వాయులీనమవుతూ….

లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం
జలపాతం వెనక్కి మళ్ళుతుంది లోపల్లోపల.
యెక్కడెక్కడోఅ చెవులు మొలుచుకొచ్చి
దేహమంతా వొక పక్షి ఈక.
అప్పుడింక చూడాలీ వినాలీ
గాలి అలలు
విరుగుతున్న చప్పుళ్ళని.

2

బయటి రోడ్డు మీద
ఉక్కుపాదం
గాలిదేహాన్ని తొక్కేస్తుంది.
రెండు పెదాల్నీ కలిపికుట్టేస్తుంది
తుపాకి భాష ఎక్కడైనా ఎప్పుడైనా
అదే…

ఊపిరిపీల్చడం నేరం
తన చప్పుళ్ళే మార్మోగాలి
చెట్లకి చిగుర్లు పుడితే నేరం
ఆకుపచ్చగా విచ్చుకుంటే శిక్ష.
చివరికన్నీ ఇనపగజ్జెలే కావాలి
ఇనపమాటలే వినిపించాలి.

అప్పుడింక
వయొలిన్‌ లోపలి ధ్యానానికి
తుపాను భాషనేర్పుతుంది
దాచేసిన నిప్పంతా
సుతిమెత్తని కమానులోంచి
కార్చిచ్చు.

ఎంత చిత్రం!
వయొలిన్‌ నినాదమవుతుంది
వసంతం గర్జిస్తుంది!

(రెండు సింఫనీల అనుభవం తర్వాత వొకటి మామూలుగానే బీతోవెన్‌ది. రెండోది స్టాలిన్‌ కాలంలో వసంతమేఘాల మీదుగా తిరుగుబాటుని ఆలాపించిన వయొలిన్‌.)


అఫ్సర్

రచయిత అఫ్సర్ గురించి:

కవి, విమర్శకుడు, రచయిత, సీనియర్ ఉపన్యాసకుడు అఫ్సర్ కు బాల్యం నుండి సాహిత్యవాతావరణంలో పెరగటం వల్ల కవిత్వం పట్ల మక్కువ ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి బి.ఏ. గోల్డ్ మెడల్‌తో ఉత్తీర్ణుడయ్యారు. తులనాత్మక సాహిత్యంలో ఎం.ఏ చేశారు. “ఆధునిక కవిత్వము తెలంగాణా నేపథ్యం” అనే విషయంపై పి.హెచ్.డి చేశాడు. అమెరికా లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి 2010లో Following the Saint: Devotion and Public Religious Performances in South India అనే అంశం పై పరిశోధించి డాక్టరేట్ సంపాదించారు. అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీలలో దక్షిణాసియా సాహిత్య సంస్కృతుల సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, భారత ప్రభుత్వంనుండి సరస్వతీ భాషాసమ్మాన్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. సారంగ సాహిత్య పక్ష పత్రికకు సారథ్యం వహిస్తున్నారు.

 ...