గత నెల రోజులుగా తెలుగు దినపత్రిక వార్త ఆదివారం సంచికలలో సాహిత్యాన్ని గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ చర్చ “మనకవులు అక్షరాస్యులేనా,” అని గుడిపాటి వేసిన మౌలికమైన ప్రశ్నతో మొదలైంది. దానిమీద వెల్చేరు నారాయణ రావు వివరణ గా ఒక వ్యాసం రాస్తూ మనకవులకి కవిత్వం రాయడానికి ఎటువంటి శిక్షణ వుంటోంది, అంతకన్న ముఖ్యంగా మన విమర్శకులకి విమర్శ రాయడంలో ఎలాటి తరిఫీదు వుంటోంది అన్న విషయాలు ఆలోచించమని కోరారు.
గుడిపాటి, నారాయణరావు రేకెత్తించిన విషయాలమీద ఆలోచనాయుతంగా చర్చజరిగితే చాలా లాభం వుండేది. కాని జరుగుతున్న చర్చల ధోరణి చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఈ రోజుల్లో తెలుగులో చర్చలు, ముఖ్యంగా సాహితీ చర్చలు వ్యక్తి నిందలతోటీ, కొరగాని ఆవేశాలతోటీ, గజిబిజి వాక్యాలతోటీ అంతంకావడం మనకి కొత్త కాదు. కాని, ఈ అసక్తి కరమైన ప్రశ్నలమీద చర్చ అలా కావడం, దురదృష్టమేకాదు, అన్యాయం కూడాను! వ్యక్తి నిందలూ ఆవేశ ప్రకటనలూ ఎవరికీ లాభం చెయ్యవు. ఆలోచనలకి అసలు పనికిరావు. అందుకని, కొన్ని విషయాలలో స్పష్టతకోసం ఇది రాస్తున్నాను.
మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.
మాండలికం లో రాస్తే మంచి కవిత్వం కాదు, శిష్ట భాషలో రాస్తేనే అది మంచి కవిత్వం అవుతుంది అనే వాదం తెలుగు సాహిత్యంలో వెనకబట్టి చాలాకాలం అయింది. It is passé. ఆ వాదాన్ని మళ్ళా పైకి తేవాలని ఈ చర్చలో ఒక ప్రయత్నం జరగడంతో చర్చ మరీ వక్రించి తప్పు దారి పట్టింది. తెలంగాణా భాషలో రాసినా, రాయల సీమ భాషలో రాసినా, ఉత్తరాంధ్ర భాషలో రాసినా, దళిత , వెనుకబడిన కులాల భాషలో రాసినా, ముందున్న కులాల భాషలో రాసినా, రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.
అర్థం: కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.
తెలుగులో ఇప్పుడు వొస్తున్న రకరకాల కవిత్వాలకి అన్నిటికీ ఒకే విమర్శసిద్ధాంతం వర్తించవలసిన అవసరం లేదు. ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ఆ విషయం దూరంనించి చూస్తున్న మాకు స్పష్టంగానే తెలుస్తోంది.
అయితే విమర్శల్లో ఏది మంచిది, సమర్థ మైనది, ఏది అనవసరపు ఆవేశాలతోనూ, ఊకదంపుగా గజిబిజి వాక్యాలతోనూ నిండిన అసమర్థ విమర్శ అన్న సంగతి ఆయాకవితా రంగాల్లో వున్న విమర్శకులే చెప్పాలి. తమ విమర్శకులకి కావలసిన తరిఫీదు ఎలా వుండాలో వాళ్ళే నిర్ణయించాలి.
తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.
ప్రపంచం చిన్నదవుతోంది. ఈ ప్రపంచంలో మారుమూల ప్రాంతాలు లేవు, పట్టుదలవున్నవాళ్ళ కి అందుబాటులో లేని భాషలు లేవు. ప్రయత్నిస్తే దొరకని పుస్తకాలు లేవు. తెలంగాణాలో అచ్చయిన పుస్తకం అరునెలలు దాటే సరికి — మిగతా దేశాల సంగతి నాకు తెలియదు కాని — అమెరికాలో తెలుగు పుస్తకాలు కొనే విశ్వవిద్యాలయాల గ్రంధాలయాల్లోదొరుకుతోంది. అంతే కాదు. ఆసక్తి ఉన్న వ్యక్తులు పనికట్టుకొని అక్కడ అచ్చైన ప్రతి పుస్తకం తెప్పించుకోవడం నేను ఎరుగుదును. పోతే, పత్రికలు ఇంటర్నెట్ లో ఏరోజుకారోజు చదువుకోడానికి వీలవుతోంది. తెలుగులో వొచ్చే రకరకాల వెబ్ సైట్ లలో వొచ్చే వ్యాసాలూ, విమర్శలూ సులభంగా అందుతున్నాయి. ప్ర పంచ కవిత్వ సంకలనాలలో తెలుగు కవిత్వం కనిపిస్తోంది. తెలుగు పూర్వంలాగా పేరుతెలియని మారుమూల భాష కాదు. అది ప్రపంచ భాషగా ఎదుగుతోంది. మేం కోరుకునేంత వేగంగా కాకపోయినా, నెమ్మదిగా అయినా ఎదుగుతోంది.
ఈ ఎదుగుదలని గమనించి, దానికి తోడ్పడగల శక్తి తెలుగులో రాస్తున్న కవుల చేతుల్లోనూ, విమర్శకుల చేతుల్లోనూ వుంది. కవిత్వానికీ, విమర్శకీ వాళ్ళు ఏర్పరిచే ప్రమాణాలు ప్రపంచస్థాయికి చేరుకోవాలని మా కోరిక.
తెలుగు సాహిత్యాన్ని పరిశీలనగాచూస్తున్న వాళ్ళు — అమెరికాలో — ఎక్కువమంది లేకపోయినా – కొద్ది మందైనా వున్నారు. అందులో తెలుగువాళ్ళూ, తెలుగు నేర్చుకున్న అమెరికన్లూ, ఇతర దేశాల వాళ్ళూ ఉన్నారు. వాళ్ళు చాలా విషయాలు చదువుతున్నారు. ఒకరికి తెలియని సంగతులు మరొకర్ని అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగు దేశంలో వున్నవాళ్ళతో సహా వాళ్ళు చాలా మందితో చర్చిస్తున్నారు. కొత్తసమాచారం దొరికినప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇందులో కొందరు ఎంత జాగ్రత్తగా తెలుగు సాహిత్య చర్చలు గమనిస్తున్నారో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. గత వారం, 27 ఆగష్టు వార్తలో తెలుగు కవులు అక్ష రాస్యులేనా అనే ప్రశ్న మీద జరుగుతున్న చర్చలో భాగంగా కాసుల ప్రతాపరెడ్డి రాసిన వ్యాసం ఇక్కడ కొందరు చదివారు. చివరి పేరాలో ఒక వాక్యం తమకి బోధపడలేదనీ, తాము నేర్చుకున్నతెలుగు వ్యాకరణం ప్రకారం అన్వయం కుదరడం లేదనీ వాళ్ళు నాకు ఆ వాక్యాన్నిచూపించారు. ఆ వాక్యం ఇది.
“తెలుగు సాహిత్యం లో ఎవరు కూడా తమ తమ అభిప్రాయాలకు జీవితాంతం కట్టుబడి వుంటారని, చర్చల వల్ల కొంతమందైనా పునరాలోచనలో పడతారని నేను భావించడం లేదు.”
సదరు వాక్యానికి నేను అన్వయం చెప్పలేకపోయాను.