‘కాళికాంబ సప్తశతి’ సందేశం

పోతులూరి వీరబ్రహ్మంగారు చారిత్రక వ్యక్తి. మనిషి దేవునిగా ఎలా మారగలడో అన్న దానికి ఉదాహరణగా వీరిని చూపించవచ్చు. ప్రజలకోసం సామాజిక రంగంలోనైనా, ఆధ్యాత్మిక రంగంలోనైనా సరే నిస్వార్థంగా పనిచేసేవారిని ప్రజలెప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు. పోతులూరి వారిని తెలుగునాట అవతార పురుషునిగా కొలుస్తారు. తమ బాగుకోసం పాటుపడిన వాళ్ళకు గుడులు కట్టి పూజించటమనే సాంప్రదాయం మొదటినుంచీ భారతదేశంలో ఉన్నదే. అయితే, వీరబ్రహ్మంకంటే కొంచెం ముందుకాలం వాడైన మహాకవి వేమన, సామాజిక సంస్కరణకు సంబంధించి ఒక మార్గాన్ని సిద్ధం చేసి పోయాడు. వీరబ్రహ్మంగారు అదే మార్గంలో ప్రజలను చైతన్యం చేయాలని నిర్ణయించుకున్నారు. వీరబ్రహ్మం వేమనను

చిక్కు విప్పి కటిక చీకటి పోగొట్టి
టక్కు పిక్కు తెలిపి నిక్కమైన
వెలుగు చూపు యోగి వేమన్న మాయన్న

అంటూ ఆయన మీద తన గౌరవాన్ని ప్రకటించారు.

వీరబ్రహ్మంగారి మీద వేమన ప్రభావం చాలా ఉంది. వేమన తన శతకంలో చెప్పిన అనేక భావాలను వీరబ్రహ్మం తనదైన శైలిలో చెప్పి మెప్పించారు. వేమన, వీరబ్రహ్మం ఇద్దరిదీ దాదాపు ఒకటే మార్గం. దీన్ని అద్భుతంగా ప్రదర్శించే గ్రంథం “కాళికాంబ సప్తశతి”.

కాళికాంబ సప్తశతిలో ఏడు వందల ఆటవెలది పద్యాలున్నాయి.”కాళికాంబ హంస కాళికాంబ” అనేది మకుటం. వీరబ్రహ్మం ఆధ్యాత్మిక జీవితం ద్వారా సమాజంలో ఎలాంటి మార్పు కోరుకున్నాడో ఈ శతక పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు. మానవ జీవితానికి సంబంధించిన సమస్త విషయాలను ఈ శతకంలో తడిమి చూశారు వీరబ్రహ్మం. సాంఘిక సంస్కరణ దృష్టితోనే వీరబ్రహ్మం ఈ శతకం రచించారు. అందుకే సినారె, “కవిత్వానికి సాంఘిక ప్రయోజనం వుండాలని దృఢంగా నమ్మిన వారు వీరబ్రహ్మం” అని నిర్ధారించారు.

పుస్తకములు చదువ పూర్ణత్మమబ్బదు
హృదయ సంపుటములు చదువ వలయు

-నంటారు బ్రహ్మంగారు. మనుషుల గుండెల్లో ఏముందో తెలుసుకోవటమే నిజమైన చదువని ఆయన అంతరార్థం. ఈ పద్యాల్లో చెప్పినవన్నీ అలా ఆయన సమాజాన్ని చదివి చెప్పినవే. అందుకే సమాజంలో ఎలాంటి మార్పు కలగాలో ఆయన చాలా పద్యాలలో స్పష్టం చేశారు. ఆయన ఈ సప్తశతిలో ఎక్కువగా కులమతాల చాటున దాగిన అసమానతలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. వేమన వలె హెచ్చుతగ్గులు లేని సమాజాన్ని నిండు హృదయంతో ఆహ్వానించారు.

ఇలకు దిగెడు వేళ కులమెవ్వరికి లేదు
మొదలు శూద్రుడుగను పుట్టువందు
శ్రుతులు చదువు వెనుక శూద్రుండె విప్రుడౌ (116)

అన్న పద్యంలో ‘కులం మధ్యలో వచ్చింది’ అన్న సంగతిని స్పష్టం చేశారు. శ్రుతులు (వేదాలు) చదవటం ద్వారా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని బ్రహ్మంగారి మాట. కానీ ఆ వేదాలను శూద్రులు చదువకూడదనే కుట్రపూరిత నిబంధన ఉన్నది. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఈ పద్యం. అంటే పుట్టుకతో లేని కులాలను మధ్యలో స్వార్థపరులు సృష్టించారని బ్రహ్మంగారి సందేశం.

కులాల విభజనకంటే ముందు మన దేశంలో వర్ణ విభజన ఉండేది. కులం అనే భావన ఎలా కింది కులాల పట్ల అమానవీయంగా తయారయ్యిందో ఒకప్పుడు వర్ణం కూడా అలాగే అమానవీయంగా ప్రవర్తించింది. మెజారిటీ ప్రజలను(అంటే ఇప్పటి బీసీ, రెడ్లు, వెలమలతో సహా) శూద్రులుగా వెలివేసి కేవలం బానిసలుగా మాత్రమే చూసింది. ఇప్పటి కింది కులాల ప్రజలను పంచమ వర్ణంగా చెప్పి కఠినమైన నిబంధనలు అమలు చేసింది ఆనాటి ఆధిపత్య వ్యవస్థ. ఈ వ్యవస్థ కొనసాగింపే కులం. ఈ ఎరుక బ్రహ్మంగారిలో చాలా స్పష్టంగా ఉంది. అందుకే-

కులము గోత్రమంచు కూసెడు మలపల
కర్మఫలము ముందు కట్టి కుడుపు
బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ (101)

అనగలిగారు. వర్ణాదులను వీడితే తప్ప బ్రహ్మజ్ఞానం కలగదని తేల్చి పారేశారు. ఒక వైపు సాటి మనుషులను కులాది భేదాలతో హీనంగా చూస్తూ బ్రహ్మజ్ఞానం కోసం తాపత్రయపడే వర్గానికి అంటించిన చురక ఇది. మరో పద్యంలో “కులమనేటి తెగులు కొంపలు గూల్చును” అనే హెచ్చరిక కూడా చేశారు. వందల ఏళ్ల కిందటే కులాన్ని “తెగులు”గా గుర్తించటం వీరబ్రహ్మంగారి సామాజిక దృష్టినే కాదు, ఆయన వ్యక్తిత్వంలోని ఆధునికతను కూడా తెలియజేస్తుంది. ఇంకో పద్యంలో “హరియు హరుడు రెండు తెరగులై వచ్చిరి” అంటూ మాలమాదిగలు సాక్షాత్తు హరిహరులు అని చెప్పటం, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఎక్కడా కనిపించదు. ఈ స్థాయిలో పరిణతి కలిగిన ఆధ్యాత్మిక పరంపరకు చెందిన తెలుగు కవి మనకు మరొకరు కనిపించరు.

కులంతోపాటు తన కాలంనాటి మతవ్యవస్థ పట్ల కూడా వీరబ్రహ్మంగారు విమర్శనాస్త్రాలు సంధించారు.

ఎన్ని మతములు గన నేమి కనంబడు?
కంటిపాపలోనె కలదు మచ్చ
మనసునందు లేక మతమునందేముండు? (404)

మనసులో మాలిన్యం పెట్టుకొని మతాల చుట్టూ తిరిగితే లాభం లేదన్నది బ్రహ్మంగారి ఉవాచ. మనస్సు శుద్ధిగా ఉంటే మతాలతో పనిలేదన్నది ఇందులోని ధ్వని. మరి వీరబ్రహ్మంగారు కూడా హిందూమతానికి ప్రతినిధి కదా అని ఎవరైనా అడగవచ్చు. ఆయన కోరిన మతం ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించనిది. కులమతాల పేరుతో మనుషుల మధ్య విభజన రేఖలు గీయటానికి వ్యతిరేకమైనది.అందుకే-

మతము మత్తు గూర్చు మార్గమ్ము కారాదు
హితము గూర్ప వలయు నెల్లరకును
హితము గూర్చ లేని మతము మానగవలె (694)

అన్నారు.”మతం మత్తుమందు”లాంటిదని తత్వవేత్త కారల్ మార్క్స్ చెప్పటానికి వందల యేళ్ల ముందే మతం మత్తుమందు కారాదని చెప్పటం బ్రహ్మంగారిలోని పురోగమన దృష్టికోణాన్ని తెలియజేస్తుంది. మతం గురించి వీరబ్రహ్మంగారి అభిప్రాయాలు సనాతన వాదానికి చెందినవి కావు. సంస్కారానికి చెందినవి. మనుషులు మనుషులుగా వ్యవహరించకుండా చేసే దైవ సంబంధిత వ్యవహారాలన్నీ వ్యర్థమని ఆయన అనేక సందర్భాలలో నొక్కి వక్కాణించారు.

వీరబ్రహ్మం కాలం నాటికే మనదేశంలో ముస్లిం, క్రైస్తవ మతాలున్నాయి. సహజంగానే మతానికి మతానికి మధ్య వాటి వాటి సాంప్రదాయాల్లో, విధివిధానాల్లో తేడాలుంటాయి. స్వార్థపరులు వాటిని ఎత్తిచూపుతూ మతాల మధ్య ఘర్షణలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తుంటారు. ఆ పరిస్థితిని బ్రహ్మంగారు గుర్తించి ఉంటారు. అందుకే

సర్వమతములందు సారమ్ము గ్రహియించి
ఐకమత్య మార్గమనుసరించి
క్రించుదనము మాని ప్రేమించుకొన మేలు (379)

అంటారు. అంటే సర్వమతాల సారాన్ని గ్రహించమని సెలవిచ్చారు బ్రహ్మంగారు. మనవాళ్ళు ఏ మతాన్ని కూడా అధ్యయనం చేయకుండా ఒకరి మతాన్ని మరొకరు దూషిస్తూ కాలం గడుపుతారు. అలా చేయమని మతాలు చెప్పవని ఆయన ఉద్దేశ్యం. అందుకే ‘క్రించుదనము'(అల్పత్వం) మాని, సాటి మనిషిని ప్రేమిస్తే మంచిదని ఆయన మనకు సూచించారు. కానీ మనం ఆయనను దేవునిగా పూజిస్తూ ఆయన అందించిన సామాజిక సందేశాన్ని మాత్రం మరిచిపోయాం.

తీర్థయాత్రలందు దేవుడొక్కడె కదా
మంచి తీర్థము మన పంచనుండె
దివ్య తీర్థమిదిగొ దేహమందున్నది (531)

అన్నది ఆయన ఆధ్యాత్మిక సందేశం. ఈ పద్యం అర్థమయితే తప్ప బ్రహ్మంగారి నిజమైన తత్వం అర్థం కాదు. తన ఆధ్యాత్మిక తత్వమేమిటో తన తత్వగీతాల్లో పండు వొలిచి చూపించినట్టు చెప్పారాయన. “చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడునురా ఒరే!ఒరే!!’ లాంటి తత్వగీతాలు ఆయనను సంపూర్ణంగా ఆవిష్కరిస్తాయి. ఆయన శిష్యులు చెప్పిన తత్వాల్లో కూడా ఈ విషయం పట్ల మనకు స్పష్టత దొరుకుతుంది. ఆయన ఆధ్యాత్మిక తత్వం అచల సిద్ధాంత పరంపరకు చెందినది. అచలం దేవుడిని, జీవుడిని వేరువేరుగా గుర్తించదు. జీవుడిలోనే దేవుడున్నాడని స్పష్టంగా చెప్తుంది. స్పష్టంగా చెప్పాలంటే అచలం మతరహితమైన ఆధ్యాత్మిక ఆలోచనలకు కేంద్ర బిందువు. దాని సారం సర్వ మానవ సమానత్వం. సామాజిక సంస్కరణ, దాని ప్రధాన ఆశయం. మానవీయ పునాదుల మీద బహుజన దృక్పథంతో వెలసిన అచల సిద్ధాంతం తెలుగునాట వీరబ్రహ్మంగారి ద్వారా పూర్ణత్వాన్ని సాధించింది.

నిగ్రహమ్ము లేని నిర్భాగ్యులెల్లరు
విగ్రహముల కెల్ల విందు జేసి
భోగ భాగ్యములను బొంద కాంక్షింతురు (16)

అనే పద్యంలో మనిషి తన స్వార్థం కోసం మాత్రమే విగ్రహాలకు విందు చేస్తున్నాడని అంటారు. ఆ స్వార్థాన్ని జయించటమే ఆయన బోధనలోని సారాంశం.

సర్వ దేవతలకు సదనమ్ము దేహమ్ము
గుడులకేగి పాట్లు పడగనేల?
నేను మేనులందు నిలుచును బ్రహ్మంబు (34)

అన్న పద్యంలో వీరబ్రహ్మంగారు చెప్తున్న “బ్రహ్మం” మానవుడు సాధన చేయవలసిన జ్ఞానం. అది నేను మరియు మేను(శరీరం)లను సమగ్రంగా అర్థం చేసుకోవటం మీద ఆధారపడింది. ఆ జ్ఞానం మతాతీతమైనది. దైవాతీతమైనది. సర్వదేవతలకు నిలయం శరీరం. ఈ ఎరుక లేకుండా గుడుల చుట్టూ తిరగటం వృధా అన్నది బ్రహ్మంగారి ఉవాచ. ఆయన మానవాళికి అందించిన ఆధ్యాత్మిక సందేశం ఇదే. ‘బ్రహ్మ జ్ఞానం’ ముక్కు మూసుకుంటే రాదని, అది నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే సిద్ధిస్తుందని మరో సందర్భంలో చెప్తారు.

బ్రహ్మంగారు తన ఆచరణ ద్వారా రచనల ద్వారా ఒకే సందేశాన్ని అందించారు. అదే దీనజనోద్ధరణ. ఆయనది ప్రజాదృష్టి. అందుకే రాజుల దగ్గర కానీ భూస్వాముల దగ్గర కానీ చేరి సుఖపడాలనుకోలేదు. ప్రజలను చైతన్యం చేయాలనుకున్నారు. అందుకోసం శిష్యులతో సహా తిరుగుతూ ప్రజల దగ్గరకే వెళ్లి బోధనలు చేశారు. పద్యాలు చెప్పారు. ప్రజలకు అర్ధమయ్యే భాషలోనే రచనలు చేశారు.

కులమతాల జాడ్యములలోన దపియించు
దీన జనుల సేద దీర్చువాడ
మానవుండె ధరను మాధవుండను వాడు (699)

అనే పద్యంలో తన ఆశయాన్ని ప్రకటించారు. భూమి మీద ఎవరైతే మానవుల కోసం పరితపిస్తారో వారే వారే నిజమైన దేవుళ్ళని ఆయన తాత్పర్యం. ప్రజల కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేశారు కాబట్టే వీరబ్రహ్మంగారిని నేడు దేవునిలా భావించి పూజిస్తున్నారు.


తోకల రాజేశం

రచయిత తోకల రాజేశం గురించి:

తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, విద్యావేత్త తోకల రాజేశంగారు 9వ తరగతి నుంచే పద్యాలు రాయడం ప్రారంభించారు. కవితలు, విమర్శనాత్మక వ్యాసాలు, సాహిత్య సమీక్షలు రాయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తన స్వగ్రామంలోని పాఠశాలలో చదువుతున్న ఇరవైమంది విద్యార్థులతో స్వయంగా శతక పద్యాలు రాయించి, వారిలో సాహిత్య స్పూర్తిని నింపారు.

 ...