1930 ప్రాంతంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారతసామ్రాజ్యంగా భావించిన ప్రాంతం ఇప్పటి భారతదేశం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, యెమెన్, ఒమెన్, ఎమిరేట్స్, ఖతార్, బహ్రయిన్, కువైట్ అని 12 దేశాలుగా విడిపోయిన భూభాగం. ఆ తరువాత కాలంలో జరిగిన అయిదు విభజనల తర్వాత రూపొందిన మాప్‌ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, జొరాస్ట్రియన్లు, బౌద్దులు నివసించారు. అందరికి కరెన్సీ రూపాయి. వారి పాస్పోర్ట్‌లపై ‘ఇండియన్ ఎంపైర్’ అని ముద్ర ఉండేది. ఒక్క యాభై సంవత్సరాల కాలంలో ఈ విషయాల భూభాగం 12 దేశాలుగా విడిపోయింది. ఈ ప్రాంతాలలో ఆర్ధికంగా ఎన్నో మార్పులు జరిగాయి. అలాగే, ఈ మార్పులు లక్షలాది జీవితాలను అతలాకుతలం చేసాయి. తాము పుట్టి పెరిగిన నేల మీద తామే రాత్రికి రాత్రి ‘విదేశీయులు’గా, ‘ఆక్రమణదారులు’గా మారిపోయారు కొందరు. ఈ కథలే సామ్ డాల్రింపుల్ (Sam Dalrymple) రాసిన చరిత్ర ‘షాటర్డ్ లాండ్స్’ (Shattered lands).
సాధారణంగా అధికారంలో ఉన్న వ్యక్తులు, విజయులై ఒక ప్రాంతాన్ని పరిపాలించిన వ్యక్తులు చరిత్రని తమకు అనుకూలంగా రాసి ఉంచాలని ప్రయత్నిస్తారు. పూర్వ చరిత్రలో తమకు అనుకూలమైనవి ఉంచి, నచ్చనివి తిరగ రాయాలని ప్రయత్నిస్తారు. ‘చరిత్ర ఇదే’ అని తాము పాలించే ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తారు. అయితే చరిత్ర ఒకరు రాసింది కాదు. అది పాటలాగానో, కట్టడంలోనో, అప్పటి ప్రజల వ్యక్తిగత పుస్తకాలలోనో, విదేశీ పర్యాటకుల రాతలలోనో ఏదో విధంగా తెలుస్తూనే ఉంటుంది. ఈ రచయిత ఎంతో శ్రమకి ఓర్చి, అన్ని వైపులనుండీ సమాచారం సేకరించి, ఒక్క చోట రికార్డ్ చేశారు.
పుస్తకం ప్రారంభంలోనే మనందరికీ ఉన్న పలు అపోహలను తొలగిస్తారు. ఉదాహరణకు, అంతరిక్షంనుండి చైనా గ్రేట్-వాల్ కనపడుతుంది అన్నది అపోహేనని తేల్చి చెప్పారు. అయితే పాకిస్తాన్-ఇండియాల మధ్య కట్టిన 3000 కి.మీ. కంచె మాత్రం, దానిపై వెలిగే 150000 లైట్ల వెలుతురువల్ల అంతరిక్షంనుండి కూడా కనపడుతుంది అనే సత్యం వెల్లడించారు. అదే విధంగా భారత్-మయన్మార్ మధ్యలో నిర్మించిన 1600 కి.మీ. కంచె కూడా కనపడుతుందట. ఈ రెండూ కొద్ది సంవత్సరాల క్రితం లేవు.
మొదటి ప్రపంచయుద్ధం తరువాత అమెరికాని కుదేలు చేసిన గ్రేట్ డిప్రెషన్ వల్ల మయన్మార్ రైతుల పంటలకు గిట్టుబాటు ధర పలకలేదు. అప్పటి దాకా బియ్యం ఎగుమతి చేస్తూ ఆర్ధికంగా సంపన్నంగా ఉన్న మయన్మార్ రైతు అప్పుల్లో కూరుకోవడం మొదలైంది. వారికి మదుపు పెట్టిన చెట్టినాడు వర్తకులు కఠినంగా వసూళ్ళు చేసుకోవడంతో, భూమిని కోల్పోయి తమ భూముల్లోనే కూలీలుగా మారసాగారు. ఆకలి చావులు పెరుగుతూండడంతో సహజంగానే వర్తకులపై వ్యతిరేక భావం మొదలయ్యింది. అది క్రమేపీ భారతీయులందరి మీదకూ ప్రసరించింది. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ జరిపిన దాడులవల్ల, అంతవరకూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా (లండన్, న్యూయార్క్‌లకన్నా) పేరు పొందిన రంగూన్, పూర్తిగా నాశనం అయిపోయింది. ఇంతవరకూ కోలుకోలేదు. ఈ సంక్షోభంలోనే భారతీయులు ఉన్నవన్నీ వదిలేసి, లాంగ్‌మార్చ్‌గా ప్రసిద్ధి చెందిన వలస మార్గం పట్టారు. హిమాలయాలు, అడవులు, ఊబులు దాటుకుని కొన్ని లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకోగా మిగిలిన వారు భారతదేశం చేరారు. ఇందులో కొందరు ఢాకా చేరారు. అక్కడ కొంచం స్థిరపడగానే కొన్ని సంవత్సరాలకి మళ్లీ ఇంకో వలస.
ఇదే సమయంలో ‘ఇండియన్ ఎంపైర్’కి రెండో వైపు యెమెన్, కువైట్ దేశాలలో భారతీయుల వర్తకం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. ఏడెన్ యూరప్‌కి ద్వారం. భారతీయులు అక్కడ భూములు కొన్నారు, వ్యాపారాలు చేశారు. ముఖ్యంగా గుజరాత్ నుంచి యెమెన్, కువైట్, ఏడెన్ నగరాలకు రాకపోకలు ఎక్కువగా జరిగేవి. అయితే ఆ సమయంలో అక్కడి స్థానికులు పనివారూ, భారత్ నుంచి వచ్చినవారు యజమానులూ అయ్యారు. ముందుగా బ్రిటిషర్లకే ఈ ప్రాంతాన్ని ఇండియానుంచి వేరు చెయ్యాలనే ఉద్దేశం కలిగింది. దానికి మన రాజకీయ నాయకులు కూడా అభ్యంతరం చెప్పలేదు. అక్కడి సంస్కృతి, మతం, చరిత్ర — దేనిలోనూ వీరికి సామ్యం కనపడలేదు. కొందరు భారతదేశంతో కలిసి వుండాలని అనుకున్నా, వారి మాటను బ్రిటిష్ ప్రభుత్వం ఖాతరు చెయ్యలేదు. కొంతకాలానికే యెమెన్, కువైట్ దేశాల్లో చమురు దొరికింది. అంతవరకూ హైదరాబాద్ నవాబ్‌తో బాంధవ్యం కోసం ఉవ్విళ్ళూరిన అక్కడి రాజులు, చమురు దొరకడంవల్ల రాత్రికి రాత్రే దేశం పట్టనంత సంపన్నులయ్యారు. బళ్ళు ఓడలయ్యాయి. భారతీయులని అక్కడనుంచి తరిమెయ్యడం మొదలయ్యింది. స్థానికులు బలవంతులై, వలసదారులు వారి వద్ద పని చేసే కూలీలయ్యారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. హైదరాబాద్ నవాబ్ ఆస్తులు భారత ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. నవాబ్ దేశం విడిచి పారిపోయారు. ఒకవైపు దేశం, రాజుల కథలు చెపుతూనే సామాన్య జీవనం ఎలా ఉందో తెలియజేయడానికి ధీరూభాయ్ అంబానీ కథను ఉదాహరణగా చూపుతారు రచయిత. లాంగ్ మార్చ్‌లో మయన్మార్‌నుంచి వచ్చిన వారిలో ఎంతోమంది ప్రాణాలు రక్షించిన ఉత్తమ్ సింగ్ కుటుంబం, అమర్త్యసేన్ కుటుంబం గురించి మాట్లాడతారు.
ఆ విధంగా ఈ చరిత్ర తెలియజేసేటప్పుడు సామ్, మానవత్వకోణాన్ని విస్మరించలేదు. భారతదేశంలో స్థిరపడిన స్కాట్లాండ్ దేశస్థుడిగా ఆయన కొంత పరాయివాడు కావటంవల్ల, చరిత్ర వివరించేటప్పుడు నిరపేక్షతో, ఎవరినీ సమర్ధించకుండా, ఎవరినీ విమర్శించకుండా ఏ పరిస్థితులవల్ల ఈ పరిణామాలు జరిగాయో వివరించారు. 2026 లో ఉన్న మనకు ఇప్పటి పరిణామాల మూలాలు తెలుస్తాయి.
ప్రముఖ చరిత్రకారుడైన విలియమ్ డాల్రింపుల్, సామ్‌కు తండ్రి. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న సామ్, ఈ పుస్తకాన్ని తన తల్లితండ్రులకి అంకితం ఇచ్చారు. ప్రతి సంఘటనను ఎంతో రీసెర్చ్ చేసి మన ముందు ఉంచారు. ఆయన శైలి కూడ ఒక ప్రవాహంలా తేలికగా సాగుతుంది. ఒక చరిత్ర పుస్తకం చదువుతున్నట్లు ఎక్కడా అనిపించదు. ఒక సినిమాలాగా పదచిత్రాలతో ఆసక్తికరంగా, దాదాపు ఒక నవల చదువుతున్న భావన కలగచేస్తారు. ఈ వాస్తవ సంఘటనల సమాహారం, ఒక పెద్ద మాప్‌ని దగ్గర పెట్టుకుని, ఒకే సమయంలో వేరు వేరు చోట్ల జరిగిన సంఘటనలు, వాటి మధ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉన్న కారణాకారణ సంబంధం గురించి తెలుసుకున్నట్లు ఉంటుంది. ఇది ఒక దేశచరిత్ర కాదు; మానవుల మనుగడ చరిత్ర.
ఈ పుస్తకం రాసే క్రమంలోనే సామ్, ఇద్దరు మిత్రులతో కలసి ‘ప్రాజెక్ట్ దాస్తాన్’ అని ప్రారంభించారు. దేశ విభజన సమయంలో తమ ఊరిని వదలి వచ్చేసిన వారికి వర్చ్యువల్‌గానైనా వారు పుట్టి పెరిగిన, తిరిగిన ప్రదేశాలు చూపాలని ఉద్దేశం. ఆ క్రమంలో స్పర్ష్ అనే మిత్రుడు, తన తాతగారు కలవరించిన పాకిస్తాన్‌లోని తమ ఊరు ‘బేలా’ని చూడాలని, తాము ఇవ్వాళ బతికి ఉండడానికి కారణమైన అక్కడి ముస్లిం కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకున్నారు. ఆయనకి ఉన్నది ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్ కనుక పాకిస్తాన్ వెళ్ళడం సాధ్యపడింది. ఆ ఊరు అలాగే వుంది. ఏమీ మారలేదు. ఆ ముస్లిం కుటుంబంలో మనవడి తరం – షేర్ ఖాన్ కుటుంబం – ఉన్నారు. వారు కూడా వీరి కుటుంబం గురించి ఎప్పుడూ తలచుకుంటూనే ఉన్నారట. తప్పిపోయిన బంధువులు తిరిగి వచ్చారన్నంత ఆప్యాయంగా వారు వీరిని ఆదరించారు. స్పర్ష్‌కి అది ఒట్టి నేల కాదు. తమ పూర్వీకులు నడయాడిన పుణ్యభూమి. రాజకీయ కారణాలేగానీ, మనుష్యుల మధ్య వేరే ఏ రకమైన గోడలూ ఉండవని తెలుస్తుంది.
పుస్తకం చివరిలో ఇప్పటి నాగాలాండ్ సంక్షోభం, మణిపూర్‌లో అల్లర్లు, రోహింగ్యాలు – వారి సమస్యలు, మయన్మార్ విపక్ష నేత ఆంగ్ సాన్ సూక్యి తండ్రి ఆంగ్ సాన్ మయన్మార్ స్వాతంత్ర్య పోరాటంలో పోషించిన పాత్ర — ఇటువంటి వివరాలు కూడా జతపరిచారు. దాదాపు 450 పేజీల చరిత్రని ఇప్పటి పాఠకులకు ఆసక్తి కలిగించే విధంగా రచించారు.
