ఒంటరితనం

(విన్నకోట రవిశంకర్‌ గారు “ఈమాట” పాఠకులకు చిరపరిచితులు. ప్రఖ్యాత కవి. “కుండీలో మర్రిచెట్టు” అనే కవితా సంకలనం ప్రచురించారు. మరో సంకలనం సిద్ధం చేస్తున్నారు. సౌత్‌ కేరొలైనా లోని కొలంబియాలో ఉంటారు.)

ఏ చిరు దీపమూ పెదవులు సాచి
మృదువుగానైనా  చుంబించకనే గదా
ఈ ప్రమిదలో వత్తికి
వేడి,వెలుగుల అనుభవం లుప్తమై పోయింది.

ఏ కొమ్మా తన పలుకులకి
తన్మయత్వంతో తలాడించకనే గదా
ఈ చిలుక పాత మాటల పంజరంలో
బందీయై పోయింది.

ఒకసారి ప్రేమగా వెలిగిస్తే చాలు
ఆపై కోరికతో జ్వలించి
ఆనంద నాట్యం చెయ్యటం,
దీపానికెవరూ నేర్పనక్కర్లేదు.

దయ తలచి,నాలుగు వేళ్ళు
దాని పంజరపు తలుపు తెరిస్తే చాలు
రెక్కలు టపటపలాడిస్తూ రాగాలాలపించటం
పిట్టకెవరూ నేర్పనక్కర్లేదు.

నునువెచ్చని అరచేయి యేదీ
తనను స్పృశించకనే గదా
ఈ భుజం మీద ఒంటరితనం
యింతగా గడ్డ కట్టింది.