దమయంతమ్మ గారు వాళ్ళ బన్నీ, ఆపగాడు, ఎలుమంతి శంకర్రావు, చంటి, రవణ మేష్టారి కాశీపతి, బూతుల కిష్టప్ప, గాజుల మామ్మ గారింటికి సునాబేడ నుండి సెలవులకి వచ్చిన పిల్లలిద్దరు, మల్లిబాబు, విజయ్ ; చర్చి వీధి నుండి ఏపీపీ గారి పిల్లలు. మిట్ట మధ్యాన్నం కరెంట్ స్థంభం గట్టుకి సుద్దముక్కతో మూడు వికెట్లు గీసుకుని బాల్ కి రెడీ అవుతున్నారు. ఆపగాడు వీధిలోని బుగ్గి చేతిలోకి తీసుకుని కార్క్‌బాల్‌ని బుగ్గిచేతుల్లో కస కస కసా తిప్పి గాల్లోకి విసిరి కేచ్ పట్టుకున్నాడు. బన్నీబాబు కేప్‌ని స్టైల్‌గా వెనక్కి తిప్పి పెట్టుకుని చూయింగ్‌గమ్‌తో పెద్ద బుంగ చేసి పేల్చి మిడాన్‌లో ఎలర్ట్‌గా నిలబడ్డాడు. బూతుల కిష్టప్ప గాడు బేట్‌ని నేలకేసి తడుతూ కాళ్ళు దువ్వుతూ “రాబే … నీయబా … బేగిరారా …” అని ఎండలోకి కళ్ళు చిట్లించుకున్నాడు. గాజుల మామ్మ గారి జాబిరీ అరుగు మీద విజయ్‌గాడు వెస్ చీకటం ఆపి అంపైర్‌కి ఉండే సహజమైన అథార్టీతో “ఎయ్యిరా ఆపా ఓ గుగ్లీ … ఈడి జీ ఒదిలిపోవాలి..” అని రెచ్చగొట్టేడు. మిడాఫ్‌లో కాశీపతిగాడు “ఒరే అంపైరూ.. నువ్వే ఇలాగ సైడ్‌లు తీస్తే ఇంకేట్రా బాబూ” అని అబ్జెక్ట్ చేసేడు. ప్లేయర్లందరూ ఎండ పడకుండా మొహాలు దించుకుని అటెన్‌షన్‌లో నిలబడ్డారు.
ఆపగాడు నిర్లక్ష్యంగా వెనక్కి తిరిగి ఇళ్ళు దాటుకుంటూ వీధి మెయిన్‌రోడ్‌ని కలిసే ‘సెంటర్’ వరకూ నిదానంగా నడిచి చటుక్కున ఇటుతిరిగి బాల్ చేతిలో వెనక దాచుకుని జోరుగా పరుగెట్టుకుంటూ వచ్చి వికెట్ (కరంట్ స్థంభమ్) దగ్గర ఆగి స్టైల్‌గా పక్కకి స్టెప్ చేసి బాల్ రిలీజ్ చేసేడు. ఆ బంతి మరీ ఎత్తుగా గాల్లోకి లేచి ఎదురు కరెంట్ స్థంభానికి టంగ్‌మని తగిలి పరాంకుశం నాయుడు గారి పెంకుటింటి మీదకి దిగి ఒక పెంకు విరగ్గొట్టి, దమయంతమ్మ గారు వాళ్ళింటి ముందు కొళాయి నీళ్ళ కోసం తవ్వించిన గొయ్యిలో పడి ఊరుకుంది. అందరూ గొల్లుమని నవ్వేరు. బూతుల కిష్టప్ప గాడు విజయ్‌కేసి తిరిగి ‘వాటీస్ దిస్ నాన్‌సెన్స్, అంపైర్?’ అన్నాడు. ఆపగాడు గోతిలోంచి బంతి తీసుకుని క్రీజ్ దగ్గర నిలబడి తప్పు దిద్దుకుంటున్నట్టు కాళీ చేత్తో గాల్లోకి బౌల్ చేసేడు. వికెట్ కీపర్ శంకర్రావు విసురుగా ఆపగాడి చేతిలో బంతి లాక్కుని “సాల్లే నీ ఎచ్చులు! ఇంక దయచెయ్యి..” అన్నాడు. కాశీపతి ఆశగా చూసి “ఒరే శంకా! నీను బే బౌలింగ్?!” అన్నాడు. శంకర్రావు ఆ మాటలు పట్టించుకోకుండా బౌలింగ్‌కి రడీ అవుతుంటే పరాంకుశం నాయుడు గారి కోడలు కోపంగా కిటికీలోంచి చూసి “ఏం శంకరు? ఎందుకలాగ ఎర్రటెండలోన సచ్చిపోతన్నారు? తిన్నగుండలేకా … ఏం మీ ఇళ్ళమీద ఆడుకోండి ముండా కిరికిట్టు!” అని అరిచింది. శంకర్రావు బాల్ వెనక్కి దాచుకుని పెద్దమనిషి తరహాగా మొహం పెట్టుకుని “అచ్చీ, మేం కాదాంటీ ..” అనీసీడు. ఆవిడ విసురుగా కిటికీ తలుపేసుకుంది. ఎదురుగా అరుగు మీద నవుడూరు మామ్మగారు, పాల పద్మ, విశాలం గారు తీరుబాటుగా కూర్చుని ఆట చూస్తున్నారు, నవ్వు మొఖాలు పెట్టుకుని.
బేటు, గ్లవ్స్ బన్నీ బాబువి. కార్క్ బాల్ ఎలుమంతి శంకర్రావుది. ఆపగాడు మంచి స్పిన్ బౌలర్ గాని ఈ విషయంలో వాడికి లెగప్పులు ఎక్కువైపోయి గీరలోకి దిగుతోంది. బంతి ఓనర్ కాబట్టి శంకర్రావు వాడ్ని ఎదిరించి బౌలింగ్కి రడీ అవుతున్నాడు. ప్లేయర్స్ అసహనంగా పొజిషన్స్‌లో సర్దుకున్నారు మళ్ళీ. విశాలం గారు ఊరుకోకుండా “ఇదుగో కిష్టప్పా! ఎంతసేపూ నువ్వేనేవిటివయ్యా బేటింగు? మా కాశీపతికి ఇవ్వరా బేటింగు” అని దబాయించింది. కాశీపతిగాడు సిగ్గుతో రైజైపోయి “అబ్బా! నువ్వెళ్ళే అసలు, ఎహే …!” అని చికాకు పడిపోయేడు.
ఇంక ఆలస్యం చెయ్యకుండా శంకర్రావు మూడే అడుగులు వెనక్కేసి ముందుకొచ్చి సడన్‌గా బౌల్ చేసేడు. అది సగం దూరం మర్యాదగా గాల్లో వెళ్ళి నేలమీద పడి స్పిన్స్ తిరుగుతూ బేట్స్‌మన్ ముందే చిన్నరాయిని గుద్దుకుని మళ్ళీ అడుగున్నర గాల్లోకి లేచింది. చంటిగాడు సరదా పడిపోయి “అందుకోరా కిష్టప్పా అంటిపండు!” అని అరిచేడు. కిష్టప్ప గాడు దృష్టంతా బాల్ మీదే ఫోకస్ చేసి సత్తువ తీరా కొడితే ఆ బంతి జువ్వలాగ కరెంట్ తీగల మీంచి లేచి ఇళ్ళూ మేడలూ వరసగా దాటుకుంటూ ఎలుమంచి వాళ్ళ సైకిల్ షాప్ పక్కన పొక్కునూరు వాళ్ళ వీధరుగు మూలలో గుద్దుకుని ఆగింది. అక్కడ్నించి వెంటనే
“అమ్మో… నంజికోళ్ళు సంపీసేర్రో..” అని కేక వినబడ్డాది.
విశాలం గారు, నవుడూరు మామ్మ గారు అబ్బురంగా నిలబడిపోయి వీధి చివరికి తొంగి చూసి “అయ్యో! ఎవర్రా పాపం .. దెబ్బ తగిలి పోయిందమ్మా..” అని కిష్టప్ప గాడి కేసీ, పిల్లల కేసీ నిందాపూర్వకంగా చూసేరు. పిల్లల్లో సగం మంది ప్రమాదం గ్రహించి ఇళ్ళలోకి పరిగెట్టేరు. ఆపగాడు, బన్నీబాబు, కిష్టప్ప, విజయ్, శంకర్రావు ఎటూ కదల్లేకుండా నిలబడిపోయేరు. లింగరాజు డాక్టర్ గారి కాంపౌండర్ నర్సింగరావు ఈ హడావుడి చూసి సర్రున పరుగెట్టుకుంటూ వచ్చి కిష్టప్ప గాడి చెయ్యి పట్టుకుని “ఎవడ్నో ఒకడ్ని సంపేస్తే గాని ఈ ఆట మానరా…?” అని కోంపడ్డాడు. కిష్టప్ప గాడు ఏడుపు మొహం ఎర్రగా పెట్టుకుని “నీను కాదండీ … నన్నంటా రేటండీ?” అని రుంజుకుంటునాడు.
పొక్కునూరు వాళ్ళరుగు మీద శాల్తీ జనం అందరూ తనవైపు రావటం చూసి బంతి చేతిలో పట్టుకుని కింద పడిపోయి గిల గిలా కొట్టుకుంటూ “అమ్మో.. గుంట్నాకొడుకులు సంపీసేర్రో..” అని అరుస్తున్నాడు. నర్సింగరావు ఎర్రగా కుర్రాళ్ళందరికేసీ చూసి కిష్టప్ప చెయ్యి వదలకుండానే “పారిపోడానికి ట్రై చేసేరో మీ ఇంట్లో వాల్ల చేతే మీకు ఏయిస్తాను రౌండు .. ఆడికేవన్నా అయితే మిమ్మల్ని లోపలేసెస్తారు పదండి .. కిరికిట్టు గిరికిట్టు ఒదిలిపోద్ది!” అని బెదిరిస్తూ సెంటర్ వైపు నడిచాడు.
నెమ్మదిగా జనం అందరూ పొక్కునూరు వాళ్ళ అరుగు చుట్టూ పోగయ్యేరు వాళ్ళ గుమ్మం ముందు కాలవ మీదుగా పరిచిన రాతిబల్లల మీదా, పక్కన సైకిల్ షాప్ మీద, ఎదురుగా వీధి లోను. ఈ హడావిడికి రిక్షావాళ్ళు, సెంటర్ లో దుంపలు, కూరలు అమ్ముకునే వాళ్ళు, బస్సుకి నిలబడ్డ వాళ్ళూ వచ్చి చేరేరు. అరుగు మీద మూలన రాతి పలకల గచ్చు మీద నొప్పిగా దొర్లుతూ ఏడుస్తున్నాడు. ముప్ఫయ్యేళ్ళ పైగానే ఉంటాయి. చూడ్డానికి పిచ్చాళ్ళాగా ఉన్నాడు. జుట్టు ఎర్రగా బుగ్గిగా ఉన్నాది. పేంట్ పొట్టిగా మడమలు దిగకుండా. వాడు కేకలేస్తున్నప్పుడల్లా పెద్దపెద్ద పారపళ్ళు చొంగ కారుతూ పచ్చగా మొహం నిండా పళ్ళే కనిపిస్తునాయి. కార్క్ బాల్ కడుపులో నొక్కుకుని లుమ్మచుట్టుకుని నొప్పికి మెలికలు తిరిగిపోతూ “సంపీసేరు రామా .. కిరికీటు బాలేసి కొట్టీసేవా ఎంకట్రవణ మూర్తీ .. సంపీసేవా ఏడుకొండలు ఎంకటెస్ప స్వామీ ..” అని అరుస్తున్నాడు.
నవుడూరు మామ్మ గారు చెవులు చేతులతో మూసుకుని “అబ్బా! రామా … ఎందుకొచ్చిన కిరికిట్టు నాయనా, వెధవ కిరికిట్లు వీధుల్లో ఆడతారా?” అంది. కాంపౌండర్ నర్సింగరావు వాడ్ని పరీక్షగా చూసి “ఎవర్రా నువ్వు .. ఏయ్ , నీ పేరేటివై?” అన్నాడు. విశాలం గారు ఆశ్చర్యంగా అందరివైపూ చూసి, “నొప్పో మొర్రో అని అతనేడుస్తూ ఉంటే నువ్వు పేరడుగుతావేంటివయ్యా నర్సింగరావు?” అని సపోర్ట్ కోసం చూసింది. జనం వీధినాటకం చూస్తున్న దాన్లో ఇదీ ఒక డైలాగ్ లాగ విని ఏం మాటాడకుండా ఊరుకున్నారు. నర్సింగరావు ఎపోలజెటిక్ గా ఆవిడ వైపు చూసి “ఈడు మనూరోడు కాడండీ ” అని, “ఒరే శంకరీ! బాల్చీ తోటి నీళ్ళు, చెంబుడు మజ్జిగ తేరా” అని శంకర్రావుకి పురమాయించేడు. అరుగుమీద వెర్రాడు గట్టిగా మూలుగుతూ మూర్చలో లాగ కొట్టుకుంటున్నాడు. నవుడూరు మామ్మ చొరవగా బకెట్ లో నీళ్ళు వాడి మొహం మీద చల్లి “హయ్యో వెర్రి తండి .. దాహానికి తాగుతావురా?” అంది.
వెర్రాడు కళ్ళిప్పి చూసి “మజ్జిగయితే కక్కేస్తాను .. రంగుసోడా ఇయ్యి మామ్మా .. నాను సచ్చిపోతాను తల్లో.. ” అని కేకేసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. గుంపస్వామి బడ్డీ నుండి గోల్డ్ స్పాట్ తెప్పించేరు. వెర్రాడు తాగినంత గోల్డ్6స్పాట్ గటగటా తాగి చివర్లో మిగిలింది మోకాలు మీద పోసుకుని నొప్పికి గింజుకుంటుంటే ఇంతలో పాల పద్మ లింగరాజు డాక్టర్ గార్నే పిలుచుకొచ్చింది. ఆయన లేంబ్రెట్టా పక్కకి తీసి స్టేండ్ వేసి వెర్రాడి పక్కకొచ్చి కూర్చుని “ఏదిరా? .. ఎక్కడ తగిలిందిరా దెబ్బ? ఏదీ ..” అన్నాడు. నర్సింగరావు లేంబ్రెట్టా డిక్కీలో వెదికి గ్లవ్స్ పట్టుకొచ్చేడు. వెర్రాడు డాక్టర్ని చూసి మరింత బిగదీసుకుని గుప్పిళ్ళు రెండూ బిగించేసి కళ్ళలో గుడ్లు తెల్లగా తేలేసి నోట్లోంచి నురగలు పోసుకుంటున్నాడు. నర్సింగరావు జేబులోంచి తాళం ఒకటి తీసి వాడి గుప్పిట్లో పెట్టి “ఈడెవడో మూర్చవాడు సార్! మనూరోడు కాడు సార్ ..” అన్నాడు. డాక్టర్ గారు వాడ్ని మాట్లాడొద్దని సంజ్ఞ చేసి వెర్రోడికేసి తిరిగి వాడి మోకాలు పరీక్ష చేద్దామని వంగితే వాడు కాళ్ళు మరీ లోపలికి ముడుచుకున్నాడు.
“ఏది చూడ్నీరా కాలు … ఎక్కడరా తగిలింది? ..” “మోకాలు నరాల మీద తగిలీసింది బాబో .. ఆకలేస్తందీ .. అన్నం పెట్టు దేవుడో ..”
పొక్కునూరు ప్లీడర్ గారు ఇంట్లోంచి ఈ గొడవంతా చూసి ఒక కుర్చీ, అరిటాకు తెచ్చి అరుగు మీద వేసేరు. కుర్చీ మీద డాక్టర్ని కూర్చోమని చెప్పి లోపల్నుండి అన్నం తెచ్చి ఆకునిండా వడ్డించేరు. విశాలం గారింట్లోంచీ నవుడూరు వాళ్ళింట్లోంచీ దమయంతమ్మ గారింట్లోంచీ మధ్యాన్నం మిగిలిన కూరలు తెచ్చేరు. లింగరాజు గారు ఇంక చేసేదేం లేక కుర్చీలో చతికిలబడ్డాడు. వెర్రాడు కుంటికాలు ముడుచుకునే అరుగుమీద స్థంభం ఊతతో పైకి లేచి కూర్చుని ఆత్రంగా ఆకు మీద పడ్డాడు. వాడు పెద్ద పెద్ద పళ్ళ మధ్య కుక్కుకుంటూ అన్నం తింటుంటే నర్సింగరావు డాక్టర్ పక్కన చేరి నిరసనగా “ఈడికి దెబ్బ తగిలిందంటారా ..?” అన్నాడు అనుమానంగా. జనం లోంచి ఎవరో “నీకే తగిల్తే తెలుస్తాది ఆ నొప్పి!” అని కసిరేడు. పొక్కునూరు ప్లీడర్ గారు తమ ఆకులో అన్నం కదా అని కొంచెం పెద్దమనిషి తరహాగా నిలబడి “ఆ తినేవాడ్ని తిన్నీవై! అసలే దెబ్బ తగిలిపోయి ఆడేడుస్తుంటే!” అన్నాడు. వెర్రోడు మధ్య మధ్యన తినటం ఆపి “నరం పట్లు మీద కొట్టీసి సంపీసేరు రామా ..” అని వెక్కుతున్నాడు.
వీధిమీద ఎండపోయి పెద్ద వాన కురిసేటట్టు ఒక్కటే పెద్ద నల్లమబ్బు వాలింది. ఆఫీసుల్నుండి వస్తున్న వాళ్ళు సైకిళ్ళు ఆపేసి చోద్యంగా నిలబడ్డారు. వెర్రాడికి అన్నం అంతా తినటానికి పదినిమిషాలు పట్టలేదు. నవుడూరు మామ్మ “ఇదుగో వెర్రబ్బాయి, ఆ ఆకు తీసి పారేసేసెయ్యిరా … ” అంది. వెర్రాడు కడుపుకేసి నొక్కుకుని నొప్పి మొహం పెట్టి “మా ఊరెళ్ళి సచ్చిపోతాను .. టిక్కటికి డబ్బులిచ్చీ ..” అన్నాడు.
“అన్నా .. తిక్క!” “బస్సుకెళిపోతాను .. టికటు కట్టీ డాట్రగారు .. ఇచ్చీ!” “ఏ ఊరెళ్తావురా ..?” “ఇరవయ్యి .. ఇరవై రూపాయిలిచ్చీ ..” “ఏ ఊర్రా మీది?”
నర్సింగరావు కలగజేసుకుని “అలాగ నిదానంగ అడిగితే ఆడేటి చెప్తాడండీ .. రొండు తగిలించితే మాట సుబ్బరంగా ఒస్తాది …” అన్నాడు. వెర్రాడు అతని వైపు కోపంగా చూసి “ఎందుకు తంతావు? కిరికిట్టు బాలేసి కొట్టేసి సంపీస్తావా? ఇరవై రూపాయిలిచ్చీ ..” అన్నాడు ఏడుపు గొంతుక తోటి.
పొక్కునూరు ప్లీడర్ గారికి వెర్రాడు వాళ్ళరుగు మీంచి కదలడేమోనని భయం పట్టుకుంది. ఆయన కిష్టప్ప వాళ్ళ నాన్న కేసి చూసి “మీ వాడు కొట్టిన దెబ్బే కదవై! ఇచ్చీ ఆ టికట్టు డబ్బులు ..” అన్నాడు. అతను ప్లీడర్ని ఏం అనలేక అందరికేసీ చూసి “అందరు పిల్లలూ ఆడిన ఆటకి మా వెధవ నొక్కడ్నే అంటారేంటండి” అని ఐదు రూపాయలు తీసి వెర్రాడి చేతిలో పెట్టాడు. వాడు ఆ ఐదునోటు పట్టుకుని అందరివైపూ తిరిగి
“టిక్కటికి డబ్బులిచ్చీ .. తే .. డబ్బులిచ్చీ ..” అని దీనంగా చేతులు చాపేడు. నర్సింగరావు మళ్ళీ “ఎక్కడ్రా దెబ్బ!.. దొంగేషకాలు?” అన్నాడు. “ఇదా దెబ్బ! .. కవుకు దెబ్బ లోపల్నుండి నరమూలాల మీద తగిలేసింది రామా! .. ఇవాల్నైటు ఇక్కడే చచ్చిపోతానో …” అనేసరికి ప్లీడర్ గారు గాబరా పడిపోయి “ఈడు అన్నంత పనీ చేసేడంటే ఆ సుడెల్లి మనమీద చుట్టుకుంటాది .. చూసుకోండి మరి!” అని రెండు నోటు తీసేడు. విశాలం గారు రెండు, రవణ మేష్టారు మూడు, పాలపద్మ రూపాయి, డాక్టర్ గారు ఐదు .. అంతా కలిపి ఇరవైరెండు రూపాయలు దండేరు. ఆ డబ్బు వాడి చేతిలో పెట్టి “ఇదిగో ఇరవై రెండు! .. ఎనక్కి చూడకుండా పోతావా?” “పోతాను .. ఇచ్చీ! డబ్బులిచ్చీ ..” అని స్ప్రింగ్ లాగ లేచి కూర్చున్నాడు. “ఏ ఊరెళ్తావురా ..?”
వెర్రాడు నోట్లన్నీ పేంట్ జేబులో తోసుకుని హుషారుగా జనాన్ని నెట్టుకుని వీధిలోకి గెంతి ఉపన్యాసం ఇచ్చేటట్టు పిడికిలి మైక్ లాగ బిగించి నోటి దగ్గర పెట్టుకుని “సోదర సోదరీమనులారా! అక్కల్లాలా .. ఆవకాయ డొక్కల్లాలా! నా పేరు లాడి సర్వీస్పర్రావు. మీము లింగధార్లుఁవి… మా పార్టి ఇందరా కాంగ్రీసు పార్టి.. అస్తం గుర్తుకే మీ వోటు .. మీయందరి వోటు నాకే.. టిక్కట్టి డబ్బులు నాకే” అని పగలబడి నవ్వి పెద్దగొంతుకతో పాట పాడుతూ డేన్స్ మొదలెట్టేడు
“పశ్చిం గోదార్జిల్లా తణుకు తాలూకా .. పశ్చిం గోదార్జిల్లా తణుకు తాలూకా .. తాడి తడి పాత గోడమీద బల్లి నా గోసిపాతకి సిల్లి బందలోన సేప నీ ముంతలోన కప్ప అంబలకడ జంబలకడ జంబలకడ జంబలకడ పశ్చిం గోదార్జిల్లా తణుకు తాలూకా .. పశ్చిం గోదార్జిల్లా తణుకు తాలూకా ..” అని వీధి వెడల్పునా చప్పట్లు చరుస్తూ చక్కర్లు కొడుతూ డేన్స్ చేస్తూ పరిగెట్టేడు.
“చూసేరండీ ఎర్రెదవకి బుర్రనిండా బుద్ధులే .. దెబ్బా లేదు ఏటీ లేదు ..” అని నర్సింగరావు ఉక్రోషంగా వాడి వెంట పడ్డాడు. “పట్టుకోండ్రా నా కొడుకుని ..” అని అందరూ వాడి వెనకే పడితే వెర్రోడు పాట ఆపకుండానే లాఘవంగా వాళ్ళని తప్పించుకుని సెంటర్లోకి పరుగెట్టి, కదిలిపోతున్న ‘కె. సింగుపూర్ ఎన్. పట్న ‘ బస్సు వెనక నిచ్చెన మీద ఒక కాలేసి ఒక చేత్తో నిచ్చెనని అంది పుచ్చుకునివేలాడుతూ రెండో చేత్తో పేంట్ జేబులోంచి కార్క్ బాల్ తీసి జనం మీదికి విసిరేసి, రెండు వేళ్ళు నోట్లో పెట్టుకుని ‘కఁయ్యీ మని విజిల్ వేసి
‘రఁయ్యి రఁయ్యి రఁయిట్ రైట్ రైట్ రైట్ .. రంబ లకడి పంబలకిడి పశ్చింగోదార్జిల్లా తణుకు తాలూకా పశ్చిం గోదార్జిల్లా తణుకు తాలూకా ..’ అని పాడుతుంటే బస్సు కదిలిపోయింది. పొక్కునూరు వాళ్ళింటి దగ్గర జనం తణుకుగాడు చేసిన మోసం గురించి చెప్పుకుంటుంటే పెద్ద గాలీ వానా.