ఎందుకో అలా!

ఒక లైబ్రరీ ర్యాకు
ఇద్దరు పరిశోధకులు
దొరకనిదే
ఓ ప్రేమ ప్రకటితమవదు

ఓ కొండచిలువ రాత్రి
నాలుగు వగరు బీర్లు
ఖర్చవనిదే
ఓ స్నేహం చిక్కబడదు

ఒక శీతాకాలపు సాయంత్రం
కొన్ని అయస్కాంతపు చూపులు
నలగనిదే
మంచం సద్దు చేయదు

ఓ నిశీధి ఏకాంతం
కొన్ని అలజడి కెరటాలు
తరమనిదే
కవితలు రెక్కలు విప్పవు

ఒక విప్లవం
కోటి గొంతుకలు
మోయనిదే
ఏ సరిహద్దులు చెరగవు

వెయ్యి యుద్ధాలు
నీతో నువ్వే నీలో నువ్వే
గెలవనిదే
గమ్యం దరిచేరదు