“టీచర్! వాడు కమ్యూనిటీ హాల్ స్టేజి దగ్గరున్నడు టీచర్! అదే టీచర్, మొన్న వినాయకచవితికి గణేశ్ని పెట్నిం జూడు. అక్కడే టీచర్!” సంతోష్ రొప్పుకుంటూ వచ్చి చెప్పాడు. వాడి కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి.
“సరే, ఇక నువ్వు క్లాసుకెళ్ళు.”
సుజాత చుట్టూ చూసింది. టీచర్లు బిజీగా ఉన్నారు. జ్యోతి, హైమల గొంతులు వినిపిస్తున్నాయి. లేచి, బయటికొచ్చి చెప్పులేసుకుంది. పిల్లలతో మెడిటేషన్ చేయిస్తున్న జ్యోతి ఎక్కడికన్నట్టు తలెగరేసింది. ఇప్పుడే వస్తానంటూ గేటు తెరిచి బయటికొచ్చింది సుజాత. కమ్యూనిటీ హాల్ స్కూలుకు కొంచెం దూరం. గబగబా నడిచి పదడుగులు వేయగానే సన్నగా ఆయాసం రావడంతో నెమ్మదించింది. కానీ, కోపం తగ్గలేదు.
‘దొంగ వెధవ! ఈరోజు గనుక దొరికాడో, వీడిక అయిపోయాడే! ఏమనుకుంటున్నాడు వీడు, నాతోనే నాటకాలేస్తున్నాడూ, వేలెడంత లేడు! …’
అసలు వీలవదని సుజాత మొదటి రోజే చెప్పింది. రాఘవులు వింటేనా? ఇంకొన్ని రోజులకే సూరిగాడి వరస అర్ధమయ్యింది.
“ఇగో అమ్మ… మల్ల ఆ చెట్లల్ల చేరి లొల్లి జేస్తుండు. కుక్కల్తొ ఆడుతుండు. నాల్గు చంప మీద కొట్టినగని రాలే. జరంత జూడు…” చెప్పబోయాడో రోజు.
“ఏం చూడమంటావయ్యా! ఎప్పుడూ కుదురుగా ఉండడు నీ కొడుకు.” సుజాత గయ్యిమంది.
“అయినా వాడి వయసెంతని? నాలుగేళ్ళు నిండనోడికి చదువంటే ఎందుకు శ్రద్ధ వుంటుంది? ఇంకో ఏడాదాగి తీసుకురా. ఇప్పుడే చదువులొచ్చేయాలంటే ఎలా? పొద్దున్నొస్తాడు. ఎప్పుడింటికి పోతాడో తెలీదు. మళ్ళా మధ్యాహ్నం తిండివేళప్పుడు వస్తాడు. తిన్నాక వెళ్ళిపోతాడు. ఎంతమంది పిల్లలతో వేగేది?”
“అమ్మమ్మ… అట్లనకు. ఈడేడ్కకు బోయినగని మల్ల నీ ముచ్చట్లే చెప్తడు. కొంచెం సదూకుంటే మంచిగైతది. జర మీ పోరగాడే అనుకోన్రి…”
సుజాత మెత్తబడింది. “ఇలా మాటిమాటికీ పోతే ఎలా రాఘవులూ! సరే వదిలిపో.” సూరిగాడి వైపు తిరిగింది కళ్ళు పెద్దవి చేసి. నిటారుగా నిలబడున్నాడు వాడు నాన్న పక్కన, సుజాతనే చూస్తూ.
“ఏరా ఉంటావా, మళ్ళీ పారిపోతావా?”
“పోను టీచర్!” చేతులు కట్టుకుని మరీ చెప్పాడు.
“ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, వాడు గనక మళ్ళీ స్కూల్ నుంచి బయటకు వచ్చాడనుకో, అలాగే తెచ్చి మీ ఇంట్లో వొదిలేస్తా. ఆ తర్వాత ఇక రానీయను.” గట్టిగా చెప్పింది. రాఘవులు తిరిగి ఏదో అనబోయి ఆగి, కొడుకుని భుజం మీద చెయ్యేసి ఆయా వైపుకి నెట్టాడు.
“ఒరే సూరీ, ఇంకోసారి పారిపోయావో నీ పని చెప్తా. స్కూల్ లోకి ఇక రానివ్వను. ఏమనుకున్నావో…” అనసూయమ్మ చెప్తూనే ఉంది. వాడి ధ్యాస అప్పటికే గోడమీదకు దూకి ‘మ్యావ్’మన్న పిల్లి మీదకు పోయింది. “అర్రే, పిల్లీ…” ఒక్కసారిగా పిల్లి వైపు పరిగెత్తాడు. వాడి వెనుకే ఇంకో ఇద్దరు పిల్లలు.
“అబ్బా!” తలపట్టుకుంది సుజాత కోపంతో ఇంకేమీ చేయలేక.
ఆ రోజు సుజాత ఇద్దరు పిల్లల్ని సూరిగాడికి కాపలాగా పెట్టింది. వాళ్ళు చాలా ఉత్సాహంతో పెద్ద టీచర్ మాటలు పాటించారు. ఒంటేలుకు కూడా ఒంటరిగా వదలకుండా వాడి వెంటే వున్నారు. రెండోరోజుకల్లా సూరిగాడికి చాలా కడుపునొప్పి వచ్చింది. ఇంట్లోనే ఉండిపోయాడు. మూడో రోజు ఉదయం కూడా అలానే ఉందన్నాడు. వాణ్ణి బతిమాలి పడుకోబెట్టి, వాళ్ళ అమ్మ గబాగబా పని ముగించుకునొచ్చేసరికల్లా పత్తా లేడు. నాలుగో రోజు మళ్ళీ రాఘవులు తెచ్చి వదిలాడు. “అమ్మ! జర బద్రం. పోరగాడు మల్ల ఉరికిపోతడు,” అంటూ.
ఈసారి సుజాత కూడా ఒక కన్ను వాడి మీదే వేసి వుంచింది. ఇంటర్వెల్‌లో కూడా వాడిని వదలకుండా తన పక్కనే కూర్చోబెట్టుకుంది సుజాత. ఇంతలో ఎవరో డోనర్స్ వస్తే వాళ్ళకి స్కూల్ చూపించడానికి వెళ్ళింది. అనుకున్నట్టుగానే వెనక్కి వచ్చేసరికి వాడు లేదు.
వాడు చేరి ఇంచుమించుగా అయిదు నెలలు కావస్తుంది. పనుంటేనో, ఏం తోచకపోతేనో, ఆకలేస్తేనో వస్తాడు. రాఘవులు రావడం అప్పగించడం ఆగిపోయిందిప్పుడు. వాడు అటు రాఘవుల దగ్గరికీ వెళ్ళడు, ఇటు స్కూలుకీ రాడు. ఇంట్లో ఉంచాలంటే రాఘవులు భార్య పనికి వెళ్ళిపోతుంది.
“ఇదో లంపటం అయిపోయింది నాకు. ప్రతీసారీ వీడికి కాపలా కాసి ఎలా ఉన్నాడో పట్టించుకోవాలి. రేపెమైనా అయితే… మళ్ళీ స్కూల్ వాళ్ళని అంటారు.” అనసూయమ్మతో అన్నది సుజాత.
సుధాకర్ తన కంపెనీ ఫ్రెండ్స్ కొందరిని స్కూలుకి తెస్తానని ఎప్పుడో చెప్పాడు. ఇప్పటికి కుదిరింది. ఆ కంపెనీ వాళ్ళు ప్రతీ క్రిస్మస్‌కూ ఏదో ఒక ఆర్ఫనేజికో, ఇలాంటి అండర్ ప్రివిలేజ్‌డ్ స్కూళ్ళకో గిఫ్ట్స్ ఇస్తుంటారట. సుజాత పిల్లలకు ముందు రోజే బడి మానద్దని చెప్పింది.
“ఐతే అందరం మంచిగా బట్టలు తొడుక్కుని వస్తం!” వసంత ఉత్సాహంగా నవ్వింది.
“ఏమొద్దు. ఎప్పటిలానే రండి. అయినా రోజూ బావుండొచ్చుగా.”
“మాయమ్మ రోజూ మంచి గుడ్డలీయది.”
“మంచివంటే కొత్తవే కానక్కర్లేదు. శుభ్రంగా రోజూ వస్తున్నావు చూడు, అలా రా. అది చాలు. బట్టలు కాదు. మన ప్రవర్తనా శుభ్రతా ముఖ్యం. అసలు మనుషులు షోకులకీ, వస్తువులకీ అనవసరంగా…” సుజాత నెమ్మదిగా ఉపన్యాసం ఇవ్వడానికి తయారవబోయింది. వసంత పారిపోయింది అనసూయమ్మ కేక విని.
“టీచర్ అగో అన్నోల్లొచ్చిన్రు.” ఓబులేసు గేటు దగ్గర్నుండే అరిచాడు. సుజాత గేటు వైపు ఎదురెళ్ళింది.
“రండి బాబూ. మీ గురించి మా సుధాకర్ చాలానే చెప్పాడు…”
“మీ గురించి కూడా మేడమ్!” ఒకబ్బాయి పలకరింపుగా నవ్వాడు.
“ఆంటీ, మీ ఆరోగ్యం బానే ఉంది కదా? మోకాలి నొప్పి ఎలా వుందిప్పుడు?” సుధాకర్ లోపలికొస్తూ అన్నాడు.
“ఆ! బానే వుంది ఇప్పటికైతే,” నవ్వింది సుజాత.
లోపలకు నడిచారందరూ. పిల్లలంతా లేచి నిలబడి, “గుడ్ మార్నింగ్ సార్!” అంటూ దీర్ఘం తీశారు. “సుదాకరన్న, ఈడ కూసో,” సుధాకర్ వచ్చి ఏసోబు పక్కన కూలబడ్డాడు. వచ్చిన వాళ్ళందరూ కింద సర్దుకు కూర్చున్నారు.
సుజాత, “అయ్యో, కుర్చీల్లో కూర్చోండి బాబూ,” అంది కంగారు పడుతూ.
“పర్లేదాంటీ, పిల్లలతో ఉండేందుకే కదా వచ్చాం. మీరు చైర్లో కూర్చోండి. మీ కాళ్ళు నొప్పిపుడతాయేమో.”
సూరిగాడు ఈ సందట్లో తలుక్కున మెరిశాడు.
“ఒరేయ్ సూరి, రారా!” సుధాకర్ పిలిచాడు. సూరి నెమ్మదిగా సిగ్గుపడుతున్నట్టు అడుగులో అడుగేసుకుంటూ వచ్చి అతని ఒళ్ళో కూర్చున్నాడు. ‘నాలుగు రోజుల్నించీ అయిపు లేడు. ఎవరో చెప్పుంటారు. వచ్చేశాడు! ఏవో ఇస్తారని వచ్చేశాడు రాస్కెల్!’ ఒళ్ళు మండింది సుజాతకు.
“ఇప్పుడు మనమంతా ఒక రౌండ్ లా కూర్చుందాం. వరుణ్ అన్న మనకొక మిమిక్రి ప్రోగ్రాం చేసి చూపిస్తాడు.”
సుధాకర్, అతని స్నేహితులు పిల్లలని గుండ్రంగా కూర్చోపెట్టారు. పెద్ద క్లాసు పిల్లలు మంచి నీళ్ళు అందించారందరికీ. వరుణ్ తన మిమిక్రి మొదలుపెట్టాడు. పిల్లలు చాలా ఇష్టంగా చూస్తున్నారు. సుజాత సూరిగాడి వైపు చూసింది, పిల్లలతో పాటు తనూ నవ్వుతూ. సూరిగాడు కళ్ళప్పగించి కేరింతలు కొడుతూ చూస్తున్నాడు. వాడి నల్లటి బుగ్గల్లో లోతుగా సొట్టలు.