక్వెన్సీల మధ్యయినా ఒకే నిష్పత్తి (r) ఉంటుంది. ఉదాహరణకు ఒక స ఫ్రీక్వెన్సీ f అనుకుంటే రి1, రి2, గ1, గ2, మ1 స్వరాల ఫ్రీక్వెన్సీలు వరసగా fr, fr2, fr3, fr4, fr5 అవుతాయన్నమాట. తారస్థాయి స ఫ్రీక్వెన్సీ fr12 = 2f కనక r = 2(1/12) అవుతుంది. దీనర్థం ఏమిటంటే పక్క పక్క స్వరాలు ఏ రెండు తీసుకున్నప్పటికీ వాటి ఫ్రీక్వెన్సీలు ఒకే నిష్పత్తిలో (సుమారుగా 2(1/12) = 1.059) ఉంటాయి. అందువల్ల ఏ స్వరాన్ని ఆధార శ్రుతి చేసుకున్నప్పటికీ తక్కిన స్వరాల క్రమం మారకుండా ఉంటుంది. ఉదాహరణకు మనం సి మెట్టును స అనుకుంటే సి షార్ప్ అనేది మొదటి (కోమల) రిషభం అవుతుంది. అలాగే సి షార్ప్ మెట్టును స అనుకుంటే డి అనేది కోమల రిషభం అవుతుంది. అందువల్ల కీబోర్డ్ మీద ఏ మెట్టును ఆధార శ్రుతి (స) చేసుకున్నప్పటికీ దాని పక్కనున్న స్వరాలన్నీ వరసగా రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ద1, ద2, ని1, ని2 అనే క్రమంలోనే వినిపిస్తాయి. పాడుతున్నవారి వీలును బట్టి ఆధారశ్రుతి ఉంటుంది కనక ఈ ఏర్పాటును గురించి మనకు తెలియాలి.
ఇక థియరీ మానేసి ప్రాక్టికల్స్‌కి వద్దాం. సంగీతం గురించి తెలుసుకోదలుచుకున్నవారు పాడి తీరాలి. తమ గొంతు కర్ణకఠోరంగా ఉందనిపిస్తే (లేక ఎవరైనా అంటే) తలుపులు మూసుకునయినా పాడుకోవాలి. పుట్టు చెవుడు ఉన్నవారు మూగవారయినట్టే పాడుతున్నప్పుడు తమ గొంతును విని తప్పులు సరిదిద్దుకోవడం (ఫీడ్‌బాక్) అతిముఖ్యమైన విషయం. అందుకే వాద్యసంగీతం నేర్చుకుంటున్నప్పుడు కూడా గాత్రం తప్పనిసరి. కీబోర్స్డ్ మీద పియానో వంటిది కాకుండా పైప్‌ఆర్గన్ వంటిది మోగిస్తే మెట్టు నొక్కినంతసేపూ మోగుతూ ఉంటుంది. అది ఎంచుకుని 3 లేక 4 శ్రుతిని మోగించి దానితో గొంతు కలపాలి. (ఇది ఏ ఆక్టేవ్‌దైనా పరవాలేదు కాని కీబోర్డ్ మధ్యలోని మెట్టును ఉపయోగిస్తే మంచిది) అది సరిగ్గా ఉంటే ఆ పక్కనున్న స్వరాలను మోగించి వాటికి అనుగుణంగా గొంతు కలపాలి. ఒకవంక పాడుతూ, మరొకవంక మోగుతున్న స్వరం వింటూ రెండూ సరిపోతున్నాయో లేదో గమనిస్తూ ఉండాలి. తప్పుపోయినా కంగారు పడకుండా, అధైర్యపడకుండా కొన్నాళ్ళపాటు అలవాటు చేసుకోవాలి. మన గొంతులో పలుకుతున్నది మనం గుర్తించగలిగితే ఏ పాట విన్నా తెలుసుకోవడం వీలవుతుంది. తప్పు పలుకుతోందేమోనని అనుమానం వస్తే తెలిసిన వారిని విని చెప్పమని కోరాలి. ఒళ్ళు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నట్టే బిడియపడకుండా ముందుకు సాగాలి. పాడకుండా కేవలం వినడం ద్వారా కూడా సంగీతాన్ని అర్థం చేసుకోవచ్చు కాని దానికి ఎక్కువకాలం పడుతుంది. గాత్ర విద్వాంసులం అనే భావన లేకుండా నెమ్మదిగా పాడుకుంటూ నేర్చుకుంటే సంగీతం సులువుగా పట్టుబడుతుంది.
ఏ ఒక్క రాగం తీసుకున్నా వాటిలో మొత్తం 12 స్వరాల్లో కొన్నే పలుకుతాయి. ఒక్కొక్క రాగానికీ ప్రత్యేకమైన “రంగూ, రుచీ, వాసనా” కలగడానికి కారణం అదే. సరిగమపదని స్వరాలన్నీ పలికే రాగాలని సంపూర్ణ రాగాలంటారు. వీటిలో రిగమదని రెండేసి ఉండే అవకాశం ఉంది కనక 32 కాంబినేషన్లు సాధ్యం అవుతాయి. ఉదాహరణకి అన్నీ కోమల స్వరాలయితే హనుమతోడి రాగం వస్తుంది. అన్నీ తీవ్ర స్వరాలయితే కల్యాణి అవుతుంది. కీబోర్డ్ మీద మీకు అనువైన శ్రుతిని స అనుకుని తక్కిన మెట్ల మీద వరసగా రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ద1, ద2, ని1, ని2 అనే స్టికర్లు అతికించుకోండి. ప్రయత్నిస్తున్నది పిల్లలూ, స్త్రీలూ అయితే అయిదున్నర (జి షార్ప్ లేదా ఆరు (ఏ) మెట్టును షడ్జమంగా తీసుకోవచ్చు. మగవారికి ఒకటి (సి) సరిపోతుంది. అందరూ ఒకే కీబోర్డ్ వాడుతున్నప్పుడు కలర్ కోడ్ ఉపయోగించి రెండు రకాల స్టికర్లు వాడుకోవాలి. ఇది ఎందుకు చెప్పాలంటే పాడేవారికి ఆధారశ్రుతి మరీ ఎక్కువా తక్కువా అయితే అపస్వరాలు పలికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
12 స్వరాలలో సరిగమదని అన్నీ ఉపయోగపడే రాగాలలో ముందుగా కల్యాణి రాగం (స, రి2, గ2, మ2, ప, ద2, ని2) తీసుకోవచ్చు. దీన్ని హిందూస్తానీలో యమన్ అంటారు. ఇందులో అప్పుడప్పుడూ మ1 ఉపయోగిస్తే అది యమన్ కల్యాణ్ అవుతుంది. కల్యాణి స్వరాలని ఒకదాని వెంట ఒకటి నొక్కుతూ నెమ్మదిగా ప్రతిస్వరానికీ గొంతు కలిపి పాడండి. కల్యాణి రాగంలో బోలెడు సినిమా పాటలున్నాయి. భానుమతి పాడిన మెల్ల మెల్లగా, మనసున మల్లెల, రారా నాసామి రారా, సావిరహే తవదీనా; ఘంటసాల పాడిన కుడి ఎడమైతే, జగమే మారినది, మది శారదాదేవి, చల్లని వెన్నెలలో మొదలైనవన్నీ గుర్తు చేసుకుంటూ వాటిని పోలిన స్వరాలు మీకు పలుకుతున్నాయేమో జాగ్రత్తగా వినండి. రాగం నీలం రంగు వంటిదైతే అందులోని పాట నీలం రంగు వస్తువు వంటిదని గుర్తుంచుకోండి. కల్యాణి స్వరాలు వాయిస్తున్నప్పుడు తక్కిన మెట్లు చేతికి తగలకుండా చూసుకోండి. ఒక్కొక్క రాగాన్నీ బాగా అర్థమయేదాకా వారాల తరబడి పలికిస్తూ ఉండాలి. ప్రాథమిక స్థాయిలో రాగమంటే స్వరాలే అని భావించాలి.
ఇది బాగా అలవాటయాక కల్యాణి స్వరాలలో తక్కినవన్నీ అలాగే పాడుతూ మ2 స్థానంలో మ1 పాడండి; అది శంకరాభరణం అవుతుంది. దాంతో మీరు వెంటనే శంకరశాస్త్రి అవతారం ఎత్తకపోయినా సుశీల పాడిన ఏమండోయ్ శ్రీవారూ పాట గుర్తుకు తెచ్చుకోండి. అది కూడా శంకరాభరణమే. అలాగే మోహన రాగంలో స్వరాలు స, రి2, గ2, ప, ద2, స. కల్యాణి, లేదా శంకరాభరణంలో మ, ని తీసేస్తే ఇది వస్తుందని మీకు వాయించి పాడుతున్నప్పుడు తెలుస్తుంది. పాత లతా పాట సయొనారా గుర్తుకు తెచ్చుకోండి. తారస్థాయి షడ్జమంతో మొదలుపెడుతూ స స సా సా, ద ప గా గా, దా దాద దాదా పగ రీరీ, సా సరి గప గప దస దాదా (పై స్థాయిలో) గా గగ గారిస రిస దాదా అని వాయించి చూడండి. మోహనలో పడకూడని కోమల స్వరాలు పడితే ట్యూన్ పాడవుతుందని గమనించండి. మోహన అలవాటయాక అందులో ద2 తీసేసి ని2 వాయిస్తే హంసధ్వని అవుతుందని తెలుస్తుంది. వాతాపి గణపతిం, శ్రీరఘురాం అనే సినిమా పాటా హంసధ్వని రాగమే.
ప్రతి రాగంలోనూ ప్రతి స్వరమూ ఉండాలని లేదు. ఆరోహణలో ఉన్న స్వరాలే అవరోహణలో ఉండాలని కాని, అదే క్రమంలో పలకాలనిగాని లేదు. అందుకనే అనేక కాంబినేషన్లలో వేలకొద్దీ రాగాలున్నాయి. డా. బాలమురళీకృష్ణ స మ1 ప (మూడే మూడు) స్వరాలతో సర్వశ్రీ అనే స్వంత రాగాన్ని సృష్టించి అద్భుతంగా కీర్తన (స్వరకల్పన చేసి మరీ) పాడారు. కింద కొన్ని రాగాల ఆరోహణ, అవరోహణలూ, వాటిలోని కొన్ని పాత తెలుగు సినిమా పాటలూ ఉన్నాయి. ఒక్కొక్క రాగంలోని స్వరాలనూ కీబోర్డ్ మీద పలికిస్తూ, కూడా పాడుకుంటూ, పాటను గుర్తుచేసుకుంటూ ఒక్కొక్క రాగంలోనూ ఎటువంటి మూడ్ పలుకుతోందో గమనించండి. సామాన్యంగా కోమల స్వరాలుండే రాగాలు కోమలత్వాన్నీ, విషాదాన్నీ వ్యక్తం చేస్తాయని అనిపిస్తుంది. కొన్ని రంగులూ, వాసనలూ కొన్నిరకాల భావాలను ప్రేరేపించినట్టే కొన్ని రాగాలు కొన్ని మూడ్స్‌కు దారితీస్తాయని తెలుస్తుంది.
వినడం, విన్నదాన్ని గుర్తుపెట్టుకుని ఆకళించుకోవడం సంగీతానికి చాలా అవసరం. ఇవన్నీ మనం ఇతర సందర్భాల్లో ఒత్తిడి లేకుండా చేస్తూ ఉన్న పనులే. ఎటొచ్చీ సంగీతం అనగానే ఏదో భయం ఆవహిస్తుంది. అటువంటి అపోహలేవీ లేకుండా సంగీతం వింటే అది తేలికేనని అర్థమౌతుంది. ఇందులో రాసినవన్నీ ఎన్నో వారాల, నెలల పాటు నెమ్మదిగా అభ్యాసం చెయ్యవలసిన విషయాలు. కుటుంబంలో భార్యాభర్తలూ, పిల్లలూ అందరూ ఆసక్తితో కలిసి కూర్చుని అభ్యాసం చేస్తే సరదాగా డిస్కవరీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.
కల్యాణి, శంకరాభరణం సంగతి పైన చూశాం. మరికొన్ని చూద్దాం. ఇక్కడ గుర్తుంచుకోవలసినదేమిటంటే స్వరాలూ, సినిమా పాటలూ రాగాల స్వరూపంలో కొంత భాగాన్నే తెలియజేస్తాయి. ఎవరినైనా గుర్తుపట్టడానికి సన్నగానో, లావుగానో, పొట్టిగానో, పొడుగుగానో ఉంటాడని స్థూలంగా వర్ణించినట్టే ఈ కింది లక్షణాలు రాగాన్ని గుర్తించడానికి తోడ్పడతాయి. కాని దీన్ని మించిన అంశాలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తిని అర్థం చేసుకున్నట్టే రాగాన్ని గురించి తెలుసుకోవడానికి ఎంతో అధ్యయనం అవసరం. రాగలక్షణాల్లో స్వరాల మధ్యనుండే సంబంధమూ, వెయ్యవలసిన, వెయ్యగూడని గమకాలూ వగైరాలెన్నో ఉంటాయి. సినిమా పాటలన్నిటిలోనూ వీటన్నిటినీ వ్యక్తం చెయ్యాలన్న నిబంధన ఏమీ ఉండదు కనక కొన్ని పాటలకు కొన్ని రాగాలు ఆధారం అని మాత్రమే చెప్పవచ్చు. మిగతావన్నీ వినికిడి మీద క్రమంగా తెలుస్తాయి.
- మాయామాళవగౌళ దీన్ని హిందూస్తానీలో భైరవ్ అంటారు. ఇందులో పడే స్వరాలు స, రి1, గ2, మ1, ప, ద1, ని2. మనవాళ్ళు సరళీస్వరాలు నేర్చుకునే రాగం. బైజూ బావ్‌రాలో మొహే భూల్ గయే సావరియా ఇదే రాగం.
- చక్రవాకం దీన్ని హిందూస్తానీలో అహీర్ భైరవ్ అంటారు. ఇందులో పడేవి స, రి1, గ2, మ1, ప, ద2, ని1. దీన్ని మాయామాళవగౌళతో పోల్చిచూడండి. ఈ రాగంలో ఏడుకొండలవాడ, రాధకు నీవేరా ప్రాణం, మన్నాడే పాడిన పూఛోనకైసే మొదలైన పాటలున్నాయి.
- చారుకేశి ఇందులో పడే స్వరాలు స, రి2, గ2, మ1, ప, ద1, ని1. ఇందులో భళిభళి దేవా, ఈ పగలు రేయిగా వగైరా పాటలున్నాయి.
- కీరవాణి ఇందులోని స్వరాలు స, రి2, గ1, మ1, ప, ద1, ని2. పూజాఫలంలో అందేనా ఈ చేతుల, నాగిన్‌లో మేరా దిల్‌యే పుకారే మొదలైనవి ఈ రాగమే.
- షణ్ముఖప్రియ ఇందులోని స్వరాలు స, రి2, గ1, మ2, ప, ద1, ని1. సంతానంలో దేవీ శ్రీదేవీ, సాగరసంగమంలో తకిట తధిమి పాటలు ఇదే రాగం.
- ఖరహరప్రియ ఇందులోని స్వరాలు స, రి2, గ1, మ1, ప, ద2, ని1. దేవదాసులో ఇంత తెలిసియుండి పల్లవీ, మిస్సమ్మలో బాలనురా మదనా ఈ రాగంలో పాటలే.
ఈ రాగాలన్నీ సంపూర్ణ రాగాలే. ఒక్కొక్క స్వరం మార్చినప్పుడు భావం ఎలా మారుతోందో గమనించండి. ఇప్పుడు తక్కువ స్వరాలున్న కొన్ని రాగాలు చూద్దాం.
- ఆభేరి దీన్ని హిందూస్తానీలో భీంపలాస్ అంటారు. ఇందులో పడే స్వరాలు స, గ1, మ1, ప, ని1. అవరోహణ స ని1 ద2 ప మ1 గ1 రి2; అంటే సరిగ్గా ఖరహరప్రియలాగే. ఆరోహణలో మటుకు రి, ద ఉండవు కనక మూడ్ తేడాగా అనిపిస్తుంది. ఈ రాగంలో లెక్కలేనన్ని ఉదాహరణల్లో నీలిమేఘాలలో, నీలీల పాడెదదేవా, నీలాల ఓమేఘమాలా, నీవేనా నను తలచినది వగైరాలున్నాయి.
- బాగేశ్రీ ఇది వాగీశ్వరి అనే పేరుకు ప్రత్యామ్నాయం; మనవాళ్ళు భాగేశ్రీ అని తప్పుగా పలుకుతారు. ఈ హిందూస్తానీ రాగంలో స్వరాలు స, గ1, మ1, ద2, ని1, స స, ని1, ద2, మ1, ప, ద2, మ1, గ1,రి2, స. ఇవన్నీ ఆభేరిలో పడే స్వరాలే అయినప్పటికీ క్రమంలో మార్పు ఉండడంవల్ల అద్భుతమైన మరొక భావం కలుగుతుంది. నీ కోసమె నే జీవించునది, రారా కనరారా, అలిగితివా మొదలైన పాటలు జనాదరణపొందాయి. హిందీలో జాగ్ దర్దే ఇష్క్ జాగ్ మరొక మంచి పాట. లతా పాడిన నా బోలే పాటను అనుకరిస్తూ రావోయి మాధవా అని భానుమతి పాడింది.
- తిలక్ కామోద్ ఈ హిందూస్తానీ రాగంలో స్వరాలు స, రి2, మ1, ప, స స, ని2, ప, ద2, మ1, గ2, స, రి2, గ2, స. ఇందులో గుండమ్మకథలోని అలిగిన వేళనె, జగదేకవీరుని కథలోని ఓ చెలీ ఓహో సఖీ మొదలైన పాటలు విని కొందరు దేశ్ అని పొరబడతారు. ఈ పాటల్లో ని1 వినబడడమే అందుకు కారణం. తిలక్ కామోద్‌లో ని1 అరుదుగా మాత్రమే ఉపయోగిస్తారు. దేశ్‌లో నాకు తెలిసినంతవరకూ ఎక్కువ తెలుగు సినిమా పాటలున్నట్టు లేవు. భక్తజయదేవ సినిమాలో ఘంటసాల పాడిన దశావతారాల రాగమాలిక ప్రళయపయోధిజలే అన్నపాటలో వసతి దశన శిఖరే అన్న చరణం మాత్రం దేశ్ రాగమే. హిందీలో కల్పనా చిత్రంలో ఆశా పాడిన బేకసీ హద్‌సే జబ్ గుజర్ జాయే, రఫీ, ఆశా మైఁ సుహాగన్ హూఁ లో పాడిన గోరీ తోరే నైన్ దేశ్ రాగానికి ఉదాహరణలు. తిలక్ కామోద్‌లో ప స అనే ప్రయోగం ఉంటుంది; అది దేశ్‌లో నిషిద్ధం. హిందూస్తానీ సంగీతంలో దీనికీ తిలక్‌కామోద్‌కూ తేడాలు స్పష్టంగా చూపుతారు. తెలుగు సినిమా పాటల్లో శ్రోతలు పొరబడుతున్నారంటే అది సంగీతదర్శకుల తప్పే. ఈ రెండు రాగాలకూ ఎటువంటి లక్షణాలుంటాయో వారికే సరిగ్గా తెలియదు.
- ఖమాస్ ఈ రాగంలోని స్వరాలు స, మ1, గ2, మ1, ని1,ద2, ప, ద2, ని2, స స, ని1, ద2, ప, మ1, గ2, రి2, స. తెలుగు సినిమా పాటల్లో ఎందుకే నీకింత తొందర, నను విడనాడకురా, పాడమనినన్నడుగతగునా మొదలైనవి ఉన్నాయి. శంకరాభరణంలో వాసుదేవాచార్య కీర్తన బ్రోచేవారెవరురా పాడారు. ఇందులో రెండు నిషాదాలుంటాయి.
- బేహాగ్ ఈ రాగంలోని స్వరాలు స, గ2, మ1, ప, ని2, స స, ని1, ద2, ప, మ2, గ2, మ1, గ2, రి2, స. ఇందులో రెండు మధ్యమాలుంటాయి. భక్త ప్రహ్లాదలో బాలమురళి పాడిన వరమొసగే వనమాలీ ఇదే రాగం. హిందీలో ముకేశ్ పాడిన బన్‌కే చకోరీ గోరీ, లతా పాడిన తేరే సుర్ ఔర్ మేరే గీత్ మొదలైన ఉదాహరణలున్నాయి.
మోహన, హంసధ్వని లాంటి అయిదు స్వరాల రాగాలు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
- హిందోళం హిందూస్తానీలో మాల్‌కౌఁస్ అనబడే ఈ రాగంలో స, గ1, మ1, ద1, ని1 స్వరాలుంటాయి. ఇందులో పగలే వెన్నెలా, మనసే అందాల బృందావనం, కలనైనా నీ వలపే మొదలైన పాటలున్నాయి.
- శుద్ధసావేరి ఇందులోని స్వరాలు స, రి2, మ1, ప, ద2. ఇందులో పాడనా తెలుగు పాట, కోలు కోలోయన్న మొదలైన పాటలున్నాయి.
- హంసానంది దీన్ని హిందూస్తానీలో రమారమి సోహనీ అంటారు. ఇందులోని స్వరాలు స, గ2, మ2, ద2, ని2, స స, ని2, ద2, మ2, గ2, రి1, స. హాయిహాయిగా ఆమని సాగేలో మొదటి చరణం, నీలాల ఓ మేఘమాలా పాటలో చివరి చరణం ఈ రాగమే. హిందోళంలాగే ఇందులోనూ పంచమం ఉండదు.
- వలజి దీన్ని హిందూస్తానీలో కలావతీ అంటారు. ఇందులోని స్వరాలు స, గ2, ప, ద2, ని1. ఇందులో రిషభం వాడకూడదుగాని దాదాపు ప్రతి సినిమా పాటలోనూ వాడారు. తెలుగులో వసంత గాలికి, వెన్నెల రేయి అనే యుగళగీతాలూ, హిందీలో రఫీ పాడిన కోయీసాగర్ ఆశా పాడిన కాహే తర్‌సాయే జియరా ఉదాహరణలు.
- రాగేశ్రీ ఈ హిందూస్తానీ రాగంలోని స్వరాలు స, గ2, మ1, ద2, ని1, స స, ని1, ద2, మ1, గ2, మ1, రి2, స. అనా్ననా భామిని, ఇది నా చెలి ఈ రాగానికి ఉదాహరణలు.
- అమృతవర్షిణి ఇందులోని స్వరాలు స, గ2, మ2, ప, ని1, స. కల్యాణిలో రి2, ద2 తీసేస్తే ఈ రాగం తయారౌతుంది. ఆనతినీయరా అనే పాట ఈ రాగానికి ఉదాహరణ.
మన సంగీతంలోని రాగాలనన్నిటిని గురించీ ఈ ఒక్క వ్యాసం ద్వారా తెలుసుకోవడం అసాధ్యం. ఇందులో చెప్పదలుచుకున్నది ఒకటే; ఒక ఆధారశ్రుతి మూలంగా, ఉన్న పన్నెండింటిలో వివిధ స్వరాల కలయిక ఎటువంటి రాగభావాన్ని కలిగిస్తుందో కీబోర్స్డ్ సహాయంతో ఎవరైనా సరే అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు ఎన్ని పాటలు ఎన్నిసార్లు విన్నప్పటికీ స్వయంగా ఎవరికి వారే ఈ స్వరాలను మోగించి చూసుకోవడం, ఆ శబ్దాల ప్రభావం ఎటువంటిదో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ప్రత్యేక విషయంగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇదొక పరిమితమైన ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే కేవలం స్వరాలు పలికించినంత మాత్రాన రాగాల అందాలన్నీ బైటపడటంలేదని మీకు త్వరలోనే తెలిసిపోతుంది. మన సంగీతంలో గమకాలు చాలా ముఖ్యం. కాని మొదటి దశలో స్వరాలను గుర్తించి రాగాలను పోల్చడానికి ప్రయత్నించడమే మంచి పద్ధతి.
పాట రాని వారికి సామాన్యంగా కీబోర్స్డ్ కూడా కొత్తే గనక కాస్త తడుముకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ స్వరాలను పలకడం, ప్రతి స్వరాన్నీ ఆధారశ్రుతితో సరిపోల్చుకుంటూ ఉండడం మొదలైనవన్నీ తప్పనిసరిగా జరిగే విషయాలు. నిస్పృహ చెందకుండా, అదేదో పనిష్మెంట్ అనుకోకుండా పట్టుదలతో కృషి చేస్తే సంగీతపు ‘రహస్యాలన్నీ’ త్వరలోనే తెలిసిపోతాయి. పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నప్పుడు వారు నేర్చుకుంటున్న ‘కృత్రిమ’ సంగీతానికీ, వారికి తెలిసిన మామూలు పాటలకూ ఉన్న సంబంధం వారికి గనక అర్థమైతే సంగీతం చాలా సులువుగా బోధపడుతుంది. అవి రెండూ వేరువేరని భావించి విడి కంపార్ట్‌మెంట్లలో ఉంచుతారు కనక సంగీత శిక్షణ కాస్తా సంగీత శిక్ష అయి ఊరుకుంటుంది. దీనికి బాధ్యులు నేర్పేవారే.
సంగీతానికి అవసరమైన మరొక శక్తి స్వరజ్ఞానం. మనకు తెలియకపోయినా మనం మాట్లాడే మాటలకు స్పెల్లింగ్ ఉన్నట్టే ప్రతి ట్యూన్‌కూ, పాటకీ స్వరాలుంటాయి. విన్న పాటకు స్వరాలు చెప్పగలగడం సంగీతకారులకు చాలా అవసరం. సంగీతం నేర్పేవారిలో చాలామందికి కనీసపు స్వరజ్ఞానం లేదని నేను గుర్తించాను. తాము నేర్చుకున్నది చిలకపలుకుల్లా వప్పగించడం తప్ప ఏది విన్నా దానికి స్వరం చెప్పగలగడం టీచర్లలో అందరికీ చేతకాదు. స్వరజ్ఞానం అలవరచుకోవడం అసాధ్యం కాదు. ప్రతి సరళీ స్వరాల వరసనీ, ‘అలంకారాన్నీ’, పాటనూ సాహిత్యంతో మాత్రమే కాకుండా ఆ వెంటనే స్వరాలతోనూ, మరొకసారి “అ” కారంతోనూ పాడుకుంటూ ఉంటే త్వరలోనే స్వరజ్ఞానం వస్తుంది.
మనం విన్నది ఎటువంటి సంగీతమైనా సరే, దాన్ని గుర్తుంచుకుని మనకే వినబడేట్టుగా గట్టిగా పాడుకోవాలి. అదే రాగమో తెలిస్తే ఆ స్వరాలు కీబోర్స్డ్ మీద మోగించి చూసుకుంటూ ఉండాలి. మోగుతున్న స్వరాల ద్వారా రాగపు స్వరూపం మనకి కాస్తకాస్తగా అవగతం అవుతుంది. మనం ఎంత మనసు పెట్టి ప్రయత్నిస్తే అంత త్వరగా అర్థం అవుతుంది. కొంత ఆలస్యం అయినంత మాత్రాన నిరాశ పడనవసరంలేదు. కొత్త విషయాలు అర్థం అవుతున్నకొద్దీ మనకు ఉత్సాహమూ, ఆసక్తీ పెరుగుతాయి. ఇంట్లో నలుగురూ కూర్చుని ప్రయత్నిస్తే ముఖ్యంగా పిల్లల్లో ఉన్న ప్రతిభ బైటపడే అవకాశం ఉంటుంది. మంచి సంగీతం ఇంట్లో మోగుతూ ఉండడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో ఇంకా కృషి చెయ్యదలిస్తే ఒక్కొక్క రాగంలోనూ ఉన్న శాస్త్రీయ సంగీతాన్నీ, సినిమాపాటలనూ ఒక కేసెట్, లేదా సీడీమీద రికార్డ్ చేసుకుని అన్నీ ఒకేసారి వింటూ ఆ రాగపు లక్షణాలని అర్థం చేసుకోవచ్చు. ఇలా రాగానికొకటి చొప్పున సేకరించుకుంటే మంచి లైబ్రరీ తయారవుతుంది. సరిగమలు రాని చాలామంది రాగాలను గుర్తుపట్టగలరు. వినికిడి వల్ల వారికి రాగాల ‘ఆకారం’ తెలుస్తూ ఉంటుంది. దీనికి నేను అనలాగ్ పద్ధతి అని పేరుపెట్టాను. దీనితోబాటు స్వరాలను కూడా డిజిటల్ పద్ధతిలో గుర్తించగలిగితే రాగం, స్వరాల నిర్మాణం మరింత ఖచ్చితంగా అర్థం అవుతాయి.
తెలుగు పాటలకు రాగాల పేర్లు , హిందీ సినిమా పాటలకు రాగాల పేర్లు కొన్ని వెబ్‌సైట్లలో ఉన్నాయి. ఎటొచ్చీ, వీటిలో కొన్ని తప్పులున్నాయి. సినిమా పాటల్లో రాగాలకు నిర్దుష్టమైన స్వరూపం ఉండడం అరుదైన విషయం. స్థూలంగా ఏ రాగం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని సినిమాపాటలు ఉపయోగపడతాయి.