వెలుతురు కిటికీ మూసేయకు

పిల్లల గుంపులో
విడిగా కూర్చొని
ఆకాశానికి నక్షత్రాలు
అంటిస్తోన్న వాణ్ణి
అక్కున చేర్చుకో

ఏదో ఒకరోజు
భూమికి చెవిలో
రహస్యం చెపుతాడు
తరాల మౌనఘోష

పొద్దుగూకిందని
పక్షులన్నీ
చెట్లు వెతుక్కున్నాయని
వెలుతురు కిటికీ మూసేసి
చీకటి తలుపు తెరవకు

గుమ్మం ముందు
రెక్క తెగిన వలసపక్షి
మూలుగుతోంది
కాస్త కనికరించు
వాక్యాల పెదాలు విచ్చి
శబ్దం గొంతు పలుకుతుంది
రహస్యాలు లేని సందర్భం
రాత్రిగా మారి
శరీరాలని తడువుతుంది

వలయాలు వలయాలుగా
తరంగాలు లంకె పడి
సూర్యుణ్ణి బయటకు తోసి
కాళ్ళు దగ్గర చేసుకుంటుంది

నువ్వు చూసేది కొండ కాదు
ధాత్రీ శరీరపు ముడత మాత్రమే


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...