కొత్త కథకి మొదటి మాట

రహస్యాలన్నీ
ఒకళ్ళకొకళ్ళు
చెప్పుకున్నాక
దేహం మాత్రమే మిగిలింది

దేహానికి రహస్యాలు లేవు
ఉన్నదంతా ఎగుడు దిగుళ్ళే
మనసే, నిండా ములిగింది
వడగళ్ళ వాన!

ఎవరు పైన ఎవరు కింద?
మెడవంపులోనే మెరుపులు
పెదాలు కాలే వేళ
ముద్దు ఎక్కడ పెట్టాలి?

కొండ ఎక్కేటప్పుడే
దారం జార్చవలసింది
దిగే దారేది?
మబ్బుల్లో నీరేది?

బాణం వదల్లేను
కాదంబరి పూర్తికాదు
వచనానికి
ఏది ఆఖరి వాక్యం?

రాత్రి సద్దు మణగదు
తలుపు చప్పుడవదు
కిటికీలో సూర్యరశ్మి
నువ్వెవరో నేనెవరో!

అంతా ముందుగా
అనుకున్నదే!
వచ్చినప్పుడే
వెళ్ళిపోయేవు

ఆషాఢం వచ్చేదాకా
ఆగడం కుదరదు
మబ్బుల్ని ఇప్పుడే రమ్మను
ఓ కబురు పంపించాలి

అద్దం లేని గదిలో
పుస్తకంలోనే ముఖం చూసుకోవాలా?
ఉత్తరంలో రాయలేని అశక్తత
కొత్త కథకి మొదటి మాట