గత శతాబ్దంలో ప్రజాకవులు

వివరంగా చెప్పకపోతే మకుటం దగ్గిరే పేచీ రావచ్చు. అందుకని, ముందుగానే, నా ఉద్దేశంలో “ప్రజా కవి” అంటే ఎవరో నిర్థారణ చేయటం మంచిది. పద్యం పదిమందినోటిలో పడి, నలిగి, పదికాలాలపాటు ప్రజలు నెమరువేసుకుంటూ ఆనందించగల కవితలు రాసిన వాడు నిజమైన ప్రజాకవి. అయితే ఈ ప్రజలు ఎవరు? అన్న ప్రశ్న రాక మానదు.

నేను గత వంద సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్ర గురించే ప్రస్తావించదలచుకున్నాను కాబట్టి, నా నిర్ధారణలు ఆ వంద యేళ్ళకే పరిమితం. పదకొండో శతాబ్దంలోకో, పన్నెండో శతాబ్దంలోకో వెళ్ళి తెలుగు సాహితీ చరిత్ర తరచి చూస్తే నా వివరణ నిలబడక పోవచ్చు. పాట ప్రజలనోటిలో ఉన్నదని నాకు తెలుసు. అయితే, ఆ రోజుల్లో సాహితీ చరిత్ర నిర్దిష్టంగా చెప్పగలిగినప్పుడు, నా definitions సవరించుకుంటాను. ప్రస్తుతానికి గత నూరేళ్ళ పరిధిలోనే ఉండి ప్రజలు ఎవరూ, అన్న ప్రశ్న వేసుకుందాం.

ఈ ప్రజలు, శ్రీశ్రీని కంఠతా పట్టి వల్లించే వాళ్ళా? కాదు. వాళ్ళూ ప్రజల్లో ఒక భాగమే; కాదనను. అయితే వీళ్ళు విద్యావంతులైన ప్రజలు. తెలుగునాట ఇప్పటికీ ఈ ప్రజలు చాల కొద్దిమంది. వీళ్ళు మైనారిటీయే! పోతే, నన్నయనో, పోతననో, కాకుంటే సమయానుకూలంగా ఒక చాటు కవినో అడక్కండానే అప్పజెప్పే వాళ్ళా? కాదు. వీళ్ళని వేళ్ళమీద లెక్కవెయ్యొచ్చు. అంటే, ఈ జాతి ప్రజలు కూడా ఒక చిన్న మైనారిటీ అన్నమాట. ఇకపోతే, ఎవరయ్యా నీ ప్రజలు అని నిలదీసి అడిగితే, నా సమాధానం: వీధి బడికెళ్ళి చదువుకోని వాళ్ళు, వీధిబడికి కూడా వెళ్ళలేని వాళ్ళు, ఏ రకంగానూ చదువుకోటానికి అవకాశంలేని వాళ్ళు, ఏదో ఒక చిన్న బడికెళ్ళి ఓ న మా లు నేర్చుకోని కాస్తోకూస్తో చదవడం చాకలిపద్దు రాయడం నేర్చుకున్న వాళ్ళు. వీళ్ళు అసలు సిసలైన ప్రజలు. మన మహానగరాలు, పెద్ద పెద్ద పట్టణాలూ వదిలేస్తే, నూటికి డెబ్భైమందో, ఎనభైమందో నేను పైన నిర్థారించిన ప్రజలకిందే జమా కట్టచ్చు. ఈ ప్రజల్లోకి వెళ్ళి బలపడ్డ కవిత్వం ప్రజా కవిత్వం. ఈ ప్రజలని ఉత్తేజ పరిచి, వాళ్ళకి ఉత్సాహాన్నిచ్చిన కవిత్వం రాసిన వాళ్ళు ప్రజా కవులు.

ఈ దృష్టితో చూస్తే, మనకి నిజమైన ప్రజాకవులు తిరుపతి వెంకట కవులు. ఈ ఇద్దరు కవులూ, పెద్ద చదువులు చదువుకున్న పట్నవాసులకి, తెలుగు పద్య సాహిత్యంపై అభిరుచి క్షీణిస్తున్న కాలంలో, తిరిగి అభిరుచి కలిగించే ప్రయత్నం చేశారు, అవధాన ప్రక్రియద్వారా! అది ఒక యెత్తు. అంతకన్న గొప్పవిశేషం : అడివిలో అబ్బా అంటున్న సంప్రదాయ సాహిత్యాన్ని నాటక ప్రక్రియ ద్వారా మెజారిటీ ప్రజల్లోకి అత్యద్భుతంగా తీసుకెళ్ళారు.

గత పాతికేళ్ళుగా ఈ నాటకాలకి మద్దతు లేకపోవడం కొంత విచారించ తగినదే. ఈ ప్రక్రియ మరుగున పడటానికి కారణాలు చాలా ఉన్నాయి; ఆ కారణాలపై చర్చ మరో వ్యాసానికి సంబంధించినది. ఇప్పుడు, ఈ వ్యాసంలో ఆ నాటకాలలో పద్యాలనీ, మీకు గుర్తుకు తేవడం నా ముఖ్యోద్దేశం. వాటితో జోడించి, నాకు తెలిసిన కొన్ని nostalgic పిట్టకథలు కూడా చెప్పుతాను.

1999 జూన్ జులై నెలల్లో, తెలుసా అనే internet సాహితీ వేదికలో ఈ పద్యాల గురించి, “మనవాళ్ళు మరిచిపోతున్న పద్యాలు,” అన్న శీర్షిక కింద రాశాను. ఆ ప్రస్తావనలని కొద్ది మార్పులతో, మరికొన్ని కొత్త చేర్పులతో మీ ముందుకి తీసుకొని వస్తున్నాను.

తిరుపతి వెంకట కవులు రాసిన పద్యనాటకాలలో ప్రసిద్ధి కెక్కినవి రెండే రెండు నాటకాలు. మొదటిది శ్రీ పాండవోద్యోగము, రెండవది శ్రీ పాండవ విజయము. ఈ రెండింటినీ కలిపి, కుదించి, పాండవోద్యోగ విజయములు అన్న పేరుతో గత శతాబ్దంలో (1935-1975) దగ్గిర దగ్గిర నలభై సంవత్సరాలు విరివిగా ప్రదర్శించేవారు. నిజం చెప్పాలంటే, ఉద్యోగ విజయాలు అనేపేరుతో ప్రదర్శించే నాటకంలో, మొదటి నాటకం, శ్రీ పాండవోద్యోగము లోని భాగాలే చాల ఎక్కువ; రెండవనాటకంలో, ఏడవ అంకంలో కొన్ని పద్యాలే ప్రదర్శనలో భాగమయ్యేవి.

గత శతాబ్దంలో పద్య నాటకాలు చాలా వచ్చాయి. కొన్ని పౌరాణికం, మరికొన్ని సాంఘికం. ఉదాహరణకి రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, భక్త ప్రహ్లాద, మయ సభ, సత్యహరిశ్చంద్ర, కృష్ణార్జున యుద్ధం, చిత్రనళీయం తోపాటు, చింతామణి, వరవిక్రయం, వగైరా అన్నీ పద్య నాటకాలే! ఈ పైనాటకాలన్నీ, చాలా పెద్ద పేరున్న నటీనటులే ప్రదర్శించేవారు. యడవల్లి సూర్యనారాయణ, కపిలవాయి రామనాధ శాస్త్రి, సి.యస్.ఆర్. ఆంజనేయులు, చిత్తూరు నాగయ్య, సూరిబాబు, వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య, అబ్బూరి వరప్రసాద రావు, పులిపాటి వెంకటేశ్వర్లు, రామతిలకం, పీసపాటి నరసింహమూర్తి, బందా కనకలింగేశ్వర రావు, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ. వి. సుబ్బారావు మొదలైన హేమాహేమీలు ఈ నాటకాలు వేశారు. అయినా, ఉద్యోగవిజయాలకొచ్చిన పేరు, జనాదరణా వీటికి రాలేదు (షణ్ముఖి ఆంజనేయ రాజు గారి రామాంజనేయ యుద్ధం మాత్రం కొన్ని ప్రాంతాలలో బహుజనాదరణ పొందింది). ఒక కారణం కథ కావచ్చు. రెండో కారణం ఉద్యోగవిజయాల్లోని పద్యాల భాష, దాని సౌలభ్యం. అంటే, ఒక్కసారి వినంగానే, గుర్తు ఉండటం. ఈ సౌలభ్యం చిత్రనళీయానికి లేదు, చింతామణికి లేదు, వరవిక్రయానికి అసలే లేదు. అందువల్ల, నటీనటులు ప్రఖ్యాతి వహించిన జగజ్జట్టీ లయినప్పటికీ, ఆ నాటకాలు అదృశ్యమయిపోయినాయని అనుకుంటాను.

ఇకముందు ఈ వ్యాసంలో, ఉద్యోగవిజయాల్లో చాలా ప్రసిద్ధికెక్కిన పద్యాలే కాకుండా, కొన్ని చక్కని సులువైన పద్యాలని గురించి కూడా ముచ్చటిస్తాను.

2.

మన నాటక సంప్రదాయంలో ముందుగా నాంది. ఒకశ్లోకమో, పద్యమో చదివింతరువాత, సూత్రధారుడు వచ్చి, వెయ్యబోయే నాటకాన్ని గురించి నటీనటులగురించి, నాటక కర్త గురించి, ‘ప్రస్తావన,’ చేస్తాడు.

ఈ వివరాలన్నీ వ్రాత ప్రతిలోనే! సర్వసాధారణంగా, తెరవెనుక హారతి వెలిగించి, నటీనటులందరూ కలిసి ఒక ప్రార్థన చదువుతారు. తమాషా ఏమిటంటే, ఈ ప్రార్థన కూడా అందరికీ నోటికొచ్చిందే. ఇదిగో ఆ ప్రార్థన:

పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద
పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వ ప్రకాశ
వరదాయక సకలలోక వాంఛిత ఫల ప్రదాయా
పాహి పాహి మాం పాహి …

అని, ఆ నాటక కంపెనీకి జై అని అంటూ కొబ్బరికాయ కొట్టంగానే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెల్లుబికి పోతుంది. చాలా మంది ప్రేక్షకులుకూడా ఈ ప్రార్థన పద్యం వల్లించడం నేనెరుగుదును!

తెరతియ్యగానే మొట్టమొదటి నటుడు వేదికపైకి రావడం, ప్రేక్షకులనుంచి ఉత్సాహంగా ఈలలు, చప్పట్లు మామూలు. కారణం : ఆ నటుడు చాలా పేరున్న వాడు కావచ్చు; అంతకన్నా ముఖ్యం, జనానికి వాడు పాడబోయే పద్యం, రాగంతో సహా తెలుసు. అతను చెప్పబోయే వచనం అందరికీ కంఠతా!

ఇదిగో చూడండి:

రాబోయే కురుపాండవుల యుద్ధంలో అర్జునుడు కృష్ణుడి సహాయం కోరడం కోసం ద్వారకకి వస్తాడు. ఈలలు ఆగింతర్వాత, అర్జున పాత్రధారి హార్మోనియం వాయించే వాడికేసి చూసి శ్రుతికోసం సైగ చేసి అందుకుంటాడు:

అదిగో ద్వారక! ఆలమందలవిగో! అందందు గోరాడు, అ-
య్యదియే కోట, అదే అగడ్త; అవె రథ్యల్ వారలే యాదవుల్
యదుసింహుండు వసించు మేడ అదిగో; నాలావదంతావళా-
భ్యుదయంబై వరమందురాంతర అతురంగోచ్చండమై పర్వెడున్

ఇది ద్వారకని వర్ణిస్తున్న పద్యం. కోట, ఆవులు, గోపాలురు, కందకం, కృష్ణుడి మేడ, కట్టేసిన ఏనుగులూ, రథాలూ— వగైరా వగైరా! పద్యం పూర్తికాకముందే, ఈలలు, చప్పట్లు, కేరింతలూ మొదలవుతాయి.

పీసపాటి వారు ఈ పద్యం పాడుతూవుంటే, పల్లెటూళ్ళల్లో ప్రేక్షకులందరికీ ద్వారక చూసినట్టే భ్రమ కలిగేదని చెప్పేవాళ్ళు. పద్యం ఆఖర్న ఆలాపన ఒకేగుక్కలో కనీసం ఐదునిమిషాలు పట్టేదిట! ఈ ఆలాపన అవంగానే, ఈలల మధ్యలో once more, once more అని అరుపులు. నటుడు ఆ పద్యం మళ్ళీ చదవాల్సిందే! జనాన్ని ఉర్రూతలూగించాల్సిందే!! నిజం చెప్పాలంటే, ఏ నటుడైనా once more కోసం ఎదురు చూస్తాడు.

రంగస్థలం మొత్తం రెండువందల చదరపుటడుగులు కూడా వుండదు. దాని మధ్యలో రెండు బెంచీలు కలిపి వేసిన పానుపు (దీనిని హంసతూలికా తల్పంగా ప్రజలు ఊహించుకునేవారు!). పానుపు తలవైపు, కాళ్ళ వైపూ రెండు కుర్చీలు, కుర్చీలు దొరక్కపోతే, రెండు ముక్కాలి పీటలు! పానుపు మీద కృష్ణుడు ఎడమ చెయ్యి తలకింద పెట్టుకొని నెమలిపింఛం ఉన్న కిరీటంతోసహా సర్వ ఆభరణాలూ పెట్టుకొని నిద్రపోతున్నట్టు నటిస్తుంటాడు. (చిన్నప్పుడు, కృష్ణుడు ఆభరణాలన్నింటితో నిద్రపోతాడెందుకూ అని ఎవరినన్నా పెద్దవాళ్ళని అడుగుదామనిపించేది, ఈ నాటకం చూసినప్పుడల్లా!)

తనకన్నా ముందుగా వచ్చిన దుర్యోధనుణ్ణి చూసి అర్జునుడు ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ఇక్కడ ఒక చిన్న పద్యం. ముగ్గురు కృష్ణులు, ముగ్గురు అర్జునులూ వుండి, ఆరు గంటల పైచిలుకు పట్టే పెద్ద నాటకం అయితేనే ఈ పద్యం అర్జునుడి వేషధారి చదువుతాడు. లేకపోతే, “ఏమి ఈ విచిత్రము”, అని ఊరుకుంటాడు. ప్రేక్షకులకి తెలుసు, దుర్యోధనుడు ముందుగానే వచ్చాడని!

ఇదిగో ఆ చిన్న పద్యం:

మనకన్న మున్ను దుర్యో
ధనుడిటకరుదెంచె కృష్ణు తనవానిగ క్ర-
న్నన చేసికొన చనన్ తన
మనమందు తలంపబోలు మందుండకటా!

(ఈ పద్యానికి అర్థం చెప్పడం అవమానించడమే అవుతుంది.)

తరువాత, అర్జునికి ఒక మంచి పద్యాలు:

అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాధ్యు డంభోధిజా-
వరు డర్తావను డంగజాంగజుడు శ్రీవత్సాంకుడేమో! నిరం-
తర నిర్ణిద్రుడు నిద్ర జెందెడి బవల్; తచ్చీర్షపుంబక్కన-
క్కురునాథుండదె కూరుచుండె దళుకుల్ గుల్కంగ బీఠమ్మునన్

కృష్ణుడికి దుర్యోధనుడు వచ్చాడని తెలుసు. అర్జునుడు ఇంకా రాలేదేమా అని అనుకుంటూ (తనలో తను!) ఒక పద్యం పాడతాడు, జనంకోసం; ఆ పానుపుమీద పడుకోనే! ఈ పద్యం ప్రసిద్ధికెక్కిన పద్యమే.

రాడాయె అర్జునుడు? కురు-
రాడవతంసంబు వచ్చె రమ్మని అనికిన్
తోడుగ నను కోరగ మో
మోడంగా వలసివచ్చు ఒక్కింత ఇటన్

(ఈ పద్యంలో మోమోడం అంటే మనం మామూలుగా వాడే మోమాటం అన్న పదానికి వికృతి!)

అర్జునుడు కృష్ణుడి పాదాలకి నమస్కరించి, కాళ్ళవైపు కూర్చుంటాడు. దుర్యోధనుడు, కృష్ణుడి తలవైపున్న కుర్చీలో కూర్చుంటాడు. దుర్యోధనుడు కూర్చుంటూ మీసం మెలిపెట్టడం చూసి, ప్రేక్షకులు హేళనగా అరవడం మామూలే! ప్రేక్షకులు ఈ నాటకంలో భాగస్వాములు; పూర్తిగా లీనమైపోయిన వాళ్ళు!

కృష్ణుడు దొంగనిద్రనుండి మేలుకొని, ఆవులించి, వళ్ళువిరుచుకొని, కాళ్ళవైపు కూర్చున్న అర్జునుడిని చూసి, కౌగలించుకొని, హార్మనిస్ట్ సంజ్ఞ వినంగానే అందరికీ రాగంతోసహా కంఠతా వచ్చిన ఈ పద్యం పాడతాడు:

ఎక్కడనుండి రాక ఇట? కెల్లరున్ సుఖులేగదా? యశో-
భాక్కులు నీదునన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
చక్కగ నున్న వారె? భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతి దాను చరించునె తెల్పు మర్జునా!

బందా కనకలింగేశ్వర రావు గారు ఈ పద్యం విడమర్చి, ప్రతి ప్రశ్నా రెండుసార్లు వేస్తూ పాడేవారు. షణ్ముఖి ఆంజనేయరాజు గారు భీముడిని గురించి అడిగే కుశలప్రశ్నని, అతిసుందరంగా “వృకోదరుడు అగ్రజాజ్ఞకున్” అని విడదీసి, వృకోదరుడులో “కో” మీద ఆలాపన కొంచెంసాగదీసి పాడేవారు. ఈ విషయం ఎందుకు చెప్పుతున్నానంటే, పద్యం పాడటంలో ఒక్కొక్క నటుడిది ఒక్కొక్క ఫక్కీ. అదికూడా, ప్రేక్షకులకి తెలుసు.

మళ్ళీ మరోసారి ప్రేక్షకులనుంచి once more, once more! బందా వారు, షణ్ముఖి వారూ ఈ పద్యం కనీసం రెండుసార్లన్నా పాడడం నాకు తెలుసు! కృష్ణుడు మెల్లిగా దుర్యోధనుడి వైపు తిరిగి, ఆశ్చర్యాన్ని అభినయిస్తూ,

బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
నీవాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతికోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ-
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్

అని అడుగుతాడు. ఈ పద్యం పాడేటప్పుడు అందులోని వ్యంగ్యం విడమర్చి పాడగల నటుడు బందా కనకలింగేశ్వర రావుగారే! కృష్ణుడి పాత్ర పోషించడంలో ఆయన్ని మించిన వారు లేరని ప్రతీతి.

ఈ పద్యాలు పూర్తి అవడానికి కనీసం అరగంట పైన పడుతుంది!

శ్రీకృష్ణుడు, సుయోధనుణ్ణి “పొగుడుతూ”,

నీ వచ్చిన పని తెల్పు ము-
దావహుడవు గమ్ము నాకు అఖిలావని పా-
లావళి మౌళీమణి సం-
భావిత చరణుడవు నీవు వచ్చుట యసదే

దుర్యోధనునికి కృష్ణుని పై అనుమానమే! “ నేను వచ్చి చాలా సేపయినది,” అంటాడు. అంటే నేను ముందుగా వచ్చాను సుమా, కానీ నువ్వు అర్జునుడిని ముందు పలకరించావు అనే దెప్పు ఉన్నది. అయినా చాలా పెద్దమనిషి తరహాగా ఈ పద్యం పాడతాడు:

కౌరవ పాండవుల్ పెనుగు కాలము చేరువ యయ్యె, మాకు న-
వ్వారికి కూడ నెక్కుడగు బంధుసముద్రుడవీవు కాన, నీ
చేరిక మాకు నిర్వురకు సేమము కూర్చెడిదౌట సాయమున్
కోరగ ఏగుదెంచితిమి గోపకులైక శిరోవిభూషణా!

పెద్ద సైజు నాటకంలో, మరో చిన్న పద్యం కూడా పాడతారు. ఆ పద్యం:

ఇరువురకు సముడవు ని-
న్నరసితి నే ప్రప్రథమమునం దటుగానన్
సరసిజలోచన! నాకున్
కర మనుకూలుడవు గమ్ము కయ్యమ్ము నెడన్

కౌరవులు, పాండవులూ యుద్ధం చేసే సమయం వచ్చింది. నువ్వు, మాకూ వాళ్ళకీ కావలసిన వాడివి. నీ సాయం కోరడానికి వచ్చాను. నేను ముందుగా వచ్చాను. అందుకని మాకు అనుకూలుడవు కమ్మని అడుగుతున్నాను అని సారాంశం. ఈ పద్యానికి అర్థం చెప్పవలసిన అవసరం ఉన్నదా?

రెండో పద్యం పాడేటప్పుడు, “నిన్నరసితి, నే ప్రప్రథమమునన్” అన్న మాటలు రెండుసార్లు గుచ్చి గుచ్చి చదవడం ఆచారం. ప్రేక్షకులకి ముఖ్యం, నటుడు పద్యం పాడటమే కాదు; నటనకూడా కావాలి.
ఆ విషయం ఆరితేరిన నటులందరికీ తెలుసు!

శ్రీకృష్ణుడు మంత్రాంగం తెలిసిన గొప్ప ఉపాయశాలి. అంటాడు:

ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను చూచితిన్
బందుగులన్న యంశ మది పాయకనిల్చె సహాయ మిర్వురున్
చెందుట పాడి; మీకునయి చేసెద సైన్యవిభాగ మందు మీ-
కుందగుదాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పుమున్నుగన్

నువ్వు ముందుగా వచ్చావు, నిజమే. నేను అర్జునుడిని ముందు చూశాను. ఇద్దరికీ సహాయం చేస్తాను. సైన్య విభాగం చేస్తాను. మీకు తగినది తీసుకోండి, చిన్నవాడు ముందు కోరుకోవడం ధర్మం, అంటూ, అర్జునుడివైపు తిరిగి, “ధనంజయా! నీఅభిప్రాయమేమి?” అని అడుగుతాడు. ముందుగా అర్జునుడి అభిప్రాయం అడగడంతో, పాండవపక్షపాతం చూపిస్తున్నాడని దుర్యోధనుడు ఎత్తి పొడుస్తాడు. అందుకు కృష్ణుని సమాధానం: (సాధారణంగా ఈ పద్యం అందరూ పాడరు.)

సుయోధనా! అట్లు కాదు, అని,

నీవు స్వతంత్రుడ వీతడు
సేవకు డగ్రజుని చెప్పుచేతలకున్ లో-
నై వర్తించెడి నందుల-
కై వేరుగ నడగవలసె నది యట్లుండెన్

అని, దుర్యోధనుడి “అహంకారాన్ని” (ego ని) బలపరుస్తాడు.

వెంటనే, ఈ క్రింది రెండు పద్యాలు పాడతాడు. ఒకవేళ పద్యాలు కత్తిరిస్తే, వచనం లో వాటి సారాంశం చెప్పుతాడు. “నేను ఒకవైపు, మహాబల సంపన్నులైన పదివేలమంది గోపాలురు మరొకవైపు. నేను ఆయుధం పట్టను. కానీ, బుద్ధికి తోచిన సాయం మాత్రం చేస్తాను.”

ఇవిగో ఆ రెండు పద్యాలు:

అన్నియెడలను నాకు దీటైనవారు
గోపకులు పదివేవు రకుంఠబలులు
కలరు నారాయణాఖ్య చెన్నలగువారు,
వారలొకవైపు నేనొక్కవైపు, మఱియు

యుద్ధమొనరింత్రు వార ల-
బద్ధమ్మెందులకు? నేను పరమాప్తుడనై
యుద్ధము త్రోవం బోవక
బుద్ధికి తోచిన సహాయమును పొనరింతున్

సుయోధనుడు “ఆశ్చర్యం” ప్రకటిస్తూ, కాస్త వికటంగా, హేళనగా, ఈ క్రింది పద్యం పాడతాడు. నటుడు ఈ పద్యం చదివే పద్ధతి ప్రేక్షకులలో విపరీతమైన నవ్వు పుట్టిస్తుంది. మాధవపెద్ది వెంకట్రామయ్య గారు దుర్యోధన పాత్ర కి గొప్ప పేరు ప్రఖ్యాతీ తెచ్చిన వారిలో ముఖ్యులు. (యస్.వీ. రంగారావు గారి పాత సినిమాలు గుర్తుంటే, ఈ పద్యాన్ని ఆయన చదువుతున్నట్టు మనం ఊహించుకోవచ్చు.)

ఆయుధము పట్టడట, అని
సేయండట! “కంచిగరుడ సేవ,” ఇతనిచే-
నేయుపకృతి యుద్ధార్ధికి
నేయెడ నగు నిట్టివాని నెవ్వండు గొనున్

అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకోవడం దుర్యోధనుడు “పరిశేషన్యాయము” గా పదివేల గోపకుల సైన్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. అర్జున వేషధారి ఈ క్రింది రెండు పద్యాలూ పాడతాడు.

నందకుమార! యుద్ధమున నా రథమందు వసింపుమయ్య! మ-
ధ్యందిన భాను మండల విధంబున నీదగు కల్మి చేసి నా-
స్యందన మొప్పు గాక! రిపుసంతతి తేజము తప్పుగాక నీ-
వెందును ఆయుధమ్ముదరి కేగమి కొప్పుదుగాక కేశవా!

ఈవొకరుండవే జగములెల్ల జయించెద; నేనుకూడ న-
ట్లే విలయం బొనర్పగల నెందును పేర్గలవాడనౌట నీ-
కీ విజయ ప్రశస్తి యగు నేమొ అటంచు మదిన్ తపింతు స-
ద్భావము కల్మి నా అభిమతం బొడగూర్చితి, కొండనెక్కితిన్

ఈ రెండూ చక్కని పద్యాలే! ఎందుకనో, ప్రజలనోళ్ళల్లో పడలేదు. కారణం: చాలా సార్లు అర్జునవేషధారి పెద్ద పేరున్న నటుడు కాకపోవడం చేత, ఇవి కత్తిరించేసే వాళ్ళు. (పులిపాటి వెంకటేశ్వర్లు గారు అర్జునుడిగా నటించినప్పుడు, ఈ పద్యాలు పాడేవారని విన్నాను.)

మూడునిమిషాలపాటు గుక్కతిప్పకుండా ఆలాపన ముగిసిం తరువాత, తెరలాగే కుర్రాడు కంగారుగా తెరవెయ్యడానికి ప్రయత్నించడం మామూలే! సరిగ్గా సమయానికి తెర తాళ్ళు పని చెయ్యవు. రెండుపక్కలా తెరని పట్టుకొని మూసెయ్యడం కూడా మామూలే!(ఇది తెరలాగిన కుర్రాడిగా నా స్వానుభవం!)

3.

నేను ఈ నాటకాలు రకారకాల యాక్టర్లు,— చిన్న, పెద్ద, గొప్ప పేరొచ్చేసిన వాళ్ళూ, సరదాకి ఘట్టిగా పాడేసే bathroom పాటగాళ్ళూ, వెయ్యడం నా చిన్నతనంలో చూశాను. (ఆడియో టేపు పెట్టుకోని అనుకరిస్తూ పాడటం నేర్చుకున్న ఔత్సాహిక యన్.ఆర్.ఐ. లు పాడటం కూడా విన్నాను!) శ్రీ పాండవోద్యోగము నాటకంలో రెండవ అంకము ఎవ్వరూ, వేసినట్టు గుర్తు లేదు. అందులో కూడా మంచి పద్యాలు వున్నాయి; అవి బాగా అందరికీ నోటికి వచ్చేసినవి కావు! మంచి గొంతున్నవాళ్ళు, చక్కగా పాడేవాళ్ళు దొరికితే, ధర్మరాజుకి, భీముడికీ చక్కని పద్యాలున్నాయి. అవి ఇప్పుడు కేవలం academic interest కోసమే చెప్పుకోవాలి. ఆ పద్యాలు కొన్ని చవి చూపించి తరువాతి అంకంలోకి జారుకుందాం.

“ఏదో రకంగా” సంధి కుదర్చమని కృష్ణుణ్ణి వేడుకుంటాడు ధర్మరాజు.

సంధి యొనర్చి మా భరత సంతతి నిల్పుము లేదయేని గ-
ర్వాంధులు ధార్తరాష్ట్రుల సహాయులతో తునిపింపుమో జగ-
ద్బాంధవ! రెండు కర్జముల భారము పెట్టితిమయ్య నీభుజ-
స్కంధమునందు; తారసిలుగావుత మాకు యశంబొ, రాజ్యమో!

సౌబలేయులు సంధికిష్టపడి రేని
అన్నదమ్ముల మేము నూటైదుగురము
పాడిమెయి నిష్టపడరేని వారు నూఱు
గురె సహోదరు లేమైదుగురమె కృష్ణ.

భీముడు “ఇంతకూ సంధి ఏమని?” అని అడుగగానే, ద్రౌపది ఎకసక్కెముగా ధర్మరాజుని దెప్పిపొడుస్తూ అంటుంది, “ అర్థరాజ్యం ఇవ్వడం ఇష్టం కాకపోతే, కనీసం ఐదూళ్ళిస్తే చాలునట,” అని.

కృష్ణుడు సంధి పొసగడం అసంభవమేమో అని చెప్పుతూ, యుద్ధానికి ఉసి కొలుపుతున్నాడని భీముడికి అనుమానం వస్తుంది. ఒక్క క్షణం, ధర్మజుని సంధిబేరం వైపు మొగ్గు చూపిస్తున్నట్టు కనపడగానే, కృష్ణుడు భీముణ్ణి వేళాకోళం పట్టి అతణ్ణీ రెచ్చగొడతాడు:

నిదురవోచుంటివో లేక బెదిరి పల్కు
చుంటివో? కాక నీవు తొల్లింటి భీమ
సేనుడవె కావొ యెన్నడీచెవులు వినని
కనులు చూడని శాంతంబు గాన వచ్చె.

యుద్ధానికి బెదురుతున్నావని కృష్ణుడు హాస్యోక్తిగా భీముడిని ఉసికొలుపు చెప్పిన పై పద్యం వినంగానే, భీముడు రెచ్చిపోయి, కృష్ణుని “గొల్ల ఇల్లాళ్ళను వంచించి కొంపకొంపకూ వెళ్ళి పెరుగు దొంగిలించిన” వాడివినీవు అని అవమానిస్తాడు. తరువాత తన పరాక్రమం చెప్పుతాడు, ఈ కింది పద్యంలో:

బకునిం చంపితి, రూపుమాపితి హిడింబాసోదరున్, దుష్ట కీ-
చకులం దున్మితి మొన్న నూర్గుర, జరాసంధున్ దురాసంధునే-
నొకడం చంపితి నాకు భీమునకు వేరొక్కండు తోడేల! యె-
న్నక నన్నీగతి పోరికిం బెదరు చున్నాడం చనం పాడియే?

అర్జునుడికి కూడా రెండు చక్కని పద్యాలున్నాయి, ఈ సందర్భంలో!.

వాడిములు మోపినంతైన వసుధ యొసగ
ననుచు సూచించెగద! సంజయుని మొగమున
పాలనకు నిక్కమైదూళ్ళె చాలుననిన
లబ్ధి లేదు కదా! యేల లాఘవంబు

వాడి సూదిమోపినంత భూమినైనా ఇవ్వను అని సంజయ రాయబారం వల్ల మనకు తెలిసింది కదా! మరి ఐదూళ్ళడగడంలో అర్థం ఏమిటి? అయినా, భీష్మునితో, ద్రోణాచార్యునితో నా మాటగా చెప్పుము.

సూతుని మైత్రిచే పగకు జొచ్చిన గొంటు సుయోధనుండు, మీ-
రాతని పట్ల వారగుట న్యాయమ, గాండివధారి నయ్యు నే-
భీతిలుచుంటి నేమనుచు పెద్దలతో అని సేయువాడ నో
తాత! గురుండ! మీరయిన ధర్మము కాదని మందలింపరే!

గాండీవం ఉండికూడా, పెద్దలైన మీతో యుద్ధం చెయ్యడానికి భయపడుతున్నాను. సుయోధనుడు, సూతపుత్రుడైన కర్ణునితో స్నేహంచేసి కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మీరు అతని పట్టున ఉండడం సబబా? మీరయినా అతనికి బుద్ధి చెప్పి మందలించండి, అని సారాంశం!

పాండవులందరూ, ద్రౌపదితో సహా కృష్ణుడిని సంధిచేసి పెట్టమని అడుగుతారు. ఆఖరున అందరూ తెరలో ఈ క్రింది పద్యం చదువుతారు.

ఆసన్నంబయ్యెను ముర-
శాసన! దేవా!ప్రయాణ సమయం బిదె భే-
రీ సముదితమగు రవము ది-
శా సముదాయంబు పగుల జయముగ మ్రోగెన్

4.

ఇక మూడవ అంకం. ఈ అంకమే ప్రసిద్ధికెక్కిన “కృష్ణరాయబారం.”
ఈ అంకంలో చాలా పద్యాలు పల్లెల్లో చాలామందికి కంఠతా వచ్చు. ఇప్పటికీ, పద్యం మొదలు అందిస్తే చాలు, ఈ రాయబారంలో పద్యాలు రాగయుక్తంగా పాడగలరు.

ఒక్క శ్రీకృష్ణ రాయబారమే నాటకంగా వేస్తే (ఏలూరులో బందా కనకలింగేశ్వర రావు గారి ప్రభాత్ థియేటర్స్ వారు అప్పుడప్పుడు కృష్ణరాయబారం మాత్రమే వేసేవారు. బందా వారు కృష్ణుడు! ఆయన, పద్యం చక్కగా విడదీసి, “గుత్తివంకాయ కూరోయి బావా,” అన్నధోరణిలో పాడేవారు. ఆయన ఎక్కడ కృష్ణుడిగా వేషంకట్టినా, ప్రేక్షకులు ఆయనచేత “గుత్తి వంకాయ కూరోయి బావా,” అనే పాట పాడించుకునేవాళ్ళు.)

మూడవ అంకంలో, కర్ణుడికి, అశ్వత్థామకి, భీష్ముడికి, సుయోధనుడికీ, చక్కటి పద్యాలున్నాయి. మచ్చుకి ఒకటో రెండో ఆ పద్యాలు చెప్పుకొని, ఎకాయెకీ రాయబారంలో కృష్ణుడి పద్యాలు గుర్తు చేసుకుందాం!

కృష్ణుడు చిరునవ్వుతో కౌరవ సభకి వస్తాడు. వచ్చి, ధృతరాష్ట్రుడితో:

“మామా! ధార్తరాష్ట్రులకు పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెల్ల కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవ దూతగా వచ్చితిని.

తమ్ముని కొడుకులు సగపా-
లిమ్మని రటులిష్టపడవయేనియు నైదూ-
ళ్ళిమ్మని రైదుగురకు ధ-
ర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్”

అని చెప్పి పాండవుల గురించి ఇలాగ అంటాడు.

పతితులు గారు నీయెడల భక్తులు, శుంఠలుగారు విద్యలం-
చతురులు, మంచివారు, నృపసంతతికిన్ తలలోని నాల్క ల-
చ్యుతునకు కూర్చువారు, రణశూరులు, పాండవులట్టివార లీ-
గతి నతిదీనులై యడుగగా నిక నేటికి సంశయింపగన్

ధృతరాష్ట్రుడు “ అల్లుడా! వాసుదేవా! సర్వమూ తెలిసి నాపై నెపము ఎందుకు పెట్టుచున్నావు? అని అంటూ,

గ్రుడ్డినగుటచేత కొంతకాలం బేలె
పుడమి పాండురాజు; కొడుకులిప్పు-
డేలుకో దొడంగి రీ కారణంబున
గ్రుడ్డిదయ్యె మాటగూడ నాకు.

కృష్ణుడు తరువాతి పద్యంలో “నీ కట్టిన పాపమెట్టిదియొ,” అని అనగానే, కర్ణుడు “అధిక ప్రసంగము మానుము,” అని కృష్ణుడితో అంటాడు.

వెంటనే భీష్ముడు, “కృష్ణుని మాట అటుంచుము, సూతపుత్రా! నీ అధిక ప్రసంగమునకు అధికారమెవ్వరిచ్చినారు?” అని మందలిస్తూ,

చెప్ప దొరకన్న విషయం
బొప్పో! తప్పో; ముగింపకుండగ నడుమన్
తప్పనుట తగునె సభలో
నెప్పుడు గురునంతవాని కేనియు కుమతీ!

గురువంతవాడు కూడా అవతలవాడు చెప్పేది పూర్తికాకండా మధ్యలో మాట్లాడటం తప్పు, అంటే interrupt చెయ్యడం నాగరిక లక్షణం కాదు అని అర్థం. ద్రోణుడు కూడా, కర్ణుడిని మందలిస్తే, కర్ణుడు అంటాడు: “కూడు గుడ్డ పెడుతున్న రాజుని దూషిస్తే మాట్లాడకుండా కూర్చోడానికి నేను ముదుసలి భీష్ముడిని కాదు; అతన్ని వెనకేసుకొచ్చే ద్రోణుడినీ కాదు,” అని అనగానే, అశ్వత్థామ, వికర్ణుని మధ్య కాస్త ఘర్షణ జరుగుతుంది. ఇక్కడ అశ్వత్థామకి ఒక చక్కని పద్యం:

కచ్చియ మాన్పి కౌరవుల గాచు తలంపున సంధి సేయగా
మచ్చిక నేగుదెంచి హరి మంచియొ చెడ్డయొ చెప్పుచుండగా
నచ్చపు రాజ భక్తి గల దంతయు వెల్లడి చేయుభంగి నీ
మచ్చరి సూతపుత్రుడభిమానముచే కలహింప నేటికిన్?

ఈ మాటల యుద్ధం తరువాత, దుర్యోధనుడు, తల్లి తండ్రులనుద్దేశించి ఈ పద్యం పాడతాడు:

ఐదూళ్ళిచ్చిన చాలును
లేదే నని సేత నిజము లెండనుచున్ దా-
యాదులు కబురంపిన నే-
నీదలుచుట వారి కోడుటే యగు గాదే?

విదురుడు, భీష్ముడు చెప్పిన మాటలు కూడా దుర్యోధనుడు పెడచెవిన పెడతాడు. ఇక్కడ విదురుడికి ఒక పద్యం, భీష్ముడికీ ఒక పద్యం; ఈ రెండు మంచి పద్యాలే!

విదురుడు దుర్యోధనుడితో:

వాసవితోడ పోరగలవాడని కర్ణుని యందు నీవు పే-
రాస గలట్టి వాడవు కదా ఇపుడిర్వుర పోరచేసి యం-
దోసరినట్టివాని తెగ యోడినటుల్మన మెంచుకొంటిమే
నీ సమరంబు మాను జగమెల్లరకుం కడు సంతసంబగున్

వెంటనే భీష్ముడు:

కవ్వడితోడి పోరితము కర్ణునకిష్టము వానిచేత నా-
కవ్వడి నొవ్వ చేసి రణకార్యము తీర్చుట నీ మనోరథం-
బివ్వరుసన్ ఫలించుగద, ఇర్వురకోరుకు లెల్ల రాజులుం
జవ్వకు బాసి సంతసముచే మన చూచెదు రాలు బిడ్డలున్

సుయోధనుడు, భీష్మ,ద్రోణ విదురులు పాండవ పక్షపాతులని మరీ మరీ దెప్పుతాడు. కర్ణునిపై తనకున్న విశ్వాసం చెప్పుతూ, ద్రోణుని దూషిస్తాడు. కర్ణుడు కూడా ద్రోణుని పరిహసిస్తాడు. ఈ అవమానం భరించలేక, అశ్వథ్థామ లేచి పోబోతూ, ఈ క్రింది పద్యం పాడతాడు:

మీరంబోకుము పొల్లు మాట వినికిన్మీరాజు రండంచు మ-
మ్మారాధించిననాడె వచ్చెదము లేరా (ద్రోణుని వైపు, కృపుని వైపూ చూసి) తండ్రి రావయ్య మా-
మా! రా పోదము పోరికై యెవరినీక్ష్మాపాలుడాసించెనో
వారే గెల్తురు వారి వారల బలావాల్లభ్యముల్చూచెదన్

కృష్ణుడు, వారించి, దుర్యోధనుడితో, ఈ మాటలు అంటాడు:

బావా! నీకొల్వు కూటము క్రమముగా రణకూటమగుచున్నది. పదుగురుండగ, నే చెప్పబోవు పల్కులు గూడ నాలింపుము:

(ఈ డైలాగు, ప్రేక్షకులందరికీ వచ్చిందే!బాగా నచ్చిందే కూడాను! కృష్ణుడు తరువాతి పద్యం మొదలెట్టకమునుపే, కరతాళ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. కారణం: ఈ కింది పద్యాలు అందరికీ కంఠతా!)

చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందఱుం-
తొల్లి గతించె, నేడు నను దూతగ పంపిరి సంధిసేయనీ-
పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు సేసెదో
యెల్లి రణంబు కూర్చెదవొ యేర్పడ చెప్పుము కౌరవేశ్వరా!

అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
అలిగిననాడు సాగరము లన్నియు ఏకము కాక పోవు క-
ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా-
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్

జెండాపై కపిరాజు ముందు సిత వాజశ్రేణియుం కూర్చి నే-
దండంబుం గొని తోలు స్యందనము మీద న్నారిసారించుచుం-
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పు డొ-
క్కండు న్నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్

సంతోషంబున సంధి చేయుదురె; వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ
కాంతం చూచిననాడు చేసిన ప్రతిజ్ఞల్ తీర్ప భీముండు నీ
పొంత న్నీ సహజన్ముఱొమ్ము రుధిరమ్ముంద్రావునాడైన ని-
శ్చింతం తద్గదయుం త్వ్దూరుయుగమున్ ఛేదించునాడేనియున్

ఈ నాలుగు పద్యాలూ మరొక్క సారి చదవండి. కృష్ణుడు నిజంగా సంధి చెయ్యడానికే వచ్చాడా అన్న అనుమానం వస్తుంది.

ప్రారంభంలోనే, “మీరు పాండవులకు చేసిన ఎగ్గులు, అంటే కీడు, అనాదరం, వాళ్ళు సహించారు. మరి ఇప్పుడు సంధిచేస్తావో, యుద్ధమే చేస్తావో, చెప్పుము. తరువాతి పద్యంలో, దుర్యోధనుణ్ణి బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు; ధర్మరాజుకి కోపం వస్తే, సముద్రాలు ఉప్పొంగిపోతాయి. పదివేలమంది కర్ణులున్నా సరే, యుద్ధంలో చావక మానరు. నామాట వినుము. అంతేకాదు. నేను చర్నాకోల్ పట్టుకొని, అర్జునిడి రథం తోలుతూ ఉండగా, గాండీవం ధరించి అర్జునుడు మీమూకని చెండాడుతున్నప్పుడు, ఏ ఒక్కడూ నీ మొర ఆలకించరు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో భీముడు చేసిన ప్రతిజ్ఞలు (దుశ్శాశనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతానని, నీ తొడలు విరుగ కొడతాననీ) గుర్తు చేస్తున్నాడు! నిజంగా సంధికోసం వచ్చిన రాయబారి, ఇట్లా భయపెడుతూ, బెదిరిస్తూ, అవమానిస్తూ మాట్లాడితే, సంధి చేద్దాం అనే కోరిక ఏమాత్రం ఉన్నా అది కొండెక్కదూ! కృష్ణుడికి, నిజంగా సంధి చెయ్యడం ఇష్టం లేదని స్పష్ట పడుతుంది.

మహా భారతంలో ఈ సందర్భంలో తిక్కన గారి పద్యాలు, “సారపుధర్మమున్,….వారలు శాంతశూరులు….”అని ధృతరాష్త్రుడితో చెప్పడం, ……. “అరయంగ తప్పు లేదంటి నీవలన……అన్నదమ్ముల నెత్తంబులాడి…….” అని దుర్యోధనుడితో చెప్పడం వంటి పద్యాలతో పోల్చి చూడండి.

ఈ పై నాలుగు పద్యాలూ, ఒక్కక్కటీ కనీసం రెండుసార్లన్నా పాడాలిసిందే!చాలా మంది ప్రేక్షకులు “శ్రీకృష్ణ” దర్శనం అయినట్టే భావిస్తారు. కృష్ణుడిపాత్రలో లీనమైపోతారు. తరువాత, ఎల్లాగో విశ్వరూప సందర్శనం ఉన్నదిగదా!

సుయోధనుడుకి కోపం వస్తుంది. శకుని, కర్ణ, దుశ్శాసనులతో లోపలికి పోయి, కృష్ణుడిని బంధించటానికి ‘పలుపులు” తెస్తారు!

కృష్ణుడు, తనదైన చిరునవ్వుతో:

బావా! ధార్తరాష్ట్రాగ్రజా! ఇటు చూడుము.

ఒక్కని చేసి నన్నిచటనుక్కడిగింప తలంచినావె? నే-
నెక్కడ పోగలాడ! ఇక ఇక్కడచిక్కితి బక్కి కైవడిన్
దక్కితి నీకు, పట్టు మొగిదక్కకుమిట్టిటు చేరరమ్ము, బల్-
చక్కటి యూహ పుట్టె, ననుజన్ములతో నరుదెమ్ము పార్థివా!

శ్రీకృష్ణుడు తన విశ్వరూపం చూపుతాడు. ధృతరాష్ట్రుడికికూడ దివ్యదృష్టి ప్రసాదిస్తాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, ఆనందపారవశ్యం నటిస్తూ, కృష్ణుడికి నమస్కరిస్తూ నిలుచుండిపోతారు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకునీ మొదలైన వారు, భయపడి, కళ్ళు మూసుకుంటారు.

మారుమూల పల్లెటూళ్ళల్లో కూడ, spot light ముందు ఒక చక్రం కట్టి, దానికి రకరకాల రంగు కాయితాలు పెట్టి ఆ చక్రాన్ని తిప్పుతారు, కృష్ణుడిపై రంగులు పడేట్టు! విశ్వరూపం అంటే, అదీ!!

మీరు మొదటిసారి ఈ నాటకం చూస్తే, నటులు పెద్ద పేరున్న వాళ్ళు కాకపోయిన సరే, ఈ సమయంలో ఆనందంతో ప్రేక్షకులు వేసే ఈలలకి, మీకు చెవుడు రాక మానదు.

శ్రీకృష్ణుడు సభని వదిలి పోతూ, కర్ణుడిని పక్కకి పిలిచి:

రాధేయా! ఏకాంతంబుగ ఒక ముహూర్తమాత్రము నీతో మాటలాడ నా
కవకాశ మొసగుదువే:

ఎల్లి సూర్యోదయంబున నేగు వాడ
ఇట వసించెద విదురుని ఇంట మాపు
ఈవటకు వత్తువో లేక ఇంటికేను
వత్తునో ఆనతీగదవయ్య కర్ణా!

కర్ణుడు, కృష్ణుడు తన జన్మ రహస్యం చెప్పడానికేమో నని అనుమానిస్తూనే, “తప్పక నీవరుగు సమయమునకు వచ్చి కలుసు కొనియెద,” అని చెప్పుతాడు.

5.

మొత్తం ఉద్యోగ విజయాలు నాటకం వేసేటప్పుడు నాలుగో అంకం బాగా కుదించి వేస్తారు. నా అనుభవంలో బహుశా రెండుసార్లు చూశానేమో, ఈ అంకం కూడా ప్రదర్శనలో ఒక భాగంగా! తిరుపతి వెంకట కవులు కర్ణ పాత్రని ఈ అంకంలో అత్యద్భుతంగా పోషించారు. ఇందులో, కృష్ణుడికి, కర్ణుడికీ, చాలా చక్కని పద్యాలున్నాయి. ఈ పద్యాలు “రేడియో నాటకాలు” విన్న వాళ్ళకి బాగా తెలిసే వుంటాయి. ఇవి, తప్పక గుర్తు పెట్టుకోవలసిన పద్యాలు!

కృష్ణుడు కర్ణుడిని “బావా!” అని సంబోధించి:

కన్నె ప్రాయమునందు భాస్కరునికరుణ
పదినెలలు మోసి నిన్ను కన్న పడతి కుంతి
చేరగా దీసి నిన్ను పెంచినది రాధ
నీవు రాధేయుడవు కావు నిశ్చయముగ.

“దుర్యోధనుడు సంధికి ఒప్పుకోడని తెలిసికూడా నేను వచ్చాను; నేను వచ్చిన అసలు కారణం: ఈ నిజవిషయం నీకు చెప్పి, నిన్ను నావెంట తీసికొని పోదామనుకుంటున్నాను. నీవు కూడా పాండవుడవే!” అని చెప్పుతూ,

అంచితులైన బందుగుల అందరిముందఱ చెప్పి నిన్ను మె-
ప్పించెద, కుంతి చేత, రవి చేత నిజంబని నీకు సాక్ష్య మి-
ప్పించెద ఫల్గుణ ప్రముఖ వీరులు కొల్వగ యెల్లభూమి యే-
లించెద నచ్ఛకీర్తి విరళీకృత సర్వదిగంతరంబుగన్

“అంతే కాదు. నిన్ను చక్రవర్తిగా పాండవులందరూ కొలిచేటట్టు చేస్తాను. ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుంది,” అని కూడా చెప్పుతాడు. చూడండి, కృష్ణుడి diplomacy! అతని పన్నాగం!

ఏ సతి వహ్నిలోన జనియించెను జన్నమొనర్చు వేళ ము-
న్నే సతి పెండ్లినాడు నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే
నేసతిమీది మోహమున నింతలుచేసిరి రాజు నీవు? ని-
న్నాసతి పెండ్లియాడ గల దాఱవ భర్తగ సూర్యనందనా!

కర్ణుడు “ కృష్ణా! ఇంద్రుడు నా కవచకుండలము అర్థించడానికి వచ్చే సమయంలో, సూర్యుని వలన నేను నా కథ కొంత విన్నాను. నువ్వు, నాయందు సౌహర్దం తో పూర్తి కథ చెప్పావు. అయినా,

సూతుని చేతికిం దొరికి సూతకళత్రము పాలు ద్రావి, యా-
సూతుని అన్నముం గుడిచి సూతకులాంగనయందు నందన
వ్రాతము గాంచి నేటికొక రాజకుమారుడ నంచు తెల్ప నా-
చేతము సమ్మతించునె, ఇసీ! యెవరేగతి సిగ్గు మాలినన్

కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ-
భూమి సమస్తమేలుకొను పూనిక చేతనె గాని నేను నా-
సేమము గోరి చుట్టముల స్నేహితుల న్విడనాడి నేడు మ-
త్స్వామి సుయోధను న్విడిచి వత్తునె? వచ్చిన మెత్తురే జనుల్

“అర్జునుడికి భయపడి, నేనూ పాండవుడనే అని నీతోకలిసి ఒక కొత్త పన్నాగం పన్నానని, నిన్నూ నన్నూ కూడా జనులందరూ దూషిస్తారుగదా! ధర్మరాజు, నిత్యసత్యవంతుడు. నేను అగ్రజుడనని తెలిసిన అతడు రాజ్యపరిత్యాగము చేయును గదా! ఆతనికి, నా పుట్టుక గురించి తెలియనియ్యకుము,” అని ప్రాధేయ పడతాడు.

కృష్ణుడు నిష్క్రమించగనే, కుంతి ప్రవేశించి, “ నీవు కౌంతేయుడవే గాని, రాధేయుడవు కావు,” అని చెప్పగా:

కర్ణుడి సమాధానం:

ఇంచుకయైన లోగరుణ యెంచక కన్నకుమారు గంగ క-
ర్పించిన గొడ్డురాల విక ప్రేముడి యెక్కడిదమ్మ నీకు? నా-
యంచితమైన రాచకొల మాఱడిపుచ్చితి సూతధర్మము
ల్గాంచితి నీటపుచ్చిన కులంబిక వచ్చునె? సంధి చేసినన్

పంచపాండవులను మాటను వేరు చేయుట నా అభిమతము గాదు. అదియునుగాక,

సిన్నతనంబునుండి దయచేసి రమావిభవంబొసంగి నా-
యున్నతి గోరి నాపయి జయోద్ధతి పూంచిన రాజుకన్న నా-
కన్నలు తమ్ములుం కొడుకు లాప్తులు యెక్కువ కాదు వాని దీ-
నున్నువప్రాణి వాని విడనాడుట నాపని కాదు మానినీ!

కుంతి వెంటనే, “పంచపాండవులను మాట వేరు చేయుట నీ అభిమతము కాదన్నావుకదా! అట్లే నాకు వరమిమ్ము,” అని అడగ్గానే:

సమరమున చేత పడినను చంప నేను
ఫల్గుణుడ దప్ప తక్కిన పాండుసుతుల
నేను మడసిన నున్నవా రేగురుందు-
రతడు మడసిన నాతోడ నైదుగురము.

కుంతి “ఉపపాండవులేవురపైన కూడా దయ ఉంచుము,” అని కోరుతుంది. కర్ణుడు “ నీ అభిమతమ్మట్లే నెరవేర్చెదను,” అంటాడు.

ఐదవ అంకం, ఆరవ అంకం ప్రదర్శించడం నేను ఎప్పుడూ చూడలేదు. కృష్ణుడు, తన సంధి విఫలమైనట్టు చెప్పడం, ధర్మరాజు బాధ పడటం, కృష్ణుడికి జరిగిన పరాభవానికి, పాండవులకు విపరీతమైన కోపం రావడం, ఐదవ అంకం సారాంశం. అర్జునుడు యుద్ధవిముఖుడైనప్పుడు, అర్జునుడికి “ నీవు నిమిత్తమాత్రుడివి! ఈ యుద్ధం అనివార్యం,” అని కృష్ణుడు “విశ్వరూపం” చూపడం, అర్జునుడు యుద్ధానికి సన్నద్ధుడు కావడానికి కృష్ణుడు చేసిన బోధన, ఆరవ అంకం సారాంశం.

6.

రెండవ నాటకం, “శ్రీ పాండవ విజయము,” లో ఆఖరి రెండు అంకాలలో(ఏడవ అంకం, ఎనిమిదవ అంకం)చాలా కొద్ది పద్యాలు మాత్రమే ప్రసిద్ధికెక్కినాయి. ఆ పద్యాలు కలుపుకొని, “పాండవోద్యోగవిజయములు,” అని ప్రదర్శించడం ఆనవాయితీ!

పదకొండు అక్షౌహిణుల కౌరవ సేన నశించింది. దుర్యోధనుడు మడుగులో దాక్కుంటాడు. కృష్ణుడితో కలసి, పాండవులందరూ ఆ మడుగు దగ్గరకు వచ్చి, దుర్యోధనుని బయటకువచ్చి యుద్ధము చెయ్యమని అడిగే పద్యాలు, ఏడవ అంకంనుంచి:

ధర్మరాజు, దుర్యోధనుని సంబోధించి పాడుతున్నాడు:

చతురంభోధి పరీతమైన ధరణీ చక్రంబు శాసించి భూ-
పతివర్గం బరిగాపులై కొలువ సేవానమ్రరాజేంద్రమౌ-
ళి తలాలంకృత రత్నదీధితి సరోలీనుండవై యుండు నీ-
స్థితి ఈ రీతిగ నేటికిం పరిణమించెన్ గాదె దుర్యోధనా!

ఈ భూమండలాన్ని శాసించి, సమస్త రాజవర్గమూ సేవలు చేస్తూ ఉండే నీకు ఈ దుస్థితి పట్టిందా, దుర్యోధనా అని అంటూ, ఈ కింది పద్యం బిగ్గరగా పాడతాడు. ఎందుకంటే, ఈ పద్యం చాలామందికి నోటికొచ్చిన పద్యం!

చచ్చిరి సోదరుల్సుతులు చచ్చిరి చచ్చిరి రాజులెల్ల రీ-
కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరీ గతిన్-
పచ్చని కొంప మాపితివి బాపురె? కౌరవనాథ! నీ సగం-
బిచ్చెద జీవితేచ్ఛ కలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్

తమ్ములు, కొడుకులు, నీ సామంతరాజులు, అందరూ యుద్ధంలో చనిపోయారు. ఈ యుద్ధానికి ముఖ్యకారకులైన కర్ణుడు, శకుని మామ కూడా హతమార్చబడ్డారు. నీ సగపాలు నీకు ఇస్తాను, బతుకుదామనే కోరిక ఉంటే, మడుగునుండి బయటకు రమ్ము. “నీ సగపాలూ ఇస్తాననడం” భారతంలో లేదనే నా నమ్మకం. ఇది, తిరుపతి వెంకట కవుల చేర్పే!

తరువాత, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడూ తలా ఒక్క పద్యం పాడతారు, దుర్యోధనుణ్ణి దెప్పిపొడుస్తూ. మడుగునుండి బయటకు వచ్చి క్షత్రియుని వలె యుద్ధ ధర్మాన్ని పాటించమని గుచ్చి గుచ్చి అడుగుతారు.

కృష్ణుడు, “ కౌరవేంద్రా! నాడు సభాముఖమున “బ్రతికినన్నాళ్ళు రారాజుననిపించుకొన వలె” నని మీ అమ్మతో చెప్పిన మాటలు గుర్తులేవా,” అని ఎద్దేవ చేస్తాడు.

దుర్యోధనుడు, పాండవులతో:

ఏలుము రాజ్యమంతయు మహీంద్రుడ; నేను పరిత్యజించితిన్
కాలము చేరువౌదనుక కానలలో తపమాచరింతు నే-
నాల మొనర్పగా తగిన యాయుధముల్దరి లేవు యుద్ధ మిం-
కేల? భవన్మనోరథము లే నొడగూర్చుచు నుండ నిత్తరిన్

వెంటనే ధర్మరాజు, “ దాన పూర్వకముగా గ్రహించుటకు మేము బ్రాహ్మలము కాము. నిన్ను కడతేర్చుటయే మా మనోరథమ్ము కాని, రాజ్యమేలుటయే కాదు. కావున తడయక, వెడలి రమ్ము,” అని హెచ్చరిస్తాడు.

తరువా త భీమునితో గదా యుద్ధం. కృష్ణుడు సైగచేసి దుర్యోధనుని తొడలపై భీమునిచే కొట్టించడం, ఆతడు తొడలు విరిగి నేల కూలడం జరుగుతుంది.

దుర్యోధనుడు ఆఖరిగా, కృష్ణునితో, “ గోపాలా! ఇది ధర్మమునకు కాలము కాదు. కలికాలము వచ్చినది. కపటోపాయము లేని వారికి జయము లేదు. ఇది వినుము,” అని ఈ పద్యం పాడతాడు:

చదివినాడను వేద శాస్త్రంబు లర్థుల-
కిచ్చినాడను మనోభీప్సితమ్ము-
లేలినాడను భూమి ఏకాత పత్రంబు
ప్రజలను సంతోష పరచినాడ
జరపినాడను పెక్కు జన్నముల్పుత్రుల-
గాంచితి పూనరకంబు వాయ
మెప్పించినాడ సుమిత్రుల నార్జించి
పొందినాడను సర్వభోగములను

క్షత్రియులచేత మిగుల పొగడ్తగన్న
కదన మరణంబు కంటి నా కంటె భాగ్య-
శాలి సుకృతి వదాన్యుండు చతురమతియు
పండితుండెవ్వడేమి లోపంబు నాకు?

బందుగులు లేక సైనయసంపదలు లేక
సంతసము లేక తగిన వంశంబు లేక
బహుళ దుఃఖాకరంబగు పాడునేల
ఈ యుధిష్టిరు చేత మోయింపుమయ్య.

మిగిలిన భాగాలు ఏవీ ప్రసిద్ధికెక్కినవి కావు. దుర్యోధనుని మరణం, దేవతల పూలవర్షం.

నాటకం అయ్యేటప్పడికీ, తెల్లవారుఝామున కోడికూత వినపడుతుంది. నిద్రపోయిన పిల్లలని బుజాలకెత్తుకొని ప్రేక్షకులందరూ ఆనందంతో ఇంటికి.

ఇవి మరిచిపోకూడని పద్యాలని నా ఉద్దేశం. మీరేమంటారు?

(ఈ మధ్య, షణ్ముఖి ఆంజనేయరాజు గారి కుమారుడు, ఈ నాటకాలని ప్రదర్శిస్తున్నట్టు విన్నాను. మూడు సంవత్సరల క్రితం, విశాఖజిల్లాలో ఒక కుగ్రామంలో, “రాయబారం,” వేస్తున్నారని చూడటానికి వెళ్ళితే, షణ్ముఖి జూనియర్ గారి కారు పాడయి, ఆయన రాలేక పోయారు. స్థానికంగా ఉన్న ఒక కుర్రాడు కృష్ణుడి వేషం వేశాడు! అతను బాగా పద్యాలు పాడలేకపోయినా, పద్యాలన్నీ విని ఆనందించారు, ఆఊరి జనం!)