కల్పన రెంటాల 2002 నుండి ఇప్పటివరకు అంటే ఇరవై ఏళ్ళలో రాసిన పదిహేను కథలు, అయిదో గోడ అన్న సంపుటిగా వెలువడినవి, చదవడం మొదలుపెడితే ఆగకుండా చదివించే కథలు. ‘అయిదోగోడ’, ‘స్లీపింగ్ పిల్’ కథలు తప్పించి అన్ని కథలు ప్రవాసాంధ్రుల జీవితాలకు సంబంధించినవి. ఆ పదిహేను కథల్లో 11 కథలు స్త్రీవాద కథలు. 22 నవంబరు 2021న ఆంధ్రజ్యోతి వివిధకిచ్చిన ఇంటర్‌వ్యూలో కల్పన అంటారు: శిల్పం మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రయోగాత్మకంగా, గొప్పగా ఉండటానికి ఈ కథలు రాయలేదు. స్త్రీల జీవితాల్లోని భిన్న శకలాలను నిజాయితీగా చూపించడమే ప్రత్యేక ప్రయోజనంగా రాశాను. శిల్పపరంగా, ప్రయోగాత్మకంగా రాయాలన్న తపనతో రాస్తూ పాఠకులను అయోమయావస్థలో పడవేసే ఈ మధ్య వస్తున్న కొన్ని కథలకు భిన్నంగా కల్పన కథలు సూటిగా, సరళంగా, కొన్ని ఉద్దేశాలకి కట్టుబడి రాసినవి. తన కథల్లో వస్తువుకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని ఆమె అన్నప్పటికీ, శిల్పపరంగా కూడా చెప్పుకోదగ్గ కథలామెవి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ముందుగా ఈ కథల సంపుటి పేరుకి సంబంధించిన కథ గురించి: అయిదోగోడ అన్నపేరు విస్మయాన్ని కలిగించి ఆలోచింపచేస్తుంది. అసలు గోడలంటేనే అవరోధాలని, అభ్యుదయ నిరోధకాలనీ తెలిసిందే. స్త్రీ జీవితం నాలుగు గోడల మధ్య అని అనడం వాడుక. అయిదోగోడ కళ్ళకు కనపడని గోడ. నారీ విముక్తికి, ప్రగతికి సమాజం అడ్డు వేసిన గోడ. ఊహాత్మకమైన ఈ గోడను పగులగొట్టి, దాటి, మహిళల వికాసానికి మార్గాలను వెతకడమే కల్పన ఈ కథ ద్వారా ప్రయత్నించింది. భర్త చనిపోయిన శారద వెంటనే ఒక తోడు కావాలని కోరుకోవడం, ప్రకటన ఇవ్వడం, భార్య చనిపోయిన మగవాడు తోడుకోసం పెళ్ళి చేసుకొనడానికి పెద్దగా అభ్యంతరం చూపని కూతురు మొదట దీన్ని ఆమోదించలేకపోవడం ఈ కథ ఇతివృతం. కథ రాసిన రచయితను శారద పాత్ర ప్రశ్నించడం ఈ కథకు హైలైట్! ముందుగా ఆనందంగా జీవితాన్ని అనుభవించడం కోసం తోడు వెతుకున్నట్టు రాసి, తర్వాత సామాజిక సేవాకార్యక్రమాలు చేయాలన్న ఉత్సాహమున్నవారికి, సంగీతం, సాహిత్యమంటే అభిరుచులున్నవారికీ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటనలో చేర్చడం, స్త్రీ ఎందుకు పెళ్ళి చేసుకోవాలో ముందే నిర్ణయించి సరిహద్దును గీసిన సమాజాన్ని నువ్వు ప్రశ్నించకపోవడం చెలియలికట్టను దాటకపోవడమే కదా? అని శారద రచయితను ప్రశ్నిస్తుంది. శారీరక సుఖం కోసం తోడు కావాలనిపించడం మగవాని విషయంలో ఆమోదిపబడినప్పుడు స్త్రీ విషయంలో అయిదోగోడగా ఎందుకు మారింది? శారద వేసిన ఈ ప్రశ్నలు ఆలోచించి పరిశీలన చేసుకోవలసినవి.
మొదటి కథ ‘అయిదు శాజరాక్‌ల తర్వాత’లో సృష్టికి బాయ్‌ఫ్రెండ్ యారన్‌తో బ్రేకప్ అవుతుంది. ఆమె లావుగా ఉండటం, ఫ్రిజిడ్‌గా ఉండటం కారణాలుగా పెళ్ళికి ప్రపోజ్ చేస్తాడనుకున్న అతను బ్రేకప్ చెప్పాడంటుంది. ఒంటరిగా న్యూ ఆర్లియన్స్ వస్తుంది. అక్కడ లోగన్ అనే యువకుడితో పరిచయం, రెస్టారెంట్‌లో అయిదు శాజరాక్‌లు తాగటం ఆమెకి కొంత ఉపశమనాన్నిస్తాయి. ఈ కథలో అంతర్లీనంగా కనిపించే సింబాలిజమ్ మనల్ని ఆకట్టుకుంటుంది. కట్రీనా వరదల్లో ఛిన్నాభిన్నమైన న్యూ ఆర్లియన్స్ నెమ్మదిగా కోలుకుని పునర్జీవించబడినట్లుగా సృష్టి బ్రేకప్ నుంచి తేరుకుని ముందుకు సాగిపోవాలన్న ఆశాభావం కథలో కనిపించింది.
‘క్రైమ్ సీన్’ కథ, అమెరికా లాంటి లిబరల్ సమాజంలో కూడా రేప్‌లు జరుగుతాయని తెలిపే కథ. కాలేజీ సెలబ్రిటీ, ఫుట్‌బాల్ ప్లేయర్ బెన్ ఒక పార్టీలో శ్రియని రేప్ చేస్తాడు. శ్రియ అతని మీద కేసు పెట్టాలనుకుంటుంది. దానిలో భాగంగా రేప్ కిట్ పరీక్ష కూడా చేయించుకుంటుంది. కాలేజ్ బెన్‌ని సస్పెండు చెయ్యకపోగా బెన్‌తో కేస్ సెటిల్ చేసుకుని రాజీకి రమ్మని శ్రియ మీద ఒత్తిడి తెస్తుంది. పరువు పోతుందని, కారెక్టర్ గురించి చెడుగా వ్యాఖ్యానాలు చెస్తారని కేస్ వేస్తే ఆమెని సపోర్ట్ చెయ్యనని తండ్రి ప్రసాద్ ఆఖరి అస్త్రాన్ని వదుల్తాడు. శ్రియకు తనకు జరిగిన మానభంగం కన్నా కేసు ఉపసంహరించుకోమని తనమీద తెస్తున్న ఒత్తిడి, తండ్రి ప్రవర్తనే ఎక్కువ బాధ కలిగిస్తుంది. రేప్‌లు జరిగే విషయంలోనూ అమ్మాయిలు పడే వేదన, ఒత్తిళ్ళు మొదలైన విషయాల్లోనూ లిబరల్ అమెరికన్ సమాజానికి, భారతీయ సమాజానికి చాలా పోలికలున్నాయని తెలుపుతుందీ కథ!
‘స్లీపింగ్ పిల్’ ఇండియాకి సంబంధించిన కథ. మారైటల్ రేప్ గురించిన కథ. ఆడవాళ్ళకి సెక్స్‌లో పాల్గొనడం ఇష్టం లేకపోయినా, భర్తల ఒత్తిళ్ళకు గురయి ఎలా బాధలనుభవిస్తారో చెప్పే కథ. చాలావరకు మహిళల అభిప్రాయాలకు, ఆలోచనలకు, ఇష్టాయిష్టాలకు విలువనివ్వని పురుషాధిక్య సమాజం మనది. అటువంటి సమాజంలో ఇతర విషయాలలాగానే సెక్స్ విషయంలో భార్య అంగీకారం భర్త తీసుకుంటాడని ఆశించడం అత్యాశే అవుతుంది మరి. ‘ఆ ముగ్గురూ’ కథలో అమెరికా లోని ఆఫీసు వాతావరణం చూపిస్తూ, మగవాళ్ళతో స్నేహంగా మెలిగే మహిళల గురించి మిగతా ఆడవాళ్ళ అభిప్రాయాలు ఎంత సంకుచితంగా ఉంటాయో తెలిపే కథ. ఈ విషయంలో లిబరల్ అమెరికన్ సొసైటీకి, భారతీయ సమాజానికి పెద్ద తేడా లేదనిపిస్తుంది.
‘ఈస్ట్రోజన్ పిల్’ స్త్రీల ఋతుక్రమం, పి.ఎమ్.ఎస్., మెనోపాజ్‌లకి సంబందించిన విషయాలను, వాటివలన వచ్చే సమస్యలు, బాధల గురించి చెప్తుంది. అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ విషయంలో స్త్రీలకున్న భయాలు, బాధల గురించి ప్రస్తావిస్తుంది. ‘టూ డాలర్స్ ప్లీజ్’ కథలో విద్యార్దులు, ఉద్యోగస్థులు, మేధావులు, స్త్రీలు – రైలుపెట్టెలో వున్న ప్రయాణీకులు – ఆర్థిక సహాయాన్ని అర్థించే తోటి ప్రయాణికురాలి వేడుకోలుకు ఏమీ పట్టనట్టు తమ మానాన తాముగా ఇన్‌సెన్సిటివ్‌గా ఉండటాన్ని చూపిస్తుంది.
‘హోమ్‌రన్’, ‘టింకూ ఇన్ టెక్సాస్‘ ప్రవాసాంధ్రుల పిల్లలకి సంబంధించిన కథలు. మొదటిది పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకునే విషయంలో, వాళ్ళు అన్నిట్లో నెగ్గాలని తాపత్రయపడే విషయంలో, వాళ్ళమీద ఒత్తిళ్ళు తెచ్చే విషయంలో నేటివ్ ఆంధ్రులకి, ప్రవాసాంధ్రులకి మధ్య పెద్ద తేడా లేదని చెప్పే కథ. రెండవది పిల్లల మానసిక ప్రపంచం వేరుగా ఉంటుందని, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్రించాలని, ఇమాజినరీ ఫ్రెండ్స్ ఉన్న పిల్లలు మామాలు పిల్లలకంటే స్నేహశీలురని, వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని చెప్పే కథ.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ చిన్నతనం నుంచి పెళ్ళి, భర్త గురించి లోపల జీర్ణించుకుపోయిన భారతీయ సంప్రదాయ విలువలు బిందు లాంటి వాళ్ళను ఎలా సంఘర్షణకి గురిచేసి, చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెస్తాయో చెప్తుంది ‘ఎండమావులు‘ కథ. అమెరికాలో వున్నా, ఆంధ్రాలో వున్నా మగవాళ్ళు మారటం లేదని, అవే పాతకాలపు ఆలోచనలతో మోసాలకు దిగుతున్నారని చెప్పే కథ. ‘ఇట్స్ నాట్ ఓకే’ ప్రేమ, గౌరవం లేని కుటుంబంలో, ఇక సరయ్యే ఆస్కారం లేని పరిస్థితులలో తెగతెంపులు చేసుకోడానికి సిద్ధపడిన వైదేహి కథ. ‘అమ్మకో ఉత్తరం’ స్వేచ్ఛకు పెట్టింది పేరయిన అమెరికాలోని జీవన విధానం, సౌకర్యాల పట్ల పెరుగుతున్న వ్యామోహం మీద వ్యంగ్యంగా రాసిన కథ.
‘కోట్ హేంగర్’ కథలో ప్రేమలో తిరస్కృత అయిన ప్రీతి గర్భస్రావానికి ప్రయత్నించి ప్రమాదస్థితిలో పడి, ఎమర్జెన్సీ మెడికల్ సహాయంతో బతికి బయటపడుతుంది. కానీ ఇల్లీగల్ అబార్షన్ నేరం కింద జైలు పాలవుతుంది. ఆమె కథ విని చలించి పెళ్ళి కాకముందే బిడ్డను కని, ఇంకెవరికో ఇచ్చేసిన అపర్ణ ఆమెని కలుసుకోడానికి వెళ్తుంది. స్నేహితురాలుగా తనను గుర్తుంచుకోమంటుంది. ఒక స్త్రీ మరో స్త్రీ పట్ల చూపించిన ఎంపథీ, సిస్టర్‌హుడ్ ఈ కథలో ప్రస్ఫుటంగా కనపడతాయి. చట్టబద్దంగా అబార్షన్ అమెరికాలో ఎంత నేరమో కూడా ఈ కథ వలన మనకు తెలుస్తుంది.
పై కథల వలన రెండు ముఖ్యమైన విషయాలు మన దృష్టిలోకి వస్తాయి. మెదటిది స్త్రీలు పడే బాధలు, ఎదుర్కొన్న వివక్షల గురించి చదివినప్పుడు అమెరికన్ సమాజం సమస్యలు లేని యుటోపియన్ సమాజం కాదని మనకర్థం అవుతుంది. రెండవది స్థలాన్ని ఇండియా చేసి, పాత్రల పేర్లు మారిస్తే ఇవన్నీ ఇండియా కథలు కూడా అవుతాయని ఆంధ్రజ్యోతి వివిధకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో కల్పన చెప్పడం రెండు సమాజాల్లో కనపడే సాదృశ్యం వలన మనకు నిజమేననిపిస్తుంది.
‘ది కప్లెట్’, ‘సంచయనం’ కథలు స్వలింగ సంపర్కులైన ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చిస్తాయి. వైష్ణవి మెక్సికన్ అమెరికన్ మాయాతో రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. మాయాతో అనుభవం సహజంగా, ఇష్టంగా అనిపించినా దాన్ని బహిరంగం చెయ్యడానికి ఇష్టపడదు. సమాజం, కుటుంబం ఎలా రియాక్ట్ అవుతారో అన్న జంకు, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయోనన్న భయం ఆమెని వెంటాడుతాయి. నికొలస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న కృష్ణని అతని తండ్రి ఆమోదించలేకపోతాడు. దానికి తోడు వాళ్ళిద్దరూ తండ్రితనం అనుభవించాలని ఒక డ్రగ్ ఎడిక్ట్ తల్లికి పుట్టిన మరోజాతి వాడైన, నల్లవాడైన జేసన్‌ని దత్తత తీసుకుని పెంచడం కూడా ఆయన సహించలేకపోతాడు. వారసత్వం అనేది కేవలం ఆస్తి పంపకాల విషయంలోనే కాక ఆత్మీయతలను, అనుబంధాలను పంచుకునే విషయంలో కూడా ఉండాలన్న కృష్ణ ఆశ నిరాశ అవుతుంది. స్వలింగ సంపర్కుల పట్ల అమెరికన్ సమాజంలో కొంత సడలింపు ఉన్నా, దానిపట్ల ప్రవాస భారతీయులలో ఉన్న విముఖత ప్రస్ఫుటంగా కనపడుతుంది.
ఇండియాలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఐపిసి సెక్షన్ 377ను కొట్టివేసి హోమోసెక్సువాలిటీని చట్ట విరుద్ధం కాదని ప్రకటించడం ఆశాజనకమైన పరిణామం. సామాజికంగా శత్రువులుగా పరిగణింపబడుతూ, దూరం చెయ్యబడుతున్న హోమోసెక్సువల్స్ పట్ల సరైన అవగాహన ఉండాలనే దృక్పథానికి ఇది దోహదం చెయ్యవచ్చు. వారి సమస్యలు, మానసిక సంఘర్షణలను గురించిన కల్పనగారి ఈ రెండు కథలు విలువైనవి. ఎందుకంటే ఈ సామాజిక సమస్య గురించి తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ కథలు వచ్చాయి కాబట్టి. [ఈ సందర్భంగా నేను లెస్బియన్ రిలేషన్‌షిప్ మీద తెలుగు సమాజం నేపథ్యంలో రాసిన కథ ‘అసహజమనిపించే సహజం’ సీవాద మాసపత్రిక భూమికలో మార్చి 2020లో వచ్చిందని తెలియపరుస్తున్నాను.]
ఒకసారి ఓల్గా ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలాసార్లు ఎక్కువగా చదువుకోని పాఠకులు ఆమె కథలు చదివి ప్రభావితమై ఆమెకి ఫోన్లు చేశారని చెప్పారు. సమాజంలో చైతన్యం రావాలంటే అటువంటి సామాన్య పాఠకుల చేత కథలు చదివించగలగాలని నేననుకుంటున్నాను. మరి కల్పన కథలని వాళ్ళు అర్థంచేసుకోగలరా? అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ, పి.ఎమ్.ఎస్., మెనోపాజ్, హార్మోన్ థెరపీ, ఈస్ట్రోజన్ పిల్స్, రీలొకేట్, ఎంబరాస్‌మెంట్ లాంటి ఇంగ్లీషు పదాలు వాళ్ళకి కొరుకుడుపడతాయా? అంతే కాకుండా ఒక్కోసారి కల్పన ఇంగ్లీషు పదాలను కథల్లో మోతాదు మించి వాడినట్లనిపిస్తుంది. ఉదాహరణకి, ‘అయిదు శాజరాక్‌ల తర్వాత’ కథలో వందకు పైగా ఇంగ్లీషు పదాలు వాడారు. ప్రవాసాంధ్రుల మీద కథలు రాసినప్పుడు ఇంగ్లీషుపదాలు వాడటం అనివార్యం అనిపించినా, సామాన్య పాఠకులను దృష్టిలో పెట్టుకుని వీలయినంత వరకు తెలుగుపదాలు వాడి ఉంటే బాగుండేది!
ప్రవాస జీవితపు వివిధ పార్శ్వాలు, కోణాలు, మహిళలపట్ల వివక్ష వీటిని గురించి ఒక మహిళా రచయిత రాసిన తీరు, స్పందించిన విధానం ఈ కథల ప్రత్యేకత! రాయడానికి సంకోచపడే విషయాలతో, సెన్సార్‌షిప్ ఉన్న అనేక అంశాలతో వినూత్నంగా రాసిన కల్పన కథలు తెలుగు కథను కొత్త కోణంలో చూపించాయని చెప్పవచ్చు. వాటిని ఆదర్శంగా తీసుకుని వైవిధ్యభరిత అంశాలతో కొత్త తరం కథలు మరిన్ని వస్తాయన్న ఆశను కలిగించాయి.
(ఇది ఆంధ్ర అసోసియేషన్, ఢిల్లీవారి ఆధ్వర్యంలో కల్పన రెంటాల కథాసంపుటి ‘అయిదోగోడ’ మీద జరిగిన జూమ్ మీటింగ్‌లో సమర్పించిన సమీక్షా పత్రం.)
అయిదో గోడ కథల సంపుటి – కల్పన రెంటాల.
ఛాయా పబ్లికేషన్స్ ప్రచురణ. విడుదల అక్టోబర్ 2021, ధర రూ.130, $8.
నవోదయ బుక్ హౌస్, మిగతా అన్నీ బుక్ స్టాల్స్ లోనూ. ఆన్‌లైన్‌లో: అమెజాన్, తెలుగుబుక్స్.
రచయిత నుంచి నేరుగా కూడా లభ్యం.