నిశ్శబ్దంలో వినిపించే ప్రశ్నలు – శ్రీసుధ మోదుగు కథ – ‘స్థితం’

…No existence can be validly fulfilled if it is limited to itself. -Simone de Beauvoir

సమకాలీన జీవితంలోని ఆందోళనలు, వైరుద్ధ్యాలు, అస్తిత్వ సంక్షోభాలను అన్వేషించే శక్తివంతమైన సాధనంగా తెలుగులో కథలు రాస్తున్న వాళ్ళలో శ్రీసుధ మోదుగు ఒకరు. డిస్టోపియా (2021), జాగృత స్వప్నం (2024) అనే రెండు కథా సంపుటాలు వస్తువైవిధ్యానికి, ప్రత్యేక రచనాశైలికి సాక్ష్యం. ఈమాటలో వెలువడి, ఆ తర్వాత తన మొదటి కథాసంపుటి డిస్టోపియాలో చేరిన ‘స్థితం’ కథను విశ్లేషించే ప్రయత్నం ఈ వ్యాసం.

‘స్థితం’ అనేది కోరిక, ఒంటరితనం, అనుబంధం, జీవితపు అన్వేషణల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాన్ని లోతుగా ఆవిష్కరించే ఒక తాత్త్విక కథ. ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ తన తాత్కాలిక నివాసాన్ని వదిలి, సమస్తాన్నీ త్యజించి ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందాలనే సంకల్పంతో బయలుదేరడం చుట్టూ ఈ కథనం అల్లుకుంది. అయితే, బాహ్యంగా ఇల్లు వదిలి వెళ్లడంకంటే, అంతరంగంలో నిజమైన వైరాగ్యం పొందడం ఎంత కష్టతరమైనదో ఈ కథ క్రమంగా వెల్లడిస్తుంది.

ఈ కథకు మూలస్తంభం అస్తిత్వపు ఆందోళన. కథానాయిక తన చుట్టూ ఉన్న సమాజం, సమాజం వేసే అంచనాలు, చివరికి తననుండి కూడా తాను పరాయీకరణకు గురైనట్లు భావిస్తుంది. కథ ప్రారంభంలోనే ఆమెను ఒక కుమ్మరి పురుగు కుట్టడం అనేది శారీరక వేదనకు, అంతర్గత మానసిక సంఘర్షణకు మధ్య ఉన్న సంకేతసంబంధాన్ని సూచిస్తుంది. మనస్సులోని అదృశ్యరూపపు గాయాలతో పోల్చినప్పుడు బాహ్యగాయం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కథనం పొడవునా ఆమె కోరిక, బంధం, స్వేచ్ఛ, అస్తిత్వపు అర్థాలను పదే పదే ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆమె ఆలోచనలు అస్తిత్వవాద సాహిత్యంలో కనిపించే తాత్త్విక విచారణలలాగా ఉంటాయి.

కోరికలను నిజంగానే వదిలేయగలమా? మనుషులు నిజంగా వైరాగ్యాన్ని పొందగలరా? జీవితం అనేది భారమా లేక వరమా? వంటి ప్రశ్నలు ఆమెను చుట్టుముడతాయి. ఈ కథ వీటికి readymade సమాధానాలను ఇవ్వదు. అందుకు భిన్నంగా, మానవ జీవితాన్ని ఒక నిరంతరమైన ప్రశ్నల ప్రవాహంగా చూపుతుంది. లౌకిక జీవితాన్ని వదిలి ఆశ్రమంలో చేరడం ద్వారా తన అస్తిత్వ సంక్షోభంనుండి బయటపడవచ్చని కథానాయిక అనుకుంటుంది. అయితే, ఆ తరహా పూర్తి స్థాయి వైరాగ్యం అనేది అసాధ్యమని కథనం సూక్ష్మంగా చూపిస్తుంది.

అన్నింటినీ వదిలేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా, ఆమె తన వస్తువులను జాగ్రత్తగా సర్దుకుంటుంది. ఇతరులు ఏమనుకుంటారోనని ఆందోళన చెందుతుంది. స్వామిని గుర్తుచేసుకుంటుంది, అమ్మణి కోసం తపిస్తుంది, గోపాల్ తనను అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. కుక్కలు, పక్షులు, అపరిచితులపై కూడా ఆమె ఆప్యాయతను ప్రదర్శిస్తుంది. ఈ వైరుధ్యం కథలో ప్రధాన వ్యంగ్యం. “వైరాగ్యం పొందాలనే కోరిక కూడా చివరికి ఒక కోరికే అవుతుంది.” అందువల్ల, ఈ కథ ఆధ్యాత్మికత గురించిన సాధారణ భావనలను సవాలు చేస్తుంది. సన్యాసినిగా మారటం అనేది ఒక సాహసోపేతమైన పలాయనంగా మాత్రమే కాకుండా, అత్యంత సంక్లిష్టమైన మానసిక ప్రక్రియగా చూపుతుంది.

శ్రీసుధ రచించిన ఈ కథ ఒక శక్తివంతమైన, అంతర్ముఖ ప్రయాణాన్ని ఆవిష్కరించే తాత్త్విక రచన. ఇది ఒక యువతి అనుభవిస్తున్న – వడపోత లేని – అంతర్మథనంగా సాగుతుంది. ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొందాలనే తపనకు, ప్రాపంచికమైన ఉనికి వైపు లాగే మానవ సహజబంధాలకు మధ్య ఒక స్త్రీ ఆత్మిక సంఘర్షణను ఈ కథ ప్రతిబింబిస్తుంది. చైతన్య స్రవంతి (Stream of Consciousness) కథన శైలి ద్వారా రచయిత్రి, కల్లోలస్థితిలో ఉన్న కథానాయిక మనస్సును చాలా సూక్ష్మంగా చూపించింది. ఈ చైతన్య స్రవంతి శైలి పాఠకుడికీ, కథానాయిక అంతరంగ ప్రపంచానికీ మధ్య ఒక సాన్నిహిత్యాన్ని ఏర్పరుస్తుంది. పాఠకులు ఆమె ప్రయాణాన్ని కేవలం గమనించడమే కాకుండా, ఆమె మానసిక ప్రయాణాన్ని స్వయంగా అనుభవంలోకి తెచ్చుకుంటారు.

దేవుడి గురించి ఆమె చేసిన ఆలోచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మనుషులు తమ కోరికలను వినడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టే దేవుడు ఉన్నాడా? అని ఆమె ఆశ్చర్యపోతుంది. ఈ పరిశీలన సందేహాన్ని, ఆత్మిక జిజ్ఞాసను ఎంతో సూక్ష్మంగా మిళితం చేస్తుంది. కథ ఎక్కడా విభజన లేకుండా, స్పష్టమైన విరామాలు లేకుండా ఒకే ప్రవాహంగా సాగుతుంది. వాక్యాలు చిన్నవిగా, శకలాలుగా ఉండడంతో తాత్త్విక శైలి కనిపిస్తుంది.

శ్రీసుధ వాడిన భాష ఇంద్రియానుభూతులతో (Sensory details) నిండి ఉంది. కుమ్మరి పురుగు కుట్టడంవల్ల కలిగే మంట, ఒంటికి తగిలే చల్లటి రాత్రి గాలి, మందుల వాసన, రైలు ప్రయాణంలో వచ్చే శబ్దాలు… వీటన్నింటినీ కథలో అద్భుతంగా పొందుపర్చటం జరిగినది. ఈ స్పర్శ, దృశ్యరూపాలు కథలోని తాత్త్విక ఆలోచనలు కేవలం ఉపన్యాసాలుగా మారిపోకుండా కాపాడాయి. భౌతిక వాస్తవికతకు, ఆధ్యాత్మికమైన ఆలోచనలకు మధ్య కథనం ఎంతో సులువుగా ప్రవహిస్తూ ఒక కలలాంటి, అదే సందర్భంలో నమ్మదగిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కథానాయక అన్నింటినీ వదిలి వెళ్లాలనుకున్నా… జ్ఞాపకాలు, అపరాధభావం, ఆకలి, అనురాగం ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. “కోరికలు వదులుకోవాలి. వదులుకుంటే పోతాయా?” అనే పదే పదే వచ్చే ప్రశ్న ఈ కథకు కీలకం.

కథ ప్రారంభంలో వచ్చే కుమ్మరి పురుగు కరవటం ఒక అద్భుతమైన ప్రతీక. మోచేతినుండి భుజంవరకు పాకే ఆ భౌతికమైన నొప్పి, ఆమె లోపలి అస్తిత్వవేదనకు సంకేతంగా మారుతుంది. ఈ కాటు ఒకే సమయంలో నిజమైనది, ప్రతీకాత్మకమైనది కూడా. జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు ఎంత పెద్ద మానసిక సంక్షోభాన్ని సృష్టిస్తాయో ఇది చూపిస్తుంది. తనలో అప్పటికే ఉన్న ‘విషాన్ని’ విరిచేయడానికి ఈ బాహ్యమైన నొప్పి ఉపయోగపడుతుందా అని కథానాయిక ఆలోచిస్తుంది.

ఈ కథ సమకాలీన తెలుగు స్త్రీల కథకి అస్తిత్వవాద (Existential) స్పర్శను జోడించింది. ఇది కేవలం ఇల్లు వదిలి వెళ్ళే ఒక స్త్రీ కథ మాత్రమే కాదు; అసలు బ్రతికి ఉండటం అంటే ఏమిటి? కోరిక అంటే ఏమిటి? అనే ప్రశ్నల గురించిన ఒక ప్రతిఫలనం. అందువల్ల అస్తిత్వవాద ఛాయలు ఈ కథలో స్పష్టంగా కనిపిస్తాయి. బొద్దింకను చూస్తూ ఆమె చేసే ఆలోచనలు కథలో మైలురాయి లాంటివి: “దీనికీ స్వేచ్ఛ ఉంది. ఎవడి కాలికిందైనా పడి చచ్చే స్వేచ్ఛ. కనీసం చావడానికైనా” అని కథానాయక అనుకోవటం ఒక తీవ్రమైన వ్యంగ్యం. ఇది మరణం గురించిన, జీవితంలోని అసంబద్ధత (Absurdity) గురించిన ఒక చేదు నిజాన్ని ఆవిష్కరిస్తుంది. శూన్యంతో, నిరాసక్తతతో నిండిన ఈ విశ్వంలో సంపూర్ణ స్వేచ్ఛ అనేది ఆఖరికి ఒంటరితనంగానో లేదా మరణంగానో మారిపోతుందేమోనన్న భయాన్ని కథనం నిరంతరం గుర్తు చేస్తుంది. మనం జీవితంలో ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఎంపికలు చేసుకున్నా, ఏదో ఒకదాని వైపు పరుగులు తీస్తున్నా (సరిగ్గా ఆ బొద్దింక ప్రధానపాత్ర వైపు పరిగెత్తినట్లు)… మన చుట్టూ ఉన్న సమాజం, కాలం లేదా విధి అనే శక్తి ముందు వ్యక్తుల శక్తి ఎంత అల్పమైనదో ఈ వాక్యం గుర్తుచేస్తుంది.

తమ స్వార్థంకోసం, తనకు ఆశ్రయమిచ్చిన చుట్టుపక్కల మనుషులపై, హాల్లో ‘నటిస్తూ’ పడుకునే వారిపై, హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఉండే శూన్యమైన జీవితాలపై కథలో పదునైన విమర్శ ఉంది. అయితే ఆ విమర్శ ఎక్కడా మితిమీరిన కోపంతో సాగదు; అందులో ఒక కరుణ, ఆత్మపరిశీలన కనిపిస్తాయి. తనను తాను కూడా మినహాయించుకోకుండా “నేనూ అంతే కదా!” అని అంగీకరిస్తుంది.

ఆధ్యాత్మికపరమైన ఆదర్శాలకు, దైనందిన జీవితంలోని సాధారణ అవసరాలకు మధ్య ఉన్న ఘర్షణను కథ సమన్వయం చేసింది. ఆధ్యాత్మిక అన్వేషణ వైపు లాగే శక్తి, గత బంధాలు, అపరాధభావన, భౌతికావసరాలు, మానసిక బలహీనత. గోపాల్ (ఆమె కవల తమ్ముడు) తో ఆమెకున్న బంధం కథలో ఎంతో హుందాగా ఉంటుంది. గోపాల్ చూపించే కాస్త విసుగు, ఎంతో ఆదరణ ఆమె పాత్రను మరింత సహజంగా మారుస్తాయి. రచయిత్రి అద్వైతాన్ని, భక్తిని, అస్తిత్వవాదాన్ని కథనంలో ఎక్కడా ప్రబోధాల్లా కాకుండా సహజంగా లీనం చేయటం జరిగినది. కథానాయికలోని పరస్పర విరుద్ధమైన ఆలోచనలు ఎంతో నిజాయితీగా అనిపిస్తాయి. కథలో కొన్ని తాత్త్వికమైన వాక్యాలు పదే పదే వచ్చినట్లు అనిపిస్తుంది, అయితే ఆమె మనస్సులోని ఆలోచనల cyclical nature చూపించడానికి రచయిత్రి కావాలనే అలా రాసి ఉండవచ్చు. ముగింపు స్పష్టంగా లేకుండా, పాఠకుడి ఊహకే వదిలేయడం ఈ కథకు అదనపు శక్తి.

వ్యక్తి తన చుట్టూ ఉన్న సామాజికమైన ఆడంబరాలు, హోదా, సంపద, బంధాలు, నైతికతలు అన్నింటినీ ప్రక్కన పెట్టి చూస్తే మిగిలేది కేవలం శారీరకమైన అస్తిత్వం మాత్రమే. ఆ స్థితిలో మనిషైనా, బొద్దింకైనా ఒకటే. బొద్దింక కనిపించడానికి సరిగ్గా ముందు కుమ్మరి పురుగు కుట్టటం గురించిన ప్రస్తావన, “నలిగిపోతూనే కుట్టింది. నొప్పి మొదలైంది. అదేం బాధగా అనిపించలేదు. బాధకు విరుగుడులా అనిపించింది,” మనసులో ఉండే అస్తిత్వశూన్యత, మానసిక వేదన లేదా మొద్దుబారినతనం మరీ ఎక్కువైపోయినప్పుడు… మరణాన్ని లేదా అస్తిత్వాన్ని గుర్తుచేసే ఒక చిన్న శారీరకమైన నొప్పి (ఒక పురుగు కుట్టడం లేదా ఒక బొద్దింకను చూడటం వంటివి) మనిషిని తిరిగి వాస్తవంలోకి తీసుకువచ్చే సాధనంగా మారతాయి. కథలో ఒక చోట కథానాయిక ఇలా అనుకుంటుంది:

గేటు వేసి బయటికొచ్చా. కుక్కలు నా అడుగుల శబ్దం గుర్తుపట్టాయనుకుంటా, తలలెత్తి చూసి మళ్ళీ పక్కకి తిప్పుకొని పడుకున్నాయి. వాటికీ, నాకూ పెద్దగా పడదు. నేను వాటిలా విశ్వాసంగా ఉండలేనని వాటికి చిన్నచూపు కావొచ్చు లేక కినుకేమో అవి నాలా ఉండలేవని. అన్నీ వదులుకొని పోతున్నా కదా! ఇప్పుడు సంతోషమేగా మీకు అనుకుంటూ వాటి వైపు చూస్తూ ముందుకు నడిచా.

‘స్థితం’ కథలోని ఈ భాగం… మనిషి తను నమ్ముకున్న సమాజాన్ని, బంధాలను వదిలి వెళ్ళేటప్పుడు కలిగే ఒకానొక అద్భుతమైన ‘నైతిక స్వేచ్ఛను’ (Moral Freedom) చూపిస్తుంది. ఇక్కడ కూడా మూగజీవాలు కేవలం జంతువులు కావు; అవి ప్రధానపాత్ర అంతరాత్మను, తన అస్తిత్వవేదనను ప్రశ్నించే నిశ్శబ్ద తాత్విక రూపాలు. గేటు వేసి సమాజంనుండి, పాత జీవితంనుండి బయటపడుతున్న ఒక వ్యక్తి మానసిక స్థితిని ఈ సన్నివేశం ఆవిష్కరిస్తుంది. మనిషికి, జంతువుకు మధ్య ఉండే పరస్పర విరుద్ధమైన నైతికతలను ఈ వాక్యాలు పట్టిస్తాయి. మనుషులు తనను చిన్నచూపు చూడటం ఒకెత్తు, కానీ వీధి కుక్కలు కూడా తనను చూసి తల పక్కకి తిప్పుకున్నాయని భావించడం ప్రధానపాత్రలోని తీవ్రమైన ఒంటరితనాన్ని, పరాయీకరణను చూపిస్తుంది. కథలో ఇంకొక చోట ఇలా ఉంటుంది:

కోరికలు వదులుకోవాలి. వదులుకుంటే పోతాయా? వదులుకోవాలంటే ఏం చేయాలి? ఏమీ చేయకుండా ఉండాలా? వాటంతట అవే ఎలా పోతాయి? అయినా నాకేం పెద్ద కోరికలున్నాయి? కనీసం అద్దంలో ముఖం కూడా సరిగా చూసుకోను. మనుషుల గురించి కూడా ఆలోచించను కదా! ఉన్నవే చిన్న కోరికలు. ఆకలైతే అన్నం తినాలనిపిస్తుంది. మనసు బాగుంటే పాట పాడుకోవాలనిపిస్తుంది. రాత్రయితేనే కొంచెం మత్తుగా ఉంటుంది. అదంతా సహజమే కదా! తోడు మాత్రం ఎప్పుడు కోరుకున్నా? ఎప్పుడో ఏరువాక పున్నమి రోజు స్వామిపై మనసుపడిన మాట నిజమే కాని అతడు దేవుడాయె. నన్ను కన్నెత్తి కూడా చూసినట్లనిపించలేదు. ఆయన దేవుడేనా నిజంగా? ఏమో అందరి కోరికల్ని పట్టించుకున్నట్లు కనిపిస్తాడు. దేవుడు కోరికల్ని పట్టించుకోవాలా? అసలు దేవుడు మనుషుల కోరికల కోసం పుట్టాడేమో! ఫలించాలనుకునేవి, ఫలించకూడదనుకునేవి. ఫలించి ఫలించి విరిగిపోయేవి. ఫలించకుండానే మనుషుల్లో మిగిలిపోయేవి.

ఈ పై భాగం అస్తిత్వవాద (Existentialist) దృష్టిలో చదివితే, ఇది కోరికలను జయించాలని ప్రయత్నించే వ్యక్తి అంతర్మథనం కాదు; కోరికలతో, ఒంటరితనంతో, జీవితపు అర్థంతో మనిషి చేసే నిరంతర సంభాషణ అని తోస్తుంది. కథకురాలు మొదట “కోరికలు వదులుకోవాలి” అనే సాంప్రదాయిక ఆధ్యాత్మిక భావనను ప్రశ్నిస్తుంది. “వదులుకుంటే పోతాయా? వదులుకోవాలంటే ఏం చేయాలి?” అనే ప్రశ్నలు అస్తిత్వవాదంలో ముఖ్యమైన సందేహాలను గుర్తుకు తెస్తాయి. అస్తిత్వవాదుల ప్రకారం మనిషి తన కోరికలు, ఆకాంక్షలు, ఎంపికలనుంచి పూర్తిగా తప్పించుకోలేడు. కోరిక అనేది మనిషి అస్తిత్వంలో అంతర్భాగం. ఆకలైతే తినాలనిపించడం, మనసు బాగుంటే పాట పాడుకోవాలనిపించడం, రాత్రి మత్తుగా అనిపించడం—ఇవన్నీ జీవించి ఉన్నాననే అనుభూతికి సంకేతాలు. ఇక్కడ కోరికను అస్తిత్వపు సహజలక్షణంగా రచయిత్రి చూస్తుంది. అయితే ఈ వాక్యాల వెనుక మరింత లోతైన అస్తిత్వపు ఖాళీ ఉంది. “తోడు మాత్రం ఎప్పుడు కోరుకున్నా?” అనే ప్రశ్నలో మనిషి ఒంటరితనం దాగి ఉంది. అస్తిత్వవాదం ప్రకారం మనిషి ప్రాథమికంగా ఒంటరివాడు. ప్రేమ, సంబంధాలు, దేవుడు—ఇవన్నీ ఆ ఒంటరితనాన్ని అధిగమించే ప్రయత్నాలు మాత్రమే. “ఏరువాక పున్నమి రోజు స్వామిపై మనసుపడిన మాట నిజమే” అని చెప్పడం ఒక ప్రేమానుభూతి మాత్రమే కాదు; తన అస్తిత్వాన్ని మరొకరితో పంచుకోవాలనే తపన. “అతడు దేవుడాయె” అన్న వాక్యంలో ప్రేమ కూడా అసాధ్యమైనదిగా మారుతుంది. ఇక్కడ దేవుడు ఒక ఆధ్యాత్మిక సత్యం కంటే, అందని ఆదర్శం (unattainable ideal) లాగా కనిపిస్తాడు. అందుకే ఆమె ప్రశ్నిస్తుంది: “దేవుడు మనుషుల కోరికల కోసం పుట్టాడేమో!” ఈ ప్రశ్నలో దేవుని గురించి అస్తిత్వవాదుల సందేహం కనిపిస్తుంది. మనిషి తన కోరికలకు, ఆశలకు అర్థం వెతుక్కోవడానికి దేవుణ్ణి సృష్టించుకున్నాడా అనే ప్రశ్న ఇది.

పై సందర్భంలో చివరి వాక్యాలు “ఫలించాలనుకునేవి, ఫలించకూడదనుకునేవి. ఫలించి విరిగిపోయేవి. ఫలించకుండానే మనుషుల్లో మిగిలిపోయేవి” అనేవి అస్తిత్వ విషాదాన్ని సంకేతిస్తాయి. మనిషి జీవితం అనేది నెరవేరిన, నెరవేరని కోరికల సమాహారం. కొన్ని కోరికలు నెరవేరినా ఆనందం శాశ్వతం కాదు… కొన్ని నెరవేరకపోయినా మనలో గాయంలా శాశ్వతంగా మిగిలిపోతాయి. ఇదే అస్తిత్వపు విషాదం.

ఈ భావన కాఫ్కా రచించిన ‘The Metamorphosis’ లోని సామ్సా పాత్రను గుర్తుకు తెస్తుంది. సామ్సాకు పెద్ద ఆశలు లేవు; కుటుంబం కోసం జీవిస్తాడు. కానీ అతని ఉనికి, కోరికలు, ప్రేమ అన్నీ చివరకు అర్థరహితంగా మారిపోతాయి. ఈ కథలో ప్రధానపాత్రకున్న చిన్న చిన్న కోరికలే తన అస్తిత్వాన్ని నిర్వచిస్తున్నాయి. నిజానికి మనిషి కోరికలనుంచి విముక్తి పొందలేడు; కోరికలే అతని అస్తిత్వానికి నిదర్శనం. ఈ కథలో ప్రధానపాత్ర తన కోరికలను అణచివేయడానికి కాకుండా వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆకలి, పాట, ప్రేమ, తోడు—ఇవి అన్నీ ఆమె అస్తిత్వాన్ని నిర్మించే అంశాలు. కోరికలనుండి తప్పించుకోవడం కాదు, వాటితో జీవించడమే మనిషి స్థితి అని చెప్పే అస్తిత్వవాదుల ఆలోచనను ఈ సందర్భం చూపిస్తుంది.

Life can only be understood backwards; but it must be lived forwards. అని సోరెన్ కీర్కెగోర్ (Søren Kierkegaard) అంటాడొక చోట. (Quoted in Søren Kierkegaard: Papers and Journals- A Selection, p.73). అంటే జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడే అర్థం చేసుకోగలం, కానీ దాన్ని ముందుకే జీవించాలి. ఈ కథలో కథలో ప్రధానపాత్ర తన గత ప్రేమను, దేవుడిపై కలిగిన ఆకర్షణను, నెరవేరని కోరికలను గుర్తు చేసుకుంటుంది. కానీ వాటి సమాధానం ఆమెకు దొరకదు. అయినా జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇదే సోరెన్ కీర్కెగోర్ సూచించిన అస్తిత్వపు వైరుధ్యం. నెరవేరినా, నెరవేరకపోయినా కోరికలతోనే మనిషి జీవిస్తాడనే అస్తిత్వ సత్యం.

కథలో ప్రధానపాత్ర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగిన వెంటనే తన చుట్టూ ఉన్న జనాన్ని చూసి ఒక్కసారిగా లోతైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. అందులోంచి “ఎప్పటికి తెలుస్తుందో వీళ్ళు జీవించే జీవితం ఏమీ లేదని, బోనుల్లో ఉన్న చుంచెలుకల్లా బతుకుతున్నారని. నేనూ అంతేకదా!” అని ఆమె గ్రహించడం అల్బెర్ట్ కామూ ‘అసంబద్ధత’ (Absurdity), సార్త్ర్ ‘బాడ్ ఫెయిత్’ (Bad Faith) భావనలను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. స్టేషన్‌లో ఖాళీ బిందెల్లా పెద్ద శబ్దం చేస్తూ తొందరపాటుగా తిరుగుతున్న మనుషులు తమ జీవితపు అర్థరాహిత్యాన్ని గుర్తించకుండా, రొటీన్ అనే బోనులో చిక్కుకుని తిరుగుతున్న చుంచెలుకల్లా కనిపిస్తారు. వాళ్ళు సమాజం నిర్దేశించిన మార్గంలో గుడ్డిగా నడుస్తూ, నిజమైన స్వేచ్ఛను, అస్తిత్వపు అర్థాన్ని తిరస్కరిస్తున్నారు. తాను కూడా అదే బోనులో భాగమని ప్రధానపాత్ర స్వీయ-గుర్తింపును గ్రహిస్తుంది.

కథ చివర్లో, ప్రధానపాత్ర చైతన్యంలో ప్రపంచం ఎలా ప్రత్యక్షమవుతుందో చూపిస్తుంది రచయిత్రి. ఈ ఊరు ఒక భౌగోళిక స్థలం కాదు; అది ఆమెకి ‘కంగారుపడుతున్నట్టు’ ‘ఊపిరాడనట్టు’ అనుభవమవుతున్న జీవనప్రపంచం (lifeworld). అపార్టుమెంట్లు ఒకదానికొకటి అతుక్కొని ఉండటం కేవలం నగరనిర్మాణం కాదు, పాత్ర అంతర్గత స్థితికి ప్రతిబింబం. పైనుంచి కిందకు చూడగానే కలిగే ఉలికిపాటు, దూకితే ఏమవుతుందనే ఆలోచన, రాయిని కిందకు వదిలి చూడటం—ఇవన్నీ మరణం, పతనం, శరీర పరిమితుల గురించి చైతన్యంలో ఉద్భవించే తక్షణ అనుభవాలు. రాయి ‘మామూలుగానే పడింది’ అనే పరిశీలనలో కూడా వస్తువుకు భౌతికలక్షణంకంటే, దానిపై కథకురాలు ఆపాదించిన అర్థమే ముఖ్యమవుతుంది; ‘పడటంలో దానికి ఉత్సాహం లేదు’ అనే వాక్యం వస్తువును మానవానుభూతుల ద్వారా గ్రహించే చైతన్యాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ దృశ్యం నగరవర్ణనగా కాకుండా, కథకురాలి చైతన్యంలో ప్రపంచం, ఆందోళన, పరాయితనం, అస్తిత్వపు అస్థిరతలను చూపించే ప్రయత్నం.

ఈ కథ ముగింపు భాగం సాధారణ సంభాషణల రూపంలో కనిపించినప్పటికీ, అంతర్లీనంగా అస్తిత్వం, వైరాగ్యం, మానవ సంబంధాలు, సేవ, జీవనానుభవం గురించి గాఢమైన తాత్విక ప్రశ్నలను ముందుకు తెస్తుంది. ఆశ్రమానికి వెళ్లి “అన్నీ వదిలేయాలి” అని కథానాయిక అనుకోవడంలో నిజానికి, ప్రపంచాన్ని విడిచిపెట్టాలనే కోరికకంటే, ప్రపంచంలోని స్వార్థపూరిత సంబంధాలవల్ల కలిగిన వ్యతిరేకతకి వ్యక్తీకరణ కనిపిస్తుంది. ఒక రకంగా ఈ కథ ఒక సిద్ధాంతాన్ని స్థాపించదు; ప్రతి సిద్ధాంతాన్నీ ప్రశ్నిస్తుంది.

గోపాల్ పాత్ర ఈ ముగింపులో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ప్రధానపాత్ర తాత్విక ప్రశ్నల్లో చిక్కుకుపోతే, గోపాల్ ప్రాథమిక జీవిత సత్యాలను గుర్తు చేస్తాడు. ప్రధానపాత్రపై అతను చూపే ప్రేమ, శ్రద్ధ, ప్రపంచాన్ని వదిలేయాలనుకునే వ్యక్తిని తిరిగి జీవితంతో కలిపే ప్రయత్నంలో భాగం. లింగంపల్లిలోని పెద్దావిడను చూసుకోవాలనే ప్రతిపాదన కథలో ఒక కీలకమైన మలుపు. ఆశ్రమానికి వెళ్ళటం ద్వారా ప్రపంచాన్ని విడిచిపెట్టాలనుకున్న ప్రధానపాత్రకు గోపాల్, ప్రపంచంలోనే ఉండి మరొక మనిషికి అవసరంగా మారే మార్గాన్ని సూచిస్తాడు. ఇది సేవను ఆధ్యాత్మికతకు ప్రత్యామ్నాయంగా చూపటం. ఆశ్రమ వైరాగ్యానికి బదులుగా మానవ సంబంధాల ద్వారా జీవితానికి అర్థాన్ని కనుగొనే ప్రయత్నం. ప్రధానపాత్ర ‘మనిషికి మనిషే ఒక అవసరం’ అనే నిర్ధారణకు వస్తుంది.

అందువల్ల ఈ కథ ముగింపు వైరాగ్యాన్ని కీర్తించదు. ఆత్మహత్యా ప్రేరణలను సమర్థించదు, లేదా ఆధ్యాత్మికవిముక్తిని అంతిమ సమాధానంగా చూపదు. బదులుగా, జీవితం ఎంత అర్థరహితంగా అనిపించినా, ఒక మనిషి మరో మనిషికి అవసరంగా మారే క్షణాల్లోనే జీవించడానికి కారణాలు ముందుకు వస్తాయని సూచిస్తుంది.