పెద్దగా ఏమీ ఏదీ అక్కర్లేదు. ఒక వెయ్యి నూట పదహార్లు మొదలుకుని, రెండు మూడు శాలువాలు పూలదండలు ఒక సాయంత్రంలో మూడు నాలుగు గంటలు కలుపుకొని, కొంత మొత్తం తనది కాదనుకుంటే, తెలుగునాట ఎవరైనా పురస్కార ప్రదాత కాగలరిప్పుడు. అమ్మలో నాన్నలో అక్కలో అన్నలో పెంచి పెద్ద చేసినవాళ్ళో దయతో చదువు చెప్పించినవాళ్ళో గురువులో పెంపుడు జంతువులో – ఎవ్వరి పేరు మీదైనా ఇప్పుడు ఒక సాహిత్య పురస్కారం ఆరంభించనూ వచ్చు, ఆ పక్క ఏడాదే ముగించనూ వచ్చు. ఇచ్చుకునేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు తప్ప వీటికి అర్హతలింకేమీ అక్కర్లేదు. ఏ సాహిత్య విలువలు, ప్రమాణాలతో ఎందుకిస్తున్నారో తెలియకుండా దానంలా ఇచ్చే ఈ పురస్కారాలను ఏమనలేం. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల ప్రైవేటు ఇష్టాలు కాబట్టి ఏమీ అనకూడదు కూడానూ. ఇలా వ్యక్తిగత ఇష్టాలు, కారణాలతో వీధికొకటిగా దొరికే పురస్కారాల మధ్యలో ప్రభుత్వం అందించే సాహిత్య అకాడెమీ అవార్డుకు ఒకప్పుడు కొంతయినా విలువ ఉండేది. అది అందుకున్న వారి పట్ల గౌరవం ఉండేది. ఆ రెండూ బహుశా ఇకపై ఉండవు, ఉండబోవు. సంస్థాగత బాధ్యత ఎంత గురుతరమైనదైనా, ఆ సంస్థను నియంత్రించే సాహిత్యకారులు అందరిలా అల్పమానవులే అన్న మేల్కొలుపు, గడియారం గంటలా ఇన్నేళ్ళుగా మోగుతూ వస్తున్నా, తెలుగు సాహిత్య ప్రపంచాన్ని చరిచి నిద్ర లేపింది ఈ ఏటి సాహిత్య అకాడెమీ యువ పురస్కార్ అవార్డు ప్రకటన, అదీనూ సోషల్ మీడియా చలువ వల్లనే. ఒక పుస్తకాన్ని పురస్కారానికి ఎలా ఎన్నుకున్నారన్న సందేహం కలిగించే రచనలు మునుపూ లేకపోలేదు. సాహిత్యవిభాగాల నుండి అందుకున్న పుస్తకాల్లో నుండి కమిటీ ఉత్తమమైనవి ఎన్నుకోవాలన్నది అకాడెమీ పురస్కారం తాలూకు ప్రాథమిక ఎంపికకి సంబంధించిన ఒక నియమం. కానీ ఏ రకంగా చూసినా ఏ సాహిత్యవిలువలూ కనపడని రచనలను పదేపదే ఎన్నుకోడం ద్వారా తెలుగు భాషలో వస్తున్న ఉత్తమసాహిత్యం ఇంతమాత్రమే అని తెలుగు అకాడెమీ దేశానికంతటికీ చాటి చెప్తూ వస్తోంది. ఏ విభాగంలో పురస్కారాలైనా ఆయా విభాగాల్లో చెప్పుకోదగ్గ కృషి చేసిన కవులు, రచయితలు, సాహిత్యకారులకు, నిజమైన సృజనాత్మక శక్తి ఉన్నవాళ్ళకి ఇస్తే, వాళ్ళకి జాతీయంగా గుర్తింపు వస్తుంది, వాళ్ళ సాహిత్య ప్రపంచం విశాలమవుతుంది. సృజన యొక్క నాణ్యత ఎంచడం అనేది ఎంత సాపేక్షికమైనా, పోల్చి చూసినప్పుడు సాధారణ పాఠకులు కూడా అద్భుతమైన విచక్షణ చూపిస్తూ ఏది మంచి కవితో కథో విమర్శో ఏది కాదో వివరించి మరీ చెప్పగలిగినప్పుడు, కేవలం నాసిరకం రచనలనే ఎంచుకుంటున్న అకాడెమీ పెద్దలను తూర్పారపట్టడం ఒక బాధ్యత. మచ్చుకైనా కనపడని వాళ్ళ నిబద్ధతను వేనోళ్ళ ప్రశ్నించక పోవడం నేరం. స్వార్థ రాజకీయ సమూహాలు, అనుయాయులైన కవిరచయిత బృందాల భజనల కోలాహలం తోడుగా, ఏళ్ళకు ఏళ్ళ తరబడి జులుం చేయడం హక్కుగా పీఠాలను ఆవహించుకుని కూర్చున్నారు కొందరు అజ్ఞానవృద్దులు. ఆ పీఠం ఇచ్చే గౌరవం కోసం దాన్నే పట్టుకు వేలాడే ఈ కుకవుల ఆధిపత్యాన్ని గుడ్డిగా ఆమోదించే అకాడెమీ కమిటీల దౌర్భాగ్యం వల్ల తెలుగు సాహిత్యంలో ఈ పురస్కారాల విలువ చెప్పుకంటుకుంటే రాయికి తుడుచుకొని పోయే స్థాయికి చేరిపోతోంది, ఇప్పటికే చేరిపోకుంటే. సాహిత్యకారులకి కావలసినది వారి ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వని సమాజం, సృజనను బ్రతికించే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. సాహిత్యం విలువ తెలిసిన సమాజానికే సాహిత్యకారులను ఎందుకు కాపాడుకోవాలో, ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది. అలాంటి అవకాశం లేని చోట సాహిత్యకారులకు రెండే దారులుంటాయి. ఈ రొచ్చు తమది కాదని ఛీ కొట్టి, అలౌకిక స్థాయిలో రచనను ప్రాణశకలంలా ఏకాంతికంగా సృజించుకోవడం. లేదూ, సామాజిక స్థాయిలో ఈ కుళ్ళిపోయిన సంస్థలను ప్రతిఘటిస్తూ, ఎవరిదైనా సరే ఒక మంచి సాహిత్యానికి గుర్తింపు తేవడమొక బాధ్యత అని నమ్మి నడుములోతుకు ఈ బురదలోకి దిగి పోరాడడం. ఈ రెండూ కాని లోకంలో అకాడెమీ పెద్దల ఉచ్చిష్టాన్ని ప్రసాదంలా చేతులు చాచి స్వీకరించడమే ప్రతీ ఒక్కరి సాహిత్యనియమం అవుతుంది.