[నేహా దీక్షిత్ దిల్లీకి చెందిన స్వతంత్ర జర్నలిస్టు. గత 17 సంవత్సరాలుగా రాజకీయాలు, జెండర్, సామాజిక న్యాయం మొదలైన విషయాలను ఆమె కవర్ చేస్తున్నారు. ఆమె రచనల్లో చాలా భాగం పరిశోధనాత్మకంగా, కథనాత్మకంగా, దీర్ఘ రూపంలో ఉంటాయి. అల్ జజీరా, వాషింగ్‌టన్ పోస్ట్, ద న్యూయార్క్ టైమ్స్, ద కారవాన్‌లాంటి పేరున్న ప్రచురణ సంస్థలకు ఆమె రిపోర్టు చేశారు. ఆమెకు దాదాపు ఒక డజనువరకూ జాతీయ, అంతర్జాతీయ జర్నలిజం అవార్డులు వచ్చాయి. 2020 సంవత్సరపు ప్రపంచ యువ జర్నలిస్టు అవార్డు, జర్నలిస్టులకు భద్రతనిచ్చే కమిటీ ఏటా ఇచ్చే అంతర్జాతీయ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డును 2019 సంవత్సరానికిగాను, అత్యుత్తమ మహిళా జర్నలిస్టులకు ఇచ్చే చమేలీదేవి జైన్ అవార్డును 2017 సంవత్సరానికిగాను, 2014 అంతర్జాతీయ కుర్ట్ స్చోర్క్ జర్నలిజం అవార్డు, యూరోపియన్ కమీషన్‌నుండి ఇచ్చే లోరెంజో నటాలీ ప్రైజ్ 2011 సంవత్సరానికిగాను ఆమె అందుకొన్నారు. ఆమె అందుకున్న అవార్డుల్లో ఇవి కొన్ని మాత్రమే. — సం.]
ఈ పుస్తకంమీద దాదాపు 9 సంవత్సరాలు పని చేశాను. దాదాపు 900 మందిని కలిసిన తరువాతే ఈ పుస్తకం బయటకు వచ్చింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేసిన వందలాది గంటల ఇంటర్వ్యూలు, సామూహిక చర్చలు, ఊరికే చెప్పుకొన్న కబుర్లు, ప్రణాళికాబద్ధమైన ప్రశ్నావళి – వీటన్నిటి ఫలితమే ఈ పుస్తకం.
బెనారస్, చాందినీ చౌక్, సభాపూర్, కరవాల్ నగర్, నస్బంది కాలనీలలో నివశిస్తున్న మనుషుల పేర్లను మార్చాను. వాళ్ల గోప్యత, గుర్తింపుల భద్రత కోసం అలా చేయాల్సి వచ్చింది. ఇద్దరు ముగ్గురు వ్యక్తులను కలిపి ఏ పాత్రలనూ తయారు చేయలేదు. ఏ ఘటనలనూ కలిపేయలేదు.
రాసిన ప్రతి విషయానికీ ఆయా వ్యక్తుల అనుమతి తీసుకొన్నాను. నేను జర్నలిస్టునని వాళ్లకు తెలుసు. ఈ పుస్తకం రాయటంలో భాగంగా వాళ్లను కలుస్తున్నానని కూడా తెలుసు.
ఫ్యాక్టరీలలో, స్వీట్ షాపుల్లో, ఇంటినుండి పనిచేసే వారి గృహాల్లో, పోలీసు స్టేషన్‌లలో, పునరావాస కేంద్రాల్లో, మార్కెట్లలో, హైవేలలో, కోర్టుల్లో, ఆసుపత్రుల్లో, మాల్స్‌లో, పారిశ్రామిక ప్రాంతాల్లో, పట్టణ గ్రామాల్లో, అనధికార కాలనీలలో, మురికివాడల్లో, ఝుగ్గి ఝోప్‌డీ నివాసాల్లో, ఇంకా ఇతర బహిరంగ ప్రదేశాల్లో నా ఫీల్డ్‌వర్కు చాలావరకు నడిచింది.
నేను చరిత్రకారిణిని కాను. ఆర్థికవేత్తనూ కాను. రాజకీయ శాస్త్రవేత్తను అంతకంటే కాదు. నేను ఎలాంటి క్రమశిక్షణా సరిహద్దులను పెట్టుకోలేదు. ఒక రిపోర్టర్‌గా – సమాచారాన్ని వెలికి తీయటం, దాన్ని ధృవీకరించటం, విశ్లేషించటం, అందులోనుండి కథనాన్ని బయటకు తీసి చెప్పటంలో నేను శిక్షణ పొందాను. అదే పని నేనిక్కడ చేశాను.
2014 చివరివరకు ఈ పుస్తకంలో వర్ణించిన వారి జీవితాలలో జరిగిన అనేకానేక సంఘటనలను నేను స్వయంగా చూశాను. ఈ పుస్తకంలో చెప్పిన సంఘటనలన్నీ నేను ఇంటర్వ్యూ చేసిన వారి జ్ఞాపకాలను ఆధారంగా తీసుకొని రాసినవి. మొదటి ఇంటర్వ్యూ అయ్యాక, ఇంకా చాలాసార్లు ఇంటర్వ్యూలు చేసి విషయాలను నిర్ధారించుకొన్నాను. ఇంకా నిర్ధారణ కోసం ప్రభుత్వపత్రాలూ, దినపత్రికల రిపోర్టులూ, న్యాయ, పోలీసు రికార్డులు, విద్యాసంబంధిత పత్రాలు, ప్రత్యేక పారిశ్రామిక నివేదికలూ వాడుకొన్నాను.
పేదలను ప్రశ్నించటానికి తరచుగా పోలీసు స్టేషన్లలో నిర్బంధించటం, ఫ్యాక్టరీలలో జరిగిన ఘటనలు, అనధికార రంగంలో పనిచేసే కార్మికులకు చెల్లించే అత్యల్ప వేతనాల రికార్డులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే గర్భస్రావాల సంఖ్య, వాడల్లో జరిగిన హింసలు, నేరాలు – ఈ పుస్తకంలో ప్రస్తావించిన ఇలాంటి ఘటనలలో చాలావాటికి బహిరంగపరచిన రికార్డులు లేవు.
ఒక విషయాన్ని అక్షరబద్ధం చేయాలంటే పరపతి, ప్రాముఖ్యత, వనరులు కావాలి. అవి పేదలకు వుండవు. జవాబుదారీతనంనుండి తప్పించుకోవటానికి ప్రభుత్వం కూడా పేదల జీవితాలను గ్రంధస్థం చేయదు. నోటిమాటలుగా చెప్పే చరిత్రలే మనకు లభించే రికార్డులు.
చాలామందికి తమదీ, తమ కుటుంబ సభ్యులదీ – వయసూ, పుట్టిన తేదీని గుర్తు పెట్టుకోవటం కష్టం. అనేకమంది పేదప్రజల్లో, పెద్దవారిలో ఇది చాలా సహజం. అలాగే తమ వేతనాలు, లేకపోతే ఒక్కో పనిలో లభించే పీస్‌వైజ్ రేటులాంటి సంఖ్యలను గుర్తు పెట్టుకోవటం కూడా కష్టమే.
ఈ పుస్తకంతో సహా, నా మొత్తం రిపోర్టింగు జీవితంలో నేను మహిళలను, వారు ఎదుర్కొన్న ఒక తరహా హింస గురించి అడిగినపుడు – వాళ్లెప్పుడూ తమలాంటి హింసను ఎదుర్కొలేదని చెప్పేవాళ్లు. కానీ తమకు తెలిసిన మరెవరో ఎదుర్కొన్న హింస అంటూ దాన్నే సవివరంగా చెబుతారు. నేరం చేసిన వారికంటే బాధితురాలికే ఎక్కువ అవమానం వుండటం వలన వాళ్లు అలా చెప్పాల్సి వస్తుంది. అసౌకర్యమైన ప్రశ్నలు మరిన్ని అసౌకర్యమైన ప్రశ్నలను పుట్టిస్తాయి. వాళ్లను ఏదైనా అడిగితే, మనల్ని కూడా అడుగుతారు. మనం ఆ ప్రశ్నలకు తప్పక సమాధానం చెప్పాలి. అప్పుడే ఇద్దరి మధ్య పాక్షికంగానైనా నమ్మకం ఏర్పడుతుంది. నేను వాళ్లతో కావాల్సినంత సమయాన్ని గడిపాక, వాళ్ల గురించి వాళ్లు మాట్లాడుతూ పోవటాన్ని గమనించాను.
మొదట్లో ముక్కలు ముక్కలుగా, ఒక పద్ధతీ పాడూ లేకుండా కథలన్నీ బయటకు వచ్చాయి. నేను వాటిని ఒకదాని తరువాత ఒకటి పేర్చుకొంటూ పోవటం మొదలుపెట్టి, ఒక సంపూర్ణరూపంలో వాటిని చూసే ప్రయత్నంలో నాకు ఇంకా బోలెడు ప్రశ్నలు ఎదురయాయి.
కానీ జ్ఞాపకం ఎప్పుడూ ఒక వరుస క్రమంలో వుండదు. గుర్తు పెట్టుకోవటం, మర్చిపోవటంలాంటి చర్యలు చాలా సంక్లిష్టంగా వుంటాయి.
కొన్ని ఘటనల వరుసక్రమాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం అంత సంతోషం కలిగించే విషయమేమీ కాదు. జ్ఞప్తికి తెచ్చుకొన్న సంఘటనలు మన బాధను తీవ్రతరం చేసి, ఏది ముందు జరిగిందీ ఏది తరువాత జరిగిందీ అనే క్రమాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఆ బాధే ఘట్టాలను అసంపూర్ణం చేస్తుంది. రంగం మీదకు కొన్ని కథనాలనే తెస్తుంది. భావాలను మాటల్లో పెట్టలేని స్థితి వస్తుంది.
గత ముప్ఫై సంవత్సరాలలో సయ్యదా చేసిన, యాభై పైచిలుకు పనుల గురించి గుర్తు తెచ్చుకోమని అడిగినపుడు, ఆమె చికాకు పడింది. ‘ఒక బేల్‌దారీ కూలీని ఇన్ని సంవత్సరాలలో ఎన్ని ఇళ్లు కట్టావని అడగ్గలవా? కాంట్రాక్టర్ల, యజమానుల చిరునామాలు ఎక్కడ గుర్తుంటాయి?’ అన్నదామె.
పనిచ్చే యజమానీ, పనీ – రెండూ వేగంగా మారిపోతున్నపుడు ఈ వివరాలకు వాళ్ల జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యతా వుండదు. ఒక ఫ్యాక్టరీలో ఆవు మూత్రంతో అగరుబత్తీలు చేయటానికీ, తలుపు పిడులు తయారు చేయటానికీ – ఎలాంటి వ్యత్యాసమూ కనబడదు. కథనాలు రాసే నాకు ముఖ్యంగా అనిపించే విషయాలు, సయ్యదాకు చాలా చిన్న విషయాలుగా వుంటాయి.
మనుషులు పదేపదే స్థానభ్రంశం చెందుతున్నపుడు, వాళ్లకు సంబంధించి చెప్పుకోవటానికి కొన్ని కథనాలను మాత్రమే ఎన్నుకొంటారు. చాలా విషయాల్లో మౌనం ఆశ్రయిస్తారు. అనేక విషయాల్ని వారి స్మృతిపథంనుండి తొలగిస్తారు. సయ్యదాను కలిసిన నాలుగు సంవత్సరాలవరకూ, అంటే 2018 వరకూ, ఆమెకు షాజెబ్ అనే కొడుకు వున్నాడని కూడా నాకు తెలియదు. 2014లో షాజెబ్ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో అప్పుడు చెప్పింది సయ్యదా. ఒక హిందువుల అమ్మాయితో ప్రేమలో పడి అందరి జీవితాలను ప్రమాదంలో పడేశాడు. అది తెలిసాక అతనికి సంబంధించిన విషయాలన్నీ నాకు తెలిసి పోయాయనుకొన్నాను. కానీ ఒక ఏడాది తరువాతనే దేశభద్రత పేరిట 2012లో అతను ఎలా రాజ్యం చేతిలో హింసకు గురి అయ్యాడో తెలిసింది.
గతానికి సంబంధించిన కొన్ని ఘటనలు ప్రజల స్మృతులనుండి పునర్నిర్మాణం చెందుతాయి. ప్రధాన, రెండవ ఇంటర్వ్యూలు ఒక దానితో ఒకటి కలిసిపోయి, వాటి ద్వారా గుర్తుకు తెచ్చుకొని చెప్పిన అనుభవాలు, సంభాషణల ప్రకారం కొన్ని మాటలను వాళ్లు చెప్పింది చెప్పినట్లుగానే వుంచాను.
కొన్నిచోట్ల మనుషులు ఏమి అనుకొన్నారో, ఏమి నమ్మారో – ఆ భావనలు, అనుభవాలను నాకు వాళ్లే వివరించి చెప్పారు.
ఈ పుస్తకంలోని చాలా విషయాలు నేను సయ్యదాను కలవక ముందే జరిగినా -ఈ పుస్తకం మీద పని చేస్తున్నపుడే, 2016లో జరిగిన సల్మాన్ మరణం, 2020లో జరిగిన దిల్లీ దాడులు మనసును కకావికలు చేశాయి.
2020 దిల్లీ దాడుల తరువాత కరవాల్ నగర్‌కు నా రాకపోకలు పెరిగాయి. అప్పుడే దాదాపు ఒక ఐదు నెలలపాటు నన్ను వెంబడించారు. యాసిడ్ దాడులు చేస్తామనీ, గ్యాంగ్ రేపులు చేస్తామని నిరంతరంగా బెదిరింపులు వచ్చాయి. ఈ మధ్య నేను ఏ కూరగాయలు కొన్నానో, బాల్కనీలో ఏ పక్క కూర్చొని వున్నానో, నా సహచరుడు ఎక్కడకు వెళ్లాడో – వందలాది ఫోన్ కాల్స్ ద్వారా నన్ను వెంబడించే వాళ్లు బెదిరిస్తున్నట్లు చెప్పేవాళ్లు. దాడుల గురించీ హిందూ ఆధిపత్య సంస్థల గురించీ నా రిపోర్టింగ్‌ను ఆపమని నాకు ఇంకో వార్నింగ్ ఇచ్చాక, మా ఇంట్లోకి చొరబడే ప్రయత్నం జరిగింది. అయితే అందులో వాళ్లు సఫలం కాలేదు. పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండా నేను ‘ఏదో ఊహించుకొంటున్నానని’ అన్నారు.
ఈ విషయం నేను సయ్యదాకు చెప్పినపుడు ‘పట్టించుకోకు. కుక్కులు మొరుగుతూనే వుంటాయి. ఏనుగు తన దారిలో అది పోతూనే వుంటుంది,’ అన్నది.
ఆ సమాధానం నాకున్న సౌలభ్యం, నా భయాలను అలాగే మనసులో మోయగలిగిన నా లగ్జరీ గురించి ఎత్తి చెప్పటమే కాదు – భవిష్యత్తు మీద భరోసానే సయ్యదాకున్న ప్రతిఘటనా ఆయుధమని కూడా తెలియచేసింది.
ఈ పుస్తకంలో నేను ఉదహరించిన స్థలాల్లో, ప్రజల మధ్య తిరుగుతూ ఇప్పటికీ రిపోర్టింగు చేస్తున్న జర్నలిస్టులందరికీ మనఃపూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నాను. వాళ్లు పని చేస్తున్న వార్తాసంస్థల్లో వారు చేస్తున్న ఈ పనికి గుర్తింపు లేకపోవచ్చు, కానీ ఆ పని ద్వారా అధోజగత్ ప్రజల చరిత్రకు తొలి రచనను వాళ్లు ఖచ్చితంగా రూపొందిస్తున్నట్లే.
ఈ కింద పుస్తకాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. The Warp and Weft: Community and Gender Identity among Banaras Weavers by Vasanthi Raman, Nickel and Dimed by Barbara Ehrenreich, Gulab Bai: The Queen of Nautanki Theatre by Deepti Priya Mehrotra, Women Workers and Globalization: Emergent Contradictions in India by Indrani Mazumdar, The Other Side of Silence: Voices from the Partition of India by Urvashi Butalia. ఈ రచనలు నేను ఈ పుస్తకంలో తెచ్చిపెట్టిన అనేక సంఘటనలకూ, కథనాలకూ సాధికారికతనిచ్చాయి.
నేను ఏదో ఒక సమూహానికి మాత్రమే స్వరాన్నయ్యానని అనుకోవటం లేదు. సయ్యదా, ఆమె కుటుంబం, స్నేహితులు చేసిన ప్రయాణాలు, వారి స్మృతులు, పోరాటాలకు గౌరవం లభిస్తుందనే భరోసాతో; భారతదేశం భిన్నస్వరాలను ఎన్నటికీ మర్చిపోదనే ఆశతో – నాకు అర్థమైన రీతిలో కథను చెప్పాను.
ఈ పుస్తకంలోని దోషాలు, అపరిపూర్ణతలు మొత్తంగా నావే.