Tree Toons

‘మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి?’ అని మిత్రులు, పాఠకులు అడిగితే నవ్వి ఉరుకోవటం, లేదా ఒక మొహమాటపు నవ్వు నవ్వి ‘అందుకే నేను కార్టూనిస్ట్’నని అని తప్పించుకోవటం పరిపాటే. నిజానికి ఇలాంటి ప్రశ్నలకి జవాబులు ఇవ్వటం కష్టమే. ఐడియాలు ఎప్పుడు, ఎలా బుర్రకి తడతాయో చెప్పటం నాకు కష్టమే. అందులోని పాత్రలు, పాత్రధారులు సూత్రధారి అయిన నా ఆధీనంలో ఉండవు.

నిజానికి పొలిటికల్ కార్టూన్స్ వెయ్యటం అంత కష్టమేమీ కాదు. (నేను మాట్లాడుతున్నది చెయ్యి తిరిగిన కార్టూనిస్ట్‌ల గురించి.) అక్కడ అన్నీ సిద్ధంగా ఉంటాయి. మనుషులు, మాటలు, ఏమి గీయాలి అన్నీ. ఎటొచ్చీ ఎలా గీయాలి అనేదే సమస్య. వాళ్ళ వాళ్ళ మానసిక స్తోమతని బట్టి వాటి నాణ్యత ఉంటుంది. ఒక మధ్యాహ్నం ఐడియా కోసం జుట్టు పీక్కుంటున్నప్పుడు పొలిటికల్ కార్టూన్‌కి సంబంధం లేని ఏదో ఐడియా వచ్చింది. సరదాగా ఇది బాగుందే అనుకుని చేతికి దొరికిన న్యూస్ ప్రింట్ కాగితం మీద గబా గబా గీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. అంతే! నాలుగయిదు నిమిషాల్లో టపటపా లైకులు, కామెంట్లు వచ్చాయి. అదే ఊపులో ప్రతి రోజూ ‘A cartoon a day’ శీర్షికన యాభయ్ కార్టూన్లు వెయ్యటం జరిగింది. నాన్ పొలిటికల్ ఐడియాలు ఇబ్బడిముబ్బడిగా బుర్రని తాకుతాయి. సవాలక్ష సందర్భాలు – లక్ష ఆలోచనలు బుర్రకి తగిలి ‘వంకరబోయి’ నేల మీద రాలిపోతాయి. ఇంకా కొన్ని చాలా విచిత్రంగా గాల్లో ఎగురుకుంటూ నేరుగా బుర్రలోకి చేరతాయి. వీటి ఉనికి ఎందుకు ఎలా ఎప్పుడు నా తలలోకి వచ్చిందో ఎప్పటికీ తేలదు.

ఉదాహరణకి మా నాయన రామకృష్ణ తను రాసిన పెన్నేటి కతలకి ముందుమాట రాస్తూ ‘ఈ కతలు దాదాపు యాభయ్ ఏళ్ళ తరవాత కూడా స్పష్టంగా ఎలా గుర్తు ఉన్నాయో నాకు తెలియదు. పెన్ను పెట్టిన వెంటనే అవన్నీ గలగలా ఏ శ్రమ పెట్టకుండా బయటకి వచ్చాయి. పెన్నేటి కతల్లోని అన్ని సందర్భాలు, మనుషులు సజీవంగా ఉండినవే. ఏవీ పూర్తిగా కల్పితాలు కావు’ అంటారు. నా చెట్ల కార్టూన్లు ఆ కతలంత గొప్పవి అనను కానీ, అవీ ఇవీ పుట్టిన తీరు ఒకటే.

ఇందులోని యాభయ్ ఆరు కార్టూన్లలో రెండే రెండు కార్టూన్ల గురించి చెప్తాను. వర్షం కురుసిన మరుసటి రోజు మా ఊళ్ళో చుట్టుపక్కల, దిబ్బల్లోనూ రెండు బీజదళాలను చీల్చుకుంటూ ఆకాశం కేసి చూస్తూ ఆ పక్కనే ఉన్న చెట్టంత చెట్టుని తెంపరితనంగా ‘Hey dude’ సంబోధించే వేపమొక్క నాకు ఎప్పటికి జ్ఞాపకమే. ఈ కార్టూన్ జీవితానుభవమే కదా.

మరొక ఉదాహరణ… రెండు మహా వృక్షాల్ని కలుపుతూ, చిరిగిన గాలిపటం తాలూకు దారం మీద ఒక వైపు నించి పాకుతున్న ఒక చీమ, మరొక చీమతో ‘ఈ వంతెన ఈ మధ్యనే పడింది’ అనటం ఎన్నో వేల పిల్లల జీవితానుభవమే కదా! ఈ చిన్న చిన్న అనుభవాలు అందరి జీవితంలోనూ ఉండేవే. ఇలా ఈ సంకలనంలోని అన్ని కార్టూన్లలోను నేను జీవితాన్ని చూశాను. దీన్ని బోడిగుండుకీ మోకాలుకీ ముడి పెట్టినట్లు ఎవరైనా భావిస్తే అందులో నా తప్పేమీ లేదు.

స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో క్లిష్టమైన ప్రశ్నలన్నింటికి దేవ్ దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఒక్కొక్క జవాబు వెనుకా ఉన్నవి వాడి జీవితానుభావాలే.

– సురేంద్ర


Tree Toons – Surendra (₹100.00)
Publisher: Penneti Books (Sept 2024)
Available at all leading bookstores.

[పుస్తక పరిచయం: అన్వర్]