ప్లే స్టేషన్

అమెరికా వచ్చిన కొత్తల్లో ఉద్యోగంలో నిలదొక్కుకోవడంలో పడి అంతగా పట్టించుకోని విషయం ఒకటి ఈమధ్య లాం (గోపాలం) మనసుని వేధిస్తోంది. దానిక్కారణం పిల్లలు పెరుగుతూంటే మనసులో పుట్టే గుబులూ, వయసు పెరగడంవల్ల వచ్చే భయం, అంటాన్నేను. “కాదు, మెచూరిటీ” అంటాడు వాడు. కారణం ఏదయితేనేం పిల్లలకి ఇండియన్‌ కల్చర్‌ అబ్బటల్లేదనేది వాడి బాధ.

“లేడికి లేచిందే పరుగ”న్నట్టు, వెంటనే న్యూ ఇయర్‌ రిజొల్యూషన్‌ తీసేసుకుని, వచ్చీరాని స్లోకాలూ పజ్యాలూ, వాళ్ళమ్మాయి మోదాకీ, అబ్బాయి సాధూకీ రోజూ పడుకునేముందు నేర్పడం కార్యక్రమంగా మొదలెట్టాడు. పిల్లలు రెండు రోజులు భరించారు.. తర్వాత “బోర్‌ ” అన్నారు.. తండ్రి విక్రమార్కుడని గ్రహించి, అతగాడు బెడ్రూం లోకి వచ్చేలోపులోనే నిద్రపోవడం మొదలెట్టారు. తన సొంత కల్చర్లో ఇలా పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చే మత్తుమందు ఉందని ఒప్పుకోలేక పోయాడు లాం.

ఎంతయినా, ఆంధ్రా నుంచి అమెరికాకి వచ్చిన మేధావిగదా.. తీరికగా ఆలోచించి.. తెలుగు కల్చరల్‌ అసోసియేషన్లో చేరి ఉధృతంగా పనిచేయడం మొదలెట్టాడు. కల్చర్‌ బాధితుల సంఘంలో ఉన్న సీనియర్‌ సభ్యుల ఉచిత సలహాల ద్వారా ఉపదేశం పొందాడు. కల్చరల్‌ ప్రోగ్రాముల్లో పిల్లల్ని ముంచి తేల్చాడు. ఫలితం కనిపించలేదు; ఇంక ఇలా కాదని, సిటీలో ఉన్న నాలాయిరమ్‌ పిల్లే దగ్గర కర్ణాటక సంగీతంలో గాత్రం నేర్పించడానికి ఏర్పాట్లు చేసాడు. అయితే వాళ్ళ భయంకర గాత్రసౌలభ్యానికి తనే భయపడబోయి సద్దుకున్నాడు… పట్టు మాత్రం వదల్లేదు.

నాలుగు నెలల తర్వాత ఒక రోజు స్కూల్నుంచి వచ్చిన నోట్‌ చూసి మాత్రం భయపడ్డాడు. సాధుకి వాయిస్‌ తెరపీ ఇప్పించాలని వాళ్ళ స్కూల్‌ నర్స్‌ ఉచిత సలహా.. ఎబ్యూజ్‌ ఆఫ్‌ వాయిస్‌ అంటూ వ్యాఖ్య.. ఇదే అదనని లాం పెళ్ళాం, “తిరుగుళ్ళు తిరగలేక ఛస్తున్నా..ఇద్దర్నీ మాన్పించెయ్యండ”ని పట్టుబట్టింది.

దిక్కుతోచని లాం తన బాల్య మిత్రుడు దివాకరాన్ని కలిసినప్పుడు పై కధంతా చెప్పుకుని బాధపడ్డాడు.

దివాకరం బొబ్బట్లలో నెయ్యి నంజుకుంటూ “ఇదే మన కల్చర్‌ . హాయిగా ఇవన్నీ తినిపించు.. ఎంజాయ్‌ చేసీస్తారు” రెచ్చగొడుతున్నట్టుగా అన్నాడు నోటినిండా బొబ్బట్టుతో.

లాంకి చిర్రెత్తుకొచ్చింది.

“మీనాన్న సం స్కృతం నేర్పుదామని రామ శబ్దం మొదలెట్టగానే ఆమదం ముఖం పెట్టలేదూ నువ్వూ” ఎత్తిపొడిచాడు బొబ్బట్టు పూర్తి చేస్తూ.

లాం ముఖం ఎర్రబడింది. “అదంతా డెడ్‌ లాంగ్వేజీ,డెడ్‌ కల్చరూరా! నా మీద రుద్దుదామని చూసారు” విసుగ్గా అన్నాడు.
అమెరికా వచ్చిన మేధావిగద.. అమ్మానాన్నల్ని విశ్లేషించడం అలవాటు చేసుకున్నాడు.

“నీ సొద నీ పిల్లలకీ అలాంటిదే” రెండో ప్లేట్లో గారె చేత్తోపట్టుకుని “ఇదే అసలయిన లివింగు కల్చరు” అంటూ అల్లప్పచ్చడిలో ముంచాడు దివాకరం.

ఇంతలో అక్కడికి వాళ్ళ ఫ్రెండు సాజిద్‌ అవతరించాడు “ఏందయ్యోయ్‌! అలా మోటుగాడిదత్తనం చేస్తూండారు?” అంటూ..

“మరి మన కల్చర్‌ ఎలా నేర్పాల్రా వీళ్ళకీ?” గింజుకున్నాడు లాం, సాజిద్‌ కామెంట్‌ పట్టించుకోకుండా.

“ఏ భజన సంఘానికో పంపరా! దేవుణ్ణి ధ్యానిస్తూంటే మన కల్చర్‌ అదే తెలుస్తుంది.. అందరూ స్నాక్స్‌ తినండోయ్‌ .. చల్లారిపోగలవు” వార్నింగ్‌ ఇచ్చాడు దివాకరం.

“గట్టాయితే నీ పోరగాండ్లకీ, నా పోరగాండ్లకీ కల్చర్‌ వేరవుతది కదా..” సాజిద్‌ అందుకున్నాడు.”మరి భారతీయ సంస్కృతి ఏంది బే! ముక్కలు ముక్కలు లెక్కలున్నది?.. యూనిటీ ఏది?”

రకరకాల యాసల్లో మాట్లాడ్డం వాడికో సరదా.

“కల్చర్‌ అంటే రెలిజియన్‌ కాదు” పెద్ద పాయింట్లా చెప్పాడు లాం.

అంతవరకూ సరదాగా మాట్లాడుతున్న దివాకరానికి తిక్కరేగింది. “మరేంట్రా! ఇందాకణ్ణించీ చూస్తున్నా. కల్చర్‌ .. కల్చర్‌ అంటూ ఊహూ..తెగ రెచ్చిపోతున్నావ్‌. మనం చిన్నప్పుడు గుడి ముఖం, పూజ పేరూ ఎరగం.. కాని మన పిల్లలు మహాభక్తులై పోవాలి. మనమొక డాన్సు చెయ్యలేదు, సంగీతప్పాట పాడలేదు.. కాని మనవాళ్ళన్నీ చేసీయ్యాలి. మనకి తీరని కోరికలన్నీ వాళ్ళమీద రుద్దీయ్యాలి.. మనం ఇండియాలో దిగ్గానే ఇంగ్లీషులో పోజులు కొట్టీయాలి, మన పిల్లలు మాత్రం తెలుగులో మాట్లాడీయ్యాలి. ఒరేయ్‌ నాన్నా.. మనం ఇండియాలో నేర్చుకున్నది, భోం చెయ్యడం, చదువుకోవడం, గిల్లీ దండా, గోళీకాయ్‌ ఆడ్డం, సినేమాలు చూడ్డం.. అంతే..అవి నేర్పించీ.. చాలు”

బిత్తరపోయిన లాం సాజిద్‌ వంక చూసాడు తనకేమైనా సపోర్ట్‌ చేస్తాడేమోనని.

“సారీ బ్రదరూ! మీరిద్దరూ కొట్టుకోండి. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడూ పరాయి కల్చర్‌ లో ఉన్నట్టే ఉంది.. ఇప్పుడు కూడా అంతే. హైదరాబాద్‌ లోనో, లక్నోలోనో పెరిగితే మీలాగే బాధపడేవాణ్ణేమో..” పచ్చి తెలుగులోకి వచ్చేసి బొబ్బట్టుమీద లంఘిస్తున్నాడు వాడు.

మనసు కలుక్కుమని తల అడ్డంగా ఊపాడు లాం.

దివాకరానికి ఇంకా పూనకం తగ్గలేదు. “నీ పిల్లల్ని చెయ్యమన్నవేమీ నువ్వు చెయ్యలేదు గాబట్టి, నీక్కల్చర్‌ లేదని ఒప్పీసుకో.. ఇంక పిల్లలికి నేర్పాల్సిన పనుండదు.. సింపులూ..” వాడి తిండిమూడ్‌ చెడగొడితే వాడు మనిషి కాడు.

కాస్త వాతావరణం చల్లబడ్డాక సాజిద్‌ అనునయిస్తూ అన్నాడు. “అసలీ దేశం రావడమన్నది మన చాయిస్‌. మన పిల్లల్ది కాదు.. వాళ్ళెందుకు సఫర్‌ అవాలి? మనం వాళ్ళని ప్రేమగా చూస్తే చాలు.. వాళ్ళకే ఏదో రోజున మన గురించీ, మన కల్చర్‌ గురించీ తెలుసుకోవాలని అనిపిస్తుంది. వాళ్ళంతటవాళ్ళే అడిగి తెలుసుకుంటారు. ఏ భాషలో నేర్చుకున్నారన్నది ముఖ్యం కాదుగా! మాంఛి నాస్తా తింటూ మూడ్‌ చెడగొట్టుకోకు” గారెల ప్లేట్‌ ముందుకు తోసాడు.

పైన స్పోర్స్ట్‌ రూంలో పిల్లలంతా గారెలు తింటూ విడియో గేమ్స్‌ ఆడుకుంటున్నారు అదే వాళ్ళ ప్రపంచమన్నట్టు.

రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...