నడుస్తూనే వచ్చేసేను …
నాకు మరక్కడ ఉండటానికి ఇష్టం లేకపోయింది. చరచరా చిన్నన్నయ్య ఇంటి మెట్లు దిగిపోయి రోడ్డు మీదకి వచ్చేసేను. వాడు చూస్తూనే ఉండిపోయేడు. చెక్కిన బొమ్మలాగా చలనం లేకుండా వాడలా చూస్తూనే ఉండిపోయేడు.
నాలో దుఃఖం పాల పొంగు లాగా పైకి లేవబోయింది. బలవంతాన అదిమి పెట్టుకుని, చేతులు రెండూ పేంటు జేబుల్లో పెట్టేసుకుని, వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా నేను రోడ్డు మీదకి వచ్చి నడవటం మొదలు పెట్టేను.
నేను చిన్నవాణ్ణే… నా ముగ్గురన్నల కన్నా నేను వయస్సులో చాలా చిన్న వాణ్ణి. నేను స్పష్టంగా చూడగలిగిన విషయాన్ని… వాళ్ళెవరూ చూడలేకపోతున్నందుకు, వాళ్ళ గుండె తడులు ఇంకిపోయి వొట్టి గుడ్డబొమ్మలుగా మారిపోయినందుకు, నాకు మనసంతా మంటలు రేగిపోతున్నాయి. మళ్ళీ వాళ్ళల్లో తెలివి తక్కువ వాడెవ్వడూ లేడు.
“నీకు తెలియదు చిన్నా …! నువ్వొంటరి గాడివి.. నువ్వా పన్లు చెయ్యలేవు.. ఆవిడ వ్యవహారంలో తల దూర్చకు.. తర్వాత బాధ పడతావు.. నా మాట విను..” అనేసి రెండో అన్నయ్య పేపర్లో ఉష్ట్రపక్షిలాగా తల దూర్చేడు. వాడంతే.. వాడికి వాడి ఉద్యోగమూ, డబ్బు లెక్కా తప్పితే మరింకేమి అక్కర్లేదు. చటుక్కున అడిగితే, వాడు వాడి కొడుకు పేరైనా చెప్పగలడో, లేదో నాకెప్పుడూ అనుమానమే. వాడికి కోపం అంటూ రావడం, నేను ఒక్క సారైనా చూడలేదు. బలంగా తోసేస్తే కిందకి దొర్లుకుంటూ వెళ్ళిపోయే కొండ మీది బండ రాయి లాగా వాడి జీవితం వెళ్ళిపోతోంది. వాడికేం చెప్పినా మరి లాభం లేదని, నేను విసిగి పోయి వచ్చేసేను.
నిన్న మూడో అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు వాడు, వీడికి భిన్నంగా వ్యవహరించలేదు. నాకు తోడుగా నిలబడతానన్లేదు.
మూడో అన్నయ్య విష్ణుమూర్తి సంగతే వేరు. వాడు పూర్తిగా కలల లోకం కాపురస్తుడు. ఊహా లోకపు విహారి. నాన్న ఎప్పుడూ వాణ్ణి “కలల కమల నయనా” అని పిలుస్తుండే వాడు. మిలట్రీ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నా వాడు ఎప్పుడూ, వొడ్డు మీద కుర్చీలో కూర్చుని, ఎదురుగా ఉధృతంగా పరవళ్ళు తొక్కుతూ, ప్రవాహం లాగా సాగిపోయే జీవితాన్ని తన్మయత్వం తో చూస్తూ ఉన్నట్టే ఉంటాడు.
సాహిత్యం తో వాడు జీవితాన్ని కొలుస్తాడు. సంగీతంతో దానికి రంగు చీరలు చుడతాడు. ఏ క్షణాన వాడు ఇంట్లో ఉన్నప్పుడు మనం వెళ్ళినా .. ఏ సంగీత ఆలాపనో, సాగుతూ వచ్చి, మనని సాకేత పరిమళం లా చుట్టేసుకుంటుంది.
వాడన్నాడు నాతో, “చిన్నాడా …! పాల పరువంలో ఉన్నావు. చక్కటి ఉద్యోగమూ ఉంది. బంగారు బొమ్మలంటి అమ్మాయిని చూసి, చేసుకుంటే, బ్రతుకు పైడి పువ్వుల పంట కాదురా ? నీ కెందుకురా.. ఈ తగమారి తంటాలు. నా మాట విని నువ్వలాంటిదేదీ తలకెత్తుకోకు. నేనెలాంటి సాయమూ చెయ్యను. ఆవిడెలా పోతే అలా పోనీ, … ఏనాడన్నా మన మాట విన్న ఆవిడైతే కదా …!”
నాకు అప్పుడు లాగి పెట్టి కొట్టాలనిపించింది. వీలైతే వాడి వొళ్ళంతా చిత్రిక పట్టాలనిపించింది. ఇంక పెద్దన్నయ్య ఏమంటాడో వినేస్తే సరి..
నాకు పెద్దన్నయ్య అంటే గురెక్కువ. ఎప్పుడూ తక్కువే మాట్లాడే పెద్దన్నయ్య ఇంటి బాధ్యతల్లో తక్కువ కష్టాలేం పడలేదు. అమ్మతో ఎన్ని భేదాలున్నా వాడేనాడు ఆమెని ఏమీ అనలేదు.
ఆలోచనల్లో మునిగి రోడ్డు మధ్యకి వచ్చేసేను. “కొంచెం, రోడ్డు చూసి నడవండి.. బాబూ..!” పక్కనుండి పోతూ రిక్షా అతడు చేసిన హెచ్చరికకి ఉలిక్కి పడ్డాను.
తల తిప్పి చూసేసరికి రైల్వేస్టేషన్ పక్కనే కనబడింది. ప్రవాహంలా సాగుతున్న జనాన్ని, వాహనాల్నీ తప్పించుకుంటూ స్టేషన్ లోపలికి పోయి అడిగితే, అలెప్సి రైలు గంట లేటన్నారు. ప్లాట్‌ఫారం మీద కూర్చున్నాను తీరుపాటుగా.
అమ్మ ఎలాటి మనిషి! ఎవరికైనా అలాంటి అమ్మ ఉంటుందా అంటే ఆశ్చర్యమే.. ఆవిడేం తెలివి తక్కువది కాదు. గ్రాడ్యుయేషన్ ఆ రోజుల్లో ఫస్ట్ క్లాసులో పాసయ్యి, ప్రభుత్వ సంస్థలో సూపరెండెంట్‌గా మొన్నే రిటైరైంది. అది కూడా పేపర్లో చూస్తేనే తెలిసింది. అమ్మ చెప్పలేదు. చెప్పే రకం కాదు కూడా…! మమ్మల్ని కన్నాక నాలుగేళ్ళకు అమ్మకి, నాన్నకి ఏవో గొడవలొచ్చేయట! ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన అమ్మ ఉద్యోగం రాగానే మమ్మల్ని, నాన్నని వొదిలేసి వెళ్ళింది. నాకు నాలుగేళ్ళుంటాయప్పుడు.
పెద్దన్నయ్యే మమ్మల్ని అమ్మై పెంచాడు. నాకిప్పటికీ ఆశ్చర్యమే..! ఎంత గొడవలొచ్చినా అమ్మ అలా వెళ్ళిపోవడమేమిటని.. నాలుగేళ్ళ నన్ను వొదిలేసి వెళ్ళిపోవటానికి అమ్మకి మనస్సెలా వొప్పుకుందని.
నా పధ్నాలుగో ఏట మొదటిసారిగా అమ్మని చూసేను. నా చిన్నప్పటి జ్ఞాపకాల్లో అమ్మ బొమ్మ లేనే లేదు.. ఇంట్లో కూడా నాన్న అమ్మ ఫొటోలేం ఉంచలేదు. అమ్మని చూసేదాకా నాకు అమ్మ రూపం తెలీనే తెలీదు.
పెద్దన్నయ్య తో కూడా ‘విశాఖ ‘ వెళ్ళేను. వాడు నన్ను కూడా రమ్మనగానే బయల్దేరిపోయేనే గాని, తిన్నగా నన్ను అమ్మ దగ్గరికి తీసుకుపోతాడని నాకు తెలీదు. అన్నయ్య చెప్పలేదు కూడా!
తిన్నగా అమ్మ ఆఫీసు కు తీసుకెళ్ళేడు అన్నయ్య. స్టాఫ్ రూం లో ఇద్దరం కూర్చున్నాం.. నా అయోమయపు మొహాన్ని చూసి అన్నయ్యకు జాలి వేసినట్టుంది.
“చిన్నాడా ..! అమ్మని చూడాలని అంటూ వుంటావు కదా..! అమ్మొస్తుంది.. చూడు..” అని నెమ్మదిగా నాకు వినబడేలాగే చెప్పేడు.
స్టాఫ్ రూం లో ఎవరూ లేరు. పొడవాటి కర్ర సోఫాలో మేమిద్దరమే కూర్చుని ఉన్నాం. నా ఒంట్లో రక్తం ఒక్కసారిగా తలలోకి పిచికారీ చేసినట్లైంది. ఒక్క క్షణం అన్నయ్య చెప్పిందేమిటో అర్థం కాలేదు. అర్థం అయ్యేలోగా అమ్మ వచ్చేసింది.
అన్నయ్య నిలబడగానే నాకు వచ్చింది అమ్మేనని తెలిసింది. అమ్మ ఇంకా స్టాఫ్ రూం లోకి అడుగు పెట్టక ముందే నా రక్తం అమ్మని పోల్చేసింది. అమ్మ వచ్చి మా ముందు నిలబడేసరికి నాకు ఎందుకోగాని ఏడుపొచ్చింది.
అన్నయ్య హెచ్చరికగా నా చెయ్యి పట్టుకోబట్టి గాని, లేకపోతే నేనెంత గట్టిగానో ఏడ్చే వాణ్ణక్కడ.
అమ్మ పొడవుగా ఉంది. కళ్ళద్దాలతో, చేతిలో పట్టుకున్న పెన్నుతో అమ్మ అచ్చం ఆఫీసర్లా ఉంది.
“చిన్నాడిని తెచ్చేనమ్మా..! నిన్ను చూడాలంటున్నాడు…!!” అన్నయ్య అబద్ధం చెప్పేడు. వచ్చేదాకా అమ్మ దగ్గరికని నాకసలు తెలీదు. నేను నమ్మలేనట్టు అన్నయ్య మొహం లోకి ఆశ్చర్యంతో చూసేను. అన్నయ్య నావైపు చూడనే లేదు.
అమ్మ నన్ను దగ్గరికి తీసుకొంటుందనుకున్నాను. నాలుగేళ్ళ నాడు నన్ను వదిలిపెట్టి పోయిన నా తల్లి నన్ను చూసి ఏడ్చేస్తుందనుకున్నాను.
అమ్మ అలా చెయ్యలేదు. కళ్ళద్దాల్లోంచి నా వంక ఓ సారి చూసింది. ఎత్తుగా ఉన్న అమ్మ మొహం లోకి చూడ్డానికి ఎందుకోగానీ, నాకు చేత కాలేదు. అలక నటిస్తే ఆవిడ దగ్గరికి తీసుకుంటుందని గాని, ఆశ పడ్డానేమో నాకు గుర్తు లేదు.
అమ్మ చీర కుచ్చిళ్ళు కదిలేయి. పెద్ద జరీ బోర్డరుతో అమ్మ ఆనాడు కట్టుకున్న గంధంరంగు చీరె నాకివ్వాళ్టికీ గుర్తే.
అమ్మ నడిచి వచ్చి సోఫాలో ఆ చివర్న కూర్చుంది. “కూర్చో… వాడినీ కూర్చోమను ..” అమ్మ మొదటి మాట నాకు కంఠస్తమే..
“ఏం చదువుతున్నావు.. ?” నన్నే అడిగింది అమ్మ. నేను తలెత్తి అమ్మ కళ్ళల్లోకి చూసేను. అప్పుడు నాకు, నేను అచ్చం అమ్మ పోలికేనని తెలిసింది.
“పదో క్లాసు” గొణిగాను తల దించుకుని.
“పెద్ద వాడివయ్యేవు …” అంది అమ్మ. ఆవిడ గొంతులో ఆవగింజంతైనా తడి వుందేమోనని వెతికాను మనస్సులో.
“వీడేమిటి…? బెల్లం కొట్టిన రాయిలా వున్నాడు. ఇంతకీ ఏం పనిమీద వొచ్చేవు..?” అని అమ్మ పెద్దన్నయ్య నడిగింది.
అన్నయ్య అమ్మతో ఏదో విషయం ఐదు నిముషాల పాటు చెప్పేడు క్లుప్తంగా.. స్టాంపు పేపర్లు … పొలం లాంటి మాటలవి …
“నేను సంతకం పెట్టను.. ఏం చేస్తాడో చేసుకోమను. పిల్లల్ని రాయబారం పంపితే, నేను లొంగుతాననుకుంటున్నాడేమో.. కుదరదు. వొరే.. నీకేదన్నా కావలిస్తే అడుగు. ఇస్తాను.. అదీ మీరంతా నా కడుపులోంచి వచ్చినందుకు. నా బాధ్యతగా ఇస్తాను. ఆయనకు చేత కాదా… ? మిమ్మల్ని నాకొదిలేయమను. నయా పైసా అడక్కుండా పెంచుకుంటాను .. ఏమనుకుంటున్నాడో, అతను, ఈ కాంతిమతి అంటే …”
అమ్మ కోపం గా ఉంది. డిగ్రీ చదువుకున్న అన్నయ్య ఏదో మాట్లాడబోయేడు.
అమ్మ లేచి నిలబడింది. ముడిపెట్టుకున్న అమ్మ తెలుపూ, నలుపూ జుత్తు కిటికీలోంచి వస్తున్న ఎండ పడి వెండి దారాలతో నేసిన దాన్లా మెరిసింది.
అమ్మ వెళ్ళిపోవటానికి సిద్ధపడి, పర్సులోంచి వందనోటు తీసి, పెద్దన్నయ్య కివ్వబోయింది.
అన్నయ్య “వద్దు, … డబ్బుంది” అన్నాడు.
“నీకూ అతగాడి పొగరే వచ్చింది, పోలికలతో పాటు …” అని ఆ నోటు నాకివ్వబోయింది.
నేను తల అడ్డంగా ఊపేను. నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయేయి. మసకలు బారేయి. తీసుకుంటే అన్నయ్య ఊరుకోడు.
“సరే … నేను వెళుతున్నాను …” అని కదలబోతూ ఎందుకోగాని అమ్మ ఆగిపోయింది. నాలో ఆశల రేకులు అందంగా విరిసేయి.
ఒక్క క్షణం ఆలోచించి, చేతిలో ఉన్న పెన్ను నా జేబులో పెడుతూ, “పరీక్షలు బాగా రాయి …” అంది అమ్మ నా తల మీద చెయ్యి వేసి. అమ్మ స్పర్శకి నా శరీరం కంపించింది. వొచ్చి పడిపోతున్న దుఃఖం ఆపుకోడానికి రెండు చేతులూ మొహం మీద కప్పుకున్నాను.
అమ్మ నన్ను ఓదార్చలేదు. నాకు నాలుగేళ్ళప్పుడు నన్ను వదిలి పెట్టి వెళ్ళిపోయిన అమ్మ నాకు పధ్నాలుగేళ్ళు వచ్చేక నేను కనిపించినా, నన్ను గుండెలకు హత్తుకోనేలేదు.
తటాలున తన చెయ్యి నా తల మీద నుంచి తీసేసి, “రాత … రాతా …” అంటూ తల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ చీర చెంగు గాల్లో విసురుగా అటూ ఇటూ ఆడింది.
రైలు చప్పుడు వినిపించి గబుక్కున లేచి నిలబడ్డాను. ఆనాడు అమ్మ ఇచ్చిన పెన్ను, ఏ నాడూ నా జేబు వీడిపోలేదు. అన్ని పరీక్షలూ దానితోనే రాసేను. మొన్న అమ్మకు రాసిన ఉత్తరం కూడా…!
రైల్లో కూర్చున్నాక మళ్ళీ అమ్మ ఆలోచనలే.. అమ్మ జ్ఞాపకాలే.. ఎంతైనా అమ్మ కదా…!
* * *
ఏలూరు లో రైలు దిగి తిన్నగా అన్నయ్య ఇంటికి వెళ్ళేను. నా ఆఖరి ఆశ పెద్దన్నయ్యే.
అన్నయ్య ఇంకా స్కూలు నుంచి రాలేదు. వొదిన దగ్గర నాకు చనువు ఎక్కువ. అయినా నేను ఆవిడతో అమ్మ విషయం చెప్పలేదు. అన్నయ్యతో మాట్లేడేక, ఆవిడతో చెప్పొచ్చనుకున్నాను.
నేను టిఫిన్ తింటుంటే, వదిన ఎదురుగా కూర్చుని అడిగింది. “నువ్వు.. సుబ్బరామయ్య గారి అమ్మాయి సంగతి ఏం ఆలోచించావో చెప్పు.. రెండ్రోజుల క్రితం వాళ్ళబ్బాయి వచ్చేడు. రాధ బాగానే ఉంటుందిగా …!”
వదిన నా పెళ్ళి గురించి పట్టు వదలకుండా ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉంది. ఎప్పుడొచ్చినా ఏదో ఒక సంబంధం గురించి ఆవిడ చెప్పకుండా ఉండదు. అందుకే ఈ మధ్య ఏలూరు రావటం తగ్గించేను.
“నాక్కొంచెం టైమివ్వు వొదినా ..! రాధనీ, సరోజనీ.. నన్ను బాధ పెట్టకు నువ్వు .. కనీసం కొన్నాళ్ళ దాకానైనా .. నేనింకా నా పెళ్ళి విషయం ఏదీ నిర్ణయించుకోలేదు… ” సౌమ్యంగా చెప్పేనామెతో.
ఆమె మొహంలో లీలగా కోపం కనబడింది. సహజమే ..! నన్ను మరేం అనకుండా వదిన వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను టీవీ చూస్తూ కూర్చున్నాను. ఆరు గంటలయ్యేటప్పటికి అన్నయ్య వచ్చేడు.
“చిన్నా …! ఎప్పుడొచ్చేవు …” అని పలకరించి మామూలు ప్రశ్నలు వేసేడు.
అన్నయ్యలో పెద్దరికం చాయాలు బాగా కనబడుతున్నాయి. అచ్చం నాన్నలా ఉన్నాడు. నాన్నలాగే తక్కువ మాట్లాడటం వాడి అలవాటు. మాట్లాడేటపుడు ఎదుటి వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూడటం, ముందుకు పడుతున్న క్రాఫు చేత్తో వెనక్కి సర్దుకోవటం … అన్నీ నాన్నలాగే ..
రాత్రి తీరుబాటుగా కూర్చున్నాక చెప్పేను. “అన్నయ్య ..! అమ్మ రిటైరైంది తెలుసా ..! ”
“తెలుసు ..!” అన్నాడన్నయ్య నా కళ్ళలోకి సూటిగా చూస్తూ..
నేను మరేం మాట్లాడలేదు. నలిగిపోయిన మడతల్లో వున్న టెలిగ్రాం కాగితం జేబులోంచి తీసి, అన్నయ్య కిచ్చేను.
“కాంతిమతి ఈజ్ ఇన్ హాస్పిటల్.. వాంట్స్ టు సీ యూ …” వారం రోజుల క్రితం నా ఆఫీస్ ఎడ్రెస్ కు వచ్చిన తెలిగ్రాం అది. అన్నయ్య చదివేడు. టెలిగ్రాం చేత్తో పట్టుకుని కాసేపు ఆలోచనలో పడ్డాడు.
“ఏమంటోంది.. అమ్మ..?” నేను అమ్మ దగ్గరికి వెళ్ళిన సంగతి అన్నయ్య గ్రహించేడు. నెమ్మదిగా చెప్పేను “అమ్మ ఆరోగ్యం బాగా లేదు. ఉద్యోగంలో విపరీతంగా శ్రమ పడడంతో అమ్మ హార్ట్‌లో వాల్వ్ దెబ్బ తిని పోయిందని డాక్టరు చెప్పేడు.. ఆవిడకిప్పుడు సంరక్షణ కావాలి..”
“వస్తానంటోందా…?”
“వొప్పుకోవడం లేదు.. బలవంత పెట్టి తీసుకు రావాలి..”
“కష్టం… ఆవిడ రాదు.” అన్నయ్య చెప్పేడు.
“నేను తీసుకొస్తాను.. వొదిన చెయ్యగలనంటే … అన్నయ్య లిద్దరూ వాళ్ళ దగ్గర కుదరదన్నారు…”
అన్నయ్య ఆలోచనలో ములిగాడు. “చాలా జాగ్రత్తలు తీసుకోవాలి… వొకరి మాట వినేరకం కాదు ఆవిడ.” “అయినా ఆవిడసలు వొప్పుకోదురా ..! ఎన్ని మార్లు బతిమాలినా రాని అమ్మ ఇప్పుడెందుకు వస్తుందిరా చిన్నా …! నాన్న పోయినప్పుడే రాలేదు…” గుర్తు చేసేడు.
నేను మవునంగా వుండిపోయేను. నాన్న పోయి ఏడేళ్ళవుతుంది.. శీతాకాలంలో పోయేడాయన. శీతాకాలం సాయంత్రం వేళ చుట్టూ దట్టంగా మంచు తెరలు తెరలు గా దిగుతుంటే, వీథి గుమ్మం వైపే దృష్టి నిలిపి వుంచి చని పోయాడాయన.
రెండు రోజులకు చనిపోతాడనగా, ఆయన నన్ను పక్కన కూర్చో బెట్టుకున్నాడు. చిన్నన్నయ్య, రెండో అన్నయ్య ఆయన కాళ్ళు ఒత్తుతుంటే, పెద్దన్నయ్య హార్లిక్స్ కలుపుతున్నాడు.
నాన్న నా చేతిని తన గుండెల మీదకి తీసుకున్నాడు. ఆయన రెప్పల వెనుక కొంచెంగా తడి. అలా నాన్నని నేనెప్పుడూ చూడలేదు.
ఉన్న నాలుగెకరాల పొలంలో అహర్నిశలు గొడ్డు చాకిరీ చేసి నాన్న మమ్మల్ని చదివించేడు. ఏనాడు గుండె ధైర్యం పోనివ్వని మనిషి ఆయన.
“కాంతి, ఇంట్లోంచి వెళ్ళిపోయి పద్ధెనిమిదేళ్ళయ్యింది…” కొంచెం గొణుక్కున్నట్లుగా వచ్చేయి ఆయన మాటలు.
“మీకు అమ్మను లేకుండా చేసేను నేను … తప్పే.”
పెద్దన్నయ్య నాన్న దగ్గరికి వచ్చేడు. “నాన్న .. అవన్నీ ఇప్పుడొద్దు.. మీరు పడుకోండి !” అన్నాడు వాడు. వాడి వంక నాన్న చూసిన చూపులో వాడి మీద ఆయనకున్న ప్రేమ కనిపించిపోయింది.
“నారాయణా.. ! నువ్వే లేకపోతే, నేనిన్నాళ్ళు ఈ ఇల్లు గడపలేన్రా… నువ్వు బంగారం కదూ…!! తమ్ముళ్ళు జాగ్రత్త..!” అన్నయ్య చేయి పట్టుకుని అన్నాడు నాన్న.
నాకు కన్నీరాగలేదు. మిలట్రీ అన్నయ్యకీ గుండె చెరువైపోయినట్టుంది. వాడు నాన్న కాళ్ళ మీద చెయ్యి అలానే ఉంచేసేడు.
“ఇప్పుడెందుకీ అప్పగింతలు నాన్న..! ఒక్క వారం పోతే, లేచి తిరుగుతావు … పొలంలో మందులు చల్లాలి కూడా …” అన్నయ్య అన్నాడు.
“లేదు నారాయణా …! నాకు తెలుసు. నువ్వేం చెప్పకు.. ఒక్క సారి మీ అమ్మని తీసుకు రాగలవా కన్నా ..!!”
నాన్న అకస్మాత్తుగా అడిగిన కోరిక విని మేం నలుగురం తెల్లబోయేం. ఏనాడు అమ్మ ప్రసక్తే తేని నాన్న అలా అడగడం మాకు కష్టంగా తోచింది.
అప్పుడు వెళ్ళేం మేం… వొకరి తర్వాత ఒకళ్ళం.. కసితో, పట్టుదలల్తో…
అమ్మ మనసు కరగలేదు. తను నాన్నని ఎప్పుడో మరచిపోయిందట. ఆయన తనకేం కాడట. మమ్మల్ని కూడా అందుకే ఆయన పోషణకే వొదిలేసిందట. నాన్నేమై పోయినా ఆవిడ కేం పట్టదుట.
ఎంత పగ అమ్మకి … ఎంత కక్ష నాన్న మీద..
మిలట్రీ వాడికి కోపం వచ్చింది. “మరైతే మరో పెళ్ళి చేసుకోలేదేం నువ్వు ..” అని గట్టిగా అడిగేడు వాడు ఆవిడని.
అమ్మ తిరస్కారంగా చూసి, “నువ్వెవడివి ..? నన్నడిగేటందుకు …?”
నాన్న అసంతృప్తిగానే చచ్చిపోయేడు.
ఆయన పోయే ముందు అమ్మకీ, నాన్నకీ మధ్య గొడవకి కారణం తెలిసింది మాకు. కారణం తెలిసేక కూడా … అంత చిన్న కారణానికి కాపురం వొదిలేసుకుంటారా … అన్న అనుమానం మాకు రాలేదు. వాళ్ళిద్దరి సంగతి తెలుసు మాకు.
ఇద్దరూ రెండు భిన్న ధృవాలు … ఇద్దరూ జతకాని స్వరాలు …
నాన్న విత్తనాలు కొనడానికి వడ్డీకి వెయ్యి రూపాయలు తెచ్చి ఇంట్లో ఉంచేక ఎవరో దగ్గర బంధువు చనిపోతే, నాలుగు రోజులు ఊరికి వెళ్ళేడట …
ఆ డబ్బు అమ్మ యూనివర్శిటీ ఫీజులకీ, పుస్తకాలకీ వాడేసిందట. మాటా మాటా పెరిగి నాన్న అమ్మని కొడితే, అమ్మ కూడా నాన్న మీద చెయ్యి చేసుకున్నదట.
అంతే ఆ తర్వాత ఆవిడ ఇల్లు వొదలి వెళ్ళింది. ఏ రాయబారాలు ఫలించలేదు. ఆర్థిక స్వేచ్ఛకోసం ఆవిడ పోరాటం ..
నాన్న పోయేక, మేం అమ్మ గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేసేం. వొదినెలు వచ్చేక మా ఇంట్లో మళ్ళీ కౌటుంబిక ఆనందం ప్రవేశించింది.
అమ్మ మా జీవితాలకో పీడకలైంది. మా బ్రతుకుల్ని ఆవిడ శపించింది.
చిన్నన్నయ్యకీ, మా మిలట్రీ అన్నయ్యకీ ఆవిడంటే అంతులేని కోపం. మేం నాన్న అనే మొక్కకి అంటుకట్టబడ్డ వాళ్ళం. మాకసలు అమ్మ లేనే లేదు …!
* * *
రాత్రి పడుకున్నానే గాని నిద్ర రాలేదు. కళ్ళ ముందు ఆక్సిజన్ మాస్క్ లో ఉన్న అమ్మ మొహం కదిలింది. శ్వాస కోసం పోరాడుతోంది అమ్మ. స్వేచ్ఛ కోసం పోరాడింది. ఆస్తి కోసం పోరాడింది. మరింక వేటి కోసమో ఆమె పోరాడుతూనే వచ్చింది. పోరాటం కోసం పోరాడిందో, మౌలికంగా పోరాటమే ఆవిడ తత్వ్తమో నాకైతే తెలీదు.
నాన్నకే తెలీనిది నాకెలా తెలుస్తుంది?
“చిన్నా వా ..?” అంది కళ్ళు తెరిచి నన్ను చూస్తూ. పెదవి విప్పి మాట్లాడలేదు నేను.. తలమాత్రం ఊపేను. “కూర్చో…” అంది.
కళ్ళ కింద నల్ల మచ్చలేర్పడ్డ అమ్మ మొహంలో అలసట మాత్రమే కనిపిస్తోంది. తలగడ కిందినుంచి కాయితాలు తీసి, “ఈ డాక్యుమెంట్లు … మీవి .. ఉంచు…” అంది.
నేను తీసుకోలేదు. అమ్మ దగ్గర్నుంచి ఏదీ తీసుకోవడం మాకెవ్వరికీ తెలీదు.
“నాకిక్కడ ఉండాలని లేదు … స్వయంగా వెళ్ళలేను.. కొంచం … ఇంటికి తీసుకెళ్ళగలవా …?” అంది.
నేను తలూపాను. అంతలోకే అనుమానం వచ్చింది. అమ్మ అడుగుతోంది ఏ ఇంటికని.
ఇంతలో పక్కనే ఉన్న నర్సు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, “ఏమిటీ ..? వెళ్ళిపోతానంటున్నారా. ? ఆవిడ .. నో, డాక్టరు వొప్పుకోరు.” అంది.
అమ్మ పెదిమలు బిగించి “నేను వెళ్ళాలి …” అంది.
“నర్సు అదోలా చూసి, “డాక్టర్ని పిలుస్తాను ..” అని వెళ్ళింది. కొద్ది సేపట్లోనే డాక్టరు వచ్చేడు. రావటమే విసురుగా వచ్చేడు. “ఏం అనుకుంటున్నారు మీరసలు ..? మీకు నచ్చినపుడు వచ్చి, వెళ్ళిపోవడానికి మీరేం టూరిస్టూ, ఇది హోటలూ కాదు.. అలాంటప్పుడు అసలు రాకుండానే ఉండాల్సింది. ప్రస్తుతం మీరున్న పరిస్థితిలో మీరసలు కదల కూడదు. ఎవరితోనూ మాట్లాడ కూడదు. మీరెన్నాళ్ళు ఇక్కడ ఉండాలో మేం నిర్ణయించాలి. మీరు కాదు.. అలాటి ఆలోచనలేమీ పెట్టుకోకండి ..” చూపుడు వేలు ఆడిస్తూ చెప్పేడు.
“నాకేం ఫర్వా లేదు..” అంది అమ్మ. బలమైన మాటలే అయినా బలహీనంగా వచ్చేయి. నోట్లోంచి చిన్నగా గురక వచ్చి ఆవిడ మెడ పక్కకి వాలిపోయింది.
నర్సు గభాలున వచ్చి అమ్మను పట్టుకుంది. డాక్టరు అమ్మకు ఆక్సిజన్ అమర్చేడు.
“సిట్యుయేషన్ ఈజ్ వెరీ బాడ్ .. ఐ థింక్ షి ఈస్ యువర్ మదర్. వై డింట్ యూ బ్రింగ్ హర్ ఎర్లియర్ ..?” తెలుగులో మొరటుగా ఉంటుందని కాబోలు డాక్టరు ఇంగ్లీషు ఉపయోగించేడు.
నా దగ్గర్నుంచి సమాధానం ఆశించకుండా, అతడు చెప్పుకు పోయేడు. ” నాలుగైదు రోజులకు తక్కువ లేకుండా ఆవిడ మా కంట్రోల్ లో ఉండాలి. బంధువులెవరూ చీటికి మాటికి వచ్చి డిస్టర్బ్ చెయ్యకూడదు. మీకు తర్వాత చెబుతాను. ఆ తర్వాత మీరు ఆవిడని తీసుకెళ్ళినా ఆవిడ బ్రతికున్నంత కాలం చాలా జాగ్రత్తగా చూడాలి. చక్కటి హోంలి ఎట్మాస్ఫియర్ ఉండి తీరాలి. ఇక్కడ మీరుండడం కన్నా మీ మిసెస్ ఉండడం చాలా ఉపయోగం..”
నాకు పెళ్ళి కాలేదని డాక్టర్ కి చెప్పలేదు. రెండు, మూడు రోజుల్లో వస్తానని బయల్దేరి వచ్చేను.
నాన్న అమ్మ కోసం చూసి, చూసి పోయేడు. అమ్మ రాలేదు. ఇప్పుడు అమ్మకి ఆ పరిస్థితి రాకూడదు. ఆవిడ కన్న వాళ్ళం… అమ్మా నువ్వు మాక్కావాలి అనాలి.. ఆవిడని బతికించుకోవాలి. ఆ తల్లి పాల ఋణం తీర్చుకోవాలి. ఎవరూ లేని బ్రతుకు ఎంత దుర్భరమో నాకు బాగా తెలుసు.
ఆ పరిస్థితి అమ్మకి రాకూడదు.. రానివ్వకూడదు.
నా ప్రయత్నం, పట్టుదలా అదే.. ఇద్దరన్నలూ ఒప్పుకోక పోయినా పెద్దన్నయ్య, వొదినా కాదన్లేదు. అది చాలు. పెద్దన్నయ్య చెబితే వాళ్ళూ విని తీరుతారు. అమ్మ ఏ వెలుగూ పంచని ఓ వొంటరి నక్షత్రంలా, ఎవరూ చదవని ఓ వెయ్యి పేజీల పుస్తకంలా ఉండిపోకూడదు.
ఇంచుమించు తెల్లవారుతూంటే నాకు నిద్ర పట్టింది.
* * *
పెద్దన్నయ్య, నేనూ, వదిన ‘ విశాఖ ‘ బయల్దేరేం. ప్రయాణం లో వదిన అడిగిన వాటికి నేను సమాధానాలు చెప్పేను. అన్నయ్య మామూలు గానే ఎక్కువ మాట్లాడలేదు. మేం హాస్పటలు చేరేసరికి టైం పదిగంటలయ్యింది.
ఆకాశం బాగా మబ్బు పట్టింది. నన్ను చూస్తూనే రిసెప్షనిస్టు … “మిస్టరు ప్రకాష్ .. ! వుయ్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ …!” అని సానుభూతిగా అంది.
నాకర్థం కాలేదు. నేను అయోమయంగా చూడటం గ్రహించిందేమో ఆమె, “టెలిగ్రాం … అందలేదా …?” అనడిగింది అనుమానంగా.
తర్వాత తనే చెప్పింది. “మీ అమ్మ గారు తెల్లవారు ఝామున పోయేరు.. బాడి మార్చురీ లోకి పంపించి, మీకు టెలిగ్రాం ఇచ్చేం..”
నేను మాట్లాడలేక పోయేను. అన్నయ్యే మొదటగా షాక్ నుండి తేరుకున్నాడు. వదిన్నీ, నన్ను మార్చురీ లోకి తీసుకెళ్ళేడు.
అమ్మ నిద్ర పోతున్నట్టుంది. అమ్మ అప్పుడు ఆకాశం లో సగంలా ఉంది. మూసిన ఆవిడ కనురెప్పల వెనకాలా, నెరసిన ఆవిడ జుట్టు కింద ఉన్న మెదడులోనూ నిక్షిప్తమైపోయిన పరమ రహస్యం అయిన భావాలేమిటో … మా కెవ్వరికీ తెలీవు.
ఆ తల్లి దేని కోసం పోరాటం సాగించిందో … తన వొంటరి జీవితంలో ఏం సాధించిందన్న తృప్తితో గడిపిందో, మాకెన్నటికీ తెలియదు.
వొదిన, అమ్మ మెడలో గొలుసు తీస్తున్నప్పుడు, గొలుసు అడుగున రహస్యంగా వున్న మంగళ సూత్రాలు కనిపించేయి. అప్పుడు .. అప్పుడు, ఆ తల్లి అంతరంగం అవగతమై, ఆమె గుండె లోతుల్లో గుట్టుగా దాచుకున్న రహస్యం బహిర్గతమై అన్నయ్య చిన్న పిల్లాడిలా ఏడ్చేడు.
అమ్మ బిలాంగింగ్స్ లో ఉన్న చిన్న కాగితంలో ఆవిడ రాసిన నాలుగు వాక్యాలు చాలు .. ఆవిడ మనసు తెలిసి పోయింది.
తప్పు లెన్నైనా చేయొచ్చు
క్షమ ఉంది.
దేవుడి పట్ల తప్పు చెయ్యకూడదు.
క్షమ ఉండదు.. శిక్ష తప్ప.
మీ నాన్న దేవుడు.
శిక్ష పూర్తిగా అనుభవించేను.
నాన్న మీద అమ్మ కు ఎంత ప్రేమ.
అమ్మ ఆస్థికలున్న కలశాన్ని ఆప్యాయంగా నేను ముద్దు పెట్టుకుంటున్నపుడు అన్నయ్య నవ్వుతూ చూసేడు.
నాకప్పుడు నాన్న దీవించినట్లైంది.! ఎక్కడినుంచో అమ్మ కూడా…!!