నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధ సౌందర్యం

ఎన్నటికీ వసివాడని సౌందర్యం అంటే అది పసిపాపలదే. వారు నవ్వినా ఏడ్చినా అందంగానే ఉంటారు. అందులోనూ చిన్నికృష్ణుడయితే యిహ చెప్పాలా! బాలకృష్ణుని మురిపాల ముచ్చట్లు అనగానే తెలుగువాళ్ళకి గుర్తుకొచ్చే కవి పోతన. పోతన భాగవతంలో శ్రీకృష్ణుని బాలలీలలు ఆపాతమధురాలు. ‘అమ్మా మన్ను తినంగ నే శిశువునో ఆకొంటినో వెఱ్ఱినో’ అంటూ చిన్నారి కృష్ణుడు పలికే ముద్దు ముద్దు మాటలు మనోహరాలు. అయితే, కృష్ణలీలలను వర్ణించే గ్రంథం మరొకటి కూడా ఉంది. అది ఎఱ్ఱన రచించిన హరివంశం. ఒక రకంగా పోతనకు ఎఱ్ఱన మార్గదర్శి అని అనుకోవచ్చు. ఎఱ్ఱన రచించిన నృసింహపురాణ, హరివంశాలలో కొన్ని పద్యాలకి నగిషీలు దిద్ది మరింత అందంగా పోతన తన భాగవతంలో ప్రయోగించాడు. ఎఱ్ఱన అరణ్యపర్వశేషంలోని ‘అంబ నవాంబుజోజ్వల కరాంబుజ’ అనే సరస్వతీస్తుతి తన భాగవత అవతారికలో పొందుపరచడం, పోతనకి ఎఱ్ఱనపైనున్న గౌరవానికి సూచనగా భావించవచ్చు. అయినా కథ నడిపే తీరులోనూ, చేసే వర్ణనలలోనూ ఎవరి ప్రత్యేకత వారిదే!

హరివంశము భారతానికి పరిశిష్ట గ్రంథం. అంటే హరివంశముతోనే భారతానికి సంపూర్తి. కాబట్టి ఎఱ్ఱన అరణ్యపర్వశేషాన్ని పూరించడమే కాకుండా, హరివంశ రచనతో తెలుగులో భారతానికి పూర్ణత్వాన్ని చేకూర్చాడన్న మాట. ఎఱ్ఱన యితర రచనలు నృసింహపురాణము, రామాయణమూను. వీటిలో రామాయణం మాత్రం లభించలేదు. భారత హరివంశాల ద్వారా ఇతిహాసాన్ని, నృసింహపురాణం ద్వారా పురాణాన్నీ, రామాయణం ద్వారా కావ్యాన్నీ – యిలా ముత్తెరంగుల సారస్వతాన్ని మొదట తెనిగించిన ఘనత కూడా ఎఱ్ఱనకి దక్కుతుంది. తిక్కన లాగనో పోతన లాగనో, ఎఱ్ఱన కవితామార్గం యిదీ అని నిర్ణయించడం అంత సులభం కాదు. నేను చదివినంతలో నాకు కనిపించిన ప్రత్యేక గుణాలు రెండు. ఒకటి – వర్ణనలలో శబ్దంపై కన్నా అర్థం పైనా, చిత్రాన్ని రూపుకట్టించడం పైనా అతనికి దృష్టి యెక్కువ. రెండు – సామాన్యుల జీవితాలలో కనిపించే సాధారణ దృశ్యాలూ సంఘటనలూ సంభాషణలూ ఎఱ్ఱన కవిత్వంలో అక్కడక్కడ తొంగిచూస్తూ, మన మనసుల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. అలా కట్టిపడేసే ఒక అపురూప వర్ణన యిప్పుడు చూద్దాం.

నోరన్ జేతులు రెండు గ్రుక్కుకొనుచున్మోమెల్ల బాష్పాంజన
స్మేరంబై తిలకింపనేర్చుచు, బొరిన్ మీజేతులన్ గన్నులిం
పారం దోముచు, చేవబూని పిఱుదొయ్యన్ మీది కల్లార్చుచున్
శ్రీరమ్యాంఘ్రియుగంబు గింజుకొనుచున్ జెల్వంబు రెట్టింపగన్

పాపం ఈ పసివాడిని ఏ బూచాడో భయపెట్టాడు కాబోలు. గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు! నోటిలో రెండు చేతులు కుక్కుకొంటూ మరీ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకి అతని మొగమంతా ‘బాష్పాంజన స్మేరంబు’ అయ్యింది. కన్నీటికి కరిగిన కాటుక ఆ పాపాయి ముఖమంతా అలముకొన్నది. ఎంత చిక్కని పదమో అంత చక్కని పదచిత్రం! మాటిమాటికీ మీజేతులతో (అంటే చేతుల పైభాగం) కన్నులు నులుముకొంటున్నాడు. చేవబూని – అంటే కాస్త బలం తెచ్చుకొని, పిఱుదు మెల్లిగా పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పసివాని పాదాలు శ్రీరమ్యంగా ఉన్నాయి. అంటే ఎంతో శోభతో మనోహరంగా ఉన్నాయి. ఆ లేలేత పాదాలను గింజుతూ తంతూ ఉంటే అతని అందం రెట్టింపవుతోంది!

అమ్మ దూరంగా వెళ్ళేసరికి ఉంగా ఉంగా అంటూ గుక్కపట్టి ఏడ్చే పసివాని రూపం ఈ పద్యంలో మన కళ్ళముందుంచాడు ఎఱ్ఱన. ‘చాలుంజాలు కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో’ అన్నాడు ధూర్జటి, దైవస్వరూపాన్ని గురించి చెపుతూ. సరిగ్గా పసిపాపల విషయంలో కూడా అదే వర్తిస్తుందేమో అనిపిస్తుంది యీ పద్యం చదివితే. ఎక్కడా శబ్దాడంబరం కానీ, అలంకార అతిశయం కానీ లేకుండా, సహజసుందరంగా రూపుదిద్దుకొన్న యీ చిత్రం లీలామోహనం. ఇది అచ్చంగా ఆ లీలామోహనుని రూపమే! కథాసందర్భాన్ని బట్టి ఆ విషయం బోధపడుతుంది. అయితే, విడిగా పద్యాన్ని పద్యంగా చదివినా కూడా యిందులోని పాపడు చిన్నికృష్ణుడే అని పోల్చుకోనేట్టుగా ఒక పదాన్ని ప్రయోగించాడు ఎఱ్ఱన. ఇలాంటి సార్థక పదప్రయోగాలు భాషపై కవికి ఉన్న పట్టుని పట్టిస్తాయి. కవిత్వానికొక కొత్త మెరుపుని చేకూరుస్తాయి. ఇంతకీ ఆ పదాన్ని మీరీపాటికి పోల్చుకొనే ఉంటారు. అవును, అది ‘శ్రీరమ్యాంఘ్రియుగము.’ ఈ పదానికున్న మరొక అర్థం – శ్రీకి రమ్యమైన అంఘ్రియుగము, అంటే లక్ష్మీదేవికి ప్రీతినిగూర్చే పాదయుగం. ‘ప్రేమపు శ్రీసతి పిసికేటి పాదము’లు ఆ శ్రీహరివే కదా!

ఎఱ్ఱన కవిత్వంలోని గడుసుదనం తెలియాలంటే, హరివంశంలో యీ పద్యం వచ్చే సన్నివేశం తెలియాలి. కంసుడు పంపిన రాక్షసులలో రెండవవాడైన శకటాసురుని కృష్ణుడు సంహరించే సన్నివేశంలో వచ్చే పద్యమిది. యశోద స్నానానికని గోపసతులతో నదీతీరానికి వస్తుంది. తాము వచ్చిన బండి క్రింద పక్కవేసి కృష్ణయ్యను పడుకోబెట్టి, నది దగ్గరకి వెళుతుంది. ఆ బండిని శకటాసురుడు ఆవహిస్తాడు. ఇంతలో కృష్ణుడు మేలుకొంటాడు. తల్లి దగ్గర లేకపోయేసరికి ఏడుపు లంకించుకొంటాడు. అప్పుడా బాలకృష్ణుని ముగ్ధస్వరూపాన్ని వర్ణించే పద్యం ఇది. బహుశా శకటాసురునికి కూడా అలాగే కనిపించి ఉంటాడు. అందుకే అవలీలగా అతని పైబడి ప్రాణాలు తియ్యడానికి పూనుకొంటాడు. కాలితో ఒక్క తాపు తన్నుతాడు శ్రీకృష్ణుడు. ఆ దెబ్బతో అసురుని అసువులు గాలిలో కలసిపోతాయి. ఇంత చేసీ మళ్ళీ ఏమీ ఎరగనట్లు చంటిపాపలా యశోదాదేవి ఒడిలో ఒదిగిపోతాడు శ్రీకృష్ణస్వామి. ఆ ముగ్ధమోహన సౌందర్యాన్ని మరొక అందమైన పద్యంలో యిలా ముర్తికట్టాడు ఎఱ్ఱన.

స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మా
ననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలో
చనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొ
ప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్

ఆ నందనందనుడు నందగోపునికి కనిపించిన తీరిది. స్తన్యమనే అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అందమైన చిరునవ్వొకటి ఆతని మోమును వెలిగిస్తోంది. విచ్చుకున్న తామరాకుల్లాంటి కన్నుల కాంతులు అమ్మవైపు ప్రీతితో ప్రసరిస్తున్నాయి. దానివల్ల ఆమె ముఖం చంద్రబింబంలా ప్రసన్నంగా ఉంది. ఇంతటి పసిబాలుడు, ప్రసన్నమూర్తి, కొద్ది క్షణాల ముందొక పెద్ద రక్కసుణ్ణి సంహరించాడంటే ఎవరు నమ్మగలరు!

శకటాసురవధ వంటి అమోఘకార్యాన్ని యీ రెండు అందమైన పద్యాల నడుమా బిగించడం ద్వారా, కృష్ణుడు చేసే కార్యాలకూ అతను పైకి కనిపించే తీరుకీ ఎంతటి వ్యత్యాసమున్నదో మనకి స్పష్టంగా ఆకళింపు చేశాడు ఎఱ్ఱన. కృష్ణుడెంతటి లీలామానుషస్వరూపుడో మనకీ సన్నివేశం చక్కగా నిరూపిస్తుంది. ఎంత అమాయకంగా కనిపిస్తాడో అంత మాయగాడు కదా మరి కృష్ణుడు!

తన మాయాజాలంబుల
మునిగి సకలలోకములును ముగ్ధంబులుగా
దనరెడు ప్రౌఢుడు, లోకము
తన మౌగ్ధ్యంబునకు బ్రముదితంబగుచుండన్

ఇది కూడా ఆ సందర్భంలో ఎఱ్ఱన రచించిన పద్యమే. నిజానికి తన మాయలో మునిగిన లోకులందరూ అమాయకులు. కానీ ఆతని ముగ్ధత్వాన్ని చూసి లోకమంతా మురిసిపోతుంది, అదే పరమచిత్రం!