శాన్‌ఫ్రాన్‌సిస్కో

ఆ నగరానికి
అప్పుడప్పుడొచ్చే సూర్యుడు
అందరిలాగే ఒక యాత్రికుడే!
పొరలుగా అల్లుకున్న
మబ్బుతెరలు తోసుకుంటూ
మొదలెట్టిన సుప్రభాత ప్రయాణం
గోధూళి వేళకూ
గమ్యం చేరదన్న అనుభవం
రావాలనే ఉన్నా
రానీయదు!! 

సాగర తీరాన
అదొక మేఘాల స్వేచ్ఛా నగరం –
రివ్వున వీచే గాలుల్లో
నగరానికే కాదు
సూర్యుడికీ చలి పుడుతుంది.
లక్క పిడతల్లా అమర్చిన ఇళ్ళూ
చూరుకు వ్రేలాడే మేఘాలూ
మది తలుపులు తీస్తే
వాకిట నిలిచేది
ఒక భావ ప్రపంచమే!

ప్రకృతి వికృతుల్ని
సమతుల్యంగా మోసే
స్వేచ్ఛ భుజమ్మీద
సప్తవర్ణాల పచ్చబొట్టు
గరం గరం ఈ నగరం!
నువ్వే కాదు,
నీతో పాటు ఇక్కడ చరిత్రా
నీడలా నడుస్తుంది …
వర్తమానపుటద్దంలో
భవిష్యత్తుని ఆవిష్కరిస్తుంది.
కళ్ళకే కాదు
స్పందనకీ ఎర్రరంగు పులిమే గోల్డెన్‌గేట్ వంతెనా –
ఇరుగు పొరుగు నిద్రల గోడల నడుమ
వయ్యారంగా కదిలే
స్వప్నాల కేబుల్ కార్లు –
చిత్రకారుల కుంచె జార్చిన
ఆర్ట్ గ్యాలరీలు –
విజ్ఞానం మేధస్సులోంచి
ఉబికొచ్చిన మ్యూజియంలు –
కళ్ళను కావలించుకునే బీచ్‌లు –
కన్నెత్తి చూస్తే నింగిని ముద్దాడే హర్మ్యాలు –
ఆకాశం అరచేతిలో చిక్కుకున్న భావనలు –
ఉక్కిరిబిక్కిరి అవుతూ –
వేగంగా పరిగెత్తే ఉత్తేజాల నడుమ
మనసొక మతితప్పిన బాటసారే!
ఒకసారి పాదం మోపితే
ఆకాశంలో మబ్బుకీ
మనసుకీ తేడా ఉండదు.
యాత్రికుడిలా
వచ్చివెళితే
ఇంటికి చేరేది నువ్వొక్కడివే!
మనస్సు మాత్రం
నగరం మూలల్లో
పదే పదే
అనుభూతులు వెతుక్కుంటూ
నిన్ను, కాలాన్నీ
వెనక్కి తోసేస్తుంది
ఆ గుంపులో మేఘమై వర్షిస్తుంది