రజని – లలిత గీతాలు

[బాలాంత్రపు రజనీకాంతరావు జన్మదిన సందర్భంగా మోహన్ మెలొడీస్ వారు నిర్వహించిన పాలగుమ్మి విశ్వనాథం మెమోరియల్ లెక్చర్స్‌లో భాగంగా చేసిన ప్రసంగపు వ్యాసరూపం ఇది, కొన్ని మార్పులతో – ర.]

రజనిగారి గురించి మాట్లాడాలంటే ముందుగా ఏ కోణాన్ని పరిశీలించాలి అనే ప్రశ్న వస్తుంది. ఈ గంట సాగే మాట-పాట కార్యక్రమములో రజనిగారి లలిత గీతాలు అనే ఒక్క పార్శ్వాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో పంచుకుంటాను.

రజని గేయసాహిత్యం స్వర-అక్షరాలతో రసాల మేళవింపు. ఆయన లలిత గీతాలలో భావ గాంభీర్యం, రస మాధుర్యం రెండూ ఉంటాయి. వీటికి తోడు ఆ పాట ప్రదర్శన లేక శ్రోతలను ఆకట్టుకునే విధంగా ఒక నాటకీయత (dramatic element) కనపడుతుంది. అందుకే ఆ పాటలు జనామోదాన్ని పొందాయి.

మరో విషయం మనందరికీ తెలిసిందే. ఆయన వాగ్గేయకారుడు. పాటలో కవిత్వం ముందు వస్తుందో లేక స్వరం, రాగం ముందు తోచి దానికి మాటలు చేకూరుస్తారో – ఇది తేలదు. ఆవంత్స సోమసుందర్‌ దీనిని ‘బ్రహ్మరహస్యం’ అన్నారు. ఆయన మాటలలో ‘పదాల హొయలు సంగీతామృతంలో ఈదులాడుతూ ఉంటాయి. రజని సరస్వతి సమగ్ర స్వరూపానికి ఆధునిక అవతరణ.’

ఈయన కవిత్వం గానం చేస్తున్నప్పుడు వేరే కవులు లేరా? ఉన్నారు. మేరునగ ధీరులున్నారు. భావగీతాల రథసారథి కృష్ణశాస్త్రి ఒక వైపు. ఆయనను రజని తన గురువుగా భావించారు. కృష్ణశాస్త్రి ప్రణయ గీతాలు, ఊహాలోకాల అందాలు ప్రజలను ఆకర్షిస్తూ ఉంటే, మరో వైపు తుఫానులా శ్రీశ్రీ పీడిత, బాధిత వర్గాల గొంతు వినిపిస్తూ ఆంధ్రదేశాన్ని కదం తొక్కించారు. రజని వీరి శైలిలోనూ వచన కవిత్వం రాశారు. ఆ వివరాలు మరొక్క వ్యాసంలో ప్రస్తావిస్తాను. పూష అనే పేరుతో రాసిన కవితలని అబ్బూరి ఛాయాదేవి ఏటికి ఎదురీతగా మన ముందుకు తీసుకువచ్చారు. ఇలా ఈ రెండు ‘ఇజాల’ మధ్యలో, ఏదో ఒక ప్రభావానికి పూర్తిగా లొంగకుండా, రజని తన గొంతు వినిపించారు. దానికి తోడు ఆయన పాటకి ఆయనే వరుస కట్టి పాడడం ఒక విశేషం. అది ఆయన ప్రత్యేకం.

కవిత్వం, వాటి ధోరణులు పక్కన పెడితే ఈ లలిత సంగీతం ఏమిటి? ఎలా వచ్చింది? అనేది ఒక్క నిమిషం పరిశీలిద్దాము. భావ సంగీతం లేక లలిత సంగీతం రాక ముందు ప్రాచుర్యంలో వున్నవి రెండే పద్ధతులు: ఒకటి శాస్త్రీయ సంగీతం. ఇది సభలలో, దేవాలయాలలో పాడేది. రెండవది జానపద సంగీతం. ఇది జనం పాడుకునేది. ఇందులోకి స్త్రీల పాటలు, శ్రామిక వర్గాలు పనులు చేసుకుంటూ పాడే పాటలు, పెళ్ళి పాటలు – ఇవన్నీ చేరాయి. నాటకాలలో, హరికథలలో ఈ రెండు పద్ధతులలోనూ పాడేవారు. స్వాతంత్ర ఉద్యమం ప్రారంభంతో బ్రిటిష్‌వారు తయారు చేసిన క్లర్కులు లేదా ‘క్లెరికల్ క్లాస్’ అని ఒక కొత్త మధ్య తరగతి వర్గం బలంగా తయారు అయ్యింది. ఈ వర్గం అప్పటి దాకా ఉన్న చదువులకు దూరంగా, ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం పెంచుకుంటూ ప్రపంచ సంస్కృతి తలుపులు తీసింది. అంతవరకూ ఏ కులం అలవాట్లు వారికి ఉండేవి. ఈ కొత్త వర్గంవారు బ్రాహ్మణ కులంలో కొన్ని అలవాట్లు, వ్యవసాయ కులాలలోని కొన్ని అలవాట్లు, బ్రిటిష్‌వారివి కొన్ని అలవాట్లు కలబోసి ఒక కొత్త సంస్కృతికి నాంది పలికారు. దీనికి తోడు యూరప్‌లో పెరుగుతున్న జాతీయవాదం మన దేశ యువకులను ఆకర్షించింది. అంతవరకూ లేని మాటలు – భారతమాత, తెలుగు తల్లి వంటివి వ్యాప్తిలోకి వచ్చాయి. మన దేశ సంస్కృతిపై అభిమానం, గర్వం ఒక ప్రాంతానికి పరిమితమవకుండా, దేశమంతా మనదే అనే భావన పెరిగింది. అది మెల్లిగా విశ్వప్రేమగా ఎదిగింది. అందుకే వీరు ఉమర్ ఖయ్యాముని ప్రేమించారు. గ్రీకు కవయిత్రి శాఫోనీ ప్రేమించారు. ఇదే సమయంలో ‘ఏకేశ్వర’ అనే భావనని బ్రహ్మ సమాజం ప్రచారం చేసింది. మరో పక్క వీరేశలింగం పంతులుగారు సాంఘిక దురాచారాలపై కత్తి కట్టారు. స్త్రీ, పురుష సమానత్వం అనే ధోరణి పెంచారు. ఇదీ రజని తన జీవన ప్రస్థానం మొదలు పెట్టేసరికి ఏర్పడిన సామాజిక నేపథ్యం.

రజనిగారు పుట్టింది నిడదవోలు. పెరిగింది, చదివింది అంతా పిఠాపురం. అప్పటి పిఠాపురం ఆయన పైన చాలా గొప్ప ప్రభావం చూపింది. ఇది కూడా మరో వ్యాసంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే పిఠాపురం ఆయనను వదలలేదు. ఆయనలో అలా ఉండిపోయింది. ఆ ఊరిలో ప్రభవిల్లుతున్న సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకం ఆయనను ప్రభావితం చేశాయి. రజని మొదట సంగీతం నేర్చుకుంది మర్ల కృష్ణమూర్తిగారి దగ్గర. కృష్ణమూర్తి వీణ సంగమేశ్వర శాస్త్రిగారి శిష్యుడు.

ఇవి కాక వంగ సంగీతం, వంగ భాష ఆయన మీద చాలా ప్రభావం చూపాయి. వీరి పినతండ్రి సూర్యనారాయణ కలకత్తా వెళ్ళి చదువుకోవడం వల్ల బెంగాలీ పుస్తకాలూ ఇంటికి చేరాయి. మరో పక్క సినిమాలలో కూడా బెంగాల్ నుంచి వచ్చే పాటలు ప్రజాదరణ పొందుతుండేవి. సైగల్, కె.సి. బారువా, సిహెచ్. ఆత్మ, కె.సి. డే పాటలు ఈయనని ఆకర్షించాయి. ఆయన అభిమాన గాయకుడు, దర్శకుడు పంకజ్ మల్లిక్. రజనిగారు ఆయనకి ఏకలవ్య శిష్యుడు. ఈయన 20-25 సంవత్సరాల వయస్సు దాకా రాసిన పాటలలో ఆయన ప్రభావం ప్రస్ఫుటంగా కనపడుతుంది.

రజనిగారికి ఇష్టాలు చాలా ఉన్నాయి. ఆయనకు చరిత్ర ఇష్టం. సంస్కృత, తెలుగు, సాహిత్యం నాటకం ఇష్టం, ఖగోళశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ఇష్టం. సంగీత చరిత్ర అంటే ఇష్టం, అన్నమయ్య అంటే ఇష్టం, కూచిపూడి యక్షగానం అంటే ఇష్టం. ఇష్టమైన ఏ విషయమైనా లోతుల్లోకి వెళ్ళి శోధించడం ఆయన స్వభావం. ఆ జ్ఞానసంపద వల్లనే ఆయన పాట కేవలం ఊహల్లో కాకుండా బిగువుగా, అర్థవంతంగా సాగుతుంది. ఆయన తన పాటలకి రకరకాల థీమ్స్ ఎంచుకున్నారు: 1. ప్రకృతి 2. దేశభక్తి, దేశ నాయకులు 3. సంగీతం పుట్టు పూర్వోత్తరాలు 4. విషయాత్మక సంగీతం. ఇక అన్నమయ్య కీర్తనలు వరుస కట్టడం, కూచిపూడి యక్షగానాలు రచించి వరుస కట్టడం గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితే, అన్ని ప్రక్రియలలోనూ ఆయన ప్రత్యేకత ఏమిటంటే అప్పటిదాకా ప్రచారంలో వున్నదానికి భిన్నంగా నూతన స్వరం వినిపించడం. అలా అని ఆయన సాంప్రదాయ మూలాలు విడిచిపెట్టలేదు. ఆయన సంప్రదాయానికి నవ్యతను అద్ది పెట్టారు. దానికి కొత్త సొబగులు తెచ్చారు.


రజని పాటలలోకి వద్దాము. రజని తన విద్యార్థి దశలోనే చండీదాస్ అనే సంగీత నాటకం మొదలు పెట్టారు. చండీదాస్ వంగదేశ కవి. వైష్ణవ సంప్రదాయ ‘కీర్తన్’ అనే పద్దతిలో ఆయన తన పాట వినిపించారు. జయదేవుడి తర్వాత వంగ దేశంలో అంతగా ప్రాచుర్యం పొందిన కవి. చండీదాస్ ఒక రజక యువతి రామినిని ప్రేమించారు. దీనితో అర్చక వర్గం, సమాజం ఆయనను వెలివేశాయి. కానీ ఆయన రాధాకృష్ణుల ప్రణయలీలలను ప్రకృతి పురుషుల ప్రణయలీలలుగా భక్తి గేయాలు రచించి ప్రజల హృదయాలను ఆకర్షించారు. ఆయన సహజయాన్ అనే ఒక కొత్త పంథాను స్థాపించి మార్గదర్శకుడయ్యారు.

చండీదాస్‌ వ్రాస్తున్న సమయంలో రజని విద్యార్థి సంఘ సాంస్కృతిక విభాగానికి నాయకుడు. ఒకసారి వారి యూనివర్సిటీకి తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారిని ఆహ్వానించారు. మాటల సందర్భంలో రజని చండీదాస్ వ్రాస్తున్నారని తెలిసి తాను కూడా చండీదాసు ప్రణయ కావ్యం సహజయాన పంథి అనే పేరుతో నాటకాన్ని వ్రాస్తున్నానని వెల్లడించారు. ఇది జరిగింది 1938లో. 1941 ఫిబ్రవరి 15న శివశంకర శాస్త్రిగారి నాటకం మద్రాసు గోఖలే హాల్‌లో ప్రదర్శించారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 21న రజని చండీదాస్ మద్రాసు ఆల్ ఇండియా రేడియో కేంద్రం నుండి ప్రసారం అయ్యింది. 1942లో ఈ రెండూ ‘ప్రతిభ’ సాహిత్య పత్రికలో ఒకే సంచికలో అచ్చయ్యాయి.

ఎవరు విన్నారెవరు

ఈ నాటికలో ఒక పాట ఉంది. ఎవరు విన్నారెవరు కన్నారు అని మొదలయ్యే పాటలో వాక్యాలు గమనిస్తే ‘తమ సమాగమింకా ముగిసేనో/ తనువొరసి ఉసురులే ఎగిసెనో’ అన్న పాదాలు వస్తాయి. ఈ సాహిత్యంలో వాచ్యార్థాల కంటే అనుభవాల పొందిక అయిన విశేషార్థాలే మన మనస్సుని ఆకట్టుకుంటాయని ఆవంత్స సోమసుందర్ అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా వంగ సంప్రదాయ కీర్తన. ఇది రాసిన పది ఏళ్ళ తరువాత, అంటే 1948 ప్రాంతంలో పంకజ్ మల్లిక్ మద్రాసు కేంద్రానికి ‘భారత్ కె సంత్ కవియాన్’ అనే ఒక ప్రోగ్రామ్ చెయ్యడానికి వచ్చారు. రజని ఈ పాట ఆయనకు వినిపించారు. తెలుగుతనం ఏ మాత్రం చెడకుండా వంగ సంప్రదాయాన్ని పాటించినందుకు ఆయన మెచ్చుకున్నారు. మరో విశేషం ఈ నాటకంలో పాటకి పాటకి, రంగానికి రంగానికి మధ్యలో వచ్చే సంగీత సేతువులు (interludes) నిర్వహించింది ఎస్. రాజేశ్వరరావుగారు. అందుకే ఈ నాటకం ప్రసారమయ్యినప్పుడు సంగీతం రజని, దర్శకత్వం ఎస్. రాజేశ్వరరావు అని అనౌన్స్ చేశారట. అది వారి స్నేహబలం.

మన ప్రేమ ఓ మలయ పవనమా

ఇటువంటి యుగళ గీతాలు రజనివి మరి కొన్ని గుర్తుకు వస్తున్నాయి. ముఖ్యంగా ‘మన ప్రేమ’. ఇది బాలమురళి, శ్రీరంగం గోపాలరత్నం పాడి దానినొక దేవగాన స్థాయికి తెచ్చారు.

మన ప్రేమ
సస్య సౌందర్య సీమలలో
ప్రభవించి ప్రభవించి
నమ్ర మరు సీమమగునో
కమ్ర సుమ ధామమగునో

అని సాగుతుందీ పాట. సంభాషణలా సాగే మరో పాట ‘ఓ మలయా పవనమా’. ఇది తరువాత సినిమాలలో ఉపయోగించారు. అలాగే ‘ఎందుకింత తొందర ఓ జాబిల్లి’ ఇది కూడా డ్యూయెట్.

తన పంతమే తావిడువడు

వంగ సంగీతమే కాదు వారికి కర్ణాటక శాస్త్రీయ సంగీతంపై కూడా అంతే పట్టు వుంది. రాగాల ఆధారంగా ఫక్తు కర్ణాటక సంప్రదాయ పద్ధతులలో కూడా పాటలు రాశారు. ఆయన వ్రాసిన ‘నవగ్రహ స్తుతి’ ఒక రాగ మాలిక. ఆయన స్వంతంగా దేశవరాళి రాగాన్ని కనుక్కుని దానిలో ఒక వాద్యసంగీతం వినిపించారు. రసాళి రాగంలో త్యాగరాజు ఒక్కరే ఒక స్వామి కీర్తన రాశారు. మిగతా వాగ్గేయకారులు ఎందుకో దానిని ఉపయోగించలేదు. రజని ఆ రాగం ఆధారంగా ఒక సినిమా పాటకు స్వరకల్పన చేశారు. ‘తన పంతమే తావిడువడు’ అనే పాట అది. ఇది బాలసరస్వతి పాడారు.

ఘనాఘన ఘనాఘన

ఇప్పుడు మనం వినబోయే పాట మేఘరంజని రాగంలో స్వరపరచింది. ఇది ప్రథమంగా ఘంటసాల రేడియోకి పాడిన పాట – ‘ఘనాఘన, ఘనాఘన’ అంటూ మొదలవుతుంది. మనం ఆంగ్ల కవిత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు సెన్స్ ఆఫ్ టచ్, సౌండ్, స్మెల్, టేస్ట్ అని అంటాం కదా, అలా ఈపాటలో శబ్ద పద చిత్రాలు పుష్కలంగా వున్నాయి. వాన చినుకు పడే ధ్వనిని ‘చిటుక్, చిటుక్’ అని, అలాగే మెరుపు ‘తటాలున’ వచ్చి కళ్ళముందే మాయమవడం, లోలోపల గర్జిస్తూ ఒక్కసారిగా ‘ఢామ్’ అంటూ పిడుగు పడడం – అంతా నాటకీయంగా ఇలా ఎన్నో పద చిత్రాలతో ఈపాటను రజని మన ముందు ఉంచారు. ఈ పాటలో ఆయన వాడినవి కొంత బరువైన సంస్కృత పదాలు –

వియత్తలిన్ తటిల్లతల్ చలచ్చకితులై పారగా
ధరాతలన్ వారిధుల్ నభోంగణ్ణమ్ము మీరగా.

అదే సమయంలో ఈయనే అంతే అందమైన వానపాట అలతి పదాలతో పిల్లల కోసం రాశారు.

వాన వాన వల్లప్పా
వాకిలి తిరిగే చెల్లప్పా
ఎండా వేసిన వస్తువులన్నీ
ఇంట్లో పెట్టు చెల్లప్పా!

అదీ రజని గొప్పతనం. (ఇవి కాక ఆయన వ్రాసిన మరికొన్ని పిల్లల పాటలు: 1. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే, 2. సిపాయి ఎక్కేది ఎర్రా గుర్రం 3. దోబూచి, దోబూచి.)

ఓహో ప్రతి శ్రుతి నటనమాడవే మయూరి

ఈపాట తలచుకున్నపుడు గుర్తుకు వచ్చే మరోటి ‘ఓహో ప్రతి శ్రుతి.’ ఇందులో వారు వర్ణించేది పిఠాపురమే. ఆ పాత కోట బురుజు, ఏటి వార తోట, పంట పొలాలు – అన్ని పిఠాపురంలో కనిపించే దృశ్యాలు. ఇలాంటిదే మరో పాట ‘నటనమాడవే మయూరి.’ అందులో నెమలి కులుకులు అన్నీ ఒక చిత్రంలా మన ముందు ఉంచారు. ఇక ఇంద్రధనుస్సు మీద ఒక పాట వుంది. ‘నింగికి నేలకి వంతెనగా’ అంటారు.

ఇప్పటి దాకా మనం రజని స్వరాలలో కర్ణాటక సంగీతం, వంగ సంగీతం రీతులు చూశాము. వారు పంజాబీ సంగీత రీతులు కూడా అనుసరించి ‘దేవదాసు’ అనే సంగీత నాటకంలో కొన్ని పాటలు వ్రాశారు. ఇది 1940లో వ్రాశారు. అది ఆయన ఇంకా సంగీతంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్న కాలం. అందులో సింధ్ కాఫీ రాగంలో ఆయన రాసి స్వరపరచిన పాట వోలేటి వేంకటేశ్వర్లు తరువాత కాలంలో అద్భుతంగా పాడారు. ఆ రోజుల్లో ఖాన్ సాహెబ్ అబ్దుల్ కరీం ఖాన్ లాహోర్ నుంచి పాడిన ‘జమునాకే తీర్’ అనే పాట, ‘పియా బినా నహీ ఆవత్ చైన్’ అనే పాటలు విని, ఆ స్ఫూర్తితో రజని ఈ పాట రాశారు. ఇది బెంగాలీ కథ, పంజాబీ ట్యూన్, తెలుగు పాట. తెలుగు మాటలు కూడా అచ్చ తెలుగు పదాలు – ఒకచోట ‘తొంగలి రెప్పలు’ అని వాడారు. అంటే వాలిన రెప్పలు. ఆ వాలిన రెప్పలా వినిపించని సవ్వడి ఆయన చిన్న తంత్రి మీటుతో ‘తింగ్’ అని వినిపించారు. ఈ పాటలో తాత్వికత మన హృదయాలను కదిలిస్తుంది. ఈ ఒక్క పాటే కాదు, నిజానికి రజని అన్ని పాటలలోనూ తాత్వికత ఒక అంతఃసూత్రంగా ఉంటూనే వచ్చింది. ఉదాహరణకు మెట్ల మీద ఒక పాట ఉంది.

మెట్ల వరుసలు, మెట్ల వరుసలు
గగన సీమలు కాల పరిధులు
జీవితమునకు, మరణమునకు
ఈవలావల కదలు వరుసలు…

ఇందులోని తాత్వికత గమనించండి.

నే చేయునది

తాత్వికత అనుకుంటే గుర్తొచ్చే మరో అద్భుతమైన పాట: మరు నిముసమే మనదో కాదో. ‘నే చేయునది, నే చేయనిది, సాధించునది, ఫలియించనది, నీ ఇచ్ఛ లేక జరుగదట, నా స్వేచ్ఛకి మొదలు తుది ఎచట…’ అంటూ సాగుతుంది.


మన దేశవాళీ వంగ, కర్ణాటక, పంజాబీ సంగీతాలే కాదు, రజని మధ్య ప్రాచ్య సంగీతం ఆధారంగా ఎన్నో పాటలు వ్రాసి స్వరపరిచారు. మధ్య ప్రాచ్య సంగీతం ఆయన స్వభావానికి మరింత దగ్గరైన సంగీతం అనుకుంటాను. ఆయన ఒక సంగీతస్వరం వింటే దానిలో ప్రయోగాలు చెయ్యకుండా వుండేవారు కారు. ముందు వారు ఈ మధ్య ప్రాచ్య సంగీతంతో ‘స్వామీ నీ ఆలయమున’ అనే పాట వ్రాసి, స్వరపరచి ప్రసారం చేశారు. ఆ పాటే విని బి. ఎన్. రెడ్డిగారు కలవడం, వారి సినిమా కోసం ఒక పాట వ్రాయించుకోవడం – ఓహో పావురమా – ఈ కథ మీ అందరకూ తెలిసే ఉంటుంది. ఈ ‘పర్షియన్ సంగీతం స్వర్గం వెళ్ళిపోయిన గాంధార గ్రామం’ అని ఆయన ప్రతిపాదన. ఈ సంగీతం ఆయన ఎన్నో చోట్ల ఉపయోగించారు. ఇది ఆయన సంగీతపరిశోధకులకు మరొక అంశం. కృష్ణశాస్త్రిగారి అతిథిశాలలో సంగీతం ఒక అద్భుతం! అదే పోకడతో వ్రాసి స్వరపరచిన మరో పాట – మూసి పై వలపు వంతెన – ఒక సంగీత రూపకం లోనిది. అందులో పాడిన ‘దక్కన్ దివ్యభూమి’లో ఆ పోకడలు స్పష్టంగా వినిపిస్తాయి. ఆయన దక్కన్‌ని:

‘ఓ అపూర్వ వినీత సంస్కృతీ కరండమా
దక్షిణోత్తర భావ మాధురీ సమ్మళిత శర్కరీ ఖండమా
హిందుస్తాన్ హృదయం పైని ఇంపైన మధు భాండమా’ అంటారు.

కరండం అంటే తేనె పెర, పెట్టె.


ఆకుపచ్చని ఆకు ఆటలో

ఇక ప్రకృతి ఆయనకు ఎంతో ఇష్టమైన అంశం. అది ఎన్నో రూపాలలో మనకు వారి రచన శతపత్ర సుందరిలో కనపడుతుంది. ఆయన ప్రకృతిని వానలో, తోటలలో, కొండలలో, ఇంద్రధనస్సులో, సెలయేరులలో, వాగులలో, నెమలిలో ఇలా ఎన్నో రూపాలలో చూస్తారు. ఇప్పుడు ‘ఆకుపచ్చని ఆకు ఆటలో’ అని ఎక్కువ ప్రచారం లోకి రాని ఒక పాటని విందాం. ఈ పాటలో మనకు ఎక్కువ తెలుగు మాటలే వినిపిస్తాయి.

‘జలజలమని ప్రవాహాలు సెలయేరులలో
తళ తళ లాడే సొగసుల మెరుపుల పాలకిలో’ అని సాగుతుంది ఈ పాట.

వడగాలి తరువాత, వానవరదల తరువాత, చీకట్ల తరువాత పడే సన్నని వాన ఆనందం కలిగిస్తుంది. ఈ పాటలో సంగీతం గమనిస్తే – ఆకు ఆట, అది చిరుగాలి అల్లనల్లగా ఆడడం మనకి స్వరంలో చూపుతారు. ఆ స్వర వరుస ఆగే విధానం గమనించండి. అది చటుక్కున ఆగదు. ఊగే ఆకు మెల్లిగా ఊపు ఆపినా దానిలో చలనం మనకి తెలుస్తూనే ఉంటుంది. అది కూడా ఆయన స్వరంలో చూపుతారు. వినండి.

శతపత్ర సుందరి నును మంచు సోనలో రొద సేయకే తుమ్మెదా

ప్రకృతి మాట తల్చుకుంటే ఎన్నో పాటలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ‘శతపత్ర సుందరి. ఓహో శతపత్ర సుందరి’ అనే పాట. ఈ పాటలో సూర్యకుమారి గొంతు ఎన్ని వయ్యారాలు పోతుందో మనం వింటాం.

* నును మంచు సోనలో, తళుక్కుమను తొలి సంజ మెరుపులో – దీనిని మోదుమూడి సుధాకర్ స్వరపరిచారు.

* రొద సేయకే తుమ్మెదా, రేగి రొద సేయకే తుమ్మెదా – సంగీతం, గానం మల్లిక్.

* నటన మాడవే మయూరి – ఇంద్రగంటి జానకీబాల పాడారు.

* సేల మీద పైరు గాలి సల్లంగ సెంప తాకి లేపుతాది – జానపద శైలిలో రాసిన పాట.


ఇక మనం ప్రస్తావించుకోవలసినది ఆయన ఆశా దృక్పథం గురించి. ఈ దృష్టి ఆయన ప్రతి పాటలోను, వాక్యంలోనూ కనపడుతుంది.

కొండ వాలులో కొలనొక్కటి
ఊరికే మాధురులు ఊరిపోతున్నాయి
ఆ వైపు, ఈ వైపు అని కాదు, అలముకోను
అందమే వెలుగైనా అన్ని వైపుల కూడా
అంధకార ప్రభలుమందు వైపుల కూడా

ఆశా నా ప్రాణసఖీ

చూశారా ఆయన ఆశావాదం! ఆయన ఇదే ఆలోచనని ఒక పాటగా కూడా వ్రాశారు. ‘ఆశా, నా ప్ర్రాణసఖి!’ ఈ ప్రాణసఖి ఎవరో కాదు – పాణీగ్రహీత దార సుభద్రగారే. కర్సియాంగ్‌లో చలిలో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ‘దురాశా భామిని పిలుపులు విననీకు’ అంటారు. ఇది సుభద్రగారి బాధ్యత అని కాదు. తనకు తానే చెప్పుకోవడం. ఈ పాటలో అన్ని పాటలలో లాగానే ఒక అంతర్గతమైన లయ (internal rhythm) ఉంటుంది. ఈ పాటలో కొన్ని వాక్యాలు వచనంలా ఉంటాయి. పాటకి ఇముడుతాయా అని అనిపిస్తుంది. కానీ పాట వినేటప్పుడు అలా అనిపించదు. ‘నిరాశా కామిని నెన్నడుము విరుగ తరమవో’ అంటాడు కవి. ఇప్పుడు ఆ పాట విందాము.

నను చూసి నవ్వేరే

సుభద్రగారి గురించి ఆయన నాలుగు పాటలు రాశారు – కాకి బావ, ఓసోసి చిట్టి మరదలా అంటూ. సుభద్రగారు రజనిగారి వీరాభిమాని. ఆయన పాటలన్నీ ఆమెకి వచ్చు. ఆమెకి నచ్చిన కొన్ని పాటలు – నను చూసి నవ్వేరే నా సఖులీ వ్రజభామినులు; ఎదురు చూడడమదెన్నాళ్ళో గదా వదిలి కదలనీదు ఆశ; స్వప్న జగతిలో ఛాయా వీణ మెరపో, వెలుగో చూడు, ఉన్నాయి. ఆమె మంచి గాయని. అయినా ఎందుకో పదిమందిలోకి వచ్చి పాడటం ఇష్టపడలేదు. ఎవరూ లేరనుకున్నపుడు ఆమె పాడేది ‘జోల పాట’. అదీ రజనిగారిదే – అందాల మల్లి నికుంజమందున సొంపుగా నిదురించవో సుందరీ/ సుందరా.


రజనిగారికి నచ్చిన అంశాలలో ఒకటి కూచిపూడి యక్షగానం. ఆయన విజయవాడ ఆకాశవాణిలో ఉండగా కూచిపూడి యక్షగానాలపై ఎక్కువ దృష్టి సారించారు. ఆయన ఒక చిన్న సంగీత నాటకంలో ఆ రీతులను అనుసరించి ఒక ప్రయోగం చేశారు. ఆ నాటకమే ‘స్వైరిణి’. అందులో ‘స్వైరిణి అన్నారు నన్ను’ అంటూ వచ్చే పాట ఉంది. ఈ పాటలో ఎంతో విషాదం తొంగి చూస్తుంది. రజని గారి భావనల సాంద్రతకి ఈ పాట ఒక మచ్చు తునక. ఈ పాట ఆ రోజుల్లో ఎంత ఆకట్టుకుందంటే ప్రముఖ రచయిత్రి తెన్నేటి హేమలత – వీరు లతగా ప్రసిధ్దులు – రచన మోహనవంశీ, ఆ రోజుల్లో యువతని ఎంతో ఆకర్షించిన పుస్తకం. అది చదివి ఆమెతో ప్రేమలో పడ్డాను అన్నవారు నాకు చాలా మంది తెలుసు. ఆ పుస్తకం ముందు పేజీలో ఈ పాట ఉంటుంది. ‘ఇది నాకోసమే వ్రాశారనిపించింది’ అని ఆమె నాతో అన్నారు.

ఈ పాట వింటే గుర్తుకు వచ్చేది బాల సరస్వతి పాడిన ‘విరహానలంపు బాధ భరియింప లేదు రాధ.’

ఓ విభావరీ! మ్రోయింపు జయభేరి

ఆ రోజుల్లో స్వతంత్రోద్యమం వలన దేశభక్తి, దేశనాయకులపై అభిమానం హెచ్చుగా ఉండేది. దాదాపుగా కవులందరూ ఈ అంశంపై పద్యాలు, కావ్యాలు, పాటలు రాశారు. రజని 1941 లోనే ‘ఓర్మి తాల్ముల పైడి నావ’ అని మధ్యాక్కరలో వ్రాశారు. ఈ ఛందస్సు, ప్రయోగం ఇది మరో పరిశోధనాంశం. 1947 ఆగస్టు 14-15 అర్ధరాత్రి, నెహ్రుగారి ఉపన్యాసం (tryst with destiny) తరువాత ప్రతి భాషలోనూ ఒక దేశభక్తి గీతం ప్రసారం అయ్యింది. ఈ కథ అంతా మనకు సుపరిచితమే. అప్పుడు వచ్చిన పాట ఇది:

మ్రోగింపు జయభేరి, వాయించు నగారా
తేలింపుము నభోవీధిని త్రివర్ణాంచిత పతాక!
భారతదేశ స్వేచ్ఛ సూర్యునాచ్ఛాదించు రాహు ఛాయ
అంతర్థాన మాయే!
ఉదయమ్మాయెను స్వేచ్ఛా భారత ఉదయమ్మాయెనహో.

ముక్కోటి కంఠాలు అంజలిదే మానవోత్తమా!

1948 ఆగస్టు 15న ‘మాదీ స్వతంత్ర దేశం, మాదీ స్వతంత్ర జాతి’ అని ప్రకటించారు. ఇదే కాక జెండా పైన, దేశం పైన మరెన్నో పాటలు రాశారు: స్వతంత్ర భారత జననీ నీ కిదే నితాంత నీరాజనము, ముక్కోటి కంఠాలు, హే భువన మోహిని…

బాపూజీ మరణంతో దేశమంతా కదలిపోయింది. రజని గాంధీగారి మీద చాలా పాటలు రాశారు. అందులో ఒకటి ‘అంజలిదే మానవోత్తమా!’ బాపూజీ తాత్త్వికత, ఆయన జీవన విధాన సారాన్ని రజని నాలుగు వాక్యాలలో తెలియజేశారు.

తన లోపల జీవాళిని
తన్ను సకల జీవులలో
కనుగొను కరుణామూర్తి
ఖేద మోద సమవర్తి.

గాంధీగారి జీవన విధానం, ఆయనలోని ఏ గుణం ఆయనను మహాత్ముడిని చేసిందో ఆ గుణం రజని నాలుగు వాక్యాలలో మనకు అందించారు.

సృష్టిలోని జీవులందరూ ఒకటే. ఏది తనలోని జీవమో అదే సర్వవ్యాప్తి అయ్యి ఆ భగవంతుడు అనుకోండి, మరోటి అనుకోండి – ఆ వెలుగు ప్రతి జీవిలోను కనపడుతుంది అని తెలుసుకున్నారు గాంధీ. అదే ఉత్తమ మానవుని లక్షణం. అన్ని మతాల సారం. ఆయన ఖేద, మోద సమవర్తి. మనం ఏ స్థితప్రజ్ఞత కావాలని కోరుకుంటామో అది ఆయనలో ఉందని కవి వాక్యం.

ఆయన ఈ పాటలో గాంధీగారిని క్రైస్ట్‌తోనూ బుద్ధుడి‌తోనూ పోల్చారు. ఈ పాటకు పాలగుమ్మి విశ్వనాథం సంగీతం కూర్చి ప్రసారం చేశారు.


హాయిలో నేల ఎదకింత హింసా?

ఇక గజల్ ప్రక్రియను అనుసరించి రజని ఎన్నో పాటలు రాశారు. గాలిబ్ గజల్‌ని కూడా అనువదించారు. హాయిలో నేల ఎదకింత హింసా? అనే ఈ పాటకి మల్లాది సూరిబాబు సంగీతం కూర్చారు. ఒకసారి ఈ ట్యూన్ రజనిగారికి వినిపించగానే ఆయనకు చాలా నచ్చి తాను చేసుకున్న ట్యూన్‌ని మర్చిపోయాను అన్నారు. ఈ పాట ఎవరి గురించి? వేణువు గురించి. వెదురుని చీల్చి, చిల్లులు పొడిచి గాయాలు చేసిన ఆ వేణువు తీయని పాటే వినిపిస్తుంది. కానీ కవికి అందులోని బాధ కూడా వినిపిస్తుంది.

ఆయన గజలులే కాదు రెండు ఠుమ్రీలు కూడా రాశారు:

1. చెలువుడు రాడేలెనే – ఓ సకియా
పిలిచెను గాని ఉపవని కలియగా

2. రావే సఖి మధువనికి
ఓ వసంత పూర్ణేందు హసన్ముఖి

రజనిగారికి మరో ఇష్టమైన సబ్జెక్టు జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం. వారు ఎంతో శ్రద్ధగా ఆ పుస్తకాలు చదువుతూ, వాటిలో జరుగుతున్న పరిశోధనలు గమనిస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం వినే పాట వారి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి ఒక మచ్చు తునక. ఆ విజ్ఞాన విశ్వరూపం మనకి ఆయన మాగ్నమ్ ఓపస్ విశ్వయానంలో కనపడుతుంది. ఆ విజ్ఞానాన్ని, మన వేదజ్ఞానాన్ని కలబోసి వాయిద్యాలతో చేసిన ఒక అద్భుత సృష్టి విశ్వయానం. ఇక ఈ పాటలో వీరు రాసింది ప్రబోధ ఏకాదశి గురించి. అది కార్తీక మాస శుద్ధ ఏకాదశి. పున్నమికి నాలుగు రోజులు ముందు వస్తుంది. ఆ రోజున ఆకాశంలో సప్త ఋషి మండలం కింద కనిపించే నక్షత్ర సమూహాన్ని శేష శయ్యపైన విష్ణుమూర్తి నిద్ర లేవడంగా వర్ణించారు మన పూర్వికులు. ఆషాడ మాస శుద్ధ ఏకాదశి నుండి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు అదే నక్షత్ర మండలం విష్ణుమూర్తి నిద్ర పోతున్నట్లు, కార్తీక మాసానికి నిద్ర లేచినట్లుగా నక్షత్రాలు కదిలి ఉంటాయి. పాశ్చాత్యులు దీనిని Hercules and dragonగా చూశారు. కాళిదాసు సంస్కృత నాటకం మేఘసందేశంలో కూడా ఈ ప్రస్తావన వుంది. ఆ విష్ణుమూర్తికి ఇరు పక్కల గరుడుడు, మరుత్తుడు అంటే శ్రవణా నక్షత్రం, స్వాతి నక్షత్రం. ఆ విష్ణుమూర్తి పైవైపున బొడ్డులోనుంచి వచ్చిన తామరలో విరించి. ఆషాడ మాస ఏకాదశి తొలి ఏకాదశి, శయన ఏకాదశి. ఇది ప్రబోధ ఏకాదశి. ఈ పాటను కనకాంగి రాగంలో చేశారు.

లేవయ్యా స్వామి లేవయ్యా నివాత శూన్య స్తంభం

విశాఖ ఎండ తరుగు సూర్యుడు. చంద్రుడు కృతిక వైపు వెడతాడు. పగలు, రేయి సమాన కాలగతులతో నడుస్తాయి. అద్రిజ అంటే పార్వతి దేవి – మూలా తారక, అభిజిత్తు నక్షత్రం అధిపతి బ్రహ్మ, ఆయన సతి సరస్వతి దేవి. గోలోకంలో రాధ. వైష్ణవ సాంప్రదాయంలో గోలోకం వైకుంఠం. ఇక్కడ రాధ అధిష్టాన దేవత. ఈ మువ్వురు అమ్మలను ఈ పాటలో ప్రస్తావించారు. ఈ విధంగా ఆర్ష, ఖగోళ శాస్త్రాలు రెండు మేళవించి స్వరపరిచారు.

ఒక తుఫాను పాట గురించి మాట్లాడుకుందాము. విశ్వయానంలో బిగ్ బాంగ్ థియరీ గురించి పాడారు. మే 9, 1990లో తుఫాను సమయంలో రేడియోకి రాసిన పాట – నివాత శూన్య స్తంభం నిష్పీడన మంధానం, ఝంఝావాత సంరంభం ధ్వంస విధి విధానం. తుఫాను రావడానికి ముందు వచ్చే గాలి లేక పోవడం, అల్ప పీడనం ఈ పాటలో కనిపిస్తాయి.

చివరిగా రజనికి ఎంతో ఇష్టమైన కవి రవీంద్రుడు. ఆయన శైలిని ఈయన అభిమానించారు. రజని లలిత సంగీతానికి ఆయనే ఆదర్శం అనిపిస్తుంది. రవీంద్రుడు అప్పటిదాకా బెంగాల్‌లో ప్రాచుర్యంలో ఉన్న శాస్త్రీయ సంగీతానికి జానపద హొయలు మేళవించి లలితంగా, శ్రావ్యంగా ఉండేలా స్వరపరిచి రవీంద్ర సంగీత్ అనే ఒక కొత్త బాణీని ప్రవేశ పెట్టారు. అది ఈ నాడు ఎంతో ప్రచారం పొందింది. ప్రతి బెంగాలీ వ్యక్తి రవీంద్ర సంగీతం నేర్చుకోవడం, లేదా విని ఆనందించే అభిరుచి పెంచుకోవడం జరిగింది. ఇలా మన తెలుగు దేశంలో లలిత సంగీతం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్ష.

రవీంద్రుడిని ఎందరో కవులు అనువదించారు. గీతాంజలి దాదాపు ఒక 20-25 మంది అనువదించి వుంటారు. మిగిలిన పాటలు అనువదించిన వారిలో గుర్తుకు తెచ్చుకోవాల్సిన మరో కవి మల్లవరపు విశ్వేశ్వర రావుగారు. రజని where the mind is without fearకి అనువాదం చేసి దానికి స్వర కల్పన చేశారు. ఆ పాట లోని భావం ఎంత గంభీరమో రజనిగారు ఎంచుకున్న మాటలు అంతే గంభీరం. చిత్త మెచట భయ శూన్యమో శీర్షమెచట ఉత్తుంగమో – ఇలా ప్రతి మాటలోనూ ఒక బరువు ఉండి భావ గంభీరత మనస్సుకి పడుతుంది.

ఎవరు కేక విని

ఈ నాడు మనం వినబోయేది అంతకంటే ప్రాచుర్యం పొందిన ‘ఎవరు కేక విని రాక పోయినా సరే’. బెంగాలీ పాట విని ఇది వింటే ఎంత అద్భుతంగా తెలుగు మాటలు ఆ రవీంద్ర సంగీతపు బాణిలోకి ఒదిగిపోయిందో అర్థం అవుతుంది.


రజనిగారు చేసిన అన్నమయ్య సంగీతం (విన్నపాలు వినవలె వింత వింతలు, రమ్మనవే మాని రచనలు. ఇందుకుగా కోపించునేలా? మొల్ల లేలే నాకు); సినిమా పాటలు, అందులో ఆయన చేసిన ప్రయోగాలు; ఇవి కాక చరమాంక సంగీతం (interludes) వంటివి గొప్ప ప్రయోగాలు. ‘మ్రోయింపు జయభేరి’లో ముందు వచ్చే వాయిద్యం, ‘జాబిల్లి వస్తున్నాడు’ పాటలో ముందు వచ్చే సంగీతం, ‘ఊరేది పేరేది’ పాటలో నాయిక కలలోకి వెళ్తున్నప్పుడు చేసిన సంగీత విన్యాసం ముఖ్యంగా మృదంగ విన్యాసం – అన్ని తల్చుకోవలసినవే. ఒక ప్రముఖ విమర్శకుడు మోదుగుల రవికృష్ణ ‘రజని తెలుగు వారి సాంస్కృతిక చిహ్నం. ఆయన తెలుగు గడ్డ మీదకు ఒక పాటల తోటను తెచ్చారు’ అన్నారు. ఈ వేళ ఆ తోటలో కాసేపు విహరించి, కొన్ని సుగంధ పుష్పాల వాసన పీల్చి ఆనందించాము. స్వస్తి.

[ఈ ప్రసంగంలో వినిపించిన పాటలు అందించిన పరుచూరి శ్రీనివాస్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో – ప్రసూన.]


ఈ ప్రసంగానికి నాకు తోడ్పడిన పుస్తకాలు, వ్యాసాలు:

  1. రజనీ – లలితసంగీత వాగ్గేయకారుడికి శతజయంతి నీరాజనం – ఆవంత్స సోమసుందర్. కళాకేళి ప్రచురణలు, పిఠాపురం, 2015.
  2. ఆత్మకథావిభావరి – బాలాంత్రపు రజనీకాంతరావు. సత్యం ఆఫ్‌సెట్ ఇంప్రింట్స్, విశాఖపట్నం, 2012.
  3. రజనీ భావతరంగాలు – బాలాంత్రపు రజనీకాంతరావు. నవోదయ ప్రచురణలు, 2011.
  4. శతపత్రసుందరి – బాలాంత్రపు రజనీకాంతరావు. 1954.
  5. ఈమాట పత్రికలో వ్యాసాలు, శబ్దతరంగాలు.