Yippee! I’m a poet, and I know it

Yippee! I’m a poet, and I know it
Hope I don’t blow it.

అని బాబ్ డిలన్ I shall be Free No 10 అన్న పాటలో అంటాడు. డిలన్‌ని, నువ్వు పాటకుడివా? కవివా? అని విలేఖకులు, విమర్శకులు, సమీక్షకులూ అడిగినప్పుడు, రకరకాల సందర్భాలలో రకరకాల సమాధానాలిచ్చాడు. అది సాహితీ విమర్శకలోకంలో కొంత కలకలం పుట్టించిన మాట నిజమే!

1963లో విడుదల చేసిన రెండవ ఆల్బమ్‌తో (The Free Wheelin’ Bob Dylan) ఇచ్చిన నోట్సులో ఇలా చెప్తాడు: Anything I can sing, I call a song. Anything I can’t sing, I call a poem. (ఏదయితే నేను పాడగలనో దానిని పాట అంటాను; ఏదయితే నేను పాడలేనో దానిని కవిత అంటాను.)

ఈ వాక్యం నాకెంతో ఇష్టం. ‘ఎందుకో చెప్పు?’ అని నన్ను అడిగితే నా దగ్గిర సరైన సమాధానం లేదు.

డిలన్ ఇచ్చిన సమాధానాలని మరొక కోణం నుంచి పరిశీలిస్తే, డిలన్ కావాలనే అటువంటి సమాధానాలు ఇచ్చి ఉండవచ్చునని నేను అనుకుంటుంటాను. కారణం: విలేఖకులన్నా విమర్శకులన్నా డిలన్‌కి వల్లమాలిన విసుగు; కోపం. 1965లో ఇంగ్లండ్‌లో ఒక విలేఖకుడు, ‘నువ్వు ఏ విషయాల గురించి పాడుతున్నావో, వాటిని గురించి ఆలోచించే పాడుతున్నావా?’ అని ఆలోచించకండా అడిన ప్రశ్నకి డిలన్ ఇలా సమాధానం ఇచ్చాడు: ‘నిజంగానే నువ్వు అతిసాహసం చేసి ఈ ప్రశ్న అడుగుతున్నావు. ఇదే ప్రశ్న నువ్వు బీటిల్స్‌ని అడుగుతావా?’

1964 లోనే The Times They Are A-Changin అన్న మకుటంతో విడుదలైన పాటలో సాహితీ భాష్యకారులని ఆహ్వానిస్తూ ఒక హెచ్చరిక నిస్తాడు డిలన్: Come writers and critics who prophesize with your pen… Don’t criticize what you can’t understand. (మీ రాతలతో సోదె చెప్పే రచయితలూ, విమర్శకులూ, రండి, రండి. మీకు అర్థం కానిదాన్ని విమర్శించకండి.)

1996లో మొదటిసారి డిలన్‌ పేరుని నోబెల్ బహుమతికి ప్రతిపాదించారు. అప్పటినుంచీ ప్రతి సంవత్సరం అతన్ని నామినేట్ చెయ్యటం, దానితోపాటు ఈ ప్రశ్న ఉద్భవించటం ఆనవాయితీ అయ్యింది. ఈ వివాదం — డిలన్ పాటకుడా, కవా? — 2004 నుంచీ మరీ ఉధృతం అయ్యింది. ఎందుకంటే, సుమారు అదే సమయంలోనే డిలన్ గురించి ఐదు పుస్తకాలు ఒకేసారి విడుదలైనాయి. ఇదంతా ఏదో కుమ్మక్కు అని విమర్శకులు భ్రమపడటానికి ఆధారం అని అనుమానించడంలో తప్పు లేదేమో!

ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ క్రిస్టఫర్ రిక్స్ (Christopher Ricks) రాసిన డిలన్స్ విజన్స్ ఆఫ్ సిన్ (Dylan’s Visions of Sin) అనే ఐదువందల పేజీల పైచిలుకు పుస్తకం, లిరిక్స్ (Lyrics: 1962-2001) అన్న పేరుతో డిలన్ పాటల పుస్తకం, క్రానికల్స్ (Chronicles) అన్న మకుటంతో డిలన్ ఆత్మకథ – మొదటి భాగం, బాబ్ డిలన్ ఎన్‌సైక్లోపీడియా (Bob Dylan Encyclopedia) అనే ఏడువందల పేజీల పైచిలుకు మరొక పుస్తకం, ఇవన్నీ విడుదలైనాయి. వాటికి తోడుగా, గిన్స్‌బర్గ్ (Allen Ginsberg), కరోల్ ఓట్స్ (Joyce Carol Oates), రిక్ మూడీ (Rick Moody), బ్యారీ హానా (Barry Hannah) డిలన్ గురించి, డిలన్ పాటల/కవితల గురించీ పొందుపరచిన వ్యాస సంకలనం! 2006 అమెజాన్ వెబ్‌సైట్‌లో సుమారు నాలుగు వందల పుస్తకాలు – డిలన్ రాసినవి, డిలన్‌పై వచ్చినవీ – ఉన్నాయి.

పాటలో కవిత్వం ఉండటానికి ఏవిధమైన అభ్యంతరమూ ఉండదు. ఉండకూడదు. ముఖ్యంగా మౌఖికసాహిత్యంతో చక్కని పరిచయం ఉన్న తెలుగు పాఠకులకి ఈ విషయం మరీ మరీ చెప్పక్కరలేదు. అయితే, కవిత అని ‘నిర్వచించబడిన’ రచనలో పాట ఉండకపోవచ్చు. అంటే కవితలన్నీ పైకి గొంతెత్తి పాడటానికి, కంఠస్థం చెయ్యడానికీ అనువుగా ఉండక పోవచ్చు నని నా అభిప్రాయం. ఏకాంతంగా కూచొని చదువుకోటానికి పద్యం, కవిత అని మనకి అచ్చుయంత్రం వచ్చిన తరువాత మరీ ప్రబలం అయ్యిందనుకుంటాను. అందుకనే కాబోలు, అచ్చులో డిలన్ పాటలు చూస్తే, ఇందులో కవిత్వం ఎక్కడ ఉన్నది? అన్న ప్రశ్న రావటానికి అవకాశం లేకపోలేదు. అందుకు ఒక కారణం: ఆధునిక లిఖిత సంస్కృతి.

ఆఖరిగా డిలన్ కవి కాదనే ఆరోపణ లేదా కవి అవునా, కాదా? అన్న చర్చ, కవిత్వానికి విశ్వవిద్యాలయాలలో విద్యావేత్తలు అంగీకరించిన లక్షణ పరిధిలో కాకుండా, డిలన్ మాధ్యమం – అంటే పాట కుండే లక్షణాలతో కవితాలక్షణాలని పొందుపరిచి, పాశ్చాత్యవిమర్శకులు పరామర్శించడం మొదలు పెట్టవలసిన అవసరం ఉన్నది. అంటే, డిలన్ రాతల గురించి రాసేటప్పుడు మూడు విషయాలు చూడాలి. మాటలు, సంగీతం, గొంతు.

2.

బాబ్ డిలన్ అసలు పేరు రాబర్ట్ జిమర్‌మన్ (Robert Allen Zimmerman). డులుత్, మినెసోటాలో మే 24, 1941న జన్మించాడు. పుట్టుకతో యూదుడు. డబ్బున్న కుటుంబం. తరువాత ద్విజుడు (born-again Christian) అయ్యాడు. డిలన్ థామస్ (Dylan Thomas, 1914- 1953) అనే వెల్ష్ కవి అంటే ఇష్టం. అందుకని అతని పేరు పెట్టుకున్నాడు.

డిలన్ మీద ఉడీ గత్రీ (Woodie Guthrie) అనే ప్రఖ్యాత జానపద పాటకుడి ప్రభావం ఉన్నదని అందరికీ తెలుసు. డిలన్ గత్రీని ప్రశంసిస్తూ రెండు పాటలు తన మొట్టమొదటి ఆల్బమ్‌లో రాశాడు (Song to Woody, Talking New York). గత్రీ రాసిన గీతం, ఈ నేల నీది (This land Is Your Land) చాలా ప్రసిద్ధికెక్కిన జానపద గీతం. అమెరికాలో అభ్యుదయవాదులు ఈ గీతాన్ని రెండవ జాతీయ గీతంగా గుర్తిస్తారు. భారతదేశంలో వందేమాతర గీతం లాగా! ఈ పాట ఒబామా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో పీట్ సీగర్ (Pete Seeger), బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ (Bruce Springstein), ఇద్దరూ పాడారు. (యూట్యూబ్‌లో.)

ఛాల్స్ సీగర్, పీట్ సీగర్, జాన్ లోమాక్స్, ఆలన్ లోమాక్స్ (Charles Seeger, Pete Seeger, John Lomax, Alan Lomax) మొదలైన పాటకులు ఉగ్రవాద వామపక్షీయులు. జానపద సంగీతం సామాజిక విప్లవాన్ని పురికొల్పగలదని ధృఢంగా నమ్మిన వాళ్ళు. డిలన్ సాహిత్యంపై వీళ్ళ ప్రభావం కొన్ని నిరసన గీతాల వరకే పరిమితం. ఆ నిరసన గీతాలే ఏరి డిలన్ సంగీతాన్ని, సాహిత్యాన్ని పొగడటం, లేదా తెగడటం — ఈ రెండూ సరికాదు. డిలన్ పాటలపై నిజమైన ప్రభావం చూపింది హ్యారీ స్మిత్ (Harry Smith) ప్రచురించిన ఆంథాలజీ (Anthology of American Folk Music, 1952). డిలన్ ఇందులో పొందుపరిచిన పాటలని 1959 లోనే విన్నాడు. ఈ సంకలనంలో అమెరికన్ జానపద సంగీతం, జానపద సంగీత సాంఘిక చరిత్ర డిలన్‌ని ఎలా ప్రభావితం చేశాయో వివరంగా డిలన్ గురించి గ్రెయ్‌ల్ మార్కస్ (Greil Marcus) రాసిన పుస్తకంలో (Bob Dylan: Writings 1968 – 2010) చదవవచ్చు.

రేడియోలో ప్రసారమవుతున్న రాక్–ఎన్-రోల్ సంగీతం సామాజిక జీవనానికి ప్రతిబింబం కాదని ఎల్లా తెలుసుకున్నాడో అల్లాగే 1960 చివరిభాగంలో సైద్ధాంతిక వామపక్ష రాజకీయాలతో ముడిపడిన జానపద గీతాలు కేవలం ప్రచార సంగీతంగా తేల్చుకొని, ఆ పరిధి నుంచి బయటకి రాగలిగాడు. అయితే, సమాజగతికి నిరనురక్తుడై, అశాంతితో కలత చెంది రాసిన చాలా నిరసనగీతాలు 1960-1965లో రాసినవే!

3.

ఈ వ్యాసంలో డిలన్ పాడిన/రాసిన ‘పాటలు’ కొన్ని తీసుకొని వాటిని గురించి ముచ్చటిస్తాను. ఇందులో కొన్ని పాటలు ప్రపంచ ప్రసిద్ధికెక్కినవి. కొన్నింటికి జాతీయగీతాల స్థాయి వచ్చింది. మరికొన్ని పాటలు డిలన్ డిస్కులు రోజూ వినే వారికే గుర్తుకి రాకపోవచ్చు. ఇదేమీ వింత విషయం కాదు. డిలన్ సుమారు ఐదువందల పైచిలుకు పాటలు రాసి పెట్టాడు. వాటి నుంచి ఎంపిక తేలిక కాదని చెప్పనక్కరలేదు.

డిలన్ రాసిన మొట్టమొదటి నిరసన గీతం (Protest song) ది డెత్ ఆఫ్ ఎమెట్ టిల్ (The Death of Emmett Till). 1955 మిసిసిపీలో, ఎమెట్ టిల్ అనే పధ్నాలుగు సంవత్సరాల వయసున్న ఆఫ్రికన్ అమెరికన్ కుర్రవాడిని, తెల్ల ఆడపిల్లను చూసి ఈల వేసిన కారణంగా – కొట్టి, కాల్చి చంపారు. తరువాత రాసిన పాట జాన్ బార్చ్ సంఘం గురించి (Talkin’ John Birch Society Blues) తీవ్ర మితవాద (extreme right-wing) సంఘం వారిని వేళాకోళం చేస్తూ రాసిన పాట. 1963లో ఎడ్ సలివన్ టీ.వీ. షోలో (Ed Sullivan show) ఈ పాట పాడటానికి వీలులేదని టీ.వీ. నిర్వాహకులు అభ్యంతరం చెపితే, రిహార్సల్ నుంచి డిలన్ వెళ్ళిపోయాడు.

మరొక పాట, ఆక్స్‌ఫర్డ్ టౌన్ (Oxford Town). జేమ్స్ మెరిడిత్ (James Meredith) నల్ల విద్యార్థి. మొట్టమొదటి సారి ఒక నల్ల విద్యార్థికి మిసిసిపి విశ్వవిద్యాలయంలో చదువుకోవటానికి అనుమతి ఇచ్చిన కారణంగా జరిగిన అల్లరులపై రాసిన పాట. ఇటువంటి నిరసన గీతాలు చాలా ఉన్నాయి కాని, వాటిలో ప్రపంచ ప్రసిద్ధికెక్కిన గీతాలు రెండు: అవి వరుసగా: Only A Pawn in Their Game, The Lonesome Death of Hattie Carroll. ఈ రెండింటిలోనూ నల్లజాతి వ్యక్తిని హత్య చేసిన నేరానికి డిలన్ చూపిన కోపం, కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. మొదటిగీతం కన్నా రెండవ గీతం గొప్పదని నా ఉద్దేశం. ఎందుకంటే, ఆ గీతంలో కోపం కన్నా, నైతిక ధైర్యం, న్యాయస్థాన ధర్మంపై వ్యంగ్యం, ఆకర్షణీయంగా చిత్రించాడు.

Only A Pawn in Their game చూడండి: మెడ్గర్ ఎవర్స్‌ని (Medgar Evers) పొంచి ఉండి తుపాకీతో కాల్చిన వార్త, పాటలో విశేషం. మెడ్గర్ ఎవర్స్ హత్య అయిన ఒక నెల తరువాత, గ్రీన్‌వుడ్, మిసిసిపీలో మొదటిసారి, డిలన్ ఈ పాట పాడాడు. ఇదే పాట రెండవసారి ఆగస్ట్ 28, 1963న వాషింగ్టన్‌లో మార్టిన్ లూథర్ కింగ్ I have a Dream ఉపన్యాసానికి ముందు పాడాడు.