మహాకవి కాళిదాసు గురించి వ్రాసిన తన వ్యాసంలో శ్రీ అరోబిందో అంటారు: భారతజాతి తనకున్నదంతా కోల్పోయినా, వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం, వ్యాస మహాభారతం, కాళిదాస గ్రంధాలూ మిగిల్తే చాలు. అవి మన ఆలోచనా విధానాలకీ, విశ్లేషణకీ, మనం నిర్మించుకున్న సంస్కృతికీ, మన నైతిక, మానసిక, తాత్విక, రస సిద్ధులకీ వాటి పరిణామ క్రమానికీ, మనం జీవితాన్ని వైభవోపేతం చేసుకున్నపద్ధతులకీ, సాధనలకీ ప్రతీకలన్నది శ్రీ అరోబిందో పరిశోధించి మనకి అందించిన సత్యం.
పాత రోజుల్లో, అంటే కొన్ని వేలసంవత్సరాల క్రితం, భారతదేశంలో ప్రజలు రకరకాల జీవన విధానాల మీద ప్రయోగాలు చేశారు. వాటిలో ముఖ్యంగా చెప్పవలసినవి మూడు రకాల ప్రయోగాలు. మొదటిది నైతిక జీవనాన్ని, రెండవది తార్కిక జీవనాన్ని, మూడవది రసమయ జీవనాన్ని ఆధారంగా చేసుకున్నవి. నైతికజీవనాన్ని వాల్మీకి మహర్షి, తార్కికజీవనాన్ని వ్యాస మహర్షి, వివరిస్తూ ప్రతిబింబిస్తూ శ్రీమద్రామాయణ, మహాభారతాల్ని అందించారు.
కొన్ని వేల సంవత్సరాల తరువాత, ప్రజాజీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని, ప్రజల్లో జీవితాన్ని పండగలా చేసుకోవాలనే ఆరాటం మొదలైంది. ఆ రసమయ ప్రపంచాన్ని మనకందించడం లోనూ, తన సృజనాత్మకతతో పరిపుష్టం చేయడం లోనూ, అలాంటి జీవితాన్ని ఆనందించడానికి సరైన మానసికస్థితుల్ని తెలియజెయ్యడం లోనూ, మార్గదర్శకుడైన వాడు మహాకవి కాళిదాసు. వాల్మీకి, వ్యాసులని వ్యతిరేకించకుండా, ఆ ధర్మాన్ని చాటుతూనే, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అన్న ప్రక్రియని తనవైన కొత్త భావాల్తో కవిత్వరూపంలో ఆవిష్కరించిన స్రష్ట. రసమయ జీవితాన్ని తరవాత తరాల కోసం రకరకాల రంగుల్లో చిత్రీకరించిన తొలికవి. ఆ తరవాత వచ్చిన కవులు ఈతని పంథాలోనే పయనించారు. రసమయ భావప్రపంచాల్ని కావ్యాలుగా మలచారు. కాని, ఏ కవులూ కాళిదాసుకున్న ప్రతిభావ్యుత్పత్తుల్ని ప్రదర్శించలేకపోయారన్నది అందరూ ఒప్పుకున్న సత్యం. ఈ భావాల్నే కొందరు చిన్న శ్లోకంలో చమత్కారంగా చెప్పారు.
పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా
అద్యాపి తత్తుల్యకవే రభావాదనామికా సార్ధవతీ బభూవ
[పురా = పూర్వం రోజుల్లో; కవీనాం గణనా ప్రసంగే = కవులను లెక్కించే ప్రస్తావన వచ్చినప్పుడు; కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా = చిటికినవేలు మీద కాళిదాసు నిలబడ్డాడు. అద్యాపి = (అప్పటినుంచి) ఈ రోజు దాకా; తత్ తుల్యకవేః = అతనికి సమానమైన కవియొక్క; అభావాత్ = (ఉనికి) లేకపోవడంవల్ల; అనామికా = ఉంగరంవేలు (అనామిక); సార్ధవతీ బభూవ = సార్ధకనామధేయురాలైంది.]
(పూర్వం కవుల్ని లెక్క పెడదామని మొదలు పెట్టి, లెక్కపెట్టేవాడు చిటికిన వేలెత్తి ‘కాళిదాసు’ అన్నాడు. తర్వాత పక్కనున్న వేలు ఎత్తి ఇంకో కవి పేరు చెప్పాలంటే (అది ఉంగరం వేలు, చిటికినవేలు కన్న పెద్దది) అంతకన్న పెద్దకవిని లెక్కపెట్టాలి. అలాంటివాడు లేడు కాబట్టి ఆ లెక్కపెట్టేవాడు అక్కడే ఆగిపోయాడు. ఆ కారణం వల్ల ఉంగరం వేలుకి అనామిక (పేరులేనిది) అన్న పేరు సరిగ్గా సరిపోయింది.)
మిగిలిన కవులు కూడా గొప్ప కవిత్వాన్ని సృష్టించారనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని జయదేవుడు ఒక శ్లోకంలో మనోహరంగా చెప్తాడు.
యస్యాశ్చోర శ్చికురనికరః కర్ణపూరో మయూరో
భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః
హర్షో హర్షో హృదయవసతిః పంచబాణస్తు బాణః
కేషాం నైషా కథయ కవితాకామినీ కౌతుకాయ
[యస్యాః = ఎవరికి; చోరః = చోరకవి; చికురనికరః = చిక్కని జుట్టో; మయూరః = మయూరుడు; కర్ణపూరః = చెవికమ్మయో; భాసః = భాసుడు; హాసః =నవ్వో; కవికులగురుః = కవికులగురువైన; కాళిదాసః = కాళిదాసు; విలాసః = విలాసమో; హర్షః = శ్రీహర్షుడు; హర్షః = ఆనందమో; బాణః= బాణుడు; హృదయవసతిః = మనసులో నిలచిన; పంచబాణః = మన్మథుడో ; ఏషా కవితాకామినీ = అట్టి ఈ కవితాకామిని; కేషాం = ఎవరికి; కౌతుకాయ = ఉత్సాహము కొరకు (ఉత్సాహమునిచ్చునది); న తు = కాదో; కథయ = చెప్పుము?]
(కవితాకామినికి చోరకవి కేశపాశం, మయూరుడు చెవులకి ఆభరణంలాంటి వాళ్ళు. భాసుడు ఆమె చిరునవ్వు. కవికులగురువు కాళిదాసు ఆమె విలాసం. హర్షుడు ఆమె ఆనందం. బాణుడు ఆమె మనసులో నిలచిన మన్మథుడు. ఇలాంటి అమ్మాయి ఎవరికి ఉత్సాహం కలగించదో చెప్పండి )
ఈ ప్రశంసలో జయదేవకవి ఒక్క కాళిదాసుని గురించి చెప్పినప్పుడు మాత్రమే కవికులగురుః అని సంబోధించాడు.
భాష, భావం, రసఙ్ఞత, దృశ్యచిత్రీకరణ, పరిసరాల పరిశీలన, మనోహరమైన భావవ్యక్తీకరణ, శిల్పసౌందర్యం, రమ్యంగా కథ చెప్పడం, మనోవిశ్లేషణ, విషయపరిజ్ఞానం, … ఇలా ఎన్నో విషయాలు కవితాత్మలో భాగాలు. కాళిదాసు వీటన్నిటినీ నభూతో నభవిష్యతి అన్నట్లు పోషించి ప్రతి కావ్యాన్నీ, ప్రతి శ్లోకాన్నీ, ప్రతి నాటకాన్నీ భారతీయ సంస్కృతికి దర్పణంగా సృష్టించి అర్పించి కవికులగురువయ్యాడు. అంతే కాదు, అలాంటి విద్యని అభ్యసించడానికి పునాదుల్ని వేసి జాతికి అధ్యాపకుడయ్యాడు.
కాళిదాసు భారతీయ కవితకి ఆత్మ వంటివాడు. కవిత ఏ రూపాన్నైనా పొంది ఉండవచ్చు. కవితాత్మ పాలు కొంతైనా దానిలో ఉంటుంది. ఇలా కాళిదాసప్రభావం తరువాత తరాల కవుల్లో ఉంటూనే వచ్చింది. కాళిదాసు భారతసంతతికి కేవలం కవిత్వాన్నే ఇవ్వలేదు. ఇంకా కొన్ని మౌలిమైన, మేధాపరమైన, సాంస్కృతిక పరమైన ఉపాధుల్ని సమకూర్చాడు. అవేమిటి? కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడు? అన్నది ఈ వ్యాసానికి మూలవస్తువు.
కవితాత్మలో కొన్ని భాగాల్ని కాళిదాసు ఎలా పండించి పోషించాడు? ఏ విధంగా అతడు మనకి అధ్యాపకుడు? అన్నది స్థూలంగా చర్చించడమే మిగిలిన వ్యాసం యొక్క ముఖ్యోద్దేశ్యం. కాళిదాసు కవిత్వంలో రసజ్ఞత గురించి వేరే చెప్పక్కర్లేదు. అది అన్నివేళలా తొణికిసలాడుతూనే ఉంటుంది. ఇక మిగిలిన విషయాలకొస్తే, ఇంత చిన్న వ్యాసంలో అన్నీ కూలంకషంగా (ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డు దాకా) చర్చించడం సాధ్యం కాదు కాబట్టి, కొన్నింటిని కాస్త విశదంగా, కొన్నింటిని స్థాలీపులాకంగా, కొన్నింటి గురించి సూక్షంగానూ చెప్పి ముగిస్తాను.
1. భాష
భాషని నాదయోగంగా భావించినవాడు కాళిదాసు. పలికే మాట (శబ్దం), దానికున్న అర్ధం, వీటి మధ్యనున్న విడదీయరాని అర్థనాదేశ్వరబంధం అర్ధనారీశ్వరబంధంలాంటిదని పూర్తిగా తెలిసినవాడు. కాబట్టే రఘువంశాన్ని,
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ — (రఘువంశః 1-1)
అని మొదలు పెట్టాడు. పైగా వాగర్థప్రతిపత్తి (శబ్దం, అర్థం రెండింటికీ సంబధించిన జ్ఞానం అబ్బడం) కోసమే జగత్తుకి తల్లిదండ్రులైన (పితరౌ) పార్వతిని, పరమేశ్వరుణ్ణీ ప్రార్థిస్తున్నానన్నాడు. పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. మొదటి శ్లోకంలోనే, వాగర్థప్రతిపత్తికోసం ప్రార్థిస్తున్నా (వందే) అనగానే అది పుష్కలంగా దొరికేసినట్టుంది, వెంటనే పార్వతీపరమేశ్వరౌ అనే గొప్ప శ్లేష చూపాడు.
రమ్యమైన పదాల్తో పూలజల్లులు కురిపించడం, కోమలమైన పదబంధాల్తో కట్టిపారెయ్యడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. సంస్కృతభాషతో పరిచయం తక్కువ ఉన్న (లేదా అసలు లేని) వాళ్ళకి కూడా హృద్యంగా తోచే విధంగా కూడా వ్రాశాడు. కేవలం పదనాదం ద్వారా రమ్యతను సృష్టించాడు. ఋతుసంహార కావ్యంలో కాళిదాసు ఆరు ఋతువుల్నీ ఆరు సర్గల్లో వర్ణించాడు. మచ్చుకి ఋతుసంహారం లోని మూడు శ్లోకాలు చూడండి.
సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి శోభితం
ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణామ్ – (వర్ష ఋతువు)
(ఎప్పుడూ మనోజ్ఞంగా, శబ్దాలతో కూడిన మహోత్సవంలో తేలియాడుతూ, విస్తరించి విసరబడిన పింఛంతో శోభిస్తూ ఉన్న నెమళ్ళ గుంపులు ఇప్పుడు ముప్పిరిగొన్న ఆనందంలో ఒకదాన్నొకటి కౌగిలించుకుంటూ, ముద్దులాడుకుంటూ నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి. పైన చెప్పిన శబ్దాలు నెమళ్ళ కేకలు కావచ్చు లేదా మేఘాల గర్జనలు కావచ్చు.)
నితాంత లాక్షారసరాగరంజితైః నితంబినీనాం చరణైః సనూపురైః
పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్ – (గ్రీష్మ ఋతువు)
(దట్టంగా పూసిన లాక్షారసం రంగు వల్ల ఎర్రబడి, అందెలతో కూడిన స్త్రీల పాదాలు అవి వేసే ప్రతీ అడుగులోనూ హంసల ధ్వనులను అనుకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అది విన్న జనులందరి మనస్సులూ మన్మథప్రభావాన్ని పొందుతున్నాయి.)
ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః
జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం
మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్
సోఽయం వో వితరీతరీతు వితనుర్భద్రం వసంతాన్వితః – (వసంత ఋతువు)
(ఎవడి గొప్ప బాణాలు అందమైన ఆకర్షణీయమైన మామిడిపూల గుత్తులో, ఎవడి విల్లు మోదుగపువ్వో, ఎవడి వింటినారి తుమ్మెదల బారో, ఎవడి మచ్చలేని తెల్లని గొడుగు తెల్లని కిరణాల్తో కూడిన చందమామో, ఎవడి మదపుటేనుగు గంధపుచెట్లున్న మలయపర్వతపు వాయువో, ఎవడి వంది జనం (స్తోత్రపాఠాలు చేసేవాళ్ళు) కోకిలలో, అటువంటి లోకాల్ని జయించే మన్మథుడు, తన స్నేహితుడైన వసంతుడితో కలిసివచ్చి (అంటే వసంతకాలంలో) మీ అందరిమీదా సుఖభాగ్యాల్ని వెదజల్లుగాక! )
ఋతుసంహారం కాళిదాసు తొలిరోజుల్లో వ్రాసినది. రాను రాను, పదలాలిత్యానికి గాఢమైన భావాల్ని కూడా జోడించి తన భాషకీ, పదనాదానికీ కొత్త రంగులు దిద్దాడు. తరువాత వ్రాసిన రఘువంశ, కుమారసంభవ, మేఘదూత కావ్యాల్లో ఇది బాగా కనిపిస్తుంది. ఆ కావ్యాలు చదివి ఆనందించాలంటే సంస్కృతభాష నేర్చుకోవాలి. శ్రీమద్రామాయణం చదవాలంటే కొద్దిగా భాష తెలిస్తే చాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఏ భాషవాళ్ళకి, ఆ భాషలో వాల్మీకి మహర్షి వ్రాసిన పాటలా ఉంటుంది. శ్లోకంలో ఉన్న పదాల్ని గద్యక్రమంలో (కర్త-కర్మ-క్రియ వరసలో) పేర్చుకుని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాళిదాసు కావ్యాలకొస్తే, ఋతుసంహారంలో తప్ప మిగిలిన కావ్యాల్లో శ్లోకాల్ని గద్యక్రమంలో పేర్చుకోవడం, కొన్ని పదబంధాలకి అర్థాన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు. భాషను ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ పరిణామాన్ని పై మూడు శ్లోకాల్లోనే చూడవచ్చు. వీటిలో మూడవ శ్లోకం ఋతుసంహారంలో ఆఖరి సర్గ అయిన వసంతర్తువులో ఆఖరి శ్లోకం.
ఇలా భాషను నేర్వగా, నేర్వగా ఈ క్రింద చెప్పిన లాంటి శ్లోకాల్లో, గీతరచయిత వేటూరి చెప్పినట్టుగా ‘ఆరు ఋతువులూ ఆహార్యములై’ కనిపిస్తూంటే, భావాల విందు, నాదాల పసందు రెండింటినీ అనుభవిస్తాం.
అది కుబేరుడి అలకానగరం అవడం వల్ల అన్ని ఋతువులూ అన్ని వేళలా ఉంటాయి. అందువల్ల అక్కడి వనితలు అన్ని ఋతువుల పువ్వుల్నీ అన్ని వేళలా దేహమంతా ధరిస్తారని మేఘుడికి (మబ్బుకి) యక్షుడు చెప్తున్నాడు.
హస్తే లీలాకమల మలకే బాలకుందానువిద్ధం
నీతా లోధ్రప్రసవరజసా పాండుతామాననే శ్రీః
చూడాపాశే నవకురువకం చారు కర్ణే శిరీషం
సీమంతే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్ – (మేఘసందేశః 2-2)
[యత్ర= ఏ (అనగా ఆ కుబేరుని అలకానగరంలో); వధూనామ్ = స్త్రీల యొక్క; హస్తే = చేతిలో; లీలా కమలమ్ = విలాసం కోసం పట్టుకున్న తామరపువ్వు (ఇది శరదృతువులో లభిస్తుంది); అలకే = ముంగురుల్లో; బాలకుందానువిద్ధమ్ = తురుముకోబడ్డ అప్పుడే విరిసిన మల్లెలు (ఇది హేమంత ఋతువులో లభిస్తుంది); ఆననే = ముఖం మీద; లోధ్రప్రసవరజసా = లొద్దుగ పువ్వుల పుప్పొడిచేత (దీన్ని పౌడర్ లా వాడి); నీతా= ఇవ్వబడిన; పాండుతామ్ శ్రీః= గౌరవర్ణపు శోభ (లొద్దుగ శిశిర ఋతువులో లభిస్తుంది); చూడాపాశే = కొప్పు ముడిలో; నవకురువకం = ఎర్ర గోరింట పువ్వు (ఇది వసంత ఋతువులో లభిస్తుంది); కర్ణే = చెవియందు; చారు శిరీషం = అందమైన దిరిసెన పువ్వు (ఇది గ్రీష్మ ఋతువులో లభిస్తుంది); సీమంతే = పాపటలో; త్వత్ =నీ; ఉపగమజం = రాక వల్ల పుట్టిన (వర్షాకాలం లో లభించే); నీపం చ = నీపకుసుమమూ (ఉంటాయో/యి).]
ఈ విధమైన భాషావికాసమే కాళిదాసుని కవికులగురువుగా మాత్రమే కాదు, సంస్కృతగురువుగా కూడా నిలబెట్టింది. సంస్కృతం నేర్చుకోవడంలో మొదటి భాగం పంచకావ్యాలు గురువు దగ్గర కూర్చుని చదివి అర్థం చేసుకోవడం. పంచకావ్యాలంటే రఘువంశం (కాళిదాసు), కుమారసంభవం (కాళిదాసు), కిరాతార్జునీయం (భారవి), శిశుపాలవధం (మాఘుడు), నైషధీయ చరితం (శ్రీహర్షుడు). దాక్షిణాత్యులు కొందరు నైషధీయ చరితం బదులు మేఘసందేశం (కాళిదాసు) అని అంటారు. ఏ లెక్కన చూసినా, అధ్యయనం విషయానికొస్తే, కాళిదాస గ్రంథాలకే పెద్దపీట. భాష నేర్వాలన్నా, భాషాసౌందర్యాన్ని అనుభవించాలన్నా కాళిదాసే.
ఆ కావ్యాల్ని చదవడం కూడా పైన చెప్పిన వరస లోనే చదవాలి. అప్పుడే భాషని సవ్యంగా నేర్చుకోగలుగుతాం. రఘువంశంలో భాష సరళంగా ప్రారంభమై, ఒక కావ్యాన్నుండి మరో కావ్యానికి వెడుతూంటే సంక్లిష్టంగా మారుతూ విద్యార్థుల మెదడుకి పరీక్షలు పెడుతుంది. అందుకే, నైషధం విద్వదౌషధం అనే సామెత. ఈ పాఠ్యప్రణాళికలో, కాళిదాసు విద్యార్ధులకిచ్చిన గొప్ప బహుమతి రఘువంశం నుంచీ కూడా కవితాసువాసనల్ని వెదజల్లడం. ఒకప్రక్క భాషని నేర్చుకుంటూండగానే, అద్భుతమైన భావసంపదలో చదువుకునే వాళ్ళని ముంచి తేల్చడం. భాషావిషయమైన అంతరార్ధాల్ని తెలియజెప్పడం. (రఘువంశం మొదటి శ్లోకంలోనే చూడండి. పదానికీ, దానికుండే అర్థానికీ గల సంబంధంతో మొదలు పెట్టాడు కావ్యాన్ని.)
కాళిదాసుకి భాషావ్యాకరణాలపైన ఉన్న మక్కువ గురించి సరదాగా, సూచనప్రాయంగా కొన్ని ఉదాహరణలిస్తాను.
తా నరాధిపసుతా నృపాత్మజైః తే చ తాభి రగమన్ కృతార్థతామ్
సోఽభవ ద్వర వధూ సమాగమః ప్రత్యయ ప్రకృతి యోగ సన్నిభః – (రఘువంశః 10- )
[తాః నరాధిపసుతాః = ఆ రాజకన్యలైన సీత, ఊర్మిళ, మాండవిక, శ్రుతకీర్తులు; నృపాత్మజైః = రాజకుమారులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల చేతనూ; తే తాభిః చ = వీరు వారిచేతనూ (అంటే రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, సీత-ఊర్మిళ-మాండవిక-శ్రుతకీర్తుల చేతనూ); కృతార్థతామ్ = కులం, శీలం, వయస్సు, రూపం మొదలయినవాటిని; అగమన్ = పొందిరి. సః వరవధూ సమాగమః = ఆ పెళ్ళికొడుకుల, పెళ్ళికూతుళ్ళ కలయిక; ప్రత్యయ ప్రకృతి యోగ సన్నిభః = ప్రత్యయాల యొక్క,ప్రకృతుల యొక్క కలయికలా ప్రకాశించినదిగా; అభవత్ = అయ్యెను.]
సంస్కృత భాషలో ప్రకృతికి ప్రత్యయాన్ని జత చేస్తేనే ఉద్దేశింపబడ్డ అర్థం వస్తుంది. దాదాపు ఇది అన్ని భారతీయభాషలకీ వర్తిస్తుంది. ఉదాహరణకి, భూ (ఉండు), డుకృఞ్ (చేయు) అనే పదాలు ప్రకృతులు (ఇవి ధాతువులైన ప్రకృతులు). వీటికి తిజ్ అనే ప్రత్యయం చేరి భవతి (ఉన్నది, ఉన్నాడు) కరోతి (చేయుచున్నది, చేయుచున్నాడు) మొదలైన అర్థాలున్న పదాలు ఏర్పడతాయి. ఇలా, సుప్, సన్ మొదలైన రకరకాల ప్రత్యయాలు వేర్వేరు ప్రకృతులకు చేరి రకరకాల పదాలు ఏర్పడి అర్థాన్నిస్తాయి. ఇలా పదార్థాల్నిచ్చే కలయికతో, పురుషార్ధాల్నిచ్చే వధూవరుల చేరికని పోలుస్తున్నాడు కాళిదాసు పై శ్లోకంలో.