నీకెట్ల మొక్కాల్నో
ఇప్పటికీ తెల్వదు నాకు
నీకివ్వగలిగే కానుకొక్కటీ
బర్కతీయదు
వెతికి వెతికి పట్టుకొచ్చే కానుక
నీ ఒక్క కన్నీటి బొట్టులో కొట్టుక పోతది
అమ్మ అని పిలిస్తేనే పొంగి పోతవేందే
కనపడగానే వలవల ఏడుస్తవెందుకే
సక్కదనాల నీ నవ్వు యాదికొస్తే
రెక్కలు కట్టుకొని నీ తాన వాలిపోవాలనిపిస్తది
నీ లెక్క గలగల ఎవరు నవ్వుతున్నరే ఈ రోజుల్ల
గుళ్లె మొక్కుతున్నా నాకు నీ గజ్జెలకాళ్లే కండ్లల్ల
ఎన్ని ముచ్చట్లు చెపుతవే
నేను రొట్టెలొత్తుతుంటే నువ్వు కాల్చుకుంట
నేను రోటి మసాల నూరుతుంటే
నువు కూర ఎసరు సూస్కుంట
నేను సకినాలు సుడుతుంటే
నువ్వు వాయి మార్చుకుంట
కలిసి రవ్వలడ్లు సుట్టుకుంట
పచ్చడి కాయలు కొట్టుకుంట
పల్లికాయలొలుసుకుంటా
పక్కబట్టలు సర్దుకుంట
ఇప్పటికీ అంతే గంటసేపు మాట్లాడి
యింక పోతనే అంటే అలుగుతవ్
మాటలమాటల్నే పనులన్నీ నేర్పేదానివి
కథల తీపితోనే బతుకు నీతి చెప్పేదానివి
నోరు మంచిదైతే ఊరు మంచిదనుకుంట
ఎన్ని బుద్ధులు ఎన్ని సుద్దులు ఎన్ని సామెతలు
బతుకమ్మ పండుగస్తే నీ పాటలకే గిరాకీ
సత్తెనారాయణ పూజైతే నీదే కదా హారతీ
ఎన్ని మాటలు ఎన్ని తన్నులు ఎన్ని కన్నీళ్ళు పడ్డవ్
మమల్ని బతికించుకోడానికే కదనే నువు బతికినవ్
ఇంకెవ్వరైనా అయితే ఇల్లొదిలి పోయేటోళ్లు
నట్టేట్ల ముంచెటోళ్లు పదిసార్లైనా సచ్చెటోళ్లు
పోయిన జన్మలో నీ అమ్మనైనందుకు
ఋణం తీర్చుకుంటున్నావో
మల్లొచ్చే జన్మలో నీకు అమ్మనై
ఋణం తీర్చుకోవాల్నో
నీ ప్రేమకు యీ లోకంలోనే కాదు
ఏ లోకంలోనా సాటి రాదు
నీ పాదాల మీద పడి చెపుతున్నా
నా బంగారు తల్లివి కదనే నువ్వు!
వచ్చేది ఏ జన్మయినా
అమ్మవు మాత్రం నువ్వే నాకు!
