అమ్మా నాన్నలతో కలిసి
అందరం హాయిగా
క్రింద కూర్చుని తినేవాళ్ళం
అతిథులొస్తే
వారు కూడా ఇమిడిపోయేవారు
కూర్చుంటే లేవలేమనో
ఒంగి ఒడ్డించలేమనో
శుభ్రం చేసుకోవటం కష్టమనో
అదేదో వెనకబాటుతనం అనో
కారణాలు బలపడి
భోజనపు బల్లలొచ్చాయి
అది ఎంత పెద్దది
ఎంత చిన్నది
ఏ గదిలో ఇమడాలి
గుండ్రపుదా చదరపుదా
ఎన్ని కుర్చీలుండాలి ఎలా ఉండాలి
వాదోపవాదాలయాకే
ఇంటిలోకి ఏదో ఒకటి ప్రవేశించేది
కొన్నాళ్ళకు అదీ పాతబడి
మరో కొత్తదొచ్చేది
లేదా పిల్లలు వారి పిల్లలు పెరిగేకొద్దీ
అదీ పెరిగేది
పిల్లల ఇళ్ళు వేరయాక బల్లలు పెరిగాయి
అయినా పిల్లలొచ్చినపుడు తప్ప
ఇంటిలో ఉన్న బల్ల
మా ఇద్దరికీ పెద్దదయి
బోసిపోతూ కనిపించేది
ఖాళీగా ఉన్న కుర్చీలు వేధించేవి
చిన్నబల్ల తెచ్చుకుంటే
వంటగది అమాంతం పెద్దదయిపోయేది
పిల్లలొచ్చినపుడు
పిల్లలతోపాటు ఆ చిన్నబల్ల విసుగులు
బాణాల్లా తాకేవి మా ఇద్దరినీ
పిల్లలు వెళ్ళిపోయాక కూడా
అయినా చిన్నదా పెద్దదా
జవాబులు తేలని ప్రశ్నలు
మళ్ళీ పిల్లలొచ్చేవరకూ
మమ్మల్ని వెంటాడుతూనే ఉండేవి
ఎప్పుడూ
ఏ బల్లలుంటేనేమి
నిలబడి తినడం కూడా
అలవాటు అయిపోయాక అందరికీ
ఈసారి వచ్చినపుడు
పెద్దది చిన్నదిగా
చిన్నది పెద్దదిగా
చేసుకోగలిగే బల్లలేవో
తెస్తామన్నారు పిల్లలు
అవునా అని ఆశ్చర్యపోయాం
అవసరానికి అనుగుణంగా
ప్రాణమున్న మనం కూడా
అలా మారిపోగలిగితే
ఎంత బాగుండును నిజంగా!