నక్షత్రాల్ని చూసుకుంటూ నక్షత్రాలు
ఒరుసుకుంటూ పోతున్న నదుల్ని
ఓర్చుకుంటూ కొండలు
ఒకరినొకరు తరుముకొంటూ
సూర్యుడు చంద్రుడు
అదృశ్యంగా అన్నింటిని తాకుతున్న గాలి
తనలో తాను గొణుక్కుంటూ హోరుమంటున్న సముద్రం
అనంతంగా సాగుతున్న ఆటే!
ఆగిన చోటెక్కడో
ఎక్కడున్నామో
ఏదారెటోనని
గమ్యం తెలుసుగనకే
కుతూహలం
తలమీద ఆకాశం
కాళ్ళకింది భూమి
ఎక్కడన్నా ఒకటే కావచ్చు
జ్గ్ఞాపకానిది వెనకచూపు
ఉత్సాహానిది ముందుచూపు
గాలి నీరు
గంపెడాశ కద!
ఎండలకెండి
వానకి తడిసి
నిలదొక్కుకున్న మొక్కలు
ఎక్కడన్నా పూలు పూస్తూనే ఉంటాయి!