పోతన భాగవతంలో దృశ్యీకరణం – 5

పోతన తరువాత వచ్చిన కవుల కవిత్వంలో దృశ్యీకరణం

దృశ్యీకరణం అన్నది లిపి పుట్టక ముందు నుంచి వుండి వుంటుంది. భాష పుట్టక ముందు నుంచే మనిషి, తను కన్నవి, విన్నవే కాక తన ఆలోచనలను, ఉద్వేగాలను ఇతరులతో పంచుకుని ఉంటాడు. పంచుకునే మనిషి తన ఊహా శక్తి మేరకు సైగలతో, హావభావాలతో ఆయా సందర్భాలను వివరించి ఉంటాడు. భాష పుట్టి, పరిణతి పొందే పరిణామక్రమంలో సైగలు, హావభావాలకు మాటలు కూడా కలిపి సాటి మనుషులకు తన భావాలను కళ్ళకు కట్టినట్లు చెప్పి ఉంటాడు. అంటే కవిత్వం పుట్టడానికి పూర్వమే దృశ్యీకరణ పద్ధతులు కొన్ని ఏర్పడి ఉంటాయి. తెలుగులో కవిత్వం పరిణతి పొందే కొద్దీ, కావ్యాలలో దృశ్యీకరణలు పెరిగాయి.

కావ్య సాహిత్యం నుంచి ప్రబంధ సాహిత్యం వరకు, కాలక్రమేణా తెలుగు భాష అభివృద్ధి చెందే క్రమంలో కవులు కావ్యాలలో దృశ్యీకరణలకు ప్రాధాన్యతను పెంచుకుంటూ వచ్చారు. ఆదికవి నన్నయ మహాభారతం నుంచి ప్రబంధ కవి పింగళి సూరన కళాపూర్ణోదయం వరకూ, ఆ పిదప వచ్చిన కావ్యాలను గమనిస్తే ‘కథలను చెప్పే ధోరణి నుంచి, కథలను చూపించే పద్ధతి’ని కవులు ఆచరించారనిపిస్తుంది.

కావ్యయుగం ప్రబంధయుగంలోకి అడుగులు వేయడానికి ఆయత్తమవుతున్న సమయంలో పోతన కావ్యరచన చేసారు. పైగా భాగవతంలో పోతన చెబుతున్నది కథలు. పోతన దృశ్యీకరణ శైలికి ఈ రెండు ముఖ్యమైన కారణాలై వుంటాయని నేనూహిస్తున్నాను.

రూప సార దృక్పథాలలో – కథే తన రూపాన్ని ఎంచుకుంటుందన్న వాదన ఒకటి ఉంది.
సారం బట్టే రూపం ఉంటుంది. చెప్పదలచుకున్న విషయం బట్టే చెప్పే తీరు ఉంటుంది. ఈ విషయం ప్రక్రియలకు మాత్రమే పరిమితం కాదు.

తెలుగు కవిత్వంలో పోతనకు ముందున్న కవులు ఎలాంటి దృశ్యీకరణ పద్ధతులను అవలంబించారో మొదటి అధ్యాయంలో స్థూలంగా చెప్పుకున్నాం. ఈ అధ్యాయంలో పోతన సమకాలీనులైన శ్రీనాథకవిసార్వభౌముని కావ్యాలలోను, పదకవితాపితామహుడు అన్నమయ్య సంకీర్తనలలోను దృశ్యీకరణలను పరిశీలించి, ఆ తర్వాత పోతన పిదప వచ్చిన కవుల కవిత్వాలలో దృశ్యీకరణల గురించి స్థూలంగా చూద్దాం.

4.1 పోతన సమకాలీన కవుల కవిత్వంలో దృశీకరణం ఉదాహరణలు

కవిత్రయ యుగానంతరం పురాణయుగంలో పెక్కు గొప్ప గ్రంథాలను వ్రాసి మెప్పించిన వారు శ్రీనాథుడు. ఆంధ్ర సాహిత్యంలో పదిహేనవ శతాబ్ది ‘శ్రీనాథయుగము’ పేరున ప్రసిద్ధికెక్కింది.

శృంగారనైషధము, భీమఖండము, కాశీఖండము, హరవిలాసము శ్రీనాథుని ప్రసిద్ధమైన రచనలు. వీరు వ్రాసిన మరుత్తరాట్చరిత్రము, శాలివాహన సప్తశతి అలభ్యాలు. క్రీడాభిరామము, పల్నాటి వీరచరిత్రము రచనలు పూర్తిగా శ్రీనాథుని రచనలు కావని, వాటి రచనలో శ్రీనాథుడి చేయి కొంతవరకు ఉండివుండవచ్చునని పండితులు అంటారు.

అనేక సంస్కృత గ్రంథాలనుంచి వస్తువును గ్రహించి ఒక చోట చేర్చి వ్రాసిన కావ్యం హరవిలాసం. ఇది కొంత అనువాదం, కొంత స్వతంత్ర రచన. అనువాదాన్ని, స్వతంత్రరచనను కలిపి ఒక రచనగా చేసే పద్ధతికి శ్రీనాథుడే ఆద్యుడు.

హరవిలాసములోని ఈ క్రింది పద్యాన్ని చూద్దాం.

చ.
జలధరమంతయై, కరటి చందము గైకొని, సూకరాకృతిన్
నిలిచి, పికంబుతో దొరసి, నేరెడుపండును బోలె నుండయై
కలశపయోధిమంథనముఖంబున బుట్టిన యమ్మహా హలా–
హలము క్రమంబునన్ శివుని హస్త సరోరుహ మెక్కె వింతగన్

(హరవిలాసము 6వ ఆశ్వాసం -69)

క్షీరసాగరమధనంలో జనించిన ఘోరవిషాన్ని స్వీకరించడానికి శివుడు సిద్ధపడ్డాడు. కాలకూటవిషం తొలుత నల్లటి మేఘంలాగా కనిపించింది. తర్వాత ఏనుగువలె కనిపించింది. పిదప వరాహమువలె అగుపించింది. పిమ్మట కోకిల లాగా, ఆపైన నేరేడుపండులాగా గుండ్రముగా మారి శివుని హస్తకమలములను చేరి ఉండిపోయింది. (చివరి పాదంలో, “వింతగన్”కి బదులుగా “జక్కగన్”, “జుక్కగన్” అనే పాఠాంతరాలు వావిళ్ళవారు 1916, 1931లలో వేసిన హరవిలాసపు ముద్రణల్లో ఉన్నాయి; “చుక్కగన్” అన్న పాఠాంతరం స్వీకరిస్తే చివరకు హలాహలం చిన్న మచ్చగా ఉండిపోయిందనే అర్థం వస్తుంది.)

పరమేశ్వరుని ఆకృతి అంతకంతకూ పెరుగుతున్నట్లు సూటిగా చెప్పకుండా, ఆ కాలకూటవిషము కొద్దికొద్దిగా చిన్నదౌతున్నట్లు శ్రీనాథుడు దృశ్యీకరించారు.

హరవిలాసము గ్రంథరచన బహుశా పోతనగారి భాగవత రచనకన్న ముందుగా జరిగి ఉండవచ్చును. చారిత్రకులు శ్రీనాథుడు పోతనకన్నా వయసులో పెద్దవాడని నిర్ణయించారు కనుక ఈ ఊహ!
ఈ పద్యంలో చెప్పిన పోలికలన్నీ – మేఘము, ఏనుగు, వరాహము, కోకిల, నేరేడుపండు అన్నీ నలుపు రంగువే. కాలకూట విషము కూడా నల్లనిదే! శివుడు ఎర్రగా ఉంటాడని అంటారు.

మరో విశేషం – భాగవతంలోని, వామన చరిత్ర ఘట్టంలో ‘రవిబింబంబుపమింప…’ పద్యంలో వామనమూర్తి క్రమక్రమంగా పెరగడాన్ని సూర్యుడి పరిమాణం క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు చూపిస్తారు పోతన గారు. బహుశా పోతనగారు ‘జలధరమంతయై…’ పద్యంతో ప్రేరణ పొంది ఉండవచ్చునేమో!

చరిత్రకారుల పరిశోధన ప్రకారం అన్నమయ్య పోతన కంటే వయసులో కాస్త పెద్దవాడైనప్పటికి, ఈ ఇద్దరు కవులు ఒకే కాలంలో జీవించి రచనలు చేసారు.

ఆసక్తి కలిగించే కథలతో కథనాలతో అలరారేవి కావ్యాలు. ఒక సన్నివేశానికో, సందర్భానికో, భావనకో పరిమితమయ్యేవి పద కవితలు.

ఛందోబద్ధమైన పద్యాలలో, అలంకారభూషితమైన సంస్కృతాన్ని తెలుగుతో సంయోజించి వ్రాసినదే సాహిత్యమని ఆనాటి ప్రధాన స్రవంతిలోని కవులు, పండితులు భావిస్తున్న కాలంలో పదసాహిత్యానికి కావ్య గౌరవం కల్పించిన వారు తాళ్ళపాక అన్నమాచార్యులు. అయితే అన్నమయ్య సంకీర్తనలను విన్నట్టు ఎక్కడా ఏ కవీ చెప్పలేదు. పోతన సమకాలికుడే అనుకున్నా, అతను అన్నమయ్యను ఎరిగినట్టు ఎక్కడా లేదు. ఆ తర్వాత వచ్చిన రాయలు సంకీర్తనను ఆముక్తమాల్యదలో మాలదాసరి కథలో కల్పించినా, దానికి ఆద్యుడైన అన్నమయ్య ప్రస్తావన తీసుకురాలేదు. దీనికి కారణం, అన్నమయ్యను వారు ఎరగకపోవడమా లేక పదకవితను ఉత్తమ సాహిత్యప్రక్రియగా భావించకపోవడమా అన్నది చర్చనీయాంశం.

కావ్యం ఒక కథను ఆవిష్కరిస్తుంది. అందుకే కావ్యకవులకు చాలా పెద్ద కాన్వాస్ ఉంటుంది. చెప్పదలచున్న కథను చాలా ఓపిగ్గా నింపాదిగా చెప్పే వీలుంటుంది. ఒక సన్నివేశానికో, సందర్భానికో, భావనకో పరిమితమయ్యేవి పదకవితలు. పదసాహిత్యంలో పెద్ద కాన్వాస్ ఉండదు. పద్యకవుల కావ్యాలు రెండున్నర గంటల సినిమా అనుకుంటే, పద కవుల సంకీర్తనలు, కీర్తనలు, పదాలు లఘు చలనచిత్రాల లాంటివి.
అన్నమయ్య శృంగారసంకీర్తనలలోని ఈ క్రింది లఘు చలనచిత్రాన్ని చూద్దాం.

అలరులు గురియఁగ నాడెనదే
అలకలఁ గులుకుల నలమేల్మంగ ॥ పల్లవి ॥

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరఁగున నాడెనదే
వరుస పూర్వదువాళపు తిరుపుల
హరిఁ గరఁగింపుచు నలమేల్మంగ ॥ అలరులు ॥

మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాఁటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్మంగ ॥ అలరులు ॥

చిందుల పాటల శిరి పొలయాటల
అందెల మ్రోతల నాడెనదే
కందువ తిరువేంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేల్మంగ ॥ అలరులు ॥

(అన్నమాచార్య శృంగార సంకీర్తనలు, సంపుటం 5- సంకీర్తన 24)

అలిమేలు మంగాదేవి దివ్య నృత్యాన్ని కళ్ళ ముందు నిలిపే అన్నమయ్య సంకీర్తన ఇది.
అలిమేలుమంగ ముంగురులు అందంగా కదలాడుతున్నాయి. జడలోని పువ్వులు జలజలా రాలుతున్నాయి. నర్తిస్తున్న అలిమేలుమంగకు అడ్డంగా చెలికత్తెలు ఒక తెర పట్టడంతో, ఆమె రూపం సగం మాత్రమే కనిపిస్తోంది. కనిపించకుండా అడ్డుగా ఉన్న తెర వెనుకన అమ్మవారు లయాత్మకంగా నృత్యం చేస్తూ, సగం విరిసిన అందాల పూబాలలా కనిపిస్తోంది. ఆమె పాదాల కదలికలు హంస నడకల్లా ఉన్నాయి. ఆమె కాలిమట్టెలు తాళగతులకు తగ్గట్లు చప్పుడు చేస్తున్నాయి. సంగీతానికి అనుగుణంగా కదులుతున్న ఆమె పాద చలనాలు హంస నడకల్లా ఉన్నాయి. ఆమె నృత్యంలోని కదలికలు నాట్యాన్ని తిలకిస్తున్న తిరుమలనాథుడిని కరిగించాయి.

ఈ సంకీర్తనలో ప్రతి చిన్న విషయాన్ని చాలా వివరంగా అంటే కదిలే ముంగురులు, జడలోంచి జాలు వారే పువ్వులు, లయాత్మకంగా కదిలే పాదాలు, చప్పుడు చేసే మట్టెలు…ఇలా అన్నమయ్య అమ్మవారి నృత్యాన్ని చాలా దివ్యంగా చిత్రీకరించారు.

ఒక అందమైన దృశ్యాన్ని అత్యంత మనోహరంగా చూపించిన సంకీర్తన ఇది. ఇలాంటి దృశ్యీకరణలు ఎన్నెన్నో అన్నమయ్య సంకీర్తనల్లో మనం చూడవచ్చు.

4.2 ప్రబంధయుగంలోని కవి నంది తిమ్మన కవిత్వంనుంచి ఒక ఉదాహరణ

ప్రబంధయుగంలో సాహితీసమరాంగణ సార్వభౌముడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలని పిలవబడే కవులుండేవారని, వారిలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన మొదలైనవారు కొందరని ప్రతీతి.

‘అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు’ అన్న పద్యం తెలుగు వారిలో బహు ప్రసిద్ధం. నంది తిమ్మన గారిని ముక్కు తిమ్మన అని కూడ పిలిచేవారని నానుడి.

నంది తిమ్మన గారి ఏకైక రచన పారిజాతాపహరణం.

సత్యభామ కోరికను తీర్చేందుకు శ్రీకృష్ణుడు సత్యభామాసమేతంగా స్వర్గానికి వెళ్ళి, పారిజాత వృక్షాన్ని ద్వారకకు తెచ్చి సత్యభామ పెరటిలోని ఉద్యానవనంలో ఉంచడం, తరువాత సత్యభామ పుణ్యకవ్రతాన్ని నిర్వహించి నారదుడికి సమస్తైశ్వర్యాలతోబాటు శ్రీకృష్ణుడిని దానం చేసి తిరిగిపుచ్చుకోవడం పారిజాతాపహరణం లోని ప్రధాన కథ.

ఈ కావ్య రచనలో నంది తిమ్మన ఎన్నో అద్భుత దృశ్యాలను, మానవ ప్రవృత్తులను, రుక్మిణీ, సత్యభామల ఆభిజాత్యంలోని అంతరాలను, సత్యభామ లోని ప్రేమ, అతిశయం, అహంకారం, శ్రీకృష్ణుని అనురాగం తనకు మాత్రమే పరిమితం కావాలన్న ఆకాంక్ష మొదలైన అంశాలను అద్భుతంగా దృశ్యీకరించారు.

ఒకరోజు నారదమహర్షి స్వర్గలోకంనుండి ఉన్నపళాన శ్రీకృష్ణుని దర్శనానికి ద్వారకకు వచ్చాడు. ఊరికే రాలేదు. వస్తూ పారిజాత పుష్పాన్ని కూడ తీసుకు వచ్చాడు. కృష్ణుని చెంత రుక్మిణీదేవి ఉన్నప్పుడు, ఆ పుష్పాన్ని కృష్ణునికి ఇచ్చి, నీకు అత్యంత ‘ప్రేమాస్పద’ అయిన భార్యకు ఈ పూవునిమ్మని చెప్పాడు.

శ్రీకృష్ణుడు ఆ పూవును ప్రక్కనే ఉన్న రుక్మిణికి ఇచ్చాడు. ఇస్తూ ఈ విషయం సత్యభామకు తెలిస్తే ఎంత రచ్చ చేస్తుందో అనుకున్నాడు. నారదుడు వెంటనే ఈ పుష్పం రుక్మిణి కొప్పులోకి చేరడం వల్ల అష్టమహిషులలో రుక్మిణి ఇష్టమహిషిగా నిలుస్తుందని, సత్యభామ గర్వం అణుగుతుందనీ అన్నాడు.

ఇక్కడ జరిగిన విషయాన్నంతటినీ తన చెలికత్తె ద్వారా విన్నది సత్యభామ. ‘వినగానే ఆమెకు విపరీతమైన కోపము కలిగింది’ అని చెప్పడానికి ఒక కవి, అందులోనూ నంది తిమ్మన లాంటి ప్రబంధకవి అవసరంలేదు.

కవి ఒక స్థితిని, సన్నివేశాన్ని, కథలోని పాత్రలను, కథను కవిత్వీకరిస్తాడు. అనువైన భాషను, అలంకారాలను ఉపయోగించి పాఠకులను కథలో మమేకం చెయ్యడానికి ప్రయత్నిస్తాడు.
చెలికత్తె మాటలు విన్న సత్యభామ ప్రతిస్పందనను ఈ క్రింది పద్యంలో అద్భుతంగా చిత్రీకరించారు.

చ.
అన విని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె నేయి వోయ భ–
గ్గన దరికొన్న భీషణ హుతాశనకీల యనంగ లేచి హె–
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమపత్రభంగ సం–
జనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద ఖిన్నకంఠియై.

(పారిజాతాపహరణం 1 – 82)

దెబ్బతిన్న ఆడు పామువలె, నేయి పోయగా భగ్గుమని పైకి లేచిన భీషణాగ్నికీలయా అన్నట్లు లేచి, కోపంతో పెద్దవైన కళ్ళలోని ఎరుపు, తన చెక్కిళ్ళకు అద్దుకున్న కుంకుమరాగచ్ఛాయతో కలిసి, క్రొత్త కాంతి వెదజల్లగా, దుఃఖంతో పూడిన గొంతుదై…

ఈ పద్యంలో ఒక విశేషం – కోపం, క్రోధం, ఆ అర్థాలనిచ్చే పర్యాయపదాలను వాడకుండా అగ్గిలా మండుతున్న సత్యభామ క్రోధాన్ని చూపించడం!

సత్యభామలోని సహజమైన ఆభిజాత్యము, నారదుని మాటలతో దెబ్బతింది. ఆమెలో కోపాన్ని, ఉక్రోషాన్ని, బాధను ఒకే పద్యంలో దర్శింపజేసారు నంది తిమ్మన.

4.3 దక్షిణాంధ్ర యుగంలోని చేమకూర వెంకటకవి కవిత్వం నుంచి ఒక పద్యం

ప్రబంధయుగం తర్వాత దక్షిణాంధ్ర సాహిత్య యుగంలోని కవి చేమకూర వెంకటకవి.
“ఆశ్చర్యకరమైన, అద్భుతమైన చమత్కారాలతో కళ్ళు మిరుమిట్లుగొలిపే” శైలిలో కవిత్వం చెప్పిన కవిగా చేమకూర వెంకటకవిని ప్రముఖ సాహిత్యవేత్త బేతవోలు రామబ్రహ్మంగారు ప్రశంసించారు.

చేమకూర వెంకటకవి కావ్యాలలో విజయవిలాసం ఎన్నదగింది. ఆంధ్ర పంచ మహా కావ్యాల కోవలో చేరవలసిన గ్రంథరాజం “విజయ విలాసము” అని తిరుపతి వేంకట కవులు అభిప్రాయపడ్డారు.
ఉలూచి, అర్జునుల సరస శృంగార సన్నివేశంలో వచ్చే ఈ క్రింది దృశ్యీకరణను చూద్దాం.

ఉ.
శయ్యకుఁ దార్పఁగాఁ దుఱుముజాఱెఁ దనంతటఁ జక్కదిద్దఁబోఁ
బయ్యెద జాఱె; నయ్యదిరిపాటునఁ గ్రక్కున నీవి జాఱె; రా–
జయ్యెడ నవ్విలాసిని యొయారముఁ జూచి కవుంగిలించె; నౌ,
నెయ్యెడ మేలె చూతురు, గ్రహింపరు జాణలు జాఱుపాటులన్‌

(విజయవిలాసము, అధ్యాయం 1, పద్యం 172)

మంచం దగ్గరకు తీసుకువస్తుండగా కొప్పుజారిపోయింది. కొప్పులోని కురులను చక్కదిద్దుకోబోతే పవిట కొంగు జారింది. ఇదేమిటిలా అంటూ తొట్రుపాటు పడుతుంటే చీరె జారిపోయింది. అర్జునుడు ఉలూచి వయ్యారాలను చూచి కౌగలించుకున్నాడు. గొప్పవాళ్ళెప్పుడూ అన్నిట్లోనూ శ్రేష్టమైన వాటినే చూస్తారు. రసికులు జారిపోయేవాటిని పట్టించుకోరు అని భావం.

అందమైన ఉలూచిని మంచం దగ్గరకు చేరదీస్తున్నప్పుడు ఒకింత బిడియంతో కూడిన తొట్రుపాటుకు అవకాశం వుందన్న ఊహను పాఠకులకు విడిచిపెట్టారు. అలా తొట్రుపాటు కలిగినప్పుడు కొప్పు విడిపోయింది. విడివడిన కొప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడు పైట జారింది. ఆపైన పైటను జాగ్రత్తగా పట్టుకోబోతే చీర జారిపోయింది. ఇక్కడ చూపించిన దృశ్యాన్ని సినిమాలోని సన్నివేశంగా ఊహించుకుంటే – మూడునాలుగు చిన్న దృశ్యశకలాలుగా కనిపిస్తాయి. దృశ్యశకలాలను గుదిగుచ్చితే సన్నివేశం మన కళ్ళముందు కదలాడుతుంది.

ఈ పద్యాన్ని సాహిత్యానికి కూడా అన్వయించవచ్చు. ‘కావ్యాలలో ఉండే వ్యాకరణ విరుద్ధాలవంటి స్వల్పలోపాలను గణించక, రసభావాది సుగుణాలనే ఎంచాలని పండిత విమర్శకులకు మనవి చేశాడు ’ అని హృదయోల్లాసవ్యాఖ్యలో తాపీధర్మారావుగారు వ్యాఖ్యానించారు.

4.4 పద్దెనిమిదవ శతాబ్ది కవి కంకటి పాపరాజు గారి పద్యం

పద్దెనిమిదవ శతాబ్దికి చెందిన కవి కంకటి పాపరాజు. వీరు విష్ణుమాయా విలాసం అనే యక్షగానాన్ని, ఉత్తర రామాయణం కావ్యాన్ని రచించి కవిగా ప్రసిద్ధికెక్కారు.

శ్రీరాముని అనుజ్ఞ మేరకు లక్ష్మణుడు గర్భవతిగా వున్న సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదలి, అయోధ్యకు బయల్దేరుతున్న సందర్భం.

మా అన్న రాముడు నిన్నిక్కడ వదలి రమ్మన్నాడని సీతకు చెప్పాడు. దిగ్భ్రాంతిలో సీతాదేవి అలా నిలుచుండి పోయింది. లక్ష్మణుడు రథమెక్కి బయల్దేరాడు. సీత దృష్టికోణంలోంచి, పరుగులు పెడుతున్న లక్ష్మణుడి రథాన్ని దృశ్యీకరించిన సన్నివేశమిది.

తే.
రమణి మఱికొంత వడిదాక రథము జూచు
దరుణి మఱికొంతసేపు కేతనము జూచు
గాంత మఱిమీద రథపరాగంబు జూచు
బడతి మఱియంతటను వట్టిబయలు సూచు

(ఉత్తర రామచరిత్రము, 6-300)

దిగ్భ్రాంతికి లోనైన సీతాదేవి లక్ష్మణుడు ఎక్కి వెడుతున్న రథాన్ని కన్నార్పకుండా కొంతసేపు చూసింది. రథం కాస్త దూరమైంది. అప్పుడామె రథం పైన ఎగురుతున్న జెండాను మాత్రమే చూడగలిగింది. అంటే జెండా మాత్రమే కనిపిస్తోంది. రథం వేగాన్నందుకుంది. మరికాస్త దూరంగా దుమ్ము రేపుకుంటూ వెళ్ళింది. సీతాదేవికి దుమ్ము మాత్రమే కనిపిస్తోంది. మరికొద్ది సేపటికి రథం కనిపించనంత దూరం సాగిపోయింది. ఒంటరిగా నిలుచుని ఉన్న సీతాదేవి ఎదురుగా కనిపిస్తున్న బయలును చూస్తూ ఉండిపోయింది!

సీతాదేవి ఊహించని సందర్భం. ఆమె ఊహించని సంఘటన. ఒక దిగ్భ్రమావస్థ. ఆమె చూస్తూనే వుండిపోయిన చూపులో – కనిపిస్తూ కనుమరుగైపోయిన భవిష్యత్తూ, క్రమక్రమంగా మాయమైపోయిన ఆశ, కడకు ఒక భయంకరమైన వాస్తవం బయలుగా కళ్ళెదుట మిగలడం – ఇవన్నీ ఈ చిన్న పద్యంలో సమర్థంగా చూపించారు పాపరాజు.

4.5 ఇరవయ్యవ శతాబ్దపు కవుల కవిత్వం నుంచి ఉదాహరణలు

ఇరవయ్యవ శతాబ్దంలో తెలుగు ప్రాంతంలో అత్యంత గుర్తింపు పొందిన పద్య కవులలో ఒకరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. తెలుగు పద్యాన్ని సరళంగా, అందంగా, శ్రవణసుభగంగా నడిపించిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణ రస ప్రధానంగా కవిత్వం వ్రాసి ‘కరుణశ్రీ’గా ప్రసిద్ధులైనారు.
పుష్పవిలాపము, కుంతి కుమారి ఖండికలు వీరు రచించిన ఖండికలలో ప్రసిద్ధమైనవి. కరుణశ్రీ గారి కవితాత్రయంగా పేర్కొనే ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ గ్రంథాలు అత్యధిక ముద్రణలు పొందాయి.

కరుణశ్రీగారి కవిత్వం ప్రధానంగా పద్యకవిత్వమైనా, కొన్ని పద్యాలు వచన కవితల్లా అనిపిస్తాయి. సమాజధోరణి ననుసరించి సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో, సులభ శైలిలో పద్యాన్ని నడిపించడం, భావాన్ని సూటిగా పాఠకులకందివ్వడం, సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపడం వీరి కవిత్వంలో కనిపించే ప్రత్యేకతలు.

మచ్చుకు ‘కుంతికుమారి’లోని ఒక పద్యాన్ని చూద్దాం. దుర్వాసముని ఇచ్చిన వరాన్ని మననం చేసుకుంటున్న కుంతికి, సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఒక అయాచిత వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వర ప్రభావంతో కుంతికి పుత్ర యోగం కలిగింది. వివాహం కాని తనకు కలిగిన పుత్రుని చూసి లోకం ఏమనుకుంటుందో అని భయపడ్డ కుంతి, పసికందును ఎక్కడైనా వదిలేయాలన్న ఆలోచనతో ఇంట్లోంచి బయటకు వచ్చే సందర్భాన్ని కరుణశ్రీ ఇలా చూపించాడు.

చ.
అది రమణీయ పుష్పవన, మా వనమం దొక మేడ, మేడపై
నది యొక మాఱుమూలగది, ఆ గదితల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక, పోలిక రాచపిల్ల, జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్!

(జంధ్యాల పాపయ్య శాస్త్రి, కుంతి కుమారి)

నాలుగు సమ పాదాలుగా వ్రాయకపోతే ఇది వచనమన్నట్లు ఉంది ఈ చంపకమాల పద్యం.
అందమైన పూలవనం. అందులో ఒక మేడ. ఆ మేడ మీద దూరంగా, ఒక మూలన ఉన్న గది. ఆ గది తలుపులు మెల్లగా తెరచుకుని ఒక పదిహేనేళ్ళ రాకుమారి పోలికలున్న బాలిక, కాళ్ళు తడబడుతుండగా మేడ మెట్లు దిగుతోంది.

ఏ ఒక్క కఠిన పదమూ లేదు. అన్నీ వాడుకలోని పదాలే. చూపిస్తున్న పూలవనం, మేడ, గది మొదలైనవన్నీ తెలిసినవే. బాలిక వయస్సు, పోలికలు, మానసిక స్థితిని చెప్పేశారు. పాఠకుల మనోనేత్రం ముందు కుంతి కుమారిని సాక్షాత్కరింప చేసారు, ఆమె నివసిస్తున్న ప్రాంతంతో సహా!

ఈ పద్యం చదువుతూంటే పోతన గారి ‘అల వైకుంఠపురంబులో…’ పద్యం గుర్తొస్తుంది. రెండు పద్యాలకు దృశ్యీకరణలో సామ్యాలు కనిపిస్తున్నా, భాషాలంకారాల విషయానికొస్తే భిన్నమైనవి.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆధునిక కవిత్వయుగంలో, పద్య కావ్యాలను వ్రాసి పాఠకులను మెప్పించిన సాహితీవేత్త. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన కవి. వీరు అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసి మెప్పించారు. రామాయణ కల్పవృక్షం పద్యకావ్యంతోబాటు మరెన్నో కావ్యాలు, వేయిపడగలు నవలతో బాటు మరెన్నో సాంఘిక, చారిత్రక నవలలు, కథలు రచించారు. రాసిలోనే కాకుండా వాసిలోనూ ఉత్తమశ్రేణి కవి, రచయిత.

వీరి పద్యకావ్యాలన్నింటిలోనూ ఎన్నో దృశ్యీకరణాంశాలు కనిపించినా, దృశ్యీకరణకు ఉదాహరణగా రామాయణ కల్పవృక్షంలోని, అయోధ్య కాండము, అహల్య ఖండములోని 27, 28 పద్యాలను పరిశీలిద్దాం.

రామ, లక్ష్మణులు వశిష్ఠమహర్షి దగ్గర శాస్త్ర, శస్త్ర, అస్త్ర విద్యలు నేర్చుకుంటున్న సమయంలో, ఒకానొకరోజు విశ్వామిత్రమహర్షి అయోధ్యకు వచ్చాడు. దశరథుడు మహర్షిని సాదరంగా ఆహ్వానించాడు. ఉచితోపచారాలు చేసి, రామచంద్రుని పిలిపించాడు. రాముని వెంట లక్ష్మణుడు వచ్చాడు. దశరథుడు విశ్వామిత్రుని పరిచయం చేసి, ఆయన గొప్పదనాన్ని రామునికి చెప్పి, విశ్వామిత్రుని పాదాలకు నమస్కరించమన్నాడు.

రామచంద్రుడు తన పాదాలను అంటినప్పుడు గాధేయుని పులకింత, ఆయన మనసులో పొందిన ఆనందం కన్నులలో వర్తించిన వైనాన్ని మహాద్భుతంగా దృశ్యమానం చేసారు విశ్వనాథ సత్యనారాయణగారు ఈ క్రింది పద్యాలలో.

క.
రాముడు నమస్కరించుచు
నా మునిపాదములు తాకి నంతటన తనూ
రోమాంధువు లానంద
శ్రీమత్పులకాంబుభంగి ధృతి ముని పొంగెన్.

(రామాయణ కల్పవృక్షం, అయోధ్య కాండము, అహల్య ఖండము 27)

సీ.
గాధేయు చూపులు కమలపత్రాభి రా
మములైన రాము నేత్రముల గలియు;
గాధేయు కన్నులు కదలి వశిష్ఠుల
స్తిమిత నేత్రములకు జేరబోవు;
గాధేయు చూపులు కమనీయరామ మే
ఘము మేన శంపాభ కాంతు లొలయు;
గాధేయు కన్నులు కదలి వశిష్ఠ శం
పాలోచనైక్య భావంబు నందు;

తే.
రామచంద్రుని మధుర దర్శనములోన
నిరువురు మునీంద్రులును బ్రహ్మఋషిత గాధి
సుతునకు వశిష్ఠులిచ్చిన శుభసమయము
నందు గన్నను నధిక సౌహార్దు లైరి
(రామాయణ కల్పవృక్షం, అయోధ్య కాండము, అహల్య ఖండము 28)

ఒక సన్నివేశాన్ని, స్వభావాన్ని, స్వరూపాన్ని దృశ్యీకరించడం కన్నా, ఒక పాత్ర మనసులో రేగే భావాలను – అది ఆనందం కావచ్చు, విషాదం కావచ్చు – దృశ్యీకరించడం క్లిష్టమైంది. విశ్వామిత్రుని పాదాలను రాముడు అంటినప్పుడు, మహర్షి మనసులో చెలరేగిన పులకింతను వారి కళ్ళలోనూ, చూపులలోను ప్రతిఫలింపచేసారు. విశ్వామిత్రుని కన్నులను ఒక నిష్ణాతుడైన చలనచిత్ర దర్శకుని మాదిరిగా పాఠకులకు ‘అతి దగ్గర’ గా చూపించారీ పద్యాలలో. ఈ సన్నివేశాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింపజేయడంతో పాటు, పాఠకులు కూడా విశ్వామిత్రుడు పొందిన అనుభూతిని పొందేలా చేసారు విశ్వనాథ గారు.

తెలుగు సాహిత్యావరణంలో తమ కవిత్వంలోని దృశ్యీకరణలతో వెలుగులు దిద్దిన కవులెందరో ఉన్నారు. ఇక్కడ ఉదహరించిన పద్యాలకన్నా మెరుగైన దృశ్యీకరణలు చేసిన ప్రతిభామూర్తులు ఎందరో ఉండి ఉంటారు. అందరినీ ఇక్కడ తలుచుకోలేక పోవడం చాలా వెలితిగా అనిపిస్తోంది.

పోతన సమకాలీన కవులు, ఆ తర్వాత కవులు దృశ్యీకరణానికి ప్రాధాన్యతనివ్వడాన్ని గమనించినప్పుడు బహుశా కావ్యవస్తువులలోను, కావ్యనిర్మాణంలోను వచ్చిన మార్పులు కారణమై ఉండవచ్చుననిపిస్తోంది. సారాన్ని బట్టే కదా రూపం!