మనసును దోచే మనస్లు– 5


శ్యాలా

మా మనస్లు ట్రెక్‌లో ఏడవరోజున మధ్య హిమాలయ ప్రాంతంలోని 3575 మీటర్ల శ్యాలా అన్న చక్కని చిరుగ్రామం చేరుకున్నాంగదా; ఆ ఊళ్ళోని మౌంటెన్ వ్యూ అన్న టీ హౌస్‌లో వసతి చేసాం గదా; చక్కని ఆతిథ్యం ఇచ్చిన పెంబ-పేమ అన్న ఆ టీ హౌస్‌ను నిర్వహించే స్నేహశీలి దంపతులు నిద్రపోయేముందు ‘బాగా పొద్దున్నే లేచి సూర్యోదయ దృశ్యం చూడండీ’ అని మరీ మరీ చెప్పారుగదా –

ఉదయం ఐదింటికే మా రూమ్మేటు గిరీష్ నన్ను నిద్ర లేపాడు. చంద్రకాంతిలో దంతపు ఛాయ వెలుగుల నడుమ మృదువుగా వెలుగుతోన్న హిమశిఖరాలు గదిలోంచి కనిపించి పలకరించాయి. ఇద్దరం గబగబా మేడమీదకు చేరాం. మనస్లు శిఖరం ఎంతో శోభామయంగా దర్శనమిచ్చింది. చూడగానే విస్మయం కలిగించే పర్వతమది. మేమున్న చోటుకు మనస్లు బాగా దగ్గరగా ఉంది – పక్షిమార్గాన ఆరేడు కిలోమీటర్లు. అంతే. అందువల్ల మబ్బు తునకైనా లేని ఆనాటి నిర్మలాకాశంలో, ఆ ఉదయ సంధ్యా సమయంలో, మనస్లు శిఖరం ఎంతో స్పష్టంగా కనిపించింది. జంట శిఖరాల పర్వతం కదా – చక్కని నెలవంక రూపులో కళ్ళ ముందు నిలచి మనసుకు పరవశం కలిగించింది.

మనస్లు ఒంటరి శిఖరం కాదు. చుట్టూ సహశిఖరాలతో నిండిన పర్వత శృంఖలలో భాగం. 7893 మీటర్ల హిమల్ ఛూలి, మొనదేలిన శిఖరమున్న 7781 మీటర్ల గాడి ఛూలి (Ngadi Chuli), 7157 మీటర్ల ఉత్తర మనస్లు, వాటితోపాటు 8163 మీటర్ల మనస్లు శిఖరం – ఇవన్నీ కలసిన, హిమానీనదాలతో కూడిన విశాలమైన లోయలో వృత్తాకారంలో నిలబడిన ఆ పర్వత శృంఖల చూసేవాళ్ళకు ఒకే సమయంలో సంతోషమూ విభ్రమా కలిగించే శక్తి కలది.

“అంతా బాగానే ఉందిగానీ ఆరుబయట భరించలేనంత చలిగా ఉంది – నీ కాళ్ళూ చేతులూ కొంకర్లు తిరిగి గడ్డ కట్టే స్థితికి చేరుతున్నాయి – ఆ గ్రహింపు ఏమన్నా ఉందా?” అంటూ మనసు నిలదీసింది. ఆలోచనలూ పరవశాలనుంచి బయటపడి గబగబా గదిలోకి వెళ్ళి పొరలు పొరలుగా ఉన్ని బట్టలు వేసుకున్నాను. ఆ పైన మందపాటి ఓవర్ కోటు వేసుకుని తిరిగి మేడమీదకు చేరాను. ఈసారి నా వెచ్చని దుస్తులు చలితో సరితూగగలవు అనిపించింది.


ఉషోదయాన మనస్లు

తొలి వెలుగుల దశ దాటి సూర్యకిరణాలు హిమ శిఖరాలను ముద్దాడడం మొదలయింది. మొట్టమొదటగా ఆ కిరణాలు మనస్లు శిఖరాన్ని తాకాయి. దంతపు రంగు శిఖరం కాస్తా క్షణాల్లో గులాబీ వర్ణం సంతరించుకొంది… ఆ తర్వాత నారింజరంగు… చివరికి ధగధగల పసిడి వర్ణం. పరిసర శిఖరాలకన్నా వర్ణాల వెల్లువ విషయంలో ముందుగా మనస్లు శిఖరం నడవడం, దాని వెంబడే అదే పసిడి దారిని మిగిలిన శిఖరాలు అనుసరించడం, ఆ ప్రక్రియను అతి దగ్గరనుంచి గమనించడం – జీవితంలో అరుదుగా లభించే అవకాశమది. వర్ణలీల ముగిసి సూర్యకిరణాలు మరింత చురుకుదేలేసరికి ఆ శిఖరప్రాంగణమంతా పాలవన్నె సంతరించుకొంది. క్షణాల్లో రజతవర్ణంతో ధగధగలాడింది. ఆ దృశ్యాన్ని చూస్తూ, లెక్కకు మించి ఫోటోలు తీస్తూ అలా చాలాసేపు ఉండిపోయాను.

అక్టోబర్ నెల కదా – ఆకాశం నిర్మలంగా ఉండటంతో ఏ అడ్డూ లేకుండా ఆ దృశ్యాలన్నీ చూడగలిగాం. ఆకాశం ఇలా నిర్మలంగా ఉండటం అన్న లక్షణంవల్లనే నేను మా ట్రెక్‌లకు అక్టోబర్ – నవంబర్ నెలలలోని ఆకురాలు కాలాన్ని ఇష్టపడతాను. వసంత కాలమూ ట్రెకింగ్‌కు అనువైనదే కానీ ఆకాశం ఆ రోజుల్లో ఇంత నిర్మలంగా ఉండదు.

అప్పటికే మా టీ హౌస్‌లోని వాళ్ళంతా మేడమీదికి చేరి హిమశిఖరాలతో సూర్యుని సయ్యాటను ఎంతో నిశ్శబ్దంగా మనసులో నింపుకోవడం మొదలెట్టి చాలాసేపయింది. ఉన్నట్టుండి ఆ నిశ్శబ్దం కేరింతలతో భగ్నమయింది. ఏమిటా అని చూస్తే ఓ జర్మన్ యువకుడు తన బృందపు సభ్యురాలయిన మరో జర్మన్ యువతికి వివాహ ప్రతిపాదన చేస్తూ కనిపించాడు. ఈ జర్మన్ బృందం మాతోపాటు ఘాప్‌నుంచి కలసి వస్తూ ఉంది. ముందు ఆ అమ్మాయి ఆ అనుకోని ప్రతిపాదన చూసి విస్తుపోయింది. కొద్ది సెకన్లపాటు స్పందించలేక పోయింది. ఆ యువకుని సంగతి ఎలా ఉన్నా మాకే ఆ కాసిన్ని క్షణాలూ సుదీర్ఘమనిపించాయి. తేరుకున్న ఆ యువతి ఆ ప్రతిపాదనను అంగీకరించగానే అభినందనలూ కేరింతలూ వెల్లువెత్తాయి. ప్రతిపాదన చెయ్యడానికి ఎన్నుకున్న ఆ సమయం అత్యద్భుతమయినది. ఏళ్ళ తరబడి తమ పిల్లలకూ మనుమలూ మనుమరాళ్ళకూ ఈ దంపతులు పదే పదే చెప్పుకుని మురిసిపోయే జ్ఞాపకం అది! అందరం వెళ్ళి వాళ్ళిద్దరినీ అభినందించి వచ్చాం.

బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో బాబు గురుంగ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌లో ముఖ్యమైన మజిలీ అయిన నామ్చే బాజార్‌లో తీవ్రమైన మంచు తుఫాను వచ్చిందనీ, అందువల్ల ఎంతోమంది ట్రెకర్లు చిక్కడి పోయారనీ చెప్పుకొచ్చాడు. మాలో కొంతమందికి ఇదే విషయం గురించి కుటుంబసభ్యులనుంచీ స్నేహితులనుంచీ ఆందోళన వ్యక్తపరుస్తూ మెసేజ్‌లు వచ్చాయి. అదృష్టవశాత్తూ మా మనస్లు సర్క్యూట్‌కు ఆ తుఫానుల తాకిడి తగలలేదు. అదే కబురు మాకు మెసేజ్‌లు పెట్టిన వాళ్ళకి అందించాం. ఏదేమైనా హిమాలయాల్లో ఏ క్షణాన ఎలాంటి వాతావరణం ఉంటుందో చెప్పటం కష్టం.

బ్రేక్‌ఫాస్ట్‌ విషయానికి వస్తే, ఆ ప్రాంతపు టీ హౌసుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ అంతా బక్‌వీట్‌నే ముఖ్యధాతువుగా చేసుకుని ఉండటం గమనించాం. కొంతమందికి బక్‌వీట్ రొట్టెలూ, మరికొంతమందికి చిక్కటి బక్‌వీట్ జావా బ్రేక్‌ఫాస్ట్‌గా అందాయి. బక్‌వీట్ అన్నది అక్కడ విరివిగా పండే పంట కాబట్టి ఆహార వ్యవహారాలలో తరచూ దాని ఉనికి ఉండటం సహజం. లంచ్ కోసం చపాతీలూ, ఆమ్లెట్లూ ప్యాక్ చేయించుకున్నాం – మాలాంటి ట్రెకర్లకు బాగా ఇష్టమయిన లంచ్ మేళవింపు అది.

బ్రేక్‌ఫాస్ట్‌ ముగించే ముందు బాబు గురుంగ్ ఆనాటి మా కార్యక్రమం వివరించాడు. మా మొదటి గమ్యం ఫుంగ్యెన్ గొంపా. అక్కడికి చేరుకోడానికి మూడు నాలుగు గంటలు పడుతుందని చెప్పాడు. అంటే లంచ్ సమయానికి అక్కడికి చేరుకుంటామన్నమాట. ఆ తర్వాత మరో నాలుగయిదు గంటలు నడిచి సాయంత్రమయ్యేలోగా సామాగావ్ గ్రామం చేరతామట. అక్కడే ఆనాటి మా మజిలీ. అంతా కలసి ఏడెనిమిది గంటలు. దూరం మరీ ఎక్కువ కాకపోయినా మేమున్న శ్యాలా గ్రామం నుంచి 500 మీటర్లు ఎగువకు వెళ్ళి మళ్ళా అదే 500 మీటర్లు దిగివచ్చి సామాగావ్ చేరాలట. ఎగుడుదిగుళ్ళ నడక కదా – ఎక్కువ శ్రమ.

నిన్న కాస్తంత నలతపడిన మోహన్ ఇవాళ్టికి బాగా కోలుకున్నాడు. నిజానికి మేమంతా నిన్న ఉదయంనుంచి బాగా పొద్దుపోయేదాకా నడుస్తూనే ఉన్నాం. ఆ మధ్యలోనే మోహన్‌కు స్వల్ప అస్వస్థత. అయినా తనకు స్వతహాగా ఉన్న శారీరక పటుత్వం సాయంతో ఆ ఇబ్బందిని జయించగలిగాడు. బృందంలోని ఇతర సభ్యులందరూ నిన్నటి నడకను గతంలోకి నెట్టేసి ఇవాల్టి నడకకు ఉత్సాహంగా సిద్ధపడిపోయారు. బృందమంతా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటమన్నది ఇలాంటి ట్రెక్‌లలో ఎంతో అవసరం. ఏ ఒక్క సభ్యుడికి నలత చేసినా దాని ప్రభావం బృందమంతటి మీదా ఉంది తీరుతుంది… ట్రెక్ ఆరంభించేముందు అనిల్, రమేష్‌లు అందరితోనూ వార్మ్ అప్ వ్యాయామాలు చేయించారు. చుట్టూ హిమశిఖరాలతో కూడిన ఆరుబయలు రంగస్థలంలాంటి ప్రదేశంలో ఉదయపు వ్యాయామాలు చెయ్యడం – దానికదే ఆహ్లాదకరమైన అనుభవం.


పేమతో శేషగిరి, అనితారాణి

మేమంతా ఆ ఎనిమిదవ రోజున శ్యాలా గ్రామంలో నడక ఆరంభించినపుడు మేమున్న టీ హౌస్ నిర్వాహకులు పెంబ-పేమలు మాతోపాటు ఊరి చివరిదాకా నడచి వచ్చి వీడ్కోలు పలికారు. ఊరి శివార్లలో ఈమధ్య కురిసిన వర్షాల వల్ల ఏర్పడిన లాండ్‌స్లైడ్ ప్రాంతాన్ని దాటడంలో సాయపడ్డారు. ‘ఏమిటో ఈ అనురాగాల ఆంతర్యం’ అనిపించింది. సంతోషం సరే సరి. శ్యాలా గొంపా దగ్గర ఉన్న చిన్న గుట్ట దగ్గర వాళ్ళిద్దరూ మా నుంచి విడివడ్డారు. ఆ వీడ్కోలు సన్నివేశానికి మనస్లు శిఖరం నేపథ్య దృశ్యంగా అమరి అలరించింది. ప్రకృతి సౌందర్యానికీ, ఆధ్యాత్మిక చింతనకూ, మానవీయ స్పందనలకూ ప్రతీక అయిన ఆ ప్రదేశంలో మేమంతా మనసారా పెంబా-పేమ దంపతులకు ధన్యవాదాలు చెప్పి ముందుకు సాగాం.

నడక మొదలెట్టీ మొదలెట్టగానే మనస్లు, హిమల్ ఛులి, పీక్ 29 శిఖరాలు చక్కని అర్ధవృత్తాకారపు హిమకుడ్యంగా చేతులు కలిపి మాముందు నిలబడి మురిపించాయి. అద్భుతమైన ప్రకృతి మా ముందు పరచుకోవడం, ఏ అడ్డూ లేకుండా ఆ దృశ్యాలను కనుచూపుమేర దాకా చూసే అవకాశం కలిగిస్తోన్న నిర్మల వాతావరణం, దిగువనున్న సుందర వర్ణచిత్రంలాంటి భూమాత, ఆ భూమాతకు నీలి గొడుగులా అమరిన వినీలాకాశం – మనసు పరవశించి పాడే సమయమది. అలా వినిపిస్తోన్న గీతాలపన సాయంతో ఎత్తులు ఎక్కుతున్న శ్రమ అన్నది తెలియకుండా అందరం మా మొదటి మజిలీ ఫుంగ్యెన్ గొంపా పరిసరాలకు చేరుకున్నాం.

దారిలో మాకు అంతకుముందే పరిచయమయిన ఇజ్రాయెల్ మిత్రులు రాజ్, మేరీ, అయోలా కనిపించారు. శ్యాలాలో వాళ్ళంతా మరో టీ హౌస్‌లో బస చేశారట. మళ్ళా అందరం కలసి నడిచాం. ఉదయం చూసిన సూర్యోదయపు అద్భుత దృశ్యాల గురించి సంతోషాలు పంచుకున్నాం. ‘అవి అలౌకిక దృశ్యాలు’ అని వాళ్ళంతా పరవశంగా చెప్పినపుడు నేను వెంటనే ‘ఔనౌను’ అన్నాను.

మేరీ మొక్కలకు వచ్చే తెగుళ్ళకు సంబంధించిన విషయాలలో నిపుణురాలు. రాజ్ కూడా వ్యవసాయ పరిశ్రమకు చెందిన మనిషి. యాపిల్ తోటలు, వైన్ యార్డుల విషయంలో అనుభవమున్న మనిషి. పద్నాలుగేళ్ళ అయోలా పాఠశాల విద్యార్థిని. మేరీకి మరో మూడు రోజుల్లో ఏభై యేళ్ళు నిండుతున్నాయట… ఆ వేడుకను లార్కే కనుమలో జరుపుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. ఇలా ట్రెక్‌లు చేస్తున్నపుడు మాకు దారిలో మరికొంతమంది యాత్రికులు ఇలా తటస్థపడే మాట నిజమేగానీ ఈ ఇజ్రాయెల్ కుటుంబంతో బాగా మాట కలిసింది. మేము నడిచే వేగంతోనే నడుస్తూ, చక్కని కబుర్లు చనువుగా చెపుతూ మాతోపాటు కలసి వచ్చిందా కుటుంబం.


జూనిపర్ చెట్లు

మేమంతా కాసేపు అంతగా ఎదుగుదలలేని జూనిపర్, బ్లూ పైన్ వృక్షాలు నిండిన అడవిలో నడిచాం. ఎత్తులు పెరిగే కొద్దీ వృక్షాలూ మొక్కలూ చిన్నపోవడం, అడవి పలచబడటం మేము పదేపదే గమనిస్తున్న విషయమే. ఆ అడవి నడుమ నిలబడి వెనక్కి తిరిగి చూస్తే ఆ కొండలూ, పర్వతాలూ, ఆడవులూ, లోయల మధ్య శ్యాలా గ్రామం కనిపించీ కనిపించని తునకలా మెరిసి మాయమయింది.

అలా ఆ అడవులూ కొండల మధ్య నడుస్తూ వెళ్ళాక రాళ్ళూ బండలూ, జడలబర్రెలు మేసే పచ్చికబయలూ నిండిన ఒక పీఠభూమి కనిపించింది. మంచుకొండలతో, హిమానీనదాలతో చుట్టుముట్టబడి ఉన్న ఆ పీఠభూమి దేవతలు నడయాడే బృహత్తర రంగస్థలిలా అనిపించింది. మనస్లు పర్వతశృంఖలలోని హిమానీనదాలను బాబు గురుంగ్ మా అందరికీ చూపించి పరిచయం చేసాడు. మేమున్న లోయలో ఒక లోతులేని సెలయేరు ప్రవహిస్తోంది – దానిలోని నీళ్ళన్నీ ఆ గ్లేషియర్లు కరగగా వచ్చినవేనట.

మేము అన్నపూర్ణ ట్రెక్ చేసినపుడు హిమానీనదాలనూ, హిమశిఖరాలనూ మనస్లు పర్వతసీమలో చూసినంత దగ్గరగా చూసి ఎరుగం. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళినపుడు అవన్నీ కాసింత దగ్గరగా ఉన్నాయన్నది నిజమేగానీ అక్కడ మనస్లులో ఉన్నంత సుందరమైన లోయలు లేవు. ఈ మనస్లు సౌందర్యం వేరు… జడల బర్రెలు, వాటి గంటల మృదుధ్వనులు, లోయలోని ప్రశాంతత – అదో దివ్యలోకం… ఊహాతీతమైన సౌందర్యం… అనిర్వచనీయమైన ఆనందం…



ఫుంగ్యెన్ గొంపా వద్ద

ఫుంగ్యెన్ గొంపా చేరగానే, ‘ఎత్తు 4040 మీటర్లు’ అన్న సూచన ఉన్న ఫలకం ఒకటి కనిపించింది. ఏ ట్రెక్‌లో అయినా 4000 మీటర్లు అన్నది ముఖ్యమైన మైలురాయి. ‘గాలి పలచన’ ప్రదేశాలకు చేరుకున్నామని చెప్పే తిరుగులేని సంకేతమది.
ఫుంగ్యెన్ లోని బౌద్ధ మందిరం టిబెటన్ సంప్రదాయ శైలిలో రాళ్ళూ చెక్కలు మేళవించి కట్టిన కట్టడం. ఛోర్టన్లు, మణికుడ్యాలు, ప్రార్థనా పతాకాలు సరే సరి. అక్కడి ప్రశాంత వాతావరణం, ఆకట్టుకొనే ప్రకృతి, నాగరిక మానవ సంపర్కానికి బాగా దూరంగా ఉండటం – ఈ లక్షణాల వల్ల ఫుంగ్యెన్ గొంపా అరుదైన ప్రఖ్యాతిని పొందింది. ‘నడిచేటపుడు ఎత్తులు చేరుకో – నిద్రించేటపుడు దిగువన నిద్రించు’ అన్న ట్రెకర్లకు తరచూ అందే అమూల్యమైన సూచనకు ఆచరణ బిందువు ఈ ఫుంగ్యెన్ గొంపా. గొంపా దగ్గర నాలుగువేల మీటర్ల ఎత్తు అందుకున్న వాళ్ళం కాస్తా రాత్రి వసతికి మరో 500 మీటర్ల దిగువన ఉన్న సామాగావ్ చేరుకుంటాం. ట్రెకింగ్‌లోని మౌలిక నియమానికి అది పరిపూర్ణమైన ఆచరణ అన్నమాట.

మేము వెళ్ళిన సమయంలో గొంపా మూసివేసి ఉంది. భిక్షువుల జాడలు కూడా కనిపించలేదు. మా గైడ్ సమీఛ కాస్తంత దూరాన కొండలలో ఉన్న భిక్షువుల నివాసాలు చూపించింది. మధ్యాహ్నం కదా – బహుశా వాళ్ళంతా విశ్రాంతి తీసుకుంటూ ఉండి ఉంటారు.

గొంపా ఆవరణలో చేరి లంచ్ చేస్తూ అందరం ఆనాటి యాత్ర విశేషాలు పంచుకోసాగాం. గంటల తరబడి, రోజుల తరబడి కలసి నడవటం అంటే సహచరుల మధ్య సంభాషణలు సహజం. కొండల్లో నడచినపుడు మనలో గుప్తంగా ఉండే నాగరిక మర్యాదలు మనకు తెలియకుండానే హరించిపోయి సంభాషణల్లో సహజత్వం ఎక్కువవుతుంది. చనువు చోటు చేసుకుంటుంది. చెణుకులు చెరుకురసంలా సాగి సంభాషణల్ని మధురంగా మలుస్తాయి. అయినా ఆ గొంపా పరిసరాల్లో కూర్చున్నపుడు మా అందరిలోనూ నిశ్శబ్దసంగీతమే రాజ్యమేలింది. పరిసరాల్లోని సౌందర్యం, ప్రశాంతి మా మనసుల్లో గూడు కట్టుకోసాగింది. అందరం ఒక రకమైన బృందధ్యానంలో తెలియకుండానే మునిగిపోయాం.

కాసేపలా గొంపా దగ్గర కూర్చుని, భోజనం ముగించి, సామాగావ్‌కేసి కాలు సాగించాం. దిగువకేసి నడక. దిగటమే కదా, అదేమంత కష్టం అనుకోనవసరం లేదు. ఒకోసారి ఎక్కడం కన్నా దిగడమే కష్టమూ ప్రమాదకరమూ అవవచ్చు. ఏమరుపాటు చోటు చేసుకుంటే కాలు జారే ప్రమాదముంటుంది. ఆ పూట నా విషయంలో అదే జరిగింది. ఏదో నిలకడలేని రాయిమీద కాలువేసాను. ఆ రాయి జారిపోయింది. నేను బొక్కబోర్లా పడిపోయాను. అదృష్టవశాత్తూ దెబ్బలేం తగల్లేదు. లేచి బట్టలు దులుపుకుని కాళ్ళు జాడించి చూసుకున్నాను. ఆందోళనతో నాకేసి చూస్తోన్న మా వాళ్ళకి చిరునవ్వుతో సమాధానం చెప్పి ముందుకు అడుగు వేసాను. ఏదేమైనా ట్రెక్‌లన్నాక, ఎగుడు దిగుడు నడకలన్నాక, ఈ పడి లేవడాలు జరుగుతూనే ఉంటాయి!

ఒకచోట నిడుపాటి మెట్ల బాటా, పెద్ద పెద్ద బండరాళ్ళూ ఉన్న ప్రదేశంలో మా నడక సాగింది. పులిమీద పుట్రలా జడల బర్రెల బృందం ఒకటి మా దారికి అడ్డంగా నిలబడింది. నిజానికి అవి సాధుజంతువులే; కానీ వాటి పదునైన కొమ్ములు చూసి అంతా సందేహిస్తూ నిలబడిపోయాం. మా రేషమ్ వాటిల్ని సైగల ద్వారానూ, చేతికర్రతోనూ మృదువుగా అదిలించి దారి సుగమం చేసాడు. అలాగే ఒకచోట ఒక రాతిగోడను చెక్క మెట్ల సాయంతో అధిగమించవలసి వచ్చింది.

దూరాన అందాల సామాగావ్ లీలగా కనిపించింది. ముందుకు సాగాం. ఊరి పొలిమేరల్లో టెంటు వేసుకుని ఉన్న వలంటీర్లు మా అందరికీ కాఫీ అందించారు… ఆ ప్రదేశాన్ని జపనీస్ కాంప్ అంటారట. పక్కనే ఉన్న స్కూలుకు చెందిన ఉపాధ్యాయులే ఆ కాంప్‌ను నడుపుతున్నారు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని స్కూలు పనుల కోసం వినియోగిస్తున్నారట. అందరం ఆ కాఫీ అంది పుచ్చుకున్నాం. ఏదేమైనా ఆ టీచర్ల ఉత్సాహం, అంకితభావం చూసి ముచ్చట కలిగింది. పలకరించినపుడు చక్కగా మాట్లాడి ఉపయోగకరమైన స్థానిక సమాచారం అందించారు.

మరో పది నిముషాల నడక తర్వాత ఊళ్ళోకి చేరాం – 200 ఇళ్ళు ఉన్నాయట. వెయ్యిమంది జనాభా అట. నేపాల్ దేశంలో మారుమూల లోయల్లో ఉన్న గ్రామాల్లో ఇది ఒకటి. టిబెట్ సరిహద్దు అక్కడికి ఎంతో దగ్గర. ఊళ్ళో ఇళ్ళన్నీ రాతి కట్టడాలు… చెక్క తలుపులు, కిటికీలు – పలకలు పరచిన పైకప్పులు. ఊళ్ళోని ముఖ్యమార్గానికి అటూ ఇటూ ఎంతో ఒద్దికగా నిలచి ఉన్నాయా ఇళ్ళు. కొండ ప్రాంతాల్లో తరచూ కనిపించినట్టు ఆ ఇళ్ళన్నీ రెండతస్తులవి; పై అంతస్తు ఇంటి వాళ్ళకోసం. దిగువ అంతస్తు వారి జంతువులూ వాటి పశుగ్రాసం కోసం… పైకి చేరడానికి చెక్క నిచ్చెనలున్నాయి. దిగువన జంతువులను ఉంచడంలో అదనపు సౌకర్యం ఒకటి ఉంది – చలికాలంలో అవి ఇంటిని వెచ్చగా ఉంచుతాయి. ప్రతి ఇంటికీ కూరగాయల మళ్ళు ఉన్నాయి. క్యాబేజీ, ముల్లంగి, ఇతర ఆకుకూరలు పండిస్తున్నారా మళ్ళల్లో.

ఊళ్ళోని రోడ్డుకు అవతలివేపున కొత్తగా వెలసిన భవనాలు కనిపించాయి. ఈ మధ్య కాలంలో సామాగావ్ కాస్తంత సందడి నిండిన ప్రదేశంగా పరిణమించిందన్నమాట. అన్నపూర్ణ మార్గంలో మనాంగ్‌లాగానూ, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ బాటలో నామ్చే బాజార్‌లాగానూ ఈ సామాగావ్ ట్రెకర్ల విరామపు విడిదిగా మారినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయినా మనస్లు సర్క్యూట్ ఇంకా అన్నపూర్ణ, ఎవరెస్ట్ అంత ప్రఖ్యాతి పొందకపోవడంవల్ల పోల్చి చూస్తే సామాగావ్‌లో యాత్రికుల తాకిడి తక్కువే అనిపించింది. ఆ గ్రామం తన రూపురేఖలనూ, ముగ్ధత్వాన్నీ ఇంకా నిలుపుకొని కనిపిస్తోంది. ఎక్కడెక్కడైతే ట్రెకింగ్ విరివిగా సాగుతుందో అక్కడ ఆయా గ్రామాలు తమ అమాయకత్వాన్ని కోల్పోవడం, టీ హౌసుల్లాంటివి విరివిగా పుట్టుకు రావడం నడుస్తున్న చరిత్రే. ఎప్పుడో ఒకప్పుడు సామాగావ్ కూడా ఆ తాకిడికి తల వంచే అవకాశం ఉంది. అది అనివార్యమే అని తెలిసినా ప్రాణం చివుక్కుమనక తప్పలేదు.

ఏదేమైనా మనాంగ్, నామ్చే బాజార్‌ల్లాగా తన ముగ్ధత్వాన్ని కోల్పోవక ముందే సామాగావ్‌ను చూడటమన్నది నాకు సంతోషం కలిగించింది. ప్రాచుర్యం లభించే కొద్దీ ఇలాంటి గ్రామాల్లో ఉద్యోగావకాశాలు పెరగడం, యువతకు ఉపాధిమార్గాలు ఏర్పడటం, ఆర్థికంగా ఆయా గ్రామాలు ముందడుగు వేయడం – ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలు. అదే సమయంలో ఆ గ్రామాలు తమ మౌలిక లక్షణాలు కోల్పోకుండా చూడగలగడం అసాధ్యమేమీ కాదు – దూరదృష్టీ, విజ్ఞతా ఉన్న నాయకులు పూనుకుంటే అది సాధ్యమే! మరి సామాగావ్‌లో అలాంటి వ్యక్తులు ఉన్నారా?!

మళ్ళా పోలికల దగ్గరకు వస్తే సామగావ్‌ను మనాంగ్, నామ్చే బాజార్‌లాంటి ఊళ్ళతో అప్పుడే పోల్చడం సాధ్యమూ కాదు, సమంజసమూ కాదు. ఆ ఊళ్ళలో ఉన్నట్టు సామాగావ్‌లో బేకరీలు, కెఫేలు, కాఫీ షాప్‌లు ఇంకా రాలేదు. ఇప్పట్లో ఊరి ప్రశాంతతకు భంగం కలిగే ప్రమాదం అంతగా లేదనే అనిపించింది. అన్నట్టు ఈ ఊరు అటు లార్కే పాస్ వెళ్ళేవారికీ ఇటు మనస్లు శిఖరం అధిరోహించేవారికీ కూడలి ప్రదేశం. సామాగావ్ నుంచి తిన్నగా సాగిపోతే లార్కే పాస్ వేపు వెళతాం. ఎడమకు మళ్ళితే మనస్లు బేస్ క్యాంప్‌.


సామాగావ్‌లో మేము ‘మౌంట్ మనస్లు’ అన్న టీ హౌస్‌లో ఉన్నాం. చక్కని సదుపాయాలు కలిగిన ముచ్చటైన వసతి గృహమది. హిమాలయాల్లో గడిపిన మరో మరపురాని రోజును కీర్తించుకుంటూ మేమంతా తీరిగ్గా డిన్నర్ చేసాం. మనస్లు శిఖరపు స్వర్ణకాంతులతో శ్యాలాలో మొదలైన మా ఉదయం ఒక పక్కన హిమశిఖరాల తోడు, మరో పక్కన ఊహాతీతమైన ప్రకృతి సౌందర్యం – వీటితో శ్రమ అన్నది తెలియకుండా గడిచిపోయింది.


అక్టోబర్ పదకొండు. శనివారం.

ఖాట్మండూ వదిలి ఎనిమిది రోజులు గడిచాయి. ట్రెక్ మొదలెట్టి ఏడు. ఆ తొమ్మిదవ రోజు విరామం కోసం అట్టేపెట్టుకున్నాం. అనుకొన్నామే కానీ కాస్తయినా నడవక పోతే కాళ్ళు నొప్పి చేస్తాయని తెలుసు. మనసూ ఊరుకోదు. అంచేత సామాగావ్‌కు బాగా దగ్గరలో ఉన్న బీరేంద్ర తాల్‌కు వెళ్ళి వద్దామని ప్రణాళిక వేసాం. ఆ సరస్సు మరీ ఎత్తున లేదు. సరళమైన నడక.


జిగ్మే తో

అంతా తీరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేసాం. తేనె పోసిన బక్‌వీట్ దిబ్బ రొట్టెలు మా బ్రేక్‌ఫాస్ట్‌లో ముఖ్యమైన దినుసు. కడుపు నిండింది. సామాన్లు సర్దుకోవడం, గదులు ఖాళీ చెయ్యడంలాంటి హడావిడులు లేవు గదా – తీరిగ్గా పది గంటలకు అందరం బీరేంద్ర సరోవరం కేసి అడుగులు వేసాం.

జూనిపర్ అడవులగుండా ఇరవై నిముషాల నడక సాగాక, పురాతనమైన పేమా ఛోలింగ్ గొంపా అన్న టిబెటన్ బౌద్ధమఠం చేరుకున్నాం. ఆ ప్రాంతంలోకెల్లా ముందుగా, 450 సంవత్సరాల క్రితం స్థాపించిన మఠమది. జిగ్మే అన్న అక్కడి మఠాధిపతి మా అందరినీ సాదరంగా ఆహ్వానించి ముఖ్యమందిరమంతా చూపించాడు. ఎన్నెన్నో ఋతువులను చూసిన గోడలు, వాటికి అమర్చిన చెక్కతో చేసిన ప్రవేశద్వారాలు, పలకల పైకప్పు, మందిర ముందు రెపరెపలాడుతోన్న ప్రార్థనా పతాకాలు – అణువణువునా ప్రాచీనత ఉట్టిపడుతోన్న మందిరమది. మనస్లు శిఖరారోహణకు వెళ్ళే బృందాలకు ఊతమిచ్చే ప్రార్థనాప్రక్రియ జరపటం ఈ మఠపు ప్రత్యేకత.

గొంపా లోపలి గోడలన్నీ మత సంబంధిత చిత్రపటాలతోనూ ‘థంగ్కా’లతోనూ అలంకరించబడి ఉన్నాయి. నడుమన బుద్ధుని కంచు విగ్రహముంది. ఒక పక్కన నేతి దీపాల వేదిక. మందిరమంతా జూనిపర్ ధూమ పరిమళం… ఓ మూలన నేల మీద కూర్చుని ధ్యానంలో మునిగిపోయిన బౌద్ధ భిక్షువు…

ఆ ధ్యానమగ్న భిక్షువును చూసిన స్ఫూర్తితో ‘మేము కూడా అలా కూర్చుని కాసేపు ధ్యానం చేయవచ్చా,’ అని జిగ్మేను అడిగాం. “మహా సంతోషంగా – బౌద్ధ మఠాల ఆధ్యాత్మిక శక్తిని ఆవాహన చేసుకోడానికి అక్కడ ధ్యానం చెయ్యడాన్ని మించిన మార్గం లేదు,” అంటూ ప్రోత్సహించాడు జిగ్మే. మాలో కొంతమందిమి ఎన్నో నిముషాలపాటు ధ్యానంలో మునిగాం. జిగ్మే చెప్పినట్టుగానే ఏదో నూతనోత్సాహం మాలోకి ప్రవేశించిన భావన కలిగింది.

విడివడుతోన్న సమయంలో ఈ గొంపా నిర్మాణానికి కొద్ది దశాబ్దాలకు పూర్వమే టిబెట్‌నుంచి వచ్చిన బౌద్ధులు సామాగావ్ గ్రామాన్ని స్థాపించారన్న వివరం అందించాడు జిగ్మే. ఆయన ఆదరణకూ చూపించిన శ్రద్ధకూ, మాతో గడపిన సమయానికీ ధన్యవాదాలు అర్పించి అక్కడినుంచి ముందుకు కదిలాం.

గొంపా వదిలి ముందుకు సాగినా ఆ అనుభవం మా మనసుల మీద చూపించిన ప్రభావం మాకు తోడుగా వచ్చింది. రావడమే కాకుండా నేను ఎవరెస్ట్ ట్రెక్‌లోనూ, అన్నపూర్ణ ట్రెక్‌లోనూ ఆగి చూసిన గొంపాలను జ్ఞప్తికి తెచ్చింది. ఈబీసీ మార్గంలోని తెంగ్బోఛె గొంపా, అప్పర్ పిసాంగ్‌లోని పిసాంగ్‌ గొంపా నా మీద చిరకాలం నిలిచే ప్రభావం చూపించాయి. అలా ట్రెకింగ్‌లాంటి సాహసక్రీడల మధ్య బౌద్ధమందిర దర్శనాలలాంటి ఆధ్యాత్మికానుభవాలు సంతరించుకోవడం, ఆ మేళవింపు ఆయా ప్రయాణాలకు అరుదైన పరిమళం అద్దడం – ఇది నేపాల్ ట్రెక్‌లలోనే సాధ్యమనుకొంటాను. పురాతన సంస్కృతి, అతి సుందరమైన ప్రకృతి, ఆధునిక జీవనవిధానం మలినపరచని ఆధ్యాత్మికత – అపురూప సమ్మేళనం ఆ గొంపా వ్యవస్థ.

అలా ఓ గంట నడిచాక మనస్లు పర్వతం మళ్ళా మా కంట పడింది. దాని రెండు శృంగాలూ స్పష్టంగా కనిపించాయి. అంతకు ముందు ఆ రెండిటిలోనూ మరికాస్త ఎత్తున ఉన్నట్టు కనిపించిన శిఖరం ఇక్కడ రెండవ శృంగం కన్నా దిగువన ఉన్నట్టు కనిపించి ఆశ్చర్యం కలిగించింది.


బీరేంద్ర-సరోవరం

అలా మనస్లు పర్వతాన్ని చూస్తూ ముందుకు సాగుతూ ఉండగానే ఉన్నట్టుండి హిమశిఖరాల మధ్య దాగి ఉన్న బీరేంద్ర సరోవరం నవ్వుతూ పలకరించింది. కాసేపట్లో అందరం ఆ సరస్సు ఎగువ గట్టు మీదకు చేరుకున్నాం. అక్కడనించి సరోవరమంతా ఒక్క ఊపులో కనిపించింది. సరోవరమంతా కనిపించడమే కాకుండా దానిలోకి దిగివస్తోన్న జలధారల ఛాయలూ స్పష్టంగా కనిపించాయి. మనస్లు పర్వతం నాయకత్వంలో మిగిలిన హిమశిఖరాలన్నీ తమ వంతు మంచు నీళ్ళను బీరేంద్ర సరోవరానికి అర్పిస్తున్న రీతి మమ్మల్ని అబ్బురపరచింది. వంతుల సంగతి ఎలా ఉన్నా ఈ సరోవరానికి మూలజలాధారం మనస్లు హిమానీనదం మాత్రమే అన్నదీ స్పష్టమయింది.

ఆ ఎగువ గట్టునే కాసేపు నిలబడి తనివిదీరా ఫోటోలు తీసాం. హిమశిఖరాల నేపథ్యం, దిగువన తటాకం ఒడ్డున దట్టమైన వృక్షజాలం, సరస్సులోకి దిగివచ్చే జలాలే కాకుండా బయటకు పారే సెలయేళ్ళు – కలల లోకమది. ఇలా ఒక సరోవరాన్ని సంపూర్ణంగా చూడటమన్నది నేను చేసిన నేపాల్ ట్రెక్‌ల్లో ఇది రెండవసారి: మొదటిసారి ఈబీసీ ట్రెక్‌లో 4500 మీటర్ల ఎత్తున ఉన్న థుగ్లా అన్న గ్రామం దగ్గరలోని ఝోంగ్లా పొఖారి సరోవరం ఇలానే చూసాను. అంతకు ముందు ఒకసారి పాకిస్తాన్ హిమాలయాల్లోని సైఫ్-ఉల్-ముల్క్ సరోవరాన్ని చూసాను.

మెల్లగా అందరం సరస్సు ఒడ్డుకు దిగాం. ఆ అతి శీతలజలాలలో కాళ్ళు తడుపుకోవాలన్న కోర్కెను ఆపుకోలేకపోయాం – బూట్లు తీసి, సాక్స్ విప్పి గులకరాళ్ళు నిండిన లోతులేని నీళ్ళలోకి అడుగు వేసాం. అప్పుడే కొండల్లో కరిగి దిగువకు దిగిన ఆ నీళ్ళు మా అలసిన పాదాలకు చిరువరాలు అయ్యాయి. కాళ్ళమీద ఐస్ పాక్‌లు పెట్టుకున్నట్టు అలసిన కండరాలకు ఉపశమనం కలిగింది. అక్కడే ఉన్న కొంతమంది జర్మన్ యువకులు ఏకంగా ఆ మంచునీళ్ళలో ఈదులాటకు దిగారు. వారి ధైర్య సాహసాలూ పట్టుదలా చూసి ముచ్చట కలిగింది.

అన్నట్టు ఈ బీరేంద్ర సరోవరం స్థూలంగా సామాగావ్ నుంచి మనస్లు బేస్ క్యాంప్ వెళ్ళే దిశలోనే ఉంది. ఆ సంగతి గుర్తుకొచ్చిన కొంతమంది మా బృందపు సభ్యులు ‘ఒక అడుగు అటూ వేద్దాం,’ అని ఉత్సాహపడ్డారు. కానీ వివరాల్లోకి వెళ్ళినపుడు అలా వెళ్ళి రావడానికి ఏడెనిమిది గంటలు అదనంగా అవసరమనీ, ఈమధ్య కురిసిన వర్షాల వల్ల లాండ్‌స్లైడ్‌ల తాకిడీ ఉంటుందనీ స్పష్టమయింది. అంచేత ఆ ఆలోచన విరమించుకున్నాం.


గణేశ్ హిమల్

తిరిగి సామాగావ్ వచ్చేటప్పుడు వేరే మార్గం తీసుకున్నాం. ఆ దారిలో అందరూ ఆరాధించే గణేశ్ హిమల్ పర్వతం దగ్గరగా కనిపించింది. పిరమిడ్‌లాంటి ఆకృతి, కొనదేరిన ముక్కు కలిగిన పర్వతమది. మా గైడ్ సమి అవకాశాన్ని అందిపుచ్చుకుని మాకు ఎదురుగా కనిపిస్తోన్న ఆ పర్వతపు మంచు దొంతరలలో గణేశుని ముఖాకృతి, తొండం, కళ్ళు చూపించింది. నిజమే. ఇక్కడి నుంచి చూస్తే వినాయకుడి రూపం స్పష్టంగా తెలుస్తోంది. ఆ పర్వతం సార్థక నామధేయి అన్న విషయంలో అందరి సందేహాలు తొలిగాయి.


ఏమన్నా ఉపకరణాలుగానీ పరికరాలుగానీ కొనాలంటే మాకు సామాగావ్ గ్రామమే అవి దొరికే చివరి విపణి వీథి. నేనొక అదనపు హెడ్‌లాంప్ కొనుక్కున్నాను. మూడు రోజుల క్రితంవరకూ కురిసిన భారీ వర్షాలు లార్కే కనుమ ప్రాంతంలో మంచును బాగా నింపి వదిలాయని తెలిసి మా బృందంలోని కొంతమంది మంచు మీద సులువుగా నడవడం కోసం బూట్లకు అమర్చుకొనే ముళ్ళ తొడుగులు – క్రాంపాన్స్, కొనుక్కున్నారు.


అవసరాలూ అలవాట్లూ మనిషిని ఎంతగా మార్చగలవో చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ. నేను స్వతహాగా భోజన ప్రియుడిని. నేపాల్ హిమాలయాల్లో మూడు నాలుగేళ్ళ క్రితం ట్రెకింగ్ మొదలుపెట్టినపుడు అక్కడ దొరికే దాల్ భాత్, మొద్దు బియ్యపు అన్నం తినడం ప్రాణాంతకమనిపించింది. మెల్లమెల్లగా అలవాటు పడిపోయాను. నాలానే మా వాళ్ళందరూ పరిస్థితితో సమాధాన పడి, ఇంటినుంచి తెచ్చుకున్న పచ్చళ్ళను అదనంగా భోజనంలో చేర్చుకుని, ఆ సమస్యను దాటుకుంటూ వచ్చారు. స్వతహాగా మేమంతా దక్షిణ భారతదేశానికి చెందిన, అన్నం ప్రధానంగా ఉండే భోజనాలలో పుట్టి పెరిగిన వాళ్ళం. పశ్చిమదేశాలకు వెళ్ళిన నాలాంటి వాళ్ళ ఆహారపుటలవాట్లలో గణనీయమైన మార్పు వచ్చింది. పాశ్చాత్య భోజనాలకు క్రమక్రమంగా అలవాటు పడిపోయాం. ఇపుడు ఈ నేపాల్ హిమాలయాల్లో దొరికేదల్లా కేవలం అన్నమూ పప్పే. మొదటి ట్రెక్‌లలో మొద్దు బియ్యం ఇబ్బంది పెట్టిందిగానీ మనస్లు దగ్గరికి వచ్చేసరికి చక్కటి సన్నబియ్యపు అన్నం దొరికింది. అదో గొప్ప ఊరట. వెరసి ఈసారి ప్రయాణంలో మా ఆహారపు అవసరాలు సవ్యంగా తీరటమే కాకుండా చిన్నప్పటి అలవాట్లయిన పచ్చళ్ళూ ఇతర ఆధరవులూ కలసిన ఆ భోజనాలు మాలోని పురాజ్ఞాపకాలను తట్టి లేపాయని చెప్పాలి. రుచుల సంగతి అలా ఉంచి ఈసారి ప్రయాణంలో ప్రతి రోజూ శుచికరమైన భోజనం లభించింది. అంచేత కడుపులు పాడవటాలూ, అనారోగ్యాలూ మా దగ్గరికి చేరలేదు.


ఆ సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి సావకాశంగా తిరిగి వద్దామనిపించింది. మరికొంతమంది నాతో చేరారు. అందరం కలసి నిన్న కాస్తంత పరిచయమయిన, ఊరికి అటుచివర ఉన్న, పాఠశాల చూసి వద్దామని బయల్దేరాం. దారికి అటూ ఇటూ పచ్చిక మేస్తోన్న జడల బర్రెలు కనిపించాయి. ఒకోచోట అవి మా దారికి అడ్డంగా వచ్చాయి కూడానూ. వాటిని అదిలించగలమా లేదా అన్న సందిగ్ధంలో మరోసారి పడినపుడు మా వెనుక వస్తోన్న టీనేజి స్కూలు పిల్లలు సాయం వచ్చారు. వాళ్ళంతా ఖాట్మండులో చదువుతూ దసరా సెలవలకు స్వగ్రామం వచ్చారట. వాళ్ళు కూడా తాము చిన్నపుడు చదువుకున్న పాఠశాల చూసి వద్దామని బయలుదేరారట.

మాలాగే ఈ ఆడపిల్లలు కూడా మాఛాఖోలానుంచి నాలుగు రోజులు నడిచి వాళ్ళ ఊరు సామాగావ్ చేరుకున్నారట. చదువు ముగిశాక ఖాట్మండులో కానీ విదేశాలలోగానీ చక్కని వృత్తులు చేపట్టాలన్నది వారి ఆకాంక్ష. వాళ్ళు అమ్మానాన్నలనూ చుట్టాలనూ చూడ్డానికైతే వచ్చారు కానీ వారిలో ఎవ్వరికీ తమ గ్రామంలో తిరిగి స్థిరపడాలన్న ఆలోచన లేదు… అన్నట్టు మేమంతా వెళుతోన్న స్కూలు పేరు గౌరీశంకర్ బేసిక్ స్కూల్ అని మాటల్లో తెలిసింది.

సాయంత్రం అయిదు గంటల వేళ అందరం స్కూలు దగ్గరికి చేరుకున్నాం. అప్పటికే నిన్న చూసిన కాఫీ టెంట్ మూసేసి ఉంది. స్కూల్లోకి వెళ్ళగా కొంతమంది పిల్లలు కనిపించారు. టీచర్లెక్కడా? అని అడిగాం – వెనుక ఉన్న భవనం చూపించారు. అక్కడ ఉన్న వంటింట్లో టీచర్లందరూ డిన్నర్ తయారీలో భాగస్వాములై కనిపించారు.


శ్యాలాలో బౌద్ధాలయం

వారిలో సేటన్ అన్న వ్యక్తి మమ్మల్ని పలకరించాడు. ఆయన టీచర్-కమ్-వార్డెన్ అట. టీచర్లు అక్కడ ఉన్న వంటమనిషికీ, ఇతర సిబ్బందికీ సాయం చేస్తున్నారు. ‘బయట బాగా చల్లగా ఉండే రోజులు కదా, టీచర్లంతా ఈ సమయంలో కిచెన్‌లో చేరడానికి ఇష్టపడతారు’ అని వివరించాడు సేటన్. కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద గిన్నెల్లో వంటకాలు ఉడుకుతూ కనిపించాయి. ఆ గిన్నెల మధ్య ఉంచిన కెటిల్‌లోంచి తాజా తాజా టీ కప్పుల్లో పోసి మాకు అందించారు. 1970ల నాటి నా చిన్నతనంలో మా అమ్మకూడా ఇలాగే కట్టెల పొయ్యి మీద వంట వండటం గుర్తొచ్చింది. కాలుతోన్న ఆనాటి ఎండీ ఎండని కట్టెల వాసన దశాబ్దాల అంతరాన్ని దాటుకుని వచ్చి మళ్ళీ నా నాసికాపుటాలను తాకింది. ఇప్పుడు ఈ టీచర్లు చేస్తున్నట్టే నేనూ శీతాకాలంలో వెచ్చదనం కోసం వంటింట్లో అమ్మ దగ్గరికి చేరేవాడిని. వేసవిలో అదే వంటిల్లు ఉష్ణగుండమయేది. నేనా దరిదాపులకు వెళ్ళేవాడిని కాదు. కానీ అమ్మకు తప్పదు కదా – అక్కడే చెమటలు కక్కేది. పొగలో ఉక్కిరిబిక్కిరి అయేది. తర్వాత్తర్వాత మా వంటింట్లో బయోగ్యాస్ అడుగుపెట్టింది. పొగ బెడద తప్పింది.

టీ తాగటం ముగిసాక సేటన్ మాకు స్కూలు భవనం, హాస్టళ్ళూ తిప్పి చూపించాడు. మేమంతా స్కూలు కోసం సముచితమైన విరాళం అందించాం. కొంతమంది పిల్లల్ని పలకరించి మాట్లాడాం. అనిత ఈ పిల్లలకోసం తీసుకువచ్చిన బిస్కెట్ పాకెట్లు వాళ్ళకు అందించాం.

ఆ బోర్డింగ్ స్కూల్లో 57మంది విద్యార్థులున్నారట. సామాగావ్ గ్రామానికీ పరిసర ప్రాంతాలకూ చెందిన వాళ్ళా పిల్లలు. మిగతా సబ్జెక్ట్‌లతోపాటు వారికి ఇంగ్లీష్ కూడా ఒక పాఠ్యాంశమట. వారాంతాలలో తలిదండ్రులు వచ్చి పిల్లల్ని చూసి వెళుతూ ఉంటారట.

స్కూలు నిర్వహణకు ప్రభుత్వనిధులతోపాటు ఆ ప్రాంతపు బౌద్ధ భిక్షువుల సాయం కూడా అందుతోంది. ఖాట్మండూలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న భిక్షువులు అందించే చేయూత అమూల్యమైనది. యోంగే మిన్గ్యూర్ రింపోఛె అన్న సామాగావ్ మూలాలకు చెందిన భిక్షువు ఖాట్మండూలో పలుకుబడి ఉన్న మనిషి. ‘ద జాయ్ ఆఫ్ లివింగ్’ అన్న పుస్తకం రాసారాయన. ధ్యానబోధనలో నిష్ణాతుడు. ఖాట్మండూలోని ‘టేగర్ ఓసెల్ వింగ్ మానెస్ట్రీ’ నిర్వాహకుడు. స్కూలు నిర్వహణలోనే కాకుండా ఇక్కడి విద్యార్థులకు ఉన్నత విద్యకోసం స్థానికంగానూ ఇతర దేశాలలోనూ స్కాలర్షిప్పులు ఇప్పించి పెడుతూ ఉంటాడట. అతని తమ్ముడు సోక్ని రింపో ఛె కూడా పేరుపొందిన బౌద్ధాచార్యుడు. ‘పుండరీక ఫౌండేషన్’ అన్న సంస్థ వ్యవస్థాపకుడు. అన్నదమ్ములు ఇద్దరూ సామాగావ్‌లో పుట్టి పెరిగిన వాళ్ళు. బౌద్ధధర్మం చదువుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడినా, తమతమ రంగాల్లో బాగా పేరుపొందినా, వాళ్ళిద్దరికీ తమ సామాగావ్ మూలాలంటే ఎంతో మక్కువ.

ఆ స్కూల్లో కాసేపు గడపటం, అక్కడి పిల్లలతోనూ టీచర్లతోనూ మాట్లాడటం మాకు ఎంతో సంతోషం కలిగించింది. సామాగావ్‌లాంటి మారుమూల గ్రామాల వారికి శక్తి సామర్థ్యాలను సమకూర్చడంలో విద్యను మించిన ఉపకరణం లేదు. పేదరికంనుంచీ పీడననుంచీ బయటపడడానికి విద్య ఉత్తమ మార్గం. ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని సామూహిక వ్యవస్థలకన్నా ఈ పాఠశాల అతి ప్రయోజనకరమైనది అన్నది నా భావన.

మేమంతా గ్రామపు పాతవీథుల్లోకి చేరుకున్నపుడు మోహన్ ఒక పద్నాలుగేళ్ళ కుర్రాడితో కబుర్లలో పడ్డాడు. పాల్డన్ గ్యాత్సో అన్న ఆ కుర్రాడు ఖాట్మండూలో చదువుకుంటున్నాడట. వాళ్ళ అన్నయ్య, అక్కయ్యలు కూడా ఖాట్మండూలోనే ఉంటున్నారట. సెలవలకు ఇంటికి వచ్చాడు. తల్లి ఒంటరి మహిళ. చిన్నపాటి కమతం ఉంది. అందులో పండే వరి పంట వారి అవసరాలకు సరిపోతుంది. పెరట్లో కాయగూరలు పెంచుతున్నారు. వాటితోపాటు కొన్ని పశువులు. సెలవుల్లో పిల్లలంతా వచ్చి తల్లికి సాయపడుతూ ఉంటారు. గ్రామంలో ఉన్న ఇతర చుట్టాలు అవసరాన్ని బట్టి ఆమెకు సాయం అందిస్తూ ఉంటారు.


సామాగావ్‌లో మేమున్న టీ హౌస్‌కు ఫుర్బు ఛవాంగ్ లామా, అతని భార్య లక్ష్మో బుటి లామా నిర్వాహకులు. దంపతులిద్దరూ స్నేహశీలులు. చక్కని ఆతిథ్యమందించారు. వాళ్ళ ఇరవై రెండేళ్ళ అబ్బాయి, నిమా లామా – బాగా సహాయం అందించే మనిషి.

ఆ సాయంత్రం ఫుర్బు లామా మాతోపాటు ముచ్చట్లకు కూర్చున్నాడు. భాషానేపథ్యాల అంతరంవల్ల కాబోలు ముందు బిడియంగా ఉండిపోయినా మెల్లమెల్లగా మాట కలిపి తన జీవిత విశేషాలు చెప్పుకొచ్చాడు. ఆయన పుట్టిందీ పెరిగిందీ సామాగావ్‌లోనే. ఎనిమిదేళ్ళ వయసులో చదువుకోసం మనాంగ్‌లోని పిన్ని దగ్గరకు చేరాడు. సామాగావ్‌నుంచి మనాంగ్ మూడు రోజులు ప్రయాణం. చిన్నప్పటినుంచీ చదువుకుని సోషల్ వర్కర్‌గా మారి తనవారికి సాయపడాలని కాంక్షించాడు.

మనాంగ్‌లో స్కూలు చదువు ముగిశాక ఖాట్మండూలోని త్రిభువన విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ టీచర్ ట్రైనింగ్ కోర్స్‌లో చేరాడు. భూగర్భశాస్త్రం, ఫోటోగ్రఫీ అధ్యయనం చెయ్యాలన్నది అతని అప్పటి అభిలాష.

జెఫ్రీ ఛైల్డ్స్ అన్న అమెరికన్ మానవ శాస్త్రవేత్త సెయింట్ లూయిస్ నగరంలోని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన వ్యక్తి. తన అధ్యయన రంగంలో క్షేత్రస్థాయి అనుభవంకోసం ఆయన నుబ్రీ లోయను ఎన్నుకున్నాడు. సామాగావ్ కేంద్రంగా ఆ అధ్యయనం కొనసాగిస్తున్నపుడు ఆయన ఫుర్బు లామా గురించి విన్నాడు. ఖాట్మండూలో చదువుతోన్న ఫుర్బు లామాను జెఫ్రీ వెళ్ళి కలిసాడు. చదువు ముగిసాక స్వగ్రామానికి తిరిగి వచ్చి స్థానిక పాఠశాలలో టీచరుగా చేరమని నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు. ఫుర్బు ముందు ఒప్పుకోలేదు. జెఫ్రీ పట్టు విడవలేదు. చిట్టచివరికి ఫుర్బు సామాగావ్ వచ్చి స్కూల్లో చేరాడు. మొదటి రెండేళ్ళు ఫుర్బు జీతం తన రీసెర్చి ఫండ్‌లోంచి జెఫ్రీనే చెల్లించాడు.

జెఫ్రీ చేపట్టిన రీసెర్చి ప్రాజెక్టు మరో రెండేళ్ళపాటు ఫుర్బు జీతనాతాలు చెల్లించింది. తర్వాత ఆ ప్రాజెక్టు ముగింపుకు వచ్చింది. ఫుర్బు చొరవ చేసి స్కూలు వ్యవహారాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్కూలును ప్రభుత్వ విద్యావ్యవస్థలో భాగం చేసే దిశగా ప్రయత్నాలు చేసాడు. ఆ ప్రయత్నాలు ఫలించి చివరికి స్కూలును ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. ఫుర్బు అలా గవర్నమెంటు ఉద్యోగి అయ్యాడు. ప్రాథమిక స్థాయినుంచి అన్ని క్లాసులకూ ఇరవై ఏళ్ళపాటు బోధించాడు. స్కూలును అభివృద్ధి చెయ్యడం, కార్యకలాపాలు విస్తరించడంలో కీలకపాత్ర పోషించాడు.

ముప్పై ఏళ్ళ క్రితం ఈ గ్రామాల్లో టీ హౌసులన్న మాటే లేదని చెప్పుకొచ్చాడు ఫుర్బు. మౌంట్ మనస్లు శిఖరారోహణకోసం వచ్చే బృందాల కోసం ఫుర్బు వాళ్ళ నాన్న సామాగావ్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలో అతి ప్రాథమిక సౌకర్యాలతో ఓ టీ హౌస్ తెరిచాడట – నిజానికి దాన్ని క్యాంపింగ్ సైట్ అనాలట. వాళ్ళ నాన్నకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఫుర్బు సహాయం తరచూ అవసరమయ్యేదట.

మనస్లు శిఖరారోహణకు వచ్చే అంతర్జాతీయ బృందాలకు సహాయం చేయటంకోసం ఆ రోజుల్లో నేపాల్ ప్రభుత్వానికి చెందిన లైజాన్ (liaison) ఆఫీసర్లు వచ్చేవారట. రావడమయితే వచ్చేవారే కానీ వారికీ ఈ స్థానిక ప్రదేశాల అవగాహన పూజ్యం. ఆ అధికారులు వచ్చి ఫుర్బు వాళ్ళ ఇంట్లో ఉండేవారట. ఈయన గవర్నమెంటు టీచరవడం, ఊళ్ళో ఇంకో వసతి సౌకర్యం లేకపోవడం ఆ చొరవకు కారణాలు.

తమ చిన్న ఇంట్లో అందరికీ వసతి కల్పించడం కష్టమయ్యేసరికి, ‘నేనే ఒక చిన్న హోటల్ ఎందుకు ఆరంభించకూడదూ?’ అన్న ఆలోచన ఫుర్బుకు వచ్చింది. ఊరి మొగలో తనకున్న స్థలంలో చిన్న వసతి గృహం, కాంపింగ్ గ్రౌండ్ తెరిచాడు. అలా సామాగావ్‌లో మొట్టమొదటి టీ హౌస్ ఆవిర్భవించింది. కాలక్రమేణా మనస్లు సర్క్యూట్ మరింతమంది సాహసికులను ఆకర్షించడం, ట్రెకర్ల తాకిడి గణనీయంగా పెరగడం, మరిన్ని టీ హౌస్‌లు సామాగావ్‌లో పుట్టుకు రావడం – మనమిప్పుడు చూస్తోన్న పరిణామం. మనస్లు శిఖరారోహకులతోపాటు లార్కే కనుమకు వెళ్ళే ట్రెకర్లు కూడా తమ ఎక్లమటైజేషన్ విడిదిగా సామాగావ్‌ను గుర్తించడంతో గ్రామంలో కోలాహలం పెరిగింది.

ఫుర్బు తన టీ హౌస్ తెరిచినపుడు ఆ దారిదాపుల్లో మరే ఇతర భవనమూ ఉండేది కాదట. ఈ టీ హౌస్‌లో దెయ్యాలున్నాయి అని గ్రామస్తులు ఆ ప్రాంతాలకు రావడానికి భయపడేవారట. పెళ్ళయిన తర్వాత వాళ్ళావిడ లక్ష్మో తమ టీ హౌస్‌ను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పాత్ర పోషించిందంటాడు ఫుర్బు.

‘నేను ఊళ్ళో లేనపుడు మా ఊరి వాళ్ళంతా కలసి నన్ను మా గ్రామం ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు. దాంతో టీచరు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవలో పడ్డాను. ఐదేళ్ళ తర్వాత రాజకీయాల్లోంచి తప్పుకుందామనుకున్నాను. మా వాళ్ళు మళ్ళా నన్ను ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు. ఈసారి తిరస్కరించాను,’ చెప్పుకొచ్చాడు ఫుర్బు.

శీతాకాలంలో గ్రామమంతా బోసిపోతుందట. సహజమే మరి. చలినుంచి తప్పించుకోవడానికి చాలామంది ఖాట్మండూ వెళ్ళిపోతారట. ఊర్లో ఎలానూ వృత్తి వ్యాపకాలకు అవకాశం ఉండదు. ఖాట్మండూలో ఇల్లేదైనా అద్దెకు తీసుకుని శీతాకాలం గడిపి వస్తారట. పెద్దవాళ్ళనూ పెంపుడు పశువులనూ చూసుకోవడానికి కొంతమంది ఊళ్ళోనే ఉండిపోతారు. చలి తగ్గి వసంతం వచ్చేసరికి ఊరి జనాభా అమాంతం పెరిగిపోతుంది. ట్రెకింగ్ సీజన్లో ఊరి జనాభా వెయ్యిని దాటుతుంది. సెలవలకు తిరిగి వచ్చే పిల్లలతో ఊరంతా కళకళలాడుతుంది. ఊరికే రావడమే కాకుండా ఆ పిల్లలంతా విధిగా అనేక పనుల్లో తమ తమ కుటుంబాలకు చేయూతనిస్తూ ఉంటారు. “ఇదివరకటి రోజుల్లో ఖాట్మండూనుంచి సామాగావ్ రావడానికి పిల్లలు బృందాలు బృందాలుగా ఏర్పడే వాళ్ళు. తమతోబాటు టిబెటన్ గుడారాలు తెచ్చుకుని దారిలో రాత్రిపూట ఆ గుడారాల్లో పడుకునేవారు. ఇపుడు పరిస్థితి మెరుగయింది. ఇపుడు రాత్రిళ్ళు టీ హౌసుల్లో గడిపి వస్తున్నారు,” చెప్పాడు ఫుర్బు.

ఫుర్బుకు నలుగురు పిల్లలు: ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఆ అమ్మాయి కెనడాలో చదువుకుంటోందట. ఒకబ్బాయి అమెరికాలో యూటా యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. మరో కొడుకు, ఇపుడు వాళ్ళ దగ్గర ఉంటోన్న నిమా లామా, త్వరలో ఖాట్మండూలో యూనివర్సిటీ చదువుకు వెళుతున్నాడు. అందరికన్నా చిన్నాడు ఖాట్మండూలో బోర్డింగ్ స్కూల్ విద్యార్థి.


ఫుర్బు-లక్ష్మోలతో

ఫుర్బు ఇపుడు నడి ఏభైల వయసుకు చేరాడు. ‘ముందు జియాలజిస్టో ఫోటోగ్రాఫరో అవుదామనుకున్నాను. అలాగే సమాజసేవకుడిని అవుదామనుకున్నాను. అదేమీ జరగలేదు. అయినా నాకే విచారమూ లేదు. నేను జీవించిన పద్ధతి మా పరిసరాలను ఎంతో కొంత ప్రభావితం చేసింది. అది చాలు,’ అన్నాడా సంతృప్త జీవి. నిజమే. స్కూలు టీచరుగా, నిర్వాహకుడిగా ఊళ్ళో వాళ్ళకి విద్యకు ఎంత శక్తి ఉందో చూపించాడు. మొట్టమొదటి టీ హౌస్ తెరిచి మరో 20 టీ హౌస్‌లకు మార్గదర్శి అయ్యాడు. ఎంతోమందికి ఉపాధిమార్గం చూపించాడు. ఒక సామాన్యుడు తన జీవితంతో ఇంత మార్పుకు కారణభూతుడయ్యాడంటే అదేమంత సామాన్యమైన విషయం కాదు.

తనవల్ల ఊరు ఎంతో కొంత అభివృద్ధి చెందింది అన్న సంతృప్తి ఫుర్బుకు ఉన్నా ఆ అభివృద్ధి శృతి మించి వెర్రి తలలు వేస్తుందేమోనన్న ఆందోళన కూడా అతనిలో ఉండటం గమనించాను. ఊళ్ళోకి విరివిగా వచ్చే ట్రెకర్లూ వాళ్ళకి వసతి కల్పించే టీ హౌస్‌లూ వ్యర్థపదార్థాల నిలయాలుగా మారుతున్నాయనీ, దానివల్ల పర్యావరణానికి హాని కలుగుతోందనీ అతని ఆవేదన. “ముఖ్యంగా మనస్లు బేస్ క్యాంప్ చెత్తా చెదారంతో నిండిపోతోంది. ఊర్లో నాలాంటి వాళ్ళమంతా కలసి ఆ బేస్ క్యాంప్‌లోని వ్యర్థ పదార్థాలను ముందు సామాగావ్‌కూ, అక్కడనుంచి ఖాట్మండూకూ తరలించే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసాం. మనస్లుకు వచ్చే సాహసికులందరూ వ్యర్థపదార్థాలను క్రమబద్ధంగా ఒక చోట చేర్చే నియమ నిబంధనలను పాటించేలా చూస్తున్నాం. అటు బేస్ క్యాంప్‌కు వెళ్ళే వాళ్ళూ, ఇటు లార్కే కనుమ వేపు వెళ్ళే వాళ్ళూ సామాగావ్‌ను దాటుకునే వెళ్ళాలి. అంచేత నియంత్రణ కాస్తంత సులభమవుతోంది,” చెప్పాడు ఫుర్బు.

అభివృద్ధి అంటే గొడ్డలివేటు ముందుగా పడేది వృక్షాల మీదే… ఆ సంగతి గమనించిన ఫుర్బు 2016లో మనస్లు ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ (MEED) ఫౌండేషన్ అన్న సంస్థను స్థాపించాడు. అప్పట్నించీ ఇప్పటిదాకా జూనిపర్, పైన్, భూర్జలాంటి జాతుల 80 వేల వృక్షాలను అక్కడ నాటిందట ఆ ఫౌండేషన్.

సామాగావ్ గ్రామపు సమగ్ర రూపాన్ని నా కళ్ళ ముందు నిలిపినందుకు ఫుర్బుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాను. “ఎన్నో రోజుల తర్వాత ఒక యాత్రికుడిగా వచ్చి మీరు ఇలా నాతో కలసి మా కష్టసుఖాలనూ చరిత్రనూ పంచుకున్నారు. అందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి,” అన్నాడతను. “ఇలా ఈ టీ హౌస్ నడపటంవల్ల ఎక్కడెక్కడి వారినో కలుసుకునే అవకాశం దొరుకుతోంది. ఇలాంటి అనుభవాలు పొందగలగడం నా అదృష్టం,” అని కూడా అన్నాడు.

మా సంభాషణ ముగిసేసరికి రాత్రి పదకొండయింది. అందరూ అప్పటికే ఎక్కడికక్కడ సర్దుకున్నారు. డైనింగ్ రూమంతా ఖాళీ అయిపోయింది. విడివడే ముందు ఫుర్బు నాకు జెఫ్రీ చైల్డ్స్ రాసిన ‘టిబెటన్ డైరీ – ఫ్రమ్ బర్త్ టు డెత్ అండ్ బియాండ్ ఇన్ ద షాడోస్ ఆఫ్ మనస్లు’ అన్న పుస్తకం బహూకరించాడు.

మణులూ మాణిక్యాలూ గోల్కొండ గనుల్లోనే కాదు – మనస్లు శిఖరం దగ్గరా దొరుకుతాయి.

(సశేషం)